Pages

Wednesday, August 9, 2017

మా వదిన మంచితనం- నా మెతకతనం.


2017, ఆగస్టునెల, మాలిక పత్రికలో వచ్చిన వదినగారి కథ..

http://maalika.org/magazine/2017/08/01/%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B0%A8%E0%B0%82-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%AE%E0%B1%86%E0%B0%A4%E0%B0%95%E0%B0%A4%E0%B0%A8/


మా వదిన మంచితనం- నా మెతకతనం.

      
 నవంబరు 8 మన ప్రథానమంత్రి నరేంద్రమోడీగారు రాత్రి యెనిమిదిగంటలకి మొత్తం ప్రపంచమే ఉలిక్కిపడేలా. 500, 1000 రూపాయిలనోట్లు ఆరాత్రి పన్నెండుగంటలనుంచీ చెల్లుబడి కావంటూ ఒక ప్రకటన చేసారు. అది వినగానే ప్రపంచం మాట దేవుడెరుగు.. నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. సంగతి కూడా అలాంటిదే మరి..
అసలే నాది ముక్కుసూటిగా వ్యవహరించే స్వభావం. బీరువాలో డబ్బుంటే ఖర్చుపెట్టుకోవడం, లేకపోతే మాట్లాడకుండా వూరుకోవడం తప్ప చాటూమాటూ తెలీనిదాన్ని. అలాంటిదానికి నాకు మా వదిన బ్రైన్ వాష్ చేసేసి, పిల్లలున్నప్పుడు యేవేవో అవసరాలుంటూంటాయి కనుక భర్తకి తెలీకుండా కొంత డబ్బైనా పక్కన పెట్టుకోవడం ఆడవాళ్ళందరి ప్రథమ కర్తవ్యం అని హితబోధ చేసిందివదిన చెప్పిన మాటలు నామీద యెంత ప్రభావం చూపెట్టాయంటే అప్పటివరకూ దాపరికం అంటే యెరుగని నేను మా యింట్లోవాళ్ళకి తెలీకుండా యేడాదినుంచీ కొంత సొమ్ము పక్కకి పెడుతుంటే అది మొన్న దసరాల టైమ్ కి మూడువేలైంది. నాకేమిటో మనసుకి చాలా ధైర్య మొచ్చినట్టు అనిపించేసి, అలాంటి చక్కటి సలహా యిచ్చినందుకు మా వదినకి బోలెడు కృతజ్ఞతలు చెప్పేసుకున్నానుఅందుకు వదిన నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూసి, అది చాలా తక్కువ మొత్తమనీ, యేటినుంచీ యింకాస్త యెక్కువగా వెనకేయమనీ అంటూ యెలా వెనకేయాలో సలహాలు కూడా యిచ్చింది. నేను ఇంకా నెమ్మదిగా సలహాలు పాటిద్దామా వద్దా అనుకుంటూండగానే యిలా మోడీగారు నోట్లు సరైన లెక్క చూపించకపోతే చెల్లవని ప్రకటించేసేరు. నా గుండెల్లో రాయి పడింది. ఇలా డబ్బులు దాచానని యింట్లో చెపితే అప్పటిదాకా నన్ను నమ్మినవాళ్ళు యెక్కడ నన్ను దొంగలా చూస్తారోనని బెంగ. చెప్పకపోతే డబ్బంతా చిత్తుకాగితాలయిపోతాయేమోనని భయం. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగైంది నా పరిస్థితి. ఇంకేం చేస్తానూ.. “త్వమేవ శరణంఅంటూ వదిన వైపు ఆర్తిగా చూసాను. వదిన అభయహస్తం యిచ్చింది. నోట్లు మార్చి పెడతాననీ, మా యింట్లోవాళ్ల ముందు అబధ్ధాలాడి డబ్బు దాచినట్టు బైటకి తెలీకుండా మానేజ్ చేస్తాననీ, మర్నాడు పొద్దున్నే డబ్బు తీసుకుని రమ్మనీ చెప్పింది. అంతకన్న గత్యంతరం నాకు కనిపించలేదు. ఎందుకంటే నేను వెళ్ళి బ్యాంకులముందు పూటలకి పూటలు క్యూలో నిలబడలేకపోవడం మాట అటుంచితే అసలు నా దగ్గర యిలా బ్లాక్ మనీ వున్నట్టు యింట్లోవాళ్ళకి తెలీడం నాకు అస్సలు యిష్టం లేదు. అందుకనే మర్నాడు పొద్దున్నే వదిన యేదో నోము నోచుకుంటోందనీ, వాయినం అందుకుందుకు రమ్మందనీ యింట్లో చెప్పి, బ్లాక్ మనీ తీసుకుని అన్నయ్యింటికి వచ్చాను.
  వదిన నన్ను సాదరంగా ఆహ్వానించింది. అన్నయ్యకి యిద్దరు ముగ్గురు బ్యాంక్ ఆఫీసర్లు తెలుసనీ, మనం వెళ్ళక్కరలేకుండా 500, 1000నోట్లు తీసుకుని వందనోట్లు యిస్తారనీ చెప్పింది. నాకు చాలా ధైర్యం వచ్చేసింది. ఆపదలో ఆదుకున్న వదిన వంక భక్తురాలిలా చూసాను. ఇంతలో ఆఫీసుకి వెళ్ళడానికి అన్నయ్య తయారై వచ్చాడు. “ఏంటి చెల్లాయ్ సంగతులూ..” అంటూ. “అంతా విని మళ్ళీ అడుగుతారేవిటండీ. పాపం మీ బావగారు పైసా యివ్వడానికి పది కారణాలడుగుతున్నారని, యింట్లో వాడడానికి యిచ్చిన డబ్బులో కాస్త పక్కకి పెట్టిందిట మీ చెల్లెలు. అదికూడా పిల్లలున్నారు కదా.. యెప్పుడే అవసరం వస్తుందో ననే తప్పితే తనకోసమా యేమైనానా.. కానీ నిన్న మోడీగారి ప్రకటనతో డబ్బులు యెలా మార్చుకోవాలో తెలీక బాధపడుతుంటే నేనే మనింటికి రమ్మన్నాను. మీకు యిద్దరు ముగ్గురు బ్యాంక్ ఆఫీసర్లు తెల్సుకదా.. పాపం స్వర్ణ క్యూలో యెక్కడ నిలబడగలదూ.. మీరు కాస్త నోట్లు మార్పించెయ్యండి.. “ అంది.
   “ దానికేం భాగ్యం.. ఏం చెల్లాయ్.. బావగారు మరీ అంత పిసినారా యేంటీ. అయినా యింట్లో భార్యని అలా పరాయిదానిలా చూస్తే యెలా?” అన్న అన్నయ్య మాటలకి నా మనసు చివుక్కుమంది. నా మాయదారి దాపరికం కాదు కానీ దేవుడిలాంటి మా ఆయనకి చెడ్డపేరు తెచ్చానా అని క్షణం అనిపించింది. ఇంతలో వదిన అందుకునిఅవన్నీ యిప్పుడెందుకు లెండి.. యేది స్వర్ణా డబ్బూ..” అంటూ చెయ్యి చాచింది. మాట్లాడకుండా బేగ్ లోంచి తీసి వదిన కుడిచేతిలో మూడువేలూ పెట్టేను. “ఎంతుందేమిటీ?” అన్నాడు అన్నయ్య చెయ్యి చాస్తూ.. వదిన యెప్పుడు తన యెడం చేతిలోంచి డబ్బు కట్టలు కుడిచేతిలోకి మార్చుకుందో తెలీదుకానీ, “ముఫ్ఫైమూడు వేలు..” అంటూ నేనిచ్చిన డబ్బుతోపాటు, తనది కూడా కలిపేసి అన్నయ్య చేతిలో పెట్టేసింది. నేను నిర్ఘాంతపోయేను. అంటే నావి మూడువేలూ, వదినవి ముఫ్ఫైవేలూనా..మొత్తం నా డబ్బే అనే అభిప్రాయం పెట్టేస్తోందా అన్నయ్యలో.. అయ్యయ్యో.. ఛీ ఛీ.. అన్నయ్యముందు యెంత సిగ్గుచేటు..విషయం అర్ధమయి నేను నోరు విప్పే లోపలే అన్నయ్య వెళ్ళిపోయేడు. నాకు కోపం ఉబికుబికి వచ్చేసింది. “ఇదేంటి వదినా.. నేను మూడు వేలే కదా ఇచ్చేను. ముఫ్ఫైవేలు కూడా నావే అనెందుకు చెప్పేవూ?” అడిగేసేను ఉక్రోషంగా..
కూల్..స్వర్ణా.. డబ్బు మార్చేటప్పుడు మూడు వేలైతేనేం ముఫ్ఫైవేలైతేనేం.. అయినా ఇప్పుడు నేను నా డబ్బులు మార్చుకుందుకు మా అన్నయ్య దగ్గరికి వైజాగ్ వెళ్ళలేనుగా.. అందుకే మీ అన్నయ్యకే యిచ్చేసేను.. “ అంది.
అంటే వదిన యెంత తెలివిగా తన బ్లాక్ మనీని వైట్ చేసుకుందో అనుకుంటూ పైకి నోరు మెదపలేని నా మెతకతనానికి నన్ను నేను తిట్టుకున్నాను.
-----------------------------------------------------------------------------------------------------------------------
"మందాకిని" త్రై మాసికపత్రిక సౌజన్యంతో..