Pages

Monday, November 30, 2009

పదహారేళ్ళ వయసు
ఓ నవతరమా....

పదహారేళ్ళ వయసంటే పంచరంగుల కలలు కనే
బంగారు ప్రాయమనే భ్రమలో నీవున్నావా...
కాదమ్మా కాదులే కఠినమైన వాస్తవమది
కనులు తెరచి..నిజమూ తెలిసీ
నీ భవితను దిద్దుకో....

కాకమ్మ కథలలోని కలల రాకుమారునికై
ఆదమరచి నిదురించే అలసత్వం తగదమ్మా
కంప్యూటరు యుగంలోన క్షణ క్షణం మారిపోవు
పోటీకై తట్టుకునే ధీరమతివి కావాలి...

విరిసీ విరియని పూవుల అందాలను తిలకించీ
మనసున మల్లెల నూపే తలపులు వదిలెయ్యమ్మా
పరిశ్రమల కాలుష్యం మనిషిని పీల్చేస్తుంటే
పూవులోని ఏ అణువో విరుగుడుగా కావాలని
నిరంతరం శ్రమించే శాస్త్రవేత్త కావాలి...

మధుమాసం తొలిప్రొద్దున కోయిలతో గొంతు కలిపి
కూ కూ రాగాలు పలుకు సమయం నీ కేదమ్మా
వేకువనే పరుగులతో ఉరకలతో మొదలయ్యే
జీవన గానం నువ్వు చెయ్యక తప్పదు తల్లీ..

తరతరాలుగా వచ్చిన సంస్కృతి సాంప్రదాయాలను
అయినచోట విస్తరించి కానిచోట కత్తిరించి
అందించాం మిమ్మల్నే అందల మెక్కించాలని
మే నడిచిన ముళ్ళబాట మీ పాలిటి రాచబాట
కావాలని ఆశిస్తూ అట్లాగే దీవిస్తూ


నింగినంటు సౌధానికి కనపడని పునాదులమై
భావితరపు జీవానికి హవిస్సులో సమిధలమై
తరలిపోవు మా తరం... నిలబడండి నవ తరం..
తరలిపోవు మా తరం... నిలబడండి నవ తరం..


*****************************************************************

Monday, November 23, 2009

శారదాస్తుతి(అచ్చంగా నాదే)శారదాదేవిని నా స్వంత మాటలతో స్తుతించే భాగ్యం కలిగించినందుకు అందరికీ కృతఙ్ఞతలు. ప్రమదావనం లో చేర్చుకోండీ అని జ్యోతీగారి నడిగితే చేయి పట్టుకు లాక్కొచ్చి ఈ బ్లాగ్ లోకంలో కూలేసారు. అందరూ ఎన్నెన్నో రాసేస్తున్నారు. అంతా కొత్త. అహా రాసెయ్యొచ్చుకదాని నాకు తోచినవి రాసేస్తూపోయాను. కొన్నాళ్ళకి తెలిసింది. అలాకాదూ, మనవూ అందరివీ చదివి కామెంట్లు రాయాలీ, మనం రాసిన దాని మీద కామెంట్లు రాసిన వారికి జవాబు లివ్వాలీ అని. మరి కొన్నాళ్ళకి కవితల మీదకి దృష్టి పోయింది. ఇప్పుడు మరువం ఉష గారు పద్యం రాయడానికి ప్రయత్నించడం చూసి నేనూ ప్రయత్నించాను. ఆచార్య ఫణీంద్రులు దానిని సరిదిద్దారు. మీరూ చూసి ఎలా ఉందో చెప్పండి. ఆచార్య ఫణీంద్రులకు హృదయపూర్వక కృతఙ్ఞతలు బ్లాగ్ ముఖంగా తెలియచేసుకుంటున్నాను.

ఇది నేను వ్రాసిన మొదటి పద్యం ..
ఆచార్య ఫణీంద్రగారికి నమస్కారములు. చంపకమాల పద్యం ఎలా రాయాలో మీరు చెప్పాక ఒకసారి ప్రయత్నించి చూడాలనిపించింది. ఇది నా మొదటి ప్రయత్నం. తప్పులు చెప్పితే సరిదిద్దుకుంటాను. ధన్యవాదములతో, శ్రీలలిత.

జిలిబిలి జుంటి తుమ్మెదల జుమ్మను నాదపు గాన మాధుర్య
మొలికెడి తీపి తేనియను మా మది నిండుగ నింపి కావవే
పలుకులరాణి నీ వలన పాడిన పాటలు వేయి తీరులై
నిలనిటు మాదు కోరికల నిండుగ తీరుచు తల్లి శారదా.


శ్రీ ఆచార్యఫణీంద్రుల జవాబు...

శ్రీలలిత గారు !
మొదటి ప్రయత్నమైనా, మొదటి పాదం ఎంత అందంగా ఎత్తుకొన్నారు !
మీకు నా హృదయ పూర్వకాభినందనలు !
అయితే, చిన్న చిన్న దోషాలు సరిదిద్ది, మెరుగులు దిద్దుతాను.

జిలిబిలి జుంటి తుమ్మెదలు చేసెడి నాదపు గాన మాధురిన్ ..."
ఒలికెడి తీపి తేనె రుచి ఉల్లము నిండుగ నింపి కావవే !
పలుకుల రాణి నీ కృపను పాడిన పాటలు వేయి తీరులై
నెలకొను మాదు కోరికల నిండుగ తీర్చుము తల్లి శారదా !


ఆ శారదాదేవి అందరికీ సకల విద్యలూ అందించాలని కోరుకుంటున్నాను.
#################################################################

Wednesday, November 11, 2009

మన ఖర్మఆమె దీపిక. ఒక రాజకీయ నాయకురాలు. రాష్ట్రం లో చాలా పరపతి గల మంత్రిణి.
అతను రాజ్. సుమారు ముఫ్ఫై సంవత్సరాలనుంచీ హీరోగా చలనచిత్ర పరిశ్రమని ఏకఛ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న హీరో. పిచ్చి అభిమానులు అతనిని వెర్రిగా ఆరాధిస్తూనే ఉన్నారు.
వాళ్ళిద్దరూ భార్యాభర్తలు.
చాలాకాలం తరవాత వాళ్ళిద్దరికీ కాసేపు మాట్లాడుకునే సమయం చిక్కింది.
దీపిక--ఏమిటివాళ..ఇంట్లోనే ఉన్నారు? షూటింగ్ లేదా?
రాజ్-- ఇవాళేమిటో అలసటగా ఉంది. ఇంట్లోనే ఉందామనుకుంటున్నాను.
దీపిక-- అయితే సరే.. నేనూ ఇవాళ ప్రోగ్రామ్స్ కాన్సిల్ చేసుకుని ఇంట్లోనే ఉంటాను. అయినా ఇంక మీరు ఆ హీరో వేషాలు మానేసి కారెక్టర్ రోల్స్ వేస్తే బాగుంటుందేమో..ఆ స్టెప్పులూ అవీ ఈ వయసులో మీరు వెయ్యలేకపోతున్నారు.
రాజ్-- నేను హీరోగానే వెయ్యాలనుకుంటున్నాను. రిటైర్ అయినా హీరో లాగే అవుతాను.
దీపిక-- ఎన్నాళ్ళు ఉండగలరు హీరోగా
రాజ్---ఇంకెన్నాళ్ళు.. మన సూరజ్ అందుకునేవరకూ..వాడినీ ఈ ఫీల్డ్ లోకే దింపేస్తే బాగుంటుంది కదా..
దీపిక---మనబ్బాయి సూరజ్ మెడిసిన్ చేద్దామనుకుంటున్నాడండీ... ఏదో ఓ రాష్ట్రం లో సీటు కొందాం.
రాజ్----సూరజా.. మెడిసినా.. ఎందుకు?
దీపిక---అదేంటండీ అలా అంటారు? వాడికి డాక్టరీ చదివి, రోగులకి సేవ చెయ్యాలనే ఆశ ఎప్పటినుంచో ఉందండీ.. ఆమాత్రం డబ్బులు కట్టగలం కదా మనం...
రాజ్---పిచ్చిదానా, డబ్బులు కట్టలేక కాదు. అంత కష్టపడి వాడు ఆ సేవలు చెయ్యవలసిన ఖర్మం ఏమొచ్చిందిప్పుడు?
దీపిక--మరి..ఇంజనీరింగ్ చదివిస్తారా..
రాజ్-- అది మటుకు ఎందుకు? కాస్త నాలుగురోజులకోసారి షూటింగ్ కి వస్తూండమను. మరో ఆరు నెలల్లో వాడిని హీరోగా పెట్టి సినిమా తీసేద్దాం.
దీపిక--కాని వాడికి ఏక్టింగ్ అంత ఇష్టం లేదనుకుంటానండీ..
రాజ్---ఇష్టం తెచ్చుకోవాలి. ఇన్నాళ్ళ నుంచీ ఈ ఇండస్ట్రీ లో ఉన్నాను. నా పరపతి తో వాడు కూడా పెద్ద హీరో అయిపోతాడు.
దీపిక-- కాని వాడి ఫేస్ ఫొటోజెనిక్ కాదుకదా.. హీరో గా పైకి రాగలడా..జనాలకి నచ్చుతాడా
రాజ్-- నచ్చక ఏంచేస్తాడు? మొదటి సినిమా చూసి తిట్టుకుంటారు. రెండో సినిమా చూసి విసుక్కుంటారు. మూడో సినిమా నుంచి అలవాటు పడిపోతారు. నాలుగో సినిమాకి ఉత్సవాలు చేస్తారు. ఈ జనం నా పిచ్చి లో ఉండగానే వాడిని ఫీల్డ్ లో దింపెయ్యాలి.
దీపిక--సినిమా తియ్యడంతో అయిపోతుందా.. సక్సెస్ అవద్దూ
రాజ్---ఎందుకు అవదూ.. మన థియేటర్ లే బోలెడున్నాయి ఆడించేస్తే సరి. అదీ కాక ఒక ఆర్నెల్లు పోయాక ఒక టి.వీ. చానల్ కూడా మొదలుపెడదామనుకుంటున్నాను. అందులో అరగంట కొకసారి మనవాడి మొహం చూపిస్తుంటే సరి. కేప్టివ్ ఆడియన్స్ కదా.. అదే కుర్చీలో కట్టిపడేసిన ప్రేక్షకులు కదా.. కొన్నాళ్ళకి వాడే నచ్చ్చుతాడు.
దీపిక-- మరి మన నీల సంగతో.. దాన్ని కూడా సినిమా ఫీల్డ్ లోనే పెడదామా..
రాజ్---ఛఛఛ...వద్దు. వద్దు. మన ఆడపిల్లల్ని ఇలా ఎక్స్పోజింగ్ లోకి దించొద్దు.
దీపిక-- మరి,, దాన్ని మెడిసిన్ చదివిద్దామా?
రాజ్-- మెడిసిన్ చదివి అందరికీ సేవలు చేసే ఖర్మ దానికెందుకు? అలాగ అదేపనిగా చదువుతూ, సేవలూ, సంతృప్తులూ అని ఆలోచించే కొంతమంది పిచ్చివాళ్ళుంటారు. అంతగా అయితే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టేసి, అలాంటి పిచ్చున్న పెద్ద పెద్ద స్పెషలిస్ట్ లని ఎంప్లాయ్ చేసి, దాన్ని సూపర్వైజ్ చేస్తుందిలే. ఈ లోపుల పార్లమెంట్ మెంబర్ ఉన్నారు చూడు...సింహాలు.. వారి అబ్బాయి తో సంబంధం చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా...
దీపిక---ఆయన మన పార్టీ కాదు కదా..
రాజ్-- అందుకే.. ఆయన కుడి పార్టీ...ఆయన కొడుకు ఎడమ పార్టీ.. నువ్వు మూల పార్టీ.. రేపు ఎలక్షన్లలో ఎటుపోయి ఎటొచ్చినా మనమ్మాయి గెలిచిన పార్టీ లోకి దూకెయ్యడానికి వీలుగా ఉంటుంది కదా...
దీపిక--- నిజమేనండోయ్... ఈ సంగతి నాకు తోచనేలేదు. మరి జనాలు నమ్ముతారంటారా
రాజ్---- అదే మరి. పదవీ, అధికారం, గ్లామరూ మన చేతిలో ఉంటే ఇన్ని కోట్ల మంది జీవితం మన చేతిలో ఉన్నట్టే. ఇలాగ పదవినీ, అధికారాన్నీ. గ్లామర్ నీ మన చేతిలోకి తీసుకోవడం మన అదృష్టం. ప్రతి రోజూ మనం వేసే పిచ్చి టేక్స్ లు కడుతూ, పిచ్చి చట్టాలు పాటిస్తూ, ఇడియట్ బాక్స్ లో పిచ్చి ప్రోగ్రాములు చూస్తూ ఉండడం వాళ్ళ ఖర్మం.
దీపిక---బలే..బలే...ఈ మాట నాకు బాగా నచ్చిందండీ..
రాజ్--ఏమాట?
దీపిక--అదే... మన అదృష్టం అనేకన్న వాళ్ళ ఖర్మం అనే మాట..
రాజ్---హహహహ... అంతే మరి. డెమాక్రసీ కదా. మెజారిటీ వాళ్ళ ఖర్మే....########################################################################################

Thursday, November 5, 2009

ఉషోదయంలో భూపాలరాగంపల్లవి-- ఉషోదయంలో భూపాలరాగం
వసంత ఋతువున కోకిల గానం
మధుర మధురమో సుధా భరితమో
మాటల కందని దివ్య భావమో..// ఉషోదయంలో//

అనుపల్లవి--చివురులు మేసిన కోయిలా
బోసి నవ్వుల పసిపాపలా
మీటెను మనసును వీణలా
ఇక కురిసెను వెన్నెల వానలా..//ఉషోదయంలో//

చరణం-----అలసిన కన్నుల అలమేలుమంగలా
అలకలు తీరిన సత్యభామలా
రాముని చూసిన క్షణము సీతలో
కలిగిన వలపుల పులకరింతలా..


ఉషోదయంలో భూపాలరాగం
వసంత ఋతువున కోకిల గానం
మధుర మధురమో సుధా భరితమో
మాటల కందని దివ్య భావమో..//ఉషోదయంలో//


**********************************************************

స్వీటూ---హాటూ

వనభోజనాల సమయానికి నాకు రావడం కుదరలేదు. మన్నించాలి. అంతా సద్దుమణిగాక ఇప్పుడు వంటల గొడవలెందుకు అనుకోకండి. మనకి మూడుపూటలూ అన్ని రకాల రుచులూ కావాలి కదా. అందుకే నా పాక శాస్త్ర నైపుణ్యం కూడా మీకు చూపిద్దామని ఈ ధైర్యం చేస్తున్నాను. ఆ సందర్భంలో కాస్త దవడ ఆడింపుకి అంటే స్వీట్ హోమ్ లో విమల అన్నట్లు ఇంట్లో తింటే వీధిలోకి వినపడే స్వీటు, హాటు ఎలా చెయ్యాలో మీకు చెప్పదల్చుకున్నాను. అలాగని ఇవేమీ అషా మాషీ వనుకోకండి. ఈ స్వీటు, హాటు రెండూ కూడా బాంబినో కంపెనీ వారు నిర్వహించిన వంటల పోటీలలో నాకు ప్రథమ బహుమతులను తెచ్చిపెట్టాయి. హహహహ్.. ఇక మొదలెట్టండి మరి..

బాంబినో గవ్వలు


కావల్సిన పదార్ధాలు:
బాంబినో సేమ్యా పేకట్- - ఒకటి
పంచదార-------------పావు కిలో
గోధుమ పిండి-----వంద గ్రాములు
ఏలకుపొడి-------ఒక టీ స్పూను
నూనె----వేయించడానికి సరిపడినంత

చేసే విధానం—
ముందుగా సేమ్యాని మిక్సీలో వేసి రవ్వలాగ పొడి చేసుకోవాలి. అందులో గోధుమపిండి వేసి నీళ్ళు పోసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. ఆ పిండి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, గవ్వలపీట సహాయంతో గవ్వలుగా తయారుచేసుకోవాలి. ఈ మధ్య కొంతమంది ఇళ్ళల్లో ఈ గవ్వల పీటలు ఉండడంలేదు. ఖంగారు పడకండి. దానికో ఉపాయం ఉంది. ఫోర్క్ ఉంటుంది కదా.. దాని సహాయంతో కూడా గవ్వలు చేసుకోవచ్చు. అలాగ తయారుచేసుకున్న గవ్వలని నూనెలో దోరగా వేయించుకోవాలి.
పంచదార లో తడిసేదాకా నీళ్ళు పోసుకుని బాగా ముదరపాకం పట్టుకోవాలి. అందులో ఏలకుపొడి వేసుకున్నాక ఈ వేయించి పెట్టుకున్న గవ్వలను
అందులో వేసి, స్టౌ మీంచి దించేసి బాగా కిందా మీదా కలిపేసుకోవాలి. అప్పుడు పంచదారంతా గవ్వల చుట్టూ పట్టుకుంటుంది. ఇంకేముంది..తినెయ్యడమే..(ఆగండాగండి.. కాస్త చల్లారనివ్వండి మరి)
ఈ లోగా మనం హాటు చేసేసుకుందాం....


మాకరోని మిక్చర్


కావలసిన పదార్ధాలు----
మాకరోని పేకట్--ఒకటి
పల్లీలు(వేరుసెనగపప్పులు)--వంద గ్రాములు
పొట్నాల పప్పు(గుల్ల సెనగపప్పు)--వంద గ్రాములు
చిన్న చిన్న బేకరీ బిస్కట్లు(జీడిపప్పు ఆకారంలో ఉంటాయి)(కావాలంటే వేసుకోవచ్చు)
కరివేపాకు--రెండు కట్టలు
ఉప్పు---తగినంత
ఎండు మిరపకాయల కారం పొడి ---తినగలిగినంత
జీలకర్రపొడి---ఒక టీ స్పూన్
నూనె--వేయించడానికి సరిపోయేంత.
చేసే విధానం--
మాకరోనీ, పల్లీలు, కరివేపాకు ఆకుదూసి, అన్నీ విడివిడిగా వేయించుకోవాలి.
ఒక బౌల్ లో వేయించుకున్న వాటితోపాటు పొట్నాలపప్పు, ఉప్పు, కారం, జీలకర్రపొడి అన్నీ బాగా కలుపుకోవాలి. అంతే..ఎంతో రుచికరమైన బాంబినో మిక్చర్ రెడీ..

ఇక కానివ్వండి మరి....


##################################################