Pages

Monday, July 26, 2010

ఒక సంవత్సరంఅందరికీ నమస్కారం.
ఇదివరకు ఎప్పుడైనా తోచనప్పుడు బ్లాగులు చదివేదానిని. కాని ఆ రాసేవారిలో నేను కూడా చేరవచ్చు అన్న దాని మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఏడాది క్రిందట "నన్ను కూడా మీ జట్టులో చేర్చుకుంటారా" అని జ్యోతీగారిని అడిగినప్పుడు, వెంటనే చేర్చుకుని బ్లాగ్ లో కూడా రాయొచ్చు కదా అన్నారు. అసలు బ్లాగ్ లో ఏం రాస్తారో, ఎలా రాస్తారో, ఎందుకు రాస్తారో తెలీని నేను ఏదో మొహమాటానికి బుర్రూపేసరికి, ఇంకేముంది.. ఈ బ్లాగ్ లోకం లోకి వచ్చి పడ్డాను. పడుతూనే "థ్రిల్" అయ్యాను. ఎందుకంటే ఇదివరకు ఏ పత్రిక కైనా కథ రాసి పరిశీలనకు పంపితే నెలలు గడిచేదాకా ఫలితమేమిటో తెలిసేది కాదు. ఆ ఎదురుచూడడమనే అనుభవం పత్రికలకు ప్రచురణకోసం పంపే వారందరికీ తెలిసేవుంటుంది. కాని హాచ్చెర్యం..ఈ బ్లాగ్ లో రాసిన మరుక్షణం నా టపా ప్రచురించబడి, అంతర్జాలం లో చదవడానికి అందుబాట్లో వుండడం చూసి ఎంత సంతోషంగా అనిపించిందో..అలా.. అలా.. నాకు సరదాగా అనిపించేవి చిన్నచిన్నవి రాస్తుంటే హంతకన్నా హాశ్చర్యం.. దానికి కామెంట్లు కూడా రావడం..నిజం చెప్పాలంటే (ఎవరూ మరోలా భావించకండేం..) అలా కామెంట్లు రాసే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలని కూడా నా పిచ్చి బుర్రకు తట్టకపోవడం. ఈ విషయంలో వారందరూ పెద్ద మనసు చేసుకుని నన్ను మన్నిస్తారని భావిస్తున్నాను.
అలాగ నా బ్లాగ్ ప్రయాణం మొదలుపెట్టి ఇప్పటికి సంవత్సరమయ్యింది. మొదటి సంవత్సరం వార్షికోత్సవం అని కాదు కాని ఈ సంవత్సరమంతా బ్లాగ్ లు రాయడంలో బోర్లా పడడం, తప్పటడుగులు వెయ్యడం అన్నీ అనుభవించాను. ఏదైనా నేర్చుకోవాలనే అభిలాష వున్న నాకు ఈ బ్లాగ్ లోకం చాలా పాఠాలు నేర్పింది.
అన్నింటికన్నా నాకు సంతోషమనిపించినదేమిటంటే భావసారూప్యత కలిగినవారితో స్నేహం ఏర్పడడం. ఈ ఏడాదిలోనాకు చాలామంది మంచి స్నేహితులు కలిసారు. ఎంతో ఆప్యాయంగా, అభిమానంతో చాలా విషయాలు చర్చించుకున్నాం. వారివల్ల నాకు తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను. అందరికీ కృతఙ్ఞతలు. మీ అందరి ఆదరాభిమానాలూ ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ,
శ్రీలలిత..

Saturday, July 17, 2010

"రోజూ పూచే రోజా పూలే

"రోజూ పూచే రోజా పూలే
ఒలికించినవీ నవరాగాలే.."
అందంగా విచ్చుకున్న రంగురంగుల గులాబీలను చూస్తుంటే నాకు వెంటనే ఈ పాట గుర్తు వచ్చింది.
ఆణిముత్యం లాంటి సినిమా "మాంగల్యబలం" లోని దీ పాట.
"తెలియని ఆనందం...నాలో కలిగినదీ ఉదయం.." అంటూ మొదలవుతుందీ పాట.
నిజమే కదా..
ఉదయాన్నే లేచి పచ్చని ప్రకృతిలో విరిసిన పూబాలలని చూస్తుంటే కలిగే తృప్తీ, అనందం పంచభక్ష్యపరమాన్నాలూ మన ముందు పెట్టినా మనకు కలగదు. అంటే మనిషి మీద మనసు ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో తెలుస్తుంది.
మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే...
మన మూడ్ కనక బాగుంటే మనకి ఇష్టంలేనివారితో కలిసి వెళ్ళినాసరే, అర్ధం పర్ధం లేని పిచ్చి సినిమా అయినా సరే ఎంతో బాగుంటుంది.
అదే మన మూడ్ బాగులేనప్పుడు ఎంత మనకి బాగా కావలసినవాళ్ళతో వెళ్ళిచూసినా, ఆ సినిమా ఎంతటి కళాఖండమయినా సరే మనకి కావలసిన అనుభూతి నివ్వదు.
ఈ మనసనేది వుంది చూసారూ.. కోతి లాంటిది.
అసలే కోతి... అందులో కల్లు తాగింది... అపై ముల్లు గుచ్చుకుంది అన్నట్టు..ఈ కోతిలాంటి మనస్సు అప్పుడప్పుడు మైకంలో పడుతుంది.
కల్లు తాగిన కోతి కాలిలో ముల్లు గుచ్చుకున్నపుడు ఎన్ని పిచ్చిగంతులు వేస్తుందో చూడాలే కాని చెప్పడానికి రాదు. అలాగే పిచ్చిగంతులు వేసే ఈ మనసుని అదుపులో పెట్టుకోవాలంటే యేం చెయ్యాలి?
ఇదివరకు వీధుల్లో కొంతమంది వచ్చి కోతినాడించేవారు. వాళ్ళు ఆ కోతికి ఎంచక్కటి శిక్షణ నిచ్చేవారు. దానిని ఒక తాడుతో కట్టి ఆ తాడుని ఆ కోతి నాడించేవాడు చేత్తో పట్టుకునేవాడు. వాడు పిల్లిమొగ్గలు వెయ్యమంటే ఎంచక్కా వేసేది. ఒక గిన్నెలాంటిది దాని నెత్తి మీద పెట్టి, "అత్తింటి కుండ నీళ్ళు తే.."అంటే ఢామ్మని కింద పడేసేది.
అదే గిన్నె మళ్ళీ నెత్తి మీద పెట్టి, "పుట్టింటి కుండ నీళ్ళు తే.." అంటే ఎంతో జాగ్రత్తగా తెచ్చేది.
అటువంటిదే ఈ మనసు కూడా. తాడేసి కట్టేసి దానిని జాగ్రత్తగా మన కట్టడిలో వుంచుకోవాలి. చెడు భావనలను దరి చేరనీకుండా మంచి ఆలోచనలనే స్వాగతించాలి. (అంటే అత్తింటివైపున్నవన్నీ చెడు భావనలా అనకండి. ఉదాహరణ కోసం చెప్పానంతే).

మంచి, చెడు అంటే యేమిటో వివరించి చెప్పనక్కర్లేదనుకుంటాను. ఇక్కడ మనం మంచి అంటే ధర్మం అనే అర్ధంలో తీసుకుంటే, "ధర్మ మంటే యేమిటి?"అని యక్షుడడిగిన ప్రశ్నకు ధర్మరాజు చెప్పిన సమాధానం
"ఎదుటివాడు ఎటువంటి పని చేస్తే నువ్వు బాధ పడతావో అటువంటి పని నువ్వు యెదుటివానిపట్ల చెయ్యకుండా వుండడమే ధర్మమంటే.." అన్న ధర్మరాజు సమాధానం అందరికీ తెలిసే వుంటుంది.

అలాగ యెదుటివారికి హాని కలిగించనిదీ, మనకు సంతోషాన్నిచ్చేదీ అయిన ప్రకృతి లోని అందాలను ఆశ్వాదించడంలో వున్న ఆహ్లాదాన్ని ఈ పాట వింటూ అందరం అనుభవిద్దాం...

*********************************************************

Tuesday, July 13, 2010

వానముచ్చట్లు

వర్షాకాలం వచ్చేసింది. ఈ వానని గురించి నాలుగు కబుర్లు చెప్పుకుందామనిపించింది..
మేఘుడు మేఘమాలికకు మేఘాల ద్వారా మేఘసందేశం పంపిస్తే, పులకించిన మేఘమాల మదిని చల్లని పిల్ల తెమ్మెర కరిగిస్తే, రాలిన పూలజల్లు తో మేఘమాల తన సంతోషం ప్రకటిస్తే, అది ధారగా మారి ధరణిని తాకితే, మొలకలెత్తిన పరిమళభరిత సుగంధం ప్రకృతిని కౌగిలిస్తే, దానికి తడిసిన పారిజాతాల సువాసన తోటంతా కమ్మితే, ముగిసిన ముచ్చట్లను మరి యొకసారి తలచుకుంటున్న సుందరి యెదలో ఝుమ్మని తుమ్మెద నాదాలు మోగితే, నాదభరితమైన ఈ జగాన్ని యేలే పరమాత్మ చల్లని చూపు ప్రసరించిన భూమాత పులకరింపుకి ప్రకృతిమాత పరవశించితే..
ఇలా ఎన్నని, ఎన్నని... ఎన్నెన్నో..ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు వర్షం గురించి.
వర్షం పడుతున్నపుడు వనమంతా ప్రాణం పోసుకుంటున్నట్లు పరవశించిపోతే..
ఇదిగో ప్రేయసి ఇలా ప్రణయారాధనలో తేలిపోతుంది...బాగా ఎండలు కాసి కాసి రోజంతా వేడితో వేగిపోయాక సాయంత్రం చల్లని మేఘాలు కమ్మేసి వర్షపుధారలు భువిని తాకుతుంటే ఆ ధారల కింద నిలబడి కళ్ళల్లో జల్లులు సూదుల్లా గుచ్చుకుంటున్నా సరే అదే పూలవర్షం లాగ పులకరించిపోవడం అంటే ఇలాగే కదా..ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ త్యాగరాజు గురించి, ఆయన వ్రాసిన "నౌకాచరితము" గురించి తెలియని వారుండరేమో..
ఆ కథ ఇలా వుంటుంది.
తనని ఆరాధించే గోపకాంతలతో కలిసి చిలిపికృష్ణుడు యమునానదిపై విహారానికి బయల్దేరతాడు.
"సింగారించుకునీ వెడలిరి శ్రీకృష్ణునితోనూ..."
గోపిక లందరూ ఎంచక్కా సింగారించుకుని శ్రీకృష్ణునితో యమునా నదిపై విహారానికి బయల్దేరతారు.
"నవ్వుచు తుళ్ళుచు నొకతె
కొప్పున పువ్వులు ముడుచుచు నొకతె.."
ఎంచక్కా ఒకరిని మించి మరొకరు అలంకరించుకుంటుంటారు.
"గంధము పూయరుగా
పన్నీరు గంధము పూయరుగా
అందమైన యదునందునికీ ..."
అనుకుంటూ కృష్ణునికి కూడా అలంకారాలు చేస్తారు...ఇలా తలొక విధంగా వారందరూ కృష్ణుని సరసన అమందానంద కందళిత హృదయారవిందులయి వుండగా..
మధురమైన భావనలతో గోపికా జనంతో శ్రీకృష్ణులవారు ఓడను నడిపే విధం బెట్టిదనిన..
"ఓడను జరిపే ముచ్చట గనరే
వనితలార మీరు..."
అంటూ నౌకావిహారం గావిస్తూ వుండగాచల్లటిగాలి వారిని చక్కిలిగిలి పెడుతుండగా..
మెల్లగా సన్నని చినుకు మొదలవుతుంది.
అందరూ చూస్తుండగానే అది వుధృతమవుతుంది
ఓడ వుయ్యాలలూగడం మాట అటుంచి, అదుపు తప్పుతుందా అనిపించే స్థితికి వస్తుంది.
అదిగో..ఆ సమయం లోనే ఆ ఓడ లో ఒకమూల చిన్న చిల్లు పడుతుంది. అందులోంచి ఓడలోకి నీళ్ళు చేరిపోతుంటాయి. అందరూ భయభ్రాంతులవుతారు. వారి వారి పయ్యెదలన్నీ ఆ చిల్లు లోకి దోపి ఆ నీటిని ఆపడానికి ప్రయత్నిస్తారు. కాని అవన్నీ విఫల ప్రయత్నాలే అవుతాయి. అప్పుడు వారందరికీ ఙ్ఞానోదయమై, వారి చేతిలో యేమీ లేదని తెలుసుకొని, పరమాత్ముడైన శ్రీకృష్ణుని శరణు కోరతారు. ఆ ఆపద్బాంధవుడు తన చిన్నారి వేలుని ఆ చిల్లుకి అడ్డం పెట్టి ఆ గోపకాంతలను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాడు. ఇదీ నౌకా చరితం కథ. ఇందులో చూసారా వర్షానికి ఎంత ప్రాముఖ్యమో.

వర్షం వర్షం లా వస్తే బాగుంటుంది కాని వెర్రెత్తిపోయి తుఫానులా మారితే ప్రమాదమే కదా మరి..ఎంత భావుకత్వం లో విహరించినా ఎప్పటికైనా ఈ లోకం లోకి రాక తప్పదు. అటువంటప్పుడు ముందు జీవుడికి కావలసినది తినడానికి తిండి. ఎవరో మహానుభావులు చెప్పినట్టు ..
"అన్నమైతే నేమిరా మరి సున్నమైతే నేమిరా..
అందుకే ఈ పాడుపొట్టకు అన్నమే వేతామురా.."
అంటూ సున్నమైనా ఫరవాలేదంటూ మళ్ళీ అన్నాన్నే కోరుకున్నాడు.
అలాగ మనుషులమై పుట్టాక కడుపు నింపుకోవాలి కదా. మరి ఆ పంట పండడానికి ఆధారం ఈ వర్షమే కదా. అతివృష్టి, అనావృష్టిలు లేకుండా ఈ వరుణదేవుడు అనుగ్రహిస్తేనే సకాలంలో పంటలు పండుతాయి.
చక్కగా అలా వర్షం పడుతున్నప్పుడు చిన్నప్పుడు పాడిన పాట గుర్తు వస్తుంది.
వానల్లు కురవాలి వానదేవుడా
వరిచేలు పండాలి వానదేవుడా
మా నాన్న తేవాలి వానదేవుడా
మాఇల్లు నిండాలి వానదేవుడా
మా అమ్మ వండాలి వానదేవుడా
మా బొజ్జ నిండాలి వానదేవుడాచిన్నప్పుడు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు వానలో తడిసినప్పటి అనుభూతిని ఎవ్వరైనా మరవగలరా...ఎంచక్క అలా వర్షం లో తడుస్తూ ఎన్నెన్ని పాటలో.. ఎన్నెన్ని ఆటలో...
వానా వానా వల్లప్పా
వాకిలి తిరుగు చెల్లప్పా
తిరుగు తిరుగు చిన్నక్కా
తిరగాలేను నరసప్పా...మరింక చల్లగా వాన కురుస్తుంటే, మనసులో మంచి భావనలు సుళ్ళు తిరుగుతుంటే, వేడి వేడిగా కమ్మటి మసాలాలు వేసిన ఫలహారాలు పంటికింద పడుతుంటే ...ఆ మజా...ఎలాంటిదంటే..
స్వర్గం బెత్తెడు దూరం లో వుండదూ..
వర్షాకాలం లో వర్షాన్ని గురించి నాలుగు మాటలు చెప్పుకోవడమంటే...
ఆ వరుణదేవుని మనసులో ధ్యానించుకున్నట్టే.
అందుకే మనందరికీ ఆ వరుణదేవుడు సకాలంలో సరిపోయేటట్టుగానే వర్షాల నిచ్చి, మన ఆకలిని తీర్చడమే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం లో మన మనసులకు కూడా మంచి భావాలను అందించాలని కోరుకుంటున్నాను.


***************************************************************

Thursday, July 1, 2010

మానవ ప్రయాణం - వారణాసి నాగలక్ష్మి

మానవ ప్రయాణం - కథాజగత్ పోటీ
ఈ కథ చదవాలంటే మీరు ఇక్కడ చదవొచ్చు.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/manava-prayanam---varanasi-nagalaksmi

ఈ కథ నాకు ఎందుకు నచ్చిందంటే అన్ని రకాలుగానూ సుఖంగా వున్నా కూడా మానవుడికి ఇంకా ఈ అసంతృప్తి ఎందుకనుకుంటూ దానిని మానవుల జీవన విధాన పరిణామక్రియకి అనుసంధానించి కథ చెప్పడమనేది అంత తేలికైన విషయం కాదు. అందుకే నాకు నచ్చింది.
మానవ ప్రయాణం---వారణాసి నాగలక్ష్మి
జీవన్మరణాలనేవి మానవ జీవితం లో్ జరిగేవే. పుట్టాక మనిషి ఎలా జీవించాడో, జీవిస్తున్నాడో మనకి తెలుస్తుంది. భౌతికంగా కనిపిస్తుంది. కాని మరణానికి చేరువయిన మనిషి అంతరంగాన్ని శతాబ్దాలుగా మానవ జీవనవిధాన పరిణామదశతో పోల్చి చెప్పడమన్నది మామూలు విషయం కాదు. అక్కడే కథ మొదలౌతుంది.
మనిషి ఆటవిక దశ నుండి, పరిపాలనాధికారం కోసం యుధ్ధాలు చేసే కాలం దాటి, బానిసత్వ శృంఖలాల నుండి బయటపడేందుకు స్వతంత్ర పోరాటం సాగించే అధ్యాయం ముగించుకుని, స్వతంత్ర భారత దేశంలో రైతుల ఆత్మహత్యల పర్వం దాటి, సాంకేతిక విద్యని సమర్ధవంతంగా వుపయోగించుకుంటూ, తన చుట్టూ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలిగే నవ నాగరిక సమాజం వరకూ సాగించిన ప్రయాణం ఈ కథలో చెప్పబడింది.
నవనాగరిక సమాజం ఏర్పడ్డాక , ఈ కథలో ప్రధానపాత్ర అయిన "మానవ్" తను విలాసంగా బ్రతకడానికి అన్ని హంగులూ అమర్చుకుని కూడా, దానితో తృప్తి పడలేక ఇంకా ఏదో చేసెయ్యాలనే తపనతో చేసిన పనే "బంగీ జంపింగ్". దీనినే "థ్రిల్" అంటుంటారు కొంతమంది. ఇది ప్రమాదకరమని తెలిసికూడా ప్రమాదం అంచులకి వెళ్ళినప్పుడు ఎలా వుంటుందో ననే ఒకరకమైన థ్రిల్ కోసం చేసిన సాహసం. ఆ సమయంలో అతను మరణం అంచులను స్పృశించినప్పుడు కలిగే భావాల మాలికే ఈ కథ.
ఒకప్పుడు కడుపు కింత తిండి, అది దొరికాక ఎండావానలకు రక్షణగా బట్ట, అదీ దొరికాక స్థిరనివాసాలు ఏర్పరచుకోవడంలో వుండడానికో ఇల్లూ ఇలాంటివన్నీ ప్రాధమికావసరాలు. రోజులు గడిచేలొద్దీ ఆ తిండిలోనే రకరకాల రుచులు, కట్టుకునే బట్టలోనే వివిధరీతులు, ఆఖరికి నివసించే ఇల్లు కూడా రూపాలు మారడమే కాదు దాని భావాలు కూడా మారిపోతూ వచ్చింది.
ప్రకృతికి అనుగుణంగా మెలగవలసిన ఈ పాంచభౌతిక శరీరం కోసం ప్రకృతి లోని వనరు లన్నింటినీ పీల్చి పిప్పిచేసి కృత్రిమంగా తన విలాసాల కోసం వినియోగించుకుంటున్న ఈ నవ నాగరిక మానవుడు ఇంకా ఏదో కావాలనీ, ఇంకా ఏదో సాధించాలనీ తహతహలాడిపోతున్నాడు. దేనికోసం అతని తపన? ఇంకా ఏమి సాధించాలని అతని ఆతృత? మరి మనిషికి ఇంక తృప్తి అంటూ వుండదా..
అన్నీ అనుభవిస్తూకూడా ఇంకా ఏదో కావాలనుకుంటూ తృప్తి లేకుండా పరుగులు పెట్టే ఈ మనిషి అసలైన తృప్తి ఎక్కడుందో తెలుసుకుందుకు ఎఫ్ఫుడైనా ప్రయత్నించాడా? నిజంగా చెప్పాలంటే మనిషికి తృప్తి అన్నది బైట ఎక్కడో లేదనీ, అతని లోకి అతను చూసుకుంటే అతనిలోనే వుందనీ తెలుస్తుంది. మనిషి అంతర్ముఖుడైతే కలిగే ఆత్మతృప్తి మరింక ఎక్కడా కనపడదు. అసలైన ఆ విషయం తెలీక మానవుడు అంతరిక్షానికి ప్రయాణించగలిగి కూడా ఇంకా ఏదో తెలీని తపనతో కొట్టుకుపోతున్నాడు. మనిషి తనలోకి తను చూసుకోకపోవడం వల్లే ఈ తపనంతా.
చివరలో మానవ్ అవిశ్రాంత ప్రయాణం మళ్ళీ మొదలయ్యింది అనే మాటతో ముగిసిన ఈ కథ చరిత్ర పునరావృత మవుతుందన్న సత్యాన్ని మరోసారి చెప్పినట్టయింది.

*************************************************************************