Pages

Monday, October 24, 2016

లలితా మహిళామండలి ఇరవైమూడవ వార్షికోత్సవ సంబరాలు..


లలితా మహిళామండలి ఇరవైమూడవ వార్షికోత్సవ సంబరాలు.. 

   అందరం పదకొండు గంటలకల్లా రాజ్యలక్ష్మిగారింటికి చేరిపోయాం. ఆవిడ పరమ వీర పాఠకురాలు. కనిపించిన పుస్తకాలూ, పేపర్లే కాదు, ఎదురుగా చిత్తుకాగితం కనిపించినా చదివి పడేసే స్వభావం. వట్టి చదివేసి వూరుకోకుండా అందులో చాలా చాలా కష్టమైన ప్రశ్నలన్నీ, జవాబులతో సహా ఒకచోట రాసిపెట్టుకుంటారు.  దానివల్ల మీకేం నష్టం అంటారా.. మాకేనండీ బాబూ నష్టం.. ఇలాగ మేం మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడల్లా  ఆ ప్రశ్నలన్నీ మామీద సంధిస్తారు. అలాగే ఇవాళకూడా మామీద పగ సాధిస్తున్నరీతిలో నాలుగు ప్రశ్నాపత్రాల నిచ్చి, జవాబులు రాయమన్నారు. ఏదో చిన్నపిల్లలకి తాయిలం చూపించినట్టు ఆ పోటీకి ప్రైజులు కూడా పెట్టారు. (హూ.. ఆవిడకీ అలవాటు యెప్పుడు పోతుందో.. మేమెప్పుడు సుఖపడతామోకదా..ఇది నా స్వగతం అన్నమాట..)
చూడండి.. చూడండి..మమ్మల్ని చూసి ఆవిడెంతలా నవ్వుకుంటున్నారో.. హూ!..అడిగేవాడికి చెప్పేవాడు లోకువని అందుకే అన్నారు.. 

  
  మొత్తానికి 10 నిమిషాలంటూ ఆవిడిచ్చిన టైముకి మరో 10 నిమిషాలు చేర్చుకుని, ఒకళ్ళకొకళ్లం దూరం దూరంగా జరిగిపోయి (చూసి కాపీ కొట్టకుండా అన్నమాట..) ఎమ్ సెట్ లెవెల్లో జవాబులు రాసి పడేసాం.
విధి ఎంత కౄరమైనది.. ప్రైజు నాకు రాలేదు.. కానీ చాలా మంచిది..ఫస్ట్ ప్రైజు మా చెల్లెలు భారతికి వచ్చింది.  నాకు ఇంకా సంతోషం.

సెకండ్ ప్రైజు విద్యుల్లతకు వచ్చింది.


  
  ప్రతిసంవత్సరం సభ్యులం అందరం వారి వారి ప్రతిభను చూపించుకునే కార్యక్రమం చేస్తుంటాం. 
అందులో భాగంగా మొట్టమొదట దుర్గ రెండు భర్తృహరి సుభాషితాలను వినిపించి, వాటి అర్ధాన్నివివరించారు.  



           కమలగారు అక్బర్ బీర్బల్ కథలూ, తెనాలి రామలింగని కథలూ చెప్పి అందరినీ ఆహ్లాదపరిచారు. 



                               ఉమాసుందరి తూము నరసింహదాసుగారి కీర్తన పాడి అందరినీ అలరించారు.





పద్మామూర్తి ఈ మధ్యనే తెలుగు యూనివర్సిటీనుంచి శాస్త్రీయసంగీతంలో డిగ్రీ పూర్తిచేసారు. అందుకని ఆవిడ శాస్త్రీయసంగీతం పాడి వారి విద్వత్తును చూపించారు. 




           శ్రీదేవి, అన్ని రకాల చీరలగురించీ వివరిస్తూ కలంకారీ పనితనం గురించి అందరికీ విశదపరిచారు.. 





రాజ్యలక్ష్మిగారు జోకులు పేల్చి అందరినీ నవ్వించారు.. 




భారతి "ఈమావి పైనుండి.. ఈవు కూ కూ యంచు.." అనే లలితగీతం పాడి అందరినీ అలరించింది. 


అసలు నిజం చెప్పాలంటే ఈ రోజుకే హైలైట్ అయిన ప్రోగ్రామ్ సుందరిగారిది. ఆవిడ చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న దశావతారాలపాటను, అభినయంతో సహా అందరిముందూ ప్రదర్శించడానికి నాలుగురోజులముందునుండీ ఇంట్లో రిహార్శల్స్ వేసుకుని యెంతో అద్భుతంగా అభినయించారు. అందుకే ఆవిడ ఫొటోలు ఇంకోరెండు యెక్కువ పెడుతున్నాను. 


                                   










     తర్వాత కళ్యాణిగారు. ఈవిడ యోగా గురువు. సూర్యనమస్కారాల ముద్రలు చూపించి వాటి వైశిష్ట్యాన్ని తెలిపారు..








రామలక్ష్మిగారు  లక్ష్మీస్తుతి చదివి అందరిలో భక్తిభావం నింపారు. 



రమాదేవి ఖడ్గతిక్కన భార్య అయిన చెన్నమ్మ గురించి చక్కని కథను వివరించారు. ఖడ్గతిక్కన అనగానే అందరికీ సాధారణంగా ఖడ్గతిక్కన భార్య ఆయన యుధ్ధం నుండి వచ్చినప్పుడు స్నానానికి మంచం చాటుగా పసుపు పెట్టిందన్న కథే గుర్తొస్తుంది. కానీ ఈ కథలో ఆ చెన్నమ్మ యెంతటి పతివ్రతో తెలుస్తుంది. యుధ్ధంలో ఖడ్గతిక్కన తల తెగి యెక్కడ పడిపోయిందో తెలీనిపరిస్థితిలో తొమ్మిదిరోజులు గడిచిపోయాక, తల లేకుండా మిగిలిన కార్యక్రమాలు యెలా చెయ్యాలొ తోచని పరిస్థితిలో అందరూ వుంటే, ఆ తొమ్మిదిరోజులూ ఈ చెన్నమ్మ అమ్మవారిముందు ఒక తపస్సులో కూర్చున్నట్టు కూర్చుందిట. తొమ్మిదోరోజు ఖడ్గతిక్కన శరీరానికి ఆ తలవచ్చి మొండానికి అంటుకుని ఒక్కసారిగా లేచి కూర్చుని, మళ్ళి పడిపోయిందిట. అప్పుడు మిగిలిన కార్యక్రమాలు  పూర్తిచేసారుట. పతివ్రతలంటే అటువంటివారూ అంటూ మాకెవరికీ తెలీని కథని యెంతో చక్కగా వివరించారు రమాదేవిగారు.


మరింక నేను మన ఇంటిపనులను యెంత తెలివిగా చేసుకోవాలో  సూచించాను. 


దుర్గ నా సూచనలకు మరికొన్ని జోడించింది.. 


సరస్వతి, భాగ్యలక్ష్మీ  యివన్నీ చూసి ఆనందించారు.. 





   ఇన్నీ చేసి అలసిపోయాక మరింక భోజనం చెయ్యాలిగా.. ఇదిగోమరి అసలైన విందుభోజనం.. 










           ఎంతో సరదాగా ఆటాపాటలతో గడిపిన అనుభూతిని ఆస్వాదిస్తూ సాయంత్రానికి అందరం యిళ్ళకి మళ్ళాం.. 


------------------------------------------------------------------------------------------------------


Thursday, October 20, 2016

ఒక ఇల్లాలి కథ..పుస్తక పరిచయం


 ఆంధ్రభూమి వారపత్రికలో ఇరవై వారాలపాటు ధారావాహికంగా వచ్చిన,  "ఒక ఇల్లాలి కథ" అనే   నేను రాసిన నవలను పుస్తకంగా ప్రచురించడం జరిగింది.
అక్టోబరు 15, శనివారం సాయంత్రం 5 గంటలకు తార్నాకాలోని స్ప్రెడింగ్ లైట్ స్ లైబ్రరీహాల్లో
ఈ  పుస్తకపరిచయం జరిగింది..





ప్రముఖ రచయిత్రి, లెక్కకు మిక్కిలి  పురస్కారాలందుకున్న డి.కామేశ్వరిగారు  పుస్తకాన్ని పరిచయం చేసారు. ముందుమాట రాసింది కూడా ఆవిడే కనుక నవల గురించి విపులంగా వివరించారు. కామేశ్వరిగారు పుస్తకాన్ని గురించి చేసిన పరిచయవాక్యాలు ఆ పుస్తకానికే  హుందాతనాన్ని తీసుకొచ్చాయి.








గర్ల్ విత్ గోల్డెన్ పెన్ గా పేరొందిన మరో ప్రముఖ రచయిత్రి మన్నెం శారదగారి ఆగమనంతో సభ కళకళలాడింది. 
రచనావ్యాసంగంలో ఆవిడ అనుభవాలను గురించి చేసిన ప్రసంగం ఆహూతులను ఆకట్టుకుంది. 


ఇంకో ప్రముఖ రచయిత్రి, ఇండస్ట్రియలిస్టూ అయిన సోమరాజు సుశీలగారి రాకతో నాకు ఆనందం రెట్టింపయ్యింది. చిన్నపరిశ్రమలు నడపడంలోని సాధక బాధకాలను ఆవిడ వివరిస్తుంటే అందరూ ఆసక్తిగా విన్నారు. 



      స్ప్రెడింగ్ లైట్ నిర్వాహకురాలు జ్యోతి యెంతో అనుభవంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.


 నా హితులు, స్నేహితులు  చాలా దూరాలనుండి కూడా వచ్చి, నా ఆనందంలో పాలుపంచుకున్నారు.



   పుస్తకం మీద వున్న అభిమానంతో  ఈ పుస్తక పరిచయసభకు వచ్చిన పెద్దలు యెంతో ఆసక్తితో ఆద్యంతం సాహిత్య ప్రసంగాలను ఆస్వాదించారు.  





                    ఈ పుస్తకానికి డి. కామేశ్వరిగారు రాసిన ముందుమాట.. 







                                      


నా మాట.

 పాతికవరకూ కథలు పత్రికలలో ప్రచురించబడగానే “నవల రాయమ్మా..” అన్న మా నాన్నగారు శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి సంకల్పబలం నుండి పుట్టిందీ నవల.
  చిన్నప్పుడంతా మాకు స్వతంత్రపోరాటం గురించీ, అప్పటి సమాజ స్థితిగతులగురించీ చెపుతుండేవారు మా నాన్నగారు. ఆ స్వతంత్ర ఉద్యమ పోరాటం నాకు చాలా స్ఫూర్తి నిచ్చింది. ఎన్ని కుటుంబాలు ఆ పోరాటంలో ఆస్తులనీ, కుటుంబసభ్యులనీ పోగొట్టుకున్నారో చెప్పేవారు.  అందుకే ఆ నేపథ్యంలోనే 160 పేజీల ఈ నవల వ్రాసాను. వ్రాసాక నవల రాయడానికి మొట్టమొదటి ప్రయత్నం యెలా వచ్చిందో నని “రచన” మాసపత్రికలోని వసుంధరగారి సాహితీవైద్యానికి పంపించాను. దానికి వారి సాహితీ చికిత్స ఇలా వుంది. * “ఒక గొప్ప నవలకు అద్భుతమైన ఇతివృత్తం. వాస్తవికతకు అద్దంపట్టే సంఘటనలు, సహజత్వాన్ని నింపుకున్న పాత్రలు, సంప్రదాయాన్ని సవాలు చేసే ప్రశ్నలు, హృదయాలను కదిలించే విశ్లేషణ ఉన్నరచన. ప్రయోజనాత్మకమైన గొప్ప సంచలన చలన చిత్రానికి కావలసిన ముడిపదార్ధం ఈ రచనలో ఉంది.“ అని చెపుతూ,  నవలలోని ప్రతిపాత్రనూ విశిష్టంగానూ, ప్రత్యేకంగానూ పోషిస్తూ, కాలక్రమాన్ని సవరించుకుంటూ 250 పేజీలు వచ్చేవరకూ తిరగవ్రాయమన్నారు. ఇంతటి ప్రోత్సాహాన్నిచ్చిన వారి సహృదయతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి సూచనలనూ, సలహాలనూ పాటిస్తూ పాత్రపోషణ పరిపుష్టం చేస్తూ మరిన్ని పేజీలు వ్రాసి ఆంధ్రభూమి వారపత్రికకు పంపించిన నవల ప్రచురణార్హమైంది. “స్త్రీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా ఆవిష్కరించిన సీరియల్” అంటూ ఆంధ్రభూమి వారపత్రికవారు దీనిని 6/9/2007 నుంచి 17/1/2008 వారపత్రిక వరకూ ఇరవైవారాలపాటు ధారావాహికంగా ప్రచురించారు. నా మొట్టమొదటి నవలను పాఠకులకు అందించిన ఆంధ్రభూమి సంపాదకవర్గానికి నా ధన్యవాదాలు.
  ఎంతోమంది త్యాగమూర్తులు నిస్వార్ధంగా తమ ఆస్తులనూ, కుటుంబాలనూ చివరికి ప్రాణాలను కూడా పణంగాపెట్టి అహింసామార్గంలో సాధించారు మన స్వాతంత్ర్యం. అజ్ఞాత దేశభక్తులు యెందరో తమ తమ కుటుంబాలను వదిలి ఈ స్వతంత్రోద్యమంలో పాలు పంచుకున్నారు. అలాంటి ఒక దేశభక్తుడు దేశం కోసం ఇల్లూవాకిలీ త్యజించి ఉద్యమంలో పాలుపంచుకుంటే ఆ కుటుంబం యెదుర్కున్న కష్టనష్టాలు యెలా వుంటాయో చూపించే ప్రయత్నం చేసాను ఈ నవలలో. మగపిల్లలకే కాలేజీ చదువులూ, ఉద్యోగాలూ అప్పుడప్పుడే అలవాటవుతున్న ఆనాటి సామాజిక వ్యవస్థలో అలాంటి ఒక దేశభక్తుని కుటుంబం అప్పటి సాంప్రదాయాలను యెదిరించలేక, యెన్నివిధాలుగా సర్దుబాటు చేసుకుంటూ తమ మనుగడ సాగించిందో తెలియచెప్పాను. మారుతున్న పరిస్థితులు మనుషుల్లో యెటువంటి మార్పులు తెస్తాయో చూపించాను. స్వతంత్రం వచ్చి యిన్నేళ్ళు దాటిపోయాక అప్పటి తరం వారిని దాదాపు అందరూ మర్చిపోతున్నట్లనిపించి, యెంతమంది యెన్నిరకాలుగా త్యాగాలు చేస్తే మనమీ స్వతంత్రం అనుభవిస్తున్నామో మళ్ళీ ఒకసారి అందరికీ గుర్తు చేద్దామని అప్పటి కాలాన్ని ఈ నవలకు నేపథ్యంగా తీసుకున్నాను.
   సమాజంలో కొన్ని కొన్ని కుటుంబాలకి కొన్ని కొన్ని ముద్రలు పడిపోతుంటాయి. అలాంటి ఒక కుటుంబమే ఈ నవలలోని రమణమూర్తి కుటుంబం. వాళ్ళు చాలా గొప్పవారనీ, వాళ్లకి పంతాలూ, పట్టింపులూ యెక్కువనీ, ఇంకొకరు వీళ్ళ మాట వినాలి తప్పితే వీళ్ళు ఎవరిమాటా వినరనీ ఆ కుటుంబంపై వున్న ముద్ర. అలాంటి కుటుంబంలో పుట్టిన రమణమూర్తిలో అవన్నీ మరికాస్త యెక్కువే వున్నాయంటూ ఆ అహాన్ని అతను పెరుగుతున్నప్పుడు చుట్టపక్కాలు మరికాస్త పెంచి పోషించారు. అలాగ వారి వంశంలోవున్న పంతం పట్టుదల వల్ల చివరికి అతని మనసులోని మాట కూడా బైటకి రానీయని వ్యక్తి రమణమూర్తి, ఒక ఇల్లాలికి భర్త. భర్తంటే యిలాగే వుండాలీ అనే మూర్ఖపు మత్తులో వున్నవాడు. ఆ కుటుంబంలోని మిగిలిన వ్యక్తులు పూర్తిగా అవకాశవాదులు. ఆ ఇంట్లోకి కోడలుగా వచ్చిన ఇల్లాలు, ఈ నవలకు కథానాయిక స్వరాజ్యం.
   స్వతంత్రపోరాట సమయంలో పాల్గొన్న యెన్నో స్వార్ధ రహిత కుటుంబాలలో ఒకటైన సాంప్రదాయ కుటుంబంలోని స్త్రీ స్వరాజ్యం. తండ్రి సత్యాగ్రహంలో పాల్గొన్న కారణాన వారి కుటుంబం యెన్ని అవస్థలు పడిందో, అది స్వరాజ్యం వివాహజీవితం మీద యెలా ప్రభావం చూపించిందో చెపుతుందీ నవల. తల్లీ, మేనత్తా చెప్పినట్టే స్వరాజ్యం భర్తే దైవ మనుకుంటుంది. అతనికి ఇష్టం లేని విషయాన్ని కలలో కూడా తల్చుకోడానికి యిష్టపడదు. పతియే ప్రత్యక్ష్యదైవం, ఇల్లే కైలాసం అనుకునే ఆ గృహిణి జీవితంలో భర్త మూర్ఖంగా ప్రవర్తించిన తీరు ఆమెని ఇంట్లోంచి బైటకి పడేసింది. నెమ్మది నెమ్మదిగా చుట్టూ మనుషులను పరిశీలిస్తూ, పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ తనని తాను నిలబెట్టుకున్న స్వరాజ్యం అందరు ఆడవారికీ ఆదర్శంగా వుండాలన్నట్టు చిత్రించాను. అప్పటి సామాజిక స్థితిగతులు, కుటుంబ సాంప్రదాయాలు, ఉమ్మడికుటుంబాలలో స్త్రీల పరిస్థితులు నాకు తెలిసినంతవరకూ చూపెట్టగలిగాను. ఏ మనిషికైనా ఓర్పూ, సహనం అనేవి కొంతవరకే వుంటాయి. అవి హద్దులు దాటితే యేమవుతుందో చెపుతుందీ నవల.
  ఈ నవల వ్రాస్తున్నప్పుడు ప్రతి మలుపులోనూ, సన్నివేశాల చిత్రీకరణలోనూ చక్కటి సలహాలనిచ్చారు మావారు శ్రీ విశ్వనాథంగారు.  ముఖ్యంగా నవల ముగించవలసిన సమయంలో ఇటువంటి ముగింపు యివ్వడమా, వద్దా అని యిద్దరం రెండునెలలు చర్చించుకున్నాం. అంత విశ్లేషణాత్మకంగా ఈ నవల చదివి నన్ను ప్రోత్సహించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
  లెక్కకు మిక్కిలి అవార్డులు, పురస్కారాలూ అందుకున్న, మేం ఆప్యాయంగా “అక్కయ్యగారూ..” అని పిలుచుకునే ప్రఖ్యాత రచయిత్రి, సహృదయిని, స్నేహశీలి  డి. కామేశ్వరిగారు ఈ నవలకు ముందుమాట వ్రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
చక్కని సలహాలనిచ్చి పుస్తకం అందంగా రావడానికి సహకరించిన శ్రీ ఉదయ్ ప్రింటర్స్  వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
పాఠకులు దీనిని ఆదరిస్తారని నమ్ముతూ..
*జూలై, 2004- “రచన “ మాసపత్రిక- సాహితీవైద్యం.
--------------------------------------------------------
                                    ఇంకోమాట...
 ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలలోనూ లభిస్తుంది..
-------------------------------------------------------------------------------
స్ప్రెడింగ్ లైట్ నుండి నచ్చిన పుస్తకం శీర్షికన జ్యోతి వ్రాసిన సమీక్ష..
 to Nacchina PusthakamNovember 16 at 6:43amీవితాలను చర్చిస్తుంది. ఇప్పటి స్త్రిలకు లభించిన స్వేచ్చ వెనుక ఎంతటి ఘర్షణ ఉండీందో, దాన్ని నేడు సద్వినియొగపరుచుకోవలసిన అవసరం స్త్రిలకు ఎంత అవసరమో తెలియచేస్తుంది. ఇప్పటి ఆధునిక స్త్రిలకు రెండు తరాలనాటి వారి అమ్మమ్మల జీవితాల గురించి తెలిసింది చాలా తక్కువ. ఆనాటి స్త్రీల జీవితాల గురించి తెలుసుకుంటే కాని తమకు లభించిన అవకాశాలను అర్ధం చేసుకోలేరు. అందుకనీ ఇటువంటి కథలను చదవవలసిన అవసరం ఉంది. అలాగే స్వాతంత్ర్యసమర యొధుల కుటుంబాలు పడ్డ అవస్థలను గురించి కూడా తెలుసుకోవాలి. స్వరాజ్యం ఒక స్వాతంత్ర్యసమరయొధుని కూతురు. తండ్రి జైలుకెళ్ళి తిరిగి రాడు. ఏమయ్యడొ తెలీదు. దుర్భర దారిద్ర్యం అనుభవిస్తూ తల్లి మేనత్త ల మధ్య ఆమె, తమ్ముడు తిలక్ పెరుగుతారు. రమణమూర్తి ఆమెను కోరి పెళ్ళి చేసుకుంటాడు. కాని పెళ్ళి తరువాత ఆమె పుట్టింటితో ఎటువంటి సంబంధం ఉండకూడదని షరతు పెడతాడు. పేదరికం, పైగా పిల్లకి పెళ్ళి కాదనే భయంతో తల్లి ఈ వివాహం జరిపిస్తుంది. 35 సంవత్సరాలు అన్నిరకాలుగా అనుకూలమైన భార్యగా సేవ చేస్తూ తన కోరికలను, ఆశలను చంపుకుని స్వరాజ్యం జీవిస్తుంది. పిల్లలు లేకపోయినా తన మరిది, ఆడపడుచులను తన వాళ్ళుగా పెంచుతుంది. వారే డబ్బు కోసం చివరకు ఆమెను మోసం చెస్తారు. తన తల్లి చావు బ్రతుకులలో ఉందని తెలిసి భర ఇంట్లో లేని సమయంలో అత్తగారి అనుమతితో 55 సంవత్సరల వయసులో పుట్టింటికి తల్లిని చూడడానికి వెల్తుంది. భర్త ఇంట్లోకి రానీయడు. అప్పుడు తన అస్తిత్వం కోసం పోరాటం చేస్తుంది. ఆ తరం లో చాల మంది స్త్రిలకు కుటుంబం పేరుతో జరిగిన అన్యాయాలను ఈ నవల ద్వారా గుర్తు చేస్తారు రచయిత్రి.

------------------------------------------------------------------------------------------------------------------------
"విహంగ" అంతర్జాలపత్రికలో  మాలాకుమార్ వ్రాసిన సమీక్ష..

http://vihanga.com/?p=18878


ఒక ఇల్లాలి కథ(పుస్తక సమీక్ష )- మాలా కుమార్

ఒక ఇల్లాలి కథ
రచయిత్రి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు,బి.ఎ(లిట్),ఎం.ఎ.(సొషియాలజీ),డిప్లమా ఇన్ మ్యూజిక్ (కర్ణాటక సంగీతం, వీణ)చేసారు.గత పన్నెండు సంవత్సరాలుగా రచనలు చేస్తున్నారు.ఇప్పటి వరకూ డెభ్బై కి పైగా కథలు వివిధ ప్రింటు,అంతర్జాల పత్రికలల్లో ప్రచురించబడ్డాయి.”నాన్నలూ నేర్చుకోండిలా”, మినీ నవలగా నవంబర్ ,2011 ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడింది.కొన్ని కథలు కథావాహిని,ఆటా(అమెరికన్ తెలుగు అసోషియేషన్) జ్ఞాపక సంచిక, కథాకేళి, ప్రమదాక్షరి కథాసంపుటాలల్లో చోటు చేసుకున్నాయి. పలు కథలకు వివిధ పత్రికలల్లో బహుమతులు వచ్చాయి. బహుమతి పొందిన కథలల్లో కొన్నింటిని “అతను-ఆమె-కాలం” (బహుమతి కథల మణిహారం ) పేరిట కథల సంపుటిగా ప్రచురించారు.ఇరవై సంవత్సరాల నుండి ఆకాశవాణిలో పలు ప్రసంగాలు, కదంబ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి.

ఒక ఇల్లాలి కథ ” అన్న ఈ నవల 6 సెప్టెంబర్ 2007 నుండి,17 జనవరి 2008 వరకు 20 వారాల పాటు ఆంధ్రభూమి పత్రిక లో ధారావాహికంగా ప్రచురించబడింది.ఇంటికి దీపం ఇల్లాలు,ఇల్లాలు కంట తడిపెడితే ఇంటికి అశుభం వగైరా వగైరా సూక్తులు చెపుతూ ఇల్లాలిని పొగుడుతూ ఉంటారు. కాని నిజ జీవితము లో  ఇల్లాళ్ళకు ఈ గౌరవం దక్కుతోందా?సుందరమ్మ అత్తగారికైతే ఘోషా లో, ఇంటి పనిలోనే జీవితం గడిచిపోయింది. ఆ రోజులల్లో వంద ఎకరాలున్నవాళ్ళైనా సరే ,వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళకి ఈ రోజుల్లో ఉన్న సదుపాయాలు ఉండేవి కాదు. శారీరికంగా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది.ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళున్నా అందరికీ పని ఉండేది. పొద్దుగూకులూ ఇంట్లో ఏదైనా పని చూసుకోవటం తప్పితే వాళ్ళ సంగతేమిటి అని ఆలోచన ఉండేది కాదు. సుందరమ్మ తండ్రి జగన్నాథంగారికి కోనసీమలో సుక్షేత్రమైన పంటభూమి,కొబ్బరి తోటలు , సిరీసంపదా ఉన్నాయి. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు, ఆరుగు కొడుకులు. సుందరమ్మకు తొమ్మిది సంవత్సరాలకే పెళ్ళైంది. పదమూడోఏట కాపురానికి వెళ్ళింది.భర్త చదువు కోసం అత్తామామలతో కాకినాడ వెళ్ళి రెండు గదుల ఇంట్లో ఉంది. అత్తగారు చెప్పినట్లుగా కొప్పు ముడుచుకోవటము, గోచీపోసి చీర కట్టుకోవటము నేర్చుకుంది. ఒద్దికగా కాపురము చేసుకుంటోంది. బాల్య చాపల్యము ఆపుకోలేక ,పక్కింటి  నుంచి సంగీతము వినిపిస్తూ ఉంటే వెళ్ళి, పక్కవాళ్ళ పని మనిషినని చెప్పి ఆ హార్మనీ పెట్టె తెచ్చుకుంది. పక్కవాళ్ళు పోలీసులను పిలిచి గొడవ ఆయ్యే సరికి మామగారు తండ్రిని పిలిచి పుట్టింటికి పంపేసాడు. తండ్రి అంతకన్న పౌరుషంగా మామగారి మీద దావా వేసి బంగారము, మనోవర్తి తీసుకొని విడాకులు ఇప్పించేసాడు. అవేవీ సుందరమ్మ చేతికి రాలేదు. చివరి వరకు పుట్టింట్లో అందరికీ సేవలు చేయటమే సరిపోయింది. తండ్రి తదనంతరము కొంచము గట్టిగా వాదించి మరదలు, పిల్లలకు ఒక గది, కొంత డబ్బు సమకూర్చ కలిగింది. అదొక్కటే ఆమే చేయగలిగింది.ఆమె తప్పేమీ లేకుండానే పెద్దవాళ్ళ పంతాలల్లో ఆమె జీవితం నలిగిపోయింది.సరస్వతి జగన్నాథరావు గారి కోడలు.పరమేశ్వరం భార్య.స్వరాజ్యం,తిలక్ లకు తల్లి.వ్యవసాయం చేసుకునేవాడికి పిల్లనిస్తే చాకిరీతోనే సరిపోతుంది.పిల్లవాడు చదువుకుంటున్నాడు. ప్లీడరీ చదువుతే మెజిస్ట్రేట్ అవుతాడు లేదా ప్రాక్టీస్ పెట్టినా రెండు చేతులా సంపాదిస్తాడు అని సరస్వతి తండ్రి ఆలోచించి చదువుకుంటున్న పరమేశ్వరానికి సరస్వతి ని ఇచ్చి పెళ్ళిచేసారు. సరస్వతి ఎంత బాధ్యతగా ఉండాలో సరిగ్గా అలాగే ఉండేది. అత్తా,మామగారు, ఆడపడుచులు, బావగార్లు, మరుదులు ఉమ్మడి కుటుంబములో ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. కాని పరమేశ్వరం చదువుకుంటుండగానే స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉద్యమంలో పాల్గొని జైల్ కు వెళ్ళటము , రావటమే సరిపోయింది. చివరిసారిగా 1946 లో జైల్ కు వెళ్ళి తిరిగి రాలేదు.అసలు ఉన్నాడో , చనిపోయాడో కూడా తెలీదు.సుందరమ్మ వారికి ఓ గూడు ఏర్పర్చకలిగింది. బయటవారి ముందు బయటపడకుండా బావగార్ల ఇళ్ళళ్ళో సాయం చేసి వారు ఇచ్చింది పుచ్చుకొని గుట్టుగా సంసారం గడుపుకొచ్చింది. తండ్రి మూలంగానే ఈ కష్టాలు అని పిల్లలు అంటే ఒప్పుకునేది కాదు.”ఊళ్ళో ఇంత మంది ఉన్నారు.ఒక్కళ్ళైనా దేశం కోసం జైలుకెళ్ళారా? అందుకే ఈ ఊళ్ళో అందరికంటే మీ నాన్నగారు గొప్పవారు.ఎవరి కుటుంబం వారు చూసుకోవటం కాదు.దేశాన్ని బానిసత్వం నుంచి విడిపించటం గొప్ప.”అనేది.అలా చెపుతున్నప్పుడు ఆమే మొహం తేజోమయం అయ్యేది.కళ్ళళ్ళో కాంతులు కురిసేవి.ఎన్ని కష్టాలు పడ్డా ఏరోజూ భర్తను నిందించలేదు.నిజంగా దేశం కోసం పోరాడిన యోధుల కన్న వారి తో సమానముగా త్యాగాలు చేసిన వారి భార్యల త్యాగము గొప్పది.వారి త్యాగానికి గుర్తిపులేదు. చదువు కాని, అన్నదమ్ముల సహకారము కాని లేకుండా కష్టపడి పిల్లలను తీర్చిదిద్దిన సరస్వతి పాత్ర అపూర్వమైనది.స్వరాజ్య తల్లీ , మేనత్త ఏదో గుట్టుగా సంసారం గుంజుకొస్తున్నారు.స్వరాజ్యం పెళ్ళిడుకొచ్చింది.బాధ్యత తీసుకొని సంబంధం చూసి పెళ్ళిచేసే పెద్ద దిక్కు ఎవరూ లేరు.అలాంటిరోజులల్లో రమణమూర్తి స్వరాజ్యం ను చూసి ఇష్టపడి,పెళ్ళిచేసుకుంటానని సూర్యం మాష్టారితో కబురు చేసాడు.దాని తో పాటు పెళ్ళు తరువాత స్వరాజ్యం ను ఎవరూ కలవరాదని , పుట్టింటి తో సంబంధం ఉండకూడదనీ కండీషన్ పెట్టాడు .చాలా ఆలోచించి, వాళ్ళున్న పరిస్థితులల్లో ఇంకోవేరే సంబంధం తేలేరని,మంచిసంబంధం వదులుకోవద్దని స్వరాజ్యంను ,రమణమూర్తికి ఇచ్చి పెళ్ళిచేసి పంపించేసారు తల్లీ, మేనత్త.రమణమూర్తి వంశం వారికి ఏమున్నా లేకపోయినా పంతాలూ పట్టుదలలూ ఎక్కువ.వాళ్ళు ఏదన్నా మాట అన్నారంటే మిన్ను విరిగి మీద పడినా సరే ఆ మాట మీదే నిలబడతారు.మహా పౌరుషం కలవారని పేరు.అలాంటి వాడికి భార్యగా వచ్చింది స్వరాజ్యం. పెద్దవాళ్ళు చెప్పినట్టు పతియే ప్రత్యక్షదైవం అనుకొంది. ఆ కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. నలుగురిలో రమణమూర్తి గొప్ప వ్యక్తి అన్నట్లు ఇంప్రెషన్ ఇచ్చేది.అందరూ ఆయనను గౌరవించి, వినయంగా మాట్లాడేటట్టు చేసేది. ఆడపడుచును,మరిదిని సొంతపిల్లలా పెంచి వారి కోరికలు తీర్చేది.అందరూ తనను ఉపయోగించుకుంటున్నారని తెలిసినా పట్టించుకునేది కాదు.అంత విధేయముగా ఉన్న స్వరాజ్యము తల్లికి బాగాలేదని తెలిసి , అత్తగారి అనుమతి తో , భర్త ఊళ్ళో లేనప్పుడు పుట్టింటి కి వెళ్ళింది.తన మాట జవదాటి,తనకు చెప్పకుండా పుట్టింటి కి వెళ్ళిందన్న కోపం తో తిరిగి వచ్చిన ఆమె ఇంట్లోకి రాకుండా తలుపులుమూసేసాడు రమణమూర్తి.తిరిగి తమ్ముడి ఇంటికి చేరిన స్వరాజ్యం తన మరదలు లలిత, మేనకోడలు స్రవంతి సహకారంతో కోలుకుంది.తనకంటూ ఒక బాటను ఏర్పర్చుకుంది.మనోవర్తి కోసం రమణమూర్తి మీద దావా వేసింది. ఇంటికి తిరిగి రమ్మన్న అత్తగారి మాటను త్రోసిపుచ్చింది.తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంది. అమాయకురాలైన స్వరాజ్యంలో మార్పు వచ్చింది. ఈతరం యువతకి ప్రతినిధి స్రవంతి. ఇంజనీరింగ్ చదువుతోంది. స్వతంత్ర భావాలు కలది. అత్తకు అండగా నిలబడుతుంది.అన్యాయాన్ని ఎదుర్కునే స్వభావము కలది.ఇలా ఐదుతరాల స్త్రీల వ్యక్తిత్వాన్ని, వారి పరిస్థితులను చూపించారు రచయిత్రి ఈ “ఒక ఇల్లాలి కథ” నవలలో.సరస్వతి తరం వరకూ చాలా మంది ఇల్లాళ్ళకు అంతగా గౌరవం దక్కలేదు. ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా పరిస్థితులు మారుతున్నట్లుగా లలిత, స్రవంతిల పాత్రలతో చూపించారు. స్వాతంత్ర్యసమరం రోజుల గురించి బాగా వివరించారు. అప్పటి నుంచి కొద్ది కొద్దిగా మారుతున్న సామాజిక స్థితి గతులు,కుటుంబసాంప్రదాయాలు,ఉమ్మడికుటుంబాలల్లో స్త్రీల పరిస్థితులు చూపించారు.కవర్ పేజీ లోనే బురద నుంచి బయటకు వచ్చిన తామరపూవును స్త్రీ పరిస్థితిలో వచ్చిన మార్పుకు సింబాలిక్ గా గొప్పగా చూపించారు. ఇక ముగింపు గురించి అంటే తనను తాను నిలబెట్టుకున్న స్వరాజ్యం అందరికీ ఆదర్శంగా ఉండాలి అన్నట్లుగా చిత్రీకరించాను అన్నారు.అదీ నిజమే.

----------------------------------------------------------------------------------------------

19-12-2016 వ తేదీన "నమస్తే తెలంగాణ" వార్తాపత్రికలో ఈ నవలపై వచ్చిన సమీక్ష..

















జూన్ 10, 2017, ఆంధ్రభూమి "అక్షర." లో ఈ నవలపై శ్రీ విహారిగారు వ్రాసిన సమీక్ష..


స్త్రీ వ్యక్తిత్వ ఔన్నత్య చిత్రణ
నవలలో ఇతివృత్తం సామాజికమై, సమాజానికీ, వ్యక్తులకీ మధ్య సంఘర్షణ సంభావ్యంగానూ, సంక్లిష్టంగానూ, వాస్తవికత ఆధారంగానూ ఉంటే - రచన ఉత్కంఠ ప్రధానంగా సాగుతుంది. అలాగే, సంఘటనలు ఒకదాని వెంట ఒకటి త్వరత్వరగా జరుగుతూ - పాత్ర ప్రమేయం ప్రస్ఫుటంగా ఉండి కథనం సరళశైలిలో సాగుతుంటే - నవలకి చదివించే గుణం మంచి ఆహార్యంగా నప్పుతుంది. జి.ఎస్.లక్ష్మిఒక ఇల్లాలి కథనవలలో గుణ విశేషాలన్నీ చక్కగా కుదురుకున్నై.
స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న సాంఘిక స్థితిగతులూ, కొన్ని కుటుంబాల్లోని త్యాగశీలుర విలువల పాటింపూ, దానికి పర్యవసానంగా తర్వాతి తరం వారుసర్వమూ కోలుపోయిన రాజరాజులుగామిగిలిపోవటం.. వంటి యథార్థాలు చారిత్రక చేదు మాత్రలు. నవలలోని వస్తువుకి ఇలాంటి యథార్థాలు కొన్ని నేపథ్యంగా నిలిచాయి. నేపథ్యంతో ఇప్పటి తరంలో మిగిలి ఉన్న కుటుంబంలోని ఒక స్వరాజ్యం కథ - నవల.
ఇతివృత్తం ఇలా సాగుతుంది.
స్వరాజ్యానికి పద్దెనిమిదో ఏట పెళ్ళైంది. కథాకాలం నాటికి ఆమె సంసార జీవనం, అత్తింట్లో మొదలైంది. భర్త రమణమూర్తి. అనువంశికంగా వచ్చిన అభిజాత్యం, పురుషాధిక్యత, పంతం, పట్టుదల మూర్త్భీవించిన మగవాడు! రచయిత్రి మాటల్లో్భర్తంటే ఇలా ఉండాలీ అనే మూర్ఖపు మత్తులో ఉన్నవాడు.’ నిర్ణయాధికారం అన్ని విషయాల్లో తనదే - అనే నిశ్చితాభిప్రాయం కలిగినవాడు. దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే అతనునరసింహావతారం ఎత్తుతాడు. అతనికి తండ్రి చనిపోయాడు. తల్లీ చెల్లెలూ, తమ్ముడు - అతని సంరక్షణలో ఉన్నారు. తల్లి అతనికి వత్తాసు. తమ్ముడు, చెల్లెలు అవకాశవాదులు. స్వరాజ్యం సహనశీలి. వివేకవతి. ‘పతివ్రత. రమణమూర్తి ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకని స్వరాజ్యమనే మొక్కని వేళ్లతో సహా పెకిలించి పట్టుకొచ్చి తన పెరట్లో పాతేసుకున్నాడు. ఆమెకూ, ఆమె వారికీ మధ్య మాటలూ, రాకపోకలూ బంద్ చేశాడు. స్వరాజ్యం తన కన్నతల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో -్భర్తకి చెప్పకుండా పుట్టింటికి వెళ్లింది. తల్లికి కులాసా చిక్కింది. తన ఇంటికి తిరిగి వచ్చింది స్వరాజ్యం. లోపలికి రానీయకుండా ఆమెని గుమ్మంలో నిలబెట్టాడు భర్త. అత్త, ఆడపడుచు, మరిదీ - కూడా దౌష్ట్యాన్ని ఎదుర్కోరు. రాత్రి దాకా ఒక్కతీ అలాగే అక్కడ ప్రాణాచారం పడింది - స్వరాజ్యం. చివరికి అతి నీరసంతో, తూలిపోతూ, అభిమానంతో కుంగిపోతూ వెనుదిరిగింది. కడకు - పుట్టింటికి చేరింది. విడాకులకి కేసు వేసింది. శాంతి ఆశ్రమంఅమ్మతో పరిచయమైంది. కేసు ఫైలు చేసింది. తీర్పు ప్రకారం భరణం ఇవ్వటం లేదు రమణమూర్తి. అతను మానసికంగా దెబ్బతిన్నాడు. స్వరాజ్యంని తిరిగి రమ్మని రాయబారాలు పంపుతాడు. స్వరాజ్యం అంగీకరించదు. ఇంతలో ఆశ్రమం అజమాయిషీనిఅమ్మస్వరాజ్యం చేతిలో పెడుతుంది. రమణమూర్తి పిచ్చివాడే అయ్యాడు. అతని తల్లి కూడా కోడల్ని తిరిగి రమ్మని ప్రాధేయపడుతుంది. ‘అవునత్తయ్యా స్వరాజ్యం రాదు, ఎందుకంటే.. స్వరాజ్యానికి స్వరాజ్యం వచ్చిందిఅంటూ చివరి మాటగా తన నిర్ణయాన్ని చెబుతుంది. నవల అలా ముగిసింది!!
స్వరాజ్యంని ఒకరోజల్లా రమణమూర్తి తన ఇంటి బయట నిలబెట్టి ఉంచేసిన దుస్సంఘటన వంటి చిత్రణలు ఆర్ద్రంగా సాగి చదువరుల మనసుకు హత్తుకొనేలా ఉన్నాయి. నవలలో పాత్ర చిత్రణదే పెద్దపీట. ఇతివృత్త పరిధిలో పాత్రకాపాత్ర స్వాభావికంగా చిత్రించబడింది. లక్ష్మిగారి కథనంలో స్థిమితం, గాంభీర్యం ఉన్నాయి. ఒక ఇల్లాలి జీవితంలో వివిధ దశా విశేషాల్నీ ఆమె వ్యక్తిత్వ నిరూపణతో - సన్నివేశ సృష్టితోకాక - సంఘటనాత్మకంగా ఆవిష్కరించారు రచయిత్రి. కారణం వల్లనే సీరియల్గా నవల మంచి పాఠకాదరణని పొందింది.

-విహారి
---------------------------------------


జూలై, 2017 కౌముది అంతర్జాల పత్రికలో నేను వ్రాసిన “ఒక ఇల్లాలి కథ”పై వచ్చిన సమీక్ష..
అరుదుగా వ్రాసినా ఆలోచింపచేసే కథావస్తువులతో, చదివించే శైలితో కథలు వ్రాస్తున్న రచయిత్రిగా జి.ఎస్.లక్ష్మిగారు తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. లక్ష్మిగారు వ్రాసిన కథల్లో ఇతివృత్తాలు ఎంతగా మనసులకు హత్తుకుంటాయో, ఆలోచింపచేస్తాయో – అలాంటి ఇతివృత్తంతో వారు వ్రాసిన తొలి నవల ఈ “ఇల్లాలి కథ”. “స్త్రీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా ఆవిష్కరించిన సీరియల్” అనే టాగ్ లైన్ తో ఆంధ్రభూమి వారపత్రికలో 2007 సెప్టెంబర్ నుంచి 2008 జనవరి వరకూ సీరియల్ గా ప్రచురించారు. కాస్త ఆలశ్యంగా క్రిందటి సంవత్సరమే ఈ నవల పుస్తకరూపంలో తెలుగు పాఠకుల ముందుకు వచ్చింది. ఈ నవల ఇంకా డ్రాఫ్ట్ స్థాయిలో ఉండగానే, ప్రముఖ రచయిత వసుంధరగారు ఈ నవలను పరిశీలించి, స్పందన తెలియచేస్తూ, “ఒక గొప్ప నవలకు అద్భుతమైన ఇతివృత్తం. వాస్తవికతకు అద్దం పట్టే సంఘటనలు, సహజత్వాన్ని నిలుపుకున్న పాత్రలు, సంప్రదాయాన్ని సవాలు చేసే ప్రశ్నలు, హృదయాలను కదిలించే విశ్లేషణ ఉన్న రచన” అన్నారు. ఈ నవల చదివిన పాఠకులు ప్రతి ఒక్కరూ వసుంధరగారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. నవల రచనాశైలి అతి సరళంగా సాఫీగా సాగింది. పాత్రలూ, వాటి వ్యక్తిత్వ చిత్రణా పాఠకులని కథాక్రమంలోకి తీసుకెళ్తాయి. పాత్రల మధ్య జరిగే సంభాషణలూ, రచయిత్రి చెప్పే నెరేషన్ రెండింటినీ సమతూకంతో నడిపింఛారు. మొదటి నవలే అయినా చాలా అనుభవమున్న నవలా రచయిత్రి వ్రాసినట్లే ఉంటుందీ నవల.  భర్త మూర్ఖత్వానికీ, తిరస్కారానికీ గురైన మధ్యతరగతి మహిళ జీవితంలో జరిగిన సంఘటనలు, ప్రతికూల పరిస్థితులని ఎదుర్కొని ఆమె సాగించిన జీవన పోరాటం, నవల ముగింపులో ఆమె తీసుకున్న నిర్ణయం…పాఠకులని ఏకబిగిన చదివిస్తాయి. ప్రథానపాత్రయొక్క తండ్రి గురించి వివరించేప్పుడు భారత దేశ స్వాతంత్ర పోరాట సమయంలోని పరిస్థితులు, అప్పటి మధ్యతరగతి జీవితాల్లోని సన్నివేశాలు అతి సమర్ధవంతంగా చిత్రించారు రచయిత్రి. ఇంటర్నెట్, సెల్ ఫోన్, ఫేస్ బుక్… ఈ నేపథ్యాలతో కథలూ, నవలలూ వస్తున్న ఈ కాలంలో చక్కటి సాంప్రదాయబధ్ధమైన కథాంశం, పాత్రలతో సాగే ఈ నవల పాఠకులకి గొప్ప రిలీఫ్ ని ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ధన్యవాదాలు కిరణ్‍ప్రభగారూ..
-------------------------------