దసరా సంబరాలు..
దసరా నవరాత్రులంటే
మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. అమ్మవారికి ఒక్కొక్కరోజు ఒక్కొక్కపేరుతో రోజుకొక్క రీతిగా
అలంకరణ, పూజ, నైవేద్యాలు చెయ్యడం మనందరికీ తెలిసిందే. బొమ్మలకొలువులు, తెలంగాణాలో అయితే
బతుకమ్మలు మనలో వున్న సృజనాత్మతని వెలికితీస్తాయి.
చిన్నప్పుడయితే మా అమ్మగారు పూజ అయ్యాక కీర్తన
పాడనిదే పూజ పూర్తయినట్టు కాదనేవారు. ఆ పూజాక్రమంలో “గీతం సమర్పయామి”, “నృత్యం సమర్పయామి.”
అని వుంటుంది కనక గీతం పాడితేకాని ఊరుకునేవారు
కాదు. అలాగ అమ్మవారి పూజ అయ్యాక మంచి కీర్తనలు, చక్కటి నృత్యం చూసే భాగ్యం కలిగిందివాళ
నాకు. మాకు తెలిసినవారమ్మాయి యామిని డాన్స్ వుందంటే మహిళాసభకి వెళ్ళాను. వెళ్ళినందుకు మనసు నిండుగా అక్కడ సంగీత, నృత్యవిశేషాలను
చూసి వచ్చాను.
ఆంధ్ర మహిళాసభలో
వున్న కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవాళ సరస్వతీపూజ కనులపండుగగా
చేసారు. సరస్వతీదేవీ, బొమ్మలకొలువు, బతుకమ్మలు
అన్నీ ఎంత అందంగా అమర్చారో. చూడడానికి రెండుకళ్ళూ చాలలేదు. ఇదిగో మీరూ చూడండి.
బతుకమ్మలను చూసారా.. ఎంత అందంగా పేర్చారో..
పూజ, హారతి అయ్యాక
సంగీత కళాశాల విద్యార్ధినులు కీర్తనలు పాడారు. అధ్యాపకులు దగ్గరవుండి తాళం వేస్తుంటే
ఎంతో శ్రధ్ధగా పాడిన ఆ కీర్తనలు ఆహూతులని ఎంతో ఆనందపరిచాయి.
తర్వాత పద్మశ్రీ
శోభానాయుడుగారి శిష్యురాలు, ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు అవార్డులు, రివార్డులు అందుకున్న
కుమారియామిని కల్లూరి నృత్యం మొదలైంది. “కంజదళాయతాక్షీ..కామాక్షీ..”
అన్న కీర్తనను ఎంతో భావ,తాళయుక్తంగా అభినయించి ప్రేక్షకులని సమ్మోహితులని చేసింది యామిని.
తపస్సు చేసుకుంటున్న శివునికై పార్వతి చేసిన తపస్సు, వారిని కలిపే ఉద్దేశ్యంతో మన్మథుడు
శివునిపై పూలబాణం వదలడం, ఆగ్రహించిన శివుడు మన్మథుని మసిచేయడం, తర్వాత శాంతించిన శివుడు మన్మథుని క్షమించడం
వంటి దృశ్యాలన్నీ ప్రేక్షకుల కనులముందు సాక్షాత్కరింపజేసింది.
మళ్ళీ సంగీత కళాశాల విద్యార్ధినులతో గీతాలాపన
కొనసాగింది.
ఎంతో ఆనందంగా
పూజ, సంగీతకచేరీ, నృత్యం చూడడానికి వచ్చినవారందరికీ అమ్మవారి ప్రసాదాన్నిచ్చి, ఆప్యాయతతో
సాగనంపారు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ రమాప్రభగారు.
ఇరిగో వీరే ఆ ప్రిన్సిపల్ రమాదేవిగారు యామినిని అభినందిస్తూ..
అలాగ సంగీత కళాశాలవారి
సరస్వతీపూజకు వెళ్ళడం వలన నవరాత్రులలో ఇవాళ ఇంత ఆనందంగా దేవిని సేవించుకోవడం నా అదృష్టంగా
అనిపించింది.
----------------------------------------------------------------------------------------
0 వ్యాఖ్యలు:
Post a Comment