Pages

Tuesday, June 29, 2010

భారం - అబ్బూరి ఛాయాదేవి

భారం --కథాజగత్ పోటీ

ఈ కథను మీరు ఇక్కడ చదవవచ్చు.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/bharam---abburi-chayadevi

ఈ కథ వాస్తవాన్ని అద్దం లా చూపించిన కథ కనుక నాకు చాలా నచ్చింది.

పెద్దవారయిపోయి, రిటైరయిన తల్లితండ్రులు వాళ్ళిద్దరే ఒకరికి ఒకరు ఆసరాగా వుంటున్న రోజులివి. పిల్లల వుద్యోగ బాధ్యతల గురించి అర్ధం చేసుకున్న తల్లితండ్రులు వారినుంచి ఎటువంటి సహకారమూ ఆశించకుండా, వారికి భారమవకుండా శేషజీవితాన్ని గడుపుతున్న రోజులివి. కాని ఎంత సర్దుకుందామని ప్రయత్నించినా ఒక్కొక్క బలహీనమైన క్షణం లో తమ తమ పిల్లల దగ్గరినుంచి సాయం అందకపోయినా కనీసం మాటల్లో నైనా ఓదార్పు కనపడితే చూడాలనుకోవడం కూడా అత్యాశ గానే అయిపోయింది.
అలా ఆశించిన ఒక తల్లే అవని. తనూ, భార్యా, పిల్లలు మాత్రమే తన కుటుంబం అనుకునే ఈ రోజుల్లో భార్య తల్లితండ్రుల యోగ క్షేమాలను ఎవరు కనుక్కుంటారు. కాని ఒక్కగానొక్క కూతురిని అపురూపంగా పెంచి, ఒక అయ్య చేతిలో పెట్టి, "అల్లుడివైనా కొడుకువైనా నీవే బాబూ" అంటున్న అత్తామామల మీద ఏమాత్రం అభిమానం చూపించని అల్లుడు, తన కాపురం నిలబెట్టుకుందుకు(అవకాశవాది లాగ) భర్త మాట జవదాటని కూతురూ, ఆప్యాయంగా చేరదీద్దామనుకుంటున్న మనవడిని కూడా దగ్గరికి చేరనీయకపోవడం వలన వచ్చిన బాధా.. ఇవన్నీ అవనిని బాధపెడుతూంటాయి.
అసలు ఒకరు మనల్ని చూడాలనీ, మన తదనంతరం ఆస్తి వాళ్లకే వెడుతుంది కనుక అప్పుడప్పుడయినా తమ బాగోగులు వాళ్ళు కనుక్కుంటూ వుండాలనీ ఆశించడం తప్పు. బ్రతికున్నప్పుడయినా సరే, తర్వాతయినా సరే మనం మరొకరికి భారం కాకూడదు. అవని కూడా అలాగే తన కూతురికి భారం కావాలనుకోలేదు. కూతురు నుంచి డబ్బూ ఆశించలెదు, మనిషి సాయమూ ఆశించలేదు. కాని ఒక్క చిన్న ఓదార్పు మాట. "ఫరవాలేదమ్మా, నీకు నే నున్నానమ్మా.." అనే ఒక్క మనసును చల్లబరిచే మాట. దాని కోసం తపించిపోయింది. కాని పాపం ఆమెకి కూతురి నుంచి ఆ మాత్రం ఓదార్పు మాట కూడా రాలేదు.
కారణం.. అలా పొరపాటున అయినా ఒక్క ఓదార్పు మాటంటే తల్లితండ్రుల భారం తనమీద ఎక్కడ పడిపోతుందోనని కూతురు కుసుమ అనుకోవడం వల్లే అనిపిస్తుంది. చాలా కుటుంబాల లో ఏ విషయం లోనైనా నిర్ణయం తీసుకోవలసింది భర్తే. దానిని అక్షరాలా ఆచరించడం వరకే భార్య బాధ్యత. అదే సంప్రదాయాన్ని అనుసరించింది కుసుమ కూడా. భర్త మాటని కాదని తను చిక్కుల్లో పడదలుచుకోలేదు. సాఫీగా సాగిపోతున్నప్పుడు లేనిపోని కష్టం యెందుకు అనుకుంది. కాని తల్లి పడే మనోవ్యధ అర్ధం చేసుకోలేకపోయింది.
మన చుట్టూ ఇలాంటివాళ్ళు చాలామంది కనిపిస్తారు. ఏదో మాట్లాడతారు తప్పితే మనసుతో ఆలోచించరు. నిజంగా కనక మనసుతో ఆలోచిస్తే, అమ్మా నాన్న యింటికి వస్తున్నారంటే మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. కాని స్వంత ఆలోచన అంటూ లేనివారికి, లేకపోతే మనసులో మాట బైటకి చెప్పే అవకాశం లేనివారికి, అదీకాక కుసుమ లాగా భర్త మాటే వేదం గా శిరసావహించే వాళ్ళకి తల్లితండ్రులు తమ యింటికి వచ్చి యిబ్బంది పెట్టడం యిష్టం వుండక తప్పించుకుంటుంటారు.
కూతురు తనని కనీసం మనసులో మాట కూడా చెప్పుకోలేనంత పరాయిదానిగా చూడడం అవనికి మరీ బాధగా అనిపిస్తుంది. కూతురితో తనకు వున్న యిలాంటి అనుభవాలన్నీ స్నేహితురాలితో చెప్పుకుని తన మనసులోని భారాన్ని దించుకుంటుంది.
అదంతా సానుభూతిగా విని, స్నేహితురాలిచ్చిన సలహాకి అమాయకంగా, జాలిగా చూస్తుంది అవని.
ఈ ఆఖరిమాట చదువుతున్నప్పుడు మనసు కలుక్కుమంటుంది.


*********************************************************************************

2 వ్యాఖ్యలు:

Pramila said...

ee maadiri mooga vedana bharinche vaallu ee madhya kaalam lo kokollalu.
paravaaledu . koothuru. kaani kodukayithe
inkaa intlo banda chaakiri kooda padivundedi. koduku chetha , kodalichetha maatalu padavalasi vasthundi.
choosthunnamu chaalaa kutumbaalalo.

శ్రీలలిత said...

ప్రమీలగారూ,
మీరు చెప్పింది అక్షరాలా నిజమండీ. మీ బ్లాగ్ ఇప్పుడే చూసాను. చాలా బాగుంది.