Pages

Monday, March 25, 2013

కాపురం అంటే ఇదీ...







       రంజిత అందమైంది, తెలివైంది, చురుకైంది, శ్రీమంతురాలూ కూడానూ. అందుకనే మరి రెండో ఆలోచనే లేకుండా వెంఠనే పెళ్ళి కొప్పేసుకున్నాడు రణధీర్.
అప్పటిదాకా ఉన్న ఊరు వదిలి ఒక్కతీ బైటకి వెళ్ళని రంజితని కాపరానికి రాగానే హోటల్ కి తీసికెళ్ళేడు. అక్కడ పదార్ధాలన్నీ బల్లమీద ఒకచోట లైన్ గా పెట్టి ఉన్నాయి. తినడాని కొచ్చినవాళ్లందరూ వాళ్ళంతటవాళ్ళే అక్కడ దొంతరగా పేర్చిన ప్లేట్లు ఒక్కొక్కటీ తీసుకుని, ఒక్కొక్క అయిటమూ చూసుకుంటూ వడ్డించుకుని, టేబిల్ దగ్గరికి తెచ్చుకుని కూర్చుని తింటున్నారు. రంజిత ఆశ్చర్యపోయింది. ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు తండ్రి భోజనానికి హోటల్ కి తీసికెడితే, హాయిగా సోఫాల్లో కూర్చుంటే టేబిల్ మీద మొత్తం అన్నీ తెచ్చి వడ్డించేవాడు సర్వర్. అలాంటిది ఇలా ఎవరికి వారే తెచ్చుకోవడమేంటని అడిగింది రణధీర్ ని.
ఏమీతెలీని రంజితకి వివరంగా అన్నీ చెప్పేడు రణధీర్.                       
"చూడు రం..(ముద్దుగా రంజితని అలాగే పిలుస్తాడు రణధీర్..అలా ఒద్దు..ఆ పేరు నాకు నచ్చదన్నా అలా పిలుస్తేనే నాకు బాగుంటుంది అంటాడు..అంతేకాదు..రంజితకి కూడా తన పేరుని ఆమె కిష్టమైనట్టు పిల్చుకునే స్వాతంత్ర్యం కూడా ఇచ్చేసేడు. కాని ఏవిటో..ఇంకా రం అతనిని ఏవండీ..అనే పిలుస్తోంది). దీన్ని బఫే అంటారు. మీ ఊళ్ళో హోటల్ లో లాగ ఇక్కడ అన్నీ పట్టుకొచ్చి వడ్డించెయ్యరు. అక్కడ వాళ్ళు ఏం వడ్డిస్తే అదే తినాలి.  అందరికీ అన్నీ ఇష్టముండవు కదా..అక్కడ కన్న ఇక్కడ అయిటమ్సూ ఎక్కువుంటాయి. ఎవరికేది కావలిస్తే వాళ్ళు అది ఎన్నిసార్లైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. అందుకని ఇష్టమైనవే తినే ఛాన్సు ఇక్కడే ఎక్కువన్న మాట.”
రణధీర్ చెప్పింది శ్రధ్ధగా వింది రంజిత.
భోజనమయ్యేక కాఫీ అడిగితే ఒక ట్రేలో కెటిల్ లో డికాషన్, విడిగా పాలు, పంచదార, ఖాళీకప్పులూ తెచ్చేడు. రణధీర్ మళ్ళీ క్లాస్ తీసుకున్నాడు.
"చూసేవా.. కొంతమంది డికాషన్ ఎక్కువ వేసుకుంటారు. కొంతమంది పాలు ఎక్కువేసుకుంటారు. వాళ్ళిష్టమొచ్చినట్టు వాళ్ళు కలిపేసింది మనం తాగక్కర్లేకుండా మన టేస్ట్ కి కావలసినట్టు తాగొచ్చన్నమాట."
    అంతేకాకుండా సెల్ఫ్ సర్వీస్ అంటే ఏవిటో చాలా వివరంగా చెప్పేడు. బైటకెళ్ళినప్పుడు స్లాట్ లో డబ్బు ఎలా వేసి, కూపన్ తీసుకోవాలో, ఆ కూపన్ తో కాఫీ మెషిన్ నుంచి కాఫీ, టీ ఎలా తీసుకోవాలో దగ్గరుండి చూపించేడు. తను స్వయంగా దగ్గరుండి గుడికి వెళ్ళినప్పుడు అర్చన కోసం కూపన్ ని రంజిత చేతే తీయించేడు. మురిసిపోయింది రంజిత.
అంతే కాదు..రంజితకి ఇంకా చాలా నేర్పేడతను. ముఖ్యంగా కంప్యూటర్ ఎలా వాడాలో నేర్పించేడు. ఆన్ లైన్ లో ఫోన్ బిల్లులూ, పవర్ బిల్లులూ ఎలా కట్టాలో చెప్పేడు. ట్రైన్ టికెట్లూ, బస్ టికెట్లూ ఎలా కొనాలో చూపించేడు. ఆఖరికి సినిమా టికెట్లు కూడా కంప్యూటర్ లో కొనడం మరీ నచ్చేసింది రంజితకి.
ఎంతో చురుకైన రంజిత అన్నీ అట్టే నేర్చేసుకుంది.
 అంతేకాదు తనెంత తెలివైనదో రణధీర్ కి తెలియడం కోసం ఒకరోజు ఆన్ లైన్ లో చీరలు కొంటోంది. ఇంకోరోజు సినిమా టిక్కెట్లు కొంటోంది. రెండు మూడు సోషల్ నెట్ వర్కుల్లో అక్కౌంట్లు పెట్టేసుకుంది.  రణధీర్ స్నేహితులందరితో ఎంతో చనువుగా ఆన్ లైన్ లో చాటింగ్ చెసేస్తోంది.
రం తెలివితేటలకి ముగ్ధుడైపోయేడు రణధీర్. అందిస్తే అల్లుకుపోయే ఆమె చాకచక్యం చూసి ఆమెని భార్యగా ఎన్నుకున్నందుకు తన తెలివితేటలకి తనకి తనే అభినందించేసుకున్నాడు.
  ఆ రోజు రణధీర్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేటప్పటికి కంప్యూటర్ ముందు కూర్చుని సీరియస్ గా ఆన్ లైన్ షాపింగ్ చేసేస్తోంది రంజిత.
"రం..ఆకలేస్తోంది. భోంచేద్దారా.." ప్రేమగా పిలిచేడు.
"ఓహ్..రణ్..నేను తినేసేను. నీకు ఆమ్లెట్ వేడిగా ఉండాలి కదా. ఫ్రిజ్ లో ఎగ్స్ ఉన్నాయి.. వేడిగా వేసేసుకో. ఉడికిన పప్పు ఫ్రిజ్ లో కప్పులో అట్టిపెట్టేను. కాస్త చింతపండు పులుసు కలుపుకుని నీకు కావల్సినట్టు పోపు ఎక్కువగా వేసుకో.. నీకు జీలకర్ర బాగా వేగితే ఇష్టం కదా.. అలా చేసేసుకో. నాకు అది నచ్చదు. అందుకే తినలేదు. నీకు సెల్ఫ్ సర్వీస్ ఇష్టం కదా. తొందరగా తినేసి రా.. ఇక్కడ నీ ఫ్రెండ్ చైతూ చాటింగ్ లోఉన్నాడు.."
రం మాటలకి రణధీర్ వంటింటికీ డైనింగ్ టేబిల్ కీ మధ్య నిశ్చేష్ఠుడై నిలబడిపోయేడు.

-------------------------------------------------------------------------------------

చిత్రం--గూగులమ్మ సౌజన్యంతో...


                                                                                      

Monday, March 18, 2013

మా మహిళామండలి మహిళా దినోత్సవం కబుర్లు.. (కాస్త ఆలస్యంగా,,,)






   మా లలితా మహిళామండలి సభ్యులం అందరం కలిసి మార్చి9న మహిళాదినోత్సవం జరుపుకున్నాం. ఈ సారి అందరం రాజ్యలక్ష్మిగారింట్లో కలిసాం. ఈవిడే రాజ్యలక్ష్మిగారు. ఎంత బిందాస్ గా ఉన్నారో చూసేరా.. ఆవిడెప్పుడూ అంతే. పేద్ద సమస్యతో ఆవిడ దగ్గరి కెడితే అంతా దూదిపింజెలా తేల్చేసి, మనసుకి హాయి నందిస్తారు.

ఇరిగో..వీరందరూ లలితా మహిళామండలి సభ్యులే...













ఈ బుజ్జిగాడే ఆరోజు అక్కడ అందరికి ముద్దుల మనవడు...





కాసేపు అందరం మహిళల్లో ఉన్న గొప్ప గుణాల గురించి మాట్లాడుకున్నాం.
తెలుగుభాషలో మాకు ఎంతవరకు పాండిత్యముందో  తెలుసుకుందుకు రాజ్యలక్ష్మిగారు మాకందరికి తెలుగులో ఒక పరీక్ష పెట్టేరు. అందరం ఒకరికొకరం చెప్పెసుకుంటూ, కాపీలు కొట్టేసుకుంటూ సరదాగా ఆ పరీక్ష రాసేసాం.
అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చినవారికి రాజ్యలక్ష్మిగారు ఎంచక్కా బహుమతులు కూడా ఇచ్చేరు. 

తర్వాత అన్నింటికంటే ముఖ్యమైనపని.. అదేనండి..భోజనం..
 అందరం తలొక రకం తెచ్చుకుని ఎంచక్కా భోంచేసాం.
ఏవేం తెచ్చుకున్నామంటారా..
ఇవిగో...






ఇవన్నీ మీకు చూపించడానికి కొన్ని ఫోటోలు అందించిన గాయత్రిగారు వీరే...



  అలాగ మా మహిళా దినోత్సవం సందర్భం గా ఆరోజంతా సరదాగా గడిపి సాయంత్రానికి ఇళ్ళకు చేరాం..

---------------------------------------------------------------------------------------

Friday, February 1, 2013

యస్..నో... ఆల్ రైట్...



        మన భాష కాక మరో భాష మాట్లాడినప్పుడు వాటి అర్ధాలు తెలీకపోతే జరిగేదేమిటో పక్కరాష్ట్రాలు వెళ్ళి ఇబ్బందులు యెదుర్కున్న వారందరికీ తెలిసే వుంటుంది.
మా చిన్నప్పుడు చాలామటుకు హైస్కూల్ చదువయ్యేవరకూ తెలుగులోనే చదువుకునేవాళ్ళం. కాలేజీకి వెళ్ళేకే ఇంగ్లీష్ మీడియమ్ లో చదువు చెప్పేవారు. అలాంటప్పుడు ఎవరైనా ఇంగ్లీష్ లో మాట్లాడితే గొప్పగా చెప్పుకునేవారు. ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళు సర్వఙ్ఞులనే అపోహతో వుండేవారు. తెలిసీ తెలీకుండా అలా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి కొంతమంది ప్రయత్నించేవారు. అలా మాట్లాడితే జరిగేదేమిటో చెప్పేదే ఈ యెస్..నో..ఆల్ రైట్ అనే నాటకం. ఆ రోజుల్లో చాలా స్కూళ్ళలో స్టూడెంట్స్ ఈ నాటకం వేసేవారు. ఈమధ్య మా చెల్లెలు వాళ్ల స్కూల్ లో వేయిస్తాను..రాసిమ్మంటే మళ్ళీ కొంచెం కొంచెం గుర్తు చేసుకుంటూ రాసాను. కొన్ని డైలాగులు మర్చిపోయి స్వంత కవిత్వం పెట్టేసాను. ఇది అప్పుడు హైస్కూల్ లో వేసినవాళ్ళెవరైనా వుంటే ఏమీ అనుకోకండేం. సరదాగా నవ్వుకుందుకే ఇది. ఇక మొదలెట్టండి మరి...


యస్..నో... ఆల్ రైట్...

   అదొక రెస్టారెంట్. ప్రొప్రైటర్ ధనంజయ్ అగరొత్తులు వెలిగించి, దేవుని పటానికి చూపించి, దండం పెట్టుకుని కాష్ కౌంటర్ లో కూర్చుంటాడు. పక్కన రేడియో లోంచి సినిమా పాటలు మంద్ర స్థాయిలో వినిపిస్తుంటే బాగుంటుంది. కస్టమర్లు ఒక్కొక్కరూ నెమ్మదిగా రావడం మొదలౌతుంది. గిరీశం అనే ఒక నడివయసాయన లాల్చీ పైజమా వేసుకుని, భుజానికి సంచీ లాంటిది తగిలించుకుని వచ్చి, ఒక టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ తింటుంటాడు. కాసేపటికి  ఇద్దరు ఆడవాళ్ళు వస్తారు.
సరోజ--ఏంటి వనజా.. మొన్న మీ నాన్నగారు వచ్చారుట...?
వనజ--యస్..యస్..                        
సరోజ--కొంపదీసి పెళ్ళి చేసుకుందుకు ఒప్పేసుకున్నావా యేంటి..?
వనజ--నో.. నో...
సరోజ--ఓహ్.. అయితే ఇవ్వాళ మనం యెంజాయ్ చెయ్యాల్సిందే.. మాట్నీకి పోదామా..?
వనజ--ఆల్ రైట్..
ఇద్దరూ బైటకి వెళ్ళిపోతారు.
ఇంగ్లీషు రాని ధనంజయ్ వాళ్ల మాటలని కళ్ళింతంత చేసుకుని, నోరు వెళ్ళబెట్టుకుని వింటుంటాడు. అక్కడే టేబిల్ దగ్గర కూర్చుని టిఫిన్ తింటున్న గిరీశం ఇది గమనిస్తాడు. బిల్లు చెల్లించడానికి కౌంటర్ దగ్గర కొచ్చి ఇలా అంటాడు.
గిరీశం--యేవిటోయ్.. ఆ అమ్మాయిల్ని అదే పనిగా చూస్తున్నావ్.. యేవిటి విశేషం..?
ధనంజయ్--ఛ..ఛ..అబ్బే.. తప్పుగా అనుకోకండీ. వాళ్ళిద్దరూ ఆడపిల్లలైనా ఇంగ్లీషులో యెంత బాగా మాట్లాడుకున్నారండీ..! మా ఊళ్ళో ఇంగ్లీషు వచ్చినవాళ్ళే లేరు. ఇక్కడ ఆడపిల్లలు కూడా అలా గలగలా ఇంగ్లీషులో మాట్లాడేస్తుంటే అలా చూస్తున్నానండి.
గిరీశం-- అందులో గొప్పేవుందోయ్. నీకు ఇంగ్లీషు కావాలంటే నేను నేర్పించనూ..నువ్వు ఇంగ్లీషులో మాట్లాడేసేవనుకో.. నీ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది.
ధనంజయ్--అంతేనంటారాండీ..అయితే బాబ్బాబూ ..కాస్త నేర్పిద్దురూ..పది కాలాలపాటు మీ పేరు చెప్పుకుంటాను.
గిరీశం--నేర్పడానికేం భాగ్యం... అలాగే నేర్పిస్తాను. కాని ఇంగ్లీషు నేర్చుకోవాలంటే బోల్డు ఖర్చవుతుంది మరి.
ధనంజయ్--యెంతవుతుందేంటండి?
గిరీశం--మొత్తం నేర్చుకుందుకు చాలా అవుతుందనుకో. కాని నీకంతా అఖ్ఖర్లేదు. "యెస్..నొ..ఆల్ రైట్.." అనే ముచ్చటగా మూడు ముక్కలు చాలు.
ధనంజయ్--(ఆతృతగా)--ఆ..ఆ..అవే మాట్లాడుకున్నారండీ ఆ అమ్మాయిలూ.. ఆ మూడుముక్కలూ నేర్పండి చాలు.
గిరీశం--మరికనేం--ఒక్కో మాటకీ వెయ్యిరూపాయల చొప్పున మూడుమాటలకీ మూడువేలంతే..(చాలా తేలికగా చెప్పాలి)
ధనంజయ్--అయ్యబాబోయ్.. మూడు వేలే..
గిరీశం--మరీ.. ఇంగ్లీషంటే ఆషామాషీ భాషనుకున్నావా? బోల్డు ఖర్చౌతుంది.
ధనంజయ్--తప్పదు కదండీ మరీ.. అలాగే చెప్పండి.
గిరీశం ధనంజయ్ ని కూర్చోబెట్టుకుని "యస్..నొ...ఆల్ రైట్." అనే మూడు పదాలూ ఒకటికి పది సార్లు చెప్పిస్తాడు. కాని వాటి అర్ధాలు మాత్రం చెప్పడు.
కాసేపయ్యాక..
   ముందులాగే కస్టమర్లు వచ్చి టిఫిన్లు తిని వెడుతుంటారు. ధనంజయ్ మహా ఆనందంగా కాష్ కౌంటర్ లో డబ్బులు వసూలు చేసుకుంటుంటాడు.
ఒక కస్టమర్ కుర్చీలో బేగ్ మర్చిపోయి వెళ్ళిపోతాడు. అది గమనించిన మరో కస్టమర్ ఆ బేగ్ తీసేసుకుని చల్లగా జారుకుంటాడు. ఇదేమీ గమనించని ధనంజయ్ తన పనిలో మునిగిపోయుంటాడు. బేగ్ మర్చిపోయి వెళ్ళిన కస్టమర్ హడావిడిగా మళ్ళి వచ్చి తను కూర్చున్న కుర్చీ దగ్గరకెళ్ళి చూసుకుంటాడు. బేగ్ కనపడదు. అటూ ఇటూ చూస్తూ ధనంజయ్ దగ్గరికొస్తాడు.
కస్టమర్ (ఖంగారుగా)- ఇక్కడ..బేగ్ మర్చిపోయాను. చూసేరా..?
ధనంజయ్ తనలో తాను-ఓహో.. బలే అవకాశం వచ్చిందే ఇంగ్లీషులో మాట్లాడ్డానికి. దెబ్బకి పెద్ద మనిషి డంగైపోవాలి అనుకుంటూ..
పైకి దర్పంగా--"యేస్.."అంటాడు.
కస్టమర్- హమ్మయ్యా.. రక్షించేరు. ఇచ్చెయ్యండి.
ధనంజయ్- నో..
కస్టమర్-ఏవిటీ.. ఇవ్వరా.. అయితే పోలీసుల్ని పిలవమంటారా..
ధనంజయ్- ఆల్ రైట్..
కస్టమర్ తెల్లబోయి మళ్ళీ అడుగుతాడు.
కస్టమర్- మిమ్మల్నే..ఇక్కడ బేగ్ మర్చిపోయేను. తీసేరా..
ధనంజయ్- యేస్..
కస్టమర్- అయితే ఇవ్వండీ..
ధనంజయ్- నో
కస్టమర్- పోలీసుల్ని పిలుస్తానంతే..
ధనంజయ్- ఆల్ రైట్..
కస్టమర్ హడావిడిగా స్క్రీన్ లోకి వెళ్ళిపోయి, ఓ నిమిషంలో ఇద్దరు కానిస్టేబుల్స్ తో వస్తాడు. ఈ లోపల ధనంజయ్ తను ఇంగ్లీష్ లో మాట్లాడేసినందుకు సంబరపడిపోతూ వుంటాడు.
పోలీసులు ధనంజయ్ ని అడుగుతారు.
పోలీస్- ఏవయ్యా, ఇక్కడ ఇతని బేగ్ మర్చిపోయేడుట. నువ్వుగాను తీసేవా?
ధనంజయ్(గొప్పగా)- యేస్
పోలీస్- అయితే అతని బేగ్ అతనికిచ్చేయ్యి.
ధనంజయ్ ( ఇంకా గొప్పగా మెడ పైకెత్తి)- న్నో
పోలీస్- అయితే నడు పోలీస్ స్టేషన్ కి
ధనంజయ్(భుజాలెగరేస్తూ)- ఆల్ రైట్
అంతే పోలీసు లిద్దరూ ధనంజయ్ చెరో రెక్కా పట్టుకుని నడిపించుకు తీసికెడుతుంటారు. అదేమిటో అర్ధంకాని ధనంజయ్ ఏదో తప్పు జరిగిందని మటుకు గ్రహించుకుని పోలీసులతో పాటు నడుస్తూ ఇలా అనుకుంటుంటాడు.
ధనంజయ్- యెస్ నో ఆల్ రైట్ ఎంత పనీ చేసావే
        మూడు వేలుచ్చుకుని ముప్పు తెచ్చుకున్నానే
        కాఫీ హోటలు పెట్టీ కొంప తీసుకున్నానే
        యెస్ నో ఆల్ రైట్ ఎంత పనీ చేసావే
అని తనలో తను పాడుకుంటున్న ధనంజయ్ ని చూసి పోలీస్ అడుగుతాడు.
పోలీస్- యెస్, నో, ఆల్ రైట్ లు తప్పు చెయ్యడమేంటయ్యా.. అసలు నువ్వేవంటున్నావ్?
ధనంజయ్- బాబూ..పోలీస్ బాబూ. మీకు జరిగిందంతా చెప్తా వినండి. ఎవరో ఇద్దరమ్మాయిలు ఇంగ్లీషులో మాట్లాడుకుంటుంటే నాక్కూడా అలా ఇంగ్లీషులో మాట్లాడాలనిపించి మా హోటల్ కొచ్చిన ఒకాయన దగ్గర మాటకి వెయ్యి చొప్పున  మూడు వేలిచ్చిఈ మూడు మాటలూ నేర్చుకున్నానండి. మీరంతా పెద్ద మనుషులు కదా.. ఇంగ్లీషులో మాట్లాడితే గొప్పగా వుంటుందనుకుని ఆ ముక్కునెట్టుకున్న మూడుముక్కలూ కక్కేసేనండి. దానికి మీరు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసికెడుతుంటే అవి ఎందుకు నేర్చుకున్నానా అని అలా పాడుకుంటున్నానండి. అంతేనండి.
పోలీస్ (ఆశ్చర్యంగా)- అంటే నీకు ఆ మాటలకి అర్ధాలు తెలీవా?
ధనంజయ్- తెలీదండి.
పోలీస్ (నవ్వుతూ) హోరి నీ యిల్లు బంగారంగానూ. మేం నువ్వు అతని బేగ్ మర్చిపోయేడుట చూసేవా అని అడిగేం నువ్వు యెస్ అన్నావు అంటే మేం అన్నదానికి ఒప్పుకున్నట్టన్న మాట.
ధనంజయ్(ఖంగారుగా)- అయ్ బాబోయ్. నేను చూడ్లేదండి.
పోలీస్-అదేమరి. మరి మే తర్వాత చూస్తే ఇచ్చెయ్యి అన్నాం కదా. అప్పుడు నువ్వు నో అన్నావు. అంటే మేం చెప్పింది నువ్వు ఒప్పుకోలేదన్నమాట.
ధనంజయ్(తెల్లబోతూ)- అలాగాండీ.
పోలీస్- ఒప్పుకోకపోతే నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసికెడతామంటే నువ్వేమన్నావ్?
ధనంజయ్- ఆల్ రైట్ అన్నానండి.
పోలీస్- అంటే అలాగే తీసికెళ్ళండీ అని ఒప్పుకున్నట్టన్న మాట. అందుకే నిన్నిప్పుడు మేం పోలీస్ స్టేషన్ కి తీసికెడుతున్నాం.
ధనంజయ్- (దండాలు పెట్టేస్తూ) బాబూ.. పోలీస్ బాబూ.. నాకు నిజంగా అలా అన్నానని తెలీదు. ఆయన బేగ్ ని నేను చూడను కూడా చూడలేదు. అసలు ఆ మాటలకి ఆ అర్ధాలని ఆ పెద్దాయన నాకు చెప్పలేదు.
పోలీస్ (ఆశ్చర్యంగా)- అంటే నీకు ఆ మాటలకి అర్ధాలు తెలీవా?
ధనంజయ్- అవును బాబూ.. నాకు ఈ మాటలు చెప్పిన పెద్దాయన వాటి అర్ధాలు చెప్పలేదు. అందుకనే నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలీలేదు. ఈ మాటల వల్ల ఇంత అపాయం వుంటుందని తెలిస్తే ఎందుకు మాట్లాడతానండీ. (దీనంగా)దయచేసి నన్ను పోలీస్ స్టేషన్ కి తీసికెళ్ళకండీ.
పోలీస్ -హోరినీ.. అర్ధాలు తెలీకుండా మాట్లాడి ఎంత అపాయం తెచ్చుకున్నావయ్యా.. ఇంకెప్పుడూ ఇలాంటి అర్ధం పర్ధం లేని పన్లు చెయ్యకు. వెళ్ళి హాయిగా వ్యాపారం చేసుకో.
అంటూ పోలీసు లిద్దరూ ధనంజయ్ ని వదిలిపెట్టేస్తారు. ధనంజయ్
యెస్ నో ఆల్ రైట్ ఎంత పనీ చేసావేమూడు వేలుచ్చుకుని ముప్పు తెచ్చుకున్నానేకాఫీ హోటలు పెట్టీ కొంప తీసుకున్నానే..
యెస్ నో ఆల్ రైట్ ఎంత పనీ చేసావే
అంటూ గొణుక్కుంటూ వెళ్ళిపోతాడు.

---------------------------------------------------------------------------------------