ఈ సంక్రాంతి యెంత సందడిగా జరిగిందంటే... ఇంకనాకు సంతోషం పట్టలేక నా ఆనందాన్ని అందరితో పంచుకోవాలని ఈ టపా వ్రాస్తున్నాను.
యెప్పటిలాగే మామూలుగానే పూజ, నైవేద్యం, కొత్తబట్టలు, యెవరైనా పేరంటానికి పిలిస్తే వెళ్లడంతో పండుగ జరిగిపోయేది. ఈసారికూడా అలాగే ఒకరింటికి గొబ్బిళ్ళపేరంటానికి వెళ్ళి అక్కడ అజమాయిషీగట్రా చేసేసి, ఆ పిల్లలకి గొబ్బిపూజ యెలా చెయ్యాలో చెప్పివచ్చేసా. ఆ మర్నాడు అంటే పెద్దపండగరోజు మా యింటికి దగ్గర్లో వుండే దుర్గ వాళ్ల అపార్ట్ మెంట్స్ లో అందరూ కలిసి పిల్లలచేత ప్రోగ్రామ్ చేయిస్తున్నారనీ, అందులో గొబ్బిళ్ళు, బొమ్మలకొలువు అన్నీ వుంటాయనీ, మన సాంప్రదాయం పిల్లలకు కూడా నేర్పిస్తే మరో తరం అందుకుంటుందనీ అంటూ దుర్గ పిలిస్తే, వాళ్ల ఆలోచనకు సంబరపడిపోతూ వెళ్ళాను. అక్కడ ఆ పిల్లల ఆటాపాటా చూస్తుంటే నా మనసంతా చెప్పలేని భావోద్వేగంతో నిండిపోయింది. అందరూ ఆరేళ్ళనుంచి పధ్నాలుగేళ్ళ పిల్లలు. ఆడపిల్లలు ఓ పదిమందీ, మగపిల్లలు ఓ నలుగురైదుగురూ వున్నారు. వాళ్ల ఉత్సాహం చూస్తుంటే మనం చెప్పాలేకానీ ఈ పిడుగులు కొండల్నైనా పిండి కొట్టేస్తారనిపించింది.
యెంచక్కటి బొమ్మలకొలువు. ఇదిగో చూడండి.
అసలు ముందు పిల్లలంతా కలిసి ఒక స్కిట్ లాంటిది వేసారు. అందులో పిక్నిక్ కి వెళ్ళడానికి ప్లాన్ వేసుకోవడమూ, ఒక్కొక్కరు ఒక్కొక్కటి తేవాలనుకోవడమూ, అందులో ఒకరు "నేను మా చెల్లిని తీసుకొస్తానన"డమూ చూస్తుంటే బలే నవ్వొచ్చింది.
మెచ్చుకోదగినవిషయం యింకోటి యేమిటంటే ఆ తల్లులు పిల్లలకి మంచి విలువలు తెలియచెయ్యాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్లకి యెటువంటివారితో స్నేహం చెయ్యాలో చెప్పే పాత "తోడికోడళ్ళు" సినిమా లోది "ఎంతెంతదూరం.. కోసెడుదూరం...మీకూ మాకూ చాల చాల దూరం..
అల్లరిచేసే పిల్లలతోటీ స్నేహము చేయమురా..మేము స్నేహము చేయమురా..." అనే పాటకి డాన్స్ చేయించారు.
ఇదిగో చూడండిదే ఆ పాట...
అయిందా..ఇంక గొబ్బిపూజ చేస్తూ...
యెన్ని గొబ్బిపాటలు పాడారో..
"గొబ్బియళ్ళో, . గొబ్బియళ్ళొ" నుంచి
"అటవీ స్థలముల కేగుదమా"..అంటూ
"గొల్లవారివాడలకు కిష్ణమూర్తి నీవు యేమి పనికి వచ్చినావు కిష్ణమూర్తి..."తో కొనసాగించి
"సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బణ్ణియ్యవే.."అంటూ ముక్తాయింపుతో కోలాటాలాడేసేరనుకోండి..
ఇంతలో మన హరిదాసుగారు "హరిలొరంగ హరీ" అంటూ పక్కవాయిద్యంతో సహా వేంచేసారు.
ఇరిగో ఇద్దరూనూ..
హరిదాసుగారి ఆశీర్వాదం తీసుకుని కూర్చున్నామో లేదో వచ్చేసారు... ఎవరంటారేంటండీ.. మన
అత్తాకోడళ్ళు..
ఆ అత్తాకోడళ్ళు యేం తెచ్చారో చెపితే భలే ఆశ్చర్యపోతారు..
హా హా..రోళ్ళు, రోకళ్ళు, తిరగలి, చేట, కుంపటి.. అవునండీ.. కుంపటే అచ్చంగా బాపూ బొమ్మలో వేస్తారూ.. అలాంటి కుంపటే..ఇంకా..బూర్లెమూకుడూ, చట్రాలూ..అబ్బో.. మనం ప్రస్తుతం మర్చిపోయినవి ఇంకా వున్నాయిలెండి. సంక్రాంతిపండగ అంటూ రోళ్ళూ, రోకళ్ళూ అంటున్నానేంటి అనుకుంటున్నారా.. అబ్బే..ఒక అత్త పనంటే బధ్ధకించే తన కోడలిచేత మంచిమాటలు చెపుతూ రోకలిపోటు యెలా వెయ్యాలో చెపుతూ, తిరగలి యెలా తిప్పాలో చెపుతూ, అరిసెలు వండించేసిందండీ కోడలిచేత. ఇదంతా పాటలోనే. తెలంగాణాప్రాంతం జానపదగేయం. యెంత బాగుందో.. వినండి.
కోడలు "అత్తమ్మా.. నా చెయ్యి నొస్తోందత్తమ్మా"..అంటూ
"రోకలెత్తాలేను హయ్యో రోలెత్తాలేను..హయ్యో
అత్తమ్మా..
రోకలెత్తాలేను రోలెత్తాలేను..
చామంతికడియాల చెయ్యెత్తలేనూ.. చెయ్యెత్తలేనూ..."
అని పాడుతుంది.
కొమ్మమీద పాలపిట్ట... కొమ్మకింద పూలబుట్ట
కొమ్మమీదా పాలపిట్టా అత్తమ్మో
కొమ్మకిందా పూలబుట్టా అత్తమ్మో
కొమ్మమీదా పాలపిట్టా అత్తమ్మో
కొమ్మకిందా పూలబుట్టా అత్తమ్మో
అని కబుర్లలో పెట్టేస్తూ
"అత్తమ్మా.. నాకు చేతనైతలేదు..." అంటే
"నీకేం చేతౌతదే..దంచూ..."అంటుంది అత్తగారు.
దంచటంతో అయిందా..
మరో కోడలిచేత పక్కన తిరగట్లో పప్పు విసిరించేస్తోంది చూడండి...
అదిగో.. ఆ పిండితో అరిసెలు కూడా వండేసుకుంటున్నారు...
హమ్మయ్య..ఇక్కడితో పిండివంటలు వండడం కూడా అయిపోయింది.
ఇంక తర్వాత యేమిటంటారా..
అసలైంది ఇక్కడే వుందండీ..
పిల్లలతోపాటు తల్లులు కూడా వీళ్లతో కలిసి ఆడి, పాడి వాళ్ల సంతోషాన్ని ప్రదర్శించుకున్నారు. యెలాగంటారా.. ఇదిగో ఈ పాటతో..
"ఒకేసి పువ్వు మీ సిగనా
చిటికెడు గంధం మా మెడనా..అహ
చిటికెడు గంధం మా మెడనా..ఛాం ఛాం ఛాం ఛాం"
"ఛాం ఛాం అక్కల్లార చామంతి మొగ్గల్లార
జానకి గౌరి ఉయాలలూగె..అహ..
జానకి గౌరి ఉయాలలూగె..జానకి గౌరి ఉయాలలూగె
యేలేలమ్మో యేలేలమ్మో యేలేలమ్మో యేలేలమ్మో"
యిన్నిరకాల ఆటలూ, పాటలూ, కోలాటాలతో మమ్మల్ని భావోద్వేగుల్ని చేసినవారి పేర్లు చెప్పడం నా కనీసధర్మం. ఇక్కడే అంబర్పేటలో రామకిష్ణానగర్లో వున్న విజేతా పార్క్ సైడ్ అపార్ట్ మెంట్ లో వాళ్లండీ. వారి పేర్లు..ఇవిగో..
చిరంజీవులు
సృజన, మాన్య, వందిత, శ్రియ, హారిక, సౌమ్య, తాన్యా, శ్రావణ్, అశ్విన్.
పర్యవేక్షించిన తల్లులు
దుర్గ, పద్మజ, సునీత, కుమారి, జయశ్రీ, రూప.
చిన్నారులతో బొమ్మలకొలువు యింకా యెంత నిండుగా వుందో చూడండి...
పిల్లలు మైనపుముద్దల్లాంటివారు. మనం పువ్వులా చేస్తే చక్కగా విచ్చుకుని సుగంధాలు విరజిమ్ముతారు. ముల్లులా చేస్తే సమాజానికి ద్రోహం చేస్తారు. ఈ సత్యం తెలిసి ఆ తల్లులు తమ పిల్లలకి చదువుతోపాటు నలుగురితో కలిసిమెలిసి వుండాలనే చక్కటి సంస్కారం నేర్పుతున్నందుకు ఆ తల్లుల్ని మనం అభినందించితీరాలి. అందిస్తే అల్లుకుపోయే ఈ పిల్లలకి యెన్ని అభినందనలైనా తక్కువే అనిపిస్తుంది.
యిది చదివినవారందరూ పెద్దమనసు చేసుకుని ఆ తల్లులకు అభినందనలు, చిరంజీవులకు ఆశీస్సులు అందిస్తారు కదూ....
29 వ్యాఖ్యలు:
భలే ముద్దుగా ఉన్నారు పిల్లలందరూ, శ్రీ లలిత గారు. నిజంగా ఆ తల్లులకు అభినందనలు తెలియచెయ్యవలసిందే.
nijamaina sankranti chesukonnaaru. pillalaki, tallulaki, vraasi andinchina meeku aaseessulu
బావుందండీ. చదువుతుంటే చాలా సంతోషమనిపించింది. ఆ తల్లులకు అభినందనలు. చిరంజీవులకు ఆశీస్సులు.
రోళ్ళు, రోకళ్ళు, తిరగలి, కుంపటి చూసి నలభై ఏళ్ళ కిందటికి వెళ్ళిపోయాను :)అలాంటి కుంపటి కొందామన్నా దొరకటంలేదు ఇప్పుడు.
ఓపిక తో పిల్లలతో ఇంత మంచి కార్యక్రమము చేయించిన తల్లులకు అభినందనలు. ఉత్సాహంగా పాల్గొన్నపిల్లలకు ఆశీస్సులు .
ఇనత మంచి కార్యక్రమం చూపించిన మీకు థాంకూలు.
సంక్రాంతి సంబరం అంబరం దాటిన వేళ,గత వైభవం మరపురానివ్వని ఆటపాటలతో అలరించిన చిన్నారులకు, వారితోపాటు మైమరిపించిన పెద్దలకు,కళ్లకు కట్టేలా చిత్రీకరించినందుకు,అక్షరచిత్రమైన మీ వ్యాసానికి అక్షరాంజలి.
thank you aunty-not only for your blessings but also for posting this write up so that we can get many blessings!
చాలా సంతోషంగా వుందండి. చిన్నారులకు ఆశీస్సులు. తల్లులకు అభినందనలు.ఇంత చక్కని కార్యక్రమాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
బావుందండి పొస్ట్ పిల్లలు చక్కగా ఉన్నారు
పుట్టి పుట్టంగనే పుణ్యాల ప్రోవయి
కన్న వారికి గూర్చు కామ్యఫలము
బుడి బుడి నడకల బుజ్జాయి నవ్వులు
నట్టింట ముత్యాల నగలు పేర్చు
పరికిణీ గట్టిన పాపాయి సొబగులు
మురిపాల ముద్దులు మూట గట్టు
పెళ్ళీడు దరిసిన ప్రియ తనయ దిరుగు
నాయింట లక్ష్మీ విహార మొరయు
ఘనులు కడుపార కూతుర్ని గన్నవారు
ఆడ పిల్లయె సర్వస్వ మవని యందు
తల్లి దండ్రులు తనివార తమకు దాము
మురియు ననుభూతు లేమని బొగడ వచ్చు !
పండుగల నాడు కన్నుల పండు వగుచు
ఆడి పాడిచు దిరుగాడు ఆడ పిల్ల
ల సడు లద్భుత రీతి శ్రీలలిత గారు
పోస్టు పెట్టి బ్లాగరులకు ముదము గూర్చె .
----- సుజన-సృజన
అద్భుతమైన టపా .ఎన్ని రోజులు శ్రమించి ఉంటారో,ఆ చిన్నారులతో పాటు తల్ల్లులు కూడా. అందరూ పోచంపల్లి పట్టుచీరలు కట్టుకుని చేనేత కు జై !అని చెప్పినట్టు కూడా ఉంది . మీతో సహా ,ప్రత్యక్షంగా ,పరోక్షంగానూ, పాల్గొన్నవారందరికీ అభినందనలు .
జ్యోతిగారూ, పది చేతులతో పనిచేసే మీరు పిల్లల ఆటలు, తల్లుల కృషీ కనిపెట్టి బాగుందంటూ కామెంట్ పెట్టారంటే వారి శ్రమకు ఫలితం దక్కినట్టే.. ధన్యవాదాలండీ..
ఙ్ఞానప్రసూనగారూ, మీ ఆశీర్వాదమే అందరికీ శ్రీరామరక్షండీ...
శిశిరగారూ, మీ ఆశీస్సులకు ధన్యవాదాలండీ..
మాలాకుమార్గారూ, నిజంగానే నేనూ అవి చూడగానే భలే ఆశ్చర్యపోయాను. మీ చక్కటి స్పందనకు ధన్యవాదాలండీ..
ఉమాదేవిగారూ, యింత అందంగా సమీక్షించిన మీ అక్షరాంజలికి మా కృతఙ్ఞతాంజలి...
Durga, I wish you all the best in every attempt of you in future also...
సూర్యలక్ష్మిగారూ,
మీ ఆశీస్సులకు ధన్యవాదాలండీ...
రాధిక(నాని)గారూ,
ధన్యవాదాలండీ...
వెంకట రాజారావు . లక్కాకులగారూ,
చాలాచాలా సంతోషమండీ. పండుగపూటా మహలక్షిలాగా ఆడపిల్ల నట్టింట్లో తిరుగాడుతుంటే కలిగే ఆనందాన్ని యెంత యెంత అందంగా పద్యబంధం చేసారో.. మీకు హృదయపూర్వక కృతఙ్ఞతలండీ...
నాగరాణి యెర్రాగారూ,
నిజంగానే చాలా శ్రమపడ్డారండీ. కాని అంతటి శ్రమా కూడా మీలాంటివారు గుర్తించినప్పుడు పొందే ఆనందం ముందు దూదిపింజెలా తేలిపోతుంది. ధన్యవాదాలండీ..
THANK YOU AUNTY. YOU HAVE MADE OUR DAY. THE EVENT IS IN ITS TOTALITY. THANK YOU VERY MUCH.
It was pleasnt reading your article. Khodos to the parents for taking all the pain in inculcating our rich culture. Wish these kids will carry the true essence of this event. Thanks to you ,madam, for taking all the pain in documenting and presenting us.
Warm regards,
Ravi Bhargav.
కళ్ళకు కట్టినట్టుగా ఫోటోలూ వారి ఆటలూ..ఓహ్..ఎంత బాగా అనిపించిందో!
శ్రీ లలితగారూ
పండగరోజు అంత చక్కగా గడిపిన మీ అదృష్టానికి కుళ్ళుగా వుంది. అందరికీ జేజేలు.
psmlakshmi
Thanks a lot Ravi Bhargavgaru, for your nice comment.
లక్ష్మిగారూ,
మీరంత కుళ్ళునందుకు నాకెంత ఆనందంగా వుందో..హ హ . just kidding..ఈసారి ఇలాంటి సందర్భాలొస్తే అందరం కలిసే ఆనందిద్దాం..
లక్ష్మీరాఘవగారూ,
కదా.. నాకూ భలే ఆనందం అనిపించిందండీ..
Sri lalitha gaaru, mee blog ide chudadam modati saari, mee posts anni chaalaa baagunnaayyoch:-):-)
Egise alalu blogger garu,
DhanyavaadaalaMdi.
Mi blog kuda nenu ippude chusaanu.
Adi Imkaa baagumdoch...
Post a Comment