Pages

Monday, August 31, 2009

కాదనలేని సత్యాలు


జ్యోతిగారు వ్రాసిన కాదనలేని సత్యాలు అనే టపాకు స్పందించి...

వరము లిచ్చేది దేవత
వలచి మురిసేది వనిత
జన్మ నిచ్చేది జనని
తోడు నిలిచేది తరుణి

ఓ పురుషుడా... అడుగడుగునా
నీ ప్రగతియే తన జగతిగా
నీ ఉనికికై తన ప్రాణమే
పణము పెట్టే పడతిపై
ఎందుకీ భేదభావం.... నీ కెందుకీ హీన భావం...

పుట్టి పెరిగిన ఇంటిని విడిచి నీ ఇంటికి వెలుగిస్తుంది
పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను నీ వారసునిగ చేస్తుంది
కరిగే కొవ్వొత్తిలా జీవనము గడుపు స్త్రీలపై
ఒక తల్లిపై , ఒక చేల్లిపై, ఇల్లాలిపై, నీ నేచ్చేలిపై
ఎందుకీ భేద భావం...నీ కెందుకీ హీన భావం....

ధర్మ శాస్త్రాలు ఒక్కటియై స్త్రీని దేవతను చేసాయి
చరిత్ర పుటలను తిప్పితే మాతృమూర్తి నీ వన్నాయి
ఈ నవీన సమాజ జీవన వేగంలో
ప్రతి దినము జరిగే పరుగుల పోటీలో
బేల కాదు ఈ బాల...నిను మించులే నవరసాల..
బేల కాదు ఈ బాల...నిను మించులే నవరసాల..


##########################################


Thursday, August 27, 2009

ప్రొఫెసర్ గారూ--స్పెషల్ క్లాసూ..ప్రొఫెసర్ గారూ--స్పెషల్ క్లాసూ..


లత పెళ్ళైన కొత్తలో ఒకసారి మొహమాటంగానే సినిమా కెడదామని అడిగింది ప్రొఫెసర్ గారిని. యింకా కొత్త కదా. కాదంటే చిన్నబుచ్చు కుంటుందనుకున్నారో యేమో సరేనంటూ బయల్దేరారు. సినిమా చూస్తున్నంత సేపూ ముళ్ళమీద కూర్చున్నట్టే కూర్చున్నారు. తెలుగు సినిమా గురించి వేరే చెప్పాలా? హీరో రాత్రీ పగలూ రిక్షా తొక్కి చెల్లెలి పెళ్ళి చేసే సెంటిమెంటు. ఆ రిక్షా తొక్కే హీరోని ఒక కోటీశ్వరుడి కూతురు ప్రేమించడం. ఫారిన్ లొకేషన్లు, డ్యూయట్లు. చూస్తున్న కాసేపూ వాళ్ళతో పాటు ప్రేక్షకులూ కలల్లో విహరించడం. తర్వాత అంతా మామూలే కదా. కాని ప్రొఫెసర్ గారు మటుకు దాన్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోయారు. సినిమా అయ్యి వెనక్కి వస్తున్నంతసేపూ పాపం లతకి ఆయన దగ్గర స్పెషల్ క్లాస్ తీసుకోక తప్పలేదు.

ఆఖరికి ఇంటి కొచ్చాక కూడా ఆ సినిమా లోని అవక తవక లన్నీ యెత్తి చూపించి, అవేవీ నిజ జీవితానికి దగ్గరగా లేవనీ, చూస్తే సత్యజిత్ రే తీసిన "పథేర్ పాంచాలి" లాంటివి చూడాలనీ, ఈ సినిమా తీసిన వాడొక ఫూలనీ, చూసినవాళ్ళు యింకా మరీ మూర్ఖులనీ విమర్శించడం మొదలుపెట్టారు. అన్నింటికన్నా ఆశ్చర్యం. సినిమా లోని "నువ్వంటే నాకెందుకో ఇంత ఇదీ.." అన్న చక్కటి పాటని చీల్చి చెండాడేసి, "వాటీజ్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఇదీ.."అని అడిగారు. ముఖ్యంగా చెప్పవలసిన విషయమేంటంటే, ఆయన చెప్పినవన్నీ కరెక్టని లత స్వయంగా ఒప్పుకునేదాకా చెప్పిందే చెప్పడం. ఇంక లతకి నీరసం వచ్చేసింది. యేం చెస్తుంది? ఒప్పుకోక ఛస్తుందా.. ఒప్పుకుంది. కానీ ప్రాణం వుండబట్టలేక ఆ రాత్రే ప్రొఫెసర్ గారు వినకుండా వాళ్ళ రెండో అన్నయ్యకి ఫోన్ చెసింది. యేడుపొక్కటే తక్కువగా జరిగిందంతా చెప్పెసింది. "అన్నయ్యా, సినిమా నుంచి వచ్చిం దగ్గర్నించీ ఇప్పటిదాకా నాకు స్పెషల్ క్లాస్ తీసుకున్నార్రా. సినిమా రెండు గంటలే కాని ఈ స్పెషల్ క్లాస్ మటుకు అయిదు గంటలు పట్టిందిరా.."

అన్నయ్యేం తక్కువ తిన్నాడా.. బ్రహ్మాండమైన వుపాయం చెప్పాడు. "చెల్లాయ్.. మేం మేస్టర్లం కదా.. అల్లాగే చెప్పిందే చెపుతూంటాం. యింకా నయం.. టెస్టేమీ పెట్టలేదు. ఖంగారు పడకు. దీనికి ఒకటే మంత్రం. బావగారు చెప్పేది నీకెప్పుడు బోర్ కొడితే అప్పుడు బెల్ కొట్టేస్తూండు. బెల్ వినగానే మా మాట టక్కున ఆగిపోతుంది. " నమ్మలేకపోయింది లత.

"నిజవా అన్నయ్యా?" "ఆహా..స్వానుభవం మీద చెప్తున్నాను. యేం అనుమానం అఖ్ఖర్లేదు. యెందుకంటే మీ వదిన నామీద అదే మంత్రం ప్రయోగించింది. " మరింక వివరణ అనవసరం అనుకుని ఫోన్ పెట్టేసాడు లత అన్నయ్య.
యింకనేం.. భలే వుపాయం దొరికిందనుకుంది లత. మళ్ళీ మరో సందేహం. అన్నయ్య అమాయకుడు కనక వదిన ఆటలు సాగాయి. మరి యిక్కడో... చూద్దాం మళ్ళీ అల్లాంటి పరిస్థితి వస్తే అనుకుంది.

మర్నాడు లత టీ వీ చూస్తోంది. పక్క రూమ్ లొ ఏదో చదువుకుంటున్న ప్రొఫెసర్ గారు పనికట్టుకుని హాల్లోకొచ్చారు. తెలుగులో వచ్చే సీరియల్స్ గురించి చెప్పేదేముంది... మళ్ళీ లతకి స్పెషల్ క్లాస్ మొదలైంది. "ఊ...ఊ.." అంటూ ఓపికున్నంత సేపు వింది పాపం. ఆమెకి మటుకు అలా చెప్పిందే చెప్తుంటే యెంతసేపని వింటుంది.. "ఎలాగురా బాబూ.." అనుకుంటుంటే అన్నయ్య చెప్పిన సలహా గుర్తొచ్చింది. బెల్ కొట్టాలి కదా అనుకుంది. అవునూ, ఇప్పటికిప్పుడు బెల్ ఎక్కడినుంచి తెచ్చేది? ప్రొఫెసర్ గారు లెక్చర్ ఇస్తూనే వున్నారు. లత చురుకైన బుర్రకి ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చింది. రోజూ దేవుడికి గంట కొడతాం కదా. నెమ్మదిగా లేచి దేవుడి గూట్లో పెట్టిన గంట తీసుకొచ్చి గణగణా వాయించడం మొదలుపెట్టింది.

సీరియస్ గా లెక్చరిస్తున్న ప్రొఫెసర్ గారు టక్కున లెచి, చేతిలో పుస్తకం మడుస్తూ పక్క గదిలోకి వెళ్ళిపోయారు. "హుర్రే" అనుకుంది లత. మొహం వెలిగిపోయింది.
కాని రెండో నిమిషంలో గుమ్మంలోకి వచ్చి లత వైపు చూసిన ప్రొఫెసర్ గారి చూపు చూస్తేమటుకు ......యెందుకులెండి.......

#####################################################################

Wednesday, August 26, 2009

ప్రొఫెసర్ గారూ-పంక్చుయాలిటీ


లత ఒక తెలుగింటి అమ్మాయి. అందరు ఆడపిల్లల్లాగే పెళ్ళి గురించీ, వివాహజీవితం గురించీ యేవేవో ఊహించుకుంది. కలల్లో విహరించే లతకీ, ప్రతి చిన్న విషయాన్నీ హేతుబధ్ధంగా ఆలోచించే ఒక ప్రొఫెసర్ కీ వివాహమైంది. వారిద్దరి మధ్య గల ఊహకీ, వాస్తవానికీ గల తేడాని చూపించడమే ఈ కథలు చెప్పడం లోని లక్ష్యం.
ప్రొఫెసర్ గారూ--పంక్చుయాలిటీ

ఆడపిల్లంటే యింటికి మహాలక్ష్మనీ, ఆమెని గారంగా, ప్రేమగా, భద్రంగా చూడాలనీ భావించే యింట్లో నలుగురన్నయ్యల తరవాత అపురూపంగా పుట్టిన ఆడపిల్ల లత. ఆంధ్రదేశంలోని చాలామంది ఆడపిల్లల్లాగే లత కూడా పెరిగింది. చిన్నప్పట్నించీ ఆడింది ఆటగా, పాడింది పాటగా పెరిగిన లతకి కాలేజీకి రాగానే అన్నయ్యల అభిమానం రెట్టింపయ్యింది. అందులోనూ లత చదివే కాలేజీ లోనె వాళ్ళ రెండో అన్నయ్య లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. మరింక చెప్పేదేముంది. ఆ కాలేజీలో చదివినన్ని రోజులూ లత అనుభవించిన ప్రత్యేకతలు చెప్పనలవికాదు. అందులోనూ కాస్త చురుకైనదేమొ అన్నింట్లోనూ తనే అయి తిరుగుతూ డిగ్రీ చదివిన మూడేళ్ళూ కాలేజీని యేలేసింది. బాధ్యతంటే తెలీకుండా జీవితమంతా తెలుగు సినిమాలు చూసుకుంటూ గడిపేస్తారనుకునే భావనలో వున్న లతకి పెళ్ళైంది.
రెండు కుటుంబాలూ ఎక్కడో ఎప్పుడో బీరకాయపీచు చుట్టరికం వున్నవాళ్ళే. అబ్బాయి మటుకు లత అన్నయ్యకి ఒకప్పటి క్లాస్ మేట్. లత తండ్రి లతని సూటిగా అడిగారు. "చూడు తల్లీ, పెద్దన్నయ్య స్నేహితుడుట. ఈమధ్యనే పి.హెచ్.డి.పూర్తి చేసి యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా చేరాట్ట. నీకు ఇష్టమైతే ముహుర్తాలు పెట్టిస్తాను."అని. కాదనడానికి లతకి కారణాలేమీ కనిపించలేదు. ఆవిధంగా లత ప్రొఫెసర్ గారి భార్య అయింది.
పాపం అప్పుడు లతకి తెలీలేదు. మంచివాడంటే చెడ్డవాడు కాదనుకుంది తప్పితే గట్టిగా మాట కూడా మాట్లాడని అతి మర్యాదస్తుడని అనుకోలేదు. బాగా చదువుకున్నవాడంటే పి.హెచ్.డి.అనుకుంది తప్పితే క్లాసు పుస్తకం తప్పితే మిగిలిన పుస్తకాలన్నీ చెత్త పుస్తకాలే అనుకుంటాడని తెలీలేదు. మనిషి ప్లాన్డ్ గా వుంటాడంటె మరీ కాలేజీలో టైమ్ టేబిల్ లాగ యింట్లొ కూడా టైమ్ టేబిల్ పెడతాడని అప్పుడు తెలీలేదు. వ్యసనాలవీ లేనివాడంటే సిగరెట్లు, తాగుడు లాంటి అలవాట్లు వుండవనుకుంది తప్పితే అతని దృష్టిలో సినిమా చూడడంకూడా ఒక దుర్వ్యసనమే అని అనుకోలేదు. అందుకే కొత్తలో అతనితో సర్దుకుపోవడం కొంచెం కష్టమే అనిపించింది.
ముఖ్యంగా పంక్చుయాలిటీని పాటించడంలో ప్రొఫెసర్ గారిని మించినవారులేరు. ఉపన్యాసాలివ్వడంలొ వారికి గల నైపుణ్యానికి తార్కాణంగా సిటీలో జరిగే చాలా సభలకి ఉపన్యాసాలివ్వమని వారికి ఆహ్వానాలందుతూండేవి. అలాగే ఒక రోజు వివేకానంద ఉపన్యాసాల గురించి ప్రసంగించమని ఒకచోట నిర్వాహకులు అడిగారు. భార్య తన ఉపన్యాసం వినాలని ప్రొఫెసర్ గారు ఆశించారు. లత కూడా భర్త గొప్పతనం చూడాలని ఉవ్వుళ్ళూరింది. అక్కడ తనని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తారని ఎంతో సంతోషపడింది. అందుకని తీరుబడిగా అలంకరణ మొదలుపెట్టింది.
హుందాగా కనపడాలని బాగా గంజి పెట్టిన కాటన్ చీర తీసింది. జడ మాని ముడి వేసింది. మేకప్ మరీ ఎక్కువగా లేకుండా, లిప్ స్టిక్ మరీ కొట్టొచ్చినట్టు కనపడకుండా జాగ్రత్తపడింది.
అప్పటికే చాలా సేపట్నించీ ప్రొఫెసర్ గారు షూ లేసులు కూడా కట్టేసుకుని, తాళాలగుత్తి చేతిలో పట్టుకుని లత కోసం అసహనంగా ఎదురుచూస్తున్నారు. అసలు ఆరోజు ఉదయం నుంచీ వాళ్ళిద్దరిమధ్యా వాదన జరుగుతూనేవుంది. చీఫ్ గెస్టంటే కనీసం అరగంటైనా ఆలస్యంగా వెళ్ళకపొతె మరింక మన గొప్పేంవుంటుంది అంటుంది లత. చెప్పిన టైమ్ కి వెళ్ళక పోతే మర్యాదగా వుండదంటారు ప్రొఫెసర్ గారు. అలాగ ఒకరి మాట మీద మరొకరు మాట వెస్తూనే వున్నారు. కాని ఇప్పుడాయన వరస చూస్తే ఈ పంక్చుయాలిటీ కాదుకాని ఇంకా ఆలస్యమైతే తనని వదిలేసి ఒక్కరే వెళ్ళిపోతారేమోనని లతకి భయం వేసింది. అందుకే అంత గంజి పెట్టి ఇస్త్రీ చేసిన కాటన్ చీరనీ హడావిడిగా చుట్టబెట్టేసుకుని తన అసంతృప్తిని మొహంలో కనిపించేటట్టు చూస్తూ ఆయనతో బయల్దేరింది.

ఇద్దరూ సరిగ్గా సమయానికి మీటింగ్ హాల్ కి చేరుకున్నారు. ఆశ్చర్యం ఇంకా హాలు తలుపులె తెరవలేదు. అనుమానం వచ్చి ఆహ్వాన పత్రిక చూసారు. అదే హాలు. అదే రోజు. అదే సమయం. ఒకరి మొహాలొకరు చూసుకుంటుంటే హాలు ముందు ఒక టూ వీలర్ ఆగింది. దాని మీంచి ఒక స్థూలకాయుడు పాన్ నములుతూ దిగి వీళ్ళ వైపు వస్తూ "యేంటింకా తలుపులు తియ్యలేదా?" దబాయిస్తున్నట్టు అడిగాడు. అతన్ని చూసి అప్పటిదాకా యేపక్కనున్నాడో కాని వాచ్ మేన్ తాళాలగుత్తితో పరిగెట్టుకొచ్చాడు. తాళం తియ్యగానే ఆ స్థూలకాయుడు మరింక వీళ్ళవేపైనా చూడకుండా స్టేజి మీదకెళ్ళి కుర్చీలు, మైకులు గట్రా సర్దటం మొదలుపెట్టాడు. లత భర్తని ప్రశ్నార్ధకంగా చూసింది. ఆ చూపుకి తట్టుకొలేని ప్రొఫెసర్ గారు మరింక మొహమాటం వదిలేసి వాచ్ మేన్ ని పిలిచి కార్యకర్తల గురించి అడిగారు. అడిగినదానికి సమాధానం చెప్పకుండా వాడు "మీరెవరండీ?"ని ఎదురు ప్రశ్న వేసాడు. ఆయనేం మాట్లాడలేకపోయారు. లత మరింక లాభం లేదని ముందుకొచ్చి, "ఈయనే ఇప్పుడిక్కడ ఉపన్యాసం యివ్వాల్సింది." అంది. వాడు వీళ్ళని వెర్రివాళ్ళని చూసినట్టు చూసి, "వస్తారలాకూకోండి.." అంటూ వెళ్ళిపోయాడు.

అలా కూర్చుని లత ఆ హాల్ కి ఎన్ని కిటికీలు, గుమ్మాలు వున్నాయో లెక్కపెట్టేసింది. సీలింగ్ ఎంత ఎత్తులొ వుందో పరిశీలించింది. గోడలకి ఏ కలర్ వెసారో ఒకటికి పదిసార్లు చూసింది. స్టేజి మీద ఎంత మంది కూర్చోవచ్చో అంచనా వేసింది. పది సార్లు చీర సర్దుకుంది. ఇరవైసార్లు జుట్టు చెరుపుకుంది. ముఫ్ఫైసార్లు చెప్పులు విడిచి మళ్ళీ వేసుకుంది. కాని ప్రొఫెసర్ గారు మటుకు పొరపాటున కూడా లత వైపు చూడలేదు. బహుశా చూసే ధైర్యం లేకపోయుండొచ్చు.

అలా వాళ్ళు కూర్చున్న అరగంటకి ఒక్కరొక్కరుగా కార్యకర్తలు రావడం మొదలుపెట్టారు. తర్వాత వాళ్ళు క్షమాపణలు చెప్పుకోడం, మర్యాదలు చెయ్యడం అదంతా వేరే విషయం కాని అప్పట్నించీ లత మళ్ళీ యెప్పుడూ ప్రొఫెసర్ గారితో ఉపన్యాసాలకి వెళ్ళలేదు.
##################################################################

Saturday, August 22, 2009

బంగారుతల్లి

ఆడపిల్లకి పెళ్ళి చేసి, అత్తవారింటికి పంపించాక మళ్ళీ అమ్మాయి పుట్టింటికి ఎప్పుడొస్తుందా అని తల్లీ, తండ్రీ వేయికళ్ళతో ఎదురుచూస్తూవుంటారు. అత్తవారింట్లో హుందాగా అన్ని బాధ్యతలూ నిర్వహిస్తున్నా అమ్మానాన్నలకి మటుకు ఆ బంగారుతల్లి ఎప్పుడూ చంటిపాపాయే. మా అమ్మాయి పెళ్ళయి వెళ్ళిన రెండేళ్ళకి మళ్ళీ మా ఇంటికి వచ్చింది. మర్నాడు వస్తోందని తెలిసినప్పుడు ఆ రాత్రంతా నాకు మనసు నిలబడలేదు. అప్పుడు వ్రాసుకున్న పాట.

పల్లవి--వెన్నలవాన కన్నులలోన ఎన్నడమ్మా ఇంకానూ...

చరణం--కన్నెరత్నం జంటకూడి కాననితీరం చేరింది
ముద్దులతల్లి మురిపాలవల్లి గృహలక్ష్మై విలసిల్లింది
పావురమై ఎగిరొస్తుందో చిలుకపలుకులే వినిపిస్తుందో
మరువపు మొలకై ముత్యపు జల్లై
నా మదిలోన అమృతం కురిసే..//వెన్నెల వాన//

చరణం--నాన్న కూతురని అమ్మంటే అమ్మ కీర్ష అని నాన్నంటే
ఇద్దరి వాదన తప్పేనంటూ మధ్యన చేరి ముద్దులు కురిసే//వెన్నెలవాన//

Thursday, August 13, 2009

కృష్ణాష్టమి శుభాకాంక్షలు
జగత్తుకే ముద్దుబిడ్డ శ్రీకృష్ణుడు. ప్రతి తల్లీ తన కొడుకే కృష్ణుడన్న భావనలో మురిసిపోయి జోలపాటలు పాడుతుంది. ఇది అలాగ వ్రాసుకున్న పాటే..ఈ కృష్ణాష్టమి సందర్భంగా.

పల్లవి-- సిరిసిరి నవ్వుల చిన్ని కిశోరా
నవనీతచోరా నిద్దురపోరా //

చరణం--మా ఇంటి కృష్ణుడు తెల్లనమ్మా
మూసిన కన్నుల వెన్నెలమ్మా
దోబూచులతో దొంగాటలతో
అలసిన కృష్ణమ్మా జోలమ్మా--జొ లాలమ్మా//సిరినవ్వుల//

చరణం- నా గానమె తల్లి యశోద లాలిగా
నాదీవనె నీకు శ్రీరామ రక్షగా
నిదురించు ఒడిలోన వటపత్రశాయిలా
కోటి దీవెన లెన్నొ పాడతా జోలగా//సిరి సిరి//

#########################

Tuesday, August 11, 2009

ఆధునిక అత్తాకోడళ్ళు

అత్తాకోడళ్ల సంబంధం ఎంత గొప్పదో అంత జాగ్రత్తగా నిలబెట్టుకోవలసింది. శ్రీ ఘంటసాల వారు పాడిన అత్తాకోడళ్ళపాట విని అందరూ ఎంతో ఆనంద పడతారు. ఈమధ్య ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఈ ఆధునిక అత్తాకోడళ్ళ పాట విన్నాను. సరిగ్గా ఘంటసాల వారి వరసలోనే పాడారు. నాకు నచ్చి, మీకూ పంచుతున్నాను.ఘంటసాల వారి పాట..వరుస

అత్తలేని కోడలుత్తమురాలు...ఓయమ్మా..

కోడల్లేని అత్త గుణవంతురాలు..ఆహూ...ఆహూ...కోడల కోడల కొడుకు పెండ్లామా ఓయమ్మా..

పచ్చి పాల మీద మీగడేదమ్మా...

వేడి పాల ల్లోన వెన్న యేదమ్మా..ఆహూ...ఆహూ...

ఓ అత్త నీ చేత ఆరళ్ళె గాని ఓయమ్మా...

పచ్చి పాల మీద మీగడుంటుందా...

వేడి పాల ల్లోన వెన్న వుంటుందా..ఆహూ..ఆహూ...


ఆధునిక అత్తా కోడళ్ళ పాట

అత్తలేని కోడలు అతి ముద్దరాలు ఓయమ్మా

కోడల్లేని అత్త కడు ధన్యురాలు.....ఆహా.....ఊహూ......


కోడల కోడల కొడుకు పెండ్లామా ఓయమ్మా..

కొత్తగిన్నె ఇట్ల సొట్టలయ్యిందేమే...పట్టుచీర ఇట్ల కర్టెనయ్యిందేమే...ఓ అత్త నీ చేత ఆరళ్ళె గాని ఓయమ్మా..

గిన్నె కొత్తదికాదు యేండ్ల పాతదమ్మా..

నీ కొడుకు తెచ్చిన చీర కర్టెన్ల వుందమ్మా..ఆహా...ఊహూ...వడ్డాణం చేయిస్త నడుము కనపడదేమె కోడలా...ఓ కోడలా..

డైటింగు రోజుల్లొ నడుమడగకూడదు..అత్తమ్మ..ఓ.అత్తమ్మా....మల్లెమాల తెచ్చా జడ వేస్త రావేమే కోడలా...ఓ కోడలా...

కత్తిరించిన జుట్టుకు మాల నిలువదు పోమ్మ అత్తమ్మ..ఓ అత్తమ్మా...చుట్టు జరీచీర సొంపుగ నేయించ కట్టుకు రావేమె కోడలా..

కంటినిండుగ చూస్త కోడలా..ఓ కోడలా..చీర కడితె నేను కాలు కదపలేను..

నా డ్రెస్సు నాకుంది నన్నొదిలిపెట్టమ్మ అత్తమ్మ..ఓ అత్తమ్మా..హాసి నీ అసాధ్యం కూలా...

మినపరొట్టె కాల్చి బల్ల మీదెట్టాను... మాయమయ్యిందేమె కోడలా..

మింగి కూర్చున్నావ కోడలా.. ఓ కోడలా...మినపరొట్టె అరిగె వయసు కాదు నీది

మంచినీళ్ళు తాగి మంచిగ పడుకోమ్మ అత్తమ్మ..ఓ అత్తమ్మా..నువ్వంటె నువ్వంటు బదులు చెప్తున్నావు... అమ్మ నేర్పిందేమె కోడలా

మీ అమ్మ నేర్పిందేమె కోడలా....అమ్మ నేర్పిందంటు ఆడపడుచు చెప్పె.. నువ్వు చెప్పిన మాట అత్తమ్మా..

నేను కాదంటాన అత్తమ్మా..ఓ అత్తమ్మా...వద్దన్న పని మాని వినయంగ నువ్వుంటె

నీకన్న నాకెవరు..కోడలా..ఎక్కువ ఇంకెవరు కోడలా..ఓ కోడలా..అనకూడని మాట అనకుండ నువ్వుంటె

నీకన్న నాకెవరు అత్తమ్మా.. ఆప్తులు ఇంకెవరు అత్తమ్మా..ఓ అత్తమ్మా..అత్త లేక కోడలు అసలుండలేదు ఓయమ్మా...

కోడల్లేక అత్తకు విలువెక్క డుందమ్మా....ఆహా....ఊహూ....

-------------------------------

Saturday, August 8, 2009

తప్పించుకోవచ్చు

ఇచ్చట ఉచితముగా సలహాలు ఇవ్వబడును.

సమయం: అన్నివేళలా ( మీరు క్యూలొ వున్నారు. దయచేసి వేచియుండండి.)

గమనిక: ఒకసారి తీసుకున్న సలహా వాపసు తీసుకొనబడదు.

హెచ్చరిక: ఎవరు చేసుకొన్న ప్రయోగానికి వారే బాధ్యులు.

మనవి: ఈ సలహాలు సరదాగా చదువుకుందుకు మాత్రమే వ్రాసినవి తప్పితే ఎవరినీ నొప్పించడానికి కాదు.ఈ సలహా భార్యా భర్త లిద్దరికీ పనికొస్తుంది. ఎవరైనా స్నేహితులు కాని, బంధువులు కాని మనని ఏదైనా కొనమనో, లేదా మాట సాయం చెయ్యమనో మొహమాటపెట్టేస్తుంటారు. వాళ్ళ మీద మనకి నమ్మకం వుండదు. అలాగని మొహమ్మీద కాదనీ చెప్పలేము. అటువంటప్పుడు భార్య భర్త పేరు చెప్పీ, భర్త భార్య పేరు చెప్పీ ఆ ఆపద గట్టెక్కించుకొవచ్చు. ఎలాగంటే.. "లేదండీ,, మా ఆవిడకి ఇలాంటివి ఎందుకో ఇష్టముండవు.. మీకు తెలుసుగా..ఆవిడ కాదన్నది నేను చెయ్యలేను.. ఏమీ అనుకోకండి" అంటూ మగవారు, "లేదే.. ఇలాంటి ఇన్ స్టాల్ మెంట్లంటే మా వారికి ఇష్టముండదు. నీకు తెలుసుకదా" అంటూ ఆడవారు ఆ ఆపద తప్పించుకోవచ్చు.( ఏదో పెద్ద అక్కడికి వారు గీచిన గీత దాటనట్టు)

Friday, August 7, 2009

చెప్పండి..

ఇచ్చట ఉచితముగా సలహాలు ఇవ్వబడును.

సమయం: అన్నివేళలా ( మీరు క్యూలొ వున్నారు. దయచేసి వేచియుండండి.)

గమనిక: ఒకసారి తీసుకున్న సలహా వాపసు తీసుకొనబడదు.

హెచ్చరిక: ఎవరు చేసుకొన్న ప్రయోగానికి వారే బాధ్యులు.

మనవి: ఈ సలహాలు సరదాగా చదువుకుందుకు మాత్రమే వ్రాసినవి తప్పితే ఎవరినీ నొప్పించడానికి కాదు.

నేను కొత్తగా పెళ్ళయి కాపురానికి వచ్చినప్పుడు ఒక పెద్దావిడ ఇచ్చిన సలహా ఇది. అది పాటించక తరవాత చాలా ఇబ్బందులు పడ్డాను. అలా మీరు పడకూడదని మీకు ఈ సలహా..

పెళ్ళయి వెళ్ళాక ముందుగా కాస్త కూర తరిగి ఇమ్మంటారు. మనం వీర లెవెలుకి పోయి గబగబా తరిగి ఇచ్చెయ్యకూడదన్నమాట. అలా ఇచ్చేస్తే మళ్ళీ వెంటనే ఇంకో పని చెప్తారు. అందుకని కేవలం రెండు పచ్చిమిరపకాయలు తరగమని ఇచ్చినా సరే... కత్తిపీట ముందు కూర్చుని వాటిని నెమ్మదిగా అలా అలా అలా తరుగుతూనే వుండాలన్నమాట.. అప్పుడు ఇంకొక పని చెప్పె అవకాశమే లేదు కదా.. ఈ పనే తెమలనిదే ఇంకొ పని ఎలా చెప్తారు చెప్పండి..

Thursday, August 6, 2009

నమ్మండి.

ఇచ్చట ఉచితముగా సలహాలు ఇవ్వబడును.

సమయం: అన్నివేళలా ( మీరు క్యూలొ వున్నారు. దయచేసి వేచియుండండి.)

గమనిక: ఒకసారి తీసుకున్న సలహా వాపసు తీసుకొనబడదు.

హెచ్చరిక: ఎవరు చేసుకొన్న ప్రయోగానికి వారే బాధ్యులు.

ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా వున్నా పాలు పొంగిపోతుంటాయి. అసలే పాలు పొంగిపోయాయన్న బాధ, మళ్ళీ అదంతా శుభ్రం చేసుకోవాలన్న పని తల్చుకుని దుఖం. వీటితో పాటు "మళ్ళీ పాలు పొంగించేసావా.." అంటూ వెనకాల్నించి మాటలు వినవస్తుంటాయి. అదేమిటో పుట్టినరోజులు, పెళ్ళిరోజులు గుర్తుండవు కాని మనం అంతకు ముందు ఎన్నిసార్లు పాలు నేలపాలు చేసామో తేదీలతో సహా గుర్తుంటుంది కొంతమందికి. అలాంటప్పుడు ఉక్రోషపడకూడదు.సెంటిమెంటుతో కొట్టాలి. పైకి డాబుగా కబుర్లు చెప్తారు కాని అసలు ఆడవాళ్ళకన్న మగవాళ్ళే ఈ సెంటిమెంట్లకి పడిపోతుంటారండీ. ఆ వీక్ నెస్ పట్టుకోవాలన్నమాట. వెంటనే మనం మొహమంతా సంతోషం నింపేసుకుని .." మీకీ విషయం తెలుసా.. మొన్న పిన్నిగారు చెప్తున్నారు.ఇలా అనుకోకుండా ఏ ఇంట్లో పాలు పొంగుతాయో ఆ ఇంట్లొ శుభం జరుగుతుందిటండీ.."అని చెప్పెయ్యాలన్నమాట. అంతే. ఇంక మళ్ళీ ఎప్పుడు పాలు పొంగినా కూడా ఒక్కమాట కూడా వాళ్ళ నోటమ్మట రాదంటే నమ్మండి.

Wednesday, August 5, 2009

ఏమంటారు?

ఇచ్చట ఉచితముగా సలహాలు ఇవ్వబడును.

సమయం: అన్నివేళలా ( మీరు క్యూలొ వున్నారు. దయచేసి వేచియుండండి.)

గమనిక: ఒకసారి తీసుకున్న సలహా వాపసు తీసుకొనబడదు.

హెచ్చరిక: ఎవరు చేసుకొన్న ప్రయోగానికి వారే బాధ్యులు.మన ఎదురింట్లొనొ పక్కింట్లొనొ (బహుశా ఈ రోజుల్లో ఎదుటి ఫ్లాట్ పక్క ఫ్లాట్ అనాలేమొ)కొంతమంది మనుషులుంటారు. వాళ్ళు వేళా పాళా లేకుండా మన ఇంట్లోకి జొరబడిపొతుంటారు. వాళ్ళ కబుర్లు మనకి నచ్చవు. అలాగని వెళ్ళమని చెప్పలేము. బాగుండదు కదా. మన పని ఇంకా తెమలదు. . కూర కలియబెడుతూనో, పులుసు పోపు పెడుతూనో వుంటాము. ఈలోపల ఆవిడ ఇస్త్రీ చీర కట్టెసుకుని మనింటికి వచ్చేసి, మన డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ లో కూర్చుని మనల్ని సూపర్వైస్ చేస్తున్నట్టు ఇది ఇలా చెయ్యకూడదు..అలా చెయ్యాలి అని నస పెడ్తూ ఉంటుంది మనకేమో లొపలి నుంచి ఉడుకుమోత్తనం తన్నుకుంటూ వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు ఇలా చెయ్యాలి.. "అవునుకదా.. నువ్వు అన్నీ ఎంచక్కా చెస్తావు. నాకేంటో అలా రానేరాదు" అంటూ ఓకిలో బటాణీకాయల్ని ఆవిడ ముందు పోసి వలవమంటే సరి. లేకపోతే చిక్కుడుకాయలు బాగుచెయ్యమంటే సరి. అదీ కాకపోతే ఇన్ని దొండకాయలు, కత్తిపీటా ఆవిడ ముందు పెట్టి తరిగి ఇమ్మంటే సరి. అబ్బే..ఇవన్నీ అడిగితే బాగుండదు అంటారా.. అలాంటప్పుడు కొత్తచీర, ఫాల్, సూదీ, దారం ఆవిడ కిచ్చి.. "నువ్వెంత బాగా కుడతావో.. మొన్న నాకు సరిగ్గా రానేలేదు" అని కాస్త పొగిడేస్తే అయితే మన చీరకి ఫాలూ వచ్చేస్తుంది.. లేకపోతే మనకి ఆవిడ బాధా తప్పుతుంది. మరింకెప్పుడూ మన పనివేళ వచ్చి మనని ఇబ్బంది పెట్టదు. ఏమంటారు?

Tuesday, August 4, 2009

ఆశ్రేష కి అత్తగారుండరా?

ఆశ్రేషకి అత్తగారుండరు... మఖకి మామగారుండరు.. విశాఖ విసిరి కొడుతుంది.. వంటి మూఢ నమ్మకాలు మనలో చాలా మందికి వున్నాయి. ముఖ్యంగా పెళ్ళిసంబంధాలు చూసెటప్పుడు ఈ విషయాన్ని మరీ పెద్దది చెసి చూపిస్తారు. మనిషికి నమ్మకాలుండడంలో తప్పులేదు. అది మన మనుగడకు అవసరమే.కాని ఇలాంటి మూఢ నమ్మకాలవల్ల మనలో చాలా మంది అన్నివిధాలుగా అనుకూలంగా వున్న సంబంధాలని కూడా కేవలం ఈ ఒక్క కారణం తో వదులుకుంటున్నారు. శాస్త్రం గొప్పదే. అనుసరించదగ్గదె. కాని ఆశ్రేష నక్షత్రజాతకులు లక్షల్లొ వుంటారు. అందరికీ ఒక్కటే సూత్రం వర్తించదు. ఒకే నక్షత్రంలొ పుట్టిన లక్షలాది జాతకుల జీవితాలు ఒక్కలాగే నడవవు. ఎందుకని? ఎవరి వ్యక్తిగత జాతకాన్ని బట్టి వారి జీవితం నడుస్తుంది. నాకు తెలిసి మా బంధుమిత్రుల్లో ఆశ్రేష నక్షత్రం కలవాళ్ళు ఆరుగురు వున్నారు. వారి పెళ్ళయి ఇప్పటికి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతున్నా వాళ్ళ అత్తగార్లు నిక్షేపంగా వున్నారు.

దీని గురించి జ్యోతిశ్శాస్త్ర పండితులు విపులంగా చెప్పారు. శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన పిడపర్తివారు---కథలూ-గాథలూ అనే పుస్తకంలో దీని గురించి ఒక కథ వుంది. దానిని యధాతధంగా ఇక్కడ వ్రాస్తున్నాను..


ఆశ్రేష జన్మ నక్షత్రం
వధువు జన్మ నక్షత్రం ఆశ్రేష కనుక అయినట్లైతే అత్తగారి గండం వుంటుందనే మూఢనమ్మకం చాలా ప్రచారంలొ వుంది. అందువల్ల ఆశ్రేష నక్షత్రంలో జన్మించిన ఆడపిల్లకు పెండ్లిసంబంధం కుదర్చడం తల్లిదండ్రులకు చాలా కష్టమౌతోంది.ఈ రోజుల్లొ కేవలం జన్మనక్షత్రం ఆశ్రేష అయినంతమాత్రం చేతనే ఈ కీడు కలుగుతుందనే నమ్మకం తప్పు అని ఈ క్రింద గాధ రుజువు చేస్తుంది.

కీ//శే// పిడపర్తి పెదపూర్ణయ్య సిధ్ధాంతిగారు రామచంద్రపురం తాలూకాలోని పులుగుర్త గ్రామంలొ కాపురముండేవారు. ఆ తాలూకా లొనే మరో గ్రామంలో భాగ్యవంతులయిన కమ్మవారు వివాహ సంబంధం నిశ్చయించుకుని ఇంక ముహూర్తం పెట్టించుకోవడానికై ఆవూరిలోని సిధ్ధాంతిగారిని సంప్రదించడానికి వెళ్ళేరు. సిధ్ధాంతిగారు వధూవరుల జన్మ నక్షత్రాలు అడిగినప్పుడు తెలిసింది వధువు నక్షత్రం ఆశ్రేష అని. వెంటనే వరుని తండ్రి ఆ వధువును తన కుమారునికి చేసుకోవడానికి నిరాకరించెడు.కేవలం ఆశ్రేష నక్షత్రంలొ వధువు జన్మించినందువల్ల అత్తగారికి కీదు కలుగుతుందనే నమ్మకమే ఆయన నిరాకరణకు కారణం. అన్నీ నిశ్చయించుకుని ఆఖరిక్షణంలొ వచ్చిన ఈ ఆటంకానికి వధూవరుల తండ్రులూ, ఆవూరి పెద్దలూ చాలా విచారించెరు. కాని వరుని తండ్రి మాత్రం తన పట్టు విడువలేదు. ఔరి పెద్దలు ఒక రాజీ ప్రయత్నం చెసేరు.శ్రీ పెదపూర్ణయ్య సిధ్ధాంతిగారి అభిప్రాయమ్ తెలుసుకొవాలనీ ఆయన ధర్మశాస్త్రంలొ నిష్ణాతులు కనుక ఆయన దోషం లేదంటే తాను అంగీకరిస్తాననీ వరుని తండ్రి అన్నారు.

అందుకై వధూవరుల తండ్రులిద్దరూ కలిసి బయల్దేరి ఒకనాడు ఉదయం పులుగుర్త గ్రామం వచ్చేరు. అప్పటికి శ్రీ పెదపూర్ణయ్య సిధ్ధాంతిగారు ఊరిముందునున్న కాలువలో స్నానం చేస్తున్నారు. స్నానానంతరం వారు వచ్చిన కారణమేమిటని ప్రశ్నించేరు. వధువు తండ్రి విషయం వివరిస్తూ కేవలం ఆశ్రేష నక్షత్రమందు వధువు పుట్టిన కారణం వల్లనే వరుని తండ్రి ఈ సంబంధం నిరాకరిస్తున్నారనీ, సిధ్ధాంతిగారి అభిప్రాయం సెలవిమ్మని నెమ్మదిగా మనవి చేసేరు. సిధ్ధాంతిగారు చిరునవ్వుతో "నాతో రండ" ని వారిని తమ ఇంటికి తీసుకొని వెళ్ళేరు. వారి ఇంటిముందున్న తాటాకుల చాపమీద వచ్చినవారిని కూర్చోమని రెండవ అరుగుపై వారు కూర్చుని "బుచ్చమ్మా" అని పిలిచేరు. ఆయన కోడలు లోపలినుండి సావిడి లోనికి వచ్చింది. "నీ జన్మనక్షత్రమేమిటి?" అని ఆమె నడిగేరు. "ఆశ్రేష" అని ఆమె సమాధానం చెప్పింది. "నువ్వు లోపలికి వెళ్ళి మీ అత్తగారినిలా రమ్మను" అన్నారు. అయిదు నిమిషాలలో పచ్చటి దబ్బపండు వంటి మేనిఛాయతో, తెల్లటికొప్పుతో, నుదుట రూపాయినాణెమంత కుంకుమబొట్టుతో వారి ఇల్లాలు మహాలక్ష్మమ్మగారు సావిడిలొకి వచ్చేరు. "బుచ్చమ్మ నీకేమౌతుంది?" అని ఆమెనడిగెరు. "కోడలు" అని ఆవిడ సమాధానం విని, "సరే..పనిలోవు వున్నావేమో..చూసుకో "అనగానే ఆవిడ లొపలికి వెళ్ళేరు. వచ్చిన పెద్దమనుష్యులిద్దరూ తెల్లబోయి చూస్తున్నారు.

"చూసేరా.ఇప్పుడు వచ్చినావిడకు మొదట వచ్చినావిడ కోడలవుతుంది.ఆవిడ జన్మనక్షత్రం ఆశ్రేష అని చెప్పడం విన్నారుకదా..ఇరవై సంవత్సరాలయింది మా అబ్బాయి వివాహమయి.చూడండి అత్తగారు రాయిలా వుంది. దీని కేమంటారు?"

వెంటనే ఆ వచ్చినవారు సిధ్ధాంతిగారి పాదాలకు నమస్కరించి "మా సందేహం తీరిపోయిందండీ..సెలవు తీసుకుంటాం." అని లేచేరు.

" అందువలన అనవసరంగా మూఢనమ్మకాలతో వివాహసంబంధాలు పాడుచేసుకోకండి. మనస్సులో ఏవిధమైన శంకలూ, భయాలూ వద్దు. జన్మనక్షత్ర మొక్కటేనా జాతకాలనూ, జీవితాలనూ తారుమారు చేసేది? దోషంలేని చోట కూడా మూర్ఖమైన పట్టుదల వద్దు. శాస్త్రంలో నిషేధం లేనప్పుడు ఈ శంకలనవసరం. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. శుభం కలుగుతుంది." అన్నారు సిధ్ధాంతిగారు.

------------------------------------------------------------------

Monday, August 3, 2009

అలాగన్నమాట.

ఇచ్చట ఉచితముగా సలహాలు ఇవ్వబడును.

సమయం: అన్నివేళలా ( మీరు క్యూలొ వున్నారు. దయచేసి వేచియుండండి.)

గమనిక: ఒకసారి తీసుకున్న సలహా వాపసు తీసుకొనబడదు.

హెచ్చరిక: ఎవరు చేసుకొన్న ప్రయోగానికి వారే బాధ్యులు.


మనం ఒక్కొక్కసారి కొన్ని వస్తువులు ఎక్కడో మర్చిపోయి ఇంటికి వచ్చేస్తూంటాం. తీరా ఇంటికొచ్చాక అవి మర్చిపోయామని చెపితే ఇంట్లో ఏమి గొడవ జరుగుతుందోనని మరోవైపు భయం. అలా అస్సలు భయపడకూడదు. దానిని మనం మనకి అనుకూలంగా మార్చుకోవాలి. అదెలాగంటే...

మనం అన్నయ్యింట్లో సెల్ ఫోన్ మర్చిపోయి వచ్చామనుకోండి. అది ఆఫీస్ నుండి వస్తూ తెమ్మని శ్రీవారికి ఎలా చెప్పాలంటే..

(పబ్లిక్ ఫోన్ నుండి) " హలో.. నేనేనండీ... మీకు గుంటూరుగోంగూర ఇష్టంకదా.. అన్నయ్య ఎవరిచేతో ఇవాళ తెప్పిస్తానని చెప్పాడు....(అబ్బే...వుత్తినే...) వస్తూ,వస్తూ అలా అన్నయ్యింటికెళ్ళి గోంగూర తీసుకురండి. రేపు కమ్మగా పచ్చడి చేసి పెడతాను.." గురుడు అన్నయ్య ఇంటికి వెళ్ళకుండా ఇంటికి రాగలడా..ఎలాగూ అక్కడికి వెళ్ళినప్పుడు మీ ఫోన్ మీ అన్నగారు ఇవ్వకుండా ఉండరుకదా...అలాగన్నమాట.

Sunday, August 2, 2009

అదన్నమాట

ఇచ్చట ఉచితముగా సలహాలు ఇవ్వబడును.

సమయం: అన్నివేళలా ( మీరు క్యూలొ వున్నారు. దయచేసి వేచియుండండి.)

గమనిక: ఒకసారి తీసుకున్న సలహా వాపసు తీసుకొనబడదు.

హెచ్చరిక: ఎవరు చేసుకొన్న ప్రయోగానికి వారే బాధ్యులు.మనం బైటకు వెడదామని ఎంతో సరదాగా ప్రోగ్రామ్ వేసుకుంటాం. సరిగ్గా అదే టైమ్ కి ఎవరో వస్తారు. (ఇంకా మనకి ముందుగా ఫోన్ చెసి రావడం అలవాటు కాలేదు కదా).

మరి అలాంటప్పుడు మనం బొత్తిగా బుడుగు లాగ ఈ మీసాలవాళ్ళు ఎప్పుడు వెడతారు అని అడగలేం కదా. అలాంటప్పుడు ఏం చెయ్యాలంటే..సలహా

మీవారు వచ్చినవారితో మాట్లాడుతుంటే మీరు లోపలికెళ్ళి, మంచి గంజి పెట్టిన చీర కట్టుకుని, మెడలొ కాస్త కనిపించేదేదైనా వేసుకుని వచ్చిన వాళ్ళముందు అటూ యిటూ, అలా అలా చీర సర్దుకుంటూ, మెడ తిప్పుకుంటూ నడయాడండి. అప్పుడు వాళ్ళు.. "మీకేదైనా ప్రోగ్రామ్ వుందాండీ.." అని అడుగుతారన్నమాట. అప్పుడు మనం "అబ్బే.. ఫరవాలేదండీ.." అంటామన్నమాట. అప్పుడు వాళ్ళు "అయ్యో.. ఫరవాలేదండీ.. మేం బయల్దేరతాం.. మీరు వెళ్ళండీ.." అంటారన్నమాట. అప్పుడు మనం "సారీ అండీ.." అంటూ వాళ్ళతో పాటే బయట పడతామన్నమాట. అదన్నమాట.

Saturday, August 1, 2009

కేశవనామపూజకీర్తన

ఈమధ్య ఒక పెద్దావిడను కలుసుకున్నప్పుడు ఆవిడ కేశవ నామాలతో మనం నిత్యం పూజ చెసుకునే పధ్ధతిని పాటగా పాడడం విన్నాను. అంటే మనం రోజూ పూజ చెసుకుంటున్నప్పుడు భగవంతుడిని ధ్యాన, ఆవాహనాది షోడశోపచారాలతో పూజిస్తాంకదా.. దానిని కేశవ నామాలతో పాడారన్నమాట. దానిని అందరికీ అందించాలని ఇది రాస్తున్నాను. నేను విని రాయడంలొ పొరపాట్లు ఏమైనా వుంటే దయచేసి సరిచెయ్యగలరు.

కేశవనామపూజ కీర్తన(నిత్యపూజ)పల్లవి// రాముని పూజింపరే-భద్రాద్రి శ్రీరాముని పూజింపరే

రాజీవదళముల కామితార్ధప్రదుడైన కౌసల్య తనయుని//రాముని//

1. కేశవమూర్తిని-క్లేశనరసింహ్వుని-శ్రీశుని మదియందుచేర్చి-ధ్యానించి//రాముని//

2. నారాయణుడౌ-తారకరాముని-నారదసన్నుతు నావాహనముచేసి//రాముని//

3.మాధవమూర్తి-మంగళాకారుడౌ-ఆదిదేవున కర్ఘ్యపాద్యాచమనములా//రాముని//

4. గోవిందమూర్తియౌ-గోపరిపాలునికి-భావములరవేడ్క పంచామృతస్నానమున//రాముని//

5. విష్ణుస్వరూపునకు-విజ్ఞానమూర్తి ప్రభ-విష్ణుశ్రీరామునకు-విశుధ్ధోదకస్నానముచే//రాముని//

6. మధుసూదనుండౌ-మహనీయతేజునకు-ముదమున తడియొత్తి-అగరుధూపమువేసి//రాముని//

7.త్రివిక్రము-శ్రీరాము-దేవాదిదేవునకు-భువనసుందరునకు-సువర్ణ వస్త్రంబిడి//రాముని//

8.వామనుడౌ-హరికి-యజ్ఞోపవీతమొసగి-కామజనకునకు-గంధాక్షతిలిడి//రాముని//

9.శ్రీధరమూర్తియౌ-శ్రీరామచంద్రునకు-మోదముతో మంచి మొల్లలు మల్లెలు//రాముని//

10.హృషీకేశు-సాధుహృదయనివాసుని-భాసిల్లు మందార-పారిజాతంబుల//రాముని//

11.పద్మనాభమూర్తి-పరంధామునకు-సహస్రపద్మములచేత-పరమానందముమీర//రాముని//

12.దామోదరుండైన-దశరధశ్రీ-స్వామికి సంపెంగి, జాజి, విరజాజుల//రాముని//

13. సంకర్షణమూర్తియౌ-సర్వాంతర్యామికి-ప్రాకటముగ ధూప దీపములర్పించి//రాముని//

14.వాసుదేవు-పరమేశు-శ్రీరాముని భాసురంబుగ మంచి భక్షభోజ్యంబుల//రాముని//

15.ప్రద్యుమ్నమూర్తియౌ-పరమోత్తరామునకు హృద్యముగ కర్పూర విడెము సమర్పించి//రాముని//

16.అనిరుధ్ధమూర్తికి-వనజదళాక్షునకు-ఘనముగ పచ్చకర్పూరహారతులిచ్చి//రాముని//

17.పురుషోత్తముండైన పుండరీకాక్షునకు కరుణసాగరునకు కర్పూర నీరాంజనాచమున//రాముని//

18. అధోక్షజుండైన-ఆనందరామునకు-మదిని పొంగుచు వేగ మంత్రపుష్పంబుడి//రాముని//

19.నారసింహుడైన శ్రీరామమూర్తికి-సారెకు ప్రదక్షిణ నమస్కారములుచేసి//రాముని//

20.అచ్యుతమూర్తియౌ-హరిశ్రీరామునకు-హెచ్చుగ చామరాలే వీవ నిజభక్తులు//రాముని//

21.జనార్ధనమూర్తి-శ్రీజానకీపతిచెంత- గానంబుసేయగా-గంధర్వ కిన్నెరులు//రాముని//

22.ఉపేంద్రమూర్తియౌ-శ్రీపతి శ్రీరామ-భూపాలచంద్రుపై పన్నీరు చల్లుచు//రాముని//

23.హరి-శ్రీరామయని-ఆనందమగ్నులై-సురలు సుమవృష్టిని-సొంపుగ కురియింప//రాముని//

24.శ్రీకృష్ణ యని-బుధులు చేరి-నృత్యము చేయ-కౌకుత్సతిలకుడౌ ఘనుడు-సీతా సహితు//రాముని//

25.భూమిజతోగూడి-పూర్ణేందువదనుడు-రామపుత్ర హృదయధామమున రంజిల్లు//రాముని//--------------------------------------------------------------------------------

గొప్ప బహుమతి..

ఇచ్చట ఉచితముగా సలహాలు ఇవ్వబడును.

సమయం: అన్నివేళలా (మీరు క్యూలొ వున్నారు. దయచేసి వేచియుండండి.)

గమనిక: ఒకసారి తీసుకున్న సలహా వాపసు తీసుకొనబడదు.

హెచ్చరిక: ఎవరు చేసుకొన్న ప్రయోగానికి వారే బాధ్యులు.

మొన్నీమధ్యనే మా దోస్తు కొడుకు పెళ్ళయింది. సాధారణంగా మేము ఒక పదిమంది పైన మా కాలనీ లో కలిసి తిరుగుతుంటాం. ఎప్పుడూకుడా అందరం కలిసి ఇంత అని వేసుకుని ఇలాంటి సమయాల్లో ఒక పెద్ద వస్తువేదైనా బహుమతిగా కొని ఇచ్చే అలవాటు. ఈసారి మరికాస్త ఎక్కువగానే వేద్దామనే నిర్ణయానికొచ్చేం. ధరలన్నీ మండిపొతున్నాయిగా మరి. దానికి ఏమీ అభిప్రాయభేదం రాలేదు కాని బహుమతే యేది కొనాలా అన్నదాని మీద వాడిగా, వేడిగా చర్చలు జరిగాయి. ఆఖరికి నాలాంటి పెద్దతలకాయలం పూనుకొని అందరి నోళ్ళూ మూయించి బహుమతి కొనేసేం. ఆ బహుమతి చూసి మా దోస్తు ఎంత సంబరపడిపొయిందో..మరో రెండు నెలలపాటు కొడుకూ, కోడలూ కాస్త సరదాగా నెలకో సినిమాకీ, నెలకోసారి సిటీలొ షికారుకీ వెళ్ళొచ్చని మహదానందపడిపొయింది. ఇంతకీ ఆ బహుమతి ఏమిటా అని కుతూహలంగా వుందా.. ఇదిగో వినండి.. మేము కొన్నవి.. పది కిలోల బియ్యం, రెండు కిలోల కందిపప్పు, రెండు కిలోల మినప్పప్పు, ఇలాగ సంసారానికి కావలసిన సంభారాలన్నీ(ఒక్క ఉప్పూ, నూనె తప్ప) (అవి ఇవ్వకూడదని సెంటిమెంటు కదా) కొని ఇచ్చేసాము. ఎలాగుంది మా బహుమతి? మీకు కూడా ఇలాంటి వాటికి సలహాలు కావాలంటే నన్ను సంప్రదించండి.