మన భాష కాక మరో భాష మాట్లాడినప్పుడు వాటి అర్ధాలు తెలీకపోతే జరిగేదేమిటో పక్కరాష్ట్రాలు వెళ్ళి ఇబ్బందులు యెదుర్కున్న వారందరికీ తెలిసే వుంటుంది.
మా చిన్నప్పుడు చాలామటుకు హైస్కూల్ చదువయ్యేవరకూ తెలుగులోనే చదువుకునేవాళ్ళం. కాలేజీకి వెళ్ళేకే ఇంగ్లీష్ మీడియమ్ లో చదువు చెప్పేవారు. అలాంటప్పుడు ఎవరైనా ఇంగ్లీష్ లో మాట్లాడితే గొప్పగా చెప్పుకునేవారు. ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళు సర్వఙ్ఞులనే అపోహతో వుండేవారు. తెలిసీ తెలీకుండా అలా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి కొంతమంది ప్రయత్నించేవారు. అలా మాట్లాడితే జరిగేదేమిటో చెప్పేదే ఈ యెస్..నో..ఆల్ రైట్ అనే నాటకం. ఆ రోజుల్లో చాలా స్కూళ్ళలో స్టూడెంట్స్ ఈ నాటకం వేసేవారు. ఈమధ్య మా చెల్లెలు వాళ్ల స్కూల్ లో వేయిస్తాను..రాసిమ్మంటే మళ్ళీ కొంచెం కొంచెం గుర్తు చేసుకుంటూ రాసాను. కొన్ని డైలాగులు మర్చిపోయి స్వంత కవిత్వం పెట్టేసాను. ఇది అప్పుడు హైస్కూల్ లో వేసినవాళ్ళెవరైనా వుంటే ఏమీ అనుకోకండేం. సరదాగా నవ్వుకుందుకే ఇది. ఇక మొదలెట్టండి మరి...
యస్..నో... ఆల్ రైట్...
అదొక రెస్టారెంట్. ప్రొప్రైటర్
ధనంజయ్ అగరొత్తులు వెలిగించి, దేవుని పటానికి చూపించి, దండం పెట్టుకుని కాష్ కౌంటర్ లో కూర్చుంటాడు. పక్కన రేడియో లోంచి సినిమా పాటలు
మంద్ర స్థాయిలో వినిపిస్తుంటే బాగుంటుంది. కస్టమర్లు ఒక్కొక్కరూ నెమ్మదిగా రావడం మొదలౌతుంది.
గిరీశం అనే ఒక నడివయసాయన లాల్చీ పైజమా వేసుకుని, భుజానికి సంచీ లాంటిది తగిలించుకుని వచ్చి, ఒక టేబుల్ దగ్గర
కూర్చుని టిఫిన్ తింటుంటాడు. కాసేపటికి ఇద్దరు
ఆడవాళ్ళు వస్తారు.
సరోజ--ఏంటి వనజా.. మొన్న మీ నాన్నగారు వచ్చారుట...?
వనజ--యస్..యస్..
సరోజ--కొంపదీసి పెళ్ళి చేసుకుందుకు ఒప్పేసుకున్నావా యేంటి..?
వనజ--నో.. నో...
సరోజ--ఓహ్.. అయితే ఇవ్వాళ మనం యెంజాయ్ చెయ్యాల్సిందే.. మాట్నీకి పోదామా..?
వనజ--ఆల్ రైట్..
ఇద్దరూ బైటకి వెళ్ళిపోతారు.
ఇంగ్లీషు రాని ధనంజయ్ వాళ్ల మాటలని కళ్ళింతంత చేసుకుని, నోరు వెళ్ళబెట్టుకుని వింటుంటాడు. అక్కడే టేబిల్ దగ్గర కూర్చుని టిఫిన్ తింటున్న
గిరీశం ఇది గమనిస్తాడు. బిల్లు చెల్లించడానికి కౌంటర్ దగ్గర కొచ్చి ఇలా అంటాడు.
గిరీశం--యేవిటోయ్.. ఆ అమ్మాయిల్ని అదే పనిగా చూస్తున్నావ్.. యేవిటి విశేషం..?
ధనంజయ్--ఛ..ఛ..అబ్బే.. తప్పుగా అనుకోకండీ. వాళ్ళిద్దరూ ఆడపిల్లలైనా ఇంగ్లీషులో
యెంత బాగా మాట్లాడుకున్నారండీ..! మా ఊళ్ళో ఇంగ్లీషు వచ్చినవాళ్ళే లేరు. ఇక్కడ ఆడపిల్లలు
కూడా అలా గలగలా ఇంగ్లీషులో మాట్లాడేస్తుంటే అలా చూస్తున్నానండి.
గిరీశం-- అందులో గొప్పేవుందోయ్. నీకు ఇంగ్లీషు కావాలంటే నేను నేర్పించనూ..నువ్వు
ఇంగ్లీషులో మాట్లాడేసేవనుకో.. నీ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది.
ధనంజయ్--అంతేనంటారాండీ..అయితే బాబ్బాబూ ..కాస్త నేర్పిద్దురూ..పది కాలాలపాటు మీ
పేరు చెప్పుకుంటాను.
గిరీశం--నేర్పడానికేం భాగ్యం... అలాగే నేర్పిస్తాను. కాని ఇంగ్లీషు నేర్చుకోవాలంటే
బోల్డు ఖర్చవుతుంది మరి.
ధనంజయ్--యెంతవుతుందేంటండి?
గిరీశం--మొత్తం నేర్చుకుందుకు చాలా అవుతుందనుకో. కాని నీకంతా అఖ్ఖర్లేదు.
"యెస్..నొ..ఆల్ రైట్.." అనే ముచ్చటగా మూడు ముక్కలు చాలు.
ధనంజయ్--(ఆతృతగా)--ఆ..ఆ..అవే మాట్లాడుకున్నారండీ ఆ అమ్మాయిలూ.. ఆ మూడుముక్కలూ నేర్పండి
చాలు.
గిరీశం--మరికనేం--ఒక్కో మాటకీ వెయ్యిరూపాయల చొప్పున మూడుమాటలకీ మూడువేలంతే..(చాలా
తేలికగా చెప్పాలి)
ధనంజయ్--అయ్యబాబోయ్.. మూడు వేలే..
గిరీశం--మరీ.. ఇంగ్లీషంటే ఆషామాషీ భాషనుకున్నావా? బోల్డు ఖర్చౌతుంది.
ధనంజయ్--తప్పదు కదండీ మరీ.. అలాగే చెప్పండి.
గిరీశం ధనంజయ్ ని కూర్చోబెట్టుకుని "యస్..నొ...ఆల్ రైట్." అనే మూడు పదాలూ
ఒకటికి పది సార్లు చెప్పిస్తాడు. కాని వాటి అర్ధాలు మాత్రం చెప్పడు.
కాసేపయ్యాక..
ముందులాగే కస్టమర్లు వచ్చి
టిఫిన్లు తిని వెడుతుంటారు. ధనంజయ్ మహా ఆనందంగా కాష్ కౌంటర్ లో డబ్బులు వసూలు చేసుకుంటుంటాడు.
ఒక కస్టమర్ కుర్చీలో బేగ్ మర్చిపోయి వెళ్ళిపోతాడు. అది గమనించిన మరో కస్టమర్ ఆ
బేగ్ తీసేసుకుని చల్లగా జారుకుంటాడు. ఇదేమీ గమనించని ధనంజయ్ తన పనిలో మునిగిపోయుంటాడు.
బేగ్ మర్చిపోయి వెళ్ళిన కస్టమర్ హడావిడిగా మళ్ళి వచ్చి తను కూర్చున్న కుర్చీ దగ్గరకెళ్ళి
చూసుకుంటాడు. బేగ్ కనపడదు. అటూ ఇటూ చూస్తూ ధనంజయ్ దగ్గరికొస్తాడు.
కస్టమర్ (ఖంగారుగా)- ఇక్కడ..బేగ్ మర్చిపోయాను. చూసేరా..?
ధనంజయ్ తనలో తాను-ఓహో.. బలే అవకాశం వచ్చిందే ఇంగ్లీషులో మాట్లాడ్డానికి. దెబ్బకి
పెద్ద మనిషి డంగైపోవాలి అనుకుంటూ..
పైకి దర్పంగా--"యేస్.."అంటాడు.
కస్టమర్- హమ్మయ్యా.. రక్షించేరు. ఇచ్చెయ్యండి.
ధనంజయ్- నో..
కస్టమర్-ఏవిటీ.. ఇవ్వరా.. అయితే పోలీసుల్ని పిలవమంటారా..
ధనంజయ్- ఆల్ రైట్..
కస్టమర్ తెల్లబోయి మళ్ళీ అడుగుతాడు.
కస్టమర్- మిమ్మల్నే..ఇక్కడ బేగ్ మర్చిపోయేను. తీసేరా..
ధనంజయ్- యేస్..
కస్టమర్- అయితే ఇవ్వండీ..
ధనంజయ్- నో
కస్టమర్- పోలీసుల్ని పిలుస్తానంతే..
ధనంజయ్- ఆల్ రైట్..
కస్టమర్ హడావిడిగా స్క్రీన్ లోకి వెళ్ళిపోయి, ఓ నిమిషంలో ఇద్దరు కానిస్టేబుల్స్ తో వస్తాడు. ఈ లోపల ధనంజయ్ తను ఇంగ్లీష్ లో మాట్లాడేసినందుకు
సంబరపడిపోతూ వుంటాడు.
పోలీసులు ధనంజయ్ ని అడుగుతారు.
పోలీస్- ఏవయ్యా, ఇక్కడ ఇతని బేగ్ మర్చిపోయేడుట.
నువ్వుగాను తీసేవా?
ధనంజయ్(గొప్పగా)- యేస్
పోలీస్- అయితే అతని బేగ్ అతనికిచ్చేయ్యి.
ధనంజయ్ ( ఇంకా గొప్పగా మెడ పైకెత్తి)- న్నో
పోలీస్- అయితే నడు పోలీస్ స్టేషన్ కి
ధనంజయ్(భుజాలెగరేస్తూ)- ఆల్ రైట్
అంతే పోలీసు లిద్దరూ ధనంజయ్ చెరో రెక్కా పట్టుకుని నడిపించుకు తీసికెడుతుంటారు.
అదేమిటో అర్ధంకాని ధనంజయ్ ఏదో తప్పు జరిగిందని మటుకు గ్రహించుకుని పోలీసులతో పాటు నడుస్తూ
ఇలా అనుకుంటుంటాడు.
ధనంజయ్- యెస్ నో ఆల్ రైట్ ఎంత పనీ చేసావే
మూడు వేలుచ్చుకుని
ముప్పు తెచ్చుకున్నానే
కాఫీ హోటలు పెట్టీ
కొంప తీసుకున్నానే
యెస్ నో ఆల్ రైట్
ఎంత పనీ చేసావే
అని తనలో తను పాడుకుంటున్న ధనంజయ్ ని చూసి పోలీస్ అడుగుతాడు.
పోలీస్- యెస్, నో, ఆల్ రైట్ లు తప్పు చెయ్యడమేంటయ్యా.. అసలు నువ్వేవంటున్నావ్?
ధనంజయ్- బాబూ..పోలీస్ బాబూ. మీకు జరిగిందంతా చెప్తా వినండి. ఎవరో ఇద్దరమ్మాయిలు
ఇంగ్లీషులో మాట్లాడుకుంటుంటే నాక్కూడా అలా ఇంగ్లీషులో మాట్లాడాలనిపించి మా హోటల్ కొచ్చిన
ఒకాయన దగ్గర మాటకి వెయ్యి చొప్పున మూడు వేలిచ్చిఈ
మూడు మాటలూ నేర్చుకున్నానండి. మీరంతా పెద్ద మనుషులు కదా.. ఇంగ్లీషులో మాట్లాడితే గొప్పగా
వుంటుందనుకుని ఆ ముక్కునెట్టుకున్న మూడుముక్కలూ కక్కేసేనండి. దానికి మీరు నన్ను పోలీస్
స్టేషన్ కి తీసికెడుతుంటే అవి ఎందుకు నేర్చుకున్నానా అని అలా పాడుకుంటున్నానండి. అంతేనండి.
పోలీస్ (ఆశ్చర్యంగా)- అంటే నీకు ఆ మాటలకి అర్ధాలు తెలీవా?
ధనంజయ్- తెలీదండి.
పోలీస్ (నవ్వుతూ) హోరి నీ యిల్లు బంగారంగానూ. మేం నువ్వు అతని బేగ్ మర్చిపోయేడుట
చూసేవా అని అడిగేం నువ్వు యెస్ అన్నావు అంటే మేం అన్నదానికి ఒప్పుకున్నట్టన్న మాట.
ధనంజయ్(ఖంగారుగా)- అయ్ బాబోయ్. నేను చూడ్లేదండి.
పోలీస్-అదేమరి. మరి మే తర్వాత చూస్తే ఇచ్చెయ్యి అన్నాం కదా. అప్పుడు నువ్వు నో
అన్నావు. అంటే మేం చెప్పింది నువ్వు ఒప్పుకోలేదన్నమాట.
ధనంజయ్(తెల్లబోతూ)- అలాగాండీ.
పోలీస్- ఒప్పుకోకపోతే నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసికెడతామంటే నువ్వేమన్నావ్?
ధనంజయ్- ఆల్ రైట్ అన్నానండి.
పోలీస్- అంటే అలాగే తీసికెళ్ళండీ అని ఒప్పుకున్నట్టన్న మాట. అందుకే నిన్నిప్పుడు
మేం పోలీస్ స్టేషన్ కి తీసికెడుతున్నాం.
ధనంజయ్- (దండాలు పెట్టేస్తూ) బాబూ.. పోలీస్ బాబూ.. నాకు నిజంగా అలా అన్నానని తెలీదు.
ఆయన బేగ్ ని నేను చూడను కూడా చూడలేదు. అసలు ఆ మాటలకి ఆ అర్ధాలని ఆ పెద్దాయన నాకు చెప్పలేదు.
పోలీస్ (ఆశ్చర్యంగా)- అంటే నీకు ఆ మాటలకి అర్ధాలు తెలీవా?
ధనంజయ్- అవును బాబూ.. నాకు
ఈ మాటలు చెప్పిన పెద్దాయన వాటి అర్ధాలు చెప్పలేదు. అందుకనే నేనేం మాట్లాడుతున్నానో
నాకు తెలీలేదు. ఈ మాటల వల్ల ఇంత అపాయం వుంటుందని తెలిస్తే ఎందుకు మాట్లాడతానండీ. (దీనంగా)దయచేసి
నన్ను పోలీస్ స్టేషన్ కి తీసికెళ్ళకండీ.
పోలీస్ -హోరినీ.. అర్ధాలు తెలీకుండా మాట్లాడి ఎంత అపాయం
తెచ్చుకున్నావయ్యా.. ఇంకెప్పుడూ ఇలాంటి అర్ధం పర్ధం లేని పన్లు చెయ్యకు. వెళ్ళి హాయిగా
వ్యాపారం చేసుకో.
అంటూ పోలీసు లిద్దరూ ధనంజయ్
ని వదిలిపెట్టేస్తారు. ధనంజయ్
యెస్ నో ఆల్ రైట్ ఎంత పనీ
చేసావే…మూడు వేలుచ్చుకుని ముప్పు తెచ్చుకున్నానే…కాఫీ హోటలు పెట్టీ కొంప తీసుకున్నానే..
యెస్ నో ఆల్ రైట్ ఎంత పనీ
చేసావే
అంటూ గొణుక్కుంటూ వెళ్ళిపోతాడు.
---------------------------------------------------------------------------------------
3 వ్యాఖ్యలు:
రేపు మా తెలుగు తరగతి వార్షికోత్సవాల్లో పిల్లలు ఇలాంటి నాటికే వేయబోతున్నారండి. అయతే అర్ధం చేసుకోకుండా బట్టీ పెట్టడం వలన వచ్చే అనర్దాలుగా మార్చి వేయిస్తున్నాము. ఎలా చేస్తారో చూడాలి.
బాగా చేస్తారండీ. పిల్లలు అన్నీ ఇట్టే పట్టేస్తారు..
bagumdi
Post a Comment