Pages

Tuesday, February 16, 2010

కంప్యూటర్ పేలిపోయింది..(దిక్కుమాలిన కథలు, కామెడీ కామెంట్ల తో)

మా కంప్యూటర్ పేలిపోయింది..దిక్కుమాలిన కథలు, కామెడీ కామెంట్ల తో అతలాకుతల మయిపోయింది..


ఏమిటా అని చూస్తే ఆంధ్రదేశమంతా అట్టుడికి పోతోంది. తెలంగాణా వేడితో తెర్లిపోతోంది.. మావోయిస్టులు బౌధ్ధమతం పుచ్చేసుకున్నారు. దలైలామా శిష్యులుగా చేరడానికి ఢిల్లీ వెళ్ళిపోయారు.


గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఎర్రగడ్డ వైపు పరుగులు పెడుతున్నారు. ఎర్రగడ్డ వైపు ఆర్.టి.సి. ఎన్ని స్పెషల్ బస్సులు వేసినా సరిపోవటం లేదు. అసెంబ్లీ మూసేసారు. మూర్ఛ రోగులు ఎక్కువయ్యారు. సినిమా హాల్సన్నీ సత్రాలుగా మారిపోయాయి. హోటల్స్ అన్నీ ప్లే గ్రౌండ్ లు అయిపోయాయి. మాల్స్ లో చూస్తే అన్ని రకాల జంతువులూ అక్కడే సమావేశాలు పెట్టుకున్నట్టున్నాయి.. ఏవేవో వింత వింత శబ్దాలొస్తున్నాయి.


కామెడీ సినిమా చూసొచ్చిన మా పిన్నత్తగారు మా వీధి చివరి బడ్డీ కొట్టు దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంది. ఆవిడకు సపోర్టుగా రిలే దీక్షల కోసం అండమాన్నించి బిన్ లాడెన్ తన సహచరులతో సహా వచ్చేసాడు.


" ఈ ప్రజారాజ్యం లో ఏం చెయ్యడానికైనా నాకు హక్కుంది " అనుకుంటూ కారు కోసం టికట్టు కొన్న మా మావగారు హిమాలయా లెక్కుతానని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు.


నాకు ఖంగారెత్తి మా ఆవిడ వైపు చూసాను. వెర్రి గొర్రెలా వెనకాల నడిచేది. ఏమిటో జంధ్యాల సినిమాలో కేరక్టర్ లా ప్రవర్తిస్తోంది. లేకపోతే ఈ మాట్లేవిటి?


ఇదిగో వినండి.."ఇది మెటర్నిటీ హాస్పిటల్ కదా... ఏం జరుగుతోందిక్కడ?" అనడిగింది..నిజమే.. అప్పుడే పుట్టిన అబ్బాయి రెండ్రోజుల క్రితం పుట్టిన అమ్మాయికి లైనేస్తున్నాడు.


వెంటనే మా ఆవిడ " ఇంత లేటా? పాపం ఆ అబ్బాయి కడుపుతొ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ తెలుగు సినిమా చూడలేదనుకుంటాను. ఇలాంటి వాళ్ళందరికీ ఎవడు దిక్కు? వెంటనే ఒక ఆర్డినెన్స్ పాస్ చెయ్యాలి.. కడుపుతో ఉన్న వాళ్ళందరూ. ఫలానా సినిమా చూసి తీరాలీ అని.. లేకపోతే అంధుల పాఠశాలలో చేర్పించి, అలోవిరా పండు తినిపిస్తారని." అంటూ ఆ హీరో ని తెగపొగిడేసింది..

" అబ్బే.. అసలెవరికీ బుధ్ధీ ఙ్ఞానం లేవు. అందులో హీరో ఎంతటి వాడు?.. నాలుగడుగుల వాడు. నలభై వీశెల బరువున్నవాడు..నల్లరంగు మీద తెల్లచారలు పెట్టుకున్నవాడు. తెల్ల జుట్టుకు ఎర్రరంగు వేసుకున్న వాడు. నల్ల కళ్ళజోడు పెట్టుకున్నవాడు. కళలన్నీ కలిపి నానబెట్టి, ఉడకబెట్టి, రుబ్బేసి, ఎండేసి, పొడిచేసి ఆ భస్మం పూసుకునేవాడు. ఎలుగుబంటి తోలుతో చేసిన సంచీలో ములక్కాడ తో చేసిన గన్ పెట్టుకుని ఎలకలని వేటాడేవాడు. " అంటూ లావుపాటి పక్కింటి పిన్నిగారి మొగుడుగారికి కన్ను కొట్టింది.


ఆయన వేపచెట్టెక్కి ఒక్క దూకు దూకాడు. వాళ్ళావిడ జడగంటలు పెట్టుకుని తిప్పుకుంటూ వచ్చి, " ఓ గుప్పెడు ఉప్పు అప్పిస్తారా? " అనడిగింది. మా ఆవిడ నా చేయి పట్టికెళ్ళి ఆవిడ చేతిలో పెడుతూ కళ్ళ నీళ్ళెట్టుకుని "ఎండ కన్నెరుగని బిడ్డడమ్మా.. జాగ్రత్తగా చూసుకో.." అంది.

నాకు ఠారెత్తిపోయింది.


ఏమిటా అని విచారిస్తే మా ఆవిడ బ్లాగ్ లో విపరీతమైనదేదో చదివిందని తెలిసింది. ఊళ్ళో స్పెషలిస్ట్ లెవరి దగ్గరి కైనా తీసికెడదామనుకుంటే అందరూ ద్వారక తో పాటు మునిగిపోయేరని తెలిసింది.

అయినా ఊరుకోలేక కాస్త చద్దన్నం లో ఆవకాయేసి కలిపి పెడితే తగ్గుతుందని ఎవరో చెపితే ఇప్పుడే అన్నం వండడం మొదలుపెట్టేను. బియ్యం కోసం చూస్తే ఏవీ? రాళ్ళయి పోయాయి.

అయినా సరే సతీవ్రతుడిలా అవే గుగ్గిళ్ళనుకుని వండడం మొదలు పెట్టాను. స్టౌ పేలిపోయింది.

విసుగు చెందని విక్రమార్కునిలా నీళ్ళని నిప్పులుగా మార్చి ఆ గుగ్గిళ్ళని వండితే మా ఆవిడ వాటిలో మినపసున్ని కలిపి నాకే పెడతానని బయల్దేరింది. అయ్యబాబోయ్... అదిగో వచ్చేస్తోంది.. నన్ను రక్షించేవారేలేరా...

***************************************************************************************************************************

Sunday, February 7, 2010

నా ఎంకి పాట


చిలకాకు పచ్చంచు చీర కట్టిందీ
రంగైన చెంగావి రైక తొడిగిందీ
కంటె నానూ కలిపి కంటాన బెట్టింది
అందాల నా ఎంకి అచ్చరే అయ్యింది.
ఏడకే ఎంకి నీవేడ కెడతావంటె
నీ నీడె నా మేడ వేరేడ కెడతానంది...//


అయ్యోరి కాడెల్లి పై పంచె తెచ్చింది
కుచ్చుల్ల తలపాగ చక్కంగ చుట్టింది
తిరునాళ్ళలో కొన్న తిరుచూర్న వెట్టింది
అద్దంల నను చూపి అందంగ నవ్వింది
ఎందుకే ఎంకి ఈ అందాలు మనకంటె
నువ్వె నా అయ్యోరు ఒద్దంటె ఒట్టంది...//


ఏటి తరగలతోటి పాట కట్టింది
పైరగాలిని పట్టి సైదోడు పదమంది
చిరుజల్లు చెయిపట్టి తందాన తానంది
నేర్చుకోమావ ఈ పాట బాగుందంది..//
నానేటి..పాటేటి ఒల్లకోయే అంటె
కాదనకు మావ నా ముచ్చటని నవ్వింది....//

సేతిలొ సెయ్యెట్టి అడుగులో అడుగేసి
గోదారి గట్టంత జంటగా నడిచింది
ఎండి ఎన్నెట్లోన గోదారి మధ్యలో
పద మావ పడవెక్కి పదమందుకోమంది...//

॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑॑