చెర్రీబ్లూజమ్స్..
ప్రకృతి
యెంత అందమైనది. ఆ ప్రకృతిలోని ప్రతి అణువూ భగవంతుని చరణాలను చేరాలని యెంత
తాపత్రయపడుతుందీ..
ఈ సుకుమార సుమాల పేరు చెర్రీ బ్లూజమ్స్ ట.
పేరులోనే యెంతటి సౌకుమార్యం! యే
భాషయితేనేం, యే పేరయితేనేం వీటి తీరు వింటే మనసు ముద్దమందారమవుతుంది.
యేడాదికి
ఒక్కసారి, అదికూడా కేవలం రెండువారాలు మాత్రమే పూస్తాయిట ఈ పూలు. యేడాదిమొత్తం
సౌందర్యారాధకులు ఈ రెండువారాలకోసం వేచి చూస్తుంటారుట. పార్కుల్లో బారులు తీరి
నిలుచుని ఈ సుమసోయగాన్ని చూసి పరవశించిపోతారుట.
అటువంటి విరులను వీక్షించే భాగ్యం నాకు మా అమ్మాయివాళ్ళింట్లో దక్కింది. వాళ్ళింటి వెనకాల డెక్ కి ఆనించి వేయించింది వీటిని మా అమ్మాయి.
అటువంటి విరులను వీక్షించే భాగ్యం నాకు మా అమ్మాయివాళ్ళింట్లో దక్కింది. వాళ్ళింటి వెనకాల డెక్ కి ఆనించి వేయించింది వీటిని మా అమ్మాయి.
నేను
ఇక్కడికి వచ్చేటప్పటికి చెట్టు నిండుగా ఆకు కనిపించకుండా పూలు. లేతగులాబీరంగులో,
ముట్టుకుంటే ముడుచుకుపోయేట్టుండే ఉలిపిరికాగితమంత పల్చని రేకులతో, ముద్దగా,
ముగ్ధమనోహరంగా, తలవంచి భూమాతను ప్రణమిల్లుతున్నంత వినయంగా తలవంచి ఊగుతున్న ఈ
పూలగుత్తులను చూస్తుంటే భావాన్ని ప్రకటించే భాషరాక మనసు మూగపోయింది.
యిన్నినాళ్ల యెదురుచూపులు యిందుకోసమే అన్నట్లు రెండువారాలు
కాగానే రేకులు భూమాతను తాకడం మొదలవుతుంది. పూలజల్లు కురిసినట్లు పల్చటి, సున్నితమైన రేకులు, చిరుగాలి తాకిడికే
అల్లనల్లన కదిలి మెల్లగా జాలువారుతుంటే ధరణికి ప్రణమిల్లుతున్న వనదేవతయేమో
అనిపిస్తుంది.
ఒక్క జన్మచాలదా
ఆ భగవంతుని ధ్యానించుటకు
ఒక్క గడియ
చాలదా ఆ దేవుని పాదాలచెంత మన మనసును అర్పించుకుందుకు
ఒక్క క్షణం
చాలదా ఆ దేవదేవుని మ్రోల వాలడానికి ఈ విరుల బ్రతుకుకు
అంతకన్న
ధన్యమైన జన్మ మరి వుండదు కాక వుండదు కదా.
------------------------------------------------------------------------------------