Pages

Monday, October 16, 2017

మా వదిన కామన్ సెన్స్.



తటవర్తి జ్ఞానప్రసూనగారు తీసుకువస్తున్న త్రైమాసిక లిఖితపత్రిక "మందాకిని" అక్టోబరు సంచికలో నా కథ "మా వదిన కామన్ సెన్స్."


మా వదిన కామన్ సెన్స్..
    మా వదినా మేమూ కూడా “స్వాతిసదన్ ”అపార్ట్ మెంట్స్ లోనే వుంటాము. ఆ అపార్ట్‍మెంట్స్ కి సెక్రటరీగా వున్న వదిన ప్రతి పండగకీ, పబ్బానికీ అందరికీ పోటీలు పెట్టేస్తుంటుంది. సాధారణంగా  పిల్లలకి క్విజ్ పోటీలు, ఆడవాళ్లకి వంటల, చేతిపనుల పోటీలూ, మగవారికి ఆటలపోటీలూ పెడుతూంటుంది. కానీ ఈసారి ఆగస్ట్ పదిహేనుకి పధ్ధతి మార్చేసింది. వయసులో చిన్నవాళ్ళు కనక పిల్లలకి యెలాగూ ప్రత్యేకంగా పోటీలు పెట్టక తప్పదు. కానీ మగవాళ్లకీ, ఆడవాళ్లకీ పోటీలు విడివిడిగా యెందుకూ.. మగవాళ్ళు వంటలు చేసేటట్లే ఆడవాళ్ళు ఆటలూ ఆడతారు అంటూ యిద్దరికీ కలిపే పోటీలు పెట్టింది. కానీ ఇద్దరినీ ప్రత్యర్ధులని చేసింది. అంటే మగవాళ్లంతా ఒక జట్టూ, ఆడవాళ్లంతా ఒక జట్టూ. ఆ జట్టుకీ, ఈ జట్టుకీ వంటలపోటీ ఒకటీ, ఆటలపోటీ ఒకటీ పెట్టింది. అసలే అనుభవజ్ఞులైన ఆడవాళ్ల జట్టు వంటలపోటీలో ప్రథమ బహుమతి గెల్చేసుకుంది. మరింక ఆటలపోటీగా త్రో బాల్ పెట్టింది.
   ఆగస్టు పదిహేను మరో రెండ్రోజుల్లోకి వచ్చేసింది. కానీ ఆటలపోటీమటుకు అందరికీ టైమ్ కుదరక యింకా అవలేదు. స్వతంత్రదినం రోజు గెలిచినవారికి బహుమతులివ్వాలి కదా. ముందుగానే బహుమతులు కొని తెచ్చిపెట్టుకోవాలాయె. ప్రతిదానికీ మా వదిన వెనకాల తోకలా నేనూ తయారవుతుంటాను కదా మరీ. అందుకని ఆ బహుమతులు కొనడానికి నన్ను సాయం రమ్మంది. అందుకే వదినతో కలిసి కోఠీకి వెళ్ళాను.
   ఎంతైనా వదిన అన్నీ యెంతో బాగా చేస్తుంది. పిల్లలకి మంచి మంచి కథల పుస్తకాలూ, పెన్నులూ కొంది. వంటలపోటీలో గెలిచిన ఆడవాళ్ళజట్టుకి ఒక్కొక్కరికి మంచి అందంగా వున్న గాజులు పెట్టుకునే బాక్సులు కొంది. మరింక త్రో బాల్ టీమ్ కి బహుమతులు కొనాలి.
  ఇంతలో అటుపక్కన యెవరో లేడీస్ హాండ్ బాగ్ లు సేల్ లో అమ్ముతున్నాడు. వెళ్ళి చూస్తే చాలా బాగున్నాయి. అంత తక్కువధరలో ఆ హాండ్ బాగ్ లు దొరకడమంటే గొప్పే. కానీ అప్పటికే ఆడవాళ్ళకి గాజులు పెట్టుకుందుకు బాక్సులు కొనేసామాయె.  కానీ ఈ బ్యాగులు చూస్తే వదలబుధ్ధి కావటం లేదు. వదిన కాసేపు ఆలోచించింది. చాలా బ్యాగులు కొంటామనీ యింకా ధర తగ్గించమనీ ఆ కొట్టువాడిని అడిగింది. ఏ కళ నున్నాడో వదిన మాటకి అతను సరే నన్నాడు. అంతే.. ఆడవాళ్ళు యెంతమందున్నారో అన్ని బాగ్‍లూ కొనేసింది. నాకు అర్ధం కాలేదు. “అదేంటి వదినా, లేడీస్ అందరికీ ఆ బాంగిల్‍బాక్సులు కొన్నావుగా!” అన్నాను.
  “ఇవీ వాళ్లకే” అంది కూల్‍గా.
  “అదేంటీ? ఇంకా ఆటలపోటీ అవలేదుగా. ఎవరు నెగ్గుతారో తెలీకుండా యెలా కొంటావ్? ఒకవేళ జెంట్స్ నెగ్గితే ఈ ప్రైజులు యెలా యిస్తాం?” అనడిగాను. వదిన నావంక సాభిప్రాయంగా చూసింది. “కాస్త కామన్ సెన్స్ ఉపయోగించు.” అంటూ యింక నావైపు చూడకుండా ఆ బాగులు రంగులు యేరడం మొదలుపెట్టింది.
     నాకు వుడుకుమోత్తనం లాంటిది వచ్చింది. నాకు కామన్ సెన్స్ లేదంటుందా! తనకే లేదు. లేకపోతే పోటీ యేమో ఆటలపోటీ.. అందులోనూ త్రోబాల్. మగవాళ్ళు కానీ బలం వుపయోగించి బంతి విసిరారంటే ఆడవాళ్ళు యెక్కడ పట్టుకోగలరూ?  మరి ఆ నెగ్గిన మగవాళ్ళకి ఈ గాజులపెట్టె యిస్తుందా.. లేక లేడీస్ హాండ్ బ్యాగ్ యిస్తుందా? మగవాళ్ళకి పనికొచ్చేవి కాకపోయినా కనీసం యింటిని అలంకరించే యే డెకరేటివ్ వస్తువులుకొన్నా బాగానే వుండేది. ఈ బాంగిల్ బాక్సులూ, బ్యాగులూ మగవాళ్లకి యేమని యిస్తాం! కానీ నాకు కామన్ సెన్స్ లేదన్న వదినతో యింక మాటలు పెంచలేదు. “చూడు చూడు.. యే రంగులు బాగుంటాయో..” అన్న వదినతో కలిసి నేను కూడా మంచిరంగుల్లో కావలసినన్ని బ్యాగులు సెలెక్ట్ చేసాను.
   ఇంటికి వచ్చానే కానీ నాకు లేనిదీ వదిన కున్నదీ అయిన ఆ  కామన్ సెన్స్ యేమిటో యెంత ఆలోచించినా నా బుర్ర కందలేదు. ఎంతసేపూ రేప్పొద్దున్న ఆ గాజులపెట్టెకానీ, హాండ్ బ్యాగు కానీ ప్రైజులుగా యిస్తున్నప్పుడు  యిచ్చే అధ్యక్షులూ, పుచ్చుకునే మగవారుకానీ యేమనుకుంటారోననే  బాధ నన్ను నిలవనివ్వటంలేదు. అప్పుడెప్పుడో చరిత్ర పాఠాల్లో చదివినట్లు గుర్తు.. ఖడ్గ తిక్కన యుధ్ధరంగం నుండి వెన్నుచూపించి వస్తే, ఆయన భార్య స్నానానికి మరుగు యేర్పరచి, అక్కడ అందుబాటులో పసుపుముద్ద కూడా పెట్టిందిట. అది చూసి తిక్కన పౌరుషంతో మళ్ళీ యుధ్ధానికి వెళ్ళాడుట. అంతకాకపోయినా  మగవాడికి కొంతైనా పౌరుషం వుంటుంది కదా! ఈ గాజులపెట్టె కానీ, హాండ్ బ్యాగుకానీ యిదిగో మీ బహుమతంటూ  చేతికిస్తే మగవాళ్ళ మొహాలు యెలా మారిపోతాయోనని వూహించుకుంటూంటేనే నాకు దడ పుట్టేసింది.
  నేను భయపడ్డానని కాలమాగదు కదా! ఆగస్టు పదిహేను రానే వచ్చింది.  అంతకుముందు సమయం  లేకపోవడం వల్ల అప్పుడే త్రోబాల్ పోటీ పెట్టడం, తర్వాత జెండా వందనం, ఆపైన బహుమతులివ్వడం జరుగుతుందని ముందురోజే వదిన అందరికీ సర్క్యులర్ పంపేసింది. గేమ్ ఆడడానికి టైమ్ పడుతుంది కనక అనుకున్న టైమ్ కన్నా ఓ గంట ముందే కార్యక్రమం మొదలుపెట్టేస్తానంది. యేం చేస్తానూ.. అలాగే ఓ గంట ముందే వెళ్ళాను.
  ఒక పీటీ సార్ పర్యవేక్షణలో పక్కనే వున్న గ్రౌండ్ లో త్రోబాల్ కోసం క్రమపధ్ధతిలో ముగ్గుతో కొలతలప్రకారం కోర్ట్ యేర్పాటు చేసింది. మధ్యలో నెట్ కూడా కొత్తగా కొందనుకుంటాను పొద్దుటెండ పడి తళతళలాడిపోతోంది. అనుకున్న సమయానికి అటూయిటూగా అందరూ వచ్చేసారు. పీటీసారే ఆ త్రోబాల్ ఆటకు జడ్జి. ఇంక యెవరైనా కాదనడానికి యేముంది? కానీ నాలో వున్న సంశయం మటుకు పోలేదు. మగవాళ్ళు యెంత ప్రస్తుతం ప్రాక్టీస్ లో లేకపోయినా కనీసం ఆట రూల్స్ అవీ కొంచెం గుర్తుండే వుంటాయి. మరింక కొందరు ఆడవాళ్ళు అప్పటికే పెరుగుతున్న యిద్దరు పిల్లలతోపాటు వీళ్ళ శాల్తీలు కూడా పెరిగిపోయుండడంతో మగవాళ్ళంత చురుగ్గా పరిగెట్టే స్థితిలో లేరు. పరుగు మాటటుంచుతే  బాల్ పట్టుకుందుకు కాస్త గబగబా ఓ అడుగు ముందుకేనా వెయ్యగలరోలేదో అనుమానమే. ఈమాత్రం దానికి ఆడడం కూడా యెందుకూ? నాకు కామన్ సెన్స్ లేదంది కానీ వదినకే లేదు కామన్ సెన్సు. ఇన్నాళ్ళకి వదినని కామన్ సెన్స్ లోనైనా మించిపోయేను అని ఆనందిస్తుంటే వదిన “స్వర్ణా.. తొందరగా రా!” అని పిలవడంతో గ్రౌండ్ లోకి వెళ్ళాను.
   ఆట మొదలైంది. పీటీ మాస్టారు చాలా స్త్రిక్ట్ గా వున్నాడు. రెండు టీముల్నీపిలిచి రూల్సన్నీ యేకరువు పెట్టాడు. మగవాళ్లంతా ఒకవైపు, ఆడవాళ్ళం ఇంకోవైపు విడిపోయాం. మా వదిన చాలా ముందుచూపుతో ఫస్ట్ అయిడ్ బాక్స్ కూడా తెప్పించింది. ఆ పీటీసార్ దానిని చూసి మావైపు జాలిగా చూసాడు. “యెందుకండీ ఆయన అలా చూస్తున్నారూ?” అని నా పక్కనున్న గుజరాతీ ఆవిడని అడిగాను. “బాల్ తగిలితే దెబ్బ బాగా తగుల్తుంది కదా! అసలే మనం ఆడవాళ్ళం.  అటువైపు బలంగా కొట్టే మగవాళ్ళు. అందుకని మనకి దెబ్బలు తగుల్తాయని అలా జాలిగా చూస్తున్నాడనుకుంటాను.” ఆవిడ తెలివినంతా వుపయోగించి సమాధాన మిచ్చిందావిడ. నాకు భయమేసింది. ఇప్పుడు నాకు తగలకూడని చోట యేదైనా దెబ్బ తగిలితే, బాల్ పట్టుకుందుకు పరిగెడుతున్నప్పుడు కాలు మడతపడి పడిపోతే.. ఇంట్లోవాళ్లకి యెంత యిబ్బందీ.. గబగబా వదిన దగ్గరికి పరిగెట్టాను. “వదినా, నేను ఆడను ఈ ఆట. నా బదులు యింకెవర్నైనా తీసుకో..” అనేసేను.
“అదేంటీ సడన్‍గా..?” అంది వదిన.
“దెబ్బలు తగిలి మంచం దిగలేకపోతే నాకు యెవరు చేస్తారు వదినా? తీరి కూర్చుని దెబ్బలు తగిలించుకోమంటావా?” ఉక్రోషంగా అడిగేను.
“దెబ్బలెందుకు తగుల్తాయీ?” అంది ఆశ్చర్యంగా..
“ఎందుకేవిటీ.. వాళ్లని చూడూ యెలా వున్నారో. వాళ్ళు మామూలుగా బంతి వేస్తేనే పట్టుకోడం కష్టం. ఇంక గేమ్ అంటే విజృంభించి ఆడేస్తారు. నేనాడనంతే..” అన్నాను చిన్నపిల్లలాగా.
“వాళ్ళు విజృంభించీ ఆడరు, నీకు దెబ్బలూ తగలవు. నాదీహామీ. నడు నడు.. “ అంటూ నన్ను బలవంతంగా కోర్టులోకి లాగేసింది.
  ఆట మొదలైంది. టాస్ గెలిచి సర్వీసు మేమే తీసుకున్నాం. ఎంత ఊపిరి బిగబట్టి, యెంత బలంగా వేసినా ఆ బాల్ నెట్ దాటి ఒక్కడుగు కన్న ముందుకి వెళ్ళలేదు. సర్వీసు మారింది. మగవాళ్ళ సర్వీసు. ఊపిరి బిగపట్టి వో మూలకి వెళ్ళిపోయి నిలబడ్డాను. 201 ఫ్లాట్ లో వుండే వెంకటేశ్వర్లుగారు చేసిన సర్వీసుని 405 లో వుండే అనూరాధ అట్టే పట్టేసుకుంది. అలాగ యిటు మేమూ, అటు వాళ్ళూ సర్వీసులు మారుతూ ఆడుతూనే వున్నాం. వాళ్ళొక్కటీ పట్టుకోడం లేదు. మావైపు బాల్ కూడా యెవరికీ తగలకూడదన్నంత సున్నితంగా వేస్తున్నారు.  చూస్తుండగానే మొదటిగేమ్ గెలిచేసాం.
  రెండోగేమ్ కూడా అలాగే అయింది. మధ్యలో పీటీసార్ యెందుకు మొత్తుకుంటున్నాడో, యెందుకు తలకొట్టుకుంటున్నాడో నాకు అర్ధంకాలేదు. రెండోగేమ్ కూడా మేమే గెలిచేసాం. పీటీసార్ అన్నయ్యతో యేదో గట్టిగా అంటూ జెండావందనానికి కూడా వుండకుండా వెళ్ళిపోయేడు.
    నేను సంతోషం పట్టలేక వదిన దగ్గరికి వెళ్ళి “ఓ.. ముందే మేచ్ ఫిక్సింగ్ చేసేసావన్న మాట. మరామాట నాకైనా చెప్పొచ్చుగా!” అన్నాను నిష్ఠూరంగా..
   “మేచ్ ఫిక్సింగ్ లేదూ.. యేమీలేదూ.. నీతో మొన్ననే అన్నానుగా.. ఆ కామన్ సెన్సే గెలిపించింది.” అంది వదిన. నాకు మళ్ళీ వుక్రోషం వచ్చేసింది. “ఏంటి వదినా, నాకు లేనిదీ, నీకు వున్నదీ.. ఆ కామన్ సెన్సూ?” అనడిగేను. వదిన నవ్వేసింది. “అంత  వుక్రోషం యెందుకూ? చెప్తాను విను. మనందరం యెవరం? ఒకళ్ళకొకళ్ళం అన్నాచెల్లెళ్ళం, అక్కా తమ్ముళ్ళ ల్లాంటివారం కదా! మగవాళ్ళకి యెదురుగా నిలబడి ఆడుతున్నది వాళ్ళింట్లోవాళ్ళూ, ఎదురింటి అన్నగారూ అని పిలిచేవాళ్ళే కదా! అలాంటప్పుడు యే మగవాడైనా యెదురుగా తనవాళ్ళనుకున్న ఆడవాళ్ళుంటే  బాల్ గట్టిగా వాళ్ళకి తగిలేలా వేస్తాడా? తన నైపుణ్యాన్నంతా చూపించేసి వాళ్లని పడగొట్టాలనుకుంటాడా? తనింట్లో ఆడవారి మీద గెలిచి మళ్ళీ యే మగవాడైనా యింట్లో సుఖంగా, శాంతిగా వుండగలడా? అందుకే మగవాళ్ళందరూ అంత సున్నితంగా ఆడారు. అదే నేనన్న కామన్ సెన్స్. అందుకే ఆ పీటీసార్ కి చిరాకొచ్చి వెళ్ళిపోయేడు ” అంది నవ్వుతూ.
   అప్పటికి నాకు కనువిప్పు కలిగింది. ఎంతైనా వదినకి కామన్ సెన్స్ యెక్కువే అనిపించింది. ఎదురుగా చూస్తే మగవాళ్లందరూ ఓడినందుకు హాయిగా నవ్వుకుంటూ జెండావందనానికి అన్నీ రెడీ చేస్తున్నారు. రెండుపోటీలూ మేమే గెలిచినందుకు మేము మగవాళ్ళకన్న ఎక్కువగానే నవ్వుకుంటూ జెండావందనం చేసి, రెండు బహుమతులూ ఆనందంగా అందుకున్నాం.



1 వ్యాఖ్యలు:

నీహారిక said...

>>>>తనింట్లో ఆడవారి మీద గెలిచి మళ్ళీ యే మగవాడైనా యింట్లో సుఖంగా, శాంతిగా వుండగలడా? అందుకే మగవాళ్ళందరూ అంత సున్నితంగా ఆడారు. అదే నేనన్న కామన్ సెన్స్. >>>

ఇప్పటికైనా మీకర్ధం అయిందా ? నేను మీ వదినగారి వీరాభిమానిని ఎందుకయ్యానో ?

వదినా మజాకా ?