Pages

Wednesday, July 29, 2009

వరలక్ష్మీదేవికి నివేదన



ఎప్పటినుంచో మేము ఈ వరలక్ష్మి శుక్రవారానికి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ఒక పాట పాడుకుంటుంటాం. ఆ పాట ఏదో పాత భక్తి సినిమాలోది. ఏ సినిమా లోదో గుర్తులేదు. పాటకూడా మధ్యలో కొన్ని మాటలు గుర్తు లేవు. అయినా పాట పాడడం రాకపోయినా మాట చెప్పినట్లే దానిని చెప్పుకునే సంప్రదాయంలో పడిపొయాము. ఈ పండుగకి అందరూ కూడా అమ్మవారి దగ్గర అది పాడుకుంటే బాగుంటుందని అనిపించి రాస్తున్నాను. ఇది ఏ సినిమా లోదో ఎవరికైనా తెలిసినా, దానిని అప్ లోడ్ చేసి అందరికి అందించినా నాకన్న సంతోషపడేవారు మరొకరుండరు. వారికి ముందుగానే ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.


పల్లవి-- వరమహాలక్ష్మీ కరుణించవమ్మా చరణాల శరణంటినమ్మా వరమహాలక్ష్మీ కరుణించవమ్మా
నా వేదనను బాప నీ దేవుతో కూడి నైవేద్యమందుకోవమ్మా//వరమహాలక్ష్మీ కరుణించవమ్మా//

చరణం-- పాలకడలిని పుట్టి శ్రీహరిని చేపట్టి వైకుంఠలోకాన లక్ష్మివైనావే మాంపాహి మాతా మాంపాహి మాతా
సత్వగుణమూర్తివే సంపత్ స్వరూపివే ఇల సకల సంపదలదాయినీవమ్మా
నా వేదనను బాప నీ దేవుతో కూడి నైవేద్యమందుకోవమ్మా//వరమహాలక్ష్మీ కరుణించవమ్మా//

చరణం-- వాగీశురాణివై వరవీణపాణివై సత్యలోకమ్మున వాణివైనావే మాంపాహి మాతా మాంపాహి మాతా
సత్వగుణమూర్తివే సంపత్ స్వరూపివే ఇల సకల విద్యలకు తల్లి నీవమ్మా
నా వేదనను బాప నీ దేవుతో కూడి నైవేద్యమందుకోవమ్మా//వరమహాలక్ష్మీ కరుణించవమ్మా//

చరణం-- గిరిరాజ తనయవై పరమేశు తరుణివై కైలాసలోకాన గౌరి వైనావే మాంపాహి మాతా మాంపాహి మాతా
సత్వగుణమూర్తివే సంపత్ స్వరూపివే ఇల సకల సౌభాగ్య దాయినీవమ్మా
నా వేదనను బాప నీ దేవుతో కూడి నైవేద్యమందుకోవమ్మా//వరమహాలక్ష్మీ కరుణించవమ్మా//

వరలక్ష్మీదేవికి నైవేద్యం





ప్రమదలందరికీ పండుగ పిండివంటల సన్నాహాలకి స్వాగతం. అసలేనైవేద్యాలు తయారుచేసుకొవాలి. పూజకి అన్నీ సిధ్ధం చేసుకోవాలి. భక్తిగా పూజచేసుకోవాలి. అందుకని సులభంగా 9 రకాలు చెసుకునె విధానం. ప్రమదలందరూ చదివితరించుదురుగాక.

1. పులగం. (ఇది అమ్మవారికి చాలా ప్రీతి). చేసుకోవడం అందరికి తెలుసనేఅనుకుంటున్నాను. నాలుగు పప్పుబద్దలు, బియ్యం, చిటికెడు పసుపు కలిపిచిన్నగిన్నెలో కుక్కర్ లొ పెట్టెయ్యడమే.

2. పరవాన్నం.(ఇది కూడా అమ్మవారికి ఇష్టమైనదే). బియ్యంతో కాని, సేమ్యాతోకాని చేసుకోవచ్చు.

3.పులిహార. (ఇది అమ్మవారికే కాదు, చాలామందికీ ఇష్టమైనదే) . వివిధరకాలుగాచేసుకోవడం తెలుసుకదా.

4. దధ్ధోజనం.(గుళ్ళో కూడా ఈ ప్రసాదం పెడుతుంటారు). వండిన అన్నంలోపెరుగు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమిర కలుపుకుని, కాస్తఇంగువ, ఆవాలు, 2 మెంతిగింజలు, 2ఎండు మిరపకాయముక్కలు వేసి నేతిపోపుపెట్టుకోవడమే.

5. కేసరి. (అదే సత్యనారాయణస్వామివారి ప్రసాదం). 1కప్-బొంబాయిరవ్వ, 1కప్-పంచదార, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కావలసినన్ని జీడిపప్పులు, కిస్ మిస్,సువాసనకు యాలకులపొడి.ముందుగా రవ్వలో పంచదార కలిపేసుకుని రెడీగా పెట్టుకోవాలి.(అలాగయితేప్రసాదం వుండలు కట్టకుండా వుంటుంది). తర్వాత స్టౌవ్ వెలిగించుకునిఅందులొ1టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పులు, కిస్ మిస్ లువేయించుకోవాలి. వేగాక 2కప్పుల నీరు పోసుకుని, మరిగాక కలిపి పెట్టుకున్నరవ్వ, పంచదార వేసి ఒక్క నిమిషం వుడకనివ్వాలి. అప్పుడందులో యేలకుల పొడివేసి, మిగిలిన నెయ్యివేసి కలిపేసుకుంటే కేసరి రెడీ. సగం నైవేద్యానికిఅట్టిపెట్టుకుని మిగిలిన సగంతో సొజ్జప్పాలు చేసుకొవాలి. ఒక్క దెబ్బకిరెండు ప్రసాదాలన్నమాట.

6. సొజ్జప్పాలు. ( పల్చగా చెసుకుంటే కరకరలాడుతూ వుంటాయి). 1కప్ మైదాచపాతిపిండిలా కలుపుకున్నాక, అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. అవిచిన్న వుండగా చేసి అరచేతిలొ తట్టుకుంటూ మధ్యలో కేసరి చిన్న వుండగా చేసిపెట్టి చిన్న పూరీలా చేతితోనే వత్తుకోవాలి. అవి ఆయిల్ లో వేయించుకోవాలి.(డీప్ ఫ్రై అన్నమాట).

7.గారెలు. (అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం). ఇది చెయ్యడం అందరికీతెలుసుకదా. అవే మరికొన్ని ఎక్కువగా చెసుకుంటే మరో నైవెద్యం. అదీ
8. ఆవడలు. (లేదా పెరుగు గారెలు). ఇవి చెయ్యడం అందరికీ తెలుసనేఅనుకుంటున్నాను.

9. మైసూరుబజ్జీ.- ఇది చెయ్యడం చాలా సులభం. 1కప్ మైదా, 1/4 కప్బియ్యంపిండి, 1కప్ పెరుగు, 1స్పూన్ పచ్చిమిరపకాయముక్కలు,1/4స్పూన్వంటసోడా, తగినంత ఉప్పు. అన్ని బాగా కలిపి చిన్న చిన్న వుండలుగా నూనెలోవేసి డీప్ ఫ్రై చెయ్యడమే.

చూసారా.. చూస్తూండగా 9రకాల నైవెద్యాలు ఎంత చక్కగా చెప్పుకున్నామో..ఏమైనా సవరణలుంటే నిస్సంకోచంగా చెప్పండి. శ్రీలలిత.

Tuesday, July 28, 2009


మనము రోజూ దేవునికి పూజ చేసేటప్పుడు ముందుగా జ్యోతిని వెలిగించి ప్రారంభిస్తాము కదా. అలాగే ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు కూడా జ్యోతిని వెలిగించే సాంప్రదాయం మనకి వుంది. అప్పుడు సంస్కృతంలొని శ్లోకాలు కాకుండా అచ్చ తెలుగులో చెప్పుకునే ప్రార్ధన ఒకటి మా ఫ్రెండ్ చెప్పారు. అది ఈ మొట్టమొదటి టపా ద్వారా అందరికీ అందిద్దామని చెపుతున్నాను. నాకు వచ్చినంతమటుకు చెపుతున్నాను. సవరణలుంటే తప్పక సెలవీయండి.
కొండంత చమురు గోరంత వత్తి గోవిందుడా నా దీపాన్ని వెలిగించు.
ఈశ్వరుడా నా దీపాన్ని ప్రకాశించెటట్లు చెయ్యి
పరమేశ్వరుడా నా దీపాన్ని ఫలించేటట్లు చెయ్యి
కాలకంఠుడా నా దీపం కనికరించేటట్లు చెయ్యి
కాశీలొ గయలొ వటవృక్షంకింద యమధర్మరాజు యెదుట పడకుండా చేసి
ఈ నిక్షేపం లాంటి దీపాన్ని మా ఇంట్లో స్థిరంగా నిలిచి వుండేటట్లు చెయ్యి.
పంచభూతాల సాక్షిగా సూర్యచంద్రులు వున్నంతవరకు మా దీపాన్ని మాఇంట్లోఇలాగె నిలిచి వుండేటట్లు చెయ్యి.

చిలక పలుకులు


ఎందరో మహానుభావులు.అందరికీ వందనములు.