Pages

Showing posts with label మా నాన్నగారు.... Show all posts
Showing posts with label మా నాన్నగారు.... Show all posts

Tuesday, June 3, 2014

మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి శతజయంత్యుత్సవం..



మేరునగమంతటి ఉన్నతవ్యక్తిత్వం కలవారూ
సముద్రమంత గంభీరులూ
కుసుమకోమలహృదయులూ
రాముడంతటి వినయసంపన్నులూ
బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు...
 ఆయనే మా నాన్నగారు.     




  ఈ జూన్ ఒకటవతారీకు నాకు, మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళకు పండుగరోజు. యెందుకంటే ఆరోజున మా నాన్నగారు, శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి శతజయంత్యుత్సవం జరిగింది.
   తొంభైయ్యారు సంవత్సరాలు నిండుగా బ్రతికిన మా నాన్నగారు పండుటాకు రాలినట్టు 2010లో స్వర్గస్తులయ్యారు. బ్రతికుంటే ఈ జూన్ ఒకటికి వందసంవత్సరాలు అయివుండేవి. అందుకే మా అన్నయ్యలు వెంకట రామ సోమయాజులు, దుర్గా వెంకటేశ్వర్లు కలిసి ఈ జూన్ ఒకటిన మా నాన్నగారి శతజయంత్యుత్సవాన్ని రాజమండ్రిలో బ్రహ్మాండంగా జరిపించారు.
  మా అక్కచెల్లెళ్ళం ముగ్గురం కలిసి వెళ్ళాం రాజమండ్రి. అంతే.. ఇంక స్టేషన్‍లో  దిగిన దగ్గర్నుంచీ మాకంతా ఆనందమే ఆనందం.
    ఈ ఉత్సవాన్ని ప్రకాశంనగర్ కమ్యూనిటీహాల్‍లో యేర్పాటు చేసారు. అది అక్కడ పింఛనుదారులందరూ కలిసి సమావేశాలు, సంబరాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పురాణ కాలక్షేపాలు లాంటివన్నీ జరుపుకునే చోటు. దానిని వారు కమ్యూనిటీహాల్ అనరు. పెద్దవారంతా కలిసి దానికి "ధర్మం చర.." అనే యెంచక్కటి పేరు పెట్టుకున్నారు. అక్కడందరూ ఆ హాల్‍ని ఆపేరుతోనే వ్యవహరిస్తారు. అలా "ధర్మం చర.." అన్న పేరుని ప్రాచుర్యంలోకి తేవాలనే వారి తలంపులోనే  తెలుస్తోంది వాళ్లందరూ యెంత ధర్మపరులో. ఆ "ధర్మం చర" తో మా నాన్నగారికి ముఫ్ఫైసంవత్సరాల పైనే అనుబంధం వుంది. అక్కడి పెద్దలందరూ మా నాన్నగారికి హితులు, సన్నిహితులు. వారందరూ ఈ ఉత్సవంలో ఆనందంగా పాలుపంచుకున్నారు.
మరింక బంధువులు, ఊరిలోని పెద్దమనుషులూ కూడా వచ్చి మా నాన్నగారిని గుర్తు చేసుకున్నారు.
           ఉదయం పదిగంటలకి మా అమ్మగారు శ్రీమతి పద్మావతి, మా నాన్నగారు శ్రీ సుబ్బయ్యశాస్త్రిగార్ల ఫొటోలకు పూలమాలలు వేసి, అక్కడ మా పెద్దక్క మహాలక్ష్మి జ్యోతి ప్రజ్వలనం చేయడంతో సభ ప్రారంభమైంది.



   నలుగురు వేదపండితులు వేదం పఠించారు. అలా ఆ ఉదయంపూట వేదపఠనం వింటుంటే ఆ దేవతలే దీవిస్తున్నారా  అనిపించింది.



   తర్వాత మా చెల్లెలు భారతి సరస్వతీదేవిని స్తుతిస్తూ ప్రార్ధనాగీతం పాడింది. "శ్రీ పద్మాంచిత పాణీ.." అన్న ఈ ప్రార్ధన మా నాన్నగారికి చాలా ఇష్టమైనది. అస్తమానం మా చెల్లెలి చేత పాడించుకునేవారు. ఆ సంగతి గుర్తొచ్చి, ఒక్కసారి నాన్నగారే అక్కడికొచ్చి వింటున్నారా అన్న అనుభూతి కలిగింది.



ప్రార్ధన అయ్యాక "కౌండిన్య.." అన్న పుస్తకాన్నిపెద్దలు శ్రీ దాట్ల బలరామరాజుగారు ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో మా నాన్నగారు విశేషకృషిచేసి వ్రాసిన పిడపర్తివారి వంశచరిత్ర, వారి కథలూ-గాథలూ మాత్రమే కాకుండా అచ్చ తెలుగులో సంక్షిప్తంగా వ్రాసి మా అమ్మగారి ఆత్మశాంతికి అంకితమిచ్చిన రామకథ కూడా వుంది. అంతే కాకుండా అందులో మా నాన్నగారు చేసిన సమస్యాపూరణలూ, వ్రాసిన చాటువులూకూడా వున్నాయి. అవే కాకుండా వారి జీవితకాలంలో జరిగిన సంఘటనలు మరపురాని కథలుగా కూడా అందులో వున్నాయి. ఇవన్నీ కలిపి  మా అన్నయ్యలిద్దరూ పుస్తకాన్ని కొత్తగా, అందంగా తీసుకొచ్చారు. ఇదిగో.. ఇదే ఆ పుస్తకం.





       ఆ పుస్తకం చేతిలో పట్టుకుని పుటలు తిప్పుతుంటే మా నాన్నగారే మళ్ళీ మాముందుకొచ్చి మాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది.
       ఆ తర్వాత అక్కడి పెద్దలందరూ నాన్నగారి గురించి మాట్లాడారు. మమ్మల్నీ మాట్లాడమన్నారు. కానీ.. అదేమిటో.. నాన్నగారు పంచిన ప్రేమ, అనురాగం మాత్రమే గుర్తొచ్చాయి తప్పితే  ఆయన పాండిత్యం, గొప్పదనం గుర్తు రాలేదు. యేనాడూ కూడా మా నాన్నగారు మమ్మల్ని ఒక్క పరుషవాక్యం కూడా అనలేదు. "అమ్మా, తల్లీ.." అని పిలిచేరు తప్పితే మరో పిలుపు లేదు. నాకేమిటో ఆ పిలుపే గుర్తొచ్చింది. మళ్ళి మళ్ళీ ఆ పిలుపునే గుర్తు చేసుకుంటూ కూర్చున్నాను.
 ధూళిపాళ మహదేవమణిగారిలాంటి పెద్దలు మా నాన్నగారితో వారికి గల అనుబంధాన్ని బట్టి ఆయన యెంతటి ఉన్నత వ్యక్తిత్వం కలవారో తెలిపారు. అవన్నీ వింటుంటే మళ్ళీ మా నాన్నగారిని చూస్తున్న అనుభూతి కలిగింది.
 పెద్దల ప్రసంగాలయ్యాక అందరికీ భోజనాలు యేర్పాటు చేసారు. రాజమండ్రిలో విందుభోజనమంటే యింక వేరే చెప్పేది యేముంది.. అన్నీ ప్రత్యేకమైన వంటలే.. అందరూ ఇష్టంగా తినేవే. పదార్ధాలన్ని చాలా బాగున్నాయి.
  ఆతర్వాత మధ్యాహ్నం కాస్త విశ్రాంతి.
     కాని మేవేమీ విశ్రాంతి తీసుకోలేదు. మా కజిన్స్ అందరం చాలా సంవత్సరాల తర్వాత ఇంత తీరుబడిగా ఒకచోట కలిసాం కదా.. అందుకని మా చిన్నప్పటి ముచ్చట్లన్నీ చెప్పుకున్నాం. అలా నాన్నగారి దగ్గర గడిపిన బాల్యం గుర్తు చేసుకుంటుంటే యెంత హాయిగా అనిపించిందో.
తర్వాత సాయంత్రం ఆరుగంటలకు హరికథా కాలక్షేపం యేర్పాటు చేసారు. మనిషికి అహంకారం పనికిరాదనే నీతిని చెపుతూ అలా అహంకరించిన భీముణ్ణీ, అర్జునుణ్ణీ శ్రీకృష్ణుడు యెలా దారికి తీసుకొచ్చాడనే అంశంపై సాగిన హరికథ. యెన్నేళ్ళయిందో అలా ప్రత్యక్ష్యంగా హరికథ విని. చాలా బాగుంది. హరికథలో పిట్టకథలు మరీ బాగుంటాయి కదా..
   
  


        ఆవిధంగా మా నాన్నగారి శతజయంత్యుత్సవం చాలా బాగా జరిగింది. ఈ విధంగా మానాన్నగారి ముచ్చట్లు   మీ అందరితో కూడా పంచుకుంటున్నందుకు యింకా సంతోషంగా వుంది. 
------------------------------------------------------------------------------------
మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి శతజయంతి సందర్భమున ఆయన రచనలతో సమకూర్చిన ప్రచురణ.

ఈ పుస్తకం ప్రింటు పుస్తకంగానూ, ebook గానూ ఈ క్రింది link లో లభిస్తుంది.


http://kinige.com/kbook.php?id=3082
రచనాభినందనలతో, జి.ఎస్.లక్ష్మి..
 
  

Tuesday, December 27, 2011

మంచినీరు...

మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన "పిడపర్తివారు-కథలూ-గాథలూ" పుస్తకం లోని మరో కథ.
పిడపర్తివారి వాక్శుధ్ధికి తార్కాణంగా నిలిచే కథ ఇది...

మంచినీరు...


నూట యాభై సంవత్సరాల క్రితం మాట.

తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం పట్టణానికి చేరువలో నున్న సోమేశ్వరం గ్రామంలో వంశ పరంపరాగత జ్యోతిర్విద్యా సంపన్నులు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు నివసిస్తూండేవారు. వారి ప్రతిభ దేశ దేశాల వ్యాపించి అనేక కథల రూపంలో యింకనూ అక్కడక్కడ నిలిచిపోయింది. వారి ప్రతిభ కొక మచ్చు తునక ఈ క్రింది గాథ.

కానూరు గ్రామానికి సమీపంలో కానూరు అగ్రహారం అనే బ్రాహ్మణ అగ్రహార మొకటి యిప్పటికీ ఉన్నది. అందు సంపన్న బ్రాహ్మణ గృహాలు ఆ రోజుల్లో నూరూ నూటయాభైదాకా ఉండేవి. ఆ అగ్రహారం గోదావరి గట్టుకు చేరి ఉన్నప్పటికీవారు ఎక్కడ నూయి తవ్వినా ఉప్పునీరే పడేది కాని మంచినీరు పడేది కాదు.

ఒకానొక సమయంలో బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు ఏదో పనిమీద సమీప గ్రామానికి వచ్చి ఆ ఊరు మీదుగా తిరిగి వెడుతున్నారు. ఆ సమయంలో ఊరు పెద్దలందరకూ ఒక ఊహ కలిగింది. పదిమంది పెద్దలూ కలిసి వెంటనే శాస్త్రిగారిని కలుసుకోవాలని వెంబడించేరు.

ఆయన ఊరు చివరకు చేరుకునేసరికి ఆయన్ను కలుసుకుని "నమస్కారమండీ " అని పలుకరించేరు.

వెంటనే శాస్త్రిగారు నిలబడిపోయి " ఏమిటి? అగ్రహారంలోని పెద్దలంతా యిలా దయచేసేరు?" అని అడిగేరు. వారిలోని పెద్దవారొకాయన యీ విధంగా శాస్త్రిగారికి మనవి చేసేరు.

"శాస్త్రిగారూ! ఈ ఊరిలో మేము ఎక్కడ నూయి తవ్వినప్పటికీ ఉప్పునీరే కాని మంచినీరు పడటం లేదు. గోదావరికి సమీపంలో నున్నప్పటికీ మంచినీరు పడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రతిరోజూ యీ గ్రామంలోని స్త్రీలు గోదావరినదికి పోయి మంచినీరు తెచ్చుకోవడానికి చాలా శ్రమ పడుతున్నారు. అందులోనూ వేసవికాలంలో యిసుక తిప్పలలో నడచి నదిలో నీరు తెచ్చుకోవలసి వస్తోంది. యి పరిస్థితుల వలన మేము మంచినీటికై చాలా కష్టపడుతున్నాము. మాకు మీరే భగవత్తుల్యులు. మేము ఎక్కడ నూయి తవ్వుకుంటే మంచినీరు పడుతుందో సెలవిస్తే అక్కడ తవ్వుకుంటాం. దయచేసి మా కోరిక మన్నించండి. " అన్నారు.

శాస్త్రిగారు ఒక ముహూర్తకాలం ఆలోచించారు.
తాను నిల్చున్న స్థలాన్ని తన కుడిచేతి తర్జనితో చూపి " ఇక్కడ త్రవ్వండి. భగవత్కృప కలుగుతుంది." అని చెప్పి పెద్దలవద్ద సెలవు తీసుకుని వారి మార్గాన వారు వెళ్ళేరు.
అక్కడ గుర్తు పెట్టుకుని నూయి తవ్వించేరు ఆ ఊరివారు. పరిశుభ్రమైన నీరు పడింది. ఆ ఊరి ప్రజల కష్టం తొలగిపోయింది.
ఇప్పటికి కూడా ఆ నూయి ఒక్కటే మంచినీటి నూయి ఆ అగ్రహారానికి.


---------------------------------------------------------------------------------------------

Sunday, December 4, 2011

దైవనిర్ణయం...



దైవనిర్ణయం...

మా నాన్నగారు వ్రాసిన "దైవనిర్ణయం" అనే ఈ కథ ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురించబడింది.
ఆంధ్రపత్రిక ఉగాది సంచికలోనూ పునర్ముద్రించబడింది.
దీనిని మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వారు ప్రచురించిన
"పిడపర్తివారు-కథలూ-గాథలూ" అనే పుస్తకంలో పొందుపరిచారు.


"లుప్తమాసమున్ వమ్మున్ జేయ పోరాడి
విశ్వపతి పాడాయెన్...."
(తిరుపతి వెంకటేశ్వరులు)

నూరేళ్ళక్రితం మాట!

గోదావరిజిల్లాలోని రామచంద్రపురం తాలూకాకు చెందినది కోటగ్రామం. ఆ గ్రామంలో ఇంద్రకంటి విశ్వపతి శాస్త్రిగారు సకలవిద్యా సంపన్నులూ, సదాశిష్య పరివృతులూను. ఒకనాటి సాయంకాలం గోధూళివేళ శాస్త్రిగారూ, శిష్యులూ సంధ్యావందనాలు నిర్వర్తించుకుంటున్నారు.

"విశ్వపతిశాస్త్రిగారూ!" అని జలదగంభీరస్వరంతో ఒక పిలుపు వినవచ్చింది.
శాస్త్రిగారి నయనాలనుండి ఆఙ్ఞ తీసుకున్న శిష్యుడు బ్రహ్మతేజో సంపన్నుడైన ఆ బ్రాహ్మణోత్తముని లోనికి ప్రవేశపెట్టేడు.
ఆయనను చూచిన తక్షణం శాస్త్రిగారు సంతోషముతో "ఓహో! సీతారామశాస్త్రిగారా! ఎంతటి అదృష్టవంతులం. మీ దర్శనం దొరికిన యీ రోజు చాలా సుదినం. దయచేయండి. ఎక్కడనుండి రాక?" అన్నారు.
"బూరాడపేట అగ్రహారం నుంచేనండి". అని సీతారామశాస్త్రిగారు సమాధానమిచ్చేరు.
శాస్త్రిగారి సతీమణీ తెచ్చిన దోసకాయచెంబులోని ఉదకంతో పాదప్రక్షాళన కావించి దంపతుల కుశలప్రశ్నాదికములకు సమాధానముల నిచ్చిఅరుగుపై నున్న చాపమీద కూర్చున్నారు పిడపర్తి సీతారామశాస్త్రిగారు.

జ్యోతిష సిధ్ధాంత భాగంలో అసమాన ప్రఙ్ఞావంతులూ, వంశ పరంపరాగత జ్యోతిర్విద్యా సంపన్నులూను వారు. సిధ్ధాంతభాగంలో వరాహమిహిర, భాస్కరాచార్య, గణేశ దైవఙ్ఞులకేమాత్రమూ తీసిపోరని దేశంలో పేరుగాంచిన అనుపమ విద్యావంతులూ, అఖండ కీర్తి సముపార్జితులూ అయిన పిడపర్తి చలమయ్యశాస్త్రిగారికి అన్నగారు.

ఆ రాత్రి భోజనానంతరం విశ్వపతిశాస్త్రిగారూ, సీతారామశాస్త్రిగారూ కూర్చుని మాట్లాడుకున్న విషయాల్లో మన కథకు సంబంధించినవి యీ క్రింది రెండు విషయాలు.

మొదటిది: సీతారామశాస్త్రిగారు వచ్చే సంవత్సరం పంచాంగం పూర్తిచేసి కొన్ని ధర్మశాస్త్ర విషయాలను చర్చించి నిర్ణయం చేయడానికని సోదరుడు చలమయ్యశాస్త్రిని కలుసుకోవడానికి దువ్వగ్రామం వెడుతున్నారన్నది.
రెండవది: రామచంద్రపురం రాజావారు వచ్చే సంవత్సరం పంచాంగం వ్రాసి యిమ్మని విశ్వపతిశాస్త్రిగారిని కోరేరనీ, అందుకు ఆయన తన కుమారుడైన రామశాస్త్రినీ, శిష్యుడైన వెంకటశాస్త్రినీ నియమించేరన్నది.

ఈ సంభాషణంతా వింటున్న రామశాస్త్రికీ, వెంకటశాస్త్రికీ ఒకే విధమైన ఆలోచన తట్టింది. ఇద్దరూ ఆలోచించుకున్నారు. రెండు మూడు మాసాలు కష్టపడనవసరం లేకుండా వారికి అప్పచెప్పిన కార్యం చేయడానికి ఒక ఉపాయం వారికి తోచింది. చిన్న వయసు వారవడం చేత గ్రంథచౌర్యంలోని దోషాతిశయాన్ని వారు గుర్తించలేకపోయారు.

మరునాడు ఉదయం విశ్వపతిశాస్త్రిగారూ, సీతారామశాస్త్రిగారూ గోదావరి స్నానానికి కోటిపల్లి రేవుకు వెళ్ళి వచ్చి దేవతార్చనలు ముగించి భోజనం పూర్తిచేసేటప్పటికి సీతారామశాస్త్రిగారి అంగవస్త్రంలో చుట్టబడి ఉన్న పంచాంగానికి పూర్తి నకలు తయారుచేసేరు రహస్యంగా యితర శిష్యుల సహాయంతో రామశాస్త్రీ, వెంకటశాస్త్రీను. భోజనానంతరం కొంచెంసేపు విశ్రమించి సీతారామశాస్త్రిగారు అందరివద్దా సెలవు తీసుకుని కోటగ్రామం నుండి బయల్దేరి వెళ్ళేరు.


-2-

భద్రాచల రాముని దర్శనం చేసుకుని రెండు మాసాలలో తిరిగి వచ్చిన విశ్వపతి శాస్త్రిగారు తనకుమారుడు, శిష్యుడు తయారుచేసిన పంచాంగం చూచి వారి ప్రఙ్ఞకు చాలా సంతోషించేరు. ఏదో తిథుల వరకు పూర్తిచేసి ఉంటారేమోనని అనుకున్న శాస్త్రిగారికి గ్రహస్ఫుటాలు, సుముహూర్తాలూ వగైరా యావత్తు గ్రంథం సిధ్ధంకావడం చూసేసరికి ఆనందం పట్టలేక కుమారుణ్ణి, శిష్యుణ్ణి చాలా అభినందించేరు.

వెంటనే ఒక శుభ ముహూర్తాన ఆ పంచాంగం తీసుకునిపోయి రామచంద్రపురంలొ రాజావారికి సమర్పించేరు శాస్త్రిగారు నిండు దర్బారులో. రాజావారు చాలా సంతోషించి శాస్త్రిగారిని ఉచితరీతిని సత్కరించేరు.

ఆ సత్కారాల నమ్దుకుని తన్మయులై యున్న శాస్త్రిగారితో దివానుగారు-
"శాస్త్రిగారూ! వచ్చే సంవత్సరం విశేషాలేమైనా రాజావారికి విన్నవించండి" అన్నారు.
" ఆ ఏమున్నాయండి మామూలే" అంటూ విశ్వపతిశాస్త్రిగారు వర్షయోగాలూ, ధరవరలూ, పంతల పరిమితి వగైరా వివరిస్తూ ఒక్క అర్ధగంటసేపు ప్రస్తావించేరు.

అప్పటికే రాజావారి ఆస్థానానికి పిడపర్తి చలమయ్యశాస్త్రిగారు చేసిన పంచాంగం ప్రతి చేరింది. ఆస్థానజ్యోతిష్కులు ఆ పంచాంగాన్ని చూసి అందలి విశేషాలను యిదివరకే రాజావారికి సమగ్రంగా తెలియపరచియున్నారు.

అందువల్ల విశ్వపతిశాఅస్త్రిగారు చెప్పినదంతా విన్న రాజావారికి అందులో లుప్తమాసం ప్రస్తావన రాకపోవడం చాలా వింతగా తోచింది. వెంటనే శాస్త్రిగారి నుద్దేశించి యిల్లా అన్నారు.

"ఏమండీ శాస్త్రిగరూ! వచ్చే సంవత్సరం లుప్తమాసం ఉన్నదట కాదా?"

"ప్రభువులు కరుణించాలి. తమ కెవరో తప్పుగా విన్నవించేరు." అన్నారు శాస్త్రిగారు.

"కాదండీ. వచ్చే సంవత్సరం లుప్తమాసమున్నదట. శాస్త్రప్రకారం చూసినట్లైతే వచ్చే సంవత్సరం లుప్తమాసం లేదు." అన్నారు శాస్త్రిగారు.

"అదేమండి అల్లా అంటారు? పిడపర్తి చలమయ్యశాస్త్రిగారే లుప్తమాసమున్నదని వ్రాసేరు. మీరు కాదంటే పోతుందా?" అన్నారు ఆస్థాన జ్యోతిష్కులలో ఒకరు.

శాస్త్రిగారికి గుండెల్లో రాయి పడింది. అయినా ధైర్యంగా యిల్లా అన్నారు.

"చాల్లెండి. మహా తెలిసున్నట్లు చెపుతారేమిటి? మీకేమి తెలుసు సిధ్ధాంతభాగం? సూర్య సిధ్ధాంతం ప్రకారం పంచాంగం చెస్తే లుప్తమాసం రానేరాదు. చలమయ్య శాస్త్రి తప్పుడు త్రోవ తొక్కేడు. అందువల్ల లుప్తమాసం వచ్చిందేమో."

"చలమయ్య శాస్త్రిగారు త్రొక్కిన తప్పుడు త్రోవ ఏమిటండీ?" అన్నారు రాజావారు ఆశ్చర్యంగా.

"చిత్తం మనవి చేస్తా. సూర్యుని చేత మయుని కుపదేశింపబడినదే సూర్యసిధ్ధాంతం. ఇది మూడువేల సంవత్సరాల పూర్వమే వాడుకలో వుండేదని ప్రతీతి. అటువంటి అతి పవిత్రమైన గ్రంథాన్నిబట్టే మన పంచాంగం చేసుకుంటున్నాం. మనది కర్మభూమి. మనకు కర్మ ప్రధానం. అందువలన సూర్యోపదిష్టమైన గ్రంథరీత్యా తయారయిన పంచాంగమునే మనం అనుసరించాలి. చలమయ్య శాస్త్రి సంస్కర్త. ఈ సూర్య సిధ్ధాంతంలోని పథకాలను తన కిష్టము వచ్చినట్లు సంస్కరించి పంచాంగం చేస్తాడు. అది శాస్త్రసమ్మతమెల్లా అవుతుంది? ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు సూర్యసిధ్ధాంత పథకాలను సంస్కరించేయడమే? దానికి తాహతు ఉండనక్కరలేదా? పూర్వం కొంతమంది సంస్కరించేరంటే వారి ప్రతిభ ముందు మన ప్రఙ్ఞ ఏమాత్రం? అందువలన చలమయ్య శాస్త్రి వ్రాసినది శాస్త్ర సమ్మతం కాదని మనవి చేస్తున్నాను. " అన్నారు శాస్త్రిగారు గంభీరంగా.

"శాస్త్ర సమ్మతం కాని సంస్కారం చలమయ్యశాస్త్రిగారు మాత్రం ఎందుకు చేస్తారండి? అయినా ఈ విషయాల్లో అభిప్రాయం వెలిబుచ్చడానికి మేమూ మా బొంట్లూ అర్హులం కాము." అన్నారు రాజావారు చిరునవ్వుతో.

ఆ నవ్వు చూసి ధైర్యం కలిగి "ప్రభువులవారు క్షమించాలి. ఎప్పటికప్పుడు గ్రహాలను దృక్సిధ్ధం చేయడానికి సంస్కారం చేయవచ్చుననీ, అది శాస్త్ర సమ్మతమేననీ పూర్వ గ్రంథాలనుండి ప్రమాణాలను ఇతోధికంగా చూపిస్తూ చలమయ్య శాస్త్రిగారు ఒకసారి రాజమహేంద్రవరంలో ఉపన్యసించేరు. ఏమి పాండిత్యము? ఏమి వాగ్ధాటి? వారు సాక్షాత్తు సూర్యాంశ సంభూతులు. ఆ సభకు కాకతాళీయంగా నేనూ వెళ్ళడం జరిగింది. అది నా అదృష్టం. సంస్కరించడమే శాస్త్ర సమ్మతం కాదనడం భావ్యం కాదని నా మనవి. " అని ఆస్థాన జ్యోతిష్కులలో ఒకరు కొంచెం ధైర్యంగా అన్నారు.

రాజావారు చిరునవ్వుతో విని విశ్వపతి శాస్త్రిగారివైపు దృష్టిని మరల్చేరు. విశ్వపతి శాస్త్రిగారికి సమాధానం చెప్పడం తప్పింది కాదు.

"ప్రభువువారికి నేను విన్నవించేది ఒక్కటే విషయం. మనది కర్మభూమి. మనం సూర్య సిధ్ధాంతాన్ని అనుసరించి కర్మ చేస్తేనే దాని ఫలితాన్ని పొందగలం. అంతేగాని ఎవరికి తోచినట్లు వారు పంచాంగాలు చేస్తే వాటి ననుసరించినవారు కర్మభ్రష్టులు కావడం తధ్యం. గ్రహాలలో ఏ సంస్కారాలు చేసినా సూర్యచంద్రుల్లో చేసిన సంస్కారం మాత్రం పూర్తిగా తిథులను మార్చేస్తుంది. చలమయ్య శాస్త్రి చంద్రునికి కూడ సంస్కార మవలంబిస్తాడు. అది బొత్తిగా శాస్త్ర విరుధ్ధమని మనవి చేస్తున్నాను." అని సమాధానం చెప్పెరు శాస్త్రిగారు.

"ఏమో! ఈ ధర్మ శాస్త్ర విషయాలు మాకు అర్ధంకావు. అయినా చలమయ్య శాస్త్రిగారిలాంటి పండితులు మన దేశంలో చాలా అరుదు. అటువంటి వారు అవలంబించిన తీరు శాస్త్ర సమ్మతం కాదనడం కొంచెం సాహసమేమోనని నా ఊహ." అన్నారు రాజావారు.

"ప్రభువులు తమ ఆస్థాన పండితులనూ, వారి విద్వత్తునూ కించపరుస్తున్నారు. ఏ విషయంలోనైనా సరే చలమయ్య శాస్త్రితో సమాన పాండిత్యం కలవారమని ఋజువు చేసుకోగలం." అన్నారు విశ్వపతి శాస్త్రిగారు.

"ఏ విషయంలొనో యెందుకు? ప్రస్తుతం యీ విషయంలోనే ఇదమిత్థమని తేలకపోతే వచ్చే సంవత్సరం ఏ పంచాంగం అవలంబించడానికీ సందేహంలో పడిపోతాం."

"చిత్తం. ప్రభువువారు యీ విషయం పూర్తిగా విమర్శించి తగిన ఏర్పాటు చేయించి ఒక నిర్ణయానికి వస్తే ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అవసరమైతే చలమయ్య శాస్త్రిగారిని ఇక్కడకు పిలిపిద్దాం." అన్నారు దివానుగారు యింతవరకు మౌనంగా ఉండి.

" ఆ ఏర్పాటు చాలా బాగుంది. ఏమండీ విశ్వపతి శాస్త్రిగారూ! చలమయ్య శాస్త్రిగారిని యిక్కడకు పిలిపించి సభ ఏర్పాటు చేస్తాం. మీకు సమ్మతమేనా?" అన్నారు రాజావారు.

"చిత్తం. ప్రభువుల ఆఙ్ఞను శిరసావహిస్తాను."
అంతటితో ఆ రోజుకు ప్రస్తావన ముగిసింది.


-3-

తణుకు దగ్గర ఉన్న దువ్వగ్రామంలో ఉంటున్న చలమయ్య శాస్త్రిగారు రామచంద్రపురం రాజావారు రమ్మన్నారని తెలియగానే శిష్య సమేతంగా బయల్దెరి రామచంద్రపురం చేరుకున్నారు. జరగబోయే సభను చూడడానికి అనేకమంది రామచంద్రపురంలో చేరేరు. నిర్ణీత సమయానికి సభ యేర్పాటయింది. పిడపర్తి చలమయ్య శాస్త్రిగారు వచ్చె సంవత్సరం లుప్తమాసం ఉన్నదన్న వాదాన్ని సమర్ధిస్తే విశ్వపతి శాస్త్రిగారు దాన్ని ఖండిస్తున్నారు. ఇరువురూ మహా పండితులు. ఆ రోజులలో పాండిత్యం ఏ ఒక్క విషయానికే చెంది ఉండేదికాదు. సర్వతోముఖ పాండిత్యం వారిది. అందువలన చలమయ్య శాస్త్రిగారితో సమానమైన పాండిత్యాన్ని సిధ్ధాంత భాగంలో చూపిస్తున్నారు విశ్వపతిశాస్త్రిగారు.

ఈ విధంగా మూడురోజులు కేసరీద్వయం హోరాహోరిని వాద ప్రతివాదాలతో పోరు సాగించేరు. ఇందులో చలమయ్య శాస్త్రిగారు ఆయన స్వయంగా చేసిన పంచాంగాన్ని సమర్ధించుకుంటున్నారు. విశ్వపతిశాస్త్రిగారు తాము తయారుచేయని పంచాంగాన్ని సమర్ధించుకోవలసివచ్చింది. రాజావారి దర్బారులో మానుషానికన్న మాటలే కాని, చలమయ్య శాస్త్రిగారి ప్రతిభా పాండిత్యమూ విశ్వపతిశాస్త్రిగారికి తెలియకపోలేదు. అందువలన ఆయన వాదంలో ఏదో వెలితి కన్పడుతోంది. అది చలమయ్య శాస్త్రిగారు కనిపెట్టేరు. కాని ఇతరులెవ్వరూ తెలుసుకోలేకపోయేరు. వీరిద్దరూ వాదించుకుంటూ ఉంటే విని తీర్పునిచ్చే సామర్ధ్యం కలవారెవ్వరూ అక్కడ లేకపోయేరు. అందువల్ల ఎవరో ఒకరు రెండవవారి వాదాన్ని ఒప్పుకోవాలి. అంతవరకూ వివాదం సాగవలసిందే.

విశ్వపతి శాస్త్రిగారు తన మాట బీరుపోకుండా ఉండడానికి మాత్రమే వాదిస్తున్నారు. కాని వారి వాదంలో పటుత్వం యెప్పుడో తగ్గిపోయినట్లు చలమయ్య శాస్త్రిగారు గ్రహించేరు. అందువల్ల విశ్వపతిశాస్త్రి తన ఓటమిని తనంత తాను అంగీకరించరనీ అంతవరకూ సభ్యులు తన వాదం శాస్త్ర సమ్మతమైనదని నిర్ధారణ చేయరనీ తెలుసుకున్నారు.

మూడవనాడు సాయంకాలం సభ ముగిసే సమయానికి చలమయ్య శాస్త్రిగారు సభ్యుల నుద్దేశించి యీ విధంగా ఉపన్యసించారు.

"పండితోత్తములారా! ఈ మూడురోజులనుండీ మా ఇరువురి వాదప్రతివాదాలూ మీరు వింటూనే వున్నారు. ఇందులొ ఏది శాస్త్ర సమ్మతమో నిర్ధారణ చేసే సామర్ధ్యము గలవారు లేని కారణంచేత ఈ విషయం యిల్లా ముగియవలసి వస్తోంది. ఒక నిర్ణయం జరగలేదు. కాని ఒక మనవి. మా వాదములలోని సత్యాన్ని నిరూపించే సమర్ధులు యీ సభలో లేకపోవచ్చును. మానవులలోనే లేకపోవచ్చును. కాని భగవంతుడు లేడా? ఆయనకా సామర్ధ్యము లేదా? ఆయన సర్వాంతర్యామి కదా? ఆయన నిర్ణయించడానికి శక్తి కలవాడే కదా? యిందుకు సభ్యులూ, రాజావారూ అంగీకరిస్తే దైవం చేత దీనికి తీర్పు చెప్పిస్తాను. అంతకన్న వేరు మార్గం లేదు. మీరు అనుమతి నివ్వాలి."

దానితో సభలో కలకలం బయల్దేరింది. అందరూ ఆశ్చర్యపోయేరు. "దైవమే నిర్ణయం చేస్తాడన్నది ఒట్టిమాట" అని కొందరన్నారు.

"ఏమో..వారి శక్తి మీకేం తెలుసు? భగవంతుడిని యిక్కడకు రప్పించి పలికించగలరు వారు." అన్నారు కొందరు.

ఈ విధంగా సభలో సంచలనం కలిగింది. దివానుగారు రాజావారితో సంప్రదించి లేచేరు.

"చలమయ్య శాస్త్రిగారూ! మీరు దైవం చేత నిర్ణయం చేయిస్తానన్నారు. దైవనిర్ణయం తప్పక ఆచరణీయమే. దానిని ఎవరూ కాదనరు. అందుకు మీరు సమర్ధులనడానికి కూడా మాకు ఏ విధమైన సందేహమూ లేదు. కాబట్టి మీరు యీ మహాసభ సమక్షమందే దైవనిర్ణయం చేయించండి." అన్నారు.

"రాజావారికి నాదొక మనవి. విశ్వపతి శాస్త్రి కూడా దీనికంగీకరించాలి కదా!" అన్నారు చలమయ్య శాస్త్రిగారు.

విశ్వపతిశాస్త్రిగారు వెంటనే తమ అంగీకారాన్ని తెలియపరిచేరు.
"అల్లాగైతే త్వరలొ ఒక శుభముహూర్తం యేర్పాటు చేయండి. ఆరోజున మనమంతా యిక్కడే మళ్ళీ కలుసుకుందాం." అన్నారు చలమయ్య శాస్త్రిగారు.

ఆనాటి సభ ముగిసింది.

-4-

త్వరలో ఒక శుభముహూర్తం యేర్పాటు చేసేరు. దూరదూరాల నుండి కూడా పండితులూ, పామరులూ వేలకొలదిగా జనం రామచంద్రపురం చేరుకున్నారు. నిర్ణీత సమయానికి చలమయ్య శాస్త్రిగారూ, విశ్వపతి శాస్త్రిగారూ కూడా సభా వేదిక పైకి వచ్చేరు. చలమయ్య శాస్త్రిగారు సభ్యులకు నమస్కరించి యిల్లా అన్నారు.

"పండితోత్తములారా! శాస్త్ర విషయమై నాకు విశ్వపతి శాస్త్రికీ జరిగిన వివాదంలో తీర్పు దైవం చేత చెప్పించడానికీ, ఆ దైవ నిర్ణయమే మనమంతా ఆచరించడానికీ మనమంగీకరించేము. భగవంతుడు ప్రత్యక్షమై మనుష్యరూపంలో నిర్ణయం తెలియపరుస్తాడనుకోవడం మూర్ఖత్వం. అందువలన నేనొక మార్గం చెబుతాను. అది అందరికీ సమ్మతమైతే అంగీకరించండి. లేనిపక్షంలో మరొక మార్గం సూచించండి. నేను సమ్మతిస్తాను.

రెండు తాటాకులు తీసుకుందాం. నా వాదం నేనొక తాటాకు మీద వ్రాస్తాను. విశ్వపతి శాస్త్రి తన వివాదాన్ని యింకొక తాటాకు మీద వ్రాస్తాడు. రెండూ ఒకే సమయంలో కాలవలో వదులుదాం. ఏది ప్రవాహానికి యెదురు వెడితే అది భగవంతునిచే అంగీకరింపబడిన వాదమని నిర్ధారణ చేయవచ్చును. ఇందుకు అందరూ సమ్మతించాలి. " అన్నారు.

దివానుగారు రాజావారివైపు చూచి ఆయన అంగీకారాన్ని గ్రహించి విశ్వపతి శాస్త్రిగారి నడిగేరు, వారికి సమ్మతమేనా అని. ఆయన కూడా సమ్మతించేరు.

సరే ఆ ప్రకారంగానే రెండు తాటాకుల మీదా రెండు వాదాలనూ వ్రాసేరు. రెండూ ఒకేసారి కాలవలో వదిలేరు. వేనకు వేలు ప్రజలు సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు. రాజావారు, దివానుగారు, తదితర రాజోద్యోగులూ కూడా దగ్గరే ఉన్నారు. చలమయ్య శాస్త్రిగారి వాదం వ్రాసి ఉన్న తాటాకు ప్రవాహానికి యెదురుగా చరచరా ప్రాకిపోయింది. అందరూ దిగ్భ్రాంతులయ్యేరు. ప్రజలు హర్షధ్వానాలు చేసేరు. గుఱ్ఱం మీద కూర్చున్న రాజావారు తటాలున క్రిందకు దిగి చలమయ్య శాస్త్రిగారి పాదాలకు నమస్కరించేరు.


-5-

మరునాడు నిండు దర్బారులో చలమయ్య శాస్త్రిగారిని రాజావారు బహుళంగా సత్కరించేరు. అందరూ దైవనిర్ణయాన్ని గురించి ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. ఏ నోట విన్నా చలమయ్య శాస్త్రిగారి ప్రతిభే వినపడుతోంది. దర్బారులో రాజావారు యిల్లా అన్నారు.

"చలమయ్య శాస్త్రిగారూ! మీ ప్రతిభ అమోఘం. సాక్షాత్తూ భగవత్స్వరూపులు మీరు. భగవంతుని చేతనే సాక్ష్యం పలికించేరు. ఇది మరొకరికి సాధ్యమా?"

విశ్వపతి శాస్త్రిగారు కూడా సభలో ఉన్నారు. ఆయన చలమయ్య శాస్త్రిగారి పాండిత్యమైతే మెచ్చుకున్నారు కాని ఆయన చేసిన దైవనిర్ణయం తంతు అంతా ఆయనకు సరిపడలేదు. ఏదో కనుకట్టు మాదిరి ఇది పామరులను రంజింప చేస్తుంది కాని పండితులకు అంగీకార యోగ్యం కాదు. అందువలన ఈ విషయం చాలా చులకనగా చూసేరు. అందుచేత వెంటనే యిల్లా అన్నారు.

"ప్రభువులు మన్నించాలి. చలమయ్య శాస్త్రి పండితుడే కాక మంత్రవేత్త కూడా. అందువలన గారడీ చేయడంలో అద్భుతమేముంది?"

చలమయ్య శాస్త్రిగారికి చాలా కోపం వచ్చింది.

"విశ్వపతీ! నీవు గారడీ అన్నది గారడి కాదు. తపశ్శక్తి. ఆ ధాటికి మహారాజాధిరాజులు కూడా తలలొగ్గేరు పూర్వం. ఈ కాలంలో తపశ్శక్తి ఉన్నదా అని అనుమానిస్తున్నావా? ఇదిగో నా తపశ్శక్తితో నేను శపిస్తున్నాను. ఈ రభస కంతకూ మూలకారణమైన వాళ్ళం నీవూ నేనూను. నాకు ఒక్కడే కుమారుడు. నీకు ఒక్కడే కుమారుడు. ఎవరి వాదం దైవసమ్మతం కాదో వారి కుమారుడు మూడు మాసాల్లో పరలోకగతు డవుతాడు.
వంశ నాశనమౌతుంది." అన్నారు.

రాజావారూ, సభ్యులూ తెల్లపోయేరు. విశ్వపతి శాస్త్రిగారు నిలువునా కూలిపోయేరు.

మూడుమాసాల్లో విశ్వపతి శాస్త్రిగారి కుమారుడు పరమపదించేడు.

=================================

Monday, July 25, 2011

దొరగారి ప్రశ్న.

మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన "పిడపర్తివారు-కథలూ-గాథలూ" పుస్తకం లోని మరో కథ.
మా చిన్నప్పుడు ఈ కథని మా నాన్నగారు ఎంతో నాటకీయంగా చెపుతుంటే చెవులు దోరగిలబెట్టి వినేవాళ్లం.





విజయనగర ప్రభువులు విజయరామ గజపతులు పద్మనాభం దగ్గర జరిగిన యుధ్ధంలో మరణించిన అనంతరం అప్పటికి పదహారు సంవత్సరముల వయస్సులో నున్న వారి కుమారులు నారాయణ గజపతులు అడవులలోనికి పారిపోయారనీ, కొంతకాలానికి విజయనగరానికి తిరిగివచ్చి బ్రిటిష్ వారికి అపరాధ రుసుము చెల్లించగా వారు విజయనగర సంస్థానాన్ని నారాయణ గజపతులకు అప్పగించేరనీ తెలుస్తోంది. మరల రాజ్యం లభించిన కారణంగా శ్రీ నారాయణ గజపతులు వారి ఆప్తులకూ, తనకు కష్టసమయంలో సాయపడినవారికీ యీనాములిచ్చి కృతఙ్ఞతలను తెలుపుకున్నారు.

శ్రీ నారాయణ గజపతులే పిడపర్తి సీతారామశాస్త్రిగారికి వారి ప్రఙ్ఞకు మెచ్చి కొన్ని యీనాం భూములను యిచ్చేరు. ఆ యీనాం భూములకు బదులు క్రీ.శ. 1811 వ సంవత్సరములో బూరాడపేట అనే లక్ష్మీనారాయణపురం అగ్రహారాన్ని వారికి బహూకరించేరు.

క్రీ.శ. 1822 వ సంవత్సరం నాటికి అప్పటి మహారాజావారు శ్రీ శాస్త్రిగారి వారసులపై ఆ అగ్రహారం స్వాధీనం నిమిత్తం విశాఖపట్టణం సబ్ కోర్ట్ లో దావా వేసేరు. సబార్డినేట్ జడ్జి శ్రీ ఏ.ఎల్.వి.రమణగారు ఆ దావాలో మహారాజావారికి అనుకూలంగా తీర్పు నిచ్చేరు. ఆ తీర్పుపై శ్రీ శాస్త్రిగారి వారసులూ తదితరులూ మద్రాసు హై కోర్టులో అప్పీలు దాఖలు చేసేరు. ఆ అప్పీలు విచారణ సమయంలో జరిగిందని ప్రచారములోనున్న యీ క్రింది గాధను చిత్తగించండి. ఆ అప్పీలు మద్రాసు హైకోర్టులో విచారణకు చీఫ్ జస్టిస్ టర్నరు దొరగారున్నూ, జస్టిసు ముత్తుస్వామి అయ్యరుగారున్నూన్యాయపీఠం మీద కూర్చుని ఉన్నారు. శ్రీ శాస్త్రిగారి తరఫున వారి పాండిత్యముచే వాదిస్తున్న వకీలుగారు యీ క్రింది విధంగా వారికి మనవి చేసేరు.

"ప్రభువులు చిత్తగించాలి. అప్పీలుదారులు పిడపర్తి వంశానికి చెందినవారు. వారి వంశం కొన్ని శతాబ్దాలనుండి కూడా జ్యోతిశ్శాస్త్ర పాండిత్యానికి ప్రసిధ్ధి జెంది ఉన్నది. ఆ వంశమునందు జన్మించిన శ్రీ సీతారామశాస్త్రిగారు వంశ పరంపరాగత జ్యోతిర్విద్యాసంపన్నులు. వారి పాండిత్యముచే శ్రీ నారాయణ గజపతులను మెప్పించిన కారణంగా మహారాజులు వారికి కొన్ని భూములను యీనాములుగా యిచ్చి క్రీ.శ. 1802 పెర్మినెంటు సెటిల్మెంటు అనంతరం ఆ యీనాం భూములకు బదులుగా బూరాడపేట అనే లక్ష్మీనారాయణ పురం అగ్రహారాన్ని వారికి క్రీ.శ. 1811 వ సంవత్సరంలో వంశపారంపర్యంగా అనుభవించడానికి కొంత కట్టుబడిపై దఖలు పరచియున్నారు.”

టర్నరు దొరగారు ఆశ్చర్యం ప్రకటిస్తూ యిల్లా అన్నారు.
"మీ దేశంలో ప్రభువులు గ్రామాలకు గ్రామాలే బహుమానాలుగా యిచ్చేస్తుంటారా ?"

వకీలుగారు:- చిత్తం. మా ప్రభువులు యెప్పుడూ చాలా దానగుణం కలవారే ప్రభూ!
టర్నరు:- అయినా యీ రీతిగా గ్రామాలకు గ్రామాలే యిచ్చేస్తుంటే కొంతకాలానికి ప్రభువుల రాజ్యపరిమితి కూడా తగ్గిపోతుందేమో?
వకీలు:- గ్రామాలను కొంత కట్టుబడిపై యిస్తూ అనుభవించడానికి మాత్రమే యిస్తారు. రాజ్యానికే లోటూ జరగదు. అయినా యిల్లా బహుమతి పొందే అర్హత ఉన్నవారు చాలా తక్కువగా ఉంటారుకదా!
టర్నరు:- అదీ నిజమే ననుకోండి. గ్రామాలు బహుమానంగా పొందే అర్హత అప్పీలుదారులకు ఉన్నదా?
వకీలు:- సందేహంలేదు ప్రభూ! ప్రభువులు నారాయణ గజపతులు రామచంద్రపురం వెళ్ళినప్పుడు శ్రీ సీతారామశాస్త్రిగారి పాండిత్యాన్ని చూచినవారై వారికి కొంత భూమిని యీనాంగా యిచ్చి విజయనగరం రప్పించుకున్నారు.
టర్నరు:- నేను కూడా మా దేశంలో వింటూ ఉండేవాడిని జ్యోతిశ్శాస్త్రంలో పండితులు యీ దేశంలో శతసహస్రాలుగా ఉన్నారని. కాని నాకు యింతవరకూ అల్లాంటివారిని కలుసుకునే అవకాశం కలగలేదు.
వకీలు:- చిత్తం. పిడపర్తి వారి వంశమంటేనే జ్యోతిశ్శాస్త్రం ప్రభూ! ఆ వంశంలో పుట్టిన ప్రతి వ్యక్తీ కూడా ఆ శాస్త్రంలో నిష్ణాతులే.
టర్నరు:- చాలా ఆశ్చర్యకరమైన విషయమే. వారెవరైనా యిప్పుడిక్కడ ఉన్నరా?

వెంటనే వకీలుగారు కోర్టుహాలులో నున్న శ్రీ పిడపర్తి దక్షిణామూర్తి శాస్త్రిగారిని రమ్మని పిలిచి జడ్జిగారివైపు తిరిగి యిల్లా అన్నారు.

వకీలు:- ప్రభువులు చూడదలచుకుంటే అప్పీలుదారులు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రిగారు యిక్కడే ఉన్నారు.
టర్నరు:- వారికి గౌరవ పూర్వక ప్రణతుల నందజేయండి. ఈ అప్పీలుకు సంబంధం లేకపోయినా నా ఆసక్తిని తెలియపరుస్తున్నాను. వారికి అభ్యంతరం లేకపోతే వారి పాండిత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని నాకు యివ్వగలరా?

వకీలుగారు శ్రీ శాస్త్రిగారిని సంప్రదించి వారి అంగీకారాన్ని జడ్జిగారికి తెలియపరిచేరు. టర్నరు దొరగారు జడ్జి ముత్తుస్వామి అయ్యరు గారితో పదినిమిషాలుపాటు మాట్లాడి వకీలుగారివైపు తిరిగి యిల్లా అన్నారు.

టర్నరు:- శ్రీ ముత్తుస్వామి అయ్యరుగారిని సంప్రదించినాను. జ్యోతిశ్శాస్త్రం మూడు విభాగాలుగా యీ దేశంలో ప్రసిధ్ధిజెంది ఉన్నదని తెలుసుకున్నాను. అందులో సిధ్ధాంతభాగంలోనూ జాతకభాగంలోనూ వారి పాండిత్యాన్ని తెలుసుకునే అవకాశం ప్రస్తుతం లేకపోవడం వలన ప్రశ్న భాగం లోనే వారి పాండిత్యాన్ని తెలుసుకోదలుచుకున్నాను. వారికేమైనా అభ్యంతరమున్నదా?

వకీలుగారు యీ విషయం శ్రీ శాస్త్రిగారికి తెలియపరచి వరికి అభ్యంతరం లేదన్న విషయాన్ని టర్నరు దొరగారికి తెలియజేసేరు. అంతట టర్నరు దొరగారు వకీలుగారితో యిల్లా అన్నారు.

టర్నరు:- రేపు ఉదయం నేను యీ కోర్టు హాలులోనికి ఏ మార్గం గుండా ప్రవేశిస్తానో చెప్పగలరా?

వకీలుగారు శ్రీ శాస్త్రిగారికి దొరగారు చెప్పినది తెలుగులో చెప్పేరు. శ్రీశాస్త్రిగారు ప్రశ్న సమయానికి గ్రహ స్థితులను పరిశీలించి అయిదు నిముషాల అనంతరం వకీలుగారి నడిగి కాగితం తీసుకుని ఆ కాగితంపై యేదో వ్రాసి మడతపెట్టి వకీలుగారికిస్తూ యీ కాగితం దొరగారికీయవలసిందిగానూ, మర్నాడు కోర్టుహాలులో ప్రవేశించిన అనంతరం యీ కాగితం చూసుకోవలసిందిగా మనవి చేయమని కోరేరు. వకీలుగారు ఆ కాగితం దొరగారికిచ్చి శ్రీశాస్త్రిగారు చెప్పిన రీతిగానే మనవి చేసేరు. దొరగారు సంతోషించి ఆ కాగితాన్ని వారి ఆఫీసు బాక్స్ లో పెట్టుకున్నారు. ఆ పైన ఆప్పీలులో వకీలుగారు చెప్పే విషయాలను వినడానికి ఉపక్రమించేరు.

మరునాడు కోర్టుహాలుకు వచ్చిన వకీళ్ళు, ప్రజలు ఆ హాలుకు తూర్పునున్న రెండుద్వారములకు మధ్యగా నున్న గోడ బ్రద్దలు కొట్టబడి మార్గం ఏర్పాటు చేయబడి ఉండడం గమనించేరు. కాని అది ఎందుకు అల్లా చేయబడిందో వారి ఊహకు అందలేదు. అందరూ హాలులో కూర్చున్నారు. ముత్తుస్వామి అయ్యరు వారి చాంబర్ నుండి వచ్చి న్యాయపీఠంపై ఆసీనులయ్యేరు. అందరూ టర్నరుదొరగారి రాకకోసం చాంబర్ కున్న ద్వారం వైపు చూస్తున్నారు. అంతలో టర్నరు దొరగారు తూర్పువైపు గోడకు బలవంతంగా పడగొట్టించి నూతనంగా ఏర్పరచిన మార్గం గుండా కోర్టుహాలులోనికి వచ్చి అందరూ ఆశ్చర్యంగా చూస్తూండగా న్యాయపీఠం మీద ఆసీనులయ్యారు. హాలులోనికి వచ్చిన వారందరూ కూర్చున్న మీదట దొరగారు వారి నుద్దేశించి యీ క్రింది విధంగా అన్నారు.

"నేను కోర్టుహాలులోనికి యీ క్రొత్తమార్గం గుండా ప్రవేశించడం మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది. దానికి కారణం చెబుతాను. నిన్న యీ కోర్టులో జరిగిన విషయాలు మీ అందరికీ తెలిసే ఉన్నాయి. నేనీ రోజు ఏ మార్గం గుండా యీ హాలులోనికి ప్రవేశిస్తానో తెలియపరచవలసిందిగా శ్రీ శాస్త్రిగారిని కోరేను. వారొక కాగితం మీద సమాధానం వ్రాసి యిచ్చి యీ రోజు న్యాయపీఠం మీద కూర్చున్నాక చూసుకోవలసిందిగా చెప్పేరు. నేను ఏ మార్గం ద్వారా లోపలికి వచ్చేనో మీరందరూ చూసే ఉన్నారు. శ్రీ శాస్త్రిగారు నా ప్రశ్నకేమి సమాధానం యిచ్చి ఉన్నారో చూద్దాం" అని వారి ఆఫీసుబాక్సునుండి కాగితం తిసి శ్రీ ముత్తుస్వామి అయ్యరుగారికిచ్చి చదవవలసిందిగా కోరేరు. శ్రీ అయ్యరుగారు యీ క్రిందివిధంగా చదివేరు.

"దొరగారు రేపు కోర్టుహాలులోనికి ఏ మార్గం గుండా ప్రవేశిస్తారో తెలుపవలసిందిగా సెలవిచ్చేరు. రేపు తూర్పువైపునున్న రెండు ద్వారాలకు మధ్యలో నున్న గోడలో బలప్రయోగం ద్వారా ఏర్పరచిన మార్గం గుండా కోర్టుహాలులోనికి ప్రవేశిస్తారనే విషయం ప్రశ్నకాలానికున్న గ్రహస్థితుల వలన విశదమౌతోందని నా మనవి."

ఇది విన్న కోర్టుహాలులోని జనమంతా నిర్ఘాంతపోయేరు. దీని తర్జుమా దొరగారికి శ్రీ అయ్యరుగారు వినిపించగానే దొరగారు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచేరు.

శ్రీ శాస్త్రిగారి జ్యోతిశ్శాస్త్ర పాండిత్యానికి అక్కడునున్న జనులందరూ జోహారులర్పించేరు.



------------------------------------------------------------------------

Friday, July 15, 2011

సరస్వతిశాపం

పిడపర్తి వారి వంశ చరిత్ర, ఆ వంశస్థుల యొక్క పాండిత్య ప్రతిభ అందరికీ తెలియాలనే ఉద్దేశ్యముతో మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు "పిడపర్తి వారు- --కథలూ-గాథలూ" అని ఒక పుస్తకం వ్రాసారు. అందులో ప్రచురించిన "సరస్వతిశాపం" అను ఈ కథ "ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలోను, ఆంగ్లానువాదం Andhra Pradesh journal లోను ప్రచురించబడింది.
సరస్వతీదేవిని దేవతగా పూజిస్తూ, శాస్త్రాధ్యయనాన్ని ఒక తపస్సుగా భావించి, స్వార్ధ మనేదే లేకుండా, అతి సాధారణ జీవితం జీవిస్తూ, ఆ శాస్త్రాన్ని తరతరాలుగా నిలబెట్టడానికి కృషి చేసిన ఇలాంటి మహా మనీషులుండబట్టే ఈ కాస్త విఙ్ఞానమైనా ఇప్పటికి మిగిలి ఉందనిపిస్తుంది ఈ కథ చదువుతుంటే. అందుకే అభిలాషగలవారికోసం దీనిని ఇక్కడ ఉంచుతున్నాను.

సరస్వతిశాపం





కొన్ని శతాబ్దాల నుండి ప్రస్తుత కాలం వరకూ జ్యోతిశ్శాస్త్రంలోని అన్ని శాఖలలోనూ అద్వితీయ పాండిత్యానికీ, అకుంఠిత ప్రఙ్ఞకూ ప్రసిధ్ధి చెంది అనేక సభల్లో అసమాన సన్మానాలను పొంది అఖండకీర్తి నార్జించినవారు పిడపర్తి వంశీయులు యీ ఆంధ్రదేశంలో. అట్టి వంశమందలి ఒక శాఖవారు రామచంద్రపురం తాలూకాలోని సోమేశ్వరం గ్రామంలో నున్నారు. ఆ శాఖకు చెందినవారే పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు. జాతక ప్రశ్న భాగాల్లో అద్వితీయ ప్రతిభాశాలి. అట్టి మహా పండితుడు తపశ్శాలి "నభూతో న భవిష్యతి" అన్న అతిశయోక్తికాదు.
సుమారు నూరు సంవత్సరాలకు పూర్వం ఒకనాటి ఉదయం సుబ్బయ్యశాస్త్రిగారు స్నాన సంధ్యాదనుష్ఠానాలను పూర్తి చేసుకుని వారి యింటి అరుగుపై కూర్చుని వేదాధ్యయనం చేసుకుంటూ యఙ్ఞోపవీతాన్ని వడుకుతున్నారు. రెండవ అరుగు మీద కూర్చున్న వారి ప్రియశిష్యుడు శ్రీధర తాళపత్ర గ్రంథాన్ని చదువుతూ యేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అట్టి సమయంలో ఠాణేదారుగారూ ఆ ఊరి పెద్దలు కొందరూ లోనికి రావడం చూసి శాస్త్రిగారు కలవరంగా లేచి నిల్చున్నారు.
"నమస్కారమండీ శాస్త్రిగారూ! తమరు పెద్దలు, మమ్ములను మీరు గౌరవించడం న్యాయమా? దయచేయండీ" అంటూ ఠాణేదారుగారు శాస్త్రిగారిని కూర్చుండమని వారు కూడా అరుగు మీద కూర్చున్నారు. కూడా వచ్చినవారు రెండరుగులమీద సద్దుకుని కూర్చున్నారు.
శాస్త్రిగారు వారి రాకకు కారణం తెలియక "చిత్తం. తమరు వేంచేసిన కారణం?" అన్నారు నెమ్మదిగా.
"శాస్త్రిగారూ! మహారాజుగారి దగ్గరనుండి వార్తాహరుడు నిన్న వచ్చేడు. ప్రభువులు తమ దర్శనాన్ని కోరుతున్నారు. వారి కోట లోనికి ఒకసారి దయచేయమని మిమ్మల్ని ప్రార్ధించవలసినదిగా మమ్ము ఆదేశించారు. మీకు ప్రయాణానికి ఎప్పుడు అనువుగా ఉంటుందో చెబితే పాలకీ యేర్పాటు చేస్తాను."
శాస్త్రిగారికి అర్ధమయింది. మహారాజావారికి జ్యోతిశ్శాస్త్రంలో చాలా ఆసక్తి కలదని వారు విన్నారు. బహుశా యేదైనా జాతకం చూపడానికిగాని ఆహ్వానించి ఉంటారని అనుకున్నారు. కాని దివానుగారికి మాత్రం యీ శాస్త్రమన్న సగమెరుక. ఆయన యీ శాస్త్రాన్నీ యీ శాస్త్రఙ్ఞుల్నీ కూడా చాలా చిన్నచూపు చూడడమే కాకుండా ముఖస్థంగా కూడా దూషిస్తారని ప్రతీతి. కోటలోనికి పోయి తన విద్యను అక్కడ చూపడం శాస్త్రిగారికి ఇష్టంలేదు. సరస్వతికి తగిన గౌరవం జరగదని ఆయన అనుమానపడ్డారు. అందువలన ఆదినిష్ఠూరమే మేలనే సామెతగా వెళ్ళకుండా ఉండడానికే నిశ్చయించుకున్నారు.
"క్షమించాలి! నేను కోటలోనికి పోవడమేమిటి? మాబోంట్లు దర్బారులో అడుగు పెట్టడానికి తాహతు లేనివారం. మాకెందుకీ రాజసభా ప్రవేశాలు బాబూ! క్షమించవలసిందిగా మహారాజువారికి విన్నవించండి." అన్నారు శాస్త్రిగారు.
"శాస్త్రిగారూ! తమరు పొరబడుతున్నారు. మీరిక్కడ ఉండిపోయినంత మాత్రం చేత మీ పాండిత్యం, ప్రతిభ యిక్కడే ఉండిపోయాయనుకుంటున్నారా? దేశ దేశాలు పాకిపోయేయి. మీ ప్రతిభను విని, మీ విద్వత్తుకు ఆశ్చర్యపడి మీ దర్శనం చేసుకోవాలని ఉన్నట్లు ఆ మధ్య దర్బారులో ఒకసారి అందరి యెదుటా వారి కోరికను వెలిబుచ్చారు మహారాజావారు. ఇప్పుడు ప్రభువులకు మీ వలన సలహా యేదైనా కావలసి ఉండవచ్చు. అది నెరవేర్చడం మన విధికదా శాస్త్రిగారూ." అన్నారు ఠాణేదారుగారు.
"ఏమైనా ప్రభువులకు నా ప్రణతుల నందజేసి క్షమించవలసిందిగా కోరండి. "అన్నారు శాస్త్రిగారు.
ఠాణేదారుగారికి యేమనడానికి తోచలేదు.
"శాస్త్రిగారూ! మీ యీ నిరాకరణకు కారనం మేము తెలుసుకోవచ్చునా?" మృదువుగా ప్రశ్నించేరు.
“సరస్వతీదేవికి తగిన గౌరవం ఆ దర్బారులోజరుగబోదని నాకు తోస్తోంది. అది నేను సహించలేను" అన్నారు శాస్త్రిగారు.
ఠాణేదారుగారికి అర్ధమయింది. దివాన్జీ బిళ్ళగోచీ పండితుల్ని అగౌరవపరచడం తనకు తెలిసిన విషయమే. ఆ రాచఠీవి ఆ దర్పం దివాన్జీ కళ్ళకు పొరలు కప్పేయంటే అసత్యమేమీలేదు. ఆయన దర్శనార్ధమై వచ్చెడి ద్రవ్యాపేక్షగల పండితులనతడు యెట్లు కించపరచినా చెల్లేది. కాని తపస్సంపన్నులూ, శపించగల శక్తిమంతులూ అయిన శాస్త్రిగారిలాంటి పండితులను ఆయన యెరుగడు. శాస్త్రిగారి అనుమానానికి కూడా అవకాశమున్నట్లు తోచింది ఠాణేదారుగారికి. మారు చెప్పలేక కొంత తడవు అవనత శిరస్కుడై
"తమ చిత్తం. ఇం కొకసారి ఆలోచించండి" అంటూ లేచేరు. శాస్త్రిగారూ, పెద్దలూ కూడా లేచేరు.
వారు వెళ్ళిన తరువాత ధైర్యాన్ని చిక్కబట్టి శ్రీధర్ "అయ్యా! రాజాస్ఠానానికి పోవడం మనకు వద్దండి"అన్నాడు.
"ఏమిరా శ్రీధర్, ఎందువలన?"
"అయ్యా, ఆ దివానుగారు చాల చెడ్డవారని వాడుకండి. మొన్న మా మేనమామ అవధాన్లు మీరు యెరిగే ఉంటారు. వేదపఠనంలో అందెవేసిన చెయ్యిలెండి. అతడు ఘన చెబుతుంటే వినవలసిందేనండి. ఆయన దివాన్ గారి దర్శనానికి వెళ్ళేడు, మహారాజా వారి దగ్గర వార్షికం యేర్పాటు చేసుకుందామని. ఇంటివద్ద దివాన్జీని కలుసుకుని ఒక పనస అందుకునేసరికి ఆయన ఉగ్రుడై "ఏమీ ఈ వెధవ గొడవ? అవతలకు పొమ్మను" అని తాబేదారు వైపు తిరిగి అరిచేరుటండి. అల్లా ఉంటుందండి ఆయన ఆహ్వానం."
శాస్త్రిగారికి ముఖం కందగడ్డలా అయింది. విద్యకు ఎంత అపచారం జరిగిందోనని చాలా బాధపడ్డారు.
"శ్రీధర్! పాపం పండాలి నాయనా! అంతవరకూ యింతే" అన్నారు శాస్త్రిగారు.
శ్రీధర్ చదువులో పడ్డాడు.

2

"ఆ బిళ్ళగోచీ పండితునిక్కూడా యెంత అహంభావం ఉందో చూసేరా ప్రభూ!" అన్నారు దివానుగారు మహారాజావారితో.
దివానుగారికి శాస్త్రిగారి సమాధానం అందింది. అది మహారాజావారికి విన్నవిస్తూ యీ విధంగా అన్నారాయన.
"దివాన్జీ! శాస్త్రి గారిని సామాన్య పండితుడనుకుంటూన్నారా! ఆ జైమిని అవతారమే ఆయన"అన్నారు మహారాజావారు.
"సందేహమే లేదు ప్రభూ! ఊరూరా ఆయన ప్రతిభే వినపడుతోంది. జాతకభాగంలోనైతేనేం ప్రశ్నభాగంలోనైతేనేం ఆయన ప్రఙ్ఞ అమోఘం. నిజంగా పూర్వపు మహర్షుల కోవకు చెందిన వారాయన" అన్నారు కవిగారు.
"నాలుగు గీతలు గీయగలిగినవాడల్లా జాతకం చెబుతానని బయల్దేరే యీ రోజుల్లో ఆ విద్యకు తగిన గౌరవం లభించడం చాలా కష్టం"అన్నారు మహారాజావారు.
మహారాజావారికి శాస్త్రిగారియందున్న గౌరవ ప్రపత్తులు అసమానవైనవని గ్రహించేరు దివానుగారు. మౌనంగా కొంతసేపు ఊరుకున్నారు.
"ఆయన విద్యకు తగిన మర్యాద తప్పక లభిస్తుందని వారికి తెలియజేసి సగౌరవంగా వారినిక్కడకు తోడి తేవలసినదిగా ఠాణేదారుకు కబురుచేయండి." అన్నారు మహారాజావారు.
"చిత్తం" అన్నారు దివానుగారు.
కాని ఆయనకు యిష్టంలేదు. ఈ శ్రోత్రియ బ్రాహ్మణునకు యింత గౌరవమివ్వడమా అని ఆయన వ్యథ.
"కాని ప్రభువులకు నాదొక మనవి. శాస్త్రానికి తగిన గౌరవమివ్వదలిస్తే అల్లాంటివారు వేలకువేలు ఉన్నారు. వారందరూ ఆ గౌరవానికి అర్హులేనా ప్రభూ!"
"అదేమిటి దివాన్జీ! సుబ్బయ్యశాస్త్రిగారిని యితర పండితులతో జమ చేస్తున్నారే? పొరపాటు. ఆయన శాస్త్రం తెలిసున్నవారూ పండితులూ కారు. ఆయనే శాస్త్రం. శాస్త్రం యెంత గౌరవానికి అర్హత కలిగి ఉందో అంత గౌరవానికి ఆయన అర్హులు" అన్నారు మహారాజావారు. దివాన్జీకి యిది రుచించలేదు.
"సరే ప్రభూ! అట్లే సందేశం పంపిస్తాను. ఒక్క మనవి నాది అనుగ్రహించండి. ఆయన విద్యనొకసారి పరీక్ష చెయ్యాలనిపిస్తోంది. బంగారాన్ని గీటురాయి మీద రాస్తేనే కదా దాని గొప్పతనం తెలిసేది. అనుమతించండి ప్రభూ!" అన్నారు.
మహారాజావారు నిర్ఘాంతపోయేరు. దివానుగారివైపు కొంచెంసేపు చూసేరు.
కవిగారు కంగారుగా అన్నారు.
"అపచారం ప్రభూ! అటువంటి పనిని తలపెట్టడం కొరివితో తల గోక్కోవడమే"
"ఏమి? అందులో దోషమేముంది? మన పరీక్షకు నిలిస్తే బహుళంగా సత్కరిద్దాం వారిని" అన్నారు దివానుగారు, మహారాజావారు మౌనంగా ఉండడం అనువుగా తీసుకుని.
"దివాన్జీ! నిప్పుతో చెలగాటం పనికిరాదు. మూర్తీభవించిన శాస్త్రమాయన. కొంచెం నిదానంగా మంచి చెడ్డలు ఆలోచించి ముందుకు వెళ్ళండి. " అన్నారు కవిగారు.
"కవిగారి అభిప్రాయమేమో?" అన్నారు దివాన్జీ.
"నా అభిప్రాయం తమరు తలపెట్టిన కార్యం విషాదాంతమవుతుందని"
"ఏమి? పరీక్షకు నిలిచి శాస్త్రిగారు సత్కారాలనందుకోలేరా?" అన్నారు దివాన్జీ హేళనగా.
కవిగారికది సహించరానిదయింది.
"ప్రభువులు క్షమించాలి. సత్కారాల కాశించిన వారైతే శాస్త్రిగారు యెప్పుడో మహారాజావారి సత్కారాల నందుకొని ఉండేవారు. వారికవి అవసరం లేదు. అదిన్నీ గాక శాస్త్రిగారి అనుమానానికి కారణం యిప్పుడు నాకు అర్ధమయింది. మహారాజావారు యువరాజావారి జాతకం చూపించడానికి శాస్త్రిగారిని పిలిపిస్తున్నారు. ఇట్టి సమయంలో వారిని గౌరవంగా ఆహ్వానించి సగౌరవంగా సాగనంపడమే అందరికీ శ్రేయస్కరం. నాకు తోచింది మనవి చేసేను. ఆ తరువాత ప్రభువుల చిత్తం". అని కవిగారు మౌనం వహించారు.
మహారాజావారు ఏమీ అనలేక ఊరుకున్నారు. దివాన్జీ ఈ అవకాశం చూసుకుని
"ప్రభూ! ఆయన మర్యాదలకేమీ లోటు రానివ్వను. ఆస్థానానికి అప్రతిష్ఠ తెచ్చేటంత అవివేకిని కాను. కాని ప్రభువులే శాస్త్రిగారి ప్రతిభను పొగుడుతూ ఉంటే నాకు కూడా వారి పాండిత్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది ప్రభూ! తమరు అనుమతించాలి." అన్నారు.
మహారాజావారికి యెటు చెప్పడానికీ తోచలేదు.
"దివాన్జీ! బాధ్యత అంతా మీదే. అయినా ఆయన్ను పరీక్షించడమంటే యెట్లా చేయదలచుకున్నారో తెలియచేయండి"
"ప్రభువులు క్షమించాలి. ఇంకా నేనేమీ ఆలోచించలేదు. కాని త్వరలోనే విన్నవించుకుంటాను."అన్నారు దివాన్జీ.
కవిగారి కిదేదో విషాదాంతానికి దారితీస్తుందని భయం తోచింది.
"ప్రభువులు సెలవిప్పిస్తే రేపు పునర్దర్శనం చేసుకుంటాను" అన్నారు కవిగారు.
సరేనన్నారు మహారాజావారు. ఒక గంటసేపు మహారాజావారూ, దివానుగారూ మాట్లాడుకున్న తరువాత దివాన్జీవారింటికి వెళ్ళిపోయేరు.

3

మహారాజావారి ఆహ్వానాన్ని రెండవసారి కూడా కాదనలేకపోయేరు శాస్త్రిగారు. ఠాణేదారుగారు తగిన మర్యాదలతో సగౌరవంగా పాలకీపై రాజధానికి తీసుకువెళ్ళేరు శాస్త్రిగారిని. కో్టలోనూ, ఆస్థానంలోనూ కూడా అఖండమైన గౌరవం చూపించారు శాస్త్రిగారికి. దర్బారు ముగిసిన అనంతరం దివాన్జీ శాస్త్రిగారిని కలుసుకుని,
"నమస్కారం శాస్త్రివర్యులకు, మహారాజావారు తమతో ఆంతరంగికంగా మాట్లాడాలని కోరుతున్నారు. తమరు అభ్యంతర మందిరానికి ఒక తూరి దయచెయ్యాలి. " అని సవినయంగా మనవి చేసేరు.
ఈ గౌరవోన్నతికి చాలా ఆశ్చర్యపోయేరు శాస్త్రిగారు. తాను అపోహ పడ్డందుకు చాలా విచారించారు. దివాన్జీతో కలిసి సేవకులు ముందు దారి చూపుతుండగా అభ్యంతర మందిరంలోనికి ప్రవేశించారు. ఆ మందిరంలోని ఉన్నతాసనాలు తీసివేయబడ్డాయి. రత్నకంబళీ పరచబడి ఉన్నది. దానిపై కూర్చుని ఉన్నారు మహారాజావారు. శాస్త్రిగారిని చూచి లేచి నమస్కరించి లోనికి ఆహ్వానించేరు. శాస్త్రిగారు కూడా ఉచితరీతిని ఆశీర్వదించి దివాన్జీతోపాటు రత్నకంబళి మీదనే ఆశీనులయ్యేరు. అర్ధగడియసేపు సంభాషణ ముగ్గురి మధ్య చాలా సరసంగా నడిచిపోయింది. ఆ తరువాత దివాన్జీ మహారాజావారివైపు చూచి వారి ఆఙ్ఞను తెలుసుకుని యీ క్రిందివిధంగా ఉపక్రమించారు.
"శాస్త్రిగారూ! మీరు వేదమూర్తులూ, మూర్తీభవించిన శాస్త్రమేనని మా ప్రభువులు యెప్పుడూ అంటుంటారు. తమ ప్రఙ్ఞ వినడమే కాని తమ దర్శన భాగ్యం నాకెప్పుడూ కలుగలేదు. మహారాజుగారు కూడా మిమ్మల్నెప్పుడూ ముఖతః పరిచయం చేసుకోలేదనుకుంటాను. "
“ దివాన్జీ! తమరు అనర్హుణ్ణి నన్ను చాలా గౌరవిస్తున్నారు. క్షమించమని నా మనవి. తమరు నాకు చూపిన గౌరవానికి అర్హుణ్ణి కాను. నేను అనుమానాన్ని వెలిబుచ్చినందులకు ప్రభువులు నాకు సరిగానే బుధ్ధిచెప్పారు." అన్నారు శాస్త్రిగారు.
"తప్పు తప్పుశాస్త్రిగారూ! మీరల్లా అనకండి. తమ పాండిత్యానికి తగిన గౌరవం మేమివ్వలేకపోయినందులకు యింకా చింతిస్తున్నాం. అదలా ఉంచండి. తమర్ని మహారాజావారు ఒక విషయం తెలుసుకుందుకు పిలిపించేరు."
"సెలవియ్యండి"
దివానుగారు వారి లాంగుకోటు క్రింది జేబులోనుండి ఒక తాళపత్రం తీసేరు. అందుపై ఒక జాతకచక్రం వ్రాసి ఉంది. కావలసిన ఉడుగతులూ, గ్రహప్రవేశాలు అన్నీకూడా అందులో వ్రాసి ఉన్నాయి.
దివానుగారు ఆ జాతక చక్రాన్ని శాస్త్రిగారి చేతికిచ్చి,
"ఈ జాతకుని యోగం భవిష్యత్తులో యెల్లా ఉంటుందో కొంచెం మనవి చెయ్యండి" అన్నారు.
మహారాజావారు చిరునవ్వుతో చూస్తున్నారు.
శాస్త్రిగారు జాతకాన్ని చూసేరు. కళ్ళు పెద్దవి చేసి మళ్ళీ చూసేరు. చాలా ఆశ్చర్యపోయేరు. ముఖంలో అనుమానం ప్రవేశించింది. వెంటనే కోపంగా మారింది. ముఖం కందగడ్డలా అయింది.
మహారాజు యిది చూసి చకితులయ్యారు. కాని దివాన్జీ తన తెలివికి లోలోన మురిసిపోతూ యిదేమీ గమనించలేదు.
"మౌనం వహించేరు సెలవీయండి" అన్నారు.
"చెప్పమన్నారా?" అన్నారు శాస్త్రిగారు. మేఘం ఉరిమినట్లుంది ఆ మాట. దివానుగారు తెల్లబోయారు. జాతకచక్రాన్ని దివానుముందుకు విసిరి యిల్లా అన్నారు శాస్త్రిగారు.
"చెపుతున్నాను. ఈ జాతకునికి గడ్డి తినే యోగమే ఉంది కాని అన్నం తినే యోగంలేదు. తెలుసుకోండి. ప్రభువులు క్షమిస్తే ఒక విషయం చెబుతాను. దివాన్జీ చేసిన ఈ పండిత అవమానం సహించరానిది. శాస్త్రానికి తీరని అపచారం. నా విద్యను పరీక్ష చేయడానికి ఆయనకాదు ఆయన్ను పుట్టించిన బ్రహ్మ దిగిరావాలని తెలుసుకోవలసి ఉంది ప్రభువులు... ఈ జాతకం ఒక కోడెదూడ పుట్టిన సమయానికి గ్రహకూటమిని తెలియచేస్తోంది, మానవశిశువు ఆ గ్రహకూటమి సమయంలో యెన్నడూ జన్మించడు.
ఇంతకూ ప్రభువులు నా విద్యను సగౌరవంగా మన్నిస్తారని హామీ యిచ్చిన మీదటనే తమ దర్శనానికి వచ్చేను. వచ్చినందుకు తగిన గౌరవమే జరిగింది...దివాన్జీ! పండితులతో చెలగాటం పనికిరాదయ్యా నీకు. విద్వాంసులూ పండితులూ అంటే నీ దగ్గరకు ద్రవ్యాపేక్షతో చేరే బ్రాహ్మణులనుకుంటున్నావయ్యా ? మహాపండితుల్నీ శాస్త్రాల్నీ కూలంకషంగా తెలుసుకున్న మహనీయుల్ని నువ్వు ఎరుగవు. వారిని పరీక్షించడానికి నీ తాహతేమయ్యా? నీకూ వారికీ హస్తిమశకాంతరం ఉందని గుర్తుంచుకో. ఇంతకీ నీవు చేసిన అపచారం సహించరానిదయ్యా. మా సరస్వతి దుఃఖపడుతోంది. నా ముఖతః నిన్ను శపిస్తోంది. నీ వంశం నీతోనే సరయ్యా. ముందుకైనా బుధ్ధి కలిగి ఉండు. "
"ప్రభూ! యీ బ్రహ్మణున్ని క్షమించండి. మా సరస్వతి మిమ్మల్ని కూడా దోషిగానే నిర్ణయిస్తోంది. ఇందులో మీ ప్రోత్సాహం లేకపోయినా మహారాజుగా దీనిని వారించకపోయినందుకు మీరు దండనార్హులని ఆమె తీర్పు. యువరాజావారి జాతకం చూపడానికి నన్ను పిలిపించేరు. ఆ పని కాలేదు. ఆ ముహూర్తాన కోడెదూడ జాతకం నా చేతికి వచ్చింది. ప్రభూ......మీ యువరాజావారు జీవించియున్న కాలంలోనే రాజ్యం మాసిపోతుందండి. ఆఖరి రోజుల్లో ప్రభూ! వారు కూడా గడ్డి కరవాలిసిందే.. ఇది సరస్వతి శాపం ప్రభూ! సెలవు ప్రభూ! పునర్దర్శనం వలదండి. సెలవ్" అంటూ నిష్క్రమించారు.
మహారాజావారూ, దివానుగారూ నిస్తబ్దులై అల్లాగే ఉండిపోయేరు.

---------------------------------------------------------------------------------

Thursday, June 23, 2011

లాఠీఛార్జి..

మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన "మఱపురాని అనుభవాలు " పుస్తకంలో మరో ఙ్ఞాపకం.



సత్యాగ్రహం రోజుల్లో సత్యాగ్రహం కోసమై మహాత్ముని పిలుపునందుకుని ప్రతి ఊరులోను కాంగ్రెసువారు ప్రత్యేకంగా కొంతమంది వాలంటీర్లకు శిక్షణనిచ్చేవారు. వారి పేర్లను నమోదు చేసుకొని, వరుసగా వారికి సత్యాగ్రహం చేయడానికి అవకాశం ఇచ్చేవారు. నూటనలుబది నాల్గవ సెక్షను ధిక్కరించడమనేది సత్యాగ్రహంలో ఒక భాగం. రోజూ ఉదయం పదిగంటలకు కాకినాడలోని మసీదు సెంటరుకు ఐదుగురు వాలంటీర్లు "వందేమాతరం మహాత్మాగాంధీకీ జై !" అంటూ నినాదాలు చేస్తూ వచ్చేవారు. నలుగురికన్న ఎక్కువమంది ఒకచోట సమావేశం కాకూడదనే ఆర్డరును ధిక్కరించేవారు. అప్పటికి అక్కడ సిధ్ధంగా ఉన్న పదిపన్నెండుమంది పోలీసు సిబ్బందీ వాలంటీర్లు సెంటరులోనికి రాగానే తమ లాఠీలతో వారిని కొట్టడం మొదలుపెట్టేవారు. ఆ వాలంటీర్ల శిక్షణ ఎలాంటిదంటే, లాఠీదెబ్బలు వర్షంలా శరీరంపై పడుతున్నప్పటికీ తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. చెయ్యెత్తి ఆ దెబ్బలను వారించుకోకూడదు. అలా ఆ దెబ్బలను భరిస్తూ ఉండిపోవలసిందే. స్పృహ తప్పి క్రింద పడిపోయేవరకూ "వందేమాతరం" అంటూనే ఉండేవారు. స్పృహ కోల్పోయి రోడ్డుమీద పడిపోయినవారిని ఒక్కొక్కరినీ కాళ్ళు పట్టుకుని రోడ్డు మీద ఈడ్చుకుపోయి ముఱికికాల్వ ప్రక్క పడేసేవారు.
ఆ వాలంటీర్లకు ప్రథమ చికిత్స చేసిన వారిని, మంచినీరు ఇచ్చేవారిని నిర్బంధించి జైలుశిక్ష వేసేవారు. ఆ విధంగా వారు రాత్రివరకూ పడి ఉన్నాక, అర్ధరాత్రి పోలీసులు ఆ స్థలం నుండి కదిలిపోయేక వాలంటీర్లు వచ్చి స్పృహలేనివారిని భుజాలపై వేసుకొని తీసుకొని వెళ్ళేవారు.
ఆ సంఘటన జరిగేటప్పుడు ఆ మెయిన్ రోడ్డు పైనున్న జనం యావత్తూ రెండువైపులనున్న అరుగుల మీదకు పాఱిపోయి కండ్లవెంట నీరు కార్చేవారు. అటువంటి లాఠీచార్జికి గుఱిఅయి చనిపోయినవారు కొందరైతే, అవయవలోపంతో జీవితాంతం బాధపడ్డవారు చాలామంది.
ఈ రీతిగా లాఠీఛార్జికి గురయిన సత్యాగ్రహుల అవస్థ చూసి కూడా, మరునాడు ఉదయం 10 గంటలకు ఇంకొక అయిదుగురు వాలంటీర్లు శాసనోల్లంఘన చేయడానికి ఉద్యుక్తులై వచ్చేవారు. వారు కూడా అదే అవస్థననుభవించేవారు. ఆ రోజులలోని సత్యాగ్రహం, దేశభక్తి, ఉత్సాహం, త్యాగబుధ్ధి అలాంటిది. ఆ త్యాగమూర్తులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. వారి పేర్లు కూడా చరిత్రకెక్కకుండా, సత్యాగ్రహసమరంలో ఆహుతి అయినవారు వేనకు వేలున్నారు.
ఎంతమంది నిస్స్వార్ధపరుల త్యాగఫలమో యీ స్వాతంత్ర్యం !


________________________________________________________________________

Tuesday, June 21, 2011

"మఱపురాని అనుభవాలు"

మా నాన్నగారు "పిడపర్తివారు--కథలూ-గాధలూ" అని పిడపర్తివారి వంశచరిత్ర,, జ్యోతిష్యంలో వారికి గల అసమాన ప్రతిభ తెలిపే కొన్ని కథలూ కలిపి ఒక పుస్తకంగా వ్రాసారు. వాటి గురించి తర్వాత ప్రస్తావిస్తాను.
ఇప్పుడు మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన ఇంకో పుస్తకం "మఱపురాని అనుభవాలు" అన్నదానిని గురించి చెపుతాను. ఈ పుస్తకం ముందుమాటలో ఆయనే వ్రాసుకున్న మాటలు...
"నా జీవితకాలంలో నేను చూసినవి రెండు ప్రపంచ యుధ్ధాలు, దేశంలో జరిగిన సత్యాగ్రహ సమరము, తదుపరి నేను విధులు నిర్వహించిన ప్రభుత్వాలు రెండు; ఒకటి బ్రిటిష్ ప్రభుత్వము, రెండవది మన దేశ నాయకుల ప్రభుత్వములో. నా విధి నిర్వహణలో ఆఫీసర్లుగానున్న తెల్లదొరలతో వ్యక్తిపరమైన సంబంధం ఉండేది.
ఈ పై విషయాలను బట్టి మీరు గ్రహించేయుంటారు నా జీవితానుభవాలు అనేకములనీ, కొన్ని అసాధారణములై ఉంటాయనీ కూడా. నా మిత్రులతో ప్రసంగిస్తున్నప్పుడు ఈ అనుభవాలను కొన్ని వారికి విన్పింపగా వారు అనందించి, నా అనుభవాలను కొన్నింటిని పుస్తకరూపంలో అందించమని కోరారు. వారి కోరిక ఫలితమే ఈ చిన్న పుస్తకము. ఇందులో నేను చూపిన అనుభవాలు దేశంలోని మహనీయుల గొప్పతనాన్ని యెత్తిచూపడానికే గాని, నా గొప్పతనం కోసం గాదు."
అల్లూరి సీతారామరాజు



మా చిన్నతనంలో ఎంతో ఆసక్తితొ విన్నదీ, కన్నదీ అల్లూరి సీతారామరాజును గుఱించి. ఆయన జీవిత చరిత్ర నాటక రూపంలోనూ, చలనచిత్రరూపంలోనూ బాగా ఈమధ్య ప్రచారం కాబడింది. అందులో చూసిన సంఘటనలకున్నూ, మాకు మా చిన్నతనంలో తెలిసిన సంఘటనలకున్నూ చాలా వ్యత్యాసం కనబడుతుంది. ముఖ్యంగా రూథర్ పోర్డ్ షూట్ చేయగా సీతారామరాజు చనిపోయినట్లు చిత్రంలో చూపించారు అయితే మా చిన్నతనంలో మేము విన్న విషయమిక్కడ తెలియపరుస్తాను.
శ్రీ సీతారామరాజు సుమారు వందమంది అనుచరులతో ఒకనాటి రాత్రి అడవిలో నిర్జన ప్రదేశంలో నిద్రపోతూ ఉండగా, ఈ విషయం చారుల వలన తెలిసికొన్న తెల్లదొరలు కమాండర్లుగానున్న మలబారు స్పెషల్ పోలీసుదళం వారిపై ఒక్కసారి విరుచుకు పడి షూటింగ్ చేయడానికి సిధ్ధపడ్డారు. నిద్రలోనున్నవారు నిద్రనుండి లేవాలన్నా ఆ అవకాశం లేకపోయింది. వెంటనే ఒక వ్యక్తి ఆ కమాండర్ల దగ్గఱకు వచ్చి యెదురుగా నిల్చి, తానే సీతారామరాజుననీ, తాను లొంగిపోతున్నాననీ, షూటింగ్ ఆర్డర్లు ఇవ్వవద్దనీ చెప్పాడు. వెంటనే అతనిని అరెస్టు చేసారు. అతని అనుచరులు తప్పించుకొనిపోవడానికి అవకాశం కలిగింది. ఆ తెల్లదొరలు సీతారామరాజును పట్టుకోగలిగినందుకు మురిసిపోతూ, అతనిని జిల్లా ప్రధాన నగరమైన కాకినాడలో సబ్ జైల్ లో ఉంచేరు. దొరలు చేసిన ఘనకార్యం వార్త వెంటనే ప్రభుత్వంలోనున్న అధికారులందరికీ తెలియజేయబడింది. "Secretary of State for India in London" కు కూడా ఈ వార్త ఆఘమేఘాలమీద చేరింది. ఇంతటి సాహసం చేయగల్గిన ఆ తెల్లదొరల కమాండర్లు పై ఆఫీసర్ల అభినందనల వర్షంలో మునిగితేలేరు. ఇక్కడ చిన్న విశేషముంది. సీతారామరాజు ఉద్యమం నడిపినప్పుడు, తన చేతికి చిక్కిన దొరలనాతడు బ్రతకనీయలేదు. మన హిందువులు చేజిక్కినప్పుడు కొంత మందలించి విడిచిపెట్టేవాడు. అందువలన తాము అరెస్ట్ చేసిన వ్యక్తి సీతారామరాజు అవునోకాదో ఆతెల్లదొరలకు తెలియదు. ఆ వ్యక్తి మాట మీదే ఆధారపడి వ్యవహరించేరు. జైలులో నున్న వ్యక్తిని చూచిన హిందూ ఆఫీసరెవరో ఒకాయన ఆ పట్టుబడిన వ్యక్తి సీతారామరాజు కాదు అన్నాడు. వెంటనే ప్రభుత్వంలో కలకలం రేగింది. ఇదివరలో సీతారామరాజు చేత పట్టుబడి వదిలి వేయబడిన ఇద్దరు ఆఫీసర్లను పిలిపించేరు. వారు కూడా ఆ వ్యక్తి సీతారామరాజు కాదని ధృవపరచారు. పట్టుబడిన రోజున, సీతారామరాజును రక్షించడానికే, ఇంకొక వ్యక్తి తానే రాజునని లొంగిపోయేడని నిశ్చయంగా ఋజువయింది. ఆ రోజుల్లో సబ్ జైల్ గోడలమీద నుండి ఆ జైలులో నున్న సీతారామరాజును చూడడానికి ప్రయత్నించిన చిన్నపిల్లలలో నేనొకడిని.
ఆ పరిస్థితులలో ఇంక చేసేదేమీలేక ప్రభుత్వంవారు ఆ వ్యక్తిని షూట్ చేసి చంపేశారు. జైలునుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటే, షూట్ చేయవలసి వచ్చిందని ప్రచారం చేసేరు. అందువలన ఇంక కోర్టులూ, నేరాలూ, సాక్ష్యాలు మొదలయిన చర్యలన్నింటికీ స్వస్తివాక్యం పలికారు.
ఇంతకూ సీతారామరాజు ఏమయ్యారని ఆ రోజులలో ఏ కోయవారి నడిగినా, ఆయన చనిపోలేదనీ, విరక్తి చెంది, అడవులలో తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయారనీ చెప్పేవారు. విరక్తి ఎందుకంటే, సీతారామరాజు ఉద్యమం నడిపేటప్పుడు కోయ మగవారు చాలామంది ఆయనతో ఉండగా, మలబారు స్పెషల్ పోలీసుదళంవారు తెల్లదొరలకమాండ్ లో పల్లెల మీద పడి నానాభీభత్సం చేసేవారట. స్త్రీలను హింసించి, పిల్లలను బాధపెట్టి, ఇండ్లను అగ్నికి ఆహుతిచేసి విపరీతమైన అరాచకం జరిపేవారనీ, ఆ వార్తలు వింటున్న సీతారామరాజుగారు చాలా బాధ పడుతుండేవారనీ, కొన్నాళ్ళకు ఆయనకు విరక్తి కలిగి ఈ ఉద్యమం ఆపవలసి వచ్చిందనీ, ఆయన తపస్సు చేసుకునేందుకు అడవులలోనికి వెళ్ళిపోయారనీ చెప్పేవారు.
1925వ సంవత్సరములోను, 1926వ సంవత్సరములోను అల్లూరి సీతారామరాజు చరిత్ర పుస్తకరూపంలో వచ్చింది. ఈ వివరాలు అందులో తెలియపరచారు. ఆ నకిలీ సీతారామరాజు ఫొటో కూడా ఆ పుస్తకంలో ఉన్నది.

(చిత్రం.. గూగులమ్మ సౌజన్యంతో..)


________________________________________________________

Sunday, June 19, 2011

మా నాన్నగారు...




అందరు తండ్రులకూ వారి అమ్మాయిలు బంగారుతల్లులే...
అందరు అమ్మాయిలకూ వారి నాన్నలు కల్పవృక్షాలే...
కావచ్చు... కాదనను... కాని...
మా నాన్నగారికి మేము ఆడపిల్లలం నలుగురం కూడా
పుటం పెట్టిన ఇరవైనాలుగు కేరట్ల బంగారులం...
అలాగే మా నాన్నగారు మాకు కల్పవృక్షం, కామధేనువు...ఇంకా ఎన్నో...

ఎంత పాండిత్యముందో అంత వినయంగానూ వుండేవారు
ఎదుటివారి వయసెంతయినా సరే ఎంతో గౌరవమిచ్చి మాట్లాడేవారు

ఆయన మాకు అందించిన నిధి సామాన్యమయిందికాదు..
ఆయన గురించి ఏ ఒక్కటని చెప్పను..
ఎక్కడ మొదలుపెట్టడం..?
ఎక్కడ చూసినా ఆయన చెప్పిన మాటే..
ఆయన మాకు చెప్పని విషయం అంటూ లేదు.

పద్యాలలో పొదిగిన అందాల్ని ఆస్వాదించి ఆనందించడం ఆయనే మాకు నేర్పారు.
ఆశువుగా పద్యాలు చెప్పేవారు. సమస్యాపూరణలు, దత్తపదులూ అలవోకగా చెప్పేవారు.

మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు కీర్తిశేషులయి ఈనాటికి సరిగ్గా సంవత్సరం అయింది.
ఈ రోజున ఆయన స్మృతులకు ప్రణతులర్పిస్తూ, వారు వ్రాసిన రెండు దత్తపదులను ఇక్కడ వుంచుతున్నాను.

ఇచ్చిన పదము..."సారము" అనే పదము నాల్గుపాదాలలో ఉపయోగించి ఒక వృత్తపద్యము.

సారము లేని భూమియును, సారస లోచన లేని వాని సం
సారము, యోగ విద్య తగు సాధన లేనిది, నీరు లేని కా
సారము, యోగ్యమైన దగు సంతతి కల్గని జీవితమ్ము, ని
స్సారములంచు పల్కెదరు సారెకు సారెకు విఙ్ఞులందఱున్.

"పాక, పీక, పేక, పోక.." ఈ నాల్గు పదాలు ఉపయోగించి రామాయణార్ధంలో ఒక వృత్త పద్యము.

పాకలు కావు కాలినవి, బంగరు మిద్దెలె మండిపోయె, మా
పీకల మీదకే ప్రభువు పెట్టెను, అతని దుష్టమౌ తలం
పేకద తెచ్చిపెట్టినది భీకరమైన విపత్తు, రాజుకీ
పోకడ లేమిటో యనుచు భోరున నేడ్చిరి లంకలో ప్రజల్.






++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++