Pages

Thursday, October 20, 2016

ఒక ఇల్లాలి కథ..పుస్తక పరిచయం


 ఆంధ్రభూమి వారపత్రికలో ఇరవై వారాలపాటు ధారావాహికంగా వచ్చిన,  "ఒక ఇల్లాలి కథ" అనే   నేను రాసిన నవలను పుస్తకంగా ప్రచురించడం జరిగింది.
అక్టోబరు 15, శనివారం సాయంత్రం 5 గంటలకు తార్నాకాలోని స్ప్రెడింగ్ లైట్ స్ లైబ్రరీహాల్లో
ఈ  పుస్తకపరిచయం జరిగింది..





ప్రముఖ రచయిత్రి, లెక్కకు మిక్కిలి  పురస్కారాలందుకున్న డి.కామేశ్వరిగారు  పుస్తకాన్ని పరిచయం చేసారు. ముందుమాట రాసింది కూడా ఆవిడే కనుక నవల గురించి విపులంగా వివరించారు. కామేశ్వరిగారు పుస్తకాన్ని గురించి చేసిన పరిచయవాక్యాలు ఆ పుస్తకానికే  హుందాతనాన్ని తీసుకొచ్చాయి.








గర్ల్ విత్ గోల్డెన్ పెన్ గా పేరొందిన మరో ప్రముఖ రచయిత్రి మన్నెం శారదగారి ఆగమనంతో సభ కళకళలాడింది. 
రచనావ్యాసంగంలో ఆవిడ అనుభవాలను గురించి చేసిన ప్రసంగం ఆహూతులను ఆకట్టుకుంది. 


ఇంకో ప్రముఖ రచయిత్రి, ఇండస్ట్రియలిస్టూ అయిన సోమరాజు సుశీలగారి రాకతో నాకు ఆనందం రెట్టింపయ్యింది. చిన్నపరిశ్రమలు నడపడంలోని సాధక బాధకాలను ఆవిడ వివరిస్తుంటే అందరూ ఆసక్తిగా విన్నారు. 



      స్ప్రెడింగ్ లైట్ నిర్వాహకురాలు జ్యోతి యెంతో అనుభవంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.


 నా హితులు, స్నేహితులు  చాలా దూరాలనుండి కూడా వచ్చి, నా ఆనందంలో పాలుపంచుకున్నారు.



   పుస్తకం మీద వున్న అభిమానంతో  ఈ పుస్తక పరిచయసభకు వచ్చిన పెద్దలు యెంతో ఆసక్తితో ఆద్యంతం సాహిత్య ప్రసంగాలను ఆస్వాదించారు.  





                    ఈ పుస్తకానికి డి. కామేశ్వరిగారు రాసిన ముందుమాట.. 







                                      


నా మాట.

 పాతికవరకూ కథలు పత్రికలలో ప్రచురించబడగానే “నవల రాయమ్మా..” అన్న మా నాన్నగారు శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి సంకల్పబలం నుండి పుట్టిందీ నవల.
  చిన్నప్పుడంతా మాకు స్వతంత్రపోరాటం గురించీ, అప్పటి సమాజ స్థితిగతులగురించీ చెపుతుండేవారు మా నాన్నగారు. ఆ స్వతంత్ర ఉద్యమ పోరాటం నాకు చాలా స్ఫూర్తి నిచ్చింది. ఎన్ని కుటుంబాలు ఆ పోరాటంలో ఆస్తులనీ, కుటుంబసభ్యులనీ పోగొట్టుకున్నారో చెప్పేవారు.  అందుకే ఆ నేపథ్యంలోనే 160 పేజీల ఈ నవల వ్రాసాను. వ్రాసాక నవల రాయడానికి మొట్టమొదటి ప్రయత్నం యెలా వచ్చిందో నని “రచన” మాసపత్రికలోని వసుంధరగారి సాహితీవైద్యానికి పంపించాను. దానికి వారి సాహితీ చికిత్స ఇలా వుంది. * “ఒక గొప్ప నవలకు అద్భుతమైన ఇతివృత్తం. వాస్తవికతకు అద్దంపట్టే సంఘటనలు, సహజత్వాన్ని నింపుకున్న పాత్రలు, సంప్రదాయాన్ని సవాలు చేసే ప్రశ్నలు, హృదయాలను కదిలించే విశ్లేషణ ఉన్నరచన. ప్రయోజనాత్మకమైన గొప్ప సంచలన చలన చిత్రానికి కావలసిన ముడిపదార్ధం ఈ రచనలో ఉంది.“ అని చెపుతూ,  నవలలోని ప్రతిపాత్రనూ విశిష్టంగానూ, ప్రత్యేకంగానూ పోషిస్తూ, కాలక్రమాన్ని సవరించుకుంటూ 250 పేజీలు వచ్చేవరకూ తిరగవ్రాయమన్నారు. ఇంతటి ప్రోత్సాహాన్నిచ్చిన వారి సహృదయతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి సూచనలనూ, సలహాలనూ పాటిస్తూ పాత్రపోషణ పరిపుష్టం చేస్తూ మరిన్ని పేజీలు వ్రాసి ఆంధ్రభూమి వారపత్రికకు పంపించిన నవల ప్రచురణార్హమైంది. “స్త్రీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా ఆవిష్కరించిన సీరియల్” అంటూ ఆంధ్రభూమి వారపత్రికవారు దీనిని 6/9/2007 నుంచి 17/1/2008 వారపత్రిక వరకూ ఇరవైవారాలపాటు ధారావాహికంగా ప్రచురించారు. నా మొట్టమొదటి నవలను పాఠకులకు అందించిన ఆంధ్రభూమి సంపాదకవర్గానికి నా ధన్యవాదాలు.
  ఎంతోమంది త్యాగమూర్తులు నిస్వార్ధంగా తమ ఆస్తులనూ, కుటుంబాలనూ చివరికి ప్రాణాలను కూడా పణంగాపెట్టి అహింసామార్గంలో సాధించారు మన స్వాతంత్ర్యం. అజ్ఞాత దేశభక్తులు యెందరో తమ తమ కుటుంబాలను వదిలి ఈ స్వతంత్రోద్యమంలో పాలు పంచుకున్నారు. అలాంటి ఒక దేశభక్తుడు దేశం కోసం ఇల్లూవాకిలీ త్యజించి ఉద్యమంలో పాలుపంచుకుంటే ఆ కుటుంబం యెదుర్కున్న కష్టనష్టాలు యెలా వుంటాయో చూపించే ప్రయత్నం చేసాను ఈ నవలలో. మగపిల్లలకే కాలేజీ చదువులూ, ఉద్యోగాలూ అప్పుడప్పుడే అలవాటవుతున్న ఆనాటి సామాజిక వ్యవస్థలో అలాంటి ఒక దేశభక్తుని కుటుంబం అప్పటి సాంప్రదాయాలను యెదిరించలేక, యెన్నివిధాలుగా సర్దుబాటు చేసుకుంటూ తమ మనుగడ సాగించిందో తెలియచెప్పాను. మారుతున్న పరిస్థితులు మనుషుల్లో యెటువంటి మార్పులు తెస్తాయో చూపించాను. స్వతంత్రం వచ్చి యిన్నేళ్ళు దాటిపోయాక అప్పటి తరం వారిని దాదాపు అందరూ మర్చిపోతున్నట్లనిపించి, యెంతమంది యెన్నిరకాలుగా త్యాగాలు చేస్తే మనమీ స్వతంత్రం అనుభవిస్తున్నామో మళ్ళీ ఒకసారి అందరికీ గుర్తు చేద్దామని అప్పటి కాలాన్ని ఈ నవలకు నేపథ్యంగా తీసుకున్నాను.
   సమాజంలో కొన్ని కొన్ని కుటుంబాలకి కొన్ని కొన్ని ముద్రలు పడిపోతుంటాయి. అలాంటి ఒక కుటుంబమే ఈ నవలలోని రమణమూర్తి కుటుంబం. వాళ్ళు చాలా గొప్పవారనీ, వాళ్లకి పంతాలూ, పట్టింపులూ యెక్కువనీ, ఇంకొకరు వీళ్ళ మాట వినాలి తప్పితే వీళ్ళు ఎవరిమాటా వినరనీ ఆ కుటుంబంపై వున్న ముద్ర. అలాంటి కుటుంబంలో పుట్టిన రమణమూర్తిలో అవన్నీ మరికాస్త యెక్కువే వున్నాయంటూ ఆ అహాన్ని అతను పెరుగుతున్నప్పుడు చుట్టపక్కాలు మరికాస్త పెంచి పోషించారు. అలాగ వారి వంశంలోవున్న పంతం పట్టుదల వల్ల చివరికి అతని మనసులోని మాట కూడా బైటకి రానీయని వ్యక్తి రమణమూర్తి, ఒక ఇల్లాలికి భర్త. భర్తంటే యిలాగే వుండాలీ అనే మూర్ఖపు మత్తులో వున్నవాడు. ఆ కుటుంబంలోని మిగిలిన వ్యక్తులు పూర్తిగా అవకాశవాదులు. ఆ ఇంట్లోకి కోడలుగా వచ్చిన ఇల్లాలు, ఈ నవలకు కథానాయిక స్వరాజ్యం.
   స్వతంత్రపోరాట సమయంలో పాల్గొన్న యెన్నో స్వార్ధ రహిత కుటుంబాలలో ఒకటైన సాంప్రదాయ కుటుంబంలోని స్త్రీ స్వరాజ్యం. తండ్రి సత్యాగ్రహంలో పాల్గొన్న కారణాన వారి కుటుంబం యెన్ని అవస్థలు పడిందో, అది స్వరాజ్యం వివాహజీవితం మీద యెలా ప్రభావం చూపించిందో చెపుతుందీ నవల. తల్లీ, మేనత్తా చెప్పినట్టే స్వరాజ్యం భర్తే దైవ మనుకుంటుంది. అతనికి ఇష్టం లేని విషయాన్ని కలలో కూడా తల్చుకోడానికి యిష్టపడదు. పతియే ప్రత్యక్ష్యదైవం, ఇల్లే కైలాసం అనుకునే ఆ గృహిణి జీవితంలో భర్త మూర్ఖంగా ప్రవర్తించిన తీరు ఆమెని ఇంట్లోంచి బైటకి పడేసింది. నెమ్మది నెమ్మదిగా చుట్టూ మనుషులను పరిశీలిస్తూ, పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ తనని తాను నిలబెట్టుకున్న స్వరాజ్యం అందరు ఆడవారికీ ఆదర్శంగా వుండాలన్నట్టు చిత్రించాను. అప్పటి సామాజిక స్థితిగతులు, కుటుంబ సాంప్రదాయాలు, ఉమ్మడికుటుంబాలలో స్త్రీల పరిస్థితులు నాకు తెలిసినంతవరకూ చూపెట్టగలిగాను. ఏ మనిషికైనా ఓర్పూ, సహనం అనేవి కొంతవరకే వుంటాయి. అవి హద్దులు దాటితే యేమవుతుందో చెపుతుందీ నవల.
  ఈ నవల వ్రాస్తున్నప్పుడు ప్రతి మలుపులోనూ, సన్నివేశాల చిత్రీకరణలోనూ చక్కటి సలహాలనిచ్చారు మావారు శ్రీ విశ్వనాథంగారు.  ముఖ్యంగా నవల ముగించవలసిన సమయంలో ఇటువంటి ముగింపు యివ్వడమా, వద్దా అని యిద్దరం రెండునెలలు చర్చించుకున్నాం. అంత విశ్లేషణాత్మకంగా ఈ నవల చదివి నన్ను ప్రోత్సహించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
  లెక్కకు మిక్కిలి అవార్డులు, పురస్కారాలూ అందుకున్న, మేం ఆప్యాయంగా “అక్కయ్యగారూ..” అని పిలుచుకునే ప్రఖ్యాత రచయిత్రి, సహృదయిని, స్నేహశీలి  డి. కామేశ్వరిగారు ఈ నవలకు ముందుమాట వ్రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
చక్కని సలహాలనిచ్చి పుస్తకం అందంగా రావడానికి సహకరించిన శ్రీ ఉదయ్ ప్రింటర్స్  వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
పాఠకులు దీనిని ఆదరిస్తారని నమ్ముతూ..
*జూలై, 2004- “రచన “ మాసపత్రిక- సాహితీవైద్యం.
--------------------------------------------------------
                                    ఇంకోమాట...
 ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలలోనూ లభిస్తుంది..
-------------------------------------------------------------------------------
స్ప్రెడింగ్ లైట్ నుండి నచ్చిన పుస్తకం శీర్షికన జ్యోతి వ్రాసిన సమీక్ష..
 to Nacchina PusthakamNovember 16 at 6:43amీవితాలను చర్చిస్తుంది. ఇప్పటి స్త్రిలకు లభించిన స్వేచ్చ వెనుక ఎంతటి ఘర్షణ ఉండీందో, దాన్ని నేడు సద్వినియొగపరుచుకోవలసిన అవసరం స్త్రిలకు ఎంత అవసరమో తెలియచేస్తుంది. ఇప్పటి ఆధునిక స్త్రిలకు రెండు తరాలనాటి వారి అమ్మమ్మల జీవితాల గురించి తెలిసింది చాలా తక్కువ. ఆనాటి స్త్రీల జీవితాల గురించి తెలుసుకుంటే కాని తమకు లభించిన అవకాశాలను అర్ధం చేసుకోలేరు. అందుకనీ ఇటువంటి కథలను చదవవలసిన అవసరం ఉంది. అలాగే స్వాతంత్ర్యసమర యొధుల కుటుంబాలు పడ్డ అవస్థలను గురించి కూడా తెలుసుకోవాలి. స్వరాజ్యం ఒక స్వాతంత్ర్యసమరయొధుని కూతురు. తండ్రి జైలుకెళ్ళి తిరిగి రాడు. ఏమయ్యడొ తెలీదు. దుర్భర దారిద్ర్యం అనుభవిస్తూ తల్లి మేనత్త ల మధ్య ఆమె, తమ్ముడు తిలక్ పెరుగుతారు. రమణమూర్తి ఆమెను కోరి పెళ్ళి చేసుకుంటాడు. కాని పెళ్ళి తరువాత ఆమె పుట్టింటితో ఎటువంటి సంబంధం ఉండకూడదని షరతు పెడతాడు. పేదరికం, పైగా పిల్లకి పెళ్ళి కాదనే భయంతో తల్లి ఈ వివాహం జరిపిస్తుంది. 35 సంవత్సరాలు అన్నిరకాలుగా అనుకూలమైన భార్యగా సేవ చేస్తూ తన కోరికలను, ఆశలను చంపుకుని స్వరాజ్యం జీవిస్తుంది. పిల్లలు లేకపోయినా తన మరిది, ఆడపడుచులను తన వాళ్ళుగా పెంచుతుంది. వారే డబ్బు కోసం చివరకు ఆమెను మోసం చెస్తారు. తన తల్లి చావు బ్రతుకులలో ఉందని తెలిసి భర ఇంట్లో లేని సమయంలో అత్తగారి అనుమతితో 55 సంవత్సరల వయసులో పుట్టింటికి తల్లిని చూడడానికి వెల్తుంది. భర్త ఇంట్లోకి రానీయడు. అప్పుడు తన అస్తిత్వం కోసం పోరాటం చేస్తుంది. ఆ తరం లో చాల మంది స్త్రిలకు కుటుంబం పేరుతో జరిగిన అన్యాయాలను ఈ నవల ద్వారా గుర్తు చేస్తారు రచయిత్రి.

------------------------------------------------------------------------------------------------------------------------
"విహంగ" అంతర్జాలపత్రికలో  మాలాకుమార్ వ్రాసిన సమీక్ష..

http://vihanga.com/?p=18878


ఒక ఇల్లాలి కథ(పుస్తక సమీక్ష )- మాలా కుమార్

ఒక ఇల్లాలి కథ
రచయిత్రి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు,బి.ఎ(లిట్),ఎం.ఎ.(సొషియాలజీ),డిప్లమా ఇన్ మ్యూజిక్ (కర్ణాటక సంగీతం, వీణ)చేసారు.గత పన్నెండు సంవత్సరాలుగా రచనలు చేస్తున్నారు.ఇప్పటి వరకూ డెభ్బై కి పైగా కథలు వివిధ ప్రింటు,అంతర్జాల పత్రికలల్లో ప్రచురించబడ్డాయి.”నాన్నలూ నేర్చుకోండిలా”, మినీ నవలగా నవంబర్ ,2011 ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడింది.కొన్ని కథలు కథావాహిని,ఆటా(అమెరికన్ తెలుగు అసోషియేషన్) జ్ఞాపక సంచిక, కథాకేళి, ప్రమదాక్షరి కథాసంపుటాలల్లో చోటు చేసుకున్నాయి. పలు కథలకు వివిధ పత్రికలల్లో బహుమతులు వచ్చాయి. బహుమతి పొందిన కథలల్లో కొన్నింటిని “అతను-ఆమె-కాలం” (బహుమతి కథల మణిహారం ) పేరిట కథల సంపుటిగా ప్రచురించారు.ఇరవై సంవత్సరాల నుండి ఆకాశవాణిలో పలు ప్రసంగాలు, కదంబ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి.

ఒక ఇల్లాలి కథ ” అన్న ఈ నవల 6 సెప్టెంబర్ 2007 నుండి,17 జనవరి 2008 వరకు 20 వారాల పాటు ఆంధ్రభూమి పత్రిక లో ధారావాహికంగా ప్రచురించబడింది.ఇంటికి దీపం ఇల్లాలు,ఇల్లాలు కంట తడిపెడితే ఇంటికి అశుభం వగైరా వగైరా సూక్తులు చెపుతూ ఇల్లాలిని పొగుడుతూ ఉంటారు. కాని నిజ జీవితము లో  ఇల్లాళ్ళకు ఈ గౌరవం దక్కుతోందా?సుందరమ్మ అత్తగారికైతే ఘోషా లో, ఇంటి పనిలోనే జీవితం గడిచిపోయింది. ఆ రోజులల్లో వంద ఎకరాలున్నవాళ్ళైనా సరే ,వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళకి ఈ రోజుల్లో ఉన్న సదుపాయాలు ఉండేవి కాదు. శారీరికంగా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది.ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళున్నా అందరికీ పని ఉండేది. పొద్దుగూకులూ ఇంట్లో ఏదైనా పని చూసుకోవటం తప్పితే వాళ్ళ సంగతేమిటి అని ఆలోచన ఉండేది కాదు. సుందరమ్మ తండ్రి జగన్నాథంగారికి కోనసీమలో సుక్షేత్రమైన పంటభూమి,కొబ్బరి తోటలు , సిరీసంపదా ఉన్నాయి. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు, ఆరుగు కొడుకులు. సుందరమ్మకు తొమ్మిది సంవత్సరాలకే పెళ్ళైంది. పదమూడోఏట కాపురానికి వెళ్ళింది.భర్త చదువు కోసం అత్తామామలతో కాకినాడ వెళ్ళి రెండు గదుల ఇంట్లో ఉంది. అత్తగారు చెప్పినట్లుగా కొప్పు ముడుచుకోవటము, గోచీపోసి చీర కట్టుకోవటము నేర్చుకుంది. ఒద్దికగా కాపురము చేసుకుంటోంది. బాల్య చాపల్యము ఆపుకోలేక ,పక్కింటి  నుంచి సంగీతము వినిపిస్తూ ఉంటే వెళ్ళి, పక్కవాళ్ళ పని మనిషినని చెప్పి ఆ హార్మనీ పెట్టె తెచ్చుకుంది. పక్కవాళ్ళు పోలీసులను పిలిచి గొడవ ఆయ్యే సరికి మామగారు తండ్రిని పిలిచి పుట్టింటికి పంపేసాడు. తండ్రి అంతకన్న పౌరుషంగా మామగారి మీద దావా వేసి బంగారము, మనోవర్తి తీసుకొని విడాకులు ఇప్పించేసాడు. అవేవీ సుందరమ్మ చేతికి రాలేదు. చివరి వరకు పుట్టింట్లో అందరికీ సేవలు చేయటమే సరిపోయింది. తండ్రి తదనంతరము కొంచము గట్టిగా వాదించి మరదలు, పిల్లలకు ఒక గది, కొంత డబ్బు సమకూర్చ కలిగింది. అదొక్కటే ఆమే చేయగలిగింది.ఆమె తప్పేమీ లేకుండానే పెద్దవాళ్ళ పంతాలల్లో ఆమె జీవితం నలిగిపోయింది.సరస్వతి జగన్నాథరావు గారి కోడలు.పరమేశ్వరం భార్య.స్వరాజ్యం,తిలక్ లకు తల్లి.వ్యవసాయం చేసుకునేవాడికి పిల్లనిస్తే చాకిరీతోనే సరిపోతుంది.పిల్లవాడు చదువుకుంటున్నాడు. ప్లీడరీ చదువుతే మెజిస్ట్రేట్ అవుతాడు లేదా ప్రాక్టీస్ పెట్టినా రెండు చేతులా సంపాదిస్తాడు అని సరస్వతి తండ్రి ఆలోచించి చదువుకుంటున్న పరమేశ్వరానికి సరస్వతి ని ఇచ్చి పెళ్ళిచేసారు. సరస్వతి ఎంత బాధ్యతగా ఉండాలో సరిగ్గా అలాగే ఉండేది. అత్తా,మామగారు, ఆడపడుచులు, బావగార్లు, మరుదులు ఉమ్మడి కుటుంబములో ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. కాని పరమేశ్వరం చదువుకుంటుండగానే స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉద్యమంలో పాల్గొని జైల్ కు వెళ్ళటము , రావటమే సరిపోయింది. చివరిసారిగా 1946 లో జైల్ కు వెళ్ళి తిరిగి రాలేదు.అసలు ఉన్నాడో , చనిపోయాడో కూడా తెలీదు.సుందరమ్మ వారికి ఓ గూడు ఏర్పర్చకలిగింది. బయటవారి ముందు బయటపడకుండా బావగార్ల ఇళ్ళళ్ళో సాయం చేసి వారు ఇచ్చింది పుచ్చుకొని గుట్టుగా సంసారం గడుపుకొచ్చింది. తండ్రి మూలంగానే ఈ కష్టాలు అని పిల్లలు అంటే ఒప్పుకునేది కాదు.”ఊళ్ళో ఇంత మంది ఉన్నారు.ఒక్కళ్ళైనా దేశం కోసం జైలుకెళ్ళారా? అందుకే ఈ ఊళ్ళో అందరికంటే మీ నాన్నగారు గొప్పవారు.ఎవరి కుటుంబం వారు చూసుకోవటం కాదు.దేశాన్ని బానిసత్వం నుంచి విడిపించటం గొప్ప.”అనేది.అలా చెపుతున్నప్పుడు ఆమే మొహం తేజోమయం అయ్యేది.కళ్ళళ్ళో కాంతులు కురిసేవి.ఎన్ని కష్టాలు పడ్డా ఏరోజూ భర్తను నిందించలేదు.నిజంగా దేశం కోసం పోరాడిన యోధుల కన్న వారి తో సమానముగా త్యాగాలు చేసిన వారి భార్యల త్యాగము గొప్పది.వారి త్యాగానికి గుర్తిపులేదు. చదువు కాని, అన్నదమ్ముల సహకారము కాని లేకుండా కష్టపడి పిల్లలను తీర్చిదిద్దిన సరస్వతి పాత్ర అపూర్వమైనది.స్వరాజ్య తల్లీ , మేనత్త ఏదో గుట్టుగా సంసారం గుంజుకొస్తున్నారు.స్వరాజ్యం పెళ్ళిడుకొచ్చింది.బాధ్యత తీసుకొని సంబంధం చూసి పెళ్ళిచేసే పెద్ద దిక్కు ఎవరూ లేరు.అలాంటిరోజులల్లో రమణమూర్తి స్వరాజ్యం ను చూసి ఇష్టపడి,పెళ్ళిచేసుకుంటానని సూర్యం మాష్టారితో కబురు చేసాడు.దాని తో పాటు పెళ్ళు తరువాత స్వరాజ్యం ను ఎవరూ కలవరాదని , పుట్టింటి తో సంబంధం ఉండకూడదనీ కండీషన్ పెట్టాడు .చాలా ఆలోచించి, వాళ్ళున్న పరిస్థితులల్లో ఇంకోవేరే సంబంధం తేలేరని,మంచిసంబంధం వదులుకోవద్దని స్వరాజ్యంను ,రమణమూర్తికి ఇచ్చి పెళ్ళిచేసి పంపించేసారు తల్లీ, మేనత్త.రమణమూర్తి వంశం వారికి ఏమున్నా లేకపోయినా పంతాలూ పట్టుదలలూ ఎక్కువ.వాళ్ళు ఏదన్నా మాట అన్నారంటే మిన్ను విరిగి మీద పడినా సరే ఆ మాట మీదే నిలబడతారు.మహా పౌరుషం కలవారని పేరు.అలాంటి వాడికి భార్యగా వచ్చింది స్వరాజ్యం. పెద్దవాళ్ళు చెప్పినట్టు పతియే ప్రత్యక్షదైవం అనుకొంది. ఆ కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. నలుగురిలో రమణమూర్తి గొప్ప వ్యక్తి అన్నట్లు ఇంప్రెషన్ ఇచ్చేది.అందరూ ఆయనను గౌరవించి, వినయంగా మాట్లాడేటట్టు చేసేది. ఆడపడుచును,మరిదిని సొంతపిల్లలా పెంచి వారి కోరికలు తీర్చేది.అందరూ తనను ఉపయోగించుకుంటున్నారని తెలిసినా పట్టించుకునేది కాదు.అంత విధేయముగా ఉన్న స్వరాజ్యము తల్లికి బాగాలేదని తెలిసి , అత్తగారి అనుమతి తో , భర్త ఊళ్ళో లేనప్పుడు పుట్టింటి కి వెళ్ళింది.తన మాట జవదాటి,తనకు చెప్పకుండా పుట్టింటి కి వెళ్ళిందన్న కోపం తో తిరిగి వచ్చిన ఆమె ఇంట్లోకి రాకుండా తలుపులుమూసేసాడు రమణమూర్తి.తిరిగి తమ్ముడి ఇంటికి చేరిన స్వరాజ్యం తన మరదలు లలిత, మేనకోడలు స్రవంతి సహకారంతో కోలుకుంది.తనకంటూ ఒక బాటను ఏర్పర్చుకుంది.మనోవర్తి కోసం రమణమూర్తి మీద దావా వేసింది. ఇంటికి తిరిగి రమ్మన్న అత్తగారి మాటను త్రోసిపుచ్చింది.తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంది. అమాయకురాలైన స్వరాజ్యంలో మార్పు వచ్చింది. ఈతరం యువతకి ప్రతినిధి స్రవంతి. ఇంజనీరింగ్ చదువుతోంది. స్వతంత్ర భావాలు కలది. అత్తకు అండగా నిలబడుతుంది.అన్యాయాన్ని ఎదుర్కునే స్వభావము కలది.ఇలా ఐదుతరాల స్త్రీల వ్యక్తిత్వాన్ని, వారి పరిస్థితులను చూపించారు రచయిత్రి ఈ “ఒక ఇల్లాలి కథ” నవలలో.సరస్వతి తరం వరకూ చాలా మంది ఇల్లాళ్ళకు అంతగా గౌరవం దక్కలేదు. ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా పరిస్థితులు మారుతున్నట్లుగా లలిత, స్రవంతిల పాత్రలతో చూపించారు. స్వాతంత్ర్యసమరం రోజుల గురించి బాగా వివరించారు. అప్పటి నుంచి కొద్ది కొద్దిగా మారుతున్న సామాజిక స్థితి గతులు,కుటుంబసాంప్రదాయాలు,ఉమ్మడికుటుంబాలల్లో స్త్రీల పరిస్థితులు చూపించారు.కవర్ పేజీ లోనే బురద నుంచి బయటకు వచ్చిన తామరపూవును స్త్రీ పరిస్థితిలో వచ్చిన మార్పుకు సింబాలిక్ గా గొప్పగా చూపించారు. ఇక ముగింపు గురించి అంటే తనను తాను నిలబెట్టుకున్న స్వరాజ్యం అందరికీ ఆదర్శంగా ఉండాలి అన్నట్లుగా చిత్రీకరించాను అన్నారు.అదీ నిజమే.

----------------------------------------------------------------------------------------------

19-12-2016 వ తేదీన "నమస్తే తెలంగాణ" వార్తాపత్రికలో ఈ నవలపై వచ్చిన సమీక్ష..

















జూన్ 10, 2017, ఆంధ్రభూమి "అక్షర." లో ఈ నవలపై శ్రీ విహారిగారు వ్రాసిన సమీక్ష..


స్త్రీ వ్యక్తిత్వ ఔన్నత్య చిత్రణ
నవలలో ఇతివృత్తం సామాజికమై, సమాజానికీ, వ్యక్తులకీ మధ్య సంఘర్షణ సంభావ్యంగానూ, సంక్లిష్టంగానూ, వాస్తవికత ఆధారంగానూ ఉంటే - రచన ఉత్కంఠ ప్రధానంగా సాగుతుంది. అలాగే, సంఘటనలు ఒకదాని వెంట ఒకటి త్వరత్వరగా జరుగుతూ - పాత్ర ప్రమేయం ప్రస్ఫుటంగా ఉండి కథనం సరళశైలిలో సాగుతుంటే - నవలకి చదివించే గుణం మంచి ఆహార్యంగా నప్పుతుంది. జి.ఎస్.లక్ష్మిఒక ఇల్లాలి కథనవలలో గుణ విశేషాలన్నీ చక్కగా కుదురుకున్నై.
స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న సాంఘిక స్థితిగతులూ, కొన్ని కుటుంబాల్లోని త్యాగశీలుర విలువల పాటింపూ, దానికి పర్యవసానంగా తర్వాతి తరం వారుసర్వమూ కోలుపోయిన రాజరాజులుగామిగిలిపోవటం.. వంటి యథార్థాలు చారిత్రక చేదు మాత్రలు. నవలలోని వస్తువుకి ఇలాంటి యథార్థాలు కొన్ని నేపథ్యంగా నిలిచాయి. నేపథ్యంతో ఇప్పటి తరంలో మిగిలి ఉన్న కుటుంబంలోని ఒక స్వరాజ్యం కథ - నవల.
ఇతివృత్తం ఇలా సాగుతుంది.
స్వరాజ్యానికి పద్దెనిమిదో ఏట పెళ్ళైంది. కథాకాలం నాటికి ఆమె సంసార జీవనం, అత్తింట్లో మొదలైంది. భర్త రమణమూర్తి. అనువంశికంగా వచ్చిన అభిజాత్యం, పురుషాధిక్యత, పంతం, పట్టుదల మూర్త్భీవించిన మగవాడు! రచయిత్రి మాటల్లో్భర్తంటే ఇలా ఉండాలీ అనే మూర్ఖపు మత్తులో ఉన్నవాడు.’ నిర్ణయాధికారం అన్ని విషయాల్లో తనదే - అనే నిశ్చితాభిప్రాయం కలిగినవాడు. దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే అతనునరసింహావతారం ఎత్తుతాడు. అతనికి తండ్రి చనిపోయాడు. తల్లీ చెల్లెలూ, తమ్ముడు - అతని సంరక్షణలో ఉన్నారు. తల్లి అతనికి వత్తాసు. తమ్ముడు, చెల్లెలు అవకాశవాదులు. స్వరాజ్యం సహనశీలి. వివేకవతి. ‘పతివ్రత. రమణమూర్తి ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకని స్వరాజ్యమనే మొక్కని వేళ్లతో సహా పెకిలించి పట్టుకొచ్చి తన పెరట్లో పాతేసుకున్నాడు. ఆమెకూ, ఆమె వారికీ మధ్య మాటలూ, రాకపోకలూ బంద్ చేశాడు. స్వరాజ్యం తన కన్నతల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో -్భర్తకి చెప్పకుండా పుట్టింటికి వెళ్లింది. తల్లికి కులాసా చిక్కింది. తన ఇంటికి తిరిగి వచ్చింది స్వరాజ్యం. లోపలికి రానీయకుండా ఆమెని గుమ్మంలో నిలబెట్టాడు భర్త. అత్త, ఆడపడుచు, మరిదీ - కూడా దౌష్ట్యాన్ని ఎదుర్కోరు. రాత్రి దాకా ఒక్కతీ అలాగే అక్కడ ప్రాణాచారం పడింది - స్వరాజ్యం. చివరికి అతి నీరసంతో, తూలిపోతూ, అభిమానంతో కుంగిపోతూ వెనుదిరిగింది. కడకు - పుట్టింటికి చేరింది. విడాకులకి కేసు వేసింది. శాంతి ఆశ్రమంఅమ్మతో పరిచయమైంది. కేసు ఫైలు చేసింది. తీర్పు ప్రకారం భరణం ఇవ్వటం లేదు రమణమూర్తి. అతను మానసికంగా దెబ్బతిన్నాడు. స్వరాజ్యంని తిరిగి రమ్మని రాయబారాలు పంపుతాడు. స్వరాజ్యం అంగీకరించదు. ఇంతలో ఆశ్రమం అజమాయిషీనిఅమ్మస్వరాజ్యం చేతిలో పెడుతుంది. రమణమూర్తి పిచ్చివాడే అయ్యాడు. అతని తల్లి కూడా కోడల్ని తిరిగి రమ్మని ప్రాధేయపడుతుంది. ‘అవునత్తయ్యా స్వరాజ్యం రాదు, ఎందుకంటే.. స్వరాజ్యానికి స్వరాజ్యం వచ్చిందిఅంటూ చివరి మాటగా తన నిర్ణయాన్ని చెబుతుంది. నవల అలా ముగిసింది!!
స్వరాజ్యంని ఒకరోజల్లా రమణమూర్తి తన ఇంటి బయట నిలబెట్టి ఉంచేసిన దుస్సంఘటన వంటి చిత్రణలు ఆర్ద్రంగా సాగి చదువరుల మనసుకు హత్తుకొనేలా ఉన్నాయి. నవలలో పాత్ర చిత్రణదే పెద్దపీట. ఇతివృత్త పరిధిలో పాత్రకాపాత్ర స్వాభావికంగా చిత్రించబడింది. లక్ష్మిగారి కథనంలో స్థిమితం, గాంభీర్యం ఉన్నాయి. ఒక ఇల్లాలి జీవితంలో వివిధ దశా విశేషాల్నీ ఆమె వ్యక్తిత్వ నిరూపణతో - సన్నివేశ సృష్టితోకాక - సంఘటనాత్మకంగా ఆవిష్కరించారు రచయిత్రి. కారణం వల్లనే సీరియల్గా నవల మంచి పాఠకాదరణని పొందింది.

-విహారి
---------------------------------------


జూలై, 2017 కౌముది అంతర్జాల పత్రికలో నేను వ్రాసిన “ఒక ఇల్లాలి కథ”పై వచ్చిన సమీక్ష..
అరుదుగా వ్రాసినా ఆలోచింపచేసే కథావస్తువులతో, చదివించే శైలితో కథలు వ్రాస్తున్న రచయిత్రిగా జి.ఎస్.లక్ష్మిగారు తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. లక్ష్మిగారు వ్రాసిన కథల్లో ఇతివృత్తాలు ఎంతగా మనసులకు హత్తుకుంటాయో, ఆలోచింపచేస్తాయో – అలాంటి ఇతివృత్తంతో వారు వ్రాసిన తొలి నవల ఈ “ఇల్లాలి కథ”. “స్త్రీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా ఆవిష్కరించిన సీరియల్” అనే టాగ్ లైన్ తో ఆంధ్రభూమి వారపత్రికలో 2007 సెప్టెంబర్ నుంచి 2008 జనవరి వరకూ సీరియల్ గా ప్రచురించారు. కాస్త ఆలశ్యంగా క్రిందటి సంవత్సరమే ఈ నవల పుస్తకరూపంలో తెలుగు పాఠకుల ముందుకు వచ్చింది. ఈ నవల ఇంకా డ్రాఫ్ట్ స్థాయిలో ఉండగానే, ప్రముఖ రచయిత వసుంధరగారు ఈ నవలను పరిశీలించి, స్పందన తెలియచేస్తూ, “ఒక గొప్ప నవలకు అద్భుతమైన ఇతివృత్తం. వాస్తవికతకు అద్దం పట్టే సంఘటనలు, సహజత్వాన్ని నిలుపుకున్న పాత్రలు, సంప్రదాయాన్ని సవాలు చేసే ప్రశ్నలు, హృదయాలను కదిలించే విశ్లేషణ ఉన్న రచన” అన్నారు. ఈ నవల చదివిన పాఠకులు ప్రతి ఒక్కరూ వసుంధరగారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. నవల రచనాశైలి అతి సరళంగా సాఫీగా సాగింది. పాత్రలూ, వాటి వ్యక్తిత్వ చిత్రణా పాఠకులని కథాక్రమంలోకి తీసుకెళ్తాయి. పాత్రల మధ్య జరిగే సంభాషణలూ, రచయిత్రి చెప్పే నెరేషన్ రెండింటినీ సమతూకంతో నడిపింఛారు. మొదటి నవలే అయినా చాలా అనుభవమున్న నవలా రచయిత్రి వ్రాసినట్లే ఉంటుందీ నవల.  భర్త మూర్ఖత్వానికీ, తిరస్కారానికీ గురైన మధ్యతరగతి మహిళ జీవితంలో జరిగిన సంఘటనలు, ప్రతికూల పరిస్థితులని ఎదుర్కొని ఆమె సాగించిన జీవన పోరాటం, నవల ముగింపులో ఆమె తీసుకున్న నిర్ణయం…పాఠకులని ఏకబిగిన చదివిస్తాయి. ప్రథానపాత్రయొక్క తండ్రి గురించి వివరించేప్పుడు భారత దేశ స్వాతంత్ర పోరాట సమయంలోని పరిస్థితులు, అప్పటి మధ్యతరగతి జీవితాల్లోని సన్నివేశాలు అతి సమర్ధవంతంగా చిత్రించారు రచయిత్రి. ఇంటర్నెట్, సెల్ ఫోన్, ఫేస్ బుక్… ఈ నేపథ్యాలతో కథలూ, నవలలూ వస్తున్న ఈ కాలంలో చక్కటి సాంప్రదాయబధ్ధమైన కథాంశం, పాత్రలతో సాగే ఈ నవల పాఠకులకి గొప్ప రిలీఫ్ ని ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ధన్యవాదాలు కిరణ్‍ప్రభగారూ..
-------------------------------


Tuesday, September 20, 2016

ప్రేమా పిచ్చీ ఒకటే..


18-9-2016 ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో వచ్చిన నేను వ్రాసిన కథ.."ప్రేమా పిచ్చీ ఒకటే.."

లింక్ కింద యిస్తున్నాను. ఒకవేళ యెవరికైనా చదవడానికి యిబ్బందిగా వుంటే కింద పెద్ద అక్షరాలతో టైప్ చేసింది పెడుతున్నాను. మీ అభిప్రాయాలు నాకు చాలా అమూల్యమని గ్రహిస్తారు కదూ!..

http://www.andhrabhoomi.net/weekly_special/aadivaram_listing/45


ప్రేమా పిచ్చీ ఒకటే..
                                                                                        జి.ఎస్.లక్ష్మి..
  “పిచ్చిదాన్ని కాపరానికి తీసుకొస్తానంటావేంట్రా.. దాని పిచ్చి నీక్కూడా అంటుకుందేంటీ?”
గొంతెత్తి గట్టిగా అరుస్తున్న జానకిని చూసి ఆమెని యెప్పుడూ అలా చూడని కొడుకు వినయ్, భర్త శేఖర్ తెల్లబోయారు.
వాళ్లని అలా చూసి అపరశాంతమూర్తిగా పేరు తెచ్చుకున్న జానకి తనని తాను సంబాళించుకుంది. గొంతు తగ్గించి నెమ్మదిగా అంది. “ మొన్ననేకదా మనం వినూని చూసి వచ్చాం. భద్రకాళిలా మీద పడిపోతుంటే ఎంత భయపడ్డామో అప్పుడే మర్చిపోయావా? దాన్నింటికి తెస్తే ఎప్పుడొచ్చి మీద పడుతుందో ననుకుంటూ గదిలో పెట్టి తాళం వెయ్యాలి. వేళకి దాని తిండీతిప్పలూ చూడాలి. అవన్నీ ఒక యెత్తైతే రోజుల పసిగుడ్డు ఆ చంటిదాన్ని క్షణక్షణం చూసుకోవాలి. ఇవన్నీ మనం చెయ్యగలవనే అంటున్నావా?”
     యదార్థాన్ని అంత స్పష్టంగా వివరించిన జానకి మాటలకి తండ్రీకొడుకులిద్దరూ కాసేపు ఏమీ మాట్లాడలేకపోయేరు. పదిహేనురోజులక్రితం పాప పుట్టిందనే సంబరంతో వినీతని చూడడానికి వియ్యాలవారింటికి వెళ్ళినప్పటి సంగతి ఒక్కసారి గుర్తొచ్చింది ముగ్గురికీ.
    జానకి, శేఖర్ లకి వినయ్ ఒక్కడే కొడుకు. తల్లితండ్రులదగ్గరినుంచి చదువు, సంస్కారం చక్కగా అందుకున్నాడు. మంచి ఉద్యోగంలో వున్నాడు. సంప్రదాయంగా తల్లితండ్రులు యెంచి, మెచ్చిన వినీతని సుముహూర్తంలో తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఏవో చిన్న చిన్న తేడాలు తప్పితే రెండు కుటుంబాల మధ్యా ఏ విధమైన గొడవలూ లేవు. అలాగ చక్కగా సాగుతున్న సంసారంలోకి ఓ చిన్నప్రాణి అడుగిడబోతోందనే వార్త వారందరినీ ఎనలేని ఆనందంలో ముంచెత్తింది. రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇంట్లో చంటిపాప పారాడబోతోంది. రెండిళ్ళలోనూ ఎంతో ఉత్సాహం. వేడుకలు, విందులతోబాటు ప్రతీనెలా మెడికల్ చెక్ అప్‍కి ఖచ్చితంగా తీసికెళ్ళేవాడు వినయ్. ఏడోనెలలో పురిటికి పుట్టింటికి హైద్రాబాదు వెళ్ళింది వినీత. అప్పటినుంచి పురుడొచ్చేవరకూ ప్రతిరోజూ ఫోన్ లో మాట్లాడుకునేవారు వినయ్, వినీతా కూడా. అంతా బాగుందన్నారు డాక్టర్లూ, పెద్దలూ కూడా.
      ఒక రోజు ఉదయాన్నే పాప పుట్టిందన్న శుభవార్త వినగానే ఏనుగెక్కినంత ఆనందపడిపోయాడు వినయ్. జానకీ, శేఖర్ల ఆనందానికింక అవధులే లేవు. పదకొండోరోజు బారసాల చేసుకుంటామంటే , సిజేరియన్ ఆపరేషన్ అయింది కనుక వినీత పీటల మీద కూర్చోడం కష్టం కనుక, బారసాల మూడో నెలలో చేసుకుందామన్న వియ్యాలవారి మాటను కాదనలేకపోయారు. కానీ, మనవరాలిని చూడడానికి మూణ్ణెల్లు ఆగలేక పురుడొచ్చిన పదిహేనురోజులకి నక్షత్రం మంచిదే కనుక పాపని చూస్తామంటూ చెన్నై నుంచి ముగ్గురూ హైద్రాబాదు వియ్యాలవారింటికి వచ్చారు. వీళ్ళని చూసి కాస్త ఇబ్బంది పడుతూనే ఆహ్వానించారు వినీత తల్లితండ్రులు భాస్కర్, సుగుణ.
“ఏదీ మా మనవరాలూ?” అంటూ ఇంట్లో అడుగుపెడుతూనే చొరవగా బెడ్‍రూమ్‍ల వైపు వెళ్ళబోతున్న జానకిని వినీత వున్నరూమ్ వైపు తీసికెళ్ళింది సుగుణ. చంటిపిల్ల పడుకుందేమో అనుకుంటూ చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా తలుపులు తోసింది జానకి. 
    చీకటిగా వున్న గదిలోకి సన్నగా పడిన వెలుతురు గీతని చూసిన వినీత పక్కమీంచి ఒక్క ఉదుటున లేచింది. నెమ్మదిగా తలుపు తోసుకు తొంగిచూస్తున్న అత్తగారిని చూసింది. అంతే.. ఒక్కసారిగా పక్కనే పడుకోబెట్టుకున్న చంటిపాపని అమాంతం గుండెలకి హత్తుకుంది. “ఫో.. ఫో.. నేను నా పాపని యివ్వను.. ఫో బైటకి.” అంటూ గట్టిగా అరవడం మొదలెట్టింది. స్థాణువయ్యింది జానకి. గట్టిగా అరుపులు వినిపించి వెనకనే వున్న శేఖర్, వినయ్ కాస్త తొంగి చూసారు. చెదిరిపోయిన జుట్టుతో, బెదురుతున్న కళ్ళతో, తెచ్చిపట్టుకున్న కోపంతో గట్టిగా అరుస్తున్న వినీతని చూసి తెల్లబోయారు. హడిలిపోయిన జానకి వెంటనే తలుపులు మూసేసి వెనక్కి తిరిగింది. పాలిపోయిన మొహాలతో భాస్కర్, సుగుణలు క్షమించమన్నట్టు చూసారు వీళ్లని. అప్పుడే అక్కడికొచ్చిన ఫామిలీడాక్టర్ మహేష్ జరిగింది గ్రహించి అందరినీ ఉద్దేశిస్తూ..”రండి, కూర్చుందాం” అంటూ వాళ్ళని హాల్లో సోఫాలవైపు నడిపించాడు.
“డాక్టర్ గారూ, ఇప్పుడే ప్రయాణం చేసొచ్చారు. కాస్త కాఫీలు తాగాక అంతా చెపుదురుగాని..”  అంది వినీత తల్లి సుగుణ.
“అవునండీ, ముందు కాస్త రిలాక్స్ అవండి. అప్పుడు మాట్లాడుకుందాం.” అంటున్న డాక్టర్ మాటలు అర్ధం కాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు జానకి, శేఖర్, వినయ్.  వరాల మొలక చంటిపాపని చూడడానికి ఉప్పొంగుతున్న ఉత్సాహంతో  వచ్చిన  ఆ ముగ్గురూ రాక్షసిలా అరుస్తూ మీదపడుతున్న వినీతని చూసి స్థాణువులయ్యారు.  వారికసలు నోటమ్మట మాటనేదే రాలేదు.
   భాస్కర్, సుగుణల బలవంతం మీద స్నానాలు చేసి, కాఫీ. టిఫిన్లు ముగించి అందరూ హాల్లో కూర్చుని స్థిమితపడ్డాక భాస్కర్ వాళ్ళ ఫామిలీడాక్టర్ మహేష్ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. ముందుగా జానకిని చూసి,
 “అమ్మా, మీరు ఖంగారు పడకండి. అంతా వివరంగా చెప్తాను..” అంటూ అందరినీ ఉద్దేశించి చెప్పసాగాడు.
 “మొదటినుంచీ జరిగిందంతా చెప్తాను.  చదువు, సంస్కారం వున్నవారు, అర్ధం చేసుకుంటారనే అనుకుంటున్నాను.
    మామూలుగా తొమ్మిదినెలలూ నిండాక మీ కోడలు వినీతని చెకప్‍కి తీసికెళ్ళినప్పుడు బేబీ బాగా తయారయిందనీ, ఎప్పుడైనా పురుడు రావచ్చనీ గైనకాలజిస్ట్ చెప్పింది. అలా చెప్పాక కూడా వారం గడిచినా నెప్పులు రాక అనీజీగా అనిపిస్తే హాస్పిటల్ లో జాయిన్ చేసుకుంది. మామూలుగా నొప్పులొస్తే ఫరవాలేదు, లేకపోతే పరిస్థితిని బట్టి సిజేరియన్ చేస్తాను అంది. అదంతా మీకు తెలిసిందే కదా.. కానీ అప్పుడే వినీత మనసులో ఒక సందేహానికి ఒక బీజం పడింది, అదేవిటంటే సిజేరియన్ చేసినప్పుడు తనకి మత్తుమందు ఇస్తారనీ, అలా ఇచ్చినప్పుడు తనకి తెలీకుండా తన పాపని తీసికెళ్ళి పోతారనీ ఒక విధమైన భయోద్వేగానికి లోనయింది. మరి అలా ఎందుకనుకుందో మాకు తెలీలేదు కానీ అలా జరగదని మేమెంత నచ్చచెప్పినా వినలేదు. ఆపరేషన్‍కి కానీ, మత్తుమందు ఇవ్వడానికి కానీ ఒప్పుకోలేదు. ఇంక సిజేరియన్ చెయ్యకతప్పని పరిస్థితుల్లో ఒకవిధంగా బలవంతంగానే వినీతకి అనస్తీషియా ఇవ్వవలసొచ్చింది. ఆపరేషను అంతా బాగానే అయిందీ, పాప కూడా హెల్దీగానే వుందీ అని అందరం సంతోషిస్తున్న టైమ్ లో తెలివిలోకి వచ్చిన వినీత ప్రవర్తన విచిత్రంగా  మారిపోయింది.  పాపని ఒక్కక్షణం వదిలి పెట్టటం లేదు. ఒక్క క్షణం వదిలినా ఎవరో తీసికెళ్ళిపోతారేమోననే భయం ఎందుకో తనలో ప్రవేశించింది.  తన దగ్గరికి ఎవరైనా వస్తే చాలు తన పాపని తీసికెళ్ళిపోతారనే భయంతో చంటిపిల్లని మరింత దగ్గరికి తీసుకుని గట్టిగట్టిగా అరిచేస్తోంది. ఎందుకిలా చేస్తోందో మాకేమీ అర్ధం కావటం లేదు. ఆపరేషనంతా బాగా అయి, తల్లీ, బిడ్డా క్షేమంగా వున్నారని సంతోషపడుతుండగానే ఏవిటో వినీత ప్రవర్తన ఇలా మారిపోయింది. “
వింటున్న శ్రోతలు నిశ్చేష్టులయ్యారు. డాక్టర్ చెప్పడం ఆపగానే కళ్ళనీళ్లపర్యంతమౌతూ.
 “తనకి తెలీకుండా మత్తుమందు ఇచ్చేసామని మామీద కూడా నమ్మకం పోయి, పాపని మా చేతికి కూడా ఇవ్వటం లేదు. ఎవరొచ్చి తన పాపని తీసేసుకుంటారో అన్నట్టు గాలి కూడా రాకుండా తలుపులు, కిటికీలు మూసేసుకుని ఆ చంటిదాన్ని ఒళ్ళో పెట్టుకు కూర్చుంటుంది. అందుకే ఇప్పుడు మీరు వెళ్ళగానే పాపని తీసేసుకుంటారేమోనని అంత గట్టిగా అరిచేసింది.” అంది సుగుణ.
      వింటున్న శేఖర్ కుటుంబం తెల్లబోయింది.  వినయ్, వినీతల వివాహం జరిగి అప్పటికి నాలుగేళ్ళయింది. అత్తగారిని తల్లి స్థానంలో నిలబెట్టుకుని, ఆవిడ చెప్పినట్టే వినయ్ వాళ్ళ కుటుంబ పధ్ధతులకీ, సాంప్రదాయాలకీ చాలా తొందరగా అలవాటు పడిపోయింది వినీత. ఇప్పటి రోజుల్లోని ఆడపిల్లల్లా విరగబాటు లేకుండా ,ఇంట్లో అందరితో చక్కగా కలిసిపోయిన  వినీత అంటే అత్త జానకికి చాలా అభిమానం. మామూలుగానే ఆడపిల్లలంటే కొంచెం ఇష్టపడే జానకి వినీత కోడలయ్యాక తనకి కూతురు లేని లోటు తీరినట్టే అనుకుంది.  గర్భవతి అయ్యి ఏడోనెల వెళ్ళిపోతుందనగా  ఇంక తప్పదన్నట్టు పురిటికి పుట్టింటికి వచ్చింది. అలా వచ్చిందన్న మాటేకానీ, రోజూ ఉదయం, సాయంత్రం చెన్నై ఫోన్ చేసి, వినయ్ తోనూ, జానకితోనూ మాట్లాడి, అక్కడి ఇంట్లో ఆరోజు ఏం జరిగిందో తెలుసుకుంటూనే వుండేది వినీత. అంతగా తమ ఇంట్లో కలిసిపోయిన వినీత ఇలా రాక్షసిలా అరుస్తూ మీద పడిపోవడమేవిటో అస్సలు అర్ధం కాలేదు వాళ్ళ ముగ్గురికీ. అందులోనూ ఇప్పుడు డాక్టర్ చెప్తున్నది వింటుంటే పాపని వాళ్ళ అమ్మానాన్నలకి కూడా ఇవ్వట్లేదనీ, ఎవ్వరినీ దగ్గరికి కూడా రానివ్వటంలేదనీ తెలిసి ఇంకా ఆశ్చర్యపోయారు. 
జరిగినదంతా శ్రధ్ధగా వింటున్న శేఖర్ కాస్త తేరుకుని, “మరి స్పెషలిస్ట్ ఎవరికీ చూపించలేదా? ఇదంతా మాకెందుకు చెప్పలేదూ?” అనడిగాడు.
సుగుణ నెమ్మదిగా చెప్పింది.. “రెండు రోజులు మధ్యమధ్యలో తెలివొచ్చి అలా అంటున్నా మేమేవీ పట్టించుకోలేదు. మూడోరోజు నుంచీ ఈ ప్రవర్తన ఏదో వింతగా అనిపించి డాక్టర్ ని అడిగాము. వాళ్ళన్నారూ.. కొంతమంది ఆడవాళ్లకి డెలివరీ అయ్యాక నరాల బలహీనత వల్ల, శరీరంలో జరిగే విపరీతమైన హార్మోన్ల మార్పులవల్ల ఇలాగ ప్రవర్తిస్తుంటారనీ, నాలుగురోజుల్లో సరైపోతుందనీ చెప్పారు. “
“నాలుగురోజులేవిటి? అప్పుడే పదిహేనురోజులైపోయింది కదా..” అడిగింది జానకి.
భాస్కర్ అందుకున్నాడు. “అవునండీ.. వారందాకా ఓపిక పట్టాము. తర్వాత మాకు భయం వేసి స్పెషలిస్ట్‍ని కలిసాము. వాళ్ళు టెస్ట్ లు చేసి, హార్మోన్లమార్పు ప్రభావం చాలా ఎక్కువగా  వుందని చెప్పి, దానికి తగ్గ మందులు ఇచ్చారు. ఈ వారమంతా వాడాము. రోజురోజుకీ వినూ ధోరణి విపరీతమైపోడం తప్పితే ఎక్కడా ఆ మందుల ప్రభావం కనిపించలేదు.”
“మరిప్పుడెలా?” ఆతృతగా అడిగాడు వినయ్. డాక్టర్ మహేష్ వినయ్ వైపు తిరిగి చెప్పాడు.  “ఖంగారు పడకండి. ఇది ముందు నరాల బలహీనత అనుకున్నాం. తర్వాత హార్మోన్ల ప్రభావం అనుకున్నాం. ఏదీ ఇదమిథ్థంగా తేలలేదు. రేపు ఇంకో స్పెషలిస్ట్ దగ్గర అపాయింట్ మెంట్ తీసుకున్నాం. మీరెలాగూ వచ్చారు కనుక ఆ స్పెషలిస్ట్ దగ్గరికి మీరూ రండి. ఈ రోజుల్లో వైద్యం బాగా అభివృధ్ధి చెందింది. అసలు రోగమేవిటో తెలియాలి తప్పితే అన్నింటికీ చక్కటి మందులున్నాయి. వినీత మామూలుగా అరోగ్యవంతురాలే కనుక ఇదేదో తాత్కాలిక సమస్యే అయుంటుంది. రేపు ఆ డాక్టర్ ని అందరి సందేహాలూ అడుగుదాం. “
డాక్టర్ మాటలు విన్న శేఖర్, జానకి, వినయ్ లకి ఏం మాట్లాడాలో తోచలేదు. భాస్కర్ కల్పించుకుని, “బావగారూ, దయచేసి రేపు మీరు కూడా మాతో రండి. మాకసలే ఈ పిల్ల ఇలా అయిందేమిటా అని బెంగగా వుంది. మీరు పక్కనుంటే కాస్త ధైర్యంగా వుంటుంది.” అన్నాడు.
       “అంతకన్నానా.. అసలు రేపు విషయమేవిటో కనుక్కుందాం.” ఏం మాట్లాడాలో తెలీని పరిస్థితిలో వున్న శేఖర్ భాస్కర్ కి మాటిచ్చేసేడు.
      వినయ్ కయితే అంతా అయోమయంగా అనిపించింది. ఈ వినీత తన వినీతేనా అన్న అనుమానం వచ్చింది. ఎప్పుడూ చక్కగా తయారయి, నెమ్మదిగా మాట్లాడుతూ, నవ్వుతూ చలాకీగా వుండే ఆ వినీతెక్కడ? ఇలా చిందరవందరగా వున్న జుట్టుతో, ఎర్రబడ్దకళ్ళతో, గట్టిగా అరుస్తూ, రాక్షసిలా మీదపడిపోతున్న ఈ వినీత ఎక్కడ? అసలెక్కడైనా పోలికంటూ వుందా? మొన్నటిదాకా తనూ, వినీతా పుట్టబోయే పాప గురించి ఎన్ని కలలు కన్నారు? ఎన్ని కబుర్లు చెప్పుకున్నారు.. ఇప్పుడా పాపని చూడడానికే  కుదరటం లేదే..ఎందుకిలా జరిగింది? తలపట్టుకుని కూర్చున్నాడు.  జానకి నెమ్మదిగా కొడుకు దగ్గరికి చేరింది. “ఖంగారు పడకు నాన్నా..రేపు డాక్టర్ దగ్గరకి వెడతారుగా.. ఆయన కంతా తెలుస్తుంది..” అంటూ కొడుకుని ఓదార్చింది కానీ, ఆమెకి మటుకు ఇదంతా  యేదో సీరియస్ విషయమే అయ్యుండాలనిపించింది. ఎంతమంది పురుళ్ళు  పోసుకోవటంలేదూ.. అందరికీ హార్మోన్లమార్పులు ఇంత విపరీతంగా వుంటాయా.. ముఖ్యంగా పాప దగ్గరికి ఎవర్నీ రానీకపోవడమేంటి? ఎంత సర్దుకుందామనుకున్నా సర్దుకోలేకపోతోంది జానకి.
   మర్నాడు స్పెషలిస్త్ దగ్గరికి వినీత రిపోర్ట్ లు తీసుకుని అందరూ వెళ్ళారు. ఆయన కేసునంతా క్షుణ్ణంగా పరిశీలించారు. వీళ్ళందరినీ కూచోబెట్టి వివరించారు.
     “చూడండీ.. మీరందరూ చదువుకున్నవారు. ప్రపంచంజ్ఞానం వున్నవారు. ఇప్పుడు మీకందరికీ తెలిసున్నదైనా ఒక విషయం వివరించాలి. మన పెద్దవాళ్ళు కూడా అంటుంటారు.. ఆడదానికి  ప్రసవమన్నది మరో జన్మలాంటిదని.. ఆ సమయంలో స్త్రీ శారీరకంగానూ, మానసికంగానూ చాలారకాల మార్పులకి, ఒత్తిడులకీ లోనవుతుంది. కొత్తగా తల్లి అయ్యే స్త్రీ గురించి  మన దేశంలో కన్నా విదేశాల్లో  చాలా పరిశోధనలు చేసారు. శరీరం, మనసూ కూడా ఎన్నెన్ని రకాల మార్పులకీ, ఉద్వేగాలకీ లోనవుతుందో చెప్పారు. అందుకే మనవాళ్ళు కూడా తల్లి అయ్యే ప్రతి స్త్రీ మనస్సూ ప్రశాంతంగా, సంతోషంగా వుంచాలని కుటుంబసభ్యులందరికీ చెపుతుంటారు. మెడికల్ సైన్స్ ఇంతగా అభివృధ్ధి చెందిన ఈ రోజుల్లో నెల తప్పినప్పట్నుంచీ గర్భవతి అయిన మహిళ డాక్టర్ల పర్యవేక్షణలోనే వుంటోంది. ఈ విషయంలో వినీత విషయంలో మీరంతా ఏమీ తక్కువ చెయ్యలేదు. అమ్మానాన్నలకన్న ఎక్కువగా అత్తమామలూ, భర్తా ఆమెని చూసుకున్నారు. మానసికంగానూ, శారీరకంగానూ కూడా ఆమెకి ఏ లోటూ లేదు. కానీ ప్రసవం తర్వాతే వినీత ఇలా ప్రవర్తిస్తోందంటే ఎందుకని మనం  ఆలోచించాలి. “
ఆసక్తిగా వింటున్న శ్రోతలు కుర్చీల్లో కాస్త ముందుకి జరిగారు.
“మెడికల్ సైన్స్ ప్రకారం చెప్పాలంటే ప్రసవమయిన స్త్రీలలో తొంభైశాతంమంది ఆ తర్వాత జరిగే ప్రసవానంతర రక్తస్రావానికి  ఒకవిధమైన మానసిక బలహీనతలకి  గురవుతారు. కానీ అందులో యాభైశాతం మంది ఆ తర్వాత నాలుగురోజుల్లోనే మానసికంగా దానిలోంఛి బైటపడతారు. మరో ఇరవైశాతంమంది ప్రసవమయిన రెండువారాల్లో మామూలు మనుషులవుతారు. కానీ ఇరవైశాతం మందిలో మటుకు  ఈ మానసిక రుగ్మత అన్నది రెండువారాలయినా పోదు. ఆ కోవలోకే వచ్చింది ఇప్పుడీ వినీత.”
“ఎందుకంటారండీ?” ఆతృతగా అడిగింది సుగుణ. అడగడమయితే సుగుణే అడిగింది కానీ జవాబు వినడానికి అక్కడున్న అందరూ అంతే ఆతృతతో చూస్తున్నారు.
    “దానికి చాలా కారణాలుంటాయి. ప్రసవానికి ముందు వినీత చాలా సంతోషంగానే వున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కూడా అంతా బాగానే అయింది. ఆ తర్వాతే ఆమెలో ఈ వింత ప్రవృత్తి కనపడుతోందంటే దాని వెనకాల ఏదైనా బలమైన కారణం వుండుండాలి. ఆమె మనసుమూలల్లో ఎక్కడో ఆమెకే తెలీని ఒక భయం, భీతి వుండుండాలి. స్వంత తల్లితండ్రులకి కూడా పాపని ఇవ్వటం లేదంటే ఆమె మనసులో వున్న భయమేమిటో మనకి తెలియాలి. అప్పుడు కానీ మనం దాని గురించి ఏమీ చెయ్యలేం.”
డాక్టర్ మాటలు వింటున్నవాళ్లకి  విషయం మరింత అయోమయంగా అనిపించింది.
డాక్టర్ మళ్ళీ అన్నాడు. “దీనికి మెడికల్ భాషలో చాలా పెద్ద పదమే వుంది. ఇటువంటిదానిని మా వైద్యపరిభాషలో “పోస్ట్‍పార్టమ్ డిసార్డర్” అంటాం. మామూలుభాషలో చెప్పాలంటే “ది బేబీ బ్లూస్”. పదిశాతం కేసుల్లో ప్రసవమయిన తర్వాత కలిగే శారీరక, మానసిక అస్థిరత్వం వల్ల, శరీరంలో విపరీతంగా జరిగే హార్మోన్ల మార్పులవల్ల మనసు మూలల్లో ఎప్పుడో దాగున్న భయాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు వినీత పదిశాతం మహిళల్లో వచ్చే మానసికరుగ్మతలో వుంది. దానికి కారణాలేమిటో కనుక్కోవాలి.”
“ఎలా తెలుస్తుంది డాక్టర్?” భాస్కర్ వెంటనే అడిగాడు.
“మీరు ఖంగారు పడకండి. నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ వున్నాడు. నేను స్పెషల్ కేస్ గా చెప్తాను. మీరు వెళ్ళి ఆయన్ని కలవండి. ఖంగారేంలేదు. అంతా సరైపోతుంది.” అంటూ ఆ సైకియాట్రిస్ట్ పేరూ, నంబరూ రాసి భాస్కర్ కి ఇచ్చాడు. సైకియాట్రిస్ట్ అన్న మాట వింటూండగానే అందరి మొహాల్లోనూ మార్పులొచ్చేసాయి. సుగుణ మొహంలో ఖంగారు కనపడితే, శేఖర్ మొహంలో ఆశ్చర్యం కనపడింది. వినయ్ మొహం పాలిపోయింది. జానకికి నోట మాట రాలేదు.యాంత్రికంగా నమస్కారం చేస్తూ డాక్టర్ దగ్గర శెలవు తీసుకున్నారందరూ.
    ఆ రాత్రే బయల్దేరి వెనక్కి చెన్నై వచ్చేసారు శేఖరం కుటుంబసభ్యులు. అప్పటికప్పుడే అది జరిగి పదిహేనురోజులయింది. అదంతా గుర్తొచ్చింది జానకికి. ఆ తర్వాత వియ్యాలవారిద్దరిమధ్యా రోజూ వినీత విషయమై ఫోన్ లో సంభాషణలు జరుగుతూనే వున్నాయి. శేఖరూ, వినయ్ రోజూ భాస్కర్ నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. జానకి మటుకు స్తబ్ధుగా అయిపోయింది. కోడలికి ఈ పిచ్చేవిటో.. ఆ చంటిది ఎలా పెరిగి పెద్దవుతుందో, నిండా ముఫ్పైయేళ్ళు కూడాలేని వినయ్ భవిషత్తేవిటో ఆమెకి అస్సలు అర్ధంకావటంలేదు.
    అంత టెన్షన్ లో వున్న జానకి దగ్గరికి వినయ్ వచ్చి, “అమ్మా, మనం వినూని ఇంటికి తెచ్చేసుకుందాం..” అనగానే అందుకే అంత గట్టిగా అడిగింది.
“పిచ్చిదాన్ని కాపరానికి తీసుకొస్తానంటావేంట్రా.. దాని పిచ్చి నీక్కూడా అంటుకుందేంటీ?” అంటూ.
వినయ్ ఏమీ మాట్లాడలేక  అలా నిలబడిపోయాడు.
శేఖర్ గబగబా జానకి దగ్గరికి వచ్చాడు. “ముందు నువ్వు కూర్చో..” అంటూ డైనింగ్ టేబిల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు.
“చూడు, జానకి వినూ పిచ్చిదేమీ కాదు. నువ్వు ముందా మాట మానెయ్యి.” అన్నాడు.
“పిచ్చిది కాకపోవడం ఏంటండీ.. మనం కళ్ళారా చూసాం. డాక్టరే అన్నాడు కదా సైకియాట్రిస్ట్ ని కలవమని. సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎవరెడతారో నాకు తెలీదంటారా?” ఎదురు ప్రశ్నించింది జానకి.
   వినయ్ ముందుకొచ్చాడు. “అమ్మా, ముందు నువ్వు విషయమంతా విను. ఈ పదిహేనురోజుల్లోనూ మామయ్యగారూ వాళ్ళూ ఎంతమందిని కలిసారో, వాళ్ళేం చెప్పారో అన్నీ చెప్తాను.” అంటూ తల్లి పక్కన కుర్చీలో కూర్చుని వినయ్ నెమ్మదిగా వివరించాడు.  “మామయ్యగారికి లక్ష్మి అని ఒక చెల్లెలు వుండేదిట. అంటే వినూకి మేనత్తన్నమాట. ఆవిడ పెద్దింట్లో మెట్టి సుఖపడాలని వాళ్ల అమ్మా,నాన్న బోలెడు కట్నమిచ్చి సంపన్నుల ఇంటి కోడలిని చేసారుట. కట్నకానుకలతో సరిపెట్టుకోకుండా వాళ్ళు అస్తమానం ఆవిడని ఇంకా ఇంకా డబ్బు తెమ్మని పుట్టింటికి పంపుతుండేవారుట. ఆ సమయంలోనే మామయ్యగారి తండ్రికి వ్యాపారంలో నష్టం వచ్చిందిట. అందుకని వియ్యాలవారు అడిగినవి ఇవ్వలేకపోయారుట. అప్పుడే ఆ వినూ మేనత్త లక్ష్మికి మగపిల్లాడు పుట్టాడుట. లక్ష్మి అత్తవారొచ్చి, పాలుతాగుతున్న పురిటికందుని  లక్ష్మి వద్దని వేడుకుంటున్నా వినకుండా, “వీడు మా వంశాంకురం. నువ్వు డబ్బు తీసుకుని మా ఇంటికొచ్చాకే వీణ్ణి చూసేదీ” అంటూ బలవంతంగా లాక్కుపోయారుట. ఆ బాధ  భరించలేక  పచ్చిబాలెంతరాలు లక్ష్మి అస్తమానం పిల్లవాడికోసం ఏడుస్తూ వుండేదిట. ఆ ఏడుపే ఆ పచ్చిబాలింతరాలిని ఉన్మాదంలోకి దింపిందిట. ఒక గుడ్డలమూట పట్టుకుని “నా బాబుని నేనివ్వను.. నేనివ్వను..” అంటూ తిండీతిప్పలూ లేకుండా హృదయవిదారకంగా ఏడ్చేదిట. ఎవ్వరినీ ఆఖరికి వాళ్ల అమ్మానాన్నల్నికూడా ఆ గుడ్డలమూటని పట్టుకోను కూడా పట్టుకోనిచ్చేది కాదుట. ఆ గుడ్డలమూటే తన బిడ్డ అన్న భ్రమలో =నే వుండేదిట.  డబ్బు సమకూర్చలేక ఆమెని అత్తింటికి పంపలేకపోయారుట తల్లితండ్రులు. తను కన్నబిడ్డని మళ్ళీ చూడలేకపోయిందిట వినూ మేనత్త లక్ష్మి. ఆ భ్రమలోనే ఆవిడ చనిపోయిందిట. ఇదంతా సరిగ్గా వినూకి ఎనిమిదేళ్ళప్పుడు జరిగింది. తెలిసీతెలీని వయస్సులో ఇంట్లో మేనత్త పిల్లవాడికోసం ఏడిచే ఏడుపు వినూ మనస్సులో ముద్రపడిపోయింది. ఆ విషయం ఆమె మనసుపొరల్లో ఎక్కడవుందోకానీ మళ్ళీ వినూకి డెలివరీకోసం మత్తుమందు ఇస్తారన్నప్పుడు గుర్తొచ్చింది. తనకి మత్తుమందిచ్చేసి తన పాపని తీసికెళ్ళిపోతారనే దృఢమైన అభిప్రాయం కలిగింది వినూకి. సాధారణంగా డెలివరీ అయ్యాక ఆడవారిలో కలిగే హార్మోన్లమార్పువల్ల, నరాల బలహీనతవల్ల, ఎక్కువగా మానసిక ఆందోళనకు గురవ్వడం వల్లా వినూ తనని తాను సంబాళించుకోలేకపోయింది. అందుకని అలా ప్రవర్తించింది. అంతే కానీ, వినూ పిచ్చిది కాదమ్మా..” వినూ గురించి అంత వివరంగా చెపుతున్న వినయ్‍ని విచిత్రంగా చూసింది జానకి.
  శేఖర్ ముందుకొచ్చాడు. “అవును జానకి. ఈ పదిహేనురోజుల్లోనూ రోజూ బావగారితో మాట్లాడుతున్నాను కదా.. ఆయన చెప్పారు. సైకియాట్రిస్ట్ వినూని బాగా పరీక్షించి కారణం ఇదీ అని చెప్పగానే, స్పెషలిస్ట్ వినూ తొందరగా కోలుకోడానికి మంచిమందులు ఇచ్చాడుట. కానీ మందులతో మాత్రమే పని జరగదనీ, దానితోపాటు ఇంట్లోవారి సహకారం వినూకి చాలా కావాలనీ చెప్పాడుట. వాళ్ళు కౌన్సిలింగ్ లో ఎలా చెప్పారో అలాగే జాగ్రత్తగా వినూ మనసు కుదుటపడేటట్టు చూసుకున్నారుట ఇన్నాళ్ళూ. నెమ్మది నెమ్మదిగా మార్పు కనపడుతోందిట. ఇప్పుడు పాపని వాళ్ల అమ్మానాన్నలకి అందిస్తోందిట వినూ. వాళ్లతోపాటే మన సహకారం కూడా వుంటే తొందరగా మనుషుల్లో పడుతుందని డాక్టర్లు చెప్పారుట. అందుకనే  వినూని ఇక్కడికి తీసుకొస్తున్నామని చెప్పారు బావగారు..” అన్న శేఖర్ మాటలకి తలెత్తి చూసింది జానకి.
    వినయ్ తల్లి కాళ్ల దగ్గర కూర్చున్నాడు. “అమ్మా,. భార్యని ఎలా చూసుకోవాలో నువ్వే ఇదివరకు ఎన్నోసార్లు చెప్పావు. ఏ తండ్రీ కూడా కూతురికి తిండి పెట్టుకోలేక పెళ్ళి చేసి పంపించడూ, మన వంశం నిలబెట్టడానికి  ప్రాణంలా పెంచుకున్న కూతుర్ని మన ఇంటికి పంపుతాడూ,  మన ఇంటికొచ్చిన లక్ష్మిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని నాతో ఎన్నిసార్లు చెప్పలేదమ్మా నువ్వూ.  మన ఇంటి లక్ష్మికి ఇప్పుడు నిజంగా మన సహకారం కావాలమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో వున్న భార్యని రావద్దనడం ధర్మమేనంటావా.. నువ్వే చెప్పు?” అనడిగాడు.
   “కానీ..” అనబోతున్న జానకిని మరి మాట్లాడనివ్వకుండా, “వాళ్ళు రేపొస్తున్నారు.. అత్తవారింట్లోవారు కూడా వినూ కోలుకోడానికి సహకరించాలని డాక్టర్ చెప్పారుట. మనింటి కొచ్చిన పిల్లని మనం చూసుకోవాలి కదా జానకీ.” అన్నాడు శేఖర్. “కానీ..నాకు తెలీదే.. భయమేస్తుంది..” అంది ఖంగారుగా జానకి ఆరోజు వినూని చూసిన దృశ్యం మర్చిపోలేకపోతోందామె.
“ఏం ఫరవాలేదు. వినూ అమ్మానాన్నా కూడా వస్తున్నారు. అంతా వున్నాం కదా..” అన్నాడు శేఖర్. జానకి మనసుకి సర్దిచెప్పుకుందుకు ప్రయత్నిస్తోంది.
    మర్నాడు సాయంకాలం ఫ్లైట్‍కి చంటిపిల్లని, వినూని తీసుకుని వచ్చారు భాస్కర్, సుగుణలు. భయంభయంగా  కోడలిని పరిశీలించింది జానకి. పదిహేనురోజులక్రితం కన్న కాస్త మార్పు కనపడుతోంది కానీ వినూ కళ్ళల్లో ఆ బెదురూ, భయం పోలేదు. తల్లి భుజాలచుట్టూ చెయ్యివేసి నెమ్మదిగా నడిపిస్తూ లోపలికి తీసుకువస్తే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది. నాలుగేళ్ళపాటు మసిలిన ఇంటిని కూడా కొత్త ఇంటిని చూస్తున్నట్టు గోడలూ, కప్పూ చూడడం మొదలుపెట్టింది. క్షణక్షణం చంటిపిల్లని తనకి మరీ దగ్గరగా పొదువుకుంటోంది.
   డాక్టర్లు హారతివ్వడం, దిష్టి తియ్యడంలాంటివి చెయ్యొద్దనీ,  దానివల్ల అనుమానాలు తలెత్తవచ్చు అన్నారని భాస్కర్ దగ్గర విని  ముందే శేఖరం చెప్పడం వలన జానకి అలాంటివేమీ చెయ్యలేదు. సుగుణ నెమ్మదిగా వినూని ఆమె గదిలోకి తీసికెళ్ళింది. ఒక్క సుగుణకి తప్పితే మరింకెవ్వరి చేతికి పాపనివ్వటంలేదు వినూ.
  శేఖర్ కుటుంబసభ్యులందరికీ భాస్కర్ డాక్టర్ చెప్పినవన్నీ వివరించాడు. వినీతతో ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ విపులంగా చర్చించాడు. అవన్నీ విన్న జానకి భయపడింది.
   అది చూసిన సుగుణ “వదినగారూ, వినూకి పూర్తిగా నయమయ్యేదాకా మేం కూడా ఇక్కడే వుంటామండీ. డాక్టర్లు అమ్మానాన్నలతో పాటూ, భర్తా, అత్తమామల సహకారం కూడా వుంటే తొందరగా కోలుకుంటుందని అన్నారని ఇలా తీసుకొచ్చాం. అసలు ఇలా వస్తామని అడగడానికి మేం చాలా భయపడ్డాం. చాలమంది ఈ పిల్ల పిచ్చిదైపోయిందీ, మాకొద్దూ అని మీరు అంటారని చెప్పారు. కానీ మీరు పెద్దమనసు చేసుకుని  మాకు ఈ అవకాశం ఇచ్చారు. మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే…” అంటూ కళ్ళనీళ్ళతో రెండుచేతులూ ఎత్తి దండం పెట్టింది.
 జానకి ఖంగారుగా..”అయ్యయ్యో ..అలా అనకండి. వినూ ఈ ఇంటికోడలు. మా వినయ్ మనసులో వున్న వినూ కోసం ఏదైనా చేస్తాను. కానీ, ఏం చెయ్యాలో ఏమిటో కాస్త మీరు చెపుతుండండి.. అంతే..” అంది.
    జానకి మాటలకి సుగుణ మనసు నిండిపోయింది. ఇంత మంచి అత్తగారు వినూకి దొరికినందుకు పొంగిపోయింది. “ఏమీలేదండీ. ఎవరైనా పాపని తన దగ్గరినుంచి తీసికెళ్ళిపోతారనే భయం వినూలో పోవాలంటే ఇంట్లోవున్నవాళ్లమీద వినూకి నమ్మకం కలగాలని  డాక్టర్ చెప్పాడు. ఈ వారంరోజుల్లోనూ మామీద నమ్మకం కలిగింది వినూకి. ప్రసవానంతరం ఇలా నరాల బలహీనతకీ, హార్మోన్లమార్పుల్లో వచ్చే మానసిక రుగ్మతలకీ  మందులు వాడుతున్నప్పుడే, చుట్టు వున్నవాళ్ళు కూడా వినూకి మానసిక ధైర్యం అందిస్తే తొందరగా కోలుకుంటుందని డాక్టర్ చెప్పారు. వినూకి కన్నబిడ్ద పాపమీదున్న మమకారం శారీరక, మానసిక బలహీనతల వల్ల ఇలా పిచ్చిలా మారిందని అన్నారు..”

  సుగుణ మాటలు వింటున్న జానకి ఆమె మాటలని మధ్యలోనే ఆపింది.. “పిచ్చి అనకండి వదినగారూ. అది కన్నకడుపుమీద ప్రేమ. ఆ ప్రేమ వ్యక్తపరిచే తీరు మనకి పిచ్చిలా కనిపిస్తోందంతే. మీరు వినీతని తీసుకుని వస్తున్నారన్న విషయం తెలిసి శ్రేయోభిలాషుల మనుకునే కొంతమంది మమ్మల్ని కూడా హెచ్చరించారు. సైకియాట్రిస్ట్ దగ్గర వైద్యం చేయించుకుంటున్న పిల్లని మీరు ఇంటికి తెచ్చుకోక్కర్లేదూ, పిచ్చిదంటే ఏ కోర్టైనా సులభంగా విడాకులు ఇచ్చేస్తుందీ. ఆ పిచ్చిదాన్ని వదిలించుకుని మరో అమ్మాయిని తెచ్చుకోండీ అంటూ ఉచితసలహాలు చాలా ఇచ్చారు. అలా కుదరదన్నామని మమ్మల్నీ పిచ్చివాళ్లనే అన్నారు. లోకంతీరు అంతేనండీ. పిచ్చికీ, ప్రేమకీ తేడా తెలుసుకోలేరు.  నాకేదో గొప్ప మనసుందని మీరు అంటున్నారు కానీ..కాదండీ.. నేనూ అమ్మనే.. నా కొడుకు మీద నాకూ పిచ్చిప్రేమే. అందుకనే ఆ కొడుకు కోసమే వినూని దగ్గరికి రానిచ్చాను. ఆ కొడుకు సంతోషం కోసం ఏవైనా చేస్తాను. ఆ ప్రేమకి మీరు మరో పేరు పెట్టుకుంటే పిచ్చి అనే అనుకోండి.  ప్రేమ పిచ్చీ ఒకటే... “ అంటున్న జానకికి చేతులెత్తి దండం పెట్టింది సుగుణ.