ఇంతేరా ఈ జీవితం..
తిరిగే రంగుల రాట్నము...
ఎంతటి నగ్న సత్యం. కాసేపు రంగులరాట్నం మీద పై పైకి చేరిపోతాం.
మరు నిమిషంలో అథః పాతాళానికి జారిపోతాం..
ఈ నిమిషంలో సంతోషం. మరో నిమిషంలో దుఃఖం.
అందరూ అయినవాళ్ళే..ఒకరింటిలో విషాదం. మనకి గుండె పిండేస్తూ వుంటుంది.
మరొకరూ అయినవాళ్ళే.. వాళ్ళింటిలో సంతోషం. నవ్వుతూ వుండాల్సిన పరిస్థితి.
దుఃఖాన్ని దాచుకోలేక, నవ్వుని తెచ్చుకోలేక మనసు పడే బాధ ఎవరికి చెప్పుకోగలం?
ముఖానికి నవ్వు అరువు తెచ్చుకుని, ఏడవకూడదు కనుక పెదాల వెనుక కొండంత బాధని అదిమిపెట్టి,
అంతా ఎంత బాగుందో అంటూ అర్ధంలేని వ్యాఖ్యానాలు చేస్తూ, మన ముఖానికి మనం తొడుగులు తగిలించుకుంటున్నాం.
అయినా ఆ దేవుడికి కూడా ఇంత నాటకీయత ఏమిటో..
అన్ని రసాలూ ఏకకాలంలో పండించెయ్యాలంటే మానవమాతృలం..మనకి సాధ్యమా..
తగిలించుకున్న బంధాలు
తగులుకున్న బాధ్యతలు
మనసు రోదిస్తున్నా
మెదడు పనిచేయకతప్పని పరిస్థితుల్లో
బాధను అగాధాల్లో పాతిపెట్టి
పెదవులకు చిరునవ్వు అతికించుకుని
ఎంత హాయిగా వున్నానో.. అనుకున్నాను.
కాని---
హాయనేది వుండేది మనసులోనేనని
కావాలని తెచ్చుకుంటే వచ్చి పెదవులపై వాలేది కాదని
ఈ పిచ్చి మనసుకి ఎప్పటికైనా తెలుస్తుందా..?
-------------------------------------------------------------------------------------------------------
2 వ్యాఖ్యలు:
మనిషి ముఖం ప్రతిభావాన్ని ప్రతిఫలించే అద్దంవంటిదే అయినా మనసులోని భావాలను కప్పిపెట్టే మంత్రాన్ని పఠించగలిగే మానవుడు నటనాగ్రేసరుడు.
చాలా బాగా చెప్పారండీ ఉమాదేవిగారు..
Post a Comment