Pages

Friday, October 16, 2015

దసరా సంబరాలు..

   దసరా నవరాత్రులంటే మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. అమ్మవారికి ఒక్కొక్కరోజు ఒక్కొక్కపేరుతో రోజుకొక్క రీతిగా అలంకరణ, పూజ, నైవేద్యాలు చెయ్యడం మనందరికీ తెలిసిందే. బొమ్మలకొలువులు, తెలంగాణాలో అయితే బతుకమ్మలు మనలో వున్న సృజనాత్మతని వెలికితీస్తాయి.
   చిన్నప్పుడయితే మా అమ్మగారు పూజ అయ్యాక కీర్తన పాడనిదే పూజ పూర్తయినట్టు కాదనేవారు. ఆ పూజాక్రమంలో “గీతం సమర్పయామి”, “నృత్యం సమర్పయామి.” అని వుంటుంది కనక గీతం పాడితేకాని  ఊరుకునేవారు కాదు. అలాగ అమ్మవారి పూజ అయ్యాక మంచి కీర్తనలు, చక్కటి నృత్యం చూసే భాగ్యం కలిగిందివాళ నాకు. మాకు తెలిసినవారమ్మాయి యామిని డాన్స్ వుందంటే మహిళాసభకి వెళ్ళాను.  వెళ్ళినందుకు మనసు నిండుగా అక్కడ సంగీత, నృత్యవిశేషాలను చూసి వచ్చాను.

  ఆంధ్ర మహిళాసభలో వున్న కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవాళ సరస్వతీపూజ కనులపండుగగా చేసారు.  సరస్వతీదేవీ, బొమ్మలకొలువు, బతుకమ్మలు అన్నీ ఎంత అందంగా అమర్చారో. చూడడానికి రెండుకళ్ళూ చాలలేదు. ఇదిగో మీరూ చూడండి. 







  
  బతుకమ్మలను చూసారా.. ఎంత అందంగా పేర్చారో..
 పూజ, హారతి అయ్యాక సంగీత కళాశాల విద్యార్ధినులు కీర్తనలు పాడారు. అధ్యాపకులు దగ్గరవుండి తాళం వేస్తుంటే ఎంతో శ్రధ్ధగా పాడిన ఆ కీర్తనలు ఆహూతులని ఎంతో ఆనందపరిచాయి.









   తర్వాత  పద్మశ్రీ శోభానాయుడుగారి శిష్యురాలు, ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు అవార్డులు, రివార్డులు అందుకున్న కుమారియామిని కల్లూరి నృత్యం మొదలైంది. “కంజదళాయతాక్షీ..కామాక్షీ..” అన్న కీర్తనను ఎంతో భావ,తాళయుక్తంగా అభినయించి ప్రేక్షకులని సమ్మోహితులని చేసింది యామిని. తపస్సు చేసుకుంటున్న శివునికై పార్వతి చేసిన తపస్సు, వారిని కలిపే ఉద్దేశ్యంతో మన్మథుడు శివునిపై పూలబాణం వదలడం, ఆగ్రహించిన శివుడు మన్మథుని  మసిచేయడం, తర్వాత శాంతించిన శివుడు మన్మథుని క్షమించడం వంటి దృశ్యాలన్నీ ప్రేక్షకుల కనులముందు సాక్షాత్కరింపజేసింది. 





  మళ్ళీ సంగీత కళాశాల విద్యార్ధినులతో గీతాలాపన కొనసాగింది. 

  ఎంతో ఆనందంగా పూజ, సంగీతకచేరీ, నృత్యం చూడడానికి వచ్చినవారందరికీ అమ్మవారి ప్రసాదాన్నిచ్చి, ఆప్యాయతతో సాగనంపారు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ రమాప్రభగారు. 

ఇరిగో వీరే ఆ ప్రిన్సిపల్ రమాదేవిగారు యామినిని అభినందిస్తూ..



    అలాగ సంగీత కళాశాలవారి సరస్వతీపూజకు వెళ్ళడం వలన నవరాత్రులలో ఇవాళ ఇంత ఆనందంగా దేవిని సేవించుకోవడం నా అదృష్టంగా అనిపించింది. 
----------------------------------------------------------------------------------------

Tuesday, May 12, 2015

చెర్రీబ్లూజమ్స్..



చెర్రీబ్లూజమ్స్..


    ప్రకృతి యెంత అందమైనది. ఆ ప్రకృతిలోని ప్రతి అణువూ భగవంతుని చరణాలను చేరాలని యెంత తాపత్రయపడుతుందీ..







   ఈ సుకుమార సుమాల పేరు చెర్రీ బ్లూజమ్స్ ట. పేరులోనే యెంతటి సౌకుమార్యం!  యే భాషయితేనేం, యే పేరయితేనేం వీటి తీరు వింటే మనసు ముద్దమందారమవుతుంది.

   యేడాదికి ఒక్కసారి, అదికూడా కేవలం రెండువారాలు మాత్రమే పూస్తాయిట ఈ పూలు. యేడాదిమొత్తం సౌందర్యారాధకులు ఈ రెండువారాలకోసం వేచి చూస్తుంటారుట. పార్కుల్లో బారులు తీరి నిలుచుని ఈ సుమసోయగాన్ని చూసి పరవశించిపోతారుట.
  అటువంటి విరులను వీక్షించే భాగ్యం నాకు మా అమ్మాయివాళ్ళింట్లో దక్కింది. వాళ్ళింటి వెనకాల డెక్ కి ఆనించి వేయించింది వీటిని మా అమ్మాయి.





   నేను ఇక్కడికి వచ్చేటప్పటికి చెట్టు నిండుగా ఆకు కనిపించకుండా పూలు. లేతగులాబీరంగులో, ముట్టుకుంటే ముడుచుకుపోయేట్టుండే ఉలిపిరికాగితమంత పల్చని రేకులతో, ముద్దగా, ముగ్ధమనోహరంగా, తలవంచి భూమాతను ప్రణమిల్లుతున్నంత వినయంగా తలవంచి ఊగుతున్న ఈ పూలగుత్తులను చూస్తుంటే భావాన్ని ప్రకటించే భాషరాక మనసు మూగపోయింది.
 
 





    యిన్నినాళ్ల యెదురుచూపులు యిందుకోసమే అన్నట్లు రెండువారాలు కాగానే రేకులు భూమాతను తాకడం మొదలవుతుంది. పూలజల్లు కురిసినట్లు పల్చటి, సున్నితమైన రేకులు, చిరుగాలి తాకిడికే అల్లనల్లన కదిలి మెల్లగా జాలువారుతుంటే ధరణికి ప్రణమిల్లుతున్న వనదేవతయేమో అనిపిస్తుంది.
 
 
 
 
 ఒక్క జన్మచాలదా ఆ భగవంతుని ధ్యానించుటకు
ఒక్క గడియ చాలదా ఆ దేవుని పాదాలచెంత మన మనసును అర్పించుకుందుకు
ఒక్క క్షణం చాలదా ఆ దేవదేవుని మ్రోల వాలడానికి ఈ విరుల బ్రతుకుకు
అంతకన్న ధన్యమైన జన్మ మరి వుండదు కాక వుండదు కదా.
 
------------------------------------------------------------------------------------
 

 

 

Tuesday, May 5, 2015

ఆవకాయదె యెపుడు అగ్రపూజ...



    మాలికపత్రిక సంపాదకురాలు జ్యోతివలబోజు స్వదస్తూరీతో అందరినీ ఆవకాయ గురించి వ్రాయమన్నారు. అసలే మే నెల. కొత్తఊరగాయలకాలం. ఆవకాయ పెట్టడం వచ్చినవాళ్ళూ, రానివాళ్ళూ, దానిని ఆస్వాదించేవాళ్ళూ, దాని పేరు చెప్పుకుని మురిసిపొయేవాళ్ళూ, కొత్తావకాయ అందని దూరదేశాల్లో వున్నవాళ్ళూ అందరూ స్పందించి ఆవకాయ గురించి వారి వారి అభిప్రాయాలు వెల్లడించారు. అందులొ నేనూ వున్నాను. నా దస్తూరీతో వచ్చిన ఈ కవిత మాలిక మే నెల పత్రికలో వచ్చింది. ఆ దస్తూరీ యెవరికైనా అర్ధమవకపోతే విడిగా చదువుకుంటారని నా బ్లాగ్ లో టైప్ చేసి కూడా పెడుతున్నాను. అందరూ ఆస్వాదిస్తారు కదూ..









 
 
 ఆవకాయదె యెపుడు అగ్రపూజ…

                  

రంగు చూడంగనే లాలాజలాలూరు

రుచులు చెప్పగమరి బ్రహ్మ దిగునె

యేటుచూసి యెటువిన్న దాని నామమె గదా

ఆవకాయదె యెపుడు అగ్రపూజ//

 

నూపప్పునూనెతొ చద్దన్నం కలిపినా

కమ్మనీ నెయ్యేసి వేడన్నం కలిపినా

జఠరాగ్నిలో వేడి అంతెత్తు లేవదే

ఆవకాయదె యెపుడు అగ్రపూజ//

 

మెంతి, మాగాయలు తమ్ముళ్ళుకాగా

గోంగూర, చింతలు పక్కోళ్ళు కాదే

ఉసిరికాయెప్పుడూ యెక్కడో వుండదే

ఆవకాయదె యెపుడు అగ్రపూజ//

 

శాకపాకంబులు యెన్నెన్నివున్నా

పిండివంటలు పది తెచ్చి వడ్డించినా

ఆవకాయయె లేని అదియేమి విందయా

ఆవకాయదె యెపుడు అగ్రపూజ//

 

అతిథులొచ్చినపుడు అందుబాటుగనుండు

కూరలేనపుడు అదియె చేదోడు యగును

పప్పులో కలిపితే చెప్పలేరా రుచిని

ఆవకాయదె యెపుడు అగ్రపూజ//

 

ఐపాడ్లు, ఐఫోన్ల దిగుమతులకన్న

ఇటునుంచి పంపించు ఈకాయ మిన్న

పెరిగె పచ్చళ్ల ప్యాకింగు ప్రతివీధిలోన

ఆవకాయదె యెపుడు అగ్రపూజ//

--------------------------------------------------------------------------------

మాలిక పత్రిక సౌజన్యంతో..