Pages

Wednesday, November 22, 2017

భమిడిపత్తి భాగోతం


భమిడిపత్తి భాగోతం



   
      ఆమధ్య నాల్రోజులు మా ఊరు రాజమంద్రం వెళ్ళొచ్చాంకదా. సరే.. దిగినరోజు ఇంట్లో పనులయిపోయేయి. మర్నాడు మా అమ్మమ్మగారి ఊరు కొత్తపేట బయల్దేరాం. అసలా గోదావరి వైపు వెడితేనే చాలు ఉత్సాహం ఉరకలు వేస్తుంది. పొద్దున్నే లేచి చెయ్యాల్సిన పనులేవీలేవు కనక ఎంతో రిలాక్సెడ్గా వుంది. రాజమంద్రం నుంచి మా అమ్మమ్మగారి ఊరు కొత్తపేట గంటే ప్రయాణం. దారంతా ఎంత బాగుందో. ఎటు చూసినా ఆకుపచ్చే. పచ్చ పచ్చని చెట్లతో కాలవగట్టువెంట కారు వెడుతుంటే పరవశించిపోయేం.
    ఎప్పుడో యేళ్ళక్రితం ద్వీపాంతరం వెళ్ళినవాళ్లం స్వంత ఊరికి వచ్చినట్టు, ఇంతా చేసి హైద్రాబాదు నుంచి రాజమండ్రి, అట్నుంచి కొత్తపేట వెడుతుంటే స్వేఛ్ఛావిహంగాల్లా ఎగిరిపోయేము. కట్టు విప్పిన దూడల్లా గంతులేసేము. కాలవగట్టంట పెరిగిన పిచ్చి బఠానీ తుప్పలని కూడా అవి మాకు హైద్రాబాదులో ఎక్కడా కనపడలేదంటూ..పీక్కుని తెచ్చుకున్నాము..  ప్రతీదీ ఇది మనకక్కడ దొరకదు కదా.. అనుకోడం, దాన్ని తెచ్చి సంచిలో కుక్కెయ్యడం. భలేగా వుందిలెండి. (ఎటొచ్చీ కారు డ్రైవరు మటుకు మాకు కాస్త లూజేమో ననుకుని ఖంగారుపడ్డట్టున్నాడు..అయినా మేం లెక్కచెయ్యలేదు లెండి.)
   కొత్తపేటలో మా అన్నయ్యింటి కెళ్ళామా.. వదిన కూడా మా మామయ్య కూతురే.. ఇంక అందరం కబుర్లే కబుర్లు. అప్పుడు మా వదిన సీతామహాలక్ష్మీ శ్రీరామ సప్తాహం చేస్తోంది. ఉదయం ఆరుగంటలనుంచి సాయంత్రం ఆరుగంటలవరకు బేచిలు బేచిలుగా శ్రీరామనామ జపమే. అలా రామనామజపం చేస్తూ ఆడవాళ్ళు కొంతమంది అక్కడేవున్న పత్తిలో గింజ తీస్తుంటే, ఇంకొంతమంది పత్తితో సన్నగా పోగులు పోగులుగా దారం తీసి ఒత్తులు చేస్తున్నారు. ఎంత నైపుణ్యమో అనిపించింది. పత్తితో దారం ఎంత బాగా వస్తోందో.. దానిని భమిడిపత్తి అంటారుట. భమిడిపత్తితో దేవుడికి దీపం పెడితే మంచిదిట. ఇది వినగానే నాకు భమిడిపత్తితో రోజూ ఇంట్లో దీపం పెట్టికోవాలనిపించింది. అంతేకాకుండా అది హైద్రాబాదులో దొరకదేమోనని కూడా అనిపించింది. సరే..ఇంకా ఆలోచన దేనికీ..ఇక్కడే కొనేసుకుంటే సరీ.. అనుకున్నాను.
అలా అనుకున్నదే తడవుగా అది కొనుక్కుందుకు నన్ను మా అన్నయ్య కొట్టుకు తీసికెళ్ళేడు. అక్కడి కెళ్ళేక "ఎన్ని కిలోలు కావాలీ?" అన్నాడు కొట్టువాడు. నాకేం చెప్పాలో తోచలేదు.
అసలు కిలో పత్తంటే ఎంత వస్తుంది? చిన్న చేతిసంచినిండానా.. లేక గోనెబస్తా నిండానా.. నేను బొత్తిగా కిలోయే కావాలంటే బాగుండదేమో..
     అలా ఆలోచిస్తుంటే చిన్నప్పుడు మా కజిన్స్ ప్రశ్న అడిగినప్పుడు మేం పడ్ద చిక్కు గుర్తొచ్చింది.

  చిన్నప్పుడు అమ్మమ్మగారి ఊరు వెళ్ళినప్పుడు మేం స్కూల్లో మాకు చెప్పిన పాటలు, పద్యాలు అక్కడి మా కజిన్స్ కి వినిపిస్తే, వాళ్ళేమో మేమేం తక్కువన్నట్టు అడ్దదిడ్దమైన ప్రశ్నలు వేసేవారు. వాటిని చొప్పదంటు ప్రశ్నలంటారుట. అందులో ఒకటేవిటంటే..
   "ఆరడుగుల గేదె వుంది. పదడుగుల చొప్పకట్ట (పశువులకు తినడానికి పెట్టె పొడుగాటి చొప్ప)వుంది. అది గేదె తినగలదా... లేదా..?" అని సీరియస్గా అడిగేవారు. మాకేమో.. ఆరడుగుల గేదె కదా.. పదడుగులది ఎలా తినగలదు అనుకుని "తినలేదు.." అని ఖచ్చితంగా చెప్పేవాళ్లం. వాళ్ళు ఫక్కున నవ్వి "పిచ్చి మొహాల్లారా.. గేదె పళ్లతో చొప్పకట్టెని ముక్కలు చెయ్యదూ.." అని వెక్కిరించేవారు.
అలాంటిదే ఇంకో ప్రశ్న.."కిలో దూది బరువా.. లేక కిలో ఇనుము బరువా..?" అనడిగేవారు. మామూలుగా దూది తేలిగ్గానే వుంటుంది కదా..ఎత్తడానికి ఇనుమే కదా బరువు.. అందుకని ఇనుమే బరువని చెప్పేవాళ్లం.. వాళ్ళు పడీ పడీ నవ్వేవారు.
    ఇప్పుడు సరిగ్గా అలాంటి ధర్మసంకటం లోనే పడ్డాను. కిలో దూది అంటే ఎంత వస్తుందీ.. మామూలు చీరలు పెట్టుకునే సంచీడా..లేక బియ్యం బస్తా అంత వస్తుందా..ఇప్పుడు ఒక్క కిలో చాలంటే ఇంత దూరం తీసుకు వచ్చిన అన్నయ్య యేమనుకుంటాడో. అసలు కిలో అంటే యెంతొస్తుందో తెలిస్తే బాగుండును అనుకుంటుంటే కొట్టువాడు, “లక్ష వత్తుల వ్రతానికామ్మా…” అనడిగేడు. సంబడం సంత కెళ్ళినట్టే వుంది అనుకున్నాను. పొద్దున్న లేచి, దీపంపెట్టేందుకే దేవుడు కనపడుతుంటే ఇంకా వ్రతాలు కూడానా అనుకుంటూ, “కాదు కానీ, రెండు కిలోలియ్యి..” అన్నాను.. వాడు సంచీతో ఇస్తాడా..బస్తాతో ఇస్తాడా అని బెదురుతూ..
   నా పుణ్యం బాగుంది.. వాడు పెద్ద ప్లాస్టిక్ బేగ్ లో దూదిని నొక్కి నొక్కి పెట్టి ఇచ్చాడు. హమ్మయ్య అనుకున్నాను.
ఇదిగో..ఇదే భమిడిపత్తి..


    హైద్రాబాదొచ్చాక లగేజితో పాటు పెద్దసంచీని కూడా ఇంట్లోకి తెస్తుంటేఇదేమిటీ?” అని ఇంట్లోవారి ప్రశ్న. కాశీ వెళ్ళి గాడిద గుడ్డట్టుకొచ్చిన సామెత లాగా అమ్మమ్మగారూరు వెళ్ళి భమిడిపత్తి తెచ్చేనంటే నవ్వుతారేమోనని, దాని గురించి పేద్ద కథ అల్లేసాను. భమిడిపత్తితో ఇంట్లో దీపం వెలిగిస్తే ఇంట అష్టైశ్వర్యాలూ, నవనిధులూ వరదలా వచ్చిపడిపోతాయనీ, ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా, ఆనందంగా వుంటారనీ సెంటిమెంటుతో కొట్టేసరికి, ఇంక మరి మాట్లాడకుండా సంచీని భయభక్తులతో తీసికెళ్ళి లోపల పెట్టేసారు.

   ఇక్కడిదాకా బానేవుంది. ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. రోజూ భమిడిపత్తితో దీపం పెట్టుకునే ఆలోచన బాగానే వుంది కానీ, పత్తి వత్తి అవడమే యెలాగా అన్నది పెద్ద సమస్య అయిపోయింది.
  అమ్మమ్మగారూళ్ళో వాళ్లందరూ యెంచక్క ఇట్టిట్టె పత్తిలో గింజ తీసేసారు.. ఇంకా సులువుగా వత్తులు చేసేసారు. నేను అందులో పిడికడంత పత్తిని తీసి, గింజ తీద్దామని చూస్తే ఓర్నాయనో.. అంగుళం అంగుళానికీ గింజే. అది కూడా చుట్టూ వున్న పత్తి గింజని గట్టిగా పట్టెసుకునుంది. గింజనుంచి పత్తి లాగాలంటే చాలా శ్రమపడాలని అర్ధమైపోయింది. పిడికెడంత పత్తీ గింజ తీసేటప్పటికి అరగంట పైగా పట్టింది. మరింక దానిని వత్తులు చెయ్యడానికి యెంత టైమ్ పడుతుందో.. అసలు కాస్త పత్తికీ యెన్ని వత్తు లవుతాయో.. నాలుగైనా అవుతాయా లేదా.. అని తల్చుకుంటుంటేనే గుండెల్లో గాభరా లాంటిది మొదలైంది.
     తెచ్చిన పత్తినుంచి గింజ లెప్పటికి తీసేనూ..దానిని వత్తు లెప్పటికి చేసేనూ.. అంతా కలిపితే యెన్ని సంవత్సరాలు పడుతుందీ అని ఆలోచిస్తుంటే అందుకేనేమో మన పెద్దవాళ్ళు యెంతకీ తెమలని పనినిపత్తిపనీఅనేవాళ్ళని గుర్తొచ్చింది.
 యేం చేస్తాం.. కక్కలేనూ.. మింగలేనూ..అన్న పరిస్థితికి వచ్చాను. రోజూ కాస్త కాస్త పత్తి తీసుకుంటుండడం, వత్తులు చేసుకుని వాడుకుంటుండడం చేస్తుంటే వసంతగానం లో వసంత గుర్తొచ్చింది. నాకన్న వసంతే నయం.. నాలాగ పత్తి కొనకుండా ఊలు మాత్రమే కొంది. తరతరాలుగా పుట్టే ఆడపిల్లల జడలకి ముడి వెయ్యడానికి మూలధనం సమకూర్చింది. కానీ, పత్తి అలాకాదే.. దీన్నెలా వాడుకోవడం అని ఆలోచిస్తుంటే నా బుర్రలో బల్బు వెలిగింది.
 మాకు తెలిసున్నావిడ ఒకావిడ ఉంది. పేరేవిటంటారా.. మన పేటెంట్ పేరుందిగాసంతలో చింతకాయ..” అలా అనేసుకుందాం. చింతకాయ వాళ్లకి ఒకసారి యెవరో వాళ్ల తోటలోవని చెపుతూ, బోలెడు పచ్చిబఠానీకాయలు పంపించారు. వాటిని వలవడం అంటే మాటలా.. అప్పుడావిడ యేం చేసిందంటే..కిట్టీపార్టీ అవుతున్నప్పుడు, బఠానీకాయల్ని ఒక్కనిమిషంలో యెవరు యెక్కువ వలుస్తారో వాళ్ళకి ఒక ప్రైజ్ అంటూ వన్ మినిట్ గేమ్ ఒకటి పెట్టింది. ఇంకనేం.. ప్రైజ్ కోసం ఆవిడ ఫ్రెండ్స్ అందరూ పోటీలు పడి కాయల్ని ఇట్టే ఒలిచి అట్టే అవతల పడేసేరుట.. ఆవిడ విషయం యెంతో గొప్పగా చెప్పింది..అది గుర్తు రాగానేఆహా ..దొరికింది దారి..” అనుకున్నాను.
 వెంటనే మా మహిళామండలిఫ్రెండ్స్ నీ, ఫేస్ బుక్ ఫ్రెండ్స్ నీ పిలిచేసి, వన్ మినిట్ లో గింజలు తియ్యడం ఒక గేమూ, వత్తులు చెయ్యడం మరో గేమూ పెట్టి పడేస్తే అనుకున్నాను.. ఇంకనేం.. భలే ఉపాయం దొరికింది అనుకుంటూ మళ్ళీ డైలమాలో పడ్డాను.. గింజ తియ్యడానికి గ్రూప్ ని పిలవడం, వత్తులు చెయ్యడానికి గ్రూప్ ని పిలవడం అని ఆలోచించేసుకుని, ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ని గింజ తీసే పోటీకీ, మహిళామండలి ఫ్రెండ్స్ ని వత్తులు చేసే పోటీకీ కేటాయించేసేను..
హమ్మయ్య..మనసులోంచి పెద్ద భారం దిగింది. ఎటొచ్చీ, పోటీలు రెండూ ఎప్పుడు పెట్టాలా అన్నదే తేలాలి.
 సో, ఫ్రెండ్స్.. బీ రెడీ..

4 వ్యాఖ్యలు:

Lalitha said...

మీ భమిడిపత్తి పోటీ ఫలితాల పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను :)

నీహారిక said...

అమెరికాలో పెడదాం లలితగారు గెలుచుకుంటారు. నా దగ్గర ఏళ్ళతరబడీ మూలనపడి ఉంది. భలే ఐడియా ఇచ్చారు.


శ్రీలలిత said...

Lalitha TS garu... haha..

శ్రీలలిత said...


హ హ నీహారికా, అలాక్కానిద్దాం..