Pages

Saturday, December 31, 2011

Tuesday, December 27, 2011

మంచినీరు...

మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన "పిడపర్తివారు-కథలూ-గాథలూ" పుస్తకం లోని మరో కథ.
పిడపర్తివారి వాక్శుధ్ధికి తార్కాణంగా నిలిచే కథ ఇది...

మంచినీరు...


నూట యాభై సంవత్సరాల క్రితం మాట.

తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం పట్టణానికి చేరువలో నున్న సోమేశ్వరం గ్రామంలో వంశ పరంపరాగత జ్యోతిర్విద్యా సంపన్నులు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు నివసిస్తూండేవారు. వారి ప్రతిభ దేశ దేశాల వ్యాపించి అనేక కథల రూపంలో యింకనూ అక్కడక్కడ నిలిచిపోయింది. వారి ప్రతిభ కొక మచ్చు తునక ఈ క్రింది గాథ.

కానూరు గ్రామానికి సమీపంలో కానూరు అగ్రహారం అనే బ్రాహ్మణ అగ్రహార మొకటి యిప్పటికీ ఉన్నది. అందు సంపన్న బ్రాహ్మణ గృహాలు ఆ రోజుల్లో నూరూ నూటయాభైదాకా ఉండేవి. ఆ అగ్రహారం గోదావరి గట్టుకు చేరి ఉన్నప్పటికీవారు ఎక్కడ నూయి తవ్వినా ఉప్పునీరే పడేది కాని మంచినీరు పడేది కాదు.

ఒకానొక సమయంలో బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు ఏదో పనిమీద సమీప గ్రామానికి వచ్చి ఆ ఊరు మీదుగా తిరిగి వెడుతున్నారు. ఆ సమయంలో ఊరు పెద్దలందరకూ ఒక ఊహ కలిగింది. పదిమంది పెద్దలూ కలిసి వెంటనే శాస్త్రిగారిని కలుసుకోవాలని వెంబడించేరు.

ఆయన ఊరు చివరకు చేరుకునేసరికి ఆయన్ను కలుసుకుని "నమస్కారమండీ " అని పలుకరించేరు.

వెంటనే శాస్త్రిగారు నిలబడిపోయి " ఏమిటి? అగ్రహారంలోని పెద్దలంతా యిలా దయచేసేరు?" అని అడిగేరు. వారిలోని పెద్దవారొకాయన యీ విధంగా శాస్త్రిగారికి మనవి చేసేరు.

"శాస్త్రిగారూ! ఈ ఊరిలో మేము ఎక్కడ నూయి తవ్వినప్పటికీ ఉప్పునీరే కాని మంచినీరు పడటం లేదు. గోదావరికి సమీపంలో నున్నప్పటికీ మంచినీరు పడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రతిరోజూ యీ గ్రామంలోని స్త్రీలు గోదావరినదికి పోయి మంచినీరు తెచ్చుకోవడానికి చాలా శ్రమ పడుతున్నారు. అందులోనూ వేసవికాలంలో యిసుక తిప్పలలో నడచి నదిలో నీరు తెచ్చుకోవలసి వస్తోంది. యి పరిస్థితుల వలన మేము మంచినీటికై చాలా కష్టపడుతున్నాము. మాకు మీరే భగవత్తుల్యులు. మేము ఎక్కడ నూయి తవ్వుకుంటే మంచినీరు పడుతుందో సెలవిస్తే అక్కడ తవ్వుకుంటాం. దయచేసి మా కోరిక మన్నించండి. " అన్నారు.

శాస్త్రిగారు ఒక ముహూర్తకాలం ఆలోచించారు.
తాను నిల్చున్న స్థలాన్ని తన కుడిచేతి తర్జనితో చూపి " ఇక్కడ త్రవ్వండి. భగవత్కృప కలుగుతుంది." అని చెప్పి పెద్దలవద్ద సెలవు తీసుకుని వారి మార్గాన వారు వెళ్ళేరు.
అక్కడ గుర్తు పెట్టుకుని నూయి తవ్వించేరు ఆ ఊరివారు. పరిశుభ్రమైన నీరు పడింది. ఆ ఊరి ప్రజల కష్టం తొలగిపోయింది.
ఇప్పటికి కూడా ఆ నూయి ఒక్కటే మంచినీటి నూయి ఆ అగ్రహారానికి.


---------------------------------------------------------------------------------------------

Sunday, December 4, 2011

దైవనిర్ణయం...



దైవనిర్ణయం...

మా నాన్నగారు వ్రాసిన "దైవనిర్ణయం" అనే ఈ కథ ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురించబడింది.
ఆంధ్రపత్రిక ఉగాది సంచికలోనూ పునర్ముద్రించబడింది.
దీనిని మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వారు ప్రచురించిన
"పిడపర్తివారు-కథలూ-గాథలూ" అనే పుస్తకంలో పొందుపరిచారు.


"లుప్తమాసమున్ వమ్మున్ జేయ పోరాడి
విశ్వపతి పాడాయెన్...."
(తిరుపతి వెంకటేశ్వరులు)

నూరేళ్ళక్రితం మాట!

గోదావరిజిల్లాలోని రామచంద్రపురం తాలూకాకు చెందినది కోటగ్రామం. ఆ గ్రామంలో ఇంద్రకంటి విశ్వపతి శాస్త్రిగారు సకలవిద్యా సంపన్నులూ, సదాశిష్య పరివృతులూను. ఒకనాటి సాయంకాలం గోధూళివేళ శాస్త్రిగారూ, శిష్యులూ సంధ్యావందనాలు నిర్వర్తించుకుంటున్నారు.

"విశ్వపతిశాస్త్రిగారూ!" అని జలదగంభీరస్వరంతో ఒక పిలుపు వినవచ్చింది.
శాస్త్రిగారి నయనాలనుండి ఆఙ్ఞ తీసుకున్న శిష్యుడు బ్రహ్మతేజో సంపన్నుడైన ఆ బ్రాహ్మణోత్తముని లోనికి ప్రవేశపెట్టేడు.
ఆయనను చూచిన తక్షణం శాస్త్రిగారు సంతోషముతో "ఓహో! సీతారామశాస్త్రిగారా! ఎంతటి అదృష్టవంతులం. మీ దర్శనం దొరికిన యీ రోజు చాలా సుదినం. దయచేయండి. ఎక్కడనుండి రాక?" అన్నారు.
"బూరాడపేట అగ్రహారం నుంచేనండి". అని సీతారామశాస్త్రిగారు సమాధానమిచ్చేరు.
శాస్త్రిగారి సతీమణీ తెచ్చిన దోసకాయచెంబులోని ఉదకంతో పాదప్రక్షాళన కావించి దంపతుల కుశలప్రశ్నాదికములకు సమాధానముల నిచ్చిఅరుగుపై నున్న చాపమీద కూర్చున్నారు పిడపర్తి సీతారామశాస్త్రిగారు.

జ్యోతిష సిధ్ధాంత భాగంలో అసమాన ప్రఙ్ఞావంతులూ, వంశ పరంపరాగత జ్యోతిర్విద్యా సంపన్నులూను వారు. సిధ్ధాంతభాగంలో వరాహమిహిర, భాస్కరాచార్య, గణేశ దైవఙ్ఞులకేమాత్రమూ తీసిపోరని దేశంలో పేరుగాంచిన అనుపమ విద్యావంతులూ, అఖండ కీర్తి సముపార్జితులూ అయిన పిడపర్తి చలమయ్యశాస్త్రిగారికి అన్నగారు.

ఆ రాత్రి భోజనానంతరం విశ్వపతిశాస్త్రిగారూ, సీతారామశాస్త్రిగారూ కూర్చుని మాట్లాడుకున్న విషయాల్లో మన కథకు సంబంధించినవి యీ క్రింది రెండు విషయాలు.

మొదటిది: సీతారామశాస్త్రిగారు వచ్చే సంవత్సరం పంచాంగం పూర్తిచేసి కొన్ని ధర్మశాస్త్ర విషయాలను చర్చించి నిర్ణయం చేయడానికని సోదరుడు చలమయ్యశాస్త్రిని కలుసుకోవడానికి దువ్వగ్రామం వెడుతున్నారన్నది.
రెండవది: రామచంద్రపురం రాజావారు వచ్చే సంవత్సరం పంచాంగం వ్రాసి యిమ్మని విశ్వపతిశాస్త్రిగారిని కోరేరనీ, అందుకు ఆయన తన కుమారుడైన రామశాస్త్రినీ, శిష్యుడైన వెంకటశాస్త్రినీ నియమించేరన్నది.

ఈ సంభాషణంతా వింటున్న రామశాస్త్రికీ, వెంకటశాస్త్రికీ ఒకే విధమైన ఆలోచన తట్టింది. ఇద్దరూ ఆలోచించుకున్నారు. రెండు మూడు మాసాలు కష్టపడనవసరం లేకుండా వారికి అప్పచెప్పిన కార్యం చేయడానికి ఒక ఉపాయం వారికి తోచింది. చిన్న వయసు వారవడం చేత గ్రంథచౌర్యంలోని దోషాతిశయాన్ని వారు గుర్తించలేకపోయారు.

మరునాడు ఉదయం విశ్వపతిశాస్త్రిగారూ, సీతారామశాస్త్రిగారూ గోదావరి స్నానానికి కోటిపల్లి రేవుకు వెళ్ళి వచ్చి దేవతార్చనలు ముగించి భోజనం పూర్తిచేసేటప్పటికి సీతారామశాస్త్రిగారి అంగవస్త్రంలో చుట్టబడి ఉన్న పంచాంగానికి పూర్తి నకలు తయారుచేసేరు రహస్యంగా యితర శిష్యుల సహాయంతో రామశాస్త్రీ, వెంకటశాస్త్రీను. భోజనానంతరం కొంచెంసేపు విశ్రమించి సీతారామశాస్త్రిగారు అందరివద్దా సెలవు తీసుకుని కోటగ్రామం నుండి బయల్దేరి వెళ్ళేరు.


-2-

భద్రాచల రాముని దర్శనం చేసుకుని రెండు మాసాలలో తిరిగి వచ్చిన విశ్వపతి శాస్త్రిగారు తనకుమారుడు, శిష్యుడు తయారుచేసిన పంచాంగం చూచి వారి ప్రఙ్ఞకు చాలా సంతోషించేరు. ఏదో తిథుల వరకు పూర్తిచేసి ఉంటారేమోనని అనుకున్న శాస్త్రిగారికి గ్రహస్ఫుటాలు, సుముహూర్తాలూ వగైరా యావత్తు గ్రంథం సిధ్ధంకావడం చూసేసరికి ఆనందం పట్టలేక కుమారుణ్ణి, శిష్యుణ్ణి చాలా అభినందించేరు.

వెంటనే ఒక శుభ ముహూర్తాన ఆ పంచాంగం తీసుకునిపోయి రామచంద్రపురంలొ రాజావారికి సమర్పించేరు శాస్త్రిగారు నిండు దర్బారులో. రాజావారు చాలా సంతోషించి శాస్త్రిగారిని ఉచితరీతిని సత్కరించేరు.

ఆ సత్కారాల నమ్దుకుని తన్మయులై యున్న శాస్త్రిగారితో దివానుగారు-
"శాస్త్రిగారూ! వచ్చే సంవత్సరం విశేషాలేమైనా రాజావారికి విన్నవించండి" అన్నారు.
" ఆ ఏమున్నాయండి మామూలే" అంటూ విశ్వపతిశాస్త్రిగారు వర్షయోగాలూ, ధరవరలూ, పంతల పరిమితి వగైరా వివరిస్తూ ఒక్క అర్ధగంటసేపు ప్రస్తావించేరు.

అప్పటికే రాజావారి ఆస్థానానికి పిడపర్తి చలమయ్యశాస్త్రిగారు చేసిన పంచాంగం ప్రతి చేరింది. ఆస్థానజ్యోతిష్కులు ఆ పంచాంగాన్ని చూసి అందలి విశేషాలను యిదివరకే రాజావారికి సమగ్రంగా తెలియపరచియున్నారు.

అందువల్ల విశ్వపతిశాఅస్త్రిగారు చెప్పినదంతా విన్న రాజావారికి అందులో లుప్తమాసం ప్రస్తావన రాకపోవడం చాలా వింతగా తోచింది. వెంటనే శాస్త్రిగారి నుద్దేశించి యిల్లా అన్నారు.

"ఏమండీ శాస్త్రిగరూ! వచ్చే సంవత్సరం లుప్తమాసం ఉన్నదట కాదా?"

"ప్రభువులు కరుణించాలి. తమ కెవరో తప్పుగా విన్నవించేరు." అన్నారు శాస్త్రిగారు.

"కాదండీ. వచ్చే సంవత్సరం లుప్తమాసమున్నదట. శాస్త్రప్రకారం చూసినట్లైతే వచ్చే సంవత్సరం లుప్తమాసం లేదు." అన్నారు శాస్త్రిగారు.

"అదేమండి అల్లా అంటారు? పిడపర్తి చలమయ్యశాస్త్రిగారే లుప్తమాసమున్నదని వ్రాసేరు. మీరు కాదంటే పోతుందా?" అన్నారు ఆస్థాన జ్యోతిష్కులలో ఒకరు.

శాస్త్రిగారికి గుండెల్లో రాయి పడింది. అయినా ధైర్యంగా యిల్లా అన్నారు.

"చాల్లెండి. మహా తెలిసున్నట్లు చెపుతారేమిటి? మీకేమి తెలుసు సిధ్ధాంతభాగం? సూర్య సిధ్ధాంతం ప్రకారం పంచాంగం చెస్తే లుప్తమాసం రానేరాదు. చలమయ్య శాస్త్రి తప్పుడు త్రోవ తొక్కేడు. అందువల్ల లుప్తమాసం వచ్చిందేమో."

"చలమయ్య శాస్త్రిగారు త్రొక్కిన తప్పుడు త్రోవ ఏమిటండీ?" అన్నారు రాజావారు ఆశ్చర్యంగా.

"చిత్తం మనవి చేస్తా. సూర్యుని చేత మయుని కుపదేశింపబడినదే సూర్యసిధ్ధాంతం. ఇది మూడువేల సంవత్సరాల పూర్వమే వాడుకలో వుండేదని ప్రతీతి. అటువంటి అతి పవిత్రమైన గ్రంథాన్నిబట్టే మన పంచాంగం చేసుకుంటున్నాం. మనది కర్మభూమి. మనకు కర్మ ప్రధానం. అందువలన సూర్యోపదిష్టమైన గ్రంథరీత్యా తయారయిన పంచాంగమునే మనం అనుసరించాలి. చలమయ్య శాస్త్రి సంస్కర్త. ఈ సూర్య సిధ్ధాంతంలోని పథకాలను తన కిష్టము వచ్చినట్లు సంస్కరించి పంచాంగం చేస్తాడు. అది శాస్త్రసమ్మతమెల్లా అవుతుంది? ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు సూర్యసిధ్ధాంత పథకాలను సంస్కరించేయడమే? దానికి తాహతు ఉండనక్కరలేదా? పూర్వం కొంతమంది సంస్కరించేరంటే వారి ప్రతిభ ముందు మన ప్రఙ్ఞ ఏమాత్రం? అందువలన చలమయ్య శాస్త్రి వ్రాసినది శాస్త్ర సమ్మతం కాదని మనవి చేస్తున్నాను. " అన్నారు శాస్త్రిగారు గంభీరంగా.

"శాస్త్ర సమ్మతం కాని సంస్కారం చలమయ్యశాస్త్రిగారు మాత్రం ఎందుకు చేస్తారండి? అయినా ఈ విషయాల్లో అభిప్రాయం వెలిబుచ్చడానికి మేమూ మా బొంట్లూ అర్హులం కాము." అన్నారు రాజావారు చిరునవ్వుతో.

ఆ నవ్వు చూసి ధైర్యం కలిగి "ప్రభువులవారు క్షమించాలి. ఎప్పటికప్పుడు గ్రహాలను దృక్సిధ్ధం చేయడానికి సంస్కారం చేయవచ్చుననీ, అది శాస్త్ర సమ్మతమేననీ పూర్వ గ్రంథాలనుండి ప్రమాణాలను ఇతోధికంగా చూపిస్తూ చలమయ్య శాస్త్రిగారు ఒకసారి రాజమహేంద్రవరంలో ఉపన్యసించేరు. ఏమి పాండిత్యము? ఏమి వాగ్ధాటి? వారు సాక్షాత్తు సూర్యాంశ సంభూతులు. ఆ సభకు కాకతాళీయంగా నేనూ వెళ్ళడం జరిగింది. అది నా అదృష్టం. సంస్కరించడమే శాస్త్ర సమ్మతం కాదనడం భావ్యం కాదని నా మనవి. " అని ఆస్థాన జ్యోతిష్కులలో ఒకరు కొంచెం ధైర్యంగా అన్నారు.

రాజావారు చిరునవ్వుతో విని విశ్వపతి శాస్త్రిగారివైపు దృష్టిని మరల్చేరు. విశ్వపతి శాస్త్రిగారికి సమాధానం చెప్పడం తప్పింది కాదు.

"ప్రభువువారికి నేను విన్నవించేది ఒక్కటే విషయం. మనది కర్మభూమి. మనం సూర్య సిధ్ధాంతాన్ని అనుసరించి కర్మ చేస్తేనే దాని ఫలితాన్ని పొందగలం. అంతేగాని ఎవరికి తోచినట్లు వారు పంచాంగాలు చేస్తే వాటి ననుసరించినవారు కర్మభ్రష్టులు కావడం తధ్యం. గ్రహాలలో ఏ సంస్కారాలు చేసినా సూర్యచంద్రుల్లో చేసిన సంస్కారం మాత్రం పూర్తిగా తిథులను మార్చేస్తుంది. చలమయ్య శాస్త్రి చంద్రునికి కూడ సంస్కార మవలంబిస్తాడు. అది బొత్తిగా శాస్త్ర విరుధ్ధమని మనవి చేస్తున్నాను." అని సమాధానం చెప్పెరు శాస్త్రిగారు.

"ఏమో! ఈ ధర్మ శాస్త్ర విషయాలు మాకు అర్ధంకావు. అయినా చలమయ్య శాస్త్రిగారిలాంటి పండితులు మన దేశంలో చాలా అరుదు. అటువంటి వారు అవలంబించిన తీరు శాస్త్ర సమ్మతం కాదనడం కొంచెం సాహసమేమోనని నా ఊహ." అన్నారు రాజావారు.

"ప్రభువులు తమ ఆస్థాన పండితులనూ, వారి విద్వత్తునూ కించపరుస్తున్నారు. ఏ విషయంలోనైనా సరే చలమయ్య శాస్త్రితో సమాన పాండిత్యం కలవారమని ఋజువు చేసుకోగలం." అన్నారు విశ్వపతి శాస్త్రిగారు.

"ఏ విషయంలొనో యెందుకు? ప్రస్తుతం యీ విషయంలోనే ఇదమిత్థమని తేలకపోతే వచ్చే సంవత్సరం ఏ పంచాంగం అవలంబించడానికీ సందేహంలో పడిపోతాం."

"చిత్తం. ప్రభువువారు యీ విషయం పూర్తిగా విమర్శించి తగిన ఏర్పాటు చేయించి ఒక నిర్ణయానికి వస్తే ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అవసరమైతే చలమయ్య శాస్త్రిగారిని ఇక్కడకు పిలిపిద్దాం." అన్నారు దివానుగారు యింతవరకు మౌనంగా ఉండి.

" ఆ ఏర్పాటు చాలా బాగుంది. ఏమండీ విశ్వపతి శాస్త్రిగారూ! చలమయ్య శాస్త్రిగారిని యిక్కడకు పిలిపించి సభ ఏర్పాటు చేస్తాం. మీకు సమ్మతమేనా?" అన్నారు రాజావారు.

"చిత్తం. ప్రభువుల ఆఙ్ఞను శిరసావహిస్తాను."
అంతటితో ఆ రోజుకు ప్రస్తావన ముగిసింది.


-3-

తణుకు దగ్గర ఉన్న దువ్వగ్రామంలో ఉంటున్న చలమయ్య శాస్త్రిగారు రామచంద్రపురం రాజావారు రమ్మన్నారని తెలియగానే శిష్య సమేతంగా బయల్దెరి రామచంద్రపురం చేరుకున్నారు. జరగబోయే సభను చూడడానికి అనేకమంది రామచంద్రపురంలో చేరేరు. నిర్ణీత సమయానికి సభ యేర్పాటయింది. పిడపర్తి చలమయ్య శాస్త్రిగారు వచ్చె సంవత్సరం లుప్తమాసం ఉన్నదన్న వాదాన్ని సమర్ధిస్తే విశ్వపతి శాస్త్రిగారు దాన్ని ఖండిస్తున్నారు. ఇరువురూ మహా పండితులు. ఆ రోజులలో పాండిత్యం ఏ ఒక్క విషయానికే చెంది ఉండేదికాదు. సర్వతోముఖ పాండిత్యం వారిది. అందువలన చలమయ్య శాస్త్రిగారితో సమానమైన పాండిత్యాన్ని సిధ్ధాంత భాగంలో చూపిస్తున్నారు విశ్వపతిశాస్త్రిగారు.

ఈ విధంగా మూడురోజులు కేసరీద్వయం హోరాహోరిని వాద ప్రతివాదాలతో పోరు సాగించేరు. ఇందులో చలమయ్య శాస్త్రిగారు ఆయన స్వయంగా చేసిన పంచాంగాన్ని సమర్ధించుకుంటున్నారు. విశ్వపతిశాస్త్రిగారు తాము తయారుచేయని పంచాంగాన్ని సమర్ధించుకోవలసివచ్చింది. రాజావారి దర్బారులో మానుషానికన్న మాటలే కాని, చలమయ్య శాస్త్రిగారి ప్రతిభా పాండిత్యమూ విశ్వపతిశాస్త్రిగారికి తెలియకపోలేదు. అందువలన ఆయన వాదంలో ఏదో వెలితి కన్పడుతోంది. అది చలమయ్య శాస్త్రిగారు కనిపెట్టేరు. కాని ఇతరులెవ్వరూ తెలుసుకోలేకపోయేరు. వీరిద్దరూ వాదించుకుంటూ ఉంటే విని తీర్పునిచ్చే సామర్ధ్యం కలవారెవ్వరూ అక్కడ లేకపోయేరు. అందువల్ల ఎవరో ఒకరు రెండవవారి వాదాన్ని ఒప్పుకోవాలి. అంతవరకూ వివాదం సాగవలసిందే.

విశ్వపతి శాస్త్రిగారు తన మాట బీరుపోకుండా ఉండడానికి మాత్రమే వాదిస్తున్నారు. కాని వారి వాదంలో పటుత్వం యెప్పుడో తగ్గిపోయినట్లు చలమయ్య శాస్త్రిగారు గ్రహించేరు. అందువల్ల విశ్వపతిశాస్త్రి తన ఓటమిని తనంత తాను అంగీకరించరనీ అంతవరకూ సభ్యులు తన వాదం శాస్త్ర సమ్మతమైనదని నిర్ధారణ చేయరనీ తెలుసుకున్నారు.

మూడవనాడు సాయంకాలం సభ ముగిసే సమయానికి చలమయ్య శాస్త్రిగారు సభ్యుల నుద్దేశించి యీ విధంగా ఉపన్యసించారు.

"పండితోత్తములారా! ఈ మూడురోజులనుండీ మా ఇరువురి వాదప్రతివాదాలూ మీరు వింటూనే వున్నారు. ఇందులొ ఏది శాస్త్ర సమ్మతమో నిర్ధారణ చేసే సామర్ధ్యము గలవారు లేని కారణంచేత ఈ విషయం యిల్లా ముగియవలసి వస్తోంది. ఒక నిర్ణయం జరగలేదు. కాని ఒక మనవి. మా వాదములలోని సత్యాన్ని నిరూపించే సమర్ధులు యీ సభలో లేకపోవచ్చును. మానవులలోనే లేకపోవచ్చును. కాని భగవంతుడు లేడా? ఆయనకా సామర్ధ్యము లేదా? ఆయన సర్వాంతర్యామి కదా? ఆయన నిర్ణయించడానికి శక్తి కలవాడే కదా? యిందుకు సభ్యులూ, రాజావారూ అంగీకరిస్తే దైవం చేత దీనికి తీర్పు చెప్పిస్తాను. అంతకన్న వేరు మార్గం లేదు. మీరు అనుమతి నివ్వాలి."

దానితో సభలో కలకలం బయల్దేరింది. అందరూ ఆశ్చర్యపోయేరు. "దైవమే నిర్ణయం చేస్తాడన్నది ఒట్టిమాట" అని కొందరన్నారు.

"ఏమో..వారి శక్తి మీకేం తెలుసు? భగవంతుడిని యిక్కడకు రప్పించి పలికించగలరు వారు." అన్నారు కొందరు.

ఈ విధంగా సభలో సంచలనం కలిగింది. దివానుగారు రాజావారితో సంప్రదించి లేచేరు.

"చలమయ్య శాస్త్రిగారూ! మీరు దైవం చేత నిర్ణయం చేయిస్తానన్నారు. దైవనిర్ణయం తప్పక ఆచరణీయమే. దానిని ఎవరూ కాదనరు. అందుకు మీరు సమర్ధులనడానికి కూడా మాకు ఏ విధమైన సందేహమూ లేదు. కాబట్టి మీరు యీ మహాసభ సమక్షమందే దైవనిర్ణయం చేయించండి." అన్నారు.

"రాజావారికి నాదొక మనవి. విశ్వపతి శాస్త్రి కూడా దీనికంగీకరించాలి కదా!" అన్నారు చలమయ్య శాస్త్రిగారు.

విశ్వపతిశాస్త్రిగారు వెంటనే తమ అంగీకారాన్ని తెలియపరిచేరు.
"అల్లాగైతే త్వరలొ ఒక శుభముహూర్తం యేర్పాటు చేయండి. ఆరోజున మనమంతా యిక్కడే మళ్ళీ కలుసుకుందాం." అన్నారు చలమయ్య శాస్త్రిగారు.

ఆనాటి సభ ముగిసింది.

-4-

త్వరలో ఒక శుభముహూర్తం యేర్పాటు చేసేరు. దూరదూరాల నుండి కూడా పండితులూ, పామరులూ వేలకొలదిగా జనం రామచంద్రపురం చేరుకున్నారు. నిర్ణీత సమయానికి చలమయ్య శాస్త్రిగారూ, విశ్వపతి శాస్త్రిగారూ కూడా సభా వేదిక పైకి వచ్చేరు. చలమయ్య శాస్త్రిగారు సభ్యులకు నమస్కరించి యిల్లా అన్నారు.

"పండితోత్తములారా! శాస్త్ర విషయమై నాకు విశ్వపతి శాస్త్రికీ జరిగిన వివాదంలో తీర్పు దైవం చేత చెప్పించడానికీ, ఆ దైవ నిర్ణయమే మనమంతా ఆచరించడానికీ మనమంగీకరించేము. భగవంతుడు ప్రత్యక్షమై మనుష్యరూపంలో నిర్ణయం తెలియపరుస్తాడనుకోవడం మూర్ఖత్వం. అందువలన నేనొక మార్గం చెబుతాను. అది అందరికీ సమ్మతమైతే అంగీకరించండి. లేనిపక్షంలో మరొక మార్గం సూచించండి. నేను సమ్మతిస్తాను.

రెండు తాటాకులు తీసుకుందాం. నా వాదం నేనొక తాటాకు మీద వ్రాస్తాను. విశ్వపతి శాస్త్రి తన వివాదాన్ని యింకొక తాటాకు మీద వ్రాస్తాడు. రెండూ ఒకే సమయంలో కాలవలో వదులుదాం. ఏది ప్రవాహానికి యెదురు వెడితే అది భగవంతునిచే అంగీకరింపబడిన వాదమని నిర్ధారణ చేయవచ్చును. ఇందుకు అందరూ సమ్మతించాలి. " అన్నారు.

దివానుగారు రాజావారివైపు చూచి ఆయన అంగీకారాన్ని గ్రహించి విశ్వపతి శాస్త్రిగారి నడిగేరు, వారికి సమ్మతమేనా అని. ఆయన కూడా సమ్మతించేరు.

సరే ఆ ప్రకారంగానే రెండు తాటాకుల మీదా రెండు వాదాలనూ వ్రాసేరు. రెండూ ఒకేసారి కాలవలో వదిలేరు. వేనకు వేలు ప్రజలు సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు. రాజావారు, దివానుగారు, తదితర రాజోద్యోగులూ కూడా దగ్గరే ఉన్నారు. చలమయ్య శాస్త్రిగారి వాదం వ్రాసి ఉన్న తాటాకు ప్రవాహానికి యెదురుగా చరచరా ప్రాకిపోయింది. అందరూ దిగ్భ్రాంతులయ్యేరు. ప్రజలు హర్షధ్వానాలు చేసేరు. గుఱ్ఱం మీద కూర్చున్న రాజావారు తటాలున క్రిందకు దిగి చలమయ్య శాస్త్రిగారి పాదాలకు నమస్కరించేరు.


-5-

మరునాడు నిండు దర్బారులో చలమయ్య శాస్త్రిగారిని రాజావారు బహుళంగా సత్కరించేరు. అందరూ దైవనిర్ణయాన్ని గురించి ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. ఏ నోట విన్నా చలమయ్య శాస్త్రిగారి ప్రతిభే వినపడుతోంది. దర్బారులో రాజావారు యిల్లా అన్నారు.

"చలమయ్య శాస్త్రిగారూ! మీ ప్రతిభ అమోఘం. సాక్షాత్తూ భగవత్స్వరూపులు మీరు. భగవంతుని చేతనే సాక్ష్యం పలికించేరు. ఇది మరొకరికి సాధ్యమా?"

విశ్వపతి శాస్త్రిగారు కూడా సభలో ఉన్నారు. ఆయన చలమయ్య శాస్త్రిగారి పాండిత్యమైతే మెచ్చుకున్నారు కాని ఆయన చేసిన దైవనిర్ణయం తంతు అంతా ఆయనకు సరిపడలేదు. ఏదో కనుకట్టు మాదిరి ఇది పామరులను రంజింప చేస్తుంది కాని పండితులకు అంగీకార యోగ్యం కాదు. అందువలన ఈ విషయం చాలా చులకనగా చూసేరు. అందుచేత వెంటనే యిల్లా అన్నారు.

"ప్రభువులు మన్నించాలి. చలమయ్య శాస్త్రి పండితుడే కాక మంత్రవేత్త కూడా. అందువలన గారడీ చేయడంలో అద్భుతమేముంది?"

చలమయ్య శాస్త్రిగారికి చాలా కోపం వచ్చింది.

"విశ్వపతీ! నీవు గారడీ అన్నది గారడి కాదు. తపశ్శక్తి. ఆ ధాటికి మహారాజాధిరాజులు కూడా తలలొగ్గేరు పూర్వం. ఈ కాలంలో తపశ్శక్తి ఉన్నదా అని అనుమానిస్తున్నావా? ఇదిగో నా తపశ్శక్తితో నేను శపిస్తున్నాను. ఈ రభస కంతకూ మూలకారణమైన వాళ్ళం నీవూ నేనూను. నాకు ఒక్కడే కుమారుడు. నీకు ఒక్కడే కుమారుడు. ఎవరి వాదం దైవసమ్మతం కాదో వారి కుమారుడు మూడు మాసాల్లో పరలోకగతు డవుతాడు.
వంశ నాశనమౌతుంది." అన్నారు.

రాజావారూ, సభ్యులూ తెల్లపోయేరు. విశ్వపతి శాస్త్రిగారు నిలువునా కూలిపోయేరు.

మూడుమాసాల్లో విశ్వపతి శాస్త్రిగారి కుమారుడు పరమపదించేడు.

=================================