Pages

Monday, March 8, 2010

మరుజన్మంటూ వుంటే
అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
తేనె లోని తీయదనం, పూల లోని సౌకుమార్యం, తొలి వెలుగు లోని వెచ్చదనం, పిల్లగాలి చల్లదనం, తొలకరి లోని గిలిగింత, పౌర్ణమినాటి పులకరింత, కోయిల కూత లోని పలకరింత, ఇవన్నీ, ఇలాంటివన్నీ, ఇంకా ఇలాంటివెన్నొ కలిసి నిండురూప మిచ్చేదే ఆడజన్మంటే..
నేను స్త్రీగా పుట్టినందుకు ఎంత సంతోషిస్తున్నానో, ఎంత గర్వపడుతున్నానో అనుకుంటుంటే, ఒక్కొక్కటే గుర్తొచ్చాయి. మొట్టమొదట...అమ్మ..
తెలిసీ తెలియని చేతలతో ఆమెని ఇబ్బంది పెట్టినా సరే, తప్పొప్పులు చెప్పి, చెయ్యిపట్టి, "మంచిదోవ ఇదీ" అని చూపించింది అమ్మ.
పెద్దలను ఎలా గౌరవించాలో, పిల్లలను ఎలా లాలించాలో, సాటివారిని ఎలా ప్రేమించాలో తను చేసి నాకు ఆదర్శప్రాయమయింది...అమ్మ.
గిల్లికజ్జాలు పెట్టుకున్నా, పరుషమైన మాట నోటివెంట వచ్చినా అదెంత తప్పో చెప్పి మందలించి మంచిమాట చెప్పింది అమ్మ.
ఎప్పుడూ కళకళలాడుతూ, నవ్వుతూ, అందరితో కలిసిపోతూ, భేషజం లేకుండా స్నేహాన్ని పంచి ఇవ్వడం నాకు నేర్పింది మా అమ్మే.
అందరి ఆకలీ తీర్చితేకాని మా అమ్మ ముద్ద నోట పెట్టడం నేనెప్పుడూ చూడలేదు.
నాకు చాలా ఆశ్చర్యం వెసేది. చాదస్తంగా వాళ్ళ మాటే నెగ్గాలనుకుంటున్న మా నాయనమ్మ, తాతగార్లతో ఒకలా మాట్లాడేది.
"వదినా, అన్నయ్య ఇలా అంటే నేనింకీ ఇంట్లొ ఉండనంతే.." అనే బాబాయితో మరొకలా మాటలాడేది.
"వదినా, నేనింకా చిన్నపిల్లనా.." అని విసుక్కునే అత్తయ్యతో ఇంకోలా మాట్లాడేది.
"నాన్న నాకు బూట్లు కొనటం లే"దని ఫిర్యాదు చేసె అన్నయ్యతో ఒకలా మాట్లాడేది.
పట్టుపరికిణీ కోసం కొట్టుకునే మా అక్కచెల్లెళ్ళిద్దరి మధ్యా మరో రకంగా మాట్లాడి సామరస్యం కుదిర్చేది.
ఎవరితోనూ "నీది తప్పు, నువ్వలా మాట్లాడకూడదు" అని మా అమ్మ అనలేదు. ఎటువంటివాళ్ళు ఏ ఫిర్యాదుతో ఆమె దగ్గరికి వెళ్ళినా ముందు చెప్పే మాట "అవును, నువ్వు చెప్పింది నిజమే" అంటూ మొదలుపెట్టేది. మధ్యమధ్యలో తర్కాన్ని లేవనెత్తి, అంత కోపంతో వచ్చిన మనిషినీ, నాదస్వరం వూది బుట్టలో పడేసినట్టు, చివరికి ఆ వచ్చినవాళ్ళు "అలాగె నీ ఇష్టం" అంటూ తలవంచుకుని వెళ్ళేలా చేసేది .
పట్టుదలే ప్రాణంగా భావించే మా నాన్నగారితో కలిసి పైకి ఒక్కమాట వినపడకుండా యింట్లో జరపవలసిన కార్యాలూ, కథలూ, పెళ్ళిళ్ళూ, పురుళ్ళూ, చదువులూ, ఉద్యోగాలూ అన్నీ స్వయంగా పూనుకుని చేయించేది.
అమ్మ దగ్గర వున్నన్నాళ్ళూ నాకు తెలీలేదు కాని పెళ్ళయ్యాక, అస్సలు పరిచయమే లేని కొత్త వ్యక్తుల మధ్య కొచ్చిపడ్డాక, బాధ్యతలంటూ మీద పడ్డాక, అప్పుడు అమ్మ ఈ పనులన్నీ అంత సామరస్యంగా ఎలా చేయగలిగిందా అని ఆలోచించడం మొదలుపెట్టాను.
పెద్దతరాన్ని గౌరవిస్తూనే, చిన్నతరం వాళ్ళ కోరికలు క్రమంలో పెడుతూ, తన తరం వాళ్ళని అనుకూలంగా మార్చుకోగల అమ్మని గురించి ఆలోచిస్తే---ఈ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో పబ్లిక్ రిలేషన్స్ అంటూ పనిచేసే పెద్దవాళ్ళు గుర్తుకొచ్చారు. నిజంగా ఆలోచిస్తే ఒక యింటిలో సభ్యులందరూ ఒకరిపై ఒకరు అభిమానం, ఆప్యాయత కలిగి సంతోషంగా వున్నారంటే, ఆ గొప్పతనమంతా ఆయింటి యిల్లాలిదే. యింట్లో ప్రశాంతంగా వుంటేనే కదా బైట పనులు సవ్యంగా జరిగేది. ఇంటింటి కొక పూవు ఈశ్వరుని కొక మాల అన్నట్టు ప్రతి యిల్లూ ఒత్తిడులు లేకుండా సంతోషంగా వుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుందన్న విషయం అందరికీ తెలిసినదే కదా.. దీనికంతకీ కారణం అమ్మ.
అందుకే నేను మరుజన్మంటూ వుంటే ఆడజన్మనే కోరుకుంటున్నా. అమ్మ అవడంలో వున్న ఆనందం, పిల్లలను పెంచుతున్నప్పుడు ప్రతి మలుపులోనూ కలిగే సంతోషం, వాళ్ళు ప్రయోజకులయ్యాక నలుగురూ వారిని పొగుడుతున్నప్పుడు కలిగే మమకారం కేవలం అమ్మ అయితేనే వుంటుంది. అందుకే నేను మళ్ళీ మళ్ళీ అమ్మనే అయి సమాజానికి మంచి పౌరులను అందిస్తాను..


##########################################################################

Monday, March 1, 2010

why women cry? ఆడవాళ్ళు ఎందుకు యేడుస్తారు?

అంతర్జాతీయ మహిళాదినోత్సవం రాబోతోంది. దాని గురించి విషయసేకరణకు అంతర్జాలం లో గాలిస్తుంటే ఒక అఙ్ఞాత రచయిత వ్రాసిన హృదయాన్ని కదిలించిన రచన ఒకటి కనిపించింది. దానిని భావానికి ప్రాధాన్యమిస్తూ తెలుగు లోకి స్వేఛ్ఛానువాదం చేసాను. ఆ రచనే ఇది.


ఒక చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మ నడిగాడు.
"అమ్మా, ఎందు కేడుస్తున్నావు?"
"ఆడదాన్ని కనుక.."
ఆ తల్లి జవాబు చెప్పింది..
"నా కర్ధం కాలేదు."
అన్నాడా అబ్బాయి.
తల్లి అతన్ని దగ్గరికి తీసుకుని,
"నీకు ఎప్పటికీ అర్ధం అవదు కూడా..." అంది.
తర్వాత ఆ అబ్బాయి అతని తండ్రి నడిగాడు.
"అమ్మెందుకు ఉట్టినే ఏడుస్తుంది?"
"ఆడవాళ్ళందరూ అంతే. ఉట్టినే ఏడుస్తారు. వాళ్ళకి ఏడవడానికి కారణం అఖ్ఖర్లేదు."
తండ్రి అంతమటుకే చెప్పగలిగాడు.
ఆ చిన్న అబ్బాయి పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా ఆడవాళ్ళు ఎందుకు ఏడుస్తారో అతనికి అర్ధం కాలేదు. చివరికి భగవంతుడికి ఫోన్ చేసాడు. ఆయన లైన్ లోకి రాగానే,
"ఓ దేవా...ఆడవాళ్ళు అంత గబుక్కున ఎందుకు ఏడుస్తారు?" అనడిగాడు.
ఆ ప్రశ్నకి భగవంతుడిలా చెప్పాడు....
" నేను స్త్రీని సృష్టించినప్పుడు ఆమె ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను. అందుకోసమే
--ఈ ప్రపంచాన్నే అతి సులభంగా ఆమె భుజస్కంధాల మీద మోసేటంత శక్తిని వాటి కిచ్చాను.
అదే సమయంలో ఆ చేతుల మధ్య ఎవరైనా సేద దీరే విధంగా చక్కని సౌఖ్యాన్నిచ్చేటట్టు వాటిని ఏర్పాటు చేసాను.
--భావితరాన్ని ఈ లోకానికి అందించే మాతృత్వ మనే ప్రక్రియలో కలిగే వేదనకు కావలసినంత మానసిక స్థైర్యాన్నిచ్చాను.
దానితోపాటు కడుపున పుట్టిన బిడ్డలే ఆమెని కాదు పొమ్మంటే తట్టుకోగలిగేంత గుండె ధైర్యాన్నిచ్చాను.
--బాధ్యత గలవాళ్ళందరూ వదిలి వెళ్ళిపోయినాకూడా ఎవరినీ నిందించకుండా కష్టాల కడలి లాంటి సంసారాన్ని ఈదగలిగేటంత ధీరత్వాన్నిచ్చాను.
--కన్నపిల్లలే తనను కష్టాలపాలు చేసినా సరే ఆ పిల్లలనే ప్రేమించేటంత మానసిక సౌకుమార్యాన్నిచ్చాను.
--భర్తలో ఎన్ని దోషాలున్నా పట్టించుకోకుండా నిండు మనసుతో అతనిని తన హృదయంలో చేర్చుకుని సేదదీర్చగలిగే శక్తి నిచ్చాను.
--ఒక మంచి భర్త తన భార్యను ఎప్పుడూ బాధపెట్టడు అనే విషయాన్ని తెలుసుకునే విఙ్ఞత ఆమెకిచ్చాను.
అయినాసరే అప్పుడప్పుడు భర్త తప్పుచెసి ఆమె సహనాన్ని పరీక్షిస్తున్నా కూడా అతని తప్పులు పట్టించుకోకుండా ఎంతో సహనంగా అతని పక్కన నిలబడేంత క్షమాహృదయాన్నిచ్చాను.
--చివరగా రాల్చడానికి ఆమెకొక కన్నీటి చుక్క నిచ్చాను.
--ఇంతటి శక్తిస్వరూపిణికీ నేను ఇచ్చిన బలహీనత ఈ ఒక్క కన్నీటి చుక్కే.
--అది పూర్తిగా ఆమె స్వంతం. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు దానిని ఉపయోగించుకునే స్వేఛ్ఛ, స్వతంత్రం ఆమె కున్నాయి. "
అంటూ భగవంతుడు ఇంకా ఇలా చెప్పాడు.
" చూడు బాబూ, ఒక స్త్రీ సౌందర్యాన్ని చూడాలంటే అది ఆమె ధరించే వస్త్రాలని బట్టి ఉండదు. పైకి కనిపించే ఆమె
బాహ్యరూపాన్ని బట్టి ఉండదు. ఆమె చేసుకునే శిరోజాలంకరణను బట్టి ఉండదు.
ఒక స్త్రీ సౌందర్యం చూడాలంటే అది ఆమె కళ్ళల్లోనే కనపడుతుంది.
ఎందుకంటే ఆ విశాల నయనాలే పవిత్ర ప్రేమ నిండివుండే ఆమె హృదయానికి ముఖద్వారం."


_______________________________________________________________

ఒక అఙ్ఞాత రచయిత వ్రాసిన దీనికి మూల రచన ఈ క్రింది లింక్ లో ఉంది.
http://www.anvari.org/fun/Truth/Why_Women_Cry.html
________________________________________________________________