skip to main |
skip to sidebar
24-6-2017 నవ్య వారపత్రికలో ప్రచురించబడిన నా కథ "నీ కోసమె నే జీవించునదీ.."
అలుపెరుగని ఆలోచనాస్రవంతి...
Pages
Friday, June 30, 2017
నీ కోసమె నే జీవించునదీ..
24-6-2017 నవ్య వారపత్రికలో ప్రచురించబడిన నా కథ "నీ కోసమె నే జీవించునదీ.."
నీకోసమె నే జీవించునదీ..
ఆరెకరాల్చేనిస్తా
- అంటుమామిడి తోపిస్తా--పోయమ్మా నా కూతురా - పోయింటికి
కీర్తితేవమ్మా
ఆరెకరాల్చేనిస్తా
- ఆవులప్పను నీజతకిస్తా--పోయమ్మా నాకూతురా - పోయూరికి కీర్తితేవమ్మా
పోనమ్మా
నేను పోనమ్మ - పోతే తిరుగుట లేదమ్మా--
పోనమ్మా నేను పోనమ్మ - పోతే
తిరుగుట లేదమ్మా
ఆరుమంది
అన్నగార్లూ - కడగొట్టోడే గంగులప్ప--వానికి నాకు కాదమ్మా - పోనమ్మ
నేను పోనమ్మా
ఏడుమందే
అక్కసెల్లెళ్లు - కడగొట్టుదీ కమలమ్మ-- దానికి నాకు కాదమ్మా - పోనమ్మా
నేను పోనమ్మా
నాగర
బిళ్ల సేపిస్తా - నాగులప్పను నీజతకిస్తా--పోయమ్మ నాకూతురా - పోనమ్మా నేను పోనమ్మా.
మంద్రస్వరంలో తనలోతనే తాదాత్మ్యం చెందుతూ పాడుకుంటున్న జానపదగీతాన్ని గదిలోకి యెవరో వచ్చిన అలికిడవడంతో
పాట ఆపేసి ఉలికిపాటుగా కళ్ళు
తెరిచాడు గురుమూర్తి. ఎదురుగా తననే తదేకంగా చూస్తున్న
మధుని చూడగానే కాస్త తబ్బిబ్బయ్యాడు.
మధు చిన్నగా నవ్వుతూ తండ్రి పక్కకెళ్ళి కూర్చుని, “ఈ పాటంటే అమ్మకి
ఇష్టం కదా నాన్నా..” అన్నాడు.
తలూపాడు నెమ్మదిగా గురుమూర్తి. తండ్రి చెయ్యి తన
చేతిలోకి తీసుకుంటూ.. “ఇవాళ యేమైనా సరే
నువ్వు నాకు అమ్మ గురించి
చెప్పి తీరాల్సిందే..” అన్నాడు మధు.
చిన్నగా
నిట్టూర్చాడు గురుమూర్తి. “కొత్తగా యేముంది చెప్పడానికి..
నీకూ తెలిసిందే కదా.. మీ అమ్మకి
అత్తారింటికి రావడం కుదరదు. అంతే..”
“అదే
యెందుకు?” కాస్త
గట్టిగా అడిగాడు.
“వాళ్ల
వూర్లో ఆడపిల్లలు అత్తారింటికి వెళ్లరుట. ఉహూ.. ఆ గ్రామదేవత
ఆ వూరి ఆడపడుచులని గ్రామం
దాటి పోనివ్వదుట. అందుకే యెంత రావాలనుకున్నా మీ
అమ్మ రాలేకపోయింది..”
తల పట్టుకున్నాడు మధు. “ఈ మాట
నా చిన్నప్పట్నించి నువ్వు చెపుతూనే వున్నావు.. నేను వింటూనే వున్నాను.
ఇప్పుడు నాకు పాతికేళ్ళు.
చదువైపోయింది. ఉద్యోగంలో జేరబోతున్నాను. ఇంకా నన్ను మభ్యపెట్టాలని
చూడకు. అసలు నీకూ, అమ్మకీ
మధ్య యేం జరిగిందో ఇవాళ
నువ్వు చెప్పవలసిందే..” స్థిరంగా అన్నాడు మధు.
మౌనంగా
వుండిపోయాడు గురుమూర్తి. ఇంకిలా లాభంలేదని మధు నెమ్మదిగా అడగడం
మొదలుపెట్టాడు. “నాన్నా.. ఇదివరకు యెన్నిసార్లు అడిగినా చెప్పలేదు.. మీ ఇద్దరిలో యెవరికైనా
ఇష్టం లేకుండా మీ పెద్దవాళ్ళు మీ
పెళ్ళి చేసారా..?”
“అహా..
కాదు..కాదు. మాది లవ్
మేరేజ్..” ఒక్కసారి యెన్నాళ్ళుగానో మనసులో దాచినదానిని బైటకి వెళ్లగక్కాడతను.
“వ్హాట్..?”
తెల్లబోయాడు మధు. నెమ్మదిగా చెప్పడం
మొదలెట్టాడు గురుమూర్తి.
“మీ
అమ్మా, నేనూ కాలేజీలో కలిసి
చదువుకున్నాం. మా నాన్నగారిది ఎక్కువగా
బదిలీలయ్యే ఉద్యోగం అవడం వల్ల నేను
కాలేజీ హాస్టల్లో వుండేవాడిని. మీ అమ్మావాళ్లది గోదావరి
జిల్లాల్లోని ఓ మారుమూల గ్రామం. మీ
అమ్మ హైస్కూల్ చదువు కూడా రోజూ
నాలుగుమైళ్ళు నడిచివెళ్ళి, ఆ చుట్టుపక్కల మూడునాలుగు
జిల్లాలకి ఒక్కటే వున్న పక్కనున్న హైస్కూల్
లో చదువుకుందిట. ఇంక కాలేజీకి రాజమండ్రీ
హాస్టల్లో వుండక తప్పలేదు. అక్కడే
మాకిద్దరికీ పరిచయం కలిగి, పెళ్ళికి దారితీసింది.”
“మీ
పెళ్ళికి పెద్దవాళ్ళు వొప్పుకోలేదా..?” మధ్యలో ఆతృతగా అడిగాడు మధు.
“ఉహూ..
కాదు. పెద్దవాళ్లకి చెపితే వొప్పుకోరేమోనని స్నేహితులసాయంతో యిద్దరం రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళి చేసుకున్నాం.”
“మరి
తర్వాత బలవంతంగా వాళ్లవాళ్ళు తీసికెళ్ళిపోయేరా అమ్మని?” పల్లెటూరిలో బాగా వుండే
పట్టుదలల గురించి విన్న మధు అడిగాడు.
తల అడ్దంగా వూపాడు . “ఉహు.. కాదు. తర్వాత
తెలిసాక కూడా రెండువైపులవాళ్ళూ యేమీ
అభ్యంతరం చెప్పలేదు. అప్పటికే మనవడు పుట్టబోతున్నాడని తెలిసి
అందరూ చాలా సంతోషపడిపోయారు కూడా..”
వింటున్న మధుకి సందేహం పోలేదు.
గురుమూర్తి కొనసాగించాడు.
“నువ్వు
పుట్టినప్పుడు ఆ మారుమూల వూళ్ళో
సదుపాయంగా వుండదని మీ అమ్మమ్మా, తాతగారూ
కూడా రాజమండ్రిలోనే వుండి, పురుడుపోసారు. తర్వాత మా యిద్దరికీ పరీక్షలు
దగ్గరకొచ్చాయి. అదవగానే ఇద్దరం వుద్యోగాలవేటలో పడ్దాము. యెప్పుడైనా మీ అమ్మకి వాళ్ల
వూరు గుర్తొస్తే వెళ్లలేకపోయినందుకు బాధపడేది. పోనీ తనని కొన్నాళ్ళు
వెళ్ళిరమ్మన్నా వొప్పుకునేది కాదు. పైగా వాళ్ల
వూరు గురించి చిత్రమైన కథ చెప్పి, తనొక్కసారి
ఆవూరు వెడితే ఆ గ్రామదేవత మళ్ళీ
తనని అత్తారింటికి పంపదని చెప్పేది. కానీ.. చివరికి అదే నిజమైంది.. ఆ
గ్రామదేవత మీ అమ్మని ఇప్పటిక్కూడా
వూరు కదలనివ్వటంలేదు. లేకపోతే మీ అమ్మ నన్ను
విడిచివుండే మనిషికాదు” గొంతు గద్గదమైంది గురుమూర్తికి.
వింటున్న మధు స్థాణువయ్యాడు.. యేమిటిది..
అసలేమైనా నమ్మశక్యంగా వుందా.. ఈరోజుల్లో కూడా ఆ వూరి
ఆడపిల్లలని అత్తారింటికి వెళ్ళనివ్వదా ఆ గ్రామదేవత.. మనం
యిరవైయ్యొకటవ శతాబ్దంలో వున్నామా.. లేక క్రీస్తుపూర్వంలో వున్నామా..
మధు ఆలోచనని తెలుసుకున్నట్టుగా అతని చెయ్యి తన
చేతిలోకి తీసుకుని గురుమూర్తి ఇలా చెప్పసాగాడు.
“అందుకే యెన్నిసార్లు
మీ అమ్మమ్మా, తాతగారూ రమ్మన్నా కూడా మీ అమ్మ
నన్ను విడిచి ఒక్కత్తీ ఆ వూరు వెళ్లననేది.
ఆ ఊరి గ్రామదేవత మీద
అంత నమ్మకం మీ అమ్మకి. కానీ, అప్పుడొకసారి దాదాపు
అక్కడి రెండుమూడు జిల్లాల్లోని జనాలు తీవ్రమైన అంటురోగం
పాలపడ్దారు. మీ
అమ్మమ్మకీ, తాతయ్యకీ కూడా అది అంటుకున్నట్టు
తెలిసింది. సరైన వైద్యసదుపాయం అందేలోపు
ఆ అంటురోగానికి బలై చాలామంది మృత్యువాత
కూడా పడ్దారని విన్న మీ అమ్మ
తనవాళ్లని చూడాలనుకుంది. పెళ్ళైన
నాలుగేళ్ళకి అక్కడ వాతావరణం బాగులేదని,
చిన్నవాడవైన నిన్ను తీసికెళ్ళడం మంచిదికాదని, మా అమ్మానాన్నా ఆసమయానికి
యిక్కడే వుండడంతో నన్ను
నిన్నూవదిలి ఒంటరిగా పుట్టింటికి వెళ్ళింది. అంతే.. మళ్ళీ ఆ గ్రామదేవత
మీ అమ్మని అత్తారింటికి రానివ్వలేదు..”
తండ్రి
చెప్పినదంతా ఓపిగ్గా విన్న మధు చివరిమాట విని మళ్ళీ చిరాకుపడ్డాడు.
“మీరు
మరీ చెపుతారు నాన్నా.. పోనీ.. మీరైనా వెళ్ళి తీసుకురావచ్చుకదా అమ్మని..”
“ఇంత చెప్పినా నీకు
తెలీలేదా.. యెవరెళ్ళినా ఆ ఊరి ఆడపిల్లలు
ఆ వూరి పొలిమేర దాటలేరు.
అందుకే మీ అమ్మ నన్ను
అక్కడికి అస్సలు రావద్దంది.”
“పోనీ..
యిన్నేళ్ళనుంచీ ఒక ఉత్తరంకానీ, ఫోన్
కానీ కూడా చెయ్యొద్దందా ఆ
గ్రామదేవత..” వెటకారంగా అడిగాడు మధు.
“యేమో
మధూ, ఆ దేవత మీద
మీ అమ్మకి చాలా నమ్మకం. మీ
అమ్మ యిక్కడికి కాపరానికి రావడం వల్లనే మీ
అమ్మమ్మగారు, తాతగారు పోయారని పూర్తిగా నమ్మిందిట. అందుకని నాతో సంబంధాలు పెంచుకుంటే
నీకూ నాకూ యే ప్రమాదం
వస్తుందోనని భయపడిపోయిందిట. అందుకే మీ
అమ్మ ఉత్తరాలు రాయొద్దనీ, ఫోన్లు చెయ్యొద్దనీ నా దగ్గర మాట
తీసుకుంది. మీ అమ్మ కిచ్చిన
మాటని యెలా దాటగలను చెప్పు..?”
తండ్రి
మాటలకి జుట్టు పీక్కున్నంత పని చేసాడు మధు.
“పోనీ..
ఆ వూళ్ళో తెలుసున్నవాళ్ళెవరైనా వుంటే వాళ్ళని అడగొచ్చుగా..
అమ్మ యెలా వుందో.. యేంటో..”
“ఆ
మధ్యవర్తే చెప్పాడీమాట. ఆ పక్కవూళ్ళోనే జిల్లాపరిషత్
ఆఫీసులో పనిచేస్తున్న రామ్మూర్తిగారి చేత మీ అమ్మ
ఉత్తరం రాసి పంపింది. అ
ఉత్తరంలో ఆ వూరి కట్టుబాట్లని
వివరంగా రాయడమే కాకుండా మరోసారి స్వయంగా ఆయనచేత చెప్పించింది. ఉత్తరం రాయడంకానీ, ఫోన్ చెయ్యడం కానీ
చేస్తే తను చచ్చినంత వొట్టని
ఆ ఉత్తరంలో తనమీద వొట్టు పెట్టుకుంది
మీ అమ్మ. మీ
అమ్మ అంత వొట్టు పెట్టుకున్నాక
నేనింక యేం చేస్తాను చెప్పు. అందుకే
నేను మళ్ళీ వెళ్ళలేదు. నీమీదే
పంచప్రాణాలూ పెట్టుకుని యిన్ని సంవత్సరాలూ గడిపాను. కానీ
యిన్ని సంవత్సరాలూ మీ అమ్మని తల్చుకోని
క్షణం లేదు. ” గొంతు గధ్గదమయింది గురుమూర్తికి.
నోటమాటరాక
కూర్చుండిపోయిన మధుని చూస్తూ, “మీ
అమ్మంటే నాకు ప్రాణం. ఆమె
గీత గీచిందంటే దాన్ని దాటే సాహసం చెయ్యను.
ఆ వూరిలోనైనా ఆమె బ్రతికుందనే నమ్మకంతోనే
నేనింకా యిలా ప్రాణాలతో వున్నాను.
ఆమె లేనినాడు నేనూ లేను. మేమిద్దరం
చావులో కూడా విడిపోకూడదని ప్రమాణాలు
చేసుకున్నాం. మా మధ్య వున్న
మానసికబంధం అంత గట్టిది.”
తండ్రి
చెప్పినదంతా సావధానంగా వింటున్న మధు “యిన్నాళ్ళూ యెందుకు
చెప్పలేదు మీరు? ఈ సంగతి
యిదివరకే చెపితే అప్పుడే తేల్చేసేవాడిని అసలు సంగతేవిటో.
యెప్పుడడిగినా అమ్మ రాదు అంటుంటే
అమ్మకి రావడం ఇష్టం లేదేమో
అనుకునేవాడిని. ఇవాళే
వెళ్ళి అసలు అమ్మ యెందుకు
రాలేదో కనుక్కుని దగ్గరుండి తీసుకొస్తాను.” అన్నాడు.
“వద్దు..
వద్దు. దేవత కాదన్నది చెయ్యకూడదు.
అది కుటుంబానికి చాలా కీడు చేస్తుంది..
అమ్మకీ, నీకూ యేమైనా అయితే
నేను తట్టుకోలేనురా,,” ఖంగారుగా అన్నాడు గురుమూర్తి.
“ మీరు
మరీ నాన్నా.. అంటే యిన్నేళ్ళనుండీ ఆ
ఊరు నుండి యే ఆడపిల్లా
అత్తారింటికి వెళ్లలేదంటారా..” నమ్మశక్యంకాదన్నట్టు అన్నాడు మధు. గురుమూర్తి
యింకా యేదో చెప్పబోతుంటే తన
మాటని సమర్ధించుకుంటూ “పోనీ.. అమ్మ యిక్కడికి రాకపోతే నేనైనా
వెళ్ళి అమ్మని చూసొస్తా నాన్నా.. మిమ్మల్ని రావద్దంది కానీ అమ్మ నన్ను
రావద్దనలేదుగా..” అన్నాడు మధు. కొడుకు
మాటకి యేమీ సమాధానం చెప్పలేకపోయాడు
గురుమూర్తి.
మధుకి
ధైర్యం వచ్చింది. “అవును నాన్నా, నేను
జాబ్ లో జేరడానికి యింకా
వారం టైముంది. హైద్రాబాదు నుంచి నిడదవోలు వెళ్లడానికి
ఒక్కరాత్రి చాలు. ఆ పక్కనే
కదా ఈ ఊరు. వెళ్ళి
ఒక్కసారి అమ్మని చూసి వచ్చేస్తా నాన్నా.”
తండ్రి చేతి మీద చెయ్యి
వేసి బతిమాలుతున్నట్టు అడిగాడు మధు. గురుమూర్తి
ద్రవించిపోయాడు. పాపం..
మూడేళ్ళప్పుడు వీడిని
విడిచివెళ్ళింది మంగళ. అప్పట్నుంచీ యెప్పుడు
అమ్మ గురించి అడిగినా తను మాట తప్పించేసేడు
తప్పితే వివరం చెప్పలేదు. ఇప్పుడు
కొడుకు ప్రాజ్ఞుడయ్యేడు. తల్లిని
చూడాలన్న వాడి కోరిక మన్నించడంలో
తప్పేముంది.. మంగళ
తనని రావద్దని ఒట్టు పెట్టుకుంది తప్పితే
కొడుకుని కాదుకదా. నవ్వుతూ
అంగీకారంగా తలూపాడు.
ఆ సాయంత్రమే హైద్రాబాదు నుంచి నిడదవోలు బయల్దేరాడు
మధు. అతను బస్సెక్కేలోపల గురుమూర్తి పడిన
హడావిడి చూసి మధు ఆశ్చర్యపోయాడు.
మంగళకి ఆకుపచ్చరంగు యిష్టమంటూ ఆ రంగులోనే చక్కని
పట్టుచీర కొన్నాడు. హైద్రాబాదు ద్రాక్షంటే ప్రాణమంటూ నాలుగుకిలోలు పొట్లం కట్టించాడు. స్వీట్లంటే మక్కువని అన్నిరకాలూ పాక్ చేయించాడు.
బస్సు దిగగానే మంగళ కిష్టమైన సంపెంగలు
కొనమని ఒకటికి పదిసార్లు చెప్పాడు. యిలాగ ఒక్కొక్కసారి ఒక్కొక్క
మాట మాట్లాడుతూ మధూని ఉక్కిరిబిక్కిరి చేసేసాడు.
తండ్రిని అంత చలాకీగా చూడడం
జ్ఞానం తెలిసాక అదే
మొదటిసారి మధుకి. తల్లిని
చూడగానే తనకి ఫోన్ చేసి
యెలావుందో, యేమందో చెప్పాలని మరీ మరీ చెప్పి
మధుని బస్సెక్కించాడు గురుమూర్తి.
రాత్రి హైద్రాబాదులో బస్సెక్కిన మధుకి అన్నీ సందేహాలే.
తండ్రి చెప్పింది అతనికి కట్టుకథలా వుంది తప్పితే యెక్కడా వాస్తవానికి దగ్గరగా లేదు. ఈ రోజుల్లో
ఆ గ్రామదేవత ఆ ఊరి ఆడపిల్లల్ని
ఊరి పొలిమేరలు దాటనివ్వదనడం యెంత హాస్యాస్పదంగా వుందీ
అనుకున్నాడు. నయం, యిప్పటికైనా
తండ్రి తనకి అసలు సంగతి
చెప్పాడు. యిన్నేళ్ళకి తను మళ్ళీ తల్లిని
చూడబోతున్నాడు. అతనికి మనసంతా యేదో అర్ధంకాని భావనతో
నిండిపోయింది. యిన్నేళ్ళ
తర్వాత తను తల్లిని యెలా
గుర్తించడం.. తనని మటుకు తల్లి
యెలా గుర్తిస్తుంది? యెందుకు
గుర్తించదు.. తల్లీకొడుకుల మధ్య రూపురేఖావిలాసాలు అవసరమా..
ఆమె యెదురుపడగానే తన మనసు ఉవ్వెత్తున
ఉప్పొంగదా.. ఆవిడ కళ్ళలో ప్రేమ
కడలిలా పొంగిపొరలదా.. దీనికి మళ్ళీ గుర్తింపులు, పరిచయాలూ
కూడా కావాలా.. ఒకదానికీ మరొకదానికీ పొసగని ఆలోచనలతో మధు ఆరాత్రంతా నిద్రలేమితో
గడిపాడు.
యింకా
పూర్తిగా తెల్లారకుండానే నిడదవోలు చేరింది బస్సు. బస్సు దిగిన మధుకి
అప్పుడే నిద్రలేస్తున్న ఆ ఊరి వాతావరణం
కొత్తగా తోచింది. నిడదవోలు మరీ హైద్రాబాదులాగా రాత్రంతా
మెలకువగా వుండకపోయినా తెల్లారకుండానే అక్కడ కూడా మనుషుల
కదలికలు మొదలయ్యాయి. హోటళ్ళన్నీ అప్పటికే వేడివేడిగా కాఫీ టిఫిన్లు సిధ్ధం
చేసుకు కూర్చున్నాయి. పనులమీద పొరుగూరికెళ్ళేవాళ్ళు బస్సుల
వెనక పరుగులు
పెడుతున్నారు. చిన్నప్పట్నించీ హైద్రాబాదులోనే పెరిగిన మధు అదంతా కొత్తగా
చూస్తూ, హోటల్ లో కాస్త
కాఫీ తాగివచ్చి, అక్కడే వున్న ఒకతన్ని “బ్రాహ్మణగూడెం
వెళ్ళే బస్సులు యెక్కడాగుతాయండీ..” అనడిగాడు.
“బామ్మనగూడేనికి బస్సెందుకండీ..అగో.. అక్కడ షేర్
ఆటోలున్నాయి కదా..అవెక్కండి..యెళిపోతారు..”
అన్నాడతను. మధు అటువైపు నడిచాడు.
అటుపక్క వెళ్ళే వూళ్లపేర్లు అరుస్తూ చెపుతున్నాడు ఒకతను. అందులో బ్రాహ్మణగూడెం అన్న పేరు విని,
బేగ్ పట్టుకుని అదెక్కి కూర్చున్నాడు మధు. సగంమంది
యెక్కాక దానిని
ముందుకు పోనిచ్చి, బస్టాండు
చివరికొచ్చాక, ఆ ఆటో నడిపేవాడి
పక్కన కూర్చున్న పదేళ్ళకుర్రాడు.. మళ్ళీ అన్ని వూళ్లపేర్లూ
చదవసాగాడు. అవేమిటో
సగం అర్ధమేకాలేదు మధుకి. అలాగ ప్రతి పది
అడుగులకీ ఆటో ఆగుతుంటే, ఆ
కుర్రాడు గట్టిగా వూళ్ళపేర్లు చదువుతుంటే ఆ వీధి చివరికొచ్చేసరికి
యేడుగురు యెక్కవలసిన దానిలో పదిమందిదాకా యెక్కించేసేడు వాడు. ఉక్కిరిబిక్కిరిగా అనిపించింది
మధుకి.“యింకా యెంతమందిని యెక్కిస్తావయ్యా..?”
విసుగ్గా అడిగాడు.
“ఇయాల
అంతేనడీ అయ్ గోరూ.. బామ్మనగూడెంలో
జాతరగదండీ.. పొద్దెక్కేకొద్దీ ఇంకా ఎక్కుతారండి..” అంటూ
సమర్ధించుకున్నాడు వాడు.
“జాతరంటే
యేం చేస్తారు?” కుతూహలంగా అడిగాడు. యింత లావున్నావు తేలుమంత్రం
తెలీదా అన్నట్టు “జాతరంటే తెలీదా తవకి?” ఆశ్చర్యంగా అడిగాడు వాడు. ఆటో నడిపేవాడు
వెంటనే..”అరే..అయ్ గారు
ఇప్పుడే అయిద్రాబాదు బస్సు దిగేరు. సూడ్లేదా..
ఆరికెట్లా తెలుస్తది? అయ్ గోరూ.. జాతరంటే
బామ్మనగూడెంలో ఓ దేవతుందండి.. ఆ
యమ్మకి యేడాది కోసారి ఊరోళ్ళు
జేసే పండగలాటిదండి.”“అంటే యేం చేస్తారు?
ఆ దేవతెవరు?” అన్న మధు ప్రశ్నకి
ఆ పదేళ్ళకుర్రాడు అందుకున్నాడు ఉత్సాహంగా.
“ఆ
ఊళ్ళో మంగలాంబ అనే ఆడపడుచు ఉండేదండి.
ఆ రోజుల్లో ఆయమ్మకి తొమ్మిదేళ్ళకే మనువు సేసేసేరండి. కాపరానికి
అంపే టయానికి నేను
అత్తింటికి పోనుగాక పోనని కూసుందిటండి. ఎవలెంత
సెప్పినా ఎల్లలేదండి. బలంతాన కాలవగట్టుదాక తీసికెళ్ళినాక ఆడనే కూకుండిపోనాదండి. అప్పటిసంది
ఆ యమ్మకి పతేడూ జాతర సేస్తారండి..”
వాడిమాటలు
సరిగా అర్ధంకాక తెల్లమొహం వేసిన మధుని చూసి
ఆ ఆటోలోనే ప్రయాణిస్తున్న యింకో పెద్దాయన కలగజేసుకుని,
“అలా చెపితే యెలా తెలుస్తుందిరా. నేను
చెపుతానుండు. మాస్టారూ, సుమారు వందేళ్లక్రితం ఆ బ్రాహ్మణగూడెంలో మంగళాంబ
అనే అమ్మాయుండేది. ఆ రోజుల్లో సాంప్రదాయం
ప్రకారం తొమ్మిదేళ్లు రాగానే కాలవకి అవతల గట్టునున్న ఊళ్ళో
కుర్రాడికిచ్చి పెళ్ళి చేసేరు. మరి పెళ్ళిపదిరోజుల్లో యేమి
జరిగిందో యేమో ఆ పిల్లకి
అత్తారిల్లంటే భయం పట్టేసుకుంది. కాపరానికి
పంపే వయసొచ్చేటప్పటికి అసలు అత్తారింటికే వెళ్లనని
పట్టు పట్టుక్కూర్చుంది. యింట్లోవాళ్ళు బలవంతంగా చీర, సారె యిచ్చి పల్లకి
యెక్కిస్తే, యేటిగట్టుదగ్గరికి రాగానే దిగి
ఆ గట్టుమీద కూర్చుండిపోయింది. యిటు పుట్టింటివాళ్ళు రానీలేదు.
అటు అత్తింటికి పోలేకపోయింది. అలా ఆ కాలవగట్టుమీదే
కూచుండిపోయిందిట. ఆ పక్కనున్న గొల్లవారే
ఆవిడకి రోజూ కాసిని పాలు
ఇచ్చేవారు. అదే ఆహారం ఆమెకి. అలా
యెన్నాళ్ళు జరిగిందో యేమోగానీ ఆమె పోయాక మాత్రం
ఆవిడ పేరన అక్కడో చిన్న
గుడి కట్టారు. అప్పట్నుంచీ ఆవిడనే ఆ గ్రామానికి దేవతగా
కొలుస్తున్నారు. ఆ ఊరి ఆడపడుచులు
యెవరు పెళ్లయి అత్తారింటికి బయల్దేరినా ఆ కాలవగట్టు దాకానే
వచ్చేవాళ్ళు. ఆ
తర్వాత వాళ్ళెక్కిన మేనా
అడుగు కూడా ముందుకు కదిలేదికాదు.
అదుగో అప్పట్నుంచీ ఆ ఊరి ఆడపిల్లలు
అత్తారింటికి వెళ్లరన్న నానుడి స్థిరపడిపోయింది.”
ఆయన చెపుతున్నది శ్రధ్ధగా వింటున్న మధు తెల్లబోయాడు. అంటే
నాన్న చెప్పింది నిజమేనన్నమాట. ఇప్పటికీ ఆ ఊరి ఆడపిల్లలు
అత్తారిళ్లకి వెళ్లరా.. మరి వాళ్లకి పెళ్ళిళ్ళు
యెలా అవుతున్నాయి.. అదే ప్రశ్న అడిగాడా
పెద్దమనిషిని మధు. నవ్వేసాడాయన. "మాస్టారూ, ఈ
నమ్మకాలన్నవి వున్నాయి చూసారూ.. నమ్మినవాళ్ళు పూర్తిగా నమ్ముతారు. నమ్మనివాళ్ళు కొట్టిపడేస్తారు. యేదైనా మనం అనుకోడంలో వుంటుంది.
ఇలాంటి నమ్మకం వొకటుంటే ఊళ్ళో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవవేమోనని
కొంతమంది దానికో ప్రత్యామ్నాయం సూచించారు. అదేవిటంటే పెళ్లైన ప్రతి ఆడపిల్లా అత్తారింటి
కెళ్ళేముందు ఈ గ్రామదేవతయిన మంగళాంబ
గుడికి వెళ్ళి, చీర, గాజులు, పసుపుకుంకుమ
యిచ్చి, అపరాధం చెప్పుకున్నాక కానీ అత్తారింటికి బయల్దేరదు.”
మధు ఉత్సాహంగా అడిగాడు. "అంటే ఆ దేవతకి
చీర, పసుపుకుంకుమా ఇచ్చెస్తే అత్తారిళ్లకి వెళ్ళొచ్చా..?"
"అలాగంటారు
కానీ మళ్ళీ దానిలో కూడా
ఓ మెలికుందండి. అలా
వెళ్ళినవాళ్లకి యేవో చెప్పుకోలేని యిబ్బందులొచ్చేయనో,
చాలారకాల బాధలు పడ్డారనో చెప్పుకుంటారు. ఒక్కొక్కళ్ళు
ఒక్కొక్కటి చెపుతారు. యేదైనా
మాస్టారూ, అన్నీ మన నమ్మకాలని
బట్టే అవుతుందండి. అందుకే ఈ ఊరి ఆడపడుచులకి
అలాంటి యిబ్బందులేమీ రాకుండా వుండాలనే ప్రతియేడూ యిదేరోజున వూళ్ళోఆ అమ్మకి జాతర చేస్తారు.
చుట్టుపక్కల పదూళ్ళజనాలు వచ్చి, ఆ అమ్మని కొలుచుకుంటారు.
అంతేకాదు, ఇవాళ ఆ అమ్మని
కొలిచినవారి కోరికలు యెలాంటివైనా సరే తప్పక తీరతాయని
యిక్కడ అందరి నమ్మకమూ కూడా.
మీరూ సమయానికి వచ్చేరు. మీ కోరికేదైనా వుంటే
కోరుకొండి మాస్టారూ. తప్పక తీరుతుంది.. ఈ
మంగళాంబకి అంత గొప్ప శక్తి
వుంది."
వింటున్న మధుకి ఏది నమ్మాలో,
ఏమని కోరాలో అర్ధంకాలేదు. అమ్మని
కలవడం కన్న తనకి వేరే
కోరికలేమున్నాయీ. తన
తల్లిని కలపమని ఈ తల్లిని కోరాలా. అమ్మలగన్నఅమ్మకి
ఆమాత్రం తెలీదా. మధుకి
మనసంతా వ్యక్తపరచలేని ఆలోచనలతో నిండిపోయింది. అమ్మవారికి
చీరె పెట్టి, అత్తారింటికి వెళ్ళే సావకాశమున్నప్పుడు అమ్మ
ఆ పని యెందుకు చెయ్యలేదు? యిన్నాళ్ళూ,
యిన్నేళ్ళూ నాన్నని ఈ మూఢనమ్మకంలో వుంచితే
అమ్మకి వచ్చే లాభమేమిటి?
ఉత్తరాలూ, ఫోన్లూ కూడా వద్దని చెప్పడంలో
అమ్మ ఆంతర్యం యేమైవుంటుంది? ఒకవేళ
అమ్మమ్మ, తాతగారు అమ్మని నాన్న దగ్గరికి రానివ్వలేదా..
వాళ్ల మాట
చెప్పడం యిష్టంలేక అమ్మ ఈ మూఢనమ్మకాన్ని
ఆశ్రయించిందా? లేకపోతే
నాన్నని పెళ్ళి చేసుకున్నందుకు అమ్మ ఆ తర్వాత
యేమైనా పశ్చాత్తాప పడవలసి వచ్చిందా.. అలాగైతే తనేమి పాపం చేసాడూ.
కొడుకైన తనని కూడా చూడాలనిపించలేదా
అమ్మకి. అర్ధంలేని ఆలోచనలతో కొట్టుకుంటున్న మధు "బామ్మనగూడెం..బామ్మనగూడెం.."అని ఆటోకుర్రాడు
అరిచే అరుపులకి ఈలోకంలో కొచ్చిపడ్దాడు. బేగ్
తీసుకుని, ఆటో దిగి చుట్టూ
పరికించసాగాడు. అప్పుడే
తెల్లవారడంతో ఊళ్ళో అందరూ పనులబాటని
పడుతున్నారు.
అటుపక్కగా
పోతున్న ఒకతన్ని ఆపి"రామ్మూర్తిగారిల్లెక్కడా..?"
అనడిగాడు. అతను మధుని రెండోవీధికి
తీసికెళ్ళి దూరంనుంచే ఓ పెంకుటిల్లు చూపించి
వెళ్ళిపోయాడు. కాస్త
పాతబడినట్టుగా వున్న ఆ పెంకుటింటి
ముందు గుమ్మాలు అప్పుడే కడిగి, ముగ్గుచారలు గీసివున్నాయి. ఓ
స్తంభానికి ఎర్రటి పోస్ట్ బాక్స్ఇనపతీగతో చుట్టి వుంది. బైటకెవరైనా వస్తారా అని మొహమాటంగా అక్కడే
నిలబడున్నాడు మధు. ఓ పదేళ్ళకుర్రాడు
వీధిచివర్నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి తారాజువ్వలా ఆ
ఇంట్లోకి దూసుకుపోతుంటే చటుక్కున అతన్ని ఒడిసిపట్టుకున్నాడు. బిక్కమొహమేసిన ఆ కుర్రాణ్ణి "రామ్మూర్తిగారున్నారా.."
అనడిగాడు. "ఆయన యిక్కడెందుకుంటారూ..చాగల్లులో కదా
వుంటారూ.." అని యెదురుప్రశ్న వేసాడు
వాడు. "ఈ ఇల్లెవరిది?’ కాస్త
వెనకడుగు వేస్తూ అడిగాడు."రామ్మూర్తిగారిది." అర్ధంకాలేదు మధుకి. ఇంతలో యింట్లోంచి ఓ
పెద్దమనిషి చొక్కాగుండీలు పెట్టుకుంటూ బైటకొచ్చాడు. "ఇది రామ్మూర్తిగారిల్లేనాండీ.." మర్యాదగా అడిగాడు మధు. "అవునండీ.. కానీ ఆయన యిప్పుడిక్కడ
వుండడంలేదు. చాగల్లు లో వుంటున్నారు." అన్నాడా పెద్దమనిషి. హతాశుడయ్యాడు
మధు. "మీకు ఆయనతో పనుంటే
మధ్యాహ్నానికల్లా వస్తారండీ.. ఇవాళ మంగళాంబ జాతరకి
ఆయన తప్పకుండా వస్తారు." అన్నాడా పెద్దమనిషి మళ్ళీ. ప్రాణం లేచొచ్చింది మధూకి. మధూ
చేతిలో బేగ్ చూసి జాతర
చూడ్డానికి ప్రయాణం చేసొచ్చినట్టు గ్రహించి, "రండి లోపలికి. స్నానం
అదీ చేసి జాతర చూడ్డానికి
వెడుదురుగాని.." సాదరంగా ఆహ్వానించాడాయన. ఆయన
మాటలని కాదనలేకపోయాడు మధు.
అపరిచితులకి
కూడా అంత ఆదరంగా ఆతిధ్యం
యిస్తారని పుట్టినప్పట్నించీ హైద్రాబాదు వదిలి వెళ్ళని మధూకి
తెలీదు. ఆ
పెద్దమనిషి పేరు పరమేశమనీ, ఆ
చుట్టుపక్కలున్న నాలుగు చిన్నఊళ్ళకి కలిపి వున్న పోస్టాఫీసుకి
పోస్ట్మాస్టరనీ తెలుసుకున్నాడు.
స్నానం, టిఫినూ అయ్యాక పరమేశం మళ్ళీ మధూకి ఆఊరి
ఆడపడుచు మంగళాంబ మాహాత్యం చెప్పి, ఆ సమయంలో యెవరైనా
వచ్చి పసుపు, కుంకుమ యిస్తే చాలు యే కోరిక
కోరుకున్నా ఆ తల్లి తప్పక
తీరుస్తుందని మరోసారి చెప్పాడు. అన్నీ ఓపిగ్గా విన్నమధు
బేగ్ లోంచి తల్లికోసం తండ్రికొన్న
చీరవున్న ప్లాస్టిక్ బేగ్ తీసి తల్లి
కనిపించగానే యివ్వడానికి పళ్ళూ, స్వీట్లతో సహా చేతిలో సిధ్ధంగా
పెట్టుకున్నాడు. ఆయనని
తల్లి గురించి అడుగుదామని నాలిక చివరివరకూ వచ్చినమాటని
బలవంతంగా ఆపుకున్నాడు.. ఊహు.. తన తల్లి
గురించి రామ్మూర్తిగారినే అడగాలి. ఇంకెవరినడిగినా తనకి సరైన సమాధానం
రాదనుకుంటుంటే, పరమేశం
చెప్పాడు. "గుళ్ళో పూజ పొద్దున్నే మొదలౌతుంది.
మీరు పదిగంటలకల్లా అక్కడికి వెడితే అమ్మని యెక్కించుకు వెళ్ళే పల్లకీ సిధ్ధంగా వుంటుంది. అమ్మకి పళ్ళిచ్చుకుని పల్లకీతోపాటు ఊరేగింపుగా కాలవగట్టుదాకా వెళ్ళొచ్చు. చాలాబాగుంటుంది."
పరమేశం
చెప్పినట్టుగానే పదిగంటలకల్లా ఊళ్ళో మంగళాంబగుడి దగ్గరికి
చేరుకున్నాడు మధు. ఆ చిన్న
ఊరిలో వున్న నాలుగైదు వీధుల్లో
ప్రతివొక్కరి అడుగూ ఆ సమయంలో
అటువైపే పడింది. గుడి, గుడి అమ్మవారు
అని అందరూ అంటుంటే యేదో
పెద్ద ప్రాకారం, అందులో ధ్వజస్థంభం, గర్భగుడిలాంటివన్నీ ఊహించుకున్న మధుకి అక్కడికి వెళ్ళగానే
ఆశ్చర్యం వేసింది. రెండువీధులు
కలిసే కూడలిలో కాస్త యెత్తుగా గుట్టలా
వున్నచోట చిన్నగోపురంతో వున్న ఒక మందిరంలాంటిది
కనిపించింది. దానిముందు
రెండువీధులూ అటూఇటూ చిన్నచిన్నదుకాణాలు. పూజకి
పనికొచ్చే కొబ్బరికాయలు, అగరువత్తులు, పసుపుకుంకుమలనుంచీ, పటికబెల్లాలు పేలాలప్రసాదాలనుంచీ, పిల్లలు తినే జీళ్ళు, కొబ్బరుండలనుంచీ, వాళ్ళు
ఆడుకునే బుడగలూ, బొమ్మలూ వరకూ అన్నిరకాల దుకాణాలు
అప్పటికే అమ్మకాలు మొదలుపెట్టేసాయి. పొద్దున్నే
ఖాళీగా కనపడిన ఆ ఊరంతా ఇప్పుడు
చుట్టుపక్కల ఊళ్ళనుంచికూడా వచ్చి చేరిన తీర్థప్రజతో
కిక్కిరిసిపోయింది. ఇంతలో
చాలామంది ఓ చెట్టువైపు పరుగెడుతుండడంతో
అదేవిటో తెలుసుకుందామని అటు నడిచాడు మధు. అక్కడ
ఒక చిన్న పల్లకీలాంటిది వుంది.
నలుగురు మనుషులు ఆ పల్లకీని రంగురంగుల
పూసలపేరులతోనూ, పూలదండలతోనూ అలంకరిస్తున్నారు. తళతళా మెరిసే ముచ్చిరేకులతో
రకరకాల ఆకారాలు చేసి వేళ్ళాడదీస్తున్నారు. ఆ పల్లకీ
లోపల కూర్చునేందుకు వీలుగా మెత్తటి ముఖమల్ గుడ్దలు పరుస్తున్నారు. వాటిమీద జరీదారాలతో కుట్టిన డిజైన్లు అంతదూరంనుంచి కూడా మెరుపులు కురిపిస్తున్నాయి.
ఆసక్తిగా గమనిస్తున్నాడు మధు అవన్నీ.
యింతలో వచ్చారు గుడిలోంచి అమ్మవారి దర్శనం చేసుకుని ఓ నలుగురు బలిష్టులు.
వారి జుట్లు విరబోసి వున్నాయి. నుదుట పొడుగ్గా గుళ్ళో
పెట్టుకున్న కుంఖంబొట్లు దర్పంగా వెలుగుతున్న దీపశిఖల్లా వున్నాయి. బిగపట్టి కట్టుకున్న పంచెలమీద నడుంకి అడ్డంగా మరో పంచె బిగించి
కట్టారు. పొడుగ్గా ఎర్రటి సిల్కుదారంతో కట్టిన గవ్వలు, శంఖాలూ, నత్తగుల్లల్లాంటివి గుచ్చిన దండలు మెడలో వేసుకున్నారు.
వాళ్ళొస్తుంటే జనాలు
భయభక్తులతో దారిచ్చారు. వారు వస్తుండడం చూసి అప్పటికే
అక్కడున్న డోలు, బాజా వాయించేవాళ్ళు ఒక్కసారిగా వాయించడం
మొదలుపెట్టారు. నలుగురూ వచ్చి పల్లకీకి అటూ
ఇటూ నిలబడ్దారు. ఇంతలో గుడిలోంచి నలుగురు
పెద్దమనుషులు పాటలుపాడుతూ అలంకరించిన
అమ్మవారి విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా చేతులమీద
తీసుకువచ్చి ఆ పల్లకీలో కూర్చోబెట్టారు. అంతే..
ఒక పెద్ద పొలికేకలాంటిది వేస్తూ
ఆ నలుగురు బలిష్టులూ ఆ పల్లకీని సునాయాసంగా
యెత్తుకుని నడవడం మొదలుపెట్టారు.
ముందు డోలూ, బాజాలు, వెనకాల
గ్రామదేవత మంగళాంబ పల్లకీ, ఆ వెనకాల పెద్దమనుషులు
కొందరూ, ఆవెనకాల జనం ఊరేగింపులా సాగడం
మొదలుపెట్టారు. జరుగుతున్నది
వింతగా చూస్తున్న మధు కూడా ఆజనంలో
చేరాడు. నెమ్మదిగా మొదలైన ఆ ఊరేగింపు ఊళ్ళో
వున్న నాలుగువీధులూ తిరుగుతుంటే ప్రతి యింటివారూ ఆ
దేవతకు పళ్ళూ, కొబ్బరికాయలూ సమర్పించుకున్నారు. నాలుగువీధులూ తిరగడం అయ్యాక ఆ పల్లకీ కాలువగట్టువైపు
తన దిశ తిప్పుకుంది. అంతే..
ఆగిపోయింది. అది
చూసి బాజాలవాళ్ళు స్థాయీ, స్పీడూ పెంచారు. ఓ
రెండడుగులు వేసింది. మళ్ళీ ఆగిపోయింది. పె
ద్దమనుషుల్లో ఒకరు వచ్చి అమ్మవారికి
ధూపం వేసారు. ఓ
రెండడుగులు వేసి మళ్ళీ ఆగిపోయింది
పల్లకీ. చుట్టూ
వున్న జనాలు "హోహో.." అని అరుస్తుంటే, బాజాల
హోరులో మరో రెండడుగులు వేసి
ఆగిపోయింది పల్లకీ. జరిగేదంతా
వింతగా చూస్తున్నాడు మధు. అతనికది
నమ్మశక్యంగా లేదు. ఒకవేళ కావాలనే
బోయీలు పల్లకీని ఆపేస్తున్నారనే నిశ్చయానికి వచ్చి, ఇంకాస్త పరిశీలనగా చూడడానికి మరికాస్త దగ్గరికి వెళ్ళాడు.
బోయీలు ట్రాన్స్ లో వున్నట్టు వూగుతున్నారు.
గట్టిగా వినిపిస్తున్న బాజాలకి చెవులు బద్దలౌతున్నట్టుంది. ఆ హోరులోనే అలా కళ్ళు సగం
ముసుకునే మరో అడుగేసేరు బోయీలు. మరి
కదలలేదు పల్లకీ. అప్పుడు అక్కడున్న పెద్దమనుషుల్లో ఒకరువచ్చి పళ్ళెంలో యేదో
ఘాటైన ధూపంవేసి దానిని ఆ బోయీల మొహం
మీదకి వదిలాడు. ఆ ఘాటుకి వాళ్ళు
మత్తులోకెళ్ళినట్టు వూగిపోతూ మరింత బలంగా యేటిగట్టువైపు
అడుగులు వెయ్యసాగారు. యిలా నెమ్మదిగా పల్లకీ
అడుగులో అడుగు వేసుకుంటూ కదులుతుంటే
పల్లకీ వెనక జనాలు పాటలూఆటలతో
చిందులేస్తూ నడుస్తున్నారు. మధు ఈ దృశ్యానంతటినీ
ఒక సినిమా చూస్తున్నట్టు చూస్తుండిపోయేడు. నిజంగా ఆ బోయీలు పల్లకీని
ముందుకు తీసికెళ్లలేకపోతున్నారో లేకపోతే తీసికెళ్లలేనట్లు నటిస్తున్నారో అతనికి అర్ధంకాలేదు. యేటిగట్టు
కష్టపడి యెక్కిన పల్లకీ మరి కదల్లేదు.
బరువుని యింక మోయలేమన్నట్టు బోయీలు
దానిని కిందకి దించేసారు. జనాలందరూ శివాలెత్తినట్టు అరుస్తూ ఆ పల్లకి చుట్టూ
తిరుగుతున్నారు.
భౌతికంగా మధు చూపు అమ్మవారివైపు
వున్నా మనసు మటుకు ఆ
చుట్టూ వున్న పెద్దముత్తైదువలను పరికించి
చూస్తోంది. వీరిలో
యెవరయి వుంటుంది అమ్మ? నాకెలా
తెలుస్తుంది? నేను
ఆమెకెలా తెలుస్తాను? కళ్ళు
కలవగానే మనసులో కదలిక వస్తుందా?
మనసు నిండిన ఆ అనుభూతి యెలా
వుంటుంది? యిన్నేళ్ళూ
చూడాలీ చూడాలీ అని తపించిన మాతృమూర్తి
కంటి కెదురుగా నిలబడితే ఆ ఆనందానుభూతిని ఈ
చిన్నిగుండె తట్టుకోగలదా? అమ్మ కనపడగానే యేం
చెయ్యాలి, యెలా పలకరించాలి?
కాళ్లమీద పడాలా..ఆ చల్లనిచేతుల్లో మొహం
దాచుకోవాలా? అసలు
నోటమ్మట మాట వస్తుందా? ఉక్కిరిబిక్కిరవుతున్న
ఆలోచనలతో వున్న మధు భుజం
మీద యెవరిదో చెయ్యి పడడంతో ఉలిక్కిపడ్డాడు. వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఓ పెద్దాయన "మధూ
అంటే.." అని ఆపేసాడు. అర్ధమైపోయింది మధుకి ఆయనే రామ్మూర్తిగారని. అవునంటూ
తలూపేడు. ఆయన
మధు చెయ్యి పట్టుకుని ఆ జనంలోంచి తప్పించి
వారికి దూరంగా కాలవగట్టు మీదున్న ఓ చెట్టు కిందకి
తీసుకొచ్చేడు. "అమ్మ..
మా అమ్మ.." మధు నోట్లోంచి మాటలు
స్పష్టాస్పష్టంగా బైటకి వచ్చేయి.
"కూర్చో
బాబూ. మీ నాన్నగారు యెలా
వున్నారు?" తాపీగా అడిగారాయన. "బాగున్నారు. అమ్మని.. మా అమ్మని చూపించండి. యెక్కడుంది? ఆ
జనాల్లో యెక్కడుంది?" ఆతృతని ఆపుకోలేకపోతున్నాడు. మధు
చెయ్యి పట్టుకుని బలవంతంగా తన యెదురుగా కూర్చోబెట్టుకుని, అప్పుడే
పల్లకిలో ఊరేగి వచ్చిన అమ్మవారిని
చూపిస్తూ "ఆ అమ్మే మీ
అమ్మ" అన్నారు నెమ్మదిగా. అర్ధంకాలేదు మధుకి. పిచ్చిగా
చూసాడాయన వైపు.
ధైర్యమిస్తున్నట్టు
మధు చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ,"
మీ అమ్మ మంగళ మంగళాంబను
చేరింది. యిప్పుడు కాదు. యెప్పుడో. యిరవైయేళ్ళక్రితవే..""మరి..మరి.. మా
నాన్న అమ్మ యిక్కడే వుందన్నారే.."నాన్న అబధ్ధం చెప్పరన్నట్టు
అన్నాడు.
"మీ
నాన్న కోసమే అలా చెప్పాం.."
ఆయన చెపుతున్నది అర్ధంకాక వెర్రిగా చూసాడు మధు."చూడు బాబూ, నువ్వు
పెద్దవాడివయ్యావు. అన్నీ అర్ధం చేసుకోగలవు.
కూర్చో. వివరంగా చెప్తాను." అంటూ మధుని యెదురుగా
కూర్చోబెట్టుకుని చెప్పసాగారు రామ్మూర్తిగారు.
"నీ
చిన్నప్పుడు ఈ చుట్టుపక్కల నాలుగైదు
జిల్లాల్లో అంటురోగమొకటి విపరీతంగా వ్యాపించింది. దాని
పాలబడ్దవాళ్లకింక మరణం
తప్పేదికాదు. ప్రభుత్వం
సాయం అందించే లోపలే చాలామంది చనిపోయారు. మీ
అమ్మమ్మకీ, తాతయ్యకీ కూడా ఆ జబ్బు
అంటుకుంది. అది
తెలిసి పెళ్ళయాక మొట్టమొదటిసారి
నిన్నూ, మీనాన్ననీ వదిలి మీ అమ్మ
వాళ్ళని చూసుకోవడం కోసం వచ్చింది.
వాళ్ళు చివరిదశలో వుండగానే మీ అమ్మకి కూడా
ఆ రోగం అంటుకుంది.
యింక తను కూడా బతకదని
మీ అమ్మకి అర్ధమైపోయింది. ఆ
సంగతి తెలిస్తే మీ నాన్న తట్టుకోలేడు.
విషం మింగేసినా మింగేస్తాడనుకుంది. యెందుకంటే
నువ్వు పుట్టేటప్పుడు మీ అమ్మ మరణం
చివరి అంచులవరకూ వెళ్ళిందిట. అది
చూసి మీ నాన్న యెవరెంత
చెప్పినా వినకుండా బతుకైనా చావైనా నా మంగళతోనే అని
యిన్ని నిద్రమాత్రలు తెచ్చుకుని మీ అమ్మతో కలిసి
చచ్చిపోతానంటూ కూర్చున్నాడుట. ఆ
దేవుడి దయవల్ల అప్పటికి మీ అమ్మకి గండం
గడిచింది. మీ
నాన్న కూడా బతికాడు. ఆ విషయం నాకు
చెప్పింది మీ అమ్మ. అందుకే తను చనిపోయినట్టు తెలిస్తే
మీ నాన్న యే అఘాయిత్యం
చేసేసుకుంటాడో అని భయపడి, ఉత్తరం
రాసి, తను పోయాక యివ్వమని
చెప్పి నాచేతి కిచ్చింది. తను
అక్కడికి రాలేకపోతున్నందుకు కారణం ఈ గ్రామదేవత
అయిన మంగళాంబ మీద పెట్టింది.
ఉత్తరం రాసినా, ఫోన్ చేసినా చచ్చినంత
వొట్టేనని గట్టిగా చెప్పింది. మీ
అమ్మ మాటంటే మీ నాన్నకి సుగ్రీవాఙ్ఞే
కదా. అలాగ
ఈ గ్రామదేవత మంగళాంబమీద ఈ చుట్టుపక్కల వూళ్ళలో
వున్న నమ్మకాన్ని మీ నాన్న బతకడానికి
వాడుకుంది మీ అమ్మ. అందుకనే మీ నాన్న దగ్గర
నువ్వు చక్కగా పెరిగి, ప్రయోజకుడవయ్యావు. మీ
నాన్నకి మీ అమ్మమీదున్న ప్రేమ
ఆమె మాటని దాటనివ్వలేదు.
అందుకే మంగళ యింకా యిక్కడ
బతికేవుందనే నమ్మకంతో మీ నాన్న బతికున్నాడు. అసలు
విషయం తెలిసిన మరుక్షణం మీ నాన్న బతకడు. అతనికి
మీ అమ్మ మీదున్న ప్రేమ
అలాంటిది. మీ
అమ్మకి అతని మీదున్నప్రేమ అలాంటిది.
నిజమైన ప్రేమికులంటే వాళ్ళిద్దరే. ఒకరి సంతోషంకోసం మరొకరు
కోరుకునే ప్రేమికులు.” కాస్త ఆగి మళ్ళీ
మొదలుపెట్టారు రామ్మూర్తిగారు.
“ఆ
మంగళాంబలో కలిసిన మీ అమ్మయింక రాదు. నువ్వు
గుండె దిటవు పరచుకోకతప్పదు.
కానీ మీ నాన్నని మీ
అమ్మంత జాగ్రత్తగా చూసుకోవలసినవాడివి నువ్వే. యిన్నాళ్ళు ఈ నిజాన్ని నిప్పులా
దాచాను. యిప్పుడు నీకు చెప్పాక నా
మనసు స్థిమితపడింది. ముందేం చెయ్యాలన్నది నువ్వే నిర్ణయించుకో.."
రామ్మూర్తిగారు చెప్పింది వింటున్న మధు మనసు మొద్దుబారిపోయింది. ఆలోచనలు
స్తంభించిపోయాయి. చేష్టలు
దక్కి అలాగే కూలబడిపోయాడు.
చేతిలో వున్న బేగ్ లోంచి
తల్లికోసం తండ్రికొన్నచీర జారి బైటకొచ్చింది. దానిని
చూసిన మధు తండ్రిని తలుచుకుని
నీరుకారిపోయాడు. అనాలోచితంగా ఆ
చీర, పళ్ళు, పువ్వులూ, గాజులూ తీసికెళ్ళి పల్లకిలో కొలువైవున్న మంగళాంబ వొడిలో పెట్టి, నమస్కరించాడు. యింతలో మధు చేతిలో వున్న
మొబైల్ మోగింది. ఒక్కసారి
ఈ లోకంలో కొచ్చాడతను. వెనక్కి తిరిగి కాలవగట్టు మీద కూర్చుని మొబైల్
తీసి చూసాడు. ఆ
ఫోన్ తండ్రి దగ్గర్నుంచి. ఆన్
చేసాడు. "నాన్నా మధూ, జాగ్రత్తగా వెళ్ళావా?
మీ అమ్మ కనిపించిందా? యెలా
వుంది? నా గురించి యేమడిగింది?"
అవతల్నించి ప్రశ్నలు బాణాల్లా వస్తున్నాయి. మధు గుండె కూడదీసుకున్నాడు. గొంతు
సవరించుకున్నాడు. ఉబికివస్తున్న
దుఃఖాన్ని నీలకంఠునిలా గొంతులోనే అదిమేసాడు. బలవంతంగా
కంఠంలోకి మృదుత్వాన్ని, సంతోషాన్నీతెచ్చుకున్నాడు.
"కలిసాను
నాన్నా. నన్ను చూసి చాలా
సంతోషించింది. నీ గురించి చాలా
చాలా అడిగింది. అసలన్ని కబుర్లూ నీ గురించే. ఈ
గ్రామదేవత వల్ల కానీ లేకపోతే
నేను యిక్కడెందుకుంటానూ అంది నాన్నా.." ఒక్కొక్కమాటను
బలవంతంగా గొంతులోకి ఆనందం తెచ్చుకుంటూ చెప్పాడు. అవతల్నించి
కాసేపు నిశ్శబ్దం. "నాన్నా.. నాన్నా.." ఆతృతగా పిలిచాడు. గురుమూర్తి
నెమ్మదిగా పలికాడు. "నాకు తెలుసురా.. మీ
అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఆ
దేవత వల్ల మనిషి అక్కడుందిపోయిందికానీ,
నిజానికి మీ అమ్మ మనసు
ప్రతిక్షణం నాతోనే వుంటుందిరా..నాకు తెలుసు..చక్కగా
మీ అమ్మతో గడిపిరా. వచ్చాక మర్చిపోకుండా కబుర్లన్నీ చెప్పాలిసుమా.." అంటూ ఫోన్ పెట్టేసాడు గురుమూర్తి. నిండుగా
వున్న ఆ గొంతులోని ఆనందాన్ని
విన్న మధుకి కన్నీళ్ళాగలేదు.
నాన్నా, నాకు నువ్వు కావాలి
నాన్నా. నువ్వు కావాలి. అమ్మ లేకుండానే యిన్నేళ్ళూ
బతికేనంటే నీవల్లే నాన్నా.. నువ్వు లేకుండా అస్సలుండలేను నాన్నా..అందుకే..అందుకే అమ్మలేదనే
విషయాన్ని నీకు చెప్పనుగాక చెప్పను.
అమ్మలాగే నేనూ
నిన్ను మోసం చేస్తాను నాన్నా.
కారణం కూడా అమ్మ చెప్పిందే.
అమ్మ లేదంటే నువ్వూ వుండవు. అమ్మలేని
నేను నిన్ను కూడా పోగొట్టుకోలేను. నువ్వు
సంతోషంగా నూరేళ్ళూ వుండాలి. ఈ
మంగళాంబ దేవత మనల్ని ఈ
విధంగా ఆదుకుంది. అందుకు
ఆ అమ్మకి యేమిచ్చినా ఋణం తీరదు అనుకుంటూ
ఆ దేవతవైపు తిరిగి మనస్ఫూర్తిగా రెండుచేతులూ జోడించాడు మధు.
----------------------------------------------------------------------------------------
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
Blog Archive
- July (1)
- October (1)
- September (1)
- August (1)
- July (3)
- June (1)
- May (1)
- April (1)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (1)
- August (3)
- July (2)
- June (2)
- April (2)
- March (1)
- February (1)
- January (2)
- December (1)
- November (2)
- October (1)
- September (3)
- August (2)
- April (1)
- March (1)
- November (1)
- October (3)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- May (1)
- March (1)
- November (1)
- October (2)
- September (1)
- February (1)
- December (1)
- November (1)
- October (2)
- May (2)
- April (1)
- January (1)
- December (1)
- October (2)
- September (1)
- August (1)
- July (2)
- June (2)
- March (1)
- February (1)
- January (1)
- November (1)
- April (2)
- March (3)
- February (1)
- January (1)
- December (2)
- November (1)
- October (5)
- August (4)
- April (3)
- February (1)
- January (4)
- December (4)
- November (2)
- October (3)
- September (1)
- July (2)
- June (3)
- May (2)
- April (3)
- March (4)
- February (2)
- January (3)
- December (1)
- November (1)
- September (1)
- August (3)
- July (4)
- June (3)
- May (1)
- March (2)
- February (2)
- January (3)
- December (3)
- November (4)
- October (4)
- September (2)
- August (15)
- July (4)
Followers
Powered by Blogger.
నాగురించి...
ఇటీవలి వ్యాఖ్యలు
Categories
- . ప్రొఫెసర్ గారి భార్య (2)
- ఆహ్వానం (1)
- ఉచితసలహాలు (9)
- కథ (1)
- కథావిశ్లేషణ (1)
- పండగలు (12)
- పండుగలు (5)
- పురస్కారం (1)
- పుస్తక ప్రచురణ.. (2)
- పెద్దలు చెప్పిన మాట (1)
- ప్రకటన (1)
- ప్రకృతి అందాలు.. (1)
- ప్రచురణలు (59)
- ప్రార్ధన (6)
- మనసులో మాట (23)
- మా నాన్నగారు... (8)
- విన్న పాట (1)
- శుభాకాంక్షలు... (1)
- శ్రధ్ధాంజలి.. (2)
- సమీక్ష (8)
- సరదాగా (18)
- స్వగతం... (2)
- స్వాగతం (1)
సుస్వాగతం ..
Copyright 2010 Shining Glow . Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates Wordpress by thebookish