Pages

Tuesday, May 12, 2015

చెర్రీబ్లూజమ్స్..చెర్రీబ్లూజమ్స్..


    ప్రకృతి యెంత అందమైనది. ఆ ప్రకృతిలోని ప్రతి అణువూ భగవంతుని చరణాలను చేరాలని యెంత తాపత్రయపడుతుందీ..   ఈ సుకుమార సుమాల పేరు చెర్రీ బ్లూజమ్స్ ట. పేరులోనే యెంతటి సౌకుమార్యం!  యే భాషయితేనేం, యే పేరయితేనేం వీటి తీరు వింటే మనసు ముద్దమందారమవుతుంది.

   యేడాదికి ఒక్కసారి, అదికూడా కేవలం రెండువారాలు మాత్రమే పూస్తాయిట ఈ పూలు. యేడాదిమొత్తం సౌందర్యారాధకులు ఈ రెండువారాలకోసం వేచి చూస్తుంటారుట. పార్కుల్లో బారులు తీరి నిలుచుని ఈ సుమసోయగాన్ని చూసి పరవశించిపోతారుట.
  అటువంటి విరులను వీక్షించే భాగ్యం నాకు మా అమ్మాయివాళ్ళింట్లో దక్కింది. వాళ్ళింటి వెనకాల డెక్ కి ఆనించి వేయించింది వీటిని మా అమ్మాయి.

   నేను ఇక్కడికి వచ్చేటప్పటికి చెట్టు నిండుగా ఆకు కనిపించకుండా పూలు. లేతగులాబీరంగులో, ముట్టుకుంటే ముడుచుకుపోయేట్టుండే ఉలిపిరికాగితమంత పల్చని రేకులతో, ముద్దగా, ముగ్ధమనోహరంగా, తలవంచి భూమాతను ప్రణమిల్లుతున్నంత వినయంగా తలవంచి ఊగుతున్న ఈ పూలగుత్తులను చూస్తుంటే భావాన్ని ప్రకటించే భాషరాక మనసు మూగపోయింది.
 
 

    యిన్నినాళ్ల యెదురుచూపులు యిందుకోసమే అన్నట్లు రెండువారాలు కాగానే రేకులు భూమాతను తాకడం మొదలవుతుంది. పూలజల్లు కురిసినట్లు పల్చటి, సున్నితమైన రేకులు, చిరుగాలి తాకిడికే అల్లనల్లన కదిలి మెల్లగా జాలువారుతుంటే ధరణికి ప్రణమిల్లుతున్న వనదేవతయేమో అనిపిస్తుంది.
 
 
 
 
 ఒక్క జన్మచాలదా ఆ భగవంతుని ధ్యానించుటకు
ఒక్క గడియ చాలదా ఆ దేవుని పాదాలచెంత మన మనసును అర్పించుకుందుకు
ఒక్క క్షణం చాలదా ఆ దేవదేవుని మ్రోల వాలడానికి ఈ విరుల బ్రతుకుకు
అంతకన్న ధన్యమైన జన్మ మరి వుండదు కాక వుండదు కదా.
 
------------------------------------------------------------------------------------
 

 

 

Tuesday, May 5, 2015

ఆవకాయదె యెపుడు అగ్రపూజ...    మాలికపత్రిక సంపాదకురాలు జ్యోతివలబోజు స్వదస్తూరీతో అందరినీ ఆవకాయ గురించి వ్రాయమన్నారు. అసలే మే నెల. కొత్తఊరగాయలకాలం. ఆవకాయ పెట్టడం వచ్చినవాళ్ళూ, రానివాళ్ళూ, దానిని ఆస్వాదించేవాళ్ళూ, దాని పేరు చెప్పుకుని మురిసిపొయేవాళ్ళూ, కొత్తావకాయ అందని దూరదేశాల్లో వున్నవాళ్ళూ అందరూ స్పందించి ఆవకాయ గురించి వారి వారి అభిప్రాయాలు వెల్లడించారు. అందులొ నేనూ వున్నాను. నా దస్తూరీతో వచ్చిన ఈ కవిత మాలిక మే నెల పత్రికలో వచ్చింది. ఆ దస్తూరీ యెవరికైనా అర్ధమవకపోతే విడిగా చదువుకుంటారని నా బ్లాగ్ లో టైప్ చేసి కూడా పెడుతున్నాను. అందరూ ఆస్వాదిస్తారు కదూ..

 
 
 ఆవకాయదె యెపుడు అగ్రపూజ…

                  

రంగు చూడంగనే లాలాజలాలూరు

రుచులు చెప్పగమరి బ్రహ్మ దిగునె

యేటుచూసి యెటువిన్న దాని నామమె గదా

ఆవకాయదె యెపుడు అగ్రపూజ//

 

నూపప్పునూనెతొ చద్దన్నం కలిపినా

కమ్మనీ నెయ్యేసి వేడన్నం కలిపినా

జఠరాగ్నిలో వేడి అంతెత్తు లేవదే

ఆవకాయదె యెపుడు అగ్రపూజ//

 

మెంతి, మాగాయలు తమ్ముళ్ళుకాగా

గోంగూర, చింతలు పక్కోళ్ళు కాదే

ఉసిరికాయెప్పుడూ యెక్కడో వుండదే

ఆవకాయదె యెపుడు అగ్రపూజ//

 

శాకపాకంబులు యెన్నెన్నివున్నా

పిండివంటలు పది తెచ్చి వడ్డించినా

ఆవకాయయె లేని అదియేమి విందయా

ఆవకాయదె యెపుడు అగ్రపూజ//

 

అతిథులొచ్చినపుడు అందుబాటుగనుండు

కూరలేనపుడు అదియె చేదోడు యగును

పప్పులో కలిపితే చెప్పలేరా రుచిని

ఆవకాయదె యెపుడు అగ్రపూజ//

 

ఐపాడ్లు, ఐఫోన్ల దిగుమతులకన్న

ఇటునుంచి పంపించు ఈకాయ మిన్న

పెరిగె పచ్చళ్ల ప్యాకింగు ప్రతివీధిలోన

ఆవకాయదె యెపుడు అగ్రపూజ//

--------------------------------------------------------------------------------

మాలిక పత్రిక సౌజన్యంతో..