Pages

Tuesday, October 27, 2009

వనభోజనాలు (కాదుటండోయ్)








ప్రతీ సంవత్సరంలాగే ఈసారి కూడా కార్తీక వనభోజనాలకి వెళ్ళాలని మా స్నేహితురాళ్ళం నిశ్చయించేసుకున్నాం. ఇక మొదలు---

ఎక్కడికి వెళ్ళాలి..ఎప్పుడు వెళ్ళాలి..ఎలా వెళ్ళాలి అని ప్రశ్నలు, చర్చలు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అక్కడే వంటలు చేసుకోవాలని కొందరంటే కాదు తీసికెడదాం లేదా కేటరింగు కిద్దాం అని మరి కొందరు.

.ఒకరి డైలాగ్, ”అయినా రోజూ వండేదే కదా, ఈరోజైనా బైట తిందాం.”.

మరొకరి డైలాగ్.”మనం బైట తింటాం సరే..మరి ఇంట్లో మగవారికోసం ఎలాగూ వండాలి కదా”

..”మా ఆయనతో ఫర్వాలేదు. బైట తినేస్తారు ఒక పూటకి..” అని ఒకావిడ గర్వంగా చెపితే,

”మా ఆయన అస్సలు బైట తినరు. అన్నీ వండి టేబిల్ మీద పెట్టి రావల్సిందే..”అని మరొకావిడ గారంగా విసుక్కుంది.

”అసలు వంటిల్లు తాళం పెట్టేసి తాళంచెవి పడేసుకుంటే కాని మనకి సుఖ ముండదు.”ఒకావిడ విప్లవాత్మకంగా ప్రకటించింది.

అది రామలక్ష్మీఆరుద్రగారి కొటేషనేమో..” తప్పులు పట్టుకునే ఆవిడ వెంటనే పట్టుకుంది.

”ఎవరి దయితేనేం.. మనకి పనికొస్తే వాడేసుకోడమే.. కనీసం తాళం చెవి దొరికే వరకూ మనకి రెస్టు..”

”మా ఆయన అయితే తాళంచెవి కొసం వెతికి టైము వేస్టు చెయ్యడు. తాళం పగలగొట్టేస్తాడు..”ఇంకో ఆవిడ వాపోయింది.

”అబ్బబ్బ.. అసలు సంగతి వదిలి ఆయన్ల గురించి మాట్లాడతారేం.. ఇప్పుడెక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తేల్చండి..”పెద్దరికం ఆపాదించుకుని కాస్త గట్టిగా మాట్లాడి అందరినీ దారిలొకి తెచ్చింది ఇంకో ఆవిడ.

ఆఖరికి అందరం తలో అయిటమూ చేసి తీసికెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఒకళ్ళు పొద్దున బ్రేక్ ఫాస్ట్ లాగ, మరొకరు లంచ్ లోకి స్వీటు, ఇంకోరు హాటు, మరొకరు బిసిబెళబాతు, ఇంకొకామె పులిహార, మరొకామె దధ్ధోజనం, ఇంకా మధ్యాహ్నం స్నాక్స్ కొందరూ ఇలా పదిమందీ పది రకాలూ చేసి తెచ్చేసుకోవాలని తేల్చేసుకున్నాం..(ఆహా..ఆడజన్మ ఎంత గొప్పదో కదా.. వంటింటి మహారాణులం. ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వండేసుకోవచ్చు..తినడం మాట దేముడెరుగు..)

తీరా ఎక్కడి కెళ్ళాలో తేల్చుకోడంలో అందరూ అన్ని చోట్లకీ వెళ్ళొచ్చేసిన వారే కనక అంత తొందరగా నిర్ణయించుకోలేకపోయాం. ఆఖరికి తక్కువమంది చూసినదీ, ఎక్కువమంది చూడనిదీ అయిన సురేంద్రపురి (కుందా సత్యనారాయణగారి కళాధామం) కి సెటిల్ అయిపోయాం. మళ్ళీ చర్చలు. అక్కడ లోపలికి తినే పదార్ధాలు తీసికెళ్ళనివ్వరనీ, బైట తినడానికి అంత వెసులుబాటుగా ఉండదనీ తెలిసి ఏం చెయ్యాలా అని చించి చించి అలోచించి ఆఖరికి స్కూలుపిల్లల్లాగ ఎవరి లంచ్ బాక్స్ వాళ్ళు తెచ్చుకోవాలనుకున్నాం. ఇంటి దగ్గర కష్టపడి స్పెషల్స్ చెయ్యక్కర్లేదు. నాకు హమ్మయ్య అనిపించింది. (నాకు వంట అంటే కొంచెం బధ్ధకమే అందుకన్నమాట.)

ఒక వేన్ మాట్లాడుకుని సరిగ్గా పొద్దున్న తొమ్మిదింటికి బయల్దేరదామనుకున్నవాళ్ళం అనుకున్నట్టే తొమ్మిదిన్నరకి ”జై భజరంగభళీ” అనుకుంటూ బయల్దేరాం.

గంటన్నర ప్రయాణించి అడంగు చేరాక గేటు దగ్గర తెలిసింది అక్కడ ఏదో బ్రిడ్జి కడుతున్నారనీ, వాహనాలన్నీ యాదగిరిగుట్టదాకా వెళ్ళి రావాలనీ.. మళ్ళి అంతదూరం వెళ్ళేక కళాధామం చేరేసరికి పదకొండు అవనే అయింది. పొద్దున్నే ఆదరా బాదరాగా ఇళ్ళల్లోంచి బయట పడ్డామేమో వేన్ ఆగగానే అక్కడే ఎవరి లంచ్ బాక్స్ వాళ్ళు విప్పేసాం.

ఇంక మొదలు. నువ్వేం తెచ్చేవంటే నువ్వేం తెచ్చేవంటూ చూసుకుని, ఒకరి దొకరు పంచుకుని, ఇదెలా చేసేరంటే, అదెలా చేసేరంటూ రెసిపీలు చెప్పేసుకుని, (రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదన్నట్టు), అందరం బాక్స్ లు ఖాళీ చెసెసాం. బిస్కట్ పేకట్లు, మంచినీళ్ళబాటిల్స్ తీసుకుని మేం కళాధామంలో అడుగు పెట్టేటప్పటికి సరిగ్గా పన్నెండు అయింది.

అబ్బ.. ఎంత బాగున్నాయో అన్ని బొమ్మలూ. బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం, గీతాప్రవచనం, క్షీరసాగరమథనం, కాళీయమర్దనం, ఇలాంటివి ఎన్నెన్ని పురాణగాథలో.. ఒకరికొకరం తెలీనివి చెప్పుకుంటూ, రామాయణం, భారతం, గిరిజాకల్యాణం లాంటి వెన్నో చూసుకుంటు వెడుతున్నాం.

ఎవరో అబ్బాయి. పాతికేళ్ళుండొచ్చు. ఒక బొమ్మ చూసి మమ్మల్ని వివరం అడిగాడు. అశోకవనం లో సీతాదేవితో రావణుడు మాట్లాడుతున్నప్పుడు చేతిలో గరికపోచ పట్టుకునుండడం చూసి ఏదో పెద్దవాళ్ళం, మాకు తెలుస్తుందని అలా ఎందుకు పట్టుకుందని అడిగాడు. అంతే..పాపం .మాకు బలయిపోయాడు. మేమందరం పొటాపోటీలుగా మాకు తెలిసిన పురాణకథలన్నీ చెప్పేసి, సీతాదేవి మహా పతివ్రత అనీ, రావణబ్రహ్మ అంతటి వాడిని గడ్డిపరకగా తీసి పడేసిందనీ, ఆ గరిక పోచని ఒక మీడియేటర్ లా వాడుకుందనీ ఇలా ఎన్నో చెప్పేసాం. పాపం ఆ అబ్బాయి మాకు మళ్ళీ కనపడలేదనుకోండి.

ఇలాగ మన పవిత్ర గాథలన్నీ చూసుకుంటూ, మధ్య మధ్యలో కూర్చుంటు , చివరికి కేంటీన్ దగ్గర అరగంట సెటిల్ అయిపోయి, మళ్ళీ ఆత్మారాముణ్ణీ తృప్తి పరిచి, పద్మవ్యూహం నుంచి బైట పడేటప్పటికి సాయంత్రం నాలుగయ్యింది. పక్కనే ఉన్న పంచముఖ ఆంజనేయస్వామిని దర్శించుకుని, తిరుగుప్రయాణం అయ్యేటప్పటికి అయిదు. ఇంటికి చెరేటప్పటికి ఆరున్నర. హమ్మయ్య. ఎంచక్కా వెళ్ళొచ్చాం అనుకుంటుండగానే మళ్ళీ చర్చలు.

ఇదసలు కార్తీకమాస వనభోజనాల లెక్క లొకె రాదనీ, కేవలం విహారయాత్రగానే అనుకోవాలనీ, ఎక్కడా ఉసిరిచెట్టుక్రింద భోజనం చెయ్యలేదు కనక మళ్ళీ మరోచోటికి ప్రోగ్రామ్ వెయ్యాలనీ అందరూ భావించారు. అందుకని మాకు మళ్ళీ వనభోజనాల ప్రోగ్రామ్ ఉంది కనక ఎవరైనా వచ్చేవాళ్ళుంటే చేతులెత్తొచ్చు...








Monday, October 26, 2009

ప్రేమలేఖ






అలల గోదారి కలలు కనమంటె

కలలొ నీరూపె కలత పెడుతుంటె

ఏమని రాసేది ఈ లేఖ

నా మది విప్పేటి ప్రేమలేఖ...


ఎదురుగా నీవె ఎదలొ నీవేలె

సుధలు కురిసేటి కథవు నీవేలె

మధురమైన మనసుతోనె

ఎదను తెరిచాను చదువుకోలేవ...


కనులలోన నీ బొమ్మ

కనబడునేమోనని

కాలమంత అద్దమెదుట

కదలకుండ గడిపాను


ఎదుట నీవు లేకుండా

బొమ్మ ఎలా వస్తుంది

మనిషి మనసు పిచ్చిది

వద్దన్నా వినని పసిది..


నా మనసు నీకు తెలియదా

మరి తెలిసి నీవు అడగవా

నీ జీవితం నను పంచుకొమ్మని

నా బతుకునే నీ కంకితమిమ్మని..


ఎందుకలా చూస్తావు

నిను మరిచిపొమ్మంటూ

మరవడమంటే మాటలా

మరణమే మేలు కదా..


మాటి మాటికీ మారే మనసులంటే

రాసి రాసి చెరిపేసిన పలకల్లాంటివి

కొత్తబొమ్మ పైన రాసినా

పాతబొమ్మ ఆనవాళ్ళు పట్టినట్టు తెలుస్తాయి..


నిన్న చూసా నీకోసం

నేడు కూడా రాలేదు సంతోషం

అంతే నోచుకున్నానా

చెప్పరాదా చివరికైనా....


Wednesday, October 7, 2009

తుళ్ళిపడకే చేపపిల్లా....


మరువం ఉష ప్రారంభించిన జలపుష్పాభిషేకానికి చంద్రునికో నూలు పోగులా నా భావనలు అందిస్తున్నాను. ఆత్రపడే చేపపిల్లకు మామూలు మాటలతో నాలుగు మంచి మాటలు చెప్పాలనే ప్రయత్నమే ఇది.





తుళ్ళిపడకే చేపపిల్లా

నీ తుళ్ళింత లిక ఆపవే
ముందరున్న సంద్రమంతా
కడు లోతైన వింతే కదే...

ఇప్పుడిప్పుడే ఈతలు కొడుతూ
ఆత్రపడిపోకె అందంగా
సొరచేపలు పెదచేపలు నీకై
నోళ్ళు తెరచినవె మందంగా...


ఎగిరి ఎగిరి పైకెగరాలని నువు

ఎగిరి పడిపోకె కెరటంలా
నీలిమేఘాల ఆకసము
నీకందనిదే అది చిత్రంగా..



మెరుపు వెలుగుల తారలతో
జతకట్టాలని నువ్వనుకుంటే
అవి మెరిసి మెరిసి నిను మురిపించి
నిను లెక్కచైక మరి పోవునులే...


ఒడ్డునున్న పూబాలలను
ముద్దాడాలని నువ్వనుకుంటే
ఒడ్డుకొచ్చిన చిన్ని నిన్ను
మరి మనిషి చూస్తే ప్రమాదమే...


వేసేస్తారు వలలు మరి
పట్టేస్తారీ దుర్మార్గులు
పెడతారు నిను గాజుతొట్టెలో లేదా
దాచుకుంటారు భద్రంగా తమ కడుపులో....


పెంచుకోవే తెలివి బాగా

నేర్చుకోవే నేర్పులు

ఎవ్వరైనా ఎప్పుడైనా నిను
పట్టకుండా ఒడుపులు...

నీకు నీవే తోడు నీడా
నీకు నీవే ధైర్యము
నీకు నీవే సరియైన జోడు
నమ్మకు ఎవరిని లోకంలో....








॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑



Thursday, October 1, 2009

మహిళాభ్యుదయానికి గాంధీజీ అందించిన సూచనలు








మహిళాభ్యుదయానికి గాంధీజీ ఇచ్చిన సూచనలు.




మహిళాభ్యుదయానికి గాంధీజీ అందించిన సూచనల గురించి తెలుసుకోవాలంటే ముందు మనం అభ్యుదయమంటే ఏమిటో తెలుసుకోవాలి. అభ్యుదయమంటే చీకటిలోనే మగ్గిపోకుండా ఎన్ని అవాంతరాలెదురైనా వెలుతురు వైపు సాగిపోవడం. అలాగ మహిళలు ప్రగతిపథం వైపు నడవడమే మహిళాభ్యుదయమంటే. మహిళలను అభ్యుదయపథం వైపు నడిపించడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేసారు. వారిలో ముఖ్యులైన వారిలో ఒకరు మహాత్మాగాంధీగారు. అసలు మహిళలను మరొకరు నడిపించవలసిన అవసరం ఎందుకొచ్చింది అంటే మనం చరిత్ర పేజీలు తిప్పాల్సిందే. గాంధీగారు స్వాతంత్రోద్యమం మొదలుపెట్టే సమయానికి మహిళల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఆయన నాయకత్వం చేపట్టిన సమయానికి స్త్రీల సగటు ఆయుర్దాయం కేవలం ఇరవైయేడు సంవత్సరాలు మాత్రమే. వైద్య సదుపాయాలు సరిగా లేకపోవడం వలన గర్భిణులు,శిశువుల మరణాలు చాలా ఎక్కువగా ఉండేవి. బాల్య వివాహాల వల్ల బాల వితంతువులు కుడా ఎక్కువగానే ఉండేవారు. కేవలం రెండు శాతం స్త్రీలు మాత్రమే ఏదోరకమైన చదువు చదువుకుని ఉండేవారు. వారికి కూడా స్వంత వ్యక్తిత్వమంటూ ఉండేది కాదు. కొన్ని ప్రాంతాల్లొ అయితే స్త్రీలలో పరదా ధరించే సాంప్రదాయం కూడా ఉండేది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే గాంధీగారు మహిళలకు గల శక్తిని గుర్తించి వారుకూడా ఏరకంగా చూసినా మగవారికి ఏవిధంగానూ తీసిపోరనీ, అన్నిరకాలుగానూ మగవారితో సమానులే అనీ తేల్చి చెప్పారు..కేవలం మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లోకూడా ఆచరించి చూపించారు.



స్వతంత్ర పోరాటానికి ఆయన పిలుపు నందుకుని వేలకొద్దీ స్త్రీలు, విద్యావంతులు, నిరక్షరాస్యులు, వివాహితులు, వితంతువులు, బాలికలు, వయసుమళ్ళినవారు అన్నిరకాలైన మహిళలూ ఇళ్ళలోంచి బయటకొచ్చారు. ఆయన ప్రణాళికలో స్వతంత్ర పోరాటమంటే కేవలం దేశాన్ని పరాయి వారి పరిపాలన నుండి తప్పించడమేకాదు. అది ఒక సామాజిక చైతన్యం కలిగి స్వతంత్ర భారతం ఆర్ధికంగా తనని తాను సమగ్రంగా అభివృధ్ధి పరచుకోవాలన్నదే ఆయన ఆశయం. స్వతంత్రోద్యమ ప్రణాళికలో ఆయన మహిళాభ్యుదయాన్ని కూడా ముఖ్యమైన అంశంగా చేర్చారు. రాజకీయంగానేకాకుండా ఆర్ధికంగా, సామాజికంగా కూడా సమాజంలో సంస్కరణలు రావాలని ఆయన ఆశించారు. అప్పటి ఆయన ఆశయ ఫలితమే మనకి స్వతంత్రం రాగానే విధమైన పోరాటాలూ లేకుండా దేశం లోని ప్రతి వ్యక్తికీ, మహిళలతో సహా ఇరవై ఒక్క సంవత్సరాల వయసు రాగానే ఓటు హక్కు వచ్చేసింది. కొన్ని దేశాల్లో లాగా దీనికోసం స్త్రీలు ఉద్యమించడానికి అవసరం లేకపోవడానికి కారణం పూర్తిగా మహాత్ములే. కేవలం ఆయన స్వతంత్ర పోరాటంలో స్త్రీలను సమానంగా భావించినందువల్లే రాజ్యాంగంలొ మహిళలకి ఓటు హక్కు ప్రాధమిక హక్కుగా సంక్రమించిందని చెప్పుకోవచ్చు.























సమాజంలో చాలా రకాలైన అసమానతలున్నాయి. ఇన్ని అసమానతలున్న సమాజాన్ని ఆదర్శవంతమైన సమాజంగా మార్చడానికి పురుషుల కన్న స్త్రీలే సమర్ధులని బాపూజీ విశ్వసించారు. ఇంకా చెప్పవలసివస్తే పురుషులు శారీరకంగా స్త్రీలకన్న బలవంతులయి ఉండవచ్చు కాని నైతికంగా మగవారికన్న మగువలే శక్తివంతులు అని తేల్చి చెప్పారు. సేవ చెయ్యడానికైనా, త్యాగం చెయ్యడానికైనా పురుషుడు స్త్రీ ముందు నిలబడలేడని స్పష్టం చేసారు. దానికోసం ఆయన ఆయన జీవితాన్నే ఉదాహరణగా చూపించారు.

మనందరికీ తెలుసు. కేవలం అహింస అనే ఆయుధం తోనె మహాత్ములు బ్రిటిష్ వారినించి మన దేశాన్ని స్వతంత్రం చేసారు. అహింస ను ఆయన తన భార్య కస్తూర్బా నుంచి నేర్చుకున్న దని పంతొమ్మిదివందల ముఫ్ఫైయెనిమిదవ సంవత్సరంలో డిసెంబర్ లో వచ్చిన హరిజన్ పత్రికలో గాంధీగారే ఇలా రాసారు.




"అహింస గురించి నేను నా భార్య ద్వారా తెలుసుకున్నాను. నేను చెప్పిన పనే చెయ్యాలని నేను నా భార్యని బలవంతపెట్టినప్పుడు, నేను చెప్పిన పని చెయ్యడం ఇష్టంలేక పని చెయ్యకూడదనే ఆవిడకు వచ్చిన స్వతంత్రమైన బలమైన భావం ఒకవైపు, నా మూర్ఖత్వానికి లొంగిపొవలసి వచ్చినందుకు ఆవిడ పడే బాధ మరో వైపు ... రెండూ నన్ను ఆలోచింపచేసాయి. ఆలోచనే నేను నా భార్యని శాసించడానికి మాత్రమే పుట్టలేదనే ఒక భావన కలిగింది. ఈసత్యం గుర్తించాక అహింసా విధానాల్లో ఆమె నాకు గురువుగా మారింది."

అలాగ ప్రతి చిన్న విషయాన్నీ గాంధీగారు స్వయంగా ఆచరించి మరీ చెప్పేవారు. మహిళా భ్యుదయమంటే మహిళలు వంటింట్లోనే మగ్గిపోకూడదనీ, జాతీయ కార్యక్రమాల్లో కూడా వారు చురుగ్గా పాల్గోవాలనీ ఆయన అస్తమానం చెపుతూండేవారు.




గాంధీగారికి మహిళల మీద ఎంత నమ్మకమో మనకి కమలాదేవి చటోపాధ్యాయ్ గారి మాటల వల్ల స్పష్టంగా తెలుస్తోంది. అవి ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న రోజులు. అసహాయురాలైన మహిళలు చక్కటి శిక్షణ పొందిన సైనికులుగా మారిన రోజులు. మొత్తం ప్రపంచమంతా భారతదేశంవైపు ముఖ్యంగా బక్కమనిషివైపు చూపు సారించిన రోజులు. సమయంలో హిందూదేశంలొని మహిళలకు దండియాత్రలో పాల్గొనడానికి రమ్మని పిలుపు నివ్వమని కమలాదేవి గాంధీగారిని వేడుకున్నారుట. దానికి ఆయన "వారికి నా దగ్గర్నించి ప్రత్యేకంగా పిలుపు నివ్వాలని నువ్వెందుకు అనుకుంటున్నావు?" అని అడిగారుట. దానికి కమలాదేవి ఇలా చెప్పారుట.. "ఎందుకంటే వారికి దండియాత్ర గురించి తెలిసుండకపోవచ్చు. వాళ్ళింకా ఇళ్ళల్లోనే మగ్గిపోతుండొచ్చు. మీరు కనక వారికి ప్రత్యేకంగా విషయం తెలియపరచకపోతే వారి మొత్తం జీవితానికే ఎంతో అద్భుతమైన దండి యాత్రలో పాలు పంచుకునే అదృష్టాన్ని పోగొట్టుకుంటారు. అందుకని దయచేసి వాళ్ళకి మీరు పిలుపు నివ్వండి." అని వేడుకున్నారుట. అప్పుడు ఆయన "ఒకవేళ అదే కనక నీ అభిప్రాయమైతే నీ చెల్లెళ్ళ గురించి నీకేమీ తెలీదనే అనుకోవాలి" అని నవ్వుతూ, ప్రత్యేకంగా ఏమీ రాయకుండానే వార్తను పంపించారుట.


అద్భుతమయిన రోజు. మహాత్మా గాంధీ దండిలో ఉప్పు తయారు చేసిన రోజు. చాలా ఉత్తేజకరమైన సంఘటనలు జరిగాయి. అందులో ముఖ్యమైనది మహిళలు అత్యుత్సాహంతో యాత్రలో ముందు వరసలో నిలిచి, పాలు పంచుకోవడం. నిజంగా అదొక అద్భుతమైన దృశ్యమనే చెప్పాలి. ఎందుకంటే సోగ కళ్ళతో, గులాబీరంగు బుగ్గలతో, పట్టుపరదాల వెనుక సుకుమారంగా పెరిగిన స్త్రీలు, ఎన్నడూ వీధిలోనికే రాని అసూర్యంపశ్యలు, కొత్తవారి యెదుట పడనివారు, పరదాలను చీల్చుకుని, నడి వీధిలో యుధ్ధాని కొచ్చినట్టు వచ్చి నిలబడ్డారు. తివాసీల మీద నడిచే సుకుమారమయిన పాదాలు కరకురాళ్ళ దారుల్లో నడిచాయి. చక్కని వంటి ఛాయ కనుమరుగయి శరీరం గాయాలతో రక్తసిక్తమైంది. చవులూరించే విందులారగించేవారు జైల్లొ పెట్టే ఎండిపోయిన రొట్టెలతో కడుపులు నింపుకున్నారు. పేద, గొప్ప అని తేడా లేకుండా, పెద్ద, చిన్న అని వయసు చూసుకోకుండా ఎందరో మహిళలు ఒక్కసారిగా నా ఇల్లు, నాది అన్న భావం పోగొట్టుకుని, దేశస్వతంత్రం కోసం నానాకష్టాలూ పడి, ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వారి జీవితాలకి కొత్త అర్ధం కల్పించుకున్నారు. అత్యంత సమర్ధవంతంగా నాయకత్వం వహించి, ఎంతో సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు. తలుపు చాటునుండే తరుణులు నేతలయ్యారు. వారు ఉప్పు సత్యాగ్రహం ఎంతో సమర్ధవంతంగా నిర్వహించి గాంధీజీ ఆశయాల్ని నిజం చేసారు. ముఫ్ఫైవేలమంది పాల్గొన్న యాత్రలో పదిహేనువేలమంది మహిళలేనంటే మన ఒళ్ళు గగుర్పొడుస్తుందికదా.. ఇవన్నీ వాళ్ళకేవీ ఊరికే రాలేదు. వాళ్ళు దెబ్బలు తిన్నారు జైళ్ళకెళ్ళారు. మాటలు పడ్డారు. వాళ్ళ జీవితాలనే పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపించారు. మహాత్ములే స్వయంగా చెప్పారు. " పోరాటంలో మహిళలు పొషించిన పాత్రని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలి" అని.




స్వతంత్ర పోరాటం కోసం బాలికలు, మహిళలు వారి ఒంటి మీదున్న నగలన్నీ ఒలిచి, గాంధీగారి ఒడిలో పోసారని వేరే చెప్పాలా.. మన ఆంధ్రదేశంలో ఎందరో మహిళలు గాంధీగారి పిలుపుకి స్పందించారు. మొన్నమొన్నటిదాకా మన కళ్ళముందున్న దుర్గాబాయమ్మగారిని మనం ఎలా మరిచిపోగలం? ఆవిడ చిన్నతనం లోనే చేతికున్న బంగారుగాజులని వేరే ఆలోచనే లేకుండా గాంధీగారి జోలెలో వేసేసారుట. ఆయన ఆశయాలకి అనుగుణంగానే దుర్గాబాయమ్మగారు స్త్రీల అర్ధిక, సామాజిక, నైతిక అభివృధ్దికోసం ఎన్నో సంస్థలు మొదలుపెట్టి, విజయవంతంగా నడిపించారు. ఇప్పటికీ అవి నడుస్తూనే ఉన్నాయి. ఇటువంటి మహిళాభ్యున్నతినే మహాత్ములు కొరుకున్నది. మహిళాభ్యున్నతి లెనిదే దెశాభ్యున్నతి లేదనే గాంధీగారిమాట ఎంత సత్యమో దీని వలన తెలుస్తోంది కదా. అదే ఆస్ఫూ ర్తే గాంధీగారు మన నించి కోరుకున్నది. మనకి కావలసింది ఎవరూ ఇవ్వరు. దానికోసం పోరాడి మనలని మనమే ఉధ్ధరించుకోవాలని ఆయన అభిప్రాయం. బాగుపడాలనే ఆలోచన మనిషిలో ఉండాలి కాని మరొకరు వచ్చి ఎందుకు చేస్తారని ఆయన ఉద్దెశ్యం. దీని గురించే గాంధీగారితో సన్నిహితంగా మెలిగే రాజకుమారి అమృతకుమారకౌర్ గారు ఇలా చెప్పారు. ఒకసారి గాంధీగారు ఒక కార్యక్రమానికి ప్రణాళికను సిధ్ధంచెసుకుంటున్నారుట. పంతొమ్మిదివందల నలభైఒకటిలో సేవాగ్రాం నుంచి వర్దోలీ కి వెడుతూ రైల్లో దాన్ని రూపొందిస్తున్నారు. అప్పుడు మహాత్ములతో రాజకుమార్ అన్నారుట.. " కార్యక్రమంలో ఒక అంశం మనం మహిళలను ఎలా పైకి తీసుకురావడం అనే విషయం గురించి చర్చించడం..అన్నది ఎంతటి విషాదమైన విషయమో కదండీ.." అని. అంటే దాని కాయన అన్నారుట.." అవును, విచారించదగ్గ విషయమే. అంటరానితనం లాంటిదే ఇది కూడా. " అన్న వారి మాటలను వింటే మనం ఎటువంటి స్థితిలో్ వున్నామో ఆయన చెప్పకనే చెప్పారనిపిస్తుంది.




మన సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ బాగా వ్యాపించివుండడమే కాదు. బాగా పాతుకుపోయివుందికూడా.. సమాజంలో ఒక వర్గాన్ని అభివృధ్ది పరిచినట్టు స్త్రీల హోదాని, స్థానాన్ని ఒక్కసారిగా పెంచలేము. దీనిలో చాలా మానసిక పరిమితులున్నాయి, పితృస్వామ్యం గురించి, పురుషాధిక్యత గురించి, స్త్రీల పట్ల జరిగే హింస గురించి సమాజంలో చాలా లోతైన భావాలు పాతుకుపోయి వున్నాయి. మన సమాజంలో అసలైన మార్పు రావాలంటే మనకి ఓపిక ఉండాలి. బాధ పెడుతున్నవారు, బాధ పడుతున్నవారు.., ఇద్దరి మానసిక స్థితిలొనూ మార్పు రావడానికి సమయం పడుతుంది. అదే మాట గాంధీగారు కూడ చెప్పారు. "అసలైన మార్పు నీలోంచి రావాలి. ఒత్తిడులకి లొంగి కనక మారితే మార్పుకి అసలు సార్ధకతే లేదు" అంటూ ఆయన మార్చి,ముఫ్ఫైఒకటి, పంతొమ్మిదివందల నలభైయ్యారు లో వచ్చిన హరిజన్ పత్రికలో రాసారు.

మహిళల గురించి మహాత్ములు చెప్పిన ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క వజ్రపు తునక. మనకెంతో స్ఫూర్తిదాయకంగా వుండే మాటలని మరోసారి తల్చుకుందాం. మహిళల గురించి వారికి ఎంతటి ఉన్నత భావాలున్నాయో మాటల వల్ల తెలుస్తుంది.
అందులో మొదటిది.....
సత్యం, అహింస అన్న విషయాలు తెలుసుకోవడానికైనా, చెప్పడానికైనా, ఆచరించడానికైనా సరే పురుషునికన్న స్త్రీలే సరైనవారు. జాలి, కరుణ, దయ, సాటి మనిషిని ప్రేమించడం అన్నవి మమతానురాగాలు గల మహిళా హృదయాలకే చెల్లుతుంది.

రెండోది.. ఎటువంటి పరిస్థితుల నో నైనా సరే స్త్రీ పురుషునికి బానిస కాదు. పురుషునికన్న ఏవిషయం లోనూ తక్కువా కాదు.

మూడోది.. స్త్రీ సమానమైన తెలివితేటలతో పురుషునితో సహచరిగా ఉండదగలిగిన సత్తా కలది అన్నారు.

నాలుగోది.. ఒకవేళ నైతికంగా కనక తీసుకుంటే మహిళ మగవారి కన్న ఎంతో ఉన్నతురాలు.

అయిదోది...అహింస అనే ఆయుధాన్ని ధరించి కనక పోరాటం సాగిస్తే దానికి సరైన సారధులు మహిళలే నని, భవిష్యత్తంతా వారి తోనే వుందనీ చెప్పారు.

ఆరోది... ఆత్మార్పణ చేసుకోగల శక్తి పురుషులతో సమానంగా స్త్రీలకీ ఉంది. కాని దురదృష్టకరమైన విషయం ఏమిటంటే పురుషులలో పైకి కనపడే శక్తి అంతర్గతంగా తమలోనూ దాగి వుందని మహిళలకే తెలీకపోవడం.

ఇవన్నీ ఒక్కొక్కటీ వింటుంటే మనకెంతో ఉత్తేజం కలుగుతోందికదా.. తలుపు చాటునుంచి బైటకురాని తరుణు లున్న రోజులలో మహిళల గురించి మహాత్ములు ఎంత ఉన్నతంగా ఆలోచించేరో కదా.

ఇవే కాక గాంధీగారు ఎంతో్ఇష్టపడే మరో విషయం సేవ చెయ్యడం. అందరూ సేవాభావం కలిగి ఉండాలని చెప్పేవారు. స్వఛ్ఛందసంస్థల నెన్నింటినో ఆయన స్థాపించారు. సమాజంలో ఎన్నో అసమానతలున్నా కూడా స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అన్న విషయం మటుకు మరవలేనిదిగా చెప్పారు. ఆయన తలపెట్టిన ప్రతి కార్యక్రమంలొను మహిళలకు సమాన స్థాయి కల్పించారు. సబర్మతి అయినాసరే సేవాగ్రామ్ అయినా సరే మన చుట్టూ ఇంకెక్కడా కనపడని ఒకరకమయిన స్వతంత్రం, ఆత్మ విశ్వాసం అక్కడి స్త్రీలలో మనకి కనపడేవి.





ఎప్పుడైతే గాంధీగారు నూలు వడకడాన్ని ఒక సంప్రదాయంగా చేయదలచుకున్నారో అప్పుడే ఆయన ఆపని చక్కగా చేసేది మహిళలే అని చెప్పారు. అది వారికి జీవనాధారమని తెలుసు. అందుకే మహిళల పురోగతి కోసమే ఆయన దానిని పునరుధ్ధరించారు. ప్రతి పెరట్లోనూ ఒక తులసి చెట్టు ఉన్నట్టే ప్రతి ఇంట్లోనూ ఒక రాట్నముండేది. మహాత్ములు చెప్పిన ఆదర్శాలు కాలంతో చెల్లిపోయేవికాదు. అవి నిత్య సత్యాలు.

స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా మన సమాజంలొ సమస్యలు అలాగే ఉన్నాయి. అప్పటికన్న ఇంకా వెర్రితలలు వేసాయి. సాంఘిక అసమానతలు, అనైతికత్వం, అవినీతి, స్త్రీల పట్ల భేదభావం, మద్యపానం, వరకట్నం, బాలకార్మికులు వంటి సమస్యలు, ఇంకా కొత్తవీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిని తొలగించడం అన్నది చట్టం వల్లా సాధ్యం కావటంలేదు. దానికి ప్రజల్లోంచి చైతన్యం రావాలి. ప్రజలంటే ఎవరు? గాంధీగారు చెప్పిన ప్రకారం ఉద్యమాన్నైనా నడిపించే శక్తి మహిళలకే ఉంది. మనల్నెవరూ పిలవక్కర్లేదు. మనమే వెడదాం. కలిసి పోరాడదాం. మహిళలపై మహాత్ముడు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడదాం. ఏది చెయ్యాలన్నా మనమే చెయ్యగలం. విద్యావంతులమయ్యాం. ఉద్యోగినులమయ్యాం. రాజకీయాల్లోనూ మన ప్రతిభ చాటుకుంటున్నాం. స్వార్ధమనేదాన్ని విడిచిపెట్టి మహాత్ములు ఎంతో ఇష్టపడ్డ సేవాకార్యక్రమాన్ని మనం చేయలేమా.. ఏదైనా మనమే చెయ్యగలం. నీ చుట్టూ ఉన్న ముళ్ళ పొదల్ని నరికివెయ్యి. చక్కని సువాసనలు వెదజల్లే పూలమొక్కలు నాటు. అంతా నీ చేతిలో పనే. నీకు సాధ్యంకానిదేదీలేదు. ఇందుకు తార్కాణం మన వెనుకటితరం వారు. వాళ్ళు మహాత్ముని పిలుపు నందుకుని , స్వార్ధాన్నివదిలి, జైళ్ళకెళ్ళి, ఉద్యమాల్లో జీవించి తెచ్చిన స్వతంత్రాన్నిమనం పరిరక్షించుకుందుకు, ఆమహాత్ముడు ఆశించిన ఆదర్శరాజ్యం తేవడానికి మనల్నెవరూ బొట్టుపెట్టి పిలవక్కర్లేదు.

రండి..... కదలిరండి....... కలిసి నడుద్దాం....మహాత్ముడు సూచించినటువంటి మహిళాభ్యుదయం వైపు. అడ్డంకులను తొలగించుకుంటూ, సమానత్వాన్ని చాటుకుంటూ మనము ఏదైనా సాధించగలమని సమాజానికి చేసి చూపిద్దాం...











---------------------------------------------------------------