Pages

Tuesday, June 3, 2014

మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి శతజయంత్యుత్సవం..



మేరునగమంతటి ఉన్నతవ్యక్తిత్వం కలవారూ
సముద్రమంత గంభీరులూ
కుసుమకోమలహృదయులూ
రాముడంతటి వినయసంపన్నులూ
బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు...
 ఆయనే మా నాన్నగారు.     




  ఈ జూన్ ఒకటవతారీకు నాకు, మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళకు పండుగరోజు. యెందుకంటే ఆరోజున మా నాన్నగారు, శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి శతజయంత్యుత్సవం జరిగింది.
   తొంభైయ్యారు సంవత్సరాలు నిండుగా బ్రతికిన మా నాన్నగారు పండుటాకు రాలినట్టు 2010లో స్వర్గస్తులయ్యారు. బ్రతికుంటే ఈ జూన్ ఒకటికి వందసంవత్సరాలు అయివుండేవి. అందుకే మా అన్నయ్యలు వెంకట రామ సోమయాజులు, దుర్గా వెంకటేశ్వర్లు కలిసి ఈ జూన్ ఒకటిన మా నాన్నగారి శతజయంత్యుత్సవాన్ని రాజమండ్రిలో బ్రహ్మాండంగా జరిపించారు.
  మా అక్కచెల్లెళ్ళం ముగ్గురం కలిసి వెళ్ళాం రాజమండ్రి. అంతే.. ఇంక స్టేషన్‍లో  దిగిన దగ్గర్నుంచీ మాకంతా ఆనందమే ఆనందం.
    ఈ ఉత్సవాన్ని ప్రకాశంనగర్ కమ్యూనిటీహాల్‍లో యేర్పాటు చేసారు. అది అక్కడ పింఛనుదారులందరూ కలిసి సమావేశాలు, సంబరాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పురాణ కాలక్షేపాలు లాంటివన్నీ జరుపుకునే చోటు. దానిని వారు కమ్యూనిటీహాల్ అనరు. పెద్దవారంతా కలిసి దానికి "ధర్మం చర.." అనే యెంచక్కటి పేరు పెట్టుకున్నారు. అక్కడందరూ ఆ హాల్‍ని ఆపేరుతోనే వ్యవహరిస్తారు. అలా "ధర్మం చర.." అన్న పేరుని ప్రాచుర్యంలోకి తేవాలనే వారి తలంపులోనే  తెలుస్తోంది వాళ్లందరూ యెంత ధర్మపరులో. ఆ "ధర్మం చర" తో మా నాన్నగారికి ముఫ్ఫైసంవత్సరాల పైనే అనుబంధం వుంది. అక్కడి పెద్దలందరూ మా నాన్నగారికి హితులు, సన్నిహితులు. వారందరూ ఈ ఉత్సవంలో ఆనందంగా పాలుపంచుకున్నారు.
మరింక బంధువులు, ఊరిలోని పెద్దమనుషులూ కూడా వచ్చి మా నాన్నగారిని గుర్తు చేసుకున్నారు.
           ఉదయం పదిగంటలకి మా అమ్మగారు శ్రీమతి పద్మావతి, మా నాన్నగారు శ్రీ సుబ్బయ్యశాస్త్రిగార్ల ఫొటోలకు పూలమాలలు వేసి, అక్కడ మా పెద్దక్క మహాలక్ష్మి జ్యోతి ప్రజ్వలనం చేయడంతో సభ ప్రారంభమైంది.



   నలుగురు వేదపండితులు వేదం పఠించారు. అలా ఆ ఉదయంపూట వేదపఠనం వింటుంటే ఆ దేవతలే దీవిస్తున్నారా  అనిపించింది.



   తర్వాత మా చెల్లెలు భారతి సరస్వతీదేవిని స్తుతిస్తూ ప్రార్ధనాగీతం పాడింది. "శ్రీ పద్మాంచిత పాణీ.." అన్న ఈ ప్రార్ధన మా నాన్నగారికి చాలా ఇష్టమైనది. అస్తమానం మా చెల్లెలి చేత పాడించుకునేవారు. ఆ సంగతి గుర్తొచ్చి, ఒక్కసారి నాన్నగారే అక్కడికొచ్చి వింటున్నారా అన్న అనుభూతి కలిగింది.



ప్రార్ధన అయ్యాక "కౌండిన్య.." అన్న పుస్తకాన్నిపెద్దలు శ్రీ దాట్ల బలరామరాజుగారు ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో మా నాన్నగారు విశేషకృషిచేసి వ్రాసిన పిడపర్తివారి వంశచరిత్ర, వారి కథలూ-గాథలూ మాత్రమే కాకుండా అచ్చ తెలుగులో సంక్షిప్తంగా వ్రాసి మా అమ్మగారి ఆత్మశాంతికి అంకితమిచ్చిన రామకథ కూడా వుంది. అంతే కాకుండా అందులో మా నాన్నగారు చేసిన సమస్యాపూరణలూ, వ్రాసిన చాటువులూకూడా వున్నాయి. అవే కాకుండా వారి జీవితకాలంలో జరిగిన సంఘటనలు మరపురాని కథలుగా కూడా అందులో వున్నాయి. ఇవన్నీ కలిపి  మా అన్నయ్యలిద్దరూ పుస్తకాన్ని కొత్తగా, అందంగా తీసుకొచ్చారు. ఇదిగో.. ఇదే ఆ పుస్తకం.





       ఆ పుస్తకం చేతిలో పట్టుకుని పుటలు తిప్పుతుంటే మా నాన్నగారే మళ్ళీ మాముందుకొచ్చి మాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది.
       ఆ తర్వాత అక్కడి పెద్దలందరూ నాన్నగారి గురించి మాట్లాడారు. మమ్మల్నీ మాట్లాడమన్నారు. కానీ.. అదేమిటో.. నాన్నగారు పంచిన ప్రేమ, అనురాగం మాత్రమే గుర్తొచ్చాయి తప్పితే  ఆయన పాండిత్యం, గొప్పదనం గుర్తు రాలేదు. యేనాడూ కూడా మా నాన్నగారు మమ్మల్ని ఒక్క పరుషవాక్యం కూడా అనలేదు. "అమ్మా, తల్లీ.." అని పిలిచేరు తప్పితే మరో పిలుపు లేదు. నాకేమిటో ఆ పిలుపే గుర్తొచ్చింది. మళ్ళి మళ్ళీ ఆ పిలుపునే గుర్తు చేసుకుంటూ కూర్చున్నాను.
 ధూళిపాళ మహదేవమణిగారిలాంటి పెద్దలు మా నాన్నగారితో వారికి గల అనుబంధాన్ని బట్టి ఆయన యెంతటి ఉన్నత వ్యక్తిత్వం కలవారో తెలిపారు. అవన్నీ వింటుంటే మళ్ళీ మా నాన్నగారిని చూస్తున్న అనుభూతి కలిగింది.
 పెద్దల ప్రసంగాలయ్యాక అందరికీ భోజనాలు యేర్పాటు చేసారు. రాజమండ్రిలో విందుభోజనమంటే యింక వేరే చెప్పేది యేముంది.. అన్నీ ప్రత్యేకమైన వంటలే.. అందరూ ఇష్టంగా తినేవే. పదార్ధాలన్ని చాలా బాగున్నాయి.
  ఆతర్వాత మధ్యాహ్నం కాస్త విశ్రాంతి.
     కాని మేవేమీ విశ్రాంతి తీసుకోలేదు. మా కజిన్స్ అందరం చాలా సంవత్సరాల తర్వాత ఇంత తీరుబడిగా ఒకచోట కలిసాం కదా.. అందుకని మా చిన్నప్పటి ముచ్చట్లన్నీ చెప్పుకున్నాం. అలా నాన్నగారి దగ్గర గడిపిన బాల్యం గుర్తు చేసుకుంటుంటే యెంత హాయిగా అనిపించిందో.
తర్వాత సాయంత్రం ఆరుగంటలకు హరికథా కాలక్షేపం యేర్పాటు చేసారు. మనిషికి అహంకారం పనికిరాదనే నీతిని చెపుతూ అలా అహంకరించిన భీముణ్ణీ, అర్జునుణ్ణీ శ్రీకృష్ణుడు యెలా దారికి తీసుకొచ్చాడనే అంశంపై సాగిన హరికథ. యెన్నేళ్ళయిందో అలా ప్రత్యక్ష్యంగా హరికథ విని. చాలా బాగుంది. హరికథలో పిట్టకథలు మరీ బాగుంటాయి కదా..
   
  


        ఆవిధంగా మా నాన్నగారి శతజయంత్యుత్సవం చాలా బాగా జరిగింది. ఈ విధంగా మానాన్నగారి ముచ్చట్లు   మీ అందరితో కూడా పంచుకుంటున్నందుకు యింకా సంతోషంగా వుంది. 
------------------------------------------------------------------------------------
మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి శతజయంతి సందర్భమున ఆయన రచనలతో సమకూర్చిన ప్రచురణ.

ఈ పుస్తకం ప్రింటు పుస్తకంగానూ, ebook గానూ ఈ క్రింది link లో లభిస్తుంది.


http://kinige.com/kbook.php?id=3082
రచనాభినందనలతో, జి.ఎస్.లక్ష్మి..
 
  

Thursday, March 13, 2014

Ladies day Out




     మా లలితా మహిళామండలి సభ్యులందరం ప్రతియేడూ International women's day కి బయటకెక్కడికైనా వెళ్ళి lunch చేసి వస్తుంటాం. (హి హి యేదో ఆ పేరు చెప్పుకుని కాస్త సరదాగా friends తో గడపడానికి ఒక వంక అంతే..)
      అలాగే ఈ యేడు కూడా యెక్కడికెడదామా అనుకుంటుంటే మా సభ్యురాలు ఒకామె వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారనీ, మమ్మల్నందరినీ అక్కడకొచ్చి ఇల్లు చూసేక, అక్కడి నుంచి lunch కి వెడదామనీ అన్నారు. ఇంకనేం.. సెబాసో అంటూ రెండు కార్లూ, ఒక వేన్ లో బయల్దేరాం. నేనైతే కావాలని వేనే యెక్కేను. యెంచక్క బోల్డుమందితో కలిసి కూర్చుని అంత్యాక్షరి ఆడుకోవచ్చు కదా.. అందుకన్న మాట. అలాగే అంబర్‍పేట నుంచి జూబిలీహిల్స్ వెళ్ళేవరకూ గంటపైగా పాత, కొత్త సినిమా పాటలతో అందరం అదరగొట్టేసాం. పాపం.. ఆ వేన్ డ్రైవర్.. తర్వాత బహుశా ఎర్రగడ్డకి  దారి వెతుక్కునుండొచ్చు. పాపం శమించుగాక.
     ఆ friend పేరు రత్నావతి. వాళ్ళు jubilee hills లో ఇల్లు కట్టుకుంటున్నారు. చాలావరకూ అయిపోయింది. ఇంక painting అయ్యాక fittings మాత్రం వున్నాయి. ఇల్లు చాలా బాగుంది. మూడంతస్తులు. ఇంట్లోనే సౌకర్యంగా lift పెట్టించుకున్నారు.  ఒక్కొక్క అంతస్తులోనూ అన్ని రూములూ వరసగా చూసుకుంటూ మూడో అంతస్తు బాల్కనీలో సెటిల్ అయ్యాం.
    దుర్గ అంతర్జాతీయ మహిళాదినోత్సవం యే దేశంలో యెప్పటినుంచీ ప్రారంభం అయిందో చెపుతూ, మహిళల హక్కులను మహిళలే పరిరక్షించుకోవాలని చెప్పారు. విద్యుల్లత పరిపూర్ణమహిళకి నిర్వచనం చెప్పారు. అందరం కొన్ని కొన్ని సందేహాలు వారినడిగి తీర్చుకుంటూ వాళ్ళు చెప్పినవి శ్రధ్ధగా విన్నాం.




      ఒంటిగంట దాటాక జూబిలీహిల్స్ లోని క్లబ్‍లో లంచ్ యేర్పాటు చేసారు రత్నావతి. ఆవిడ అతిథులని గూర్చి యెంత శ్రధ్ధ తీసుకున్నారంటే.. ఆరోజు జూబిలీహిల్స్ క్లబ్‍లో సౌత్‍ఇండియన్ వంట చేసే కుక్ శెలవు పెట్టేడని అక్కడివాళ్ళు చెపితే.. మా ఫ్రెండ్స్ లో కొందరు మసాలాలు వేసిన కూరలు తినలేరని ఇంటిదగ్గర్నుంచే స్వయంగా గుత్తివంకాయకూర, దొండకాయ కూర, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసి తీసుకొచ్చారు. నిజంగా చాలా గొప్ప కదా.. హాయిగా అన్నిరకాలూ తినేసాం.


         అప్పటికి మధ్యాహ్నం మూడైంది. యెవరికీ ఇళ్లకి వెళ్లబుధ్ధవలేదు. అందరం కలిసి తంబోలా ఆడడం మొదలుపెట్టాం. నాలుగు దాటేదాకా సరదాగా కాలక్షేపం చేసుకుని "పోదామా ఇక పోదామా.." అనుకుంటూ ఇళ్ళకి చేరేటప్పటికి సాయంత్రం అయిదయింది.  

 మేమందరం కలిసి రత్నావతిగారికి నూతన గృహప్రవేశ సందర్భంగా మా సంతోషం ప్రకటించుకుంటూ ఒక చిన్న బహుమతిని అందజేశాం.


వీళ్ళిద్దరూ...రత్నావతి, ఆవిడ కోడలు లక్ష్మి.






       అవండీ... ఈ సంవత్సరం మా మహిళామండలి జరుపుకున్న మహిళాదినోత్సవ సంబరాల వివరాలు.. బాగున్నాయా...?

----------------------------------------------------------------------------------------

Wednesday, February 19, 2014

కాస్త ఆలోచిస్తే.



నేను రాసిన "కాస్త ఆలోచిస్తే.." అన్న కథ నవ్య వారపత్రిక కథలపోటీలో బహుమతి పొందింది. చదివి మీ అభిప్రాయాలు తెలియచేస్తారు కదూ..
లింక్ ఇదిగో...

http://www.navyaweekly.com/2014/feb/12/page42.asp

నవ్య వారపత్రిక సౌజన్యంతో...