కథ--అమ్మకో ఉత్తరం
రచయిత్రి---కల్పనా రెంటాల
బాధ్యతలు బంధాలని ఎలా శాసిస్తాయో ఈ కథ చెపుతుంది కనుక నాకు ఈ కథ నచ్చింది.
అత్తవారింటినుంచి కూతురు ఎప్పుడు వచ్చి తనని సంతోషపెడుతుందా అని ఎదురుచూసే తల్లికి, పుట్టింటికి వెళ్ళి కాస్త సేదదీరదామని వున్నా కదలనీయని కుటుంబబాధ్యతలుగల ఒక కూతురు ఆ తల్లి మనసు కష్టపడకుండా వుండాలని అమెరికాలో తను ఎంత సంతోషంగా వుంటోందో బుకాయింపుగా చెప్పడం మొదలుపెట్టి, ఆఖరికి తన మనసుని పట్టుకోలేక బేలపడి రాసిన ఉత్తరం ఈ కథ.
చిన్నప్పుడు చిన్న చిన్న గిన్నెలతో, పప్పు, బెల్లాలతో అన్నం, పప్పు వండి బుల్లి బుల్లి చేతులతో నోటిలో పెడుతుంటే పొంగిపోతుంది అమ్మ.
బువ్వాలాట లాడుతున్న బుల్లితల్లిని మురిపెంగా చూసుకుంటుంది.
అదే అమ్మ ఆ బుల్లితల్లికి పెళ్ళి చేసి అత్తవారింటికి పంపాక అనుక్షణం ఆరాటపడిపోతుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన బంగారుతల్లి అక్కడ ఎలా సమర్ధించుకుంటోందోనన్న ఆలోచనతో ఆమె నుంచి వచ్చే ఒక చల్లనిమాట కోసం కొట్టుకుపోతూంటుంది.
ఎప్పుడు ఎప్పుడు ఆ బుల్లితల్లి ఇంటికి వస్తుందా అని వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంది.
కాని మరి ఆ బంగారుతల్లో...ఇప్పుడు బుల్లితల్లి కాదుకదా..
ఒక ఇంటికి ఇల్లాలు.
బాధ్యత గల ఒక తల్లి.
తగిలించుకున్న బంధాలు
తగులుకున్న బాధ్యతలు
మనసు మథనపడుతున్నా
మెదడు పనిచేయక తప్పని పరిస్థితుల్లో
బాధను అగాధాల్లో పాతిపెట్టి
పెదవులకు చిరునవ్వు అతికించుకుని
ఎంత హాయిగా వున్నానో
అనుకోక తప్పని పరిస్థితి.
తనకున్న చిన్న చట్రంలో ఇమిడిపోయి ఇతర విషయాల గురించి కనీసం ఆలోచించడానికి కూడా అవకాశమివ్వని పరుగెత్తే కాలంతో పాటు ఉరుకులూ, పరుగులతో నడిచే జీవనసరళి.
కాని అమ్మ మనసు తెలుసు. తను బాగానే వున్నానని పదిరోజులకొకసారైనా అమ్మకి చెప్పకపోతే ఆ తల్లి మనసు పడే ఆరాటం ఈ కూతురికి తెలుసు.
అందుకే సముద్రాల ఆవలితీరంనుంచి కూడా పని కట్టుకుని ఫోన్లు చేస్తుంది.
కాని పాపం.. ఆ తల్లికి అది సరిపోదు. పిల్ల ఒక్క ఉత్తరమ్ముక్క రాస్తే ఆ నాలుగు పదాలూ నలభైసార్లు చదువుకుంటే కాని ఆ తల్లికి సంతృప్తి వుండదు.
ఏడాది కోసారైనా వచ్చి తన దగ్గర ఓ నాలుగు రోజులుంటే తప్ప ఆ తల్లి కడుపు నిండదు.
ఇది ప్రతి తల్లీ, కూతురూ అనుభవించే ఆవేదనే.
దానినే కల్పన రెంటాల ఒక కథలా రాసారు.
ఆ కథ ఇలా మొదలౌతుంది,
అమెరికా నుంచి ఫోన్ చేసినా మాట్లాడడం కుదరకపోవడం వల్ల ఈ కథలో కూతురికి పెన్ పట్టుకుని కాగితాలు ముందేసుకుని (అవి కూడా టిష్యూపేపర్లు) ఇండియాలో వున్న తల్లికి తెలుగులో ఉత్తరం రాయడం తప్పలేదు. తల్లి ఈమెయిల్ ఇవ్వడం నేర్చుకోకపోయినందుకు ఒకవిధంగా నిష్ఠూరమాడుతూనే ఉత్తరం రాయడం మొదలెట్టిన ఆమె అమెరికా జీవనసరళి ఎలా వుంటుందో వర్ణిస్తుంది.
అక్కడి జీవితం ఎంత యాంత్రికమైనదో చెప్తూ, అది సుఖంగా బతకడానికి ఎంత అనుకూలంగా వుంటుందో చెపుతూ..ఆ ధోరణిలో మనుషులు మిషన్లలా ఎలా మారిపోతారో చెపుతుంది.
యంత్రాలతో పాటు ఒక యంత్రంలా మారిపోవాలనుకుంటున్న ఆమె అలా రాస్తూండగానే ఆమె మనసు తల్లి ఒడిని చేరిపోతుంది. ఆమె గుండె పట్టేస్తుంది. ఈ మాట చదువుతున్నప్పుడు మనకి కూడా గుండె పట్టేస్తుంది.
తన కుటుంబాన్ని బాధ్యతగా నడిపించుకునే క్రమంలో తల్లికి ఉత్తరం రాయలేకపోవడం, అనుకున్నప్పుడల్లా పుట్టింటికి రాలేకపోవడం అన్నవి తనకి తనే సమర్ధించుకుంటుంది.
కాని మనసులో ఎక్కడో దాగున్న తడి ఆమె కళ్ళని చెమ్మగిలజేస్తుంది.
అనురాగాలు, ఆప్యాయతలూ మనలని అంత తొందరగా వదిలిపోవని ఈ కథ నిరూపిస్తుంది.
ఈ సెంటిమెంటుతో పాటు రచయిత్రి అమెరికా జీవనవిధానం గురించి కూడా చక్కగా చెప్పారు. కథ మొదలుపెడితే కదలకుండా చదివింపజేస్తుంది.
ఆఖరున కాస్త గుండె బరువెక్కుతుంది కూడా.
-------------------------------------------------------------------------------------------
ఈ కథ మీరు ఇక్కడ చదవవచ్చు.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/am-mako-uttaram---kalpana-rentala
కినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా