Pages

Wednesday, May 18, 2011

ఎవరు చెపుతారు...!





మా అమ్మమ్మ చేతి తరవాణి అమృతతుల్యం
నాకింకా గుర్తే...
పెరట్లో పాలేళ్ళు- పొలాల్లో పనివాళ్ళు
యింట్లో పసివాళ్ళు-వీధిలో కుర్రాళ్ళు
పిన్నలు పెద్దలు చుట్టపక్కాలు
ఆ ఊళ్ళో అందరికీ అన్నపూర్ణ మా అమ్మమ్మే.

మరిక మా అమ్మ...
ఉమ్మడి కుటుంబంలో పెద్దకోడలు
అత్తగారు మామగారు మరదులు తోడికోడళ్ళు
ఆదపడుచులూ-యింటి అల్లుళ్ళూ
తన పిల్లలు పరాయిపిల్లలనే తేడాలు లేకుండా
పిన్నా పెద్దా అందరికీ చల్లనితల్లి మా అమ్మే...

ఇక మా సంగతా...
పొట్ట చేత పట్టుకుని ఊళ్ళు పట్టుకు పోయినవాళ్లం
మేమిద్దరం మాకిద్దరూ అనుకున్నవాళ్ళం
యేడాదికో రెండేళ్ళకో కుటుంబాలన్నీ కలిసాయంటే
అది ఒక ఆనందహేల...

సరే మా అమ్మాయి...
ఒక్కతే కూతురితో సరిపెట్టింది
తోడుగా మరొకర్ని కనమంటే
దీనిని బాగా పెంచాలికదా అంటుంది
సంబరంగా కలిసి తిరిగే తోబుట్టువు లేక
దుఃఖంలో పాలు పంచుకునే దిక్కు లేక
ఒంటికాయ శొంఠికొమ్ములా పెరిగిన నా మనవరాలు
యిప్పుడంటుందీ...
"నాకు పెళ్ళొద్దూ..." అని
ఎందుకనడిగితే స్వేఛ్ఛకి భంగమట
మరొకరి సహవాసం కోసం తన స్వతంత్రాన్ని వదులుకోలేదుట...

అణువు అణువణువై
అణువణువు పరమాణువై
పరమాణువు పెఠిల్లుమంటె
యిక మిగిలేది శూన్యమేనని
తనకెవరు చెపుతారు...!


"రచన--ఇంటింటిపత్రిక" సౌజన్యంతో....


+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Tuesday, May 10, 2011

తల్లీ...నిన్ను దలంచి...




తల్లీ…. భారతి….
నిన్ను తలంచి నేను పట్టిన పొత్తము ఈ విధి భంగమయ్యె
ఏమని చెప్పుదు నాదు దుస్ఠితిన్...

ఉదయమున నిను దలంతునన్న
అరుణకిరణములు సోకని నివాసమయ్యె
మనసు కుత్సాహము లేక మౌని నైతి…….

చైతన్యముతో పట్టువిడక
నీదుగురించి నాల్గు వాక్యముల్ చెప్పుదమన్న
ఏమి పాపము చేసితినొ గాని
వినెడి విద్యార్థి ఎందును కానరాడు…….

నిను తనివార పూజింప విరిసిన పూలుతేబోవ
హతవిధీ.. ఏమని చెప్పుదు ఎక్కడ కాంచిన
కృత్రిమ పుష్పరాజములె గోచరమయ్యె…..

మదిని కలవరమ్ముతో,
తెగని పట్టుదలతో,
ఎటులైన నీదు మహిమలు,
నిను పఠించిన పొసగు మహానందములు,
నీదు దీవెనచే కలుగు పుణ్యములు,
నీదుపై ఏకాగ్రతతో కలుగు అద్వైత సిధ్ధి,
మనఃపీఠమున నిను స్థాపించిన పొందు కైవల్యము,
మరి ఎందును కానరాదని తెలియచెప్పుదుమన్న
వినెడివారు కరవైరి...ఏమనందు...

తల్లీ...భారతీ..నిను కొలవగలేని దౌర్భాగ్యపు జాతి అయినది
వేద విఙ్ఞానఖని అయిన అమృతభాండము ఎదుట నుండగా
ఎడారిలో ఎండమావికై పరుగులిడు యాతన
ఈ పిచ్చి జనుల మది కెందుకొ….

చలము సేయక
నీవు వారిని చల్లగ చూసి
పెడదారి పట్టిన పిలవాని త్రోవ మరల్చి
నీ అక్కున చేర్చి బ్రోవుమ తల్లి శారదా....



-------------------------------------------

Saturday, April 23, 2011

మనం పుస్తకాలు ఎందుకు చదవాలంటే...



నీ ఊహా ప్రపంచంలో
చెయితిరగని కంచంలో
ఎందుకోయ్ పెట్టుకున్నావ్ అన్నం కొంచెం..?
పెట్టుకోవోయ్ పెద్ద బంగారు కంచం
ఒంచుకోవోయ్ పాయసం నిండుగా కంచం...!
(ఇది మా నాన్నగారు శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు ఊహాప్రపంచం గురించి వ్రాసుకున్న కవితలో చిన్న భాగం. మన ఊహ మన చిత్తం వచ్చినట్టు ఎంతగా ఎల్లలు దాటి ఊహించుకోవచ్చోనని ఆయన చెప్పిన విషయాన్ని తెలియచెప్పడానికి ఇది ఇక్కడ పెట్టాను.)

మనం పుస్తకాలు ఎందుకు చదవాలంటే...
మనిషికి ఊహలో ఊహించుకున్నంత ఆనందం నిజజీవితంలో కనిపించదు.
నిజం కంటే ఊహ అందంగా వుంటుంది కనకే మనిషి తను చెయ్యలేని పనినీ, తన కళ్ళకు కనిపించలేని అందాల్నీ ఊహలో వెతుక్కుంటాడు.
ఒక సినిమా చూస్తున్నప్పుడు కానీ, టీవీ చూస్తున్నప్పుడు కానీ కథలోని పాత్రలు కళ్ళముందు కనపడతాయి. అవి నిర్మాతా, దర్శకుల దృష్టిలో సృష్టించుకున్న పాత్రలు, సంఘటనలు. వాటిని వారి దృష్టితోనే మనమూ చూస్తున్నాం. ఒక్కరి అభిరుచి అవి చూస్తున్నవారందరిమీదా రుద్దబడుతోంది.
అదే మనం ఒక పుస్తకం చదువుకుంటుంటే జరిగే పరిస్థితి వేరు. పుస్తకంలో కవిగాని, రచయితగాని రాసినదానిని చదువుతున్నప్పుడు మనం దానిని మన అభిరుచికి అనుగుణంగా ఆ సుందరదృశ్యవర్ణనను కానీ, ఆ పాత్ర మనసులోని భావాలనుగానీ, ఆ పాత్ర ప్రవర్తించిన తీరునిగానీ, ఆ పాత్రయొక్క అందం, ఆహార్యంగానీ ఊహించుకుంటాం. అది మన మనసుకి చాలా ఆనందం కలగజేస్తుంది. అందుకే పుస్తకపఠనంలో అంత ఆనందం వుంది.
ఒక మంచి పుస్తకం చదువుతున్నప్పుడు మనం అందులో లీనమైపోతాం. ఆ పుస్తకంలోని కథతో పాటుగా ప్రయాణం చేస్తాం. కథ సుఖాంతమైతే ఆనందిస్తాం. దుఃఖాంతమైతే బాధపడతాం. మన మనసుల్ని ఇంతగా ప్రభావితం చేస్తున్న పుస్తకపఠనాన్ని మనకు సాధ్యమైనంతవరకు ప్రోత్సహిద్దాం. మన పిల్లలకి పుస్తకాలు చదవడం అలవాటు చేద్దాం. ఎంతో గొప్ప కవులని, రచయితలని వాళ్ళకి పరిచయం చేద్దాం. పుస్తకపఠనంలోని ఆనందాన్ని వాళ్ళకీ రుచి చూపిద్దాం.
ఏప్రిల్ 23 జాతీయ పుస్తకదినం సందర్భంగా...
(చిత్రం...గూగులమ్మ సౌజన్యంతో...)