కె.రామలక్ష్మిగారి
“అద్దం” కథలసంపుటి..
కె. రామలక్ష్మిగారి
కథలసంపుటి “అద్దం” చదవడం ఇప్పుడే పూర్తి చేసాను. నేను పుస్తకాలు విపరీతంగా చదివే రోజుల్లో
చాలా ఇష్టపడి చదివే రచయిత(త్రు)లలో ఈవిడ కూడా ఒకరు. ముఖ్యంగా ఈవిడ సృష్టించిన పార్వతీ,
కృష్ణమూర్తిల పాత్రలంటే ఎంతిష్టమో చెప్పలేను. 2009లో ప్రచురించబడిన, 278 పేజీలున్న
ఈ “అద్దం” పుస్తకంలో 28 కథలు ఉన్నాయి. ఏ కథ ప్రాముఖ్యత ఆ కథదే. చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా, సరళమైన భాషలో,
పాఠకుల గుండెల్లోకి విషయం వెళ్ళిపోయేలా చెప్పడం రామలక్ష్మిగారి ప్రత్యేకత.
పుస్తకానికి పెట్టినపేరు “అద్దం” కథపైనే శ్రీ బాపుగారు
ముఖచిత్రం వేసారు. ఆయన బొమ్మల గురించి వేరే చెప్పక్కర్లేదుగా..
వస్తు వైవిధ్యం వున్న ఈ కథల్లో అసలు కథల్లో వుండవల్సిన
క్లుప్తత, గాఢత, సంఘర్షణ, అనుభూతి లాంటివన్నీ అడుగడుగునా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా
“అద్దం” కథలో ఆఖరి వాక్యాలు “పోవడం మంచిదైంది కదా!” అన్న వాక్యాలు చదువుతుంటే కళ్ళనీరు
గిర్రున తిరగక మానదు.
“నిజం కంటే సాక్ష్యం
ముఖ్యం” కథలో కొడుకుని భర్త చంపుతుంటే ప్రత్యక్షంగా చూసిన తల్లి మాట కోర్టులో చెల్లదుట.
ఆమె కేవలం ఆ కేసులో పార్టీయేనట. సాక్ష్యం కాదట…అంటూ ఆ తండ్రిని మనసు స్థిరంలేనివాడిలా
శిక్ష వెయ్యకుండా వదిలేసిన కోర్టు పధ్ధతులను గురించి చదువుతుంటే మనసు మండిపోతుంది.
“హృదయంలేని పట్నం”
కథలో ప్రస్తుతం పట్నవాసాల్లో తన గొడవే తప్ప యెదుటివాడు చచ్చినా సరే పట్టించుకోకపోవడం
అన్న ధోరణి యెక్కువవుతోందనుకుంటాము కానీ రామలక్ష్మిగారు ఆరోజుల్లోనే ఆ కథ వ్రాసేసారు.
ఉదయమనగా ఆస్పత్రి ముందు రోడ్డు మీద పడున్న శవాన్ని ఎంతమందో చూస్తూ కూడా పట్టించుకోరు.
ఆఖరికి చీకటి పడుతుండగా ఆ శవం మార్చ్యురీకి తరలిస్తారు. ఓ ధర్మదాత ఆ శవంపై కప్పిన ఆచ్ఛాదన,
ఆ శవాన్ని డ్రాయర్ లో తోసే బాయ్ తలకి మారుతుంది..అన్న వాక్యాలు చదువుతుంటే మనసు నీరు
కారిపోతుంది.
“అందమైన పొరుగు”
కథలో భర్త పక్కింటామెను మెచ్చుకుంటే భార్య పడే తపన చాలా హృద్యంగా చెప్పారు.
అన్ని కథలూ ఇలా మనసుని తట్టి లేపేవే. దిగ్గజాల్లాంటి
సాహితీపరులతో సన్నిహితంగా మెలిగే రామలక్ష్మిగారు వారి దగ్గర విలువలున్న కథలు వ్రాయాలని
తెలుసుకున్నానని చెప్పారు. “విలువ” అన్న మాటకి నిర్వచనం ఏమిటని రామలక్ష్మిగారు బైరాగిని
అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఇలా వుంది.” కొన్నాళ్ళ తర్వాత నువ్వు రాసినవాటికి నువ్వే
సిగ్గు పడకుండా వుండగల్గినవి..” అన్న ఆ మాట ఎంత గొప్పదో కదా!. ఈ విషయం రామలక్ష్మిగారు
తమ ముందుమాటలో చెప్పారు. అంత విలువలను గుర్తించి రాసిన కథలు కనకే అప్పుడూ, ఇప్పుడూ,
ఎప్పుడూ కూడా వాటి విలువ అంత గొప్పగానూ నిలబడింది.
కె.రామలక్ష్మిగారు
వారి స్నేహితురాలు శాంతకు అంకితమిచ్చిన ఈ పుస్తకం ఎక్కడైనా లభిస్తే తప్పక చదవండి.
0 వ్యాఖ్యలు:
Post a Comment