Pages

Showing posts with label . ప్రొఫెసర్ గారి భార్య. Show all posts
Showing posts with label . ప్రొఫెసర్ గారి భార్య. Show all posts

Thursday, August 27, 2009

ప్రొఫెసర్ గారూ--స్పెషల్ క్లాసూ..



ప్రొఫెసర్ గారూ--స్పెషల్ క్లాసూ..


లత పెళ్ళైన కొత్తలో ఒకసారి మొహమాటంగానే సినిమా కెడదామని అడిగింది ప్రొఫెసర్ గారిని. యింకా కొత్త కదా. కాదంటే చిన్నబుచ్చు కుంటుందనుకున్నారో యేమో సరేనంటూ బయల్దేరారు. సినిమా చూస్తున్నంత సేపూ ముళ్ళమీద కూర్చున్నట్టే కూర్చున్నారు. తెలుగు సినిమా గురించి వేరే చెప్పాలా? హీరో రాత్రీ పగలూ రిక్షా తొక్కి చెల్లెలి పెళ్ళి చేసే సెంటిమెంటు. ఆ రిక్షా తొక్కే హీరోని ఒక కోటీశ్వరుడి కూతురు ప్రేమించడం. ఫారిన్ లొకేషన్లు, డ్యూయట్లు. చూస్తున్న కాసేపూ వాళ్ళతో పాటు ప్రేక్షకులూ కలల్లో విహరించడం. తర్వాత అంతా మామూలే కదా. కాని ప్రొఫెసర్ గారు మటుకు దాన్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోయారు. సినిమా అయ్యి వెనక్కి వస్తున్నంతసేపూ పాపం లతకి ఆయన దగ్గర స్పెషల్ క్లాస్ తీసుకోక తప్పలేదు.

ఆఖరికి ఇంటి కొచ్చాక కూడా ఆ సినిమా లోని అవక తవక లన్నీ యెత్తి చూపించి, అవేవీ నిజ జీవితానికి దగ్గరగా లేవనీ, చూస్తే సత్యజిత్ రే తీసిన "పథేర్ పాంచాలి" లాంటివి చూడాలనీ, ఈ సినిమా తీసిన వాడొక ఫూలనీ, చూసినవాళ్ళు యింకా మరీ మూర్ఖులనీ విమర్శించడం మొదలుపెట్టారు. అన్నింటికన్నా ఆశ్చర్యం. సినిమా లోని "నువ్వంటే నాకెందుకో ఇంత ఇదీ.." అన్న చక్కటి పాటని చీల్చి చెండాడేసి, "వాటీజ్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఇదీ.."అని అడిగారు. ముఖ్యంగా చెప్పవలసిన విషయమేంటంటే, ఆయన చెప్పినవన్నీ కరెక్టని లత స్వయంగా ఒప్పుకునేదాకా చెప్పిందే చెప్పడం. ఇంక లతకి నీరసం వచ్చేసింది. యేం చెస్తుంది? ఒప్పుకోక ఛస్తుందా.. ఒప్పుకుంది. కానీ ప్రాణం వుండబట్టలేక ఆ రాత్రే ప్రొఫెసర్ గారు వినకుండా వాళ్ళ రెండో అన్నయ్యకి ఫోన్ చెసింది. యేడుపొక్కటే తక్కువగా జరిగిందంతా చెప్పెసింది. "అన్నయ్యా, సినిమా నుంచి వచ్చిం దగ్గర్నించీ ఇప్పటిదాకా నాకు స్పెషల్ క్లాస్ తీసుకున్నార్రా. సినిమా రెండు గంటలే కాని ఈ స్పెషల్ క్లాస్ మటుకు అయిదు గంటలు పట్టిందిరా.."

అన్నయ్యేం తక్కువ తిన్నాడా.. బ్రహ్మాండమైన వుపాయం చెప్పాడు. "చెల్లాయ్.. మేం మేస్టర్లం కదా.. అల్లాగే చెప్పిందే చెపుతూంటాం. యింకా నయం.. టెస్టేమీ పెట్టలేదు. ఖంగారు పడకు. దీనికి ఒకటే మంత్రం. బావగారు చెప్పేది నీకెప్పుడు బోర్ కొడితే అప్పుడు బెల్ కొట్టేస్తూండు. బెల్ వినగానే మా మాట టక్కున ఆగిపోతుంది. " నమ్మలేకపోయింది లత.

"నిజవా అన్నయ్యా?" "ఆహా..స్వానుభవం మీద చెప్తున్నాను. యేం అనుమానం అఖ్ఖర్లేదు. యెందుకంటే మీ వదిన నామీద అదే మంత్రం ప్రయోగించింది. " మరింక వివరణ అనవసరం అనుకుని ఫోన్ పెట్టేసాడు లత అన్నయ్య.
యింకనేం.. భలే వుపాయం దొరికిందనుకుంది లత. మళ్ళీ మరో సందేహం. అన్నయ్య అమాయకుడు కనక వదిన ఆటలు సాగాయి. మరి యిక్కడో... చూద్దాం మళ్ళీ అల్లాంటి పరిస్థితి వస్తే అనుకుంది.

మర్నాడు లత టీ వీ చూస్తోంది. పక్క రూమ్ లొ ఏదో చదువుకుంటున్న ప్రొఫెసర్ గారు పనికట్టుకుని హాల్లోకొచ్చారు. తెలుగులో వచ్చే సీరియల్స్ గురించి చెప్పేదేముంది... మళ్ళీ లతకి స్పెషల్ క్లాస్ మొదలైంది. "ఊ...ఊ.." అంటూ ఓపికున్నంత సేపు వింది పాపం. ఆమెకి మటుకు అలా చెప్పిందే చెప్తుంటే యెంతసేపని వింటుంది.. "ఎలాగురా బాబూ.." అనుకుంటుంటే అన్నయ్య చెప్పిన సలహా గుర్తొచ్చింది. బెల్ కొట్టాలి కదా అనుకుంది. అవునూ, ఇప్పటికిప్పుడు బెల్ ఎక్కడినుంచి తెచ్చేది? ప్రొఫెసర్ గారు లెక్చర్ ఇస్తూనే వున్నారు. లత చురుకైన బుర్రకి ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చింది. రోజూ దేవుడికి గంట కొడతాం కదా. నెమ్మదిగా లేచి దేవుడి గూట్లో పెట్టిన గంట తీసుకొచ్చి గణగణా వాయించడం మొదలుపెట్టింది.

సీరియస్ గా లెక్చరిస్తున్న ప్రొఫెసర్ గారు టక్కున లెచి, చేతిలో పుస్తకం మడుస్తూ పక్క గదిలోకి వెళ్ళిపోయారు. "హుర్రే" అనుకుంది లత. మొహం వెలిగిపోయింది.
కాని రెండో నిమిషంలో గుమ్మంలోకి వచ్చి లత వైపు చూసిన ప్రొఫెసర్ గారి చూపు చూస్తేమటుకు ......యెందుకులెండి.......

#####################################################################

Wednesday, August 26, 2009

ప్రొఫెసర్ గారూ-పంక్చుయాలిటీ


లత ఒక తెలుగింటి అమ్మాయి. అందరు ఆడపిల్లల్లాగే పెళ్ళి గురించీ, వివాహజీవితం గురించీ యేవేవో ఊహించుకుంది. కలల్లో విహరించే లతకీ, ప్రతి చిన్న విషయాన్నీ హేతుబధ్ధంగా ఆలోచించే ఒక ప్రొఫెసర్ కీ వివాహమైంది. వారిద్దరి మధ్య గల ఊహకీ, వాస్తవానికీ గల తేడాని చూపించడమే ఈ కథలు చెప్పడం లోని లక్ష్యం.
ప్రొఫెసర్ గారూ--పంక్చుయాలిటీ

ఆడపిల్లంటే యింటికి మహాలక్ష్మనీ, ఆమెని గారంగా, ప్రేమగా, భద్రంగా చూడాలనీ భావించే యింట్లో నలుగురన్నయ్యల తరవాత అపురూపంగా పుట్టిన ఆడపిల్ల లత. ఆంధ్రదేశంలోని చాలామంది ఆడపిల్లల్లాగే లత కూడా పెరిగింది. చిన్నప్పట్నించీ ఆడింది ఆటగా, పాడింది పాటగా పెరిగిన లతకి కాలేజీకి రాగానే అన్నయ్యల అభిమానం రెట్టింపయ్యింది. అందులోనూ లత చదివే కాలేజీ లోనె వాళ్ళ రెండో అన్నయ్య లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. మరింక చెప్పేదేముంది. ఆ కాలేజీలో చదివినన్ని రోజులూ లత అనుభవించిన ప్రత్యేకతలు చెప్పనలవికాదు. అందులోనూ కాస్త చురుకైనదేమొ అన్నింట్లోనూ తనే అయి తిరుగుతూ డిగ్రీ చదివిన మూడేళ్ళూ కాలేజీని యేలేసింది. బాధ్యతంటే తెలీకుండా జీవితమంతా తెలుగు సినిమాలు చూసుకుంటూ గడిపేస్తారనుకునే భావనలో వున్న లతకి పెళ్ళైంది.
రెండు కుటుంబాలూ ఎక్కడో ఎప్పుడో బీరకాయపీచు చుట్టరికం వున్నవాళ్ళే. అబ్బాయి మటుకు లత అన్నయ్యకి ఒకప్పటి క్లాస్ మేట్. లత తండ్రి లతని సూటిగా అడిగారు. "చూడు తల్లీ, పెద్దన్నయ్య స్నేహితుడుట. ఈమధ్యనే పి.హెచ్.డి.పూర్తి చేసి యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా చేరాట్ట. నీకు ఇష్టమైతే ముహుర్తాలు పెట్టిస్తాను."అని. కాదనడానికి లతకి కారణాలేమీ కనిపించలేదు. ఆవిధంగా లత ప్రొఫెసర్ గారి భార్య అయింది.
పాపం అప్పుడు లతకి తెలీలేదు. మంచివాడంటే చెడ్డవాడు కాదనుకుంది తప్పితే గట్టిగా మాట కూడా మాట్లాడని అతి మర్యాదస్తుడని అనుకోలేదు. బాగా చదువుకున్నవాడంటే పి.హెచ్.డి.అనుకుంది తప్పితే క్లాసు పుస్తకం తప్పితే మిగిలిన పుస్తకాలన్నీ చెత్త పుస్తకాలే అనుకుంటాడని తెలీలేదు. మనిషి ప్లాన్డ్ గా వుంటాడంటె మరీ కాలేజీలో టైమ్ టేబిల్ లాగ యింట్లొ కూడా టైమ్ టేబిల్ పెడతాడని అప్పుడు తెలీలేదు. వ్యసనాలవీ లేనివాడంటే సిగరెట్లు, తాగుడు లాంటి అలవాట్లు వుండవనుకుంది తప్పితే అతని దృష్టిలో సినిమా చూడడంకూడా ఒక దుర్వ్యసనమే అని అనుకోలేదు. అందుకే కొత్తలో అతనితో సర్దుకుపోవడం కొంచెం కష్టమే అనిపించింది.
ముఖ్యంగా పంక్చుయాలిటీని పాటించడంలో ప్రొఫెసర్ గారిని మించినవారులేరు. ఉపన్యాసాలివ్వడంలొ వారికి గల నైపుణ్యానికి తార్కాణంగా సిటీలో జరిగే చాలా సభలకి ఉపన్యాసాలివ్వమని వారికి ఆహ్వానాలందుతూండేవి. అలాగే ఒక రోజు వివేకానంద ఉపన్యాసాల గురించి ప్రసంగించమని ఒకచోట నిర్వాహకులు అడిగారు. భార్య తన ఉపన్యాసం వినాలని ప్రొఫెసర్ గారు ఆశించారు. లత కూడా భర్త గొప్పతనం చూడాలని ఉవ్వుళ్ళూరింది. అక్కడ తనని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తారని ఎంతో సంతోషపడింది. అందుకని తీరుబడిగా అలంకరణ మొదలుపెట్టింది.
హుందాగా కనపడాలని బాగా గంజి పెట్టిన కాటన్ చీర తీసింది. జడ మాని ముడి వేసింది. మేకప్ మరీ ఎక్కువగా లేకుండా, లిప్ స్టిక్ మరీ కొట్టొచ్చినట్టు కనపడకుండా జాగ్రత్తపడింది.
అప్పటికే చాలా సేపట్నించీ ప్రొఫెసర్ గారు షూ లేసులు కూడా కట్టేసుకుని, తాళాలగుత్తి చేతిలో పట్టుకుని లత కోసం అసహనంగా ఎదురుచూస్తున్నారు. అసలు ఆరోజు ఉదయం నుంచీ వాళ్ళిద్దరిమధ్యా వాదన జరుగుతూనేవుంది. చీఫ్ గెస్టంటే కనీసం అరగంటైనా ఆలస్యంగా వెళ్ళకపొతె మరింక మన గొప్పేంవుంటుంది అంటుంది లత. చెప్పిన టైమ్ కి వెళ్ళక పోతే మర్యాదగా వుండదంటారు ప్రొఫెసర్ గారు. అలాగ ఒకరి మాట మీద మరొకరు మాట వెస్తూనే వున్నారు. కాని ఇప్పుడాయన వరస చూస్తే ఈ పంక్చుయాలిటీ కాదుకాని ఇంకా ఆలస్యమైతే తనని వదిలేసి ఒక్కరే వెళ్ళిపోతారేమోనని లతకి భయం వేసింది. అందుకే అంత గంజి పెట్టి ఇస్త్రీ చేసిన కాటన్ చీరనీ హడావిడిగా చుట్టబెట్టేసుకుని తన అసంతృప్తిని మొహంలో కనిపించేటట్టు చూస్తూ ఆయనతో బయల్దేరింది.

ఇద్దరూ సరిగ్గా సమయానికి మీటింగ్ హాల్ కి చేరుకున్నారు. ఆశ్చర్యం ఇంకా హాలు తలుపులె తెరవలేదు. అనుమానం వచ్చి ఆహ్వాన పత్రిక చూసారు. అదే హాలు. అదే రోజు. అదే సమయం. ఒకరి మొహాలొకరు చూసుకుంటుంటే హాలు ముందు ఒక టూ వీలర్ ఆగింది. దాని మీంచి ఒక స్థూలకాయుడు పాన్ నములుతూ దిగి వీళ్ళ వైపు వస్తూ "యేంటింకా తలుపులు తియ్యలేదా?" దబాయిస్తున్నట్టు అడిగాడు. అతన్ని చూసి అప్పటిదాకా యేపక్కనున్నాడో కాని వాచ్ మేన్ తాళాలగుత్తితో పరిగెట్టుకొచ్చాడు. తాళం తియ్యగానే ఆ స్థూలకాయుడు మరింక వీళ్ళవేపైనా చూడకుండా స్టేజి మీదకెళ్ళి కుర్చీలు, మైకులు గట్రా సర్దటం మొదలుపెట్టాడు. లత భర్తని ప్రశ్నార్ధకంగా చూసింది. ఆ చూపుకి తట్టుకొలేని ప్రొఫెసర్ గారు మరింక మొహమాటం వదిలేసి వాచ్ మేన్ ని పిలిచి కార్యకర్తల గురించి అడిగారు. అడిగినదానికి సమాధానం చెప్పకుండా వాడు "మీరెవరండీ?"ని ఎదురు ప్రశ్న వేసాడు. ఆయనేం మాట్లాడలేకపోయారు. లత మరింక లాభం లేదని ముందుకొచ్చి, "ఈయనే ఇప్పుడిక్కడ ఉపన్యాసం యివ్వాల్సింది." అంది. వాడు వీళ్ళని వెర్రివాళ్ళని చూసినట్టు చూసి, "వస్తారలాకూకోండి.." అంటూ వెళ్ళిపోయాడు.

అలా కూర్చుని లత ఆ హాల్ కి ఎన్ని కిటికీలు, గుమ్మాలు వున్నాయో లెక్కపెట్టేసింది. సీలింగ్ ఎంత ఎత్తులొ వుందో పరిశీలించింది. గోడలకి ఏ కలర్ వెసారో ఒకటికి పదిసార్లు చూసింది. స్టేజి మీద ఎంత మంది కూర్చోవచ్చో అంచనా వేసింది. పది సార్లు చీర సర్దుకుంది. ఇరవైసార్లు జుట్టు చెరుపుకుంది. ముఫ్ఫైసార్లు చెప్పులు విడిచి మళ్ళీ వేసుకుంది. కాని ప్రొఫెసర్ గారు మటుకు పొరపాటున కూడా లత వైపు చూడలేదు. బహుశా చూసే ధైర్యం లేకపోయుండొచ్చు.

అలా వాళ్ళు కూర్చున్న అరగంటకి ఒక్కరొక్కరుగా కార్యకర్తలు రావడం మొదలుపెట్టారు. తర్వాత వాళ్ళు క్షమాపణలు చెప్పుకోడం, మర్యాదలు చెయ్యడం అదంతా వేరే విషయం కాని అప్పట్నించీ లత మళ్ళీ యెప్పుడూ ప్రొఫెసర్ గారితో ఉపన్యాసాలకి వెళ్ళలేదు.
##################################################################