Pages

Saturday, March 25, 2017

తమలపాకుతో నువ్వొకటిస్తే..



ఫిబ్రవరి/ మార్చి 2017 జాబిలి  సాహితి సామాజిక రాజకీయ మాసపత్రికలో  నేను వ్రాసిన "తమలపాకుతో నువ్వొకటిస్తే.." అనే కథ ప్రచురించబడింది. చదివి మీమీ అభిప్రాయాలు చెపుతారుకదూ!



తమలపాకుతో నువ్వొకటిస్తే
                                                                                                      .
      “ఇంత లావున్నావు తేలుమంత్రం తెలీదా అన్నట్టు యిన్నేళ్ళొచ్చేయి ఆమాత్రం కంప్యూటర్ చూడ్డం తెలీదూ..”
అని రుక్మిణి వెటకారంగా అన్న మాటలకి ఉడుక్కున్నాడు ఆనందరావు.
రెండేళ్ళ పిల్లాడు  బొమ్మలతో ఆడుకున్నట్టు ఆడుకుంటాడు దీనితో..” యింకోమాట కూడా జోడించింది రుక్మిణి అగ్నికి ఆజ్యం పోసినట్టు.
అవునూ.. నాకు తెలీదూ.. ఇంతోటి కంప్యూటరూ రాకపోతే యిప్పుడు నాకొచ్చిన నష్టం యేవీలేదు. యేం..నన్ననే బదులు  నువ్వు నేర్చుకోవచ్చుగా.” మాటకి మాట బదులు చెప్పేనని సంతోషించేడతను. రుక్మిణి పిల్లలతో మాట్లాడలేకపోయినందుకు  విసుక్కుంటూ కంప్యూటర్ ముందునుంచి లేచి  టీవి చూడ్డానికి వెళ్ళిపోయింది. ఆహ్లాదకరంగా గడపవలసిన ఆదివారం ఉదయం ఆనందరావు యింట్లో అలా మొదలైంది.
 ఆనందరావు రిటైరయి అయిదేళ్ళైంది. ఆ రోజుల్లో ఆఫీసుల్లో కంప్యూటర్ ఈరోజుల్లో వాడినంత ఎక్కువగా లేకపోవడం వలన అది నేర్చుకోకుండానే అతను ప్రభుత్వోద్యోగిగా రిటైరయిపోయేడు.  ఇప్పుడు పిల్లలు పరాయిదేశాల్లో స్థిరపడడంతో రుక్మిణికి, ఆనందరావుకీ పిల్లలతో మాట్లాడడానికి కంప్యూటర్ వాడడం తప్పనిసరైంది. మొదట్లో కొన్నాళ్ళు ఫోన్ లో మాట్లాడేవారు. ఆ ఫోన్ చేసినప్పుడు కొన్ని మాట్లాడీ, ఇంకొన్ని మర్చిపోతూ వుండేవారు. యిదంతా చూసిన వాళ్ళబ్బాయి మురళి ఆర్నెల్లక్రితం యిండియా విజిట్ కి వచ్చినప్పుడు ఇంట్లో కంప్యూటర్ కొనిపెట్టి, దానిని యెలా ఉపయోగించాలో తండ్రికి బోధించాడు. మురళి చెప్పినప్పుడుహోస్.. యింతేనా..” అనిపించిన ఆనందరావుకి, తర్వాత స్వయంగా దానిముందు కూర్చుని  యేదైనా మీట నొక్కుదామంటే అన్నీ అనుమానాలే వచ్చేవి. అందులోనూ యివాళ రుక్మిణి పక్కనే కూర్చుని  యేది నొక్కుదామన్నా యేదో బాంబు పేలుతుందన్నట్టుఅదికాదు.. ఇదికాదు..” అంటూ వెనకనుంచి హెచ్చరికలు మొదలుపెట్టడంతో యే మీట నొక్కాలో తెలీక నొక్కిన మీట తప్పుదవడం వలన పిల్లలతో చాటింగ్ చెయ్యడానికే కుదరలేదు. అందుకే రుక్మిణికి అంత విసుగు, నిరాశాను.
 అసలు ఆనందరావు ఇప్పటికి ఆర్నెల్లనుంచి కాస్త ఆ కంప్యూటర్ యెలాగ చూడాలో చెప్పమని మేనల్లుడు రవిని అడుగుతున్నాడు. రవి, అతని భార్య రేణూ కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. వారికి టైమ్ దొరకడమే అపురూపం. అందుకే మావయ్యమాట కాదనలేక వస్తావస్తానంటూ కాలం గడిపేస్తున్నాడే కానీ పాపం రవికి రావడానికే కుదరటంలేదు. రుక్మిణి వెటకారం చూసాక ఇంక యివాళైనా గట్టిగా అడగకపోతే  లాభంలేదని మళ్ళీ ఫోన్ చేసాడు రవికి ఆనందరావు. “ఏరా.. ఇవాళ ఆదివారవే కదా.. వస్తావా.” అంటూ.
   మేనమావా, మేనల్లుళ్ల మధ్య అభిమానాలూ, చనువూ బాగానే వున్నాయి. కానీఇవాళా..” అన్న రవి గొంతు కాస్త నీరసంగా వినిపించింది ఆనందరావుకి. “ఏమైందిరా..” అనడిగాడు ఆతృతగా.. “అబ్బే.. ఏం లేదులే మావయ్యా.. వస్తాను..” అన్నాడు రవి. “అయితే భోజనానికి వచ్చెయ్యండి యిద్దరూ..” అన్న ఆనందరావు మాటలకిఅబ్బే లేదు మావయ్యా.. రేణూ యెవరో ఫ్రెండ్ యింటికి వెళ్ళాలిట. నేను వస్తాలే ఓ గంటలో..” అంటూ ఫోన్ పెట్టేసాడు రవి.
 “యేమన్నాడు రవీ.. వస్తానన్నాడా..?” మనిషి టీవీ ముందు కూర్చున్నా చెవులు యిటువైపే వుంచిన రుక్మిణి మళ్ళీ ఆనందరావు కూర్చున్న గదిలోకి వచ్చి అడిగింది. “..” అన్న ఆనందరావు మాటలకి, “యిద్దరినీ భోజనానికి వచ్చెయ్యమనలేకపోయారా..” అంది సంబరంగా. పదిమందికి ఆనందంగా వండి వడ్డించే రుక్మిణికి గుజ్జనగూళ్ళొండినట్టు తమిద్దరకే వంట చేసుకోవడం అస్సలు నచ్చదుఅందుకే యింటికి యెవరు భోజనానికి వస్తారా అని చూస్తుంటుంది. అందులోనూ రవి, రేణుల జంటంటే మరీ ఇష్టం రుక్మిణికి.
రమ్మన్నాను. కానీ రేణు యెవరో ఫ్రెండ్ యింటికి వెడుతోందిట. రవి వస్తానన్నాడు..” అన్నాడు ఆనందరావు. యివాళ యెలాగైనా రవి దగ్గర ఈ మెయిల్స్ పంపడాలూ, చాటింగ్ చెయ్యడాలూ, స్కైప్ లో పిల్లలను చూస్తూ మాట్లాడడాలూ  క్షుణ్ణంగా నేర్చుకోవాలని కృతనిశ్చయుడైపోయాడతను.  కానీ రేణు రాకుండా రవి ఒక్కడే రావడం రుక్మిణికి నచ్చలేదు. యింకేం మాట్లాడకుండా వెళ్ళిపోయిందావిడ.
  సరిగ్గా పదకొండుగంటలకల్లా రవి తన లాప్ టాప్ బాగ్ తీసుకుని మేనమావ ఆనందరావు యింటికి వచ్చేసేడు. రాగానే అత్తయ్య ఇచ్చిన చిక్కటి కాఫీ తాగి, సిస్టం ముందు కూర్చుని మెయిల్ ఎలా చూడాలో, ఆన్ లైన్ వెళ్ళి ఎలా చాట్ చెయ్యాలో అన్నీ ఆనందరావుకి చూపించాడు.
    ఆన్‍లైన్ లోకి వెళ్ళి పిల్లలతో ఎలా మాట్లాడొచ్చో రవి ఒకటొకటిగా చూపిస్తుంటే ఆనందరావు చిన్న నోట్ బుక్ లో స్టెప్- బై- స్టెప్ రాసుకుంటున్నాడు. అది చూసిన రవి నవ్వుకుంటూఅన్నీ ఇక్కడే కనిపిస్తాయి గదా మామయ్యా, వేరే రాసుకోడం యెందుకూ?” అన్నాడు. ఏవిటి కనిపించేది నామొహం.. స్క్రీన్ మీద బోల్డు ఆప్షన్సు వుంటాయి. అవన్నీ చదివినా తెలియొద్దూ.. దాని బదులు మనకేది కావాలో ముందే రాసి పెట్టుకుంటే దానినే నొక్కొచ్చు. “ అన్న ఆనందరావు మాటలు విని యింకిలా లాభంలేదనుకున్నాడో యేమో ప్రత్యక్ష్యంగా చూపించడానికి ఆన్‍లైన్ లో మనకి కావలసినవాళ్ళుంటే వాళ్ల పేరు దగ్గర ఆకుపచ్చగా చుక్క  కనిపిస్తుందని చెపుతూ వాళ్ళావిడ రేణూ పేరు యెదురుగా కనిపించిన గ్రీన్ డాట్ ని చూపిస్తూ అక్కడ క్లిక్ చేసాడు రవి.
   అలా క్లిక్ చెయ్యగానే ఒక డైలాగ్ బాక్స్ లాంటిది వచ్చింది. అందులో రవి "హి.." అని టైప్ చేసాడు. అటునుంచి కదలిక లేదు. బహుశా  రేణూ చూసుండదా.. అనుకుంటూ మళ్ళీ "మై స్వీటీ.." అని టైప్ చేసాడు. అంతే.. సమాధానం తుపాకీగుండు కన్న వేగంగా వచ్చింది. అది చూసిన రవి మొహం  నల్లగా మాడిపోయింది. మాడిపోయిన  రవి మొహం చూసిన ఆనందరావు అసలు రేణూ యేం రాసిందా అని తొంగి చూసేడు. ఆ బాక్స్ లో ఒక గుండ్రటి సున్నాలో కళ్ళూ, నోరూ కనిపిస్తున్నాయి. కళ్ళు అదేవిటీ అలా పెద్దవీ, చిన్నవీ అవుతున్నట్టూ, కనుబొమలు వక్రంగా పైకి లేచినట్టూ, పెదాలమధ్య పళ్ళు అకస్మాతుగా బైటకొచ్చి పటపటలాడించినట్టూ కనపడుతున్నాయి అనుకుంటూ అదేవిటో అర్ధంకాక రవి మొహం వైపు చూసాడు. నల్లబడిన రవి మొహం తెల్లగా పాలిపోయి కనపడింది. "ఏవిట్రా అది?" ఆతృత ఆపుకోలేకపోయాడు ఆనందరావు.
రవి అదేవిటో వివరించి చెప్పాడు. వాళ్ళావిడిచ్చిన మెసేజ్ లో మొహంలో భావాలు అలా వుంటే వాళ్ళ ఆవిడకి కోపమొచ్చిందని అర్ధమట. "ఎందుకురా కోపం? ఏం చేసావేంటీ?" "ఏమో నాకేం తెలుసూ?" పాపం జాలేసింది ఆనందరావుకి మేనల్లుడి మీద."పొద్దున్న ఇంట్లో ఏం జరిగిందిరా?"  "ఇంట్లో ఏమైనా మాట్లాడుకుంటే పక్కవాళ్ళకి వినపడుతుంది కదా. అందుకే ఇంట్లో ఏవీ మాట్లాడుకోం.""మరి పోట్లాట?"
"మాట్లాటే లేకపోతే మరింక పోట్లాట మాటెక్కడిది?". మేనల్లుడు సమాధానానికి  ఏడిసినట్టుంది అనుకున్నాడు ఆనందరావు. చుట్టూ నలుగురు మనుషులున్నారని భార్యాభర్తలు ఒకరిమీదొకరు కోపగించుకోడం మానేస్తారా.  అసలు భార్య కోపం తెచ్చుకోడంలో ఎంత ఆనందం వుందో ఈ కుర్రకుంకలకేం తెలుసు?  అందులోనూ ఈ రేణూ కోపమొచ్చిందని చెప్పిన పధ్ధతేమీ అస్సలు బాగులేదు. చుట్టుపక్కల ఎంతమందుంటే మటుకేం? కోపమొస్తే వెంటనే కోపగించుకోకుండా చుట్టుపక్కలవాళ్ళ గురించి ఆలోచిస్తారా ఎవరైనా? యేదో కోడ్ పెట్టుకోరూ
  యిదివరకురోజుల్లో చుట్టూ యెంతమందున్నా భార్య మీద కోప్పడ్డానికి మగవాడికి మొగుడిననే  ఆయుధం ఒకటుండేది. ఆ ఆయుధంతో ఆ మొగుడు ఎంతమందిలోనైనా భార్య మీద యెన్ని అరుపులు అరిచినా చెల్లిపోయేది. కానీ పాపం భార్యలకి భర్తమీద కోపం వచ్చినా నలుగురిముందూ యేమనలేకపోయేవారు. అలాగని వూరుకోకుండా ఆరోజుల్లో నలుగురిలోనూ వున్నప్పుడు మొగుడనేవాడు ఏం మట్లాడాలో, ఎలా మాట్లాడాలో చెప్పడానికి ఆడవారికి ఎంచక్కటి పడికట్టు వాక్యాలుండేవి.
 మొగుడనేవాడు ఎంతమందిలో వున్నా సరే, ఆవిడగారు, "ఏవండీ, ఓసారిలా వస్తారా.." అంటే దానర్ధం ఆవిడ భర్తని లోపలికి పిలిచి, ఎవ్వరూ చూడకుండా, అందరికీ వినపడేలా లోపల ప్రయివేటు చెప్పేసి బయటికి పంపేదన్న మాట.
 అదేకనక ఏ పెళ్ళిలోనో పేరంటంలోనో మొగుడు ఏదో కాస్త స్వేఛ్ఛ దొరికింది కదాని పేట్రేగిపోయి మట్లాడేస్తుంటే ఎంతో ముద్దుగా చెపుతుంది..."ఇంటికి రండి. మీ పని చెపుతాను.." అని. అంతే... అంతటి మగధీరుడూ మళ్ళీ యింటి కెళ్ళేదాకా నోరిప్పితే ఒట్టూ.
 అసలు సిసలైన జాణలైన భార్యలు మరోరకం వుంటారు. వాళ్ళు ఎంతమందిలో వున్నాసరే భర్త పక్కనే కూర్చుంటారు. అది మొగుడంటే ప్రేమతో కాదు. పక్కనే కూర్చుంటే అతగాడేమైనా అవాకులూ చవాకులూ పేలుతుంటే ఎవరూ చూడకుండా పక్కనుంచి తొడపాశం పెట్టొచ్చని. కాని అదేం ఖర్మమో.. అలాంటి జాణలకి వట్టి చవటదద్దమ్మలు మొగుళ్ళుగా దొరుకుతారు. "అమ్మా, ఇదెందుకో గిల్లుతోంది చూడవే..." అని అతి రహస్యాన్ని బట్టబయలు చేసేస్తారు.
  ఇలాంటి సొగసైన విషయాలు కేవలం భార్యలకు కోపమొస్తేనే భర్తలకు తెలుస్తాయి. ప్రత్యక్ష్యంగా భార్యతో కలహపడడంలో వున్న ఆనందాన్ని స్వయంగా అనుభవించాలి తప్పితే ఇలా ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్  చూసేసి భార్యకి మొహం చాటెయ్యడం యేమాత్రం మంచిపని కాదని అనందరావు రవికి హితబోధ చేస్తుంటే అ డైలాగ్ బాక్స్ లో రేణు నుంచి యేదో బొమ్మలాంటిది వచ్చింది. అది చూడగానే రవి సంతోషంతో. “హా తెల్సింది మావయ్యా. వాళ్ల ఫ్రెండింటికి వెడుతున్నప్పుడు రేణూ నన్ను షార్ట్ స్  వేసుకోమంది. నాకేమో అవి నచ్చవు. ఆరడుగులుంటానా. అందులోనూ రివటలా సన్నగా కూడా వుంటానాయె. అలా హాఫ్ పాంట్ వేసుకుంటే మోకాళ్లకింద కాళ్ళు అసహ్యంగా సన్నగా పుల్లల్లా కనపడతాయని వేసుకోనన్నాను. అంతే. అందుకే వాళ్ల ఫ్రెండింటికి నన్ను రావొద్దని తనొక్కతే వెడుతోంది.”
 కారణం తెలిసిన ఆనందరావుహారి వెర్రినాగన్నా.” అంటూ పకపకా నవ్వేసాడు. “అయితే యింకేం.. కారణం తెల్సిందిగా..యేదో స్నేహితులముందు నిన్ను మాడర్న్ గా చూపించాలనుకుందేమో. తప్పేవుంది. ఆ నిక్కరే వేసుకుంటానని వొప్పేసుకో.”
మావయ్యా.. నీకు దండం పెడతాను. నిక్కరన్న మాట మాత్రం అనకు. అస్సలు వేసుకోబుధ్ధికాదు. యెంచక్కా రేణూ అన్నట్టు షార్ట్ స్ అను. ప్లీజ్..” యింక వేసుకోక తప్పదని తెలిసాక కనీసం పేరైనా వినబుల్ గా వుండాలని ఆనందరావుని బ్రతిమాలుకున్నాడు.
పోనీ అలాక్కానీ..  హాఫ్ పాంట్ అనే అందాం. యే రాయైతేనేం పళ్ళూడగొట్టుకుందుకు..” అంటూ మేనల్లుణ్ణి హాఫ్ పేంట్ వేసుకుందుకు వొప్పించిన సంతోషంతో  అలుకబూనిన భార్యని బ్రతిమాలుకోవడం అన్నది యెంత పెద్ద కళో శ్రీకృష్ణుని ఉదహరిస్తూ చెప్పాడు. మావయ్య చేసిన జ్ఞానబోధని రవి ముకుళితహస్తుడై విన్నాడు. రవితో పాటు వీళ్లకి మరో డోసు కాఫీ కావాలేమోనని అడగడానికి వచ్చిన రుక్మిణి కూడా వీళ్ళ సంభాషణ మొత్తం వింది. నెమ్మదిగా చప్పుడు చెయ్యకుండా తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపోయింది.
 మేనమావ చెప్పిన పాఠాలు విన్న రవి రేణూని ప్రసన్నం చేసుకునే ఉద్దేశ్యంతో చాట్ బాక్స్ వైపు తిరిగి తెల్లబోయేడు. రేణూ ఆన్ లైన్ నుంచి వెళ్ళిపోయింది. బిక్కమొహం వేసిన రవిని చూసి సంగతి తెలుసుకుని ఫోన్ చెయ్యి.” అన్నాడు ఆనందరావు. వెంటనే రేణూ నంబరు కలిపాడతను. యెంగేజ్డ్ వచ్చింది. మరింక ఆలస్యం చెయ్యకుండాసారీ. అయ్ వేర్ వాట్ యు సెడ్.” అని మెసేజ్ పెట్టేసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడతను.
 తేలికపడిన మనసులతో మావా, అల్లుణ్ణిద్దరూ యాక్షన్ మూవీ పెట్టుకుని టీవీ ముందు సెటిలయిపోయేరు. రుక్మిణి మొబైల్ ఫోన్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళి రేణూకి ఫోన్ చేసి లంచ్ కి రమ్మని చెప్పింది. రేణూకి రుక్మిణీ ఆంటీ అంటే అమ్మలాగ అన్నీ అర్ధమయ్యేలా చెపుతారని చాలా యిష్టం. కానీ యిప్పుడు రవి వాళ్ళింటికే వెళ్ళాడు. తనూ వెడితే చులకనైపోదూ అనుకుంటూసారీ ఆంటీ, నేను మా ఫ్రెండ్ యింటికి వెడుతున్నాను.” అంది. రుక్మిణి వూరుకోలేదు. “రేణూ, నీతో ఓ ముఖ్యవిషయం మాట్లాడాలి.” అంది. “తెలుసాంటీ. రవి అక్కడే వున్నాడు కదా. అంతా నాదే తప్పంటూ నాకు బుధ్ధులు చెపుతారు. “
  “ఊహు.. నీకు బుధ్ధులు చెప్పేంతటివారమా మేము.” అంది రుక్మిణి నవ్వుతూ. “అయినా భార్యాభర్తలన్నాక కూరలో పోపులా పోట్లాటల చిటపటలు  లేకపోతే యెలా. నీకో సంగతి చెప్పనా రేణూ. ఓ పెద్దాయన అంటూండేవారు, దెబ్బలాడుకోని భార్యాభర్తలంటే వాళ్ళు ఒకరితో ఒకరు సహజంగా కలిసి వుండటం లేదూ, యిద్దరి కిద్దరూ నటిస్తున్నారూ..అని..అందుకని యిలా చిన్న చిన్న కలహాలులేని కాపురాలు ఉప్పు లేని పప్పులా వుంటాయి. మీరు దెబ్బలాడుకోడంలో తప్పులేదు కానీ దానినే చివరిదాకా లాగి అవి చిలికి చిలికి గాలివాన కాకుండా మటుకు చూసుకోవాలి.”  “అలాగెందుకవుతుందాంటీ..” “యెందుకవదమ్మా.. ముఖ్యంగా మీరు దెబ్బలాడుకునే విషయం డబ్బుకి సంబంధించినది మటుకు కాకూడదు. డబ్బు మహా పాపిష్టిది. మనుషులను నిర్దాక్షిణ్యంగా విడదీసే మహాశక్తి డబ్బు దగ్గర వుంది. మీ తగాదాలు అంతవరకూ పోకుండా పట్టువిడుపులుండాలి“ “అబ్బె..మా గొడవ డబ్బు గురించి కాదాంటీ..”
  “తెలిసిందమ్మా.. రవి వాళ్ల మావయ్యకి చెపుతుంటే అంతా విన్నాను. యిలాంటి గొడవలతో యిబ్బందిలేదు. కానీ వీటికి కూడా పట్టువిడుపులుండాలి. రవే నీ మాట వినాలి అని నువ్వూ, నువ్వే దిగి రావాలని రవీ అనుకుంటూ యిద్దరూ చెరోవైపూ బయల్దేరారా..లేదా. అదే కూడదంటున్నాను. మీ చిలిపి తగవులకి ఒక టైమ్ లిమిట్ పెట్టుకోండి. అది దాటితే మరింక అతనే దిగిరావాలి అని నువ్వూ, నువ్వే దిగిరావాలి అని రవీ అనుకుంటూ ఈగో లకి పోకుండా యెవరో వొకరు ముందుకొచ్చి మాటలు కలుపుకోండి. యే సంగతైనా సరే విషయం మీ యిద్దరి మధ్యనే వుండాలి. యిప్పుడయితే రవి ఈయనతో చెప్పేడు కనక సరిపోయింది. అదే మరే ఫ్రెండ్ తో నయినా చెప్పుంటే అతను రవిని యింకా రెచ్చగొట్టేలా మాట్లాడొచ్చు కదా. అందుకే అంటున్నాను. రవి యిక్కడే వున్నాడు. నువ్వూ వచ్చెయ్యి. చక్కగా యిద్దరూ భోజనం చేసి వెడుదురుగాని.”
కానీ ఆంటీ.. “ అంటూ నసుగుతున్న రేణూతో  రేణూ, మాకన్న యెక్కువ చదువుకున్నవాళ్ళూ, అంతకన్నా యెక్కువగా సంపాదించుకుంటున్నవాళ్ళూ, ప్రపంచంలో యేమూల యేం జరుగుతోందో క్షణాలమీద అరచేతిలో చూసుకోగలిగేవాళ్ళూ మీరు. తమలపాకుతో నువ్వొకటిస్తే అన్న సామెతలాగా చెయ్యకు.” రేణూ కుతూహలంగా అడిగిందిఅదేం సామెతాంటీ?” రుక్మిణి నవ్వేసింది.  “చాలా పాతసామెతే రేణూ.. తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపుచెక్కతో నేనొకటిస్తా..అనీ భార్యాభర్తలిద్దరూ ఒకరిమీదకి యింకొకరు యుధ్ధానికి సిధ్ధమవడం అన్నమాట..” ఆ సామెత విని హాయిగా నవ్వేసింది రేణూ.
 “అందుకే రేణూ,  యింక నీకు విడమర్చి చెప్పక్కర్లేదనే అనుకుంటున్నాను. నీకు యిష్టమని మామిడికాయపప్పు చేసి, మెంతిబద్దలు వేసేను. రామ్మా. మంచిదానివి కదూ.” అని రుక్మిణి ఆప్యాయంగా పిలిచిన తీరుకి మరింక రేణు రాననలేకపోయింది. “ఈ బుద్దూ అక్కడే వున్నాడా.” అనడిగింది ముందుజాగ్రత్త  పడడానికి. ఫక్కున రాబోయిన నవ్వుని బలవంతంగా ఆపుకుంటూవున్నాడు. రా. నువ్వన్న ఈ మాట వింటే మావాఅల్లుళ్ళిద్దరూ తెగ గింజుకుంటారు.”అంది రుక్మిణి. రేణూ కూడా నవ్వుతూఅలాగే ఆంటీ, అరగంటలో అక్కడుంటానుఅంటూ ఫోన్ పెట్టేసింది.
 వంట పూర్తిచేసి ముందుగదిలోకి వచ్చి సినిమా చూస్తున్న మావా అల్లుళ్లతో రేణూ వస్తోందని చెప్పింది రుక్మిణి. ఒక్కసారి తుళ్ళిపడ్డారిద్దరూ. ఆనందరావు ముందుగా తేరుకునిరుక్మిణీ, మన మురళీ హాఫ్ పేంట్ యింట్లో యెక్కడో వుండాలి చూడూ.” అన్నాడు ఖంగారుగా. “యెందుకు మావయ్యా..”అన్న రవితో, “రేణూ వచ్చేటప్పటికి నువ్వు హాఫ్ పేంట్ తో కనిపిస్తే సంబరపడుతుందిరా. రుక్కూ, నువ్వు కాస్త తొందరగా వెతుకుదూ.” అన్నాడు ఆనందరావు రుక్మిణిని బ్రతిమాలుతూ. “అందుకే అయితే నా దగ్గరే వుంది మావయ్యా. యింట్లో రేణూ యెంత వెతికినా కనపడకుండా వుండడానికి దానిని నా లాప్ టాప్ బేగ్ లో దాచేసేను. అది నా దగ్గరే వుందిప్పుడు.” అన్నాడు వెలిగిపోతున్న మొహంతో రవి.
అయితే యింకేం. దూరిపో దానిలోకి.” అన్న మావయ్య మాటలని అయిదునిమిషాల్లో ఆచరణలో పెట్టేసాడు రవి. హాఫ్ పేంట్ లోకి మారిపోయివచ్చిన రవిని చూసి ఫక్కున రాబోయిన నవ్వుని బలవంతాన ఆపుకుంది రుక్మిణి. యింతలోనే యెంటరయ్యింది రేణూ. ఆనందంగా యెదురెళ్ళాడు రవి హాఫ్ పేంట్ ప్రస్ఫుటంగా కనిపించేలా. అతన్ని అలా చూసిన రేణూ మొహం మందారంలా విచ్చుకుంది. మళ్ళీ అంతలోనే ఆలోచనలో పడింది.
యేమైంది రేణూ అలా వున్నావు.. నువ్వు కోరినట్టే వేసుకున్నాడుగా రవి?” భోజనాలబల్ల దగ్గర అన్నీ సర్దుతూ, తన పక్కన వున్న రేణూని నెమ్మదిగా అడిగింది రుక్మిణి. “అందుకు సంతోషంగానే వుంది ఆంటీ. కానీ రవి అన్నది నిజమే. అంత పొడుగుకాళ్ళు కింద పుల్లల్లా సన్నగా వున్నాయి. పాపం. నా కోసం యెంత యిబ్బంది పడుతున్నాడో.” అంది రేణూ. రేణూ ఆలోచించిన తీరుకి రుక్మిణి పొంగిపోయింది. ఆమెని దగ్గరగా తీసుకుని, “మీరిద్దరూ యిలాగే ఒకరి గురించి మరొకరు ఆలోచించుకోండి చాలు. మీ సంసారం స్వర్గమే..” అంది నిండుమనసుతో.

---------------------------------------------------------------------------------------------------
జాబిలి మాసపత్రిక సౌజన్యంతో.. 

Saturday, November 5, 2016

ఉపాయం వుందిగా..



ఉపాయం వుందిగా..

అచ్చంగా తెలుగు సమూహంలో శ్రీమతి మంథా భానుమతిగారు శ్రీ కట్టుపల్లి ప్రసాద్గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కథలపోటీలో తృతీయ బహుమతి పొందిన నేను వ్రాసిన కథ..
"ఉపాయం వుందిగా.."


సిరికిం జెప్పడు శంఖ చక్రయుగామున్ చేదోయి సంధింపడు...” అంటూ గజేంద్ర మోక్షంలో పోతనగారు చెప్పినట్టు తనను తానూ పూర్తిగా భగవంతుని శరణాగతి కోరిన వాడిని రక్షించటానికి వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు అలాగే పరుగెడుతూ వచ్చేస్తాడు...”
చాగంటి వారి ప్రవచనాలలో లీనమైపోయి వింటున్న పద్మనాభం గారికి, హాల్లోనే మరో మూల కూర్చుని హోమ్ వర్క్ చేసుకుంటున్న మనవాడి శశాంక్ గొంతు టీవీ వాల్యూమ్ ని మించి వినిపించింది.
అబ్బ! తాతయ్యా.... సౌండ్ కాస్త తగ్గిస్తావా? ఇక్కడ నేను డిస్టర్బ్ అవుతున్నాను. ఇంకా బోల్డు హోమ్ వర్క్ ఉంది...” గబుక్కున టీవీ ఆఫ్ చేసేసేరు పద్మనాభం గారు.
బెడ్ రూమ్ లో ఉతికిన బట్టలు మడత పెడుతున్న భార్యని చూసి రాజారావు, “వాడెందుకలా అరుస్తాడు? పెద్దాయన ఫీల్ అవరూ?” అన్నాడు.
పొద్దుటినుంచీ ఏదో ఒక పనిలో అలిసిపోయున్న దమయంతి, “ఆయన పెద్దాయన, వీడు చిన్నవాడు... ఇద్దరిలో ఎవరికీ మటుకు ఏం చెప్పగలం?” అంది.ఇక వాదన పెంచుకుందుకు అది సమయం కాదనుకుంటూ, “రేపు నేను వచ్చేటప్పుడు కరెంట్ బిల్లూ, ఫోన్ బిల్లూ కట్టేస్తాను. నువ్వు వచ్చేటప్పుడు దారే కనుక, అమ్మా నాన్నల మెడికల్ రిపోర్ట్స్ తీసుకొస్తావా?” అనడిగాడు.“అలాగే, అన్నట్టు మీరు వచ్చే దారిలోనే కదా జనరిక్ మందుల షాపులున్నాయి... నాకు కొంచెం పెయిన్ కిల్లర్స్ తెస్తారా, వచ్చేటప్పుడు?” అడిగింది దమయంతి.
...” అంటూ ఆఫీస్ ఫైల్స్ తీసుకోవటానికి హాల్లోకి వెళ్ళిన అతను తల్లిదండ్రులు నెమ్మదిగా మాట్లాడుకోవటం విన్నాడు.
మనం మన ఊరు వెళ్లి ఒక్కళ్ళం ఉండలేమంటారాండీ?” అడుగుతోంది సావిత్రి.“ఏమని వెడతాం చెప్పు? ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకుని వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళినా అద్దింట్లోనో ఉండాలి...” అంటున్న పద్మనాభం గారి మాటలకి అడ్డు వస్తూ, “ పోనీ, అలాగే ఉందాం... రామం గారింట్లో పక్కన రెండు గదులూ తీసుకుని ఉందాం... మాత్రం ఉండలేమా?” అందావిడ.
ఎలా ఉండగలం? నాకా పెన్షన్ రాదు... మళ్ళీ మన అద్దెకీ, నెల గడవడానికీ వీడే డబ్బు ఎత్తి పంపాలి కదా.. ఏదో అందరం కలిసి ఉంటున్నాం కనుక సర్దుకొస్తున్నాడు కానీ మళ్ళీ మనకి వేరే కాపురం పెట్టి డబ్బు పంపాలంటే పాపం వాడికీ కష్టమే కదా?”
ఏమోనండి... ఇంత వయసొచ్చి, చిన్నపిల్లాడి చేత మీరు మాటనిపించుకుంటుంటే నాకు బాధగా అనిపించి అలా అన్నాను... నిజమేలెండి... పాపం వాడు మటుకు ఎత్తి పంపడం కష్టమే కదా... అయినా మీరు మరీనండి... టీవీ అంత గట్టిగా పెట్టుకోవాలా? చదువుకునే పిల్లాడింట్లో ఉన్నాడని మాత్రం తెలీదూ?” “అలాగేలే... ఏవిటో, వినిపించక అలా పెట్టుకున్నాను. ఇక మీద వాడి హోమ్ వర్క్ అయ్యేకే పెట్టుకుంటాలే టీవీ...”
అమ్మానాన్నల సంభాషణ విన్న రాజారావు మనసు భారమైంది.
ఊళ్ళో ఎప్పుడో తాతల నాటి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో ఉండేవారు అమ్మా, నాన్నా... కప్పు ఎప్పుడు కూలి తలమీద పడుతుందో అని హడిలిపోయే వారు. మరమ్మతులు చేయించుకునేంత స్తోమత లేదాయె. అందుకే దానిని అమ్మి, వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేసేడు. పల్లెటూరూ, పడిపోతున్న ఇల్లూ కనుక దానికి అంత ఎక్కువ డబ్బేమీ రాలేదు. వచ్చిన డబ్బుతో ఫ్లాట్ కి డౌన్ పేమెంట్ కట్టాడు. మిగిలినది నెలనెలా వాయిదాలతో తీరుస్తున్నాడు. తన పరిస్థితులతో వాళ్ళూ, వాళ్ళ సర్దుబాటులతో తామూ కలిసి ఉండక తప్పదు.
ఇందులో ఎవరూ పరాయి వాళ్ళు కాదు. ‘నాకేమి ఒరిగిందీ?’ అనుకునే కంటే, ‘నేనేరకంగా సర్దుకోగలనూ అనుకుంటేనే సంసారం సవ్యంగా నడుస్తుంది. అదృష్టం బాగుండి దమయంతి మంచిదే. అత్తమామలు పనికిరారనే మనిషి కాదు. ఎటొచ్చీ ఆఫీసులో కూడా పని ఎక్కువైనప్పుడు కాస్త విసుక్కుంటుంది. తప్పదు. అందరమూ మనుషులమే... వాళ్ళు పెద్దవాళ్ళు... కాలం గడవక కాలక్షేపం కోసం టీవీ పెట్టుకుంటారు. శశాంక్ చదువుకునే పిల్లాడు... వాడికి ప్రతి నిమిషమూ విలువైనదే... వాడి చదువుకు కూడా అంతరాయం కలగకూడదు కదా! ఎలా సమస్యను పరిష్కరించడం? రాజారావు అన్ని విధాలుగానూ ఆలోచిస్తున్నాడు.
***
భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ వైపు వెళుతున్న రాజారావుకి, దమయంతి మాటలు వినబడ్డాయి.
చూడు నాన్నా, తాతగారికి వినిపించదు కనుక కొంచెం ఎక్కువ సౌండ్ పెట్టుకుంటారు. నువ్వలా ఆయన మీద అరిస్తే డాడీ బాధపడరూ?” కొడుక్కు నచ్చజెబుతోంది.
ఏంటి మామ్, అసలే హోమ్ వర్క్ తెమలక నేను చస్తుంటే, తాతగారు టీవీ అంత సౌండ్ పెడితే నాకేమైనా బుర్రకెక్కాలా వద్దా? ఆఖరికి ఎగ్జామ్స్ లో కూడా ప్రవచనాలే రాసేట్టున్నాను...” చిరాగ్గా అన్నాడు శశాంక్.
భోజనం చేస్తూ, “ సమస్యకి పరిష్కారం లేదా దమ్మూ?” అనడిగాడు రాజారావు.
ఏమో బాబూ, కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుంది. పూట పూటా భాగోతం భరించలేను. ఏం చేస్తారో, ఎలా చేస్తారో నాకు తెలియదు. ఉన్న కొద్దీ వాడు పెద్ద క్లాసుల్లోకి వెడతాడు. ఇంట్లో వాడికి చదువుకుందుకు చోటే లేకుండా పోతోంది. హాల్లో టీవీ సౌండ్ తో వాడెలా చదువుకోగలడు? పైగా ఏడు వాడికి కంప్యూటర్ కూడా కొనాలి. ఎక్కడ పెట్టుకుంటాం? మనక్కావలసినవి మనమెలాగూ మానుకున్నాం. పిల్లాడి చదువు చూసుకోకపోతే ఎలా?” నిష్ఠూరంగానే అన్నా, దమయంతి మాటల్లో సత్యం కనిపించింది రాజారావుకి.
అసలే ఆఫీసులో పనీ, ఇంట్లో గొడవతో చిరాగ్గా ఉన్న దమయంతికి రాత్రి నడుమునొప్పి విపరీతంగా వచేసింది. టాబ్లెట్ వేసుకొని, గదిలో కిటికీ తలుపులన్నీ మూసేసుకొని, భోజనం కూడా చేయలేక పడుకుండిపోయింది. దమయంతి నడుము నొప్పితో నాలుగురోజులకో సారైనా చాలా బాధ పడుతూ ఉంటుంది. పొద్దుట్నించీ గిలక్కాయలా తిరుగుతూ పనులన్నీ చేసుకునే కోడలు ఇలా నడుమునొప్పితో బాధ పడటం చూస్తూంటే సావిత్రికి చాలా బాధగా అనిపించింది. కాసిని పాలు వేడి చేసిద్దామని చూసేటప్పటికి గిన్నెలో పాలు కొంచెమే కనిపించాయి. అవి మర్నాటికి తోడు పెట్టడం కోసం అట్టిపెట్టిన పాలు. తాతా, మనవడు కూడా అన్నంలో పెరుగు బిళ్ళ వేయనిదే భోజనం చేయరు. కాసిని పాలూ ఉన్న గిన్నె చేతిలో పెట్టుకుని, ఒక్క క్షణం చూసి, ‘పోనీలే, రేపు ఉదయం ఆయనకి పెరుగు వెయ్యడం మానేస్తాను...’ అనుకుంటూ గ్లాసులోకి పాలు తీసుకుని, వేడి చేసి, పంచదార కలిపి రాజారావు చేతికిచ్చి దమయంతి చేత తాగించమంది.
రాజారావు తెచ్చిన పాలు చూసి దమయంతి, “ఇప్పుడీ పాలు నాకెందుకండీ? రేపు పెరుగు లేకపోతే ఇబ్బంది అవుతుంది...” అంది.
పోనిద్దూ! రేపు శశాంక్ పెరుగు వేసుకోవడం మానేస్తాడు. ఒక్క పూటకి ఏమీ కాదులే... నువ్వు పాలు తాగు..” అంటూ ఒక విధంగా బలవంతంగానే దమయంతి చేత పాలు తాగించాడు రాజారావు.
రాత్రి జరిగిన గొడవతో నిద్ర సరిగ్గా లేకపోవడంతో ఉదయం లేచేసరికి రాజారావు, దమయంతీ కూడా కాస్త చిరాగ్గానే ఉన్నారు. పొద్దున్నే హడావిడిగా తయారయి శశాంక్ ను స్కూలుకు పంపి ఇద్దరూ ఆఫీసులకి బయలుదేరేరు.
వచ్చేటప్పుడు మరచిపోకుండా నా మందులు తెండి... నొప్పి భరించలేకపోతున్నాను...” అని వెళ్ళేటప్పుడు మళ్ళీ గుర్తు చేసింది దమయంతి. మరో పదినిమిషాలకి దమయంతి కూడా తయారై అత్తగారితో చెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయింది.
కొడుకూ, కోడలు ఆఫీసులకీ, మనవడు శశాంక్ స్కూలుకీ వెళ్ళాక, అప్పటిదాకా కాళ్ళూ చేతులూ కట్టేసినట్టు, కదలకుండా పేపరు పుచ్చుకుని గదిలో ఉండిపోయిన పద్మనాభం గారు హాల్లోకి వచ్చి భక్తి టీవీ పెట్టుకుని ప్రవచనాలు వింటూ జరిగినది మర్చిపోడానికి ప్రయత్నిస్తున్నారు.
***
సాయంత్రమైంది. అందరూ గూటికి చేరారు. పద్మనాభం గారు మళ్ళీ తమ గదిలోకి దూరిపోయి, పొద్దున్న చదివిన పేపరే మళ్ళీ చదవడంలో మునిగిపోయారు.
ఇంటికి వచ్చిన రాజారావు తను వస్తూ తెచ్చినవన్నీ, డైనింగ్ టేబుల్ మీద పెట్టి, కాళ్ళూ చేతులూ కడుక్కు రావడానికి వెళ్ళాడు. అవన్నీ విడదీసి ఎక్కడివక్కడ సర్దుతున్న దమయంతి అందుల పాకెట్ తీసి చూసింది.
ఇదేమిటండీ, పెయిన్ కిల్లర్ ఒక్కటే తెచ్చారు? జెంటాక్ తేలేదేం? ఆంటాసిడ్ వేసుకోకుండా పెయిన్ కిల్లర్ ఒక్కటే వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ కి కడుపులో మండిపోతుంది కదా?” నిలదీసింది భర్తని.
అరెరే... పెయిన్ కిల్లర్ ఒక్కటే చాలనుకున్నాను...” భర్త జవాబుకు తల కొట్టుకుంది దమయంతి.
నడుము నొప్పి తగ్గటానికి పెయిన్ కిల్లర్. కానీ పెయిన్ కిల్లర్ కి సైడ్ ఎఫెక్ట్ ఉంది. అదేమిటంటే కడుపులో మంట. సైడ్ ఎఫెక్ట్ తగ్గించుకోవాలంటే ఆంటాసిడ్ వేసుకోవాలి...” విడమరచి చెప్పింది.
అంటే, ప్రతీ సమస్యకీ ఒక పరిష్కారం ఉన్నట్టే పరిష్కారానికి ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట!” ఆలోచిస్తున్నట్టు అన్నాడు రాజారావు.
మాత్రం దానికి అంత ఆలోచన ఎందుకో...”
దమయంతిని చేయిపట్టి అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టి చెప్పాడు, రాజారావు.
అంటే, తల్లిదండ్రులు వృద్ధులైపోయి, ఒంటరిగా ఉండలేకపోవడం సమస్య అయితే, వాళ్ళని కొడుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం దానికి పరిష్కారం. కానీ మూడుతరాలు ఒకే ఇంట్లో ఉండాల్సివచ్చినప్పుడు పరిష్కారానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవే మనం రోజూ అనుభవించే ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్...”
అర్థం కానట్టు చూసింది దమయంతి.
దమ్మూ, అమ్మానాన్నలు మనింట్లో ఉండటం మనం సమస్యగా అనుకోకూడదు. అది సమస్య కాదు కానీ, ప్రస్తుతానికి సమస్యగానే అనుకుందాం. అమ్మా నాన్నా మనతోనే ఉండాలి, ఉంటారు కూడా.. దానికి నీక్కూడా విధమైన అభ్యంతరం లేదని నాకూ తెలుసు. కానీ చదువుకుంటున్న పిల్లాడి దృష్ట్యా చూస్తే వాళ్లిక్కడ ఉండడం వాళ్ళ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్ వస్తున్నాయి. వాటిని మనం ఫేస్ చేయకతప్పదు. కానీ ఇప్పుడు నువ్వు పెయిన్ కిల్లర్ వేసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ కి అది రాకుండా ఎలా ఆంటాసిడ్ వేసుకుంటున్నావో అలాగే మనం కూడా వాళ్లుండడం వాళ్ళ వచ్చే సమస్యకి ఆంటాసిడ్ వేద్దాం.”
ఎలా?” కుతూహలంగా అడిగింది దమయంతి.
మనది టూ బెడ్ రూమ్ ఫ్లాట్ కదా! సౌకర్యంగా ఉంటుందని, పెద్ద అటాచ్డ్ బాత్ ఉన్నది అమ్మానాన్నలకిచ్చి, మనం చిన్నదానిలో ఉంటున్నాం. ఇన్నాళ్ళూ శశాంక్ చిన్నవాడు కనుక నడచిపోయింది. ఇప్పుడు వాడూ, వాడు చదివే క్లాసూ కూడా పెరుగుతున్నాయి. ఇకపై వాడికి చదువుకునేందుకు ఒక రూమ్ కావాలి. అందుకని మనం మనింట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఇక గొడవలేం ఉండవు...”
ఏం మార్పులు?”
మనది డ్రాయింగ్ కమ్ డైనింగ్ రూమ్ పొడుగ్గా ఉంది కదా... దాన్ని ఒక్క సోఫాలు పట్టేంతవరకే ఉంచి, అక్కడినుంచి డైనింగ్ వరకూ ఒక్క సన్నని పాసేజ్ మటుకే ఉంచి ఒక పక్కకి పార్టిషన్ పెట్టేద్దాం. అది శశాంక్ కి స్టడీ రూమ్ అవుతుంది. కిటికీ పక్కకి రైటింగ్ టేబుల్ వేస్తే, పక్క గోడకి కంప్యూటర్ సెట్ చెయ్యొచ్చు. పక్క బాల్కనీలో మరో బాత్ రూమ్ కట్టిద్దాం. చిన్నదైనా ఫర్వాలేదు. టీవీని అమ్మా వాళ్ళ రూము లోకి షిఫ్ట్ చేద్దాం. మనకి ఎటూ చూడడానికి టైముండదు. ఎప్పుడైనా చూడాలంటే అక్కడే కూర్చుని చూద్దాం. ఇంకోటీ, అంతే ముఖ్యమైనది ఏమిటంటే, నాన్నగారికి టీవీకి కనెక్ట్ చేసే ఒక హెడ్ ఫోన్ సెట్ కొనివ్వడం. అవి చెవిలో పెట్టుకుని, ఆయన టీవీలో, ఛానెల్ ఎంత సౌండ్ పెట్టుకుని చూసినా పక్కవాళ్ళకి కూడా వినిపించదు. శశాంక్ కి అసలు డిస్ట్రబెన్స్ ఉండదు... ఏమంటావ్?”
మరి డబ్బు?” చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగింది దమయంతి.
మా ఆఫీసులో ఉన్న కోపరేటివ్ సొసైటీ లో రెండేళ్ళ క్రితం తీసుకున్న లోన్ ఈనెలతో తీరిపోయింది. వచ్చేనెలలో మళ్ళీ తీసుకుంటాను. ఏముందీ? ఇంకో రెండేళ్ళు లోన్ కట్టుకుంటాం.. అంతే...”
కళ్ళు విప్పార్చుకుని రాజారావుని చూసింది దమయంతి.
సమస్య ఇంత సులువుగా తీరుతుందనుకోలేదండీ... రోజూ అటు పెద్దవాళ్ళని ఏమీ అనలేక, ఇటు పిల్లవాడికి నచ్చజెప్ప లేక నన్ను నేను తిట్టుకుంటూ, మిమ్మల్ని విసుక్కునే దాన్ని. మీరన్నట్టు నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ వేసుకునే ముందు ఆంటాసిడ్ వేసుకున్నట్టే, సమస్య వస్తే పరిష్కారం చూసే ముందు అది అందరికీ ఆమోద యోగ్యమైనదైతే అంతా సుఖాంతమే కదండీ...” మెరుస్తున్న కళ్ళతో అంది.
, సుఖాంతమే... ఎందుకంటే, ఇదంతా నువ్వు అర్థం చేసుకున్నావు చూడు... అందుకూ సుఖాంతం...” అన్నాడు మనస్ఫూర్తిగా రాజారావు.
***
--------------------------------------------------------------------