Pages

Tuesday, July 13, 2010

వానముచ్చట్లు

వర్షాకాలం వచ్చేసింది. ఈ వానని గురించి నాలుగు కబుర్లు చెప్పుకుందామనిపించింది..
మేఘుడు మేఘమాలికకు మేఘాల ద్వారా మేఘసందేశం పంపిస్తే, పులకించిన మేఘమాల మదిని చల్లని పిల్ల తెమ్మెర కరిగిస్తే, రాలిన పూలజల్లు తో మేఘమాల తన సంతోషం ప్రకటిస్తే, అది ధారగా మారి ధరణిని తాకితే, మొలకలెత్తిన పరిమళభరిత సుగంధం ప్రకృతిని కౌగిలిస్తే, దానికి తడిసిన పారిజాతాల సువాసన తోటంతా కమ్మితే, ముగిసిన ముచ్చట్లను మరి యొకసారి తలచుకుంటున్న సుందరి యెదలో ఝుమ్మని తుమ్మెద నాదాలు మోగితే, నాదభరితమైన ఈ జగాన్ని యేలే పరమాత్మ చల్లని చూపు ప్రసరించిన భూమాత పులకరింపుకి ప్రకృతిమాత పరవశించితే..
ఇలా ఎన్నని, ఎన్నని... ఎన్నెన్నో..ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు వర్షం గురించి.
వర్షం పడుతున్నపుడు వనమంతా ప్రాణం పోసుకుంటున్నట్లు పరవశించిపోతే..
ఇదిగో ప్రేయసి ఇలా ప్రణయారాధనలో తేలిపోతుంది...బాగా ఎండలు కాసి కాసి రోజంతా వేడితో వేగిపోయాక సాయంత్రం చల్లని మేఘాలు కమ్మేసి వర్షపుధారలు భువిని తాకుతుంటే ఆ ధారల కింద నిలబడి కళ్ళల్లో జల్లులు సూదుల్లా గుచ్చుకుంటున్నా సరే అదే పూలవర్షం లాగ పులకరించిపోవడం అంటే ఇలాగే కదా..ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ త్యాగరాజు గురించి, ఆయన వ్రాసిన "నౌకాచరితము" గురించి తెలియని వారుండరేమో..
ఆ కథ ఇలా వుంటుంది.
తనని ఆరాధించే గోపకాంతలతో కలిసి చిలిపికృష్ణుడు యమునానదిపై విహారానికి బయల్దేరతాడు.
"సింగారించుకునీ వెడలిరి శ్రీకృష్ణునితోనూ..."
గోపిక లందరూ ఎంచక్కా సింగారించుకుని శ్రీకృష్ణునితో యమునా నదిపై విహారానికి బయల్దేరతారు.
"నవ్వుచు తుళ్ళుచు నొకతె
కొప్పున పువ్వులు ముడుచుచు నొకతె.."
ఎంచక్కా ఒకరిని మించి మరొకరు అలంకరించుకుంటుంటారు.
"గంధము పూయరుగా
పన్నీరు గంధము పూయరుగా
అందమైన యదునందునికీ ..."
అనుకుంటూ కృష్ణునికి కూడా అలంకారాలు చేస్తారు...ఇలా తలొక విధంగా వారందరూ కృష్ణుని సరసన అమందానంద కందళిత హృదయారవిందులయి వుండగా..
మధురమైన భావనలతో గోపికా జనంతో శ్రీకృష్ణులవారు ఓడను నడిపే విధం బెట్టిదనిన..
"ఓడను జరిపే ముచ్చట గనరే
వనితలార మీరు..."
అంటూ నౌకావిహారం గావిస్తూ వుండగాచల్లటిగాలి వారిని చక్కిలిగిలి పెడుతుండగా..
మెల్లగా సన్నని చినుకు మొదలవుతుంది.
అందరూ చూస్తుండగానే అది వుధృతమవుతుంది
ఓడ వుయ్యాలలూగడం మాట అటుంచి, అదుపు తప్పుతుందా అనిపించే స్థితికి వస్తుంది.
అదిగో..ఆ సమయం లోనే ఆ ఓడ లో ఒకమూల చిన్న చిల్లు పడుతుంది. అందులోంచి ఓడలోకి నీళ్ళు చేరిపోతుంటాయి. అందరూ భయభ్రాంతులవుతారు. వారి వారి పయ్యెదలన్నీ ఆ చిల్లు లోకి దోపి ఆ నీటిని ఆపడానికి ప్రయత్నిస్తారు. కాని అవన్నీ విఫల ప్రయత్నాలే అవుతాయి. అప్పుడు వారందరికీ ఙ్ఞానోదయమై, వారి చేతిలో యేమీ లేదని తెలుసుకొని, పరమాత్ముడైన శ్రీకృష్ణుని శరణు కోరతారు. ఆ ఆపద్బాంధవుడు తన చిన్నారి వేలుని ఆ చిల్లుకి అడ్డం పెట్టి ఆ గోపకాంతలను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాడు. ఇదీ నౌకా చరితం కథ. ఇందులో చూసారా వర్షానికి ఎంత ప్రాముఖ్యమో.

వర్షం వర్షం లా వస్తే బాగుంటుంది కాని వెర్రెత్తిపోయి తుఫానులా మారితే ప్రమాదమే కదా మరి..ఎంత భావుకత్వం లో విహరించినా ఎప్పటికైనా ఈ లోకం లోకి రాక తప్పదు. అటువంటప్పుడు ముందు జీవుడికి కావలసినది తినడానికి తిండి. ఎవరో మహానుభావులు చెప్పినట్టు ..
"అన్నమైతే నేమిరా మరి సున్నమైతే నేమిరా..
అందుకే ఈ పాడుపొట్టకు అన్నమే వేతామురా.."
అంటూ సున్నమైనా ఫరవాలేదంటూ మళ్ళీ అన్నాన్నే కోరుకున్నాడు.
అలాగ మనుషులమై పుట్టాక కడుపు నింపుకోవాలి కదా. మరి ఆ పంట పండడానికి ఆధారం ఈ వర్షమే కదా. అతివృష్టి, అనావృష్టిలు లేకుండా ఈ వరుణదేవుడు అనుగ్రహిస్తేనే సకాలంలో పంటలు పండుతాయి.
చక్కగా అలా వర్షం పడుతున్నప్పుడు చిన్నప్పుడు పాడిన పాట గుర్తు వస్తుంది.
వానల్లు కురవాలి వానదేవుడా
వరిచేలు పండాలి వానదేవుడా
మా నాన్న తేవాలి వానదేవుడా
మాఇల్లు నిండాలి వానదేవుడా
మా అమ్మ వండాలి వానదేవుడా
మా బొజ్జ నిండాలి వానదేవుడాచిన్నప్పుడు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు వానలో తడిసినప్పటి అనుభూతిని ఎవ్వరైనా మరవగలరా...ఎంచక్క అలా వర్షం లో తడుస్తూ ఎన్నెన్ని పాటలో.. ఎన్నెన్ని ఆటలో...
వానా వానా వల్లప్పా
వాకిలి తిరుగు చెల్లప్పా
తిరుగు తిరుగు చిన్నక్కా
తిరగాలేను నరసప్పా...మరింక చల్లగా వాన కురుస్తుంటే, మనసులో మంచి భావనలు సుళ్ళు తిరుగుతుంటే, వేడి వేడిగా కమ్మటి మసాలాలు వేసిన ఫలహారాలు పంటికింద పడుతుంటే ...ఆ మజా...ఎలాంటిదంటే..
స్వర్గం బెత్తెడు దూరం లో వుండదూ..
వర్షాకాలం లో వర్షాన్ని గురించి నాలుగు మాటలు చెప్పుకోవడమంటే...
ఆ వరుణదేవుని మనసులో ధ్యానించుకున్నట్టే.
అందుకే మనందరికీ ఆ వరుణదేవుడు సకాలంలో సరిపోయేటట్టుగానే వర్షాల నిచ్చి, మన ఆకలిని తీర్చడమే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం లో మన మనసులకు కూడా మంచి భావాలను అందించాలని కోరుకుంటున్నాను.


***************************************************************

12 వ్యాఖ్యలు:

మధురవాణి said...

సూపర్ శ్రీలలిత గారూ! వర్షంలో తడిసేలా చేశారు మమ్మల్ని :)

praseeda said...

లలితగారూ.. అద్భుతం.. ఎంత బావుందో చెప్పలేను..

హరే కృష్ణ said...

చాలా చాలా బావుంది

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు
చాలా బాగారాశారు . ఫొటోలు అదుర్స్ అనుకోండి .

భావన said...

బాగుందండి శ్రీలలిత మొత్తానికి అన్ని భావాలను కలదిప్పేరు వానతో కలిపి. మంచి పాటలను గుర్తు చేసేరు చిన్ని కృష్ణుడి మీద.

psmlakshmiblogspotcom said...

బాగుంది శ్రీ లలిత గారూ
దివినుండి భువికి దిగుతున్న అమృత ధారలతో మొదలుపెట్టి అందరి మంచి కోరుతూ ముగించారు. చాలా బాగుంది.
psmlakshmi

సవ్వడి said...

శ్రీ లలిత గారు! ఎంత బాగుందో చెప్పలేను. మరో రెండు మూడు సార్లు చదువుతాను.
మొదటి పేరా హైలెట్............... అదే కాదు మొత్తం అంతా!

నేస్తం said...

ఇప్పుడే ఓడలు జరిపే ముచ్చట గనరే వనితలారా నేడూ అని పాడుకుని వంట ముగించి మీ పోస్ట్ చదివాను.. చాలాబాగా రాసారు..పోటోస్ చాలా బాగున్నాయి :)

Anonymous said...

పైనున్న అన్ని కామెంట్లు కలిపి నా కామెంట్ గా వేసుకోండి.
ముఖ్యంగా బురద నీటిలో గెంతుతున్న చిన్న పిల్లల ఫొటో నాకు భలే నచ్చేసింది. ఆ ఆనందం పొందాలంటే ఇంకో జన్మ ఎత్తాల్సిందేకదా

శ్రీలలిత said...

మధురవాణిగారూ,
ప్రసీదగారూ,
హరేకృష్ణగారూ,
మాలాకుమార్ గారూ,
భావనగారూ,
పి.ఎస్.ఎమ్.లక్ష్మిగారూ,
సవ్వడిగారూ,
నేస్తంగారూ,
లలితగారూ,
మీ అందరికీ నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వుందండీ. అందరికీ ధన్యవాదాలు.

అశోక్ పాపాయి said...

ఫొటోస్ బాగున్నాయండి.

శ్రీలలిత said...

అశోక్ పాపాయ్ గారూ,
ధన్యవాదాలండీ..