2015 సంవత్సరం వెడుతూ వెడుతూ నాకు చాలా ఆనందాన్నిచ్చి వెళ్ళింది. ఎప్పుడూ కలలో కూడా అనుకోని నేను నా కథలను కొన్నింటిని కథలసంపుటిలా తీసుకురావాలనుకోవడం నాకు ఇప్పటికీ వింతగానే వుంటుంది. అలా సంకల్పించుకోగానే కొంతమంది మితృలని సంప్రదించాను. అందరూ చాలా ఉపయోగకరమైన సలహాలనిచ్చి నన్ను ప్రోత్సహించారు. అలా ధైర్యం చేసి నా కథల సంకలనాన్ని తీసుకొచ్చాను.
ఇదిగో ఇదే నా మొట్టమొదటి కథల సంపుటి..
అబ్బ.. ఆ పుస్తకం చూసుకుంటూంటే ఎంత బాగుందో.. ఎంత ఆనందమో.. అప్పుడే పుట్టిన పాపాయిని చూసినట్టు, విచ్చుకుంటున్న గులాబీని చూసినట్టు, కోయిల పాట విన్నట్టు.. ఎంత ఎంత బాగుందో.. ఎందుకంత బాగుందో తెలుసా… ఆ పుస్తకం మీది ముఖచిత్రం ఉషారాణి తీసుకున్న ఫొటో.. అడగగానే అంతకంటేనా అంటూ అనుమతి నిచ్చేసింది. ఆహా కదా..
మరి ఆ పుస్తకానికి ముందుమాట ఎవరు రాసారనుకుంటున్నారూ..
“గర్ల్ విత్ గోల్డెన్ పెన్” గా ప్రసిధ్ధి పొందిన మన్నెం శారదగారు. ఏమి నా భాగ్యమూ..
అనుకున్నాను.
ఇంక ఆ పుస్తకాన్ని ఆవిష్కరించినది లెక్కకు మిక్కిలి అవార్డులందుకున్న డి. కామేశ్వరిగారు. అంతకన్న ఆనందం ఉంటుందా!
హైద్రాబాదులో 2015 డిశెంబర్ నెల 18 నుంచి 27 వరకు
జరిగిన పుస్తక ప్రదర్శనలో మొట్టమొదటిరోజే ఈ పుస్తకం “అతను – ఆమె – కాలం“ పుస్తకావిష్కరణ
జరిగింది.
అబ్బ.. అన్ని పుస్తకాలలో నా పుస్తకం కూడా అక్కడ.. ఎంత ఆనంద మనిపించిందో..
నేను పుస్తకం ఆవిష్కరించినందుకు ఆనందిస్తూ నా ప్రియ నెచ్చెలి మాలాకుమార్ నాకందించిన అభినందనలు..
.
ఆ రోజు నా ఆనందంలో పాలు పంచుకున్ననా హితులు, స్నేహితులు....
విడుదలయిన నా పుస్తకం "అతను - ఆమె - కాలం" గురించి కొల్లూరి సోమశంకర్‍గారు పుస్తకం.నెట్ లో వ్రాసిన సమీక్ష..
పుస్తకం.నెట్
పుష్కరకాలంగా కథలు వ్రాస్తూ, ఇప్పటికి డెబ్భయి కథలకి పైగా వ్రాసిన
శ్రీమతి జి.ఎస్.లక్ష్మి గారి మొదటి కథా సంపుటి ఇది. ఇందులో 23 కథలున్నాయి.
వాటిల్లో 16 వివిధ బహుమతులు పొందిన కథలు. మరికొన్ని వివిధ భాషలలోకి అనువాదమై ఇతర
భాషీయులను కూడా అలరించినవి. ఈ పుస్తకంలోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం.
***
ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం తిరుపతి వెళ్ళడమే. ఆ తరువాత ఏ పుణ్యక్షేత్రానికి
వెళ్ళలేదా ఆ కుటుంబం. ఏ గుడిలోను అన్నదానానికో మరేదే పుణ్యకార్యానికో విరాళాలు
ఇవ్వలేదు. అయినా బోలెడు పుణ్యం సాధించామని చెబుతుందా ఇల్లాలు. ఇంటాయనకి తెలియకుండా
ఆమె ఏ ఘనమైన దానం చేసి పుణ్యం సంపాదించింది? తెలుసుకోవాలంటే
చదవాలి "ఏది పుణ్యం" కథని.
ఒక్కొక్కసారి మనకి తెలిసిన విషయాలయినా సరే ఎదుటిమనిషి నోటి వెంట వింటూంటే
బాగుంటుంది. మరి అత్తగారికి తెలిసిన ఏ విషయాన్ని కోడలు ఆమెకి మళ్ళీ తెలిసేలా
చేసిందో "దాంపత్యం" కథలో
చదవచ్చు.
పిల్లలకి ఏం కావాలో తల్లికి ఎవరూ చెప్పక్కరలేకుండానే తెలిసిపోతుంది. పిల్లల
భవిష్యత్తుకు బాల్యం నుంచే బంగారు బాట వేయాలనుకునే తల్లిదండ్రులు తమ అబ్బాయిని
గొప్పవాడిని చెయ్యాలని అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఓ శిక్షకురాలిని
సైతం ఏర్పాటు చేస్తారు. ఆ పిల్లాడు ఏం కోరితే అది కొనిస్తూంటారు అమ్మానాన్నలు.
వాడో రోజూ మూన్ కావలాంటాడు. తండ్రేమో కొడుకు వ్యోమగామి అయిపోతాడని సంతోషపడితే...
తల్లికి అనుమానం వస్తుంది - అసలు చందమామని
ఎందుకడిగాడా అని. నిజం తెలుసుకున్నాకా ఆమెకి అర్థమవుతుంది - కొడుకుకి కావల్సింది
చందమామ కాదని! ఆ కొడుకు కోరుకున్నదేదో తెలుసుకోవాలంటే చదవాలి "చందమామ రావె" కథని.
వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపుతూ ప్రశ్నించే కథ "ఇది ఇలా సాగవలసిందేనా?". సామాజిక సేవ పేరిట స్వలాభం
చూసుకునేవారితో పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ కథ సూచిస్తుంది.
ఈ పుస్తకానికి శీర్షికగా నిలిచిన "అతడు - ఆమె
- కాలం" కథ ఈ సంపుటికే
మకుటాయమానమైన కథ. భార్యాభర్తల మధ్య ఏర్పడిన అపోహలను కాలం తొలగించడం మంచిదే. అయినా
ఈ కథలోని భార్యాభర్తలు తమని తాము మార్చుకోడానికి చాలా కాలం తీసుకున్నందుకు ఒకింత
ఆశ్చర్యం వేస్తుంది. ఇంట్లో భార్యని పట్టించుకోని భర్తలు,
తాము అనుకున్నది
జరగలేదని భర్తని నిర్లక్ష్యం చేసే భార్యలు ఎంతో మంది ఉన్నారు. భార్యాభర్తలు ఎలా
మసలుకుంటే నిజమైన కాపురం అవుతోందో ఈ కథ చెబుతుంది.
తను ఊహించుకున్నదే నిజమని, ఎదుటివారేదో కష్టాల్లో ఉన్నారని భావించి
వారినేదో ఉద్ధరించాలనుకున్న ఓ యువతికి "నాణానికి
మరోవైపు" చూడమని సలహా నిస్తారు వృద్ధ దంపతులు. వాస్తవాలు
తెలుసుకోకుండా హడావుడి చేయకూడదని ఈ కథ చెబుతుంది.
ధైర్యం చేసి సముద్రాలు దాటి వెళ్ళిన పార్వతమ్మకి లభించిన పెన్నిధి ఏది? దేశం కాని దేశంలో ఆమెకి నిశ్చింత ఎలా కలిగింది? చదవండి "పెన్నిధి దొరికింది" కథ.
తండ్రి మీద అలిగి ఇల్లు వదిలి పోయిన కుర్రాడు తన తప్పు ఎలా తెలుసుకున్నాడో, తండ్రి తన లోపమెలా గ్రహించాడో చెప్పే కథ "కాస్త
ఆలోచిస్తే...". ఒకరినొకరు అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తే కుటుంబ
సభ్యుల మధ్య అపోహలు తొలగి అందరూ ఆనందంగా ఉండగలరని ఈ కథ చెబుతుంది.
ఓ గొప్ప సంస్థకి సి.ఇ.ఓ.గా ఎంపికయిన వ్యక్తి తన ఘనతకి కారణం తల్లని చెబుతాడు.
తన తల్లి ఉమ్మడి కుటుంబంలో బంధువులందరితోనూ నెగ్గుకొచ్చిన తీరు మోడరన్ మేనేజ్‌మెంట్
పాఠాలకు ఏమాత్రం తీసిపోదని చెబుతాడో ఇంటర్వ్యూలో. ఆసక్తిగా చదివించే కథ "ఇప్పుడైనా చెప్పనీయమ్మా...".
విలువల సంఘర్షణ ఇతివృత్తంగా సాగిన కథ "మరో
కోణం". తమ సంస్కృతికి వ్యతిరేకంగా రాసి పాపులర్ అయిన ఓ రచయిత
పైరవీ చేసి అవార్డు తెచ్చుకుంటాడు. అతడిని అభినందిస్తూ, ఓ సభ
ఏర్పాటవుతుంది. ఇన్నాళ్ళు ప్రజలు దేనిని పట్టించుకోరని భావిస్తూంటాడా రచయిత. కాని
జనాలు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ.. ఆందోళన చేస్తారు. సన్మానకర్తలు/సభ
నిర్వాహకులు ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కాని, ఒక్కరు కూడా రచయితని హెచ్చరించరు. ఇది ఎదురు డబ్బిచ్చి సభలు నిర్వహింపజేసుకుని, వాటిల్లో తమని పొగిడింపజేసేలా చూసుకునే వ్యక్తుల స్వభావాన్ని పట్టి చూపిన కథ.
అటువంటివారితో జనాల ప్రవర్తన కూడా అలాగే ఉంటుందని చెప్పడం బాగుంది.
వృద్ధులూ, పసిపిల్లలూ ఒకటేనని.. వారికి కొన్ని కోరికలుంటాయని
చెబుతుంది "ఒఖ్ఖ రెండు రూపాయలు".
ఆర్ద్రంగా పాఠకుల మనస్సుని కదిలిస్తుందీ కథ.
తన గత జీవితం తలచుకోడానికి ఇష్టపడని ఓ వ్యక్తి అల్లిన ఆ కథ ఏమిటి? లేని వ్యక్తులను ఉన్నట్లుగా ఎందుకు భ్రమింపజేశాడు? లోకం పోకడలకీ, మనుషుల మనస్తత్వాలకీ అద్దం పట్టిన కథ "మూర్తిగారొచ్చారు".
పెరిగి పెద్దయి సంపాదనలో పడ్డ పిల్లల తల్లితండ్రులను కరిపేపాకుతో పోలుస్తారు
తులసమ్మ. కరివేపాకు కేవలం పరిమళం కోసమని భావించి వంటల్లో వేస్తారు, కాని తినేముందు కంచంలోంచి తీసి పారేస్తారు. కరివేపాకు తింటే కలిగే మేలు వాళ్ళకి
తెలియదు. సంఘంలో గౌరవం కోసం తల్లిదండ్రుల పట్ల ప్రేమ కనపరిచినా, ఇంట్లో మాత్రం వాళ్ళని తీసిపారేస్తుంటారు పిల్లలు. అటువంటి పిల్లల కథే "మేడిపండ్లు...".
పిల్లల పెంపకం ఎలా ఉండాలో, పిల్లలకి అసలేం నేర్పించాలో చెప్పే కథ
"మీరే నేర్పాలి..". భవిష్యత్
తరాల వారు ఆనందంగా జీవించాలంటే నేడేం నేర్చుకోవాలో చెప్పే కథ ఇది.
దేశంలో ఎక్కడ చూసినా వెర్రితలలు వేస్తున్న ఓ ముఖ్యమైన సమస్యని "ప్రత్యక్ష సాక్షి" కథలో చెబుతారు రచయిత్రి.
సమస్యకి పరిష్కారమేమీ సూచించరు కాని, ఆలోచించేలా
చేస్తారు.
తండ్రి షష్టిపూర్తి వేడుకకి పుట్టింటికి వెళ్ళాలనుకున్న కాత్యాయనికి ఎన్ని
ఆటంకాలు? ఎంతమందిని అడగాల్సి వచ్చింది? వాళ్ళందరూ ఎందుకు
వద్దన్నారు? చివరికి భర్త ఏమన్నాడు? "కలవారి కోడలు
కలికి కామాక్షి" అనే పాటని అన్వయిస్తూ... ఉమ్మడి కుటుంబంలో ఉండే ఒక్కో
బంధువును తలచుకుంటూ... ఆహ్లాదంగా సాగిన కథ "కలికి
కాత్యాయిని".
కడుపారా తినాలని ఓ ఇంటికి భోజనానికి వెడితే, అక్కడ మనం
కడుపుబ్బా నవ్వుకునే ప్రహసనం ఎదురవుతుంది. ఎక్కడా? ఏమిటి? ఎందుకు? చదువుతూ నవ్వేసుకునే కథ "డిజైనర్
ఫుడ్". తెలుగువాళ్ళ అసలైన డిజెనర్ ఫుడ్ ఏమిటో ఈ కథ చెబుతుంది.
వివాహ ప్రక్రియ ఓ 'ఈవెంట్ షో'గా మారిన వైనం
తెలుసుకోవాలంటే చదవాలి "కొత్త సీసాలో పాత సారా".
హాస్యకథలో పోటీలో బహుమతి గెల్చుకున్న కథ. నవ్విస్తునే చురకలు వేస్తుంది.
మునిమనవడి సంబరం, ఇస్తినమ్మ వాయనం... పుచ్చుకుంటినమ్మ
వాయనం, వెర్రిబాగుల వదిన వ్రత కథ, జయహో వదిన.. వంటి
కథలు హాయిగా చదివిస్తాయి.
***
మన జీవితాల్లో క్రమంగా పలచబడుతున్న ఆప్యాయతలనూ, సమాజంలో
మృగ్యమవుతున్న మానవతని, మనుషులు సమిష్టివాదం నుంచి వ్యష్టివాదం
వైపు మొగ్గు చూపడాన్నీ ఈ కథలు కళ్ళకు కట్టినట్టు చూపుతాయి. చక్కని ఇతివృత్తాలతో, ఆకర్షణీయమైన శైలితో, సులభంగా చదివిస్తాయి అన్ని కథలు. 200
పేజీలున్న ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక కేంద్రలలోనూ లభిస్తుంది. వెల రూ.150/-
ప్రతులకు రచయిత్రినీ సంప్రదించవచ్చు. ఈబుక్ కినిగెలోనూ లభిస్తుంది.
~ కొల్లూరి సోమ శంకర్
ధన్యవాదాలు సోమశంకర్‍గారూ..
మరి ఆ పుస్తకం మీరు కూడా చదివి మీ అమూల్యమయిన అభిప్రాయాలు తెలుపుతారు కదూ!
ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. ఈ బుక్ గానూ, ప్రింట్ పుస్తకంగానూ ఆన్లైన్ లో ఈ క్రింది లింక్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు.
http://kinige.com/kbook.php?id=6249
-----------------------------------------------------------------------------------------------------------------------------------
http://kinige.com/kbook.php?id=6249
-----------------------------------------------------------------------------------------------------------------------------------
విహంగ—మాసపత్రిక..ఫిబ్రవరి,2016
అతను- ఆమె-కాలం(పుస్తక
సమీక్ష ) – మాలా కుమార్
శ్రీమతి జి..యస్.లక్ష్మి
గారు గత పన్నెండు సంవత్సరాలుగా
కథలు వ్రాస్తున్నారు.ఇప్పటి వరకూ దాదాపు డెభై
కథల పైగా వ్రాసారు.అందులో
చాలా వాటికి వివిధ పత్రికలల్లో బహుమతులు
వచ్చాయి.ఆ బహుమతి వచ్చిన
కథల మణిహారమే ఈ “అతడు- ఆమె-కాలం”.ఈ కథలే కాకుండా
“ఒక ఇల్లాలి కథ”అన్న నవల 6 సెప్టెంబర్
2007 నుంచి జనవరి ,2008 వరకు 20 వారాలపాటు ఆంధ్రభూమి పత్రిక లో ప్రచురించబడింది. ఇంకా
“నాన్నలూ-నేర్చుకోండిలా”మినీ
నవలగా 2011 ఆంధ్రభూమి మాసపత్రిక లో ప్రచురించబడింది.కొన్ని
కథలు కథావాహిని, ఆటా జ్ఞాపక సంచిక,
కథాకేళి,ప్రమదాక్షరి కథా సంపుటాలల్లో చోటు
చేసుకున్నాయి. కొన్ని కథలు ఇంగ్లీష్, కన్నడ,తమిళ బాషలలోకి కూడా
అనువదించబడి ప్రచురించబడ్డాయి. ఇరవై సంవత్సరాల నుండి
ఆకాశవాణిలో పలు ప్రసంగాలు ,కదంబ
కార్యక్రమాలు ప్రసారమయ్యాయి.
మనము
అన్నదానం చేస్తున్నాము.విద్యాదానం చేస్తున్నాము.దీపదానం చేస్తున్నాము . ఇంకా బోల్డు రకరకాల
దానాలు చేస్తున్నాము.అవీ మనకు తెలీకుండానే
అంటే అవును నిజమే అని
“ఏది పుణ్యం”లో పార్వతి చెప్పేదాకా
మనకు తెలీదు!
భార్యా
భర్తల మధ్య ఉండవలసిన అనుబంధాలు
ఎలాంటివి?భర్తపొమ్మనగానే భార్య ఇంట్లో నుంచి
వెళ్ళిపోవలసిందేనా? పెళ్ళైనప్పటి నుంచి తన ఇల్లు,
తన వాళ్ళు అనుకొని తన సర్వ శక్తులూ
ధారపోసి ఆ ఇంటిని తీర్చి
దిద్దిన ఆ ఇల్లాలికి ఆ
ఇంటి మీద ఏ హక్కూ
లేదా? ఆ ఇల్లాలి ఆత్మవిశ్వాసం
గురించి చక్కగా చెప్పారు “దాంపత్యం” కథలో!
కాంతి,
శరత్ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు.వారి
కొడుకు బున్ని.వాడి ని మంచి
స్కూల్లో, కాలేజీ లో చదివించాలి, ఉజ్వలమైన
భవిష్యత్తు ఉండాలి దానికోసం ఇద్దరూ ఎంత కష్టపడటానికైనా సిద్దమే.అందుకే ఇద్దరూ సంపాదిస్తున్నారు.వాడి పెంపకంలో ఏవిధమైన
లోటూ చేయలేదు.పిల్లల పెంపకం లో ట్రైనింగ్ ఐన
ఆశాను రెండువేలిచ్చి వాళ్ళు ఆఫీస్ కెళ్ళినప్పుడు చూసుకునేందుకు
నియమించారు.ఆశా చాలా కరెక్ట్
మనిషి. ఎట్టి పరిస్తితులల్లోనూ తన
డ్యూటీ మర్చిపోదు.బున్నీకి అన్ని రకాల పద్దతులూ
చక్కగా బోదిస్తుంది.మరి బున్నీ కి
కావలసింది ఈ క్రమశిక్షణలేనా? “చందమామరావే”కథలో
చిన్నపిల్లలకు కావలసిందేమిటో సున్నితంగా చెప్పారు లక్ష్మి గారు.
మొహమాటానికి
పోతే ఏదో అయ్యిందిట.పాపం
మాలతి ఓ పక్క భర్త
, కూతురు తెచ్చి పెట్టిన కుక్కపిల్లతోటే కష్టాలు పడుతుంటే ఆ పైన తెలుగు
అసోషియేషన్ సెక్రెటరీ ప్రమీల గారితో పెద్ద కష్టం వచ్చింది.
మొహమాటానికి ఆవిడ హేంస్టర్స్ ను
చూసుకోవలసి వచ్చి ఎన్ని ఇబ్బందులు
పడ్డదో “పాపం మాలతి” లో చదివి సరదాగా
నవ్వుకోవచ్చు.
దాంపత్యం
గురించి మరో మంచి కథ
“అతడు-ఆమె-కాలం”.పెళ్ళైన్ ముప్పయ్యేళ్ళకి ఇంట్లో ఇద్దరే. ఆ ఇద్దరి మధ్య
కొన్ని యోజనాల దూరం. ఆ భార్యా
భర్తలు ఇద్దరూ ఆ దూరాన్ని ఎలా
అదిగమించారు? వారిలో మార్పు వచ్చింది.అతను ఆప్యాయంగా ఆమె
చుట్టూ చేతులు వేసాడు. ఆమె భధ్రంగా అందులో
ఇమిడిపోయింది.చక్కని మనో విశ్లేషణతో సాగుతుంది
ఈ కథ.
అరే భూమికి జానెడెత్తు లేడు తనని చూసి
నవ్వుతాడా !మనస్సు చివుక్కు మనిపించింది.మనవడితో చక్కగా ఆడుకోవాలి, పాడుకోవాలి అని బోలెడంత ఆశతో
అమెరికా వచ్చినప్పటి నుంచి వాడిని చూసి,
ఎంతసేపూ ఆ పిచ్చి బాక్సూ
, బ్లాక్సూ పెట్టుకొని కూర్చుంటాడు తన దగ్గరికే రాడు
అని బోలెడు నిరాశపడిపోయింది పార్వతమ్మ.అలా మామ్మను ఏడిపించిన
ఆ బూరెబుగ్గల , గుండ్రటి కళ్ళ ముద్దుల మనవడు
రాత్రి కాగానే మామ్మ వళ్ళో “ఐ
ఆం స్కేర్డ్”అంటూ దూరిపోయాడు.మామ్మా
మనవళ్ళ ముచ్చట్లు మురిపెంగా మన కళ్ళ ముందుంచారు
రచయిత్రి “పెన్నిధి దొరికింది” లో.
“ఎదుగుతున్న
పిల్లలతో ఎలా ఉండాలో, వాళ్ళను
హాండిల్ చేయటం ఎంత కష్టమో
చెబుతారు “కాస్త ఆలోచిస్తే ” కథలో!
ఒక కుటుంబ గౌరవం నిలబడాలన్నా కూలిపోవాలన్నా
కారణం ఆ ఇంటి ఇల్లాలే.ఆ ఇల్లాలి లక్ష్యం
పిల్లల అభివృద్ధి ఐనప్పుడు మిగిలిన విషయాలన్నీ చిన్నవైపోతాయి” ఒక ఇల్లాలు ఎలా ఉండాలో ఎంత
బాగా వివరించారో ఈ కథ “ఇప్పుడైనా
చెప్పనీయమ్మా”లో!
మోడరన్
కలికి చిలకల కొలికి కాత్యాయిని
తండ్రి షష్ఠిపూర్తి కి వెళ్ళేందుకు ,ఆఫీస్
లో అత్తగారిలాంటి బాస్,ఖచ్చితంగా రూల్స్
పాటించే మామగారిలాంటి పిల్లల స్కూల్ ప్రిన్సిపల్ ,ఇంటి పెత్తనం చెలాయించే
పెద్దతోడికోడల్లాంటి పిల్లల ట్యూషన్ టీచరూ,గంభీరంగా ఉండే
పెద్దబావగారి లాంటి సంగీతం మాస్టారు
లను సెలవు అడిగేందుకు ఎలాంటి
సమస్యలో చిక్కుకుందో, కాత్యాయిని భర్త రాజేంద్ర భోగిలా
ఆ సమస్యల చిక్కును ఎలా విడదీసాడో ,”కలవారి
కోడలు కలికి కామాక్షీ “పాటతో
అన్వయిస్తూ బహు చమత్కారంగా చెప్పారు
రచయిత్రి.
“ఇస్తినమ్మ
వాయనం , పుచ్చుకుంటినమ్మ వాయనం” లో ఈ కాలం
పిల్లలకు కంప్యూటర్లో నోములు ఎలా నోమించాలో సరదా
గా ఉంది.
“పాతసీసాలో
కొత్త సారా”లో ఈవెంట్ మారేజ్
లూ,మరదలు మాడ గురించి
చదివి కడుపుబ్బ నవ్వుకోకుండా ఉండలేము.
సరదాగా
, ఆహ్లాదంగా సాగిన వెర్రిబాగుల వదిన
వ్రతకథను, ఆటో అతనిని ముప్పతిప్పలు
పెట్టిన వదిన కథను చదివి
జయహో వదినా అని నవ్వీ
నవ్వీ కళ్ళల్లో నీళ్ళు రాక తప్పదు :)
మరికొన్ని
కథలతో మొత్తం ఇరవై మూడు కథలు
ఇందులో ఉన్నాయి.అన్నీ వివిధ పత్రికలలో
బహుమతులు వచ్చినవే.జి.యస్.లక్ష్మి
గారు పోటీకి కథ పంపుతే ఏదో
వొక బహుమతి రాకుండా ఉండదేమో!మరి వారి రచనా
శైలి అలాంటిది.వారు తీసుకునే కథా
వస్తువు కూడా మన చుట్టుపక్కల
జరుగుతున్న సంఘటన ల నుంచే
తీసుకున్నారు.అందుకే అంత సహజంగా ఉన్నాయి.
అన్నీ తప్పక చదవవలసిన కథలు.
ధన్యవాదాలు మాలాకుమార్‍గారూ..
మార్చి
, 2016 “కౌముది” అంతర్జాల పత్రికలో
నా పుస్తకం “అతను – ఆమె – కాలం” పై వచ్చిన సమీక్ష.
“గతదశాబ్దంగా
– ఆలోచించి వ్రాసే కథలు, ఆలోచింపచేసే కథలు, సత్తా ఉన్న కథలు, సారాంశం నిండిన కథలు,
చదవాలనిపించే కథలు, చదవదగిన కథలు – వ్రాసే రచయిత్రుల పేర్లు కొన్ని చెప్పండి” – అంటే
ఖచ్చితంగా ఆ జాబితాలో చేర్చదగిన రచయిత్రి శ్రీమతి జి.ఎస్.లక్ష్మిగారు. పెద్ద హడావిడి, హంగూ ఆర్భాటం లేని రచనా శైలి, అతి
సరళంగా ఉంటూ హృదయాన్ని తాకే కథాంశాలూ జి.ఎస్.లక్ష్మిగారి కథల్లోని ప్రత్యేకత. కుటుంబ
సంబంధాలు, సమాజంలో మానవీయ విలువలు ఈ కథల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. అందుకే ఈ రచయిత్రి
కథలకి పలు పత్రికల్లో బహుమతులు వచ్చాయి. అలాంటి బహుమతి కథలన్నింటినీ చేర్చి తన తొలి
కథాసంపుటిని ప్రచురించారు రచయిత్రి. వారి మాటల్లోనే తెలుసుకోవాలంటే – గత కొన్నేళ్ళుగా
ఒక్కసారిగా పెరిగిన సాంకేతికత వలన ప్రపంచమంతా ఒక కుగ్రామంలా కనిపిస్తున్న నేపథ్యంలో
అంత త్వరగానూ మనుషుల జీవనవిధానంలో వచ్చిన మార్పు ఎటువంటిదో, దానివలన వారి మనస్తత్వాలు
ఏ విధంగా మారాయో, మానవ సంబంధాలూ, అనుబంధాలూ, విలువలూ ఎలా వాటి అర్ధాలను మార్చుకున్నాయో
గమనిస్తుంటే కలిగిన ఆలోచనలే నా కథలకు ప్రేరణలు” అన్నారు రచయిత్రి. ఈ స్పందనలకు ప్రాణప్రతిష్ట
అన్నట్లుగా సజీవత్వంతో సాగాయి ఇందులోని కథలన్నీ. భార్యాభర్తల మధ్య ఎవరు గొప్ప అనే అంశంతో
చాలా కథలు వచ్చినా లక్ష్మిగారు “దాంపత్యం” కథలో ఇదే అంశాన్ని వైవిధ్యభరితమైన కోణంలో
చిత్రించారు. జీవితమంతా అరగదీసి, పిల్లల పెంపకంలో వెచ్చించిన తల్లిదండ్రులు, తుదిరోజుల్లో
పిల్లల ఎదుటే చెయ్యిచాచాల్సిన క్షణాలు వచ్చినప్పుడు జరిగే సన్నివేశాలని మనసులని మెలిపెట్టేలా
అక్షరీకరించారు “ఒఖ్ఖ రెండురూపాయలు” కథలో. “అతను – ఆమె – కాలం”. “ఇప్పుడైనా చెప్పనీయమ్మా..”
ఇలాంటి కథలన్నీ హృదయాల్ని తట్టి లేపేవే. కేవలం గంభీరమైన కథాంశాలనే కాక హాస్యాన్ని కూడా
అతిసున్నితంగా, సరికొత్తగా ఈ రచయిత్రి చెప్పగలరు అనడానికి ఉదాహరణ “డిజైనర్ ఫుడ్”. మన్నెం
శారదగారు ముందు మాటలో చెప్పినట్లు “ఏదో చెప్పేద్దామని కాకుండా రచయిత్రిగా తనకున్న సామాజిక
బాధ్యతని గుర్తెరిగి చాలా సామర్థ్యంతో ప్రతికథని గుండెకు హత్తుకుని, మనసుకి ఎత్తుకుని
రాశారనిపించింది నాకు”. – ఈ పుస్తకంలోని కథలన్నీ చదివాక ఈ అభిప్రాయంతో పాఠకులంతా ఏకీభవిస్తారు.
సున్నితత్వం కనుమరుగై, మానవసంబంధాలు సైతం వ్యాపారాత్మకమై
పోతున్న ఈ కాలంలో ఇలాంటి కథల అవసరం ఎంతైనా ఉంది.
సంపాదకులకు ధన్యవాదాలు.
-------------------------------------------------------------------------------------------------------
మాలిక ఏప్రిల్, 2016..అంతర్జాలపత్రికలో శ్రీ బులుసు సుబ్రహ్మణ్యంగారి సమీక్ష..
మాలిక ఏప్రిల్, 2016..అంతర్జాలపత్రికలో శ్రీ బులుసు సుబ్రహ్మణ్యంగారి సమీక్ష..
అతను – ఆమె – కాలం పుస్తకం ఇరవై మూడు కధల సమాహారం. ఇందులో పదహారు కధలు బహుమతులు పొందినవి. కొన్ని వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి. రచయిత శ్రీమతి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు, సుమారు పన్నెండేళ్ళుగా రచనలు చేస్తున్నారు. లక్ష్మిగారి కొన్ని కధలు, ఒక నవల, ఒక మినీ నవల వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈమె బ్లాగ్లోకంలో కూడా ప్రసిద్ధులు.
ఈ పుస్తకంలో కధలు చదివితే శ్రీమతి లక్ష్మిగారు మూడుతరాల తెలుగు జీవితాలలో కాలగమనంలో వచ్చిన, వస్తున్న మార్పులని క్షుణ్ణంగా అధ్యయనం చేశారని అర్ధం అవుతుంది. శ్రీమతి లక్ష్మిగారి ఆహ్లాదకరమైన శైలి సులువుగా చదివించేస్తుంది. కధపై పట్టు, బిగి సడలించకుండా సాగే కధనం ఈమె స్వంతం. ఏ కధ చదివినా మన చుట్టూ జరిగే సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఈనాటి వేగవంతమైన జీవితాలలో లోపిస్తున్న మానవతా బంధాలని సున్నితంగా సృశిస్తూ, ఏ ఇజాల జోలికి పోకుండా, తను అనుకున్నది సూటిగా చెప్పడం ఈమె ప్రత్యేకత. సామాన్యుల జీవితాలలో ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయతలు, అనుబంధాలు ఇంకా ఉన్నాయి అనే నమ్మకం బలపడుతుంది, ఈ కధలు చదివితే.
ఈ పుస్తకానికి పెట్టిన పేరు, “అతను- ఆమె-కాలం” అనే కధ ఆసక్తికరంగా ఉంది. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా అని తను కూడా చేసుకున్న ఒక భర్త, స్వంత అభిప్రాయాలు, ఆశలు, సరదాలు ఉన్నా జీవితమంతా తనను భద్రంగా చూసుకుంటాడు అనే నమ్మకంతో అతని వేలు పట్టుకుని వచ్చిన భార్య. ఇద్దరూ విరుద్ధ భావాలు కల ముఖ్య పాత్రలు. అనురాగం, ప్రేమ వారి మధ్య లేవేమో అనిపించే సంఘటనలు. గడిచే కాలం, పెరుగుతున్న దూరం. కూతురు బారసాల రోజున “నువ్వు మా అమ్మ పేరు పెట్టడానికి ఒప్పుకుంటే బారసాల పీటల మీద కూర్చుంటాను. లేదూ… నా కూతురిని తీసుకు వెళ్లిపోతాను” అని మొండి పట్టు నెగ్గించుకున్న అతను, కొడుకు పెళ్లి సంబంధం విషయంలో మాట్లాడడానికి ఇంటికి వచ్చిన పెద్దమనుషులతో భర్త మాట్లాడుతుంటే “మీరూరుకోండి …నేను చెప్తానుగా … మీ సంబంధం మా వాడు ఒప్పుకోడండి… ఇంకా మాట్లేమిటి? వెళ్లి రండి” అంటూ వారి ముందు భర్తని చులకన చేసిన ఆమె, మధ్య గడచిన కాలం. ఉన్నట్టుండి ఆమెకి స్ట్రోక్ . హాస్పిటల్ లో జేర్చిన తరువాత ఇరువురూ తమ జీవితాలను పునరాలోచించుకుంటారు. హాస్పిటల్ నుంచి తిరిగి వస్తూ “ఎంతయిదండి బిల్లు?” అడిగిన ఆమె. “నువ్వు మళ్ళీ నాతో వస్తున్నావు. అందుకు ఎంతిచ్చినా తక్కువే” అన్న అతను. అతని కౌగిలిలో ఒదిగిన ఆమె. హృద్యంగా ఉంది చదివినప్పుడు. విరుద్ధ భావాల వ్యక్తుల మధ్య కూడా, కాలం గడిచే కొద్దీ అంతర్లీనంగా అవ్యక్తంగా పెరిగిన ప్రేమ, అభిమానం పాఠకుడిని మురిపిస్తుంది .
పై కధతో కొద్దిగా పోలిక ఉన్న మరో కధ ‘దాంపత్యం’. “ఏమిటా నిలబడి నిద్రపోవడం? మొగుడి మొహాన కాస్త కాఫీ పోసేదేమైనా ఉందా? లేదా?” ఇది భర్త పలకరింపు. అలా అని భార్యకు ఏమీ లోటు చెయ్యలేదు. స్వతహాగా మంచి మనిషే. కానీ ఆడవారికి కూడా స్పందించే గుణముంటుందని తెలియని వాడు. తన ఇష్టాలే భార్యకి నచ్చాలనుకునేవాడు. కోపమూ ఎక్కువే. అతని నోటికి అడ్డు, అదుపు ఉండదు. రమేశం పెళ్ళాంగానే రాజేశ్వరి జీవితం. పిల్లల దృష్టిలో తల్లి దేవత, తండ్రి రాక్షసుడు. పిల్లలకి పెళ్లి అయి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. అయినా భర్త మారలేదు. సహించింది. సహించింది. ఒకరోజున తిరుగుబాటు చేసింది. ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. విషయం తెలిసి పిల్లలు వచ్చారు. కోడలి సలహా, ప్రోద్బలంతో ఇంటికి తిరిగి వచ్చింది రాజేశ్వరి తన హక్కులు సాధించుకోవటానికి. సంతోషంగా తలూపి స్వాగతించాడు రమేశం.
మనకి తెలియకుండానే మనం చాలా దానాలు చేసేస్తుంటాం. అందువల్ల బోలెడు పుణ్యం కూడా మూట కట్టుకుంటాము. ఎలానో తెలుసు కోవాలంటే ‘ఏది పుణ్యం’ కధ చదవాల్సిందే.
మనమడితో ఆడుకోవాలని, అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలని అమెరికా వెళుతుంది ఒక నాయనమ్మ. టివి కూడా ఆపరేట్ చెయ్యడం చాతకాదని నాయనమ్మని హేళనగా చూస్తాడు మనమడు. మనమడిని మచ్చిక చేసుకోడానికి విఫల ప్రయత్నాలు చేస్తుంది నాయనమ్మ. అనుకోకుండా ఒక రాత్రి మనమడు చేరువ అవుతాడు. సరదాగా సాగే కధ ‘పెన్నిధి దొరికింది’
ఉమ్మడి కుటుంబంలో, ఎవరిని నొప్పించకుండా, అందరికి తలలో నాలుకగా మసలుతూ, దక్షతతో సమస్యలని పరిష్కరించే తల్లిని చూసి మేనేజ్మెంట్ పద్దతులు నేర్చుకున్న తనయుడి కధ ‘ఇప్పుడైనా చెప్పనీయమ్మా’ .
కని పెంచిన తల్లి ఎడల బాధ్యత మరచి, ఆమె కనీస అవసరాలను కూడా గుర్తించని కొడుకు నేర్చుకున్న పాఠం ‘ఒఖ్ఖ రెండు రూపాయలు’ లో చదవచ్చు.
పెంపుడు జంతువులంటే కొంతమందికి ఇష్టం మరికొందరికి అయిష్టం. అయిష్టమైనా పిల్లల కోసం ఒప్పుకున్న మాలతి కష్టాలలో పడ్డ వైనం ‘పాపం మాలతి’ కధలో సరదాగా చదువుకోవచ్చు.
తను ఊహించినవే నిజాలని భ్రమించి, సమాజసేవకి, పీడిత జనోద్ధరణకి నడుం కట్టిన యువతి తెలుసుకున్న సత్యం ‘నాణానికి మరోవైపు’ కధలో. కధని పూర్తి చేసిన తరువాత మనసు ఆర్ద్ర మవుతుంది.
భార్యా భార్తలిరువురు ఉన్నతోద్యోగంలో ఉన్నవారే. రెండేళ్ళ వయసున్న కొడుకు భవిష్యత్ గురించి కలలు కంటారు. వాడిని క్రమ శిక్షణలో పెంచడానికి, అన్నీ నేర్పడానికి, పిల్లల పెంపకంలో ట్రెయిన్ అయిన ఆయాని పెడతారు. కొడుకు మనసులో ఏముందో తల్లి ఎలా తెలుసుకుందో ‘చందమామ రావే’ కధలో చూడవచ్చు.
“ఎత్తుకో బిడ్డనూ ఎక్కు అందలమూ …చేరి మీ వారితో చెప్పి రావమ్మా” అని అన్నగారు అంటే అత్తమామలని, తోడికోడలని,
బావగారిని, భర్తని ఇత్యాదులందరినీ అనుమతి అడిగి కానీ బండి ఎక్కడం కుదరేది కాదు ఆ రోజుల్లో కూడా. వాళ్ళు సులువుగానే అనుమతి ఇచ్చేవారు. ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తున్న స్త్రీ శలవు పెట్టి ఊరికి వెళ్ళాలంటే ఎన్ని అనుమతులు కావాలి? ‘కలికి కాత్యాయిని’ చదివితే అర్ధం అవుతుంది.
శ్రీమతి లక్ష్మిగారు శృతి మించని, సున్నితమైన హాస్యంతో వ్రాసిన ‘డిజైనర్ ఫుడ్’ ‘పాత సీసాలో కొత్త సారా’ ‘వెఱ్ఱిబాగుల వదిన వ్రతకధ’ మొదలైన కధలు పెదాల మీద చిరునవ్వు చెరగకుండా చదివించేస్తాయి.
కధలన్నిటి గురించీ వివరించాలంటే, ఒక్కో కధకి కనీసం ఒక్కో పేరా వ్రాయాలి. స్థలాభావం వల్ల ఇంతకంటే ఎక్కువ వ్రాయడం కుదరదు. పుస్తకం ధర నూట ఏభై రూపాయలూ పూర్తిగా వసూలవుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
‘అతను – ఆమె – కాలం’ పుస్తకాలు ప్రముఖ పుస్తకాల షాప్ ల్లో దొరుకుతాయి. అంతర్జాల బుక్ షాప్ ‘కినిగె’ లో కూడా దొరుకుతాయి. రచయిత్రి దగ్గర నుంచి కూడా బడయవచ్చు.
సారంగ సాహిత్య వారపత్రికలో సి. ఉమాదేవిగారి సమీక్ష..
.http://magazine.saarangabooks.com/2016/05/19/%E0%B0%86%E0%B0%AE%E0%B1%86-%E0%B0%AE%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81-%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2/#comment-29690
సి.ఉమాదేవి.
ఆమె
- మనము - గుర్తుండని
కాలం
ఏదైనా కథ చదువుతున్నారా?ఆ సమయంలో ఎవరైనా
మిమ్మల్ని పలకరిస్తున్నారా? ఆ...ఊ... మాత్రమే
మీ సమాధానమా? అయితే అతను-ఆమె-కాలం చదువుతున్నారన్నమాటే! చదవడంలేదంటారా? అయితే
ఈ విభిన్న కథారాగవిపంచిని మీటాల్సిందే! తప్పక చదవాల్సిన బహుమతి
కథల మణిహారమే జి.యస్.లక్ష్మిగారి
‘ అతను-ఆమె-కాలం’ కథాసంపుటి. ఆమె రచించిన కథలు
మనము చదవడం ప్రారంభించామా మరిక
కాలం గుర్తుండదంటే అతిశయోక్తికాదు. చదివేకొలది మన మనసు పొత్తళ్లలో
నిక్షిప్తమయేలా రచించిన కథలు ఓ వంక
హాస్యలాలనగా,మరోవంక మానవతారాగాలాపనగా వెరసి సమకాలీన సమాజ
గీతాలాపనగా మన ప్రక్కనే కూర్చుని
మనిషి మనవలసిన విధమిదీ అని అనునయంగా చెప్తున్నట్లు
కథనల్లడం లక్ష్మిగారికి వెన్నతోకాదు మనసుతో పెట్టిన విద్య.
ఉదాహరణకు వీరు రచించిన దాంపత్యం
కథే తీసుకుందాం. ఎన్నో కుటుంబాలలో సాధారణంగా
తారసపడే అంశం. అయితేనేం కథ
నడిపిన తీరు మాత్రం అసాధారణం.
అడుగడుగునా ఉత్సుకతలేపే సంభాషణా చాతుర్యం కథను పూర్తిగా చదివేదాకా
కట్టిపడేస్తుంది. తరువాతయినా వదలిపెడుతుందా? ఊహూ! మనమెక్కడికెళ్తున్నా మనలోనే తిష్టవేసి
మన మనసును చిలుకుతూనే ఉంటుంది. కథ వెంటాడటమంటే ఇదేమరి!
భార్యంటే కేవలం అలంకరణతో నిండిన
ఆహార్యానికే పరిమితమైన ఉత్సవవిగ్రహంలా భావించే భర్త రామేశం. భర్తలోని
ఎంతటి కోపాన్నయినా,మాటల తూటాలనయినా భరించిన
భార్య రాజేశ్వరి కాలక్రమేణా సహనం అసహనమై భర్తను
విడిచి వెళ్లిపోతుంది. ఓదార్పు అందకపోతే శక్తికి మించిన ఓర్పు కూడా మున్ముందు ప్రజ్వరిల్లే
బడబాగ్నికి బీజమే! అయితే దాంపత్యబంధంలో గాలివాన
కలకాలం నిలవకూడదు.పిల్లల పలకరింపు, సమర్థింపు ఇచ్చిన స్థైర్యంతో తన ఇంట మళ్లీ
మహరాణిలా అడుగు పెడుతుంది రాజేశ్వరి. భర్త
మౌనంలో రాజీ ధోరణి ఆహ్వానించదగ్గ
పరిణామమే. బంధంలోని అనుబంధానికి అద్దం పట్టిన కథ.
ఇక ‘చందమామ రావె’ కథ.
ఒకనాటి బాల్యానికి చందమామ రావె అని అమ్మపాడే
పాట నిత్యశ్రవణమే. కాని నేటి చిన్నారులకు
అందివచ్చిన సాంకేతికత అనేక వరాలు కురిపిస్తూనే
తెలియని శాపంగా కూడా పరిణమించడం బాధాకరం.
అమ్మనాన్నలు ఆఫీసు పనులలో నిమగ్నమై
బున్నీకి ఆశ అనే కేర్
టేకర్ ను నియమిస్తారు. బుర్రకే
కాదు నోటికీ స్పూను ఫీడింగ్ చేసే ఆశ బున్నీలోని
అసంతృప్తికి మరో భాష్యం చెప్తుంటుంది.
బున్నీ చందమామ కావాలంటున్నడని ఆశ చెప్తే తమ
బిడ్డ చంద్రుడిపై నడవాలనుకుంటున్నాడని సంబరపడతారు సాఫ్ట్ వేర్ తల్లిదండ్రులు. అయితే
తమ బిడ్డకు చందమామ రావె అంటూ అమ్మ
అందించే నోటిముద్దలు కావాలన్న నిజం తెలిసినపుడు వారికేకాదు
మనకు మనసు చివుక్కుమంటుంది.
‘పాపం మాలతి’ అనే కథ అమెరికా
జీవనవిధానంలో అగ్రభాగాన్ని ఆక్రమించుకున్న పెట్ పోషణకు సంబంధించినదే.
పెట్స్ తో అనుబంధానికి అక్కడ
పెద్దపీటే! నిజానికి పక్షులనుకాని పెంపుడు జంతువులను కాని పెంచుకోవడం సర్వసామాన్యమేయైనా
అవసరార్థం వేరే ఎక్కడికైనా వెళ్లాల్సివస్తే
పెంచుకున్నవాటి పోషణ కష్టమే. ఈ
సన్నివేశంతో మాలతి పడ్డ అవస్థలను
హాస్యస్ఫోరకంగా చిత్రీకరించిన కథ. తనకిష్టంలేకపోయినా ఇంటికి
తెచ్చిన కుక్కపిల్లకు తోడు అనుకోకుండా హామ్
స్టర్స్ బాధ్యత మీదపడిన మాలతి వీటితోపడ్డ కష్టం
ఆయాచితంగా వచ్చిన తకధిమే! బోనులోనే తలలు వేలాడేసిన హామ్
స్టర్స్ స్థానంలో వేరేవి వచ్చి చేరేవరకు మనకు
గుబులే!
మనిషి ఆలోచనా సరళిలో
ఎన్నో కోణాలుంటాయి.విభిన్నకోణాలలో జరిగే ఆలోచనా మథనం
ఒకొక్కసారి అర్థవంతమైనా మరొక్కసారి అర్థరహితం కూడా అవుతుంటుంది. వృద్ధదంపతుల
వ్యాహ్యాళికి వచ్చి పార్కులోనే గంటకు
పైగా కూర్చుండిపోవడానికి కారణం కొడుకు
కోడలి నిరాదరణే కారణమన్న నిర్ణయానికి వచ్చిన యువతి వారికి తాను
అండగా నిలబడతానని, చేయూతనందిస్తానని తన వెనుకనున్న బలాన్ని
వివరిస్తుంది. ఉద్యోగాలలో అలసి ఇంటికి వచ్చిన
కొడుకు కోడలికి కాస్తయినా ఏకాంతం లేకపోతే పరస్పరం ఏదైనా ఎలా చర్చించుకుంటారన్న
సహజమైన కారణాన్ని వివరించిన వృద్ధస్త్రీ మాటలు తానాలోచించిన కోణం
ఎంత తప్పయిందో తెలుసుకుని ఆ వృద్ధులకు నమస్సులర్పిస్తుంది.
ఇదే ‘నాణానికి మరోవైపు’ కథలో చెప్పినది.
కాస్త ఆలోచిస్తే కథ
నిజంగా కాస్తకాదు, చాలా ఆలోచించాల్సిన కథ.
అర్ధరాత్రయినా ఇంటికిరాక స్నేహితులతో బలాదూర్ తిరిగే కొడుకు చందును ఆవేశంతో చెంపపై కొట్టడమే కాదు ఇంట్లోకి రానివ్వనంటాడు
తండ్రి . తండ్రి మాటలకు రోషం ఉవ్వెత్తున ఎగిసిన
చందు ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.స్నేహితుడు రాజారాం ఇంట్లో రెండు రోజులున్నా రాజారాం
తల్లిదండ్రులు తననెలాగైనా ఇంటికి పంపించే ఆలోచనలో ఉన్నారని గ్రహించి చిన్నగా ఆ ఇంటినుండి కూడా
తప్పుకుంటాడు. తదుపరి చదువెలా అన్న మీమాంస, బ్రతకడమెలా
అనే బ్రతుకు భయం పొటమరించినా ఇంటికి
మాత్రం వెళ్లకూడదనుకుంటాడు. బ్రతుకు
రహదారిలో తన బాటనెలా నిర్మించుకోవాలో
తెలియని చందు అనుకోకుండా మామయ్య
దృష్టిలో పడతాడు. నడిరోడ్డుపై దొంగసొత్తు తనకు వదలి దొంగలు
పారిపోతే దెబ్బలు తింటున్న చందును మేనమామ కాపాడి చందు ఆకలి తీర్చి
తానేమి ఆరా తీయకుండానే చందు
ద్వారానే విషయం తెలుసుకుంటాడు. చందులో
రగిలే ఆకలి తీర్చడమే కాదు
ఆలోచనలను రగిలిస్తాడు అతడి మామయ్య. కొడుకు
ఆచూకీ తెలియని తల్లిదండ్రులకు చందు మేనమామ చందు
వివరాలనందిస్తాడు. తనకోసం వచ్చిన తల్లిని ఆప్యాయంగా చుట్టుకుపోతాడు చందు. ఆ దృశ్యాన్ని
చూసిన సూర్యం ముఖం కాంతివంతమవుతుంది. పనిలో
పనిగా సూర్యానికి ఆవేశం తగ్గించుకోవాలని సున్నితంగా
చెప్తాడుచందు మేనమామ. ఈ కథకు బహుమతి
రావడం ముదావహం.నిజానికి పాఠకులకే ఈ కథ ఓ
చక్కని బహుమతి.
ఇంకా
జయహో వదినా ,వెఱ్ఱిబాగుల వదిన వ్రతకథ,ఇస్తినమ్మ
వాయనం,డిజైనర్ ఫుడ్ వంటి చక్కటి
హాస్యకథలు అలరిస్తాయి. తప్పక చదివి తీరవలసిన
పుస్తకం అనడంలో సందేహం లేదు.
“అతను
– ఆమె – కాలం” అనే ఈ పుస్తకం
అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలలోనూ లభిస్తుంది.
కినిగె.కామ్ లో ప్రింట్
బుక్, ఈ బుక్ కూడా
లభిస్తాయి.
సి.ఉమాదేవి
ధన్యవాదాలు ఉమాదేవిగారూ..
------------------------------------------------------------------------------------------------------------
Jyothi Spreadinglight toNacchina Pusthakam
Jyothi Spreadinglight toNacchina Pusthakam
వాటుగా మారిన జీవితంలో అందరూ మరచిపోతున్న కోణాన్ని చూపుతూ వీరు రాసిన కథలు ఆనందం కలిగించాయి. ముఖ్యంగా ఆ తరం దంపతుల సహజీవనంలో వారికే తెలీయకుండా ఒకరి కోసం ఒకరు జీవించిన విధానాన్ని చూపిన విధానం బావుంది. ఆధునికత వైపు ప్రయాణిస్తున్న మన జీవితాలలోనే కొన్ని లోపాలున్నట్లు అర్దం అవుతుంది. “దాంపత్యం”, “అతడు ఆమే కాలం” “ఇప్పుడన్నా చెప్పనీయమ్మా” “కలికి కాత్యాయిని” ఇటువంటి దంపతుల కథలు. “ఏది పుణ్యం” కథ ద్వారా రచయిత్రి నిజాయితీగా బ్రతుకుతున్న మధ్యతరగతి సమాజానికి చేస్తున్న మేలును గురించి వివరిస్తారు. “ఒక్క రెండు రూపాయలు” కథ మనసును కదిలిస్తుంది. తల్లి తండ్రులు ముసలివారయి వారి అవసరానన్నీ బిడ్డలు చూస్తున్నాం కాబట్టీ వారిదంటూ కొంత పైకం వారి వద్ద ఉండవలసిన అవసరం లేదు అనుకునే పిల్లలను ఉద్దేశించి రాసిన కథ. రచయిత్రి ఈ కథను రాసిన తీరు చాలా బావుంది. సున్నితమైన అంశాన్ని నొప్పించక చెప్పిన విధం నాకు చాలా నచ్చింది. “నాణానికి మరో వైపు” అనే కథకూడా తప్పక చదవవలసిన కథ. ముసలి వారందరూ వారి పిల్లల వద్ద కష్టపడుతున్నారని అనుకునే కొందరికి కనువిప్పు ఈ కథ. పెద్దవారి భాద్యత తీసుకున్న చిన్నవారు కొన్ని సార్లు కోల్పోయే ఆనందాన్ని పెద్ద తరం అర్ధం చేసుకుంటే ఆ కుటుంబానికి కలిగే ఆనందం చెప్పే కథ ఇది. రచయిత్రి రాసిన కథలు తక్కువైనా మంచి ఆలోచనతో, పరిశిలనతో అవగాహనతో రాయడం కనిపిస్తుంది. ప్రతి కథ కూడా మనకు జీవితంలోని మరో కోణాన్ని చూపిస్తూ ముందుకు సాగుతుంది. మనం కొన్ని సందర్భాలలో అర్ధం చేసుకోలేకపోతున్న విషయాల పట్ల అవగాహన కలిగిస్తాయి కొన్ని కథలు. “కాస్త ఆలోచిస్తే” కథ టీనేజ్ పిల్లలున్న తల్లులందరికీ పెద్ద ఊరట. రచయిత్రి ఇటువంటి మంచి కథలు రాస్తూ ఉండాలి.
14 వ్యాఖ్యలు:
Congratulations Sree Lalitha Garu -
Congratulations Sri Lalitha Garu .
Congratulations, after reading the introduction, want to read the complete book. Is there a way I can buy it online?
Thank you Sridevigaru for your interest in buying the book. This is the link for you to get the book as print version and as e book. Please go through it and leave me your valuable opinion about the stories.
THanking you once again,
G.S.Lakshmi.
http://kinige.com/kbook.php?id=6249
Thank you Malagaru..
Thank you Sridevi Adurigaru..
అభినందనలు లలితగారు.ఉషారాణి ముఖచిత్రం అన్నారు కదా ఎక్కడ ? ఈసారి పుస్తక ప్రదర్శనలో కాకుండా వేరే ఎక్కడైనా ఆడిటోరియం లో ఏర్పాటు చేయండి.ఉషగారి పుస్తక పరిచయం లో కలుసుకున్నాం కదా ?
Mee Avishkarana lo nenoo vunnanoch!
Niharikagaru..baagunnaaraa..
MIru lekumdaanaa Lakshmi Raghavagaru...
వయసు,మనసు కాదేది జీవితానికి అడ్డం. అవి అర్ధాలే గాని, అతను-ఆమె-కాలానికి అద్దాలు ... సూపర్బ్ అండ్ congratulations లలితగారు ..
నిజం చెప్పారు రుక్మిణీదేవిగారూ.. ధన్యవాదాలు..
chala bagha chepparu, keep it up
Telugu NRIs గారికి ధన్యవాదాలు.
Post a Comment