Pages

Wednesday, October 29, 2014

లలితా మహిళామండలి ఇరవైయ్యొకటవ వార్షికోత్సవ సంబరాలు..



    ఈ నెల యేడవ తారీకు మంగళవారం  మా లలితా మహిళామండలి ఇరవైయ్యొకటవ వార్షికోత్సవం చాలా బాగా జరిగింది. ఆరోజు మధ్యాహ్నం పదకొండు గంటలకల్లా మా సభ్యుల్లో ఒకరయిన రాజ్యలక్ష్మిగారింటికి మేమందరం చేరిపోయాం.
ఈవిడే రాజ్యలక్ష్మిగారు.


 
 
 
      ఆ రోజు మా విందుబాధ్యతంతా ఆవిడే తీసుకున్నారు. యెంతైనా పెద్ద మనసులెండి. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసారు.
 
ఈసారి వార్షికోత్సవాలకి మా సభ్యులం అందరం యెవరికి తోచిన ప్రజ్ఞ వాళ్ళు చూపించాలని అనుకున్నాము. ఆ సందర్భంగా
 
  అంతకు ముందే జరిగిన మహాత్మాగాంధీ పుట్టినరోజుని గుర్తు చేస్తూ దుర్గ గాంధీగారి గురించి  కొన్ని విషయాలు
 
సోదాహరణంగా ప్రస్తావించారు.
 
 


                              కమలగారు తరిగొండ వెంగమాంబ జీవితం గురించి ఆసక్తికరంగా వివరించారు.




                                  గాయత్రి పోతన భాగవతంలోని పద్యాల మాధుర్యాన్ని రుచి చూపించారు.




                                                   సీత బలే బలే జోక్స్ చెప్పి నవ్వించారు.




                           శారద తెలంగాణా మాండలికంలో వినాయకచవితి కథ చెప్పి అందరినీ ఆహ్లాదపరిచారు..




                                          రామలక్ష్మి దుర్గాష్టకం చదివి అందరిలో భక్తిభావం కలిగించారు.


    రాజ్యలక్ష్మి  కొన్ని నవీన జీవితసత్యాలను చదివి అందరి కళ్ళూ తెరిపించారు. అందులో మచ్చుకి ఒకటి రెండు చెప్పాలంటే..
పెద్ద పెద్ద ఇళ్ళు-ఒంటరి సంసారాలు
పెరిగిన డిగ్రీలు-తగ్గిన కామన్ సెన్స్
ఎక్కువ జీతం- తగ్గిన మనశ్శాంతి ... లాంటివి. బాగున్నాయి కదూ..




       కళ్యాణి కస్తూరి రంగ రంగా అంటూ చిన్నికృష్ణుని పుట్టుక గురించి యెప్పటిదో పాటని మళ్ళీ అందరికీ అందజేసారు.




   ఉమాసుందరి కోడలు దిద్దిన కాపురం సినిమాలో  "నీ ధర్మం నువు మరవొద్దూ.." అంటూ అందరినీ ప్రగతి పథులని చేసారు.



               విద్యుల్లత "ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుందీ.." అని పాడి అందరినీ శబరి భక్తిలో ముంచేసారు.



       రత్న శాంతినివాసం సినిమాలో "రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా.." పాటను మృదుమథురంగాపాడి అందరినీ సరాగాల ఉయ్యాలలో ఊపేసారు.



                          పద్మామూర్తి కీరవాణిరాగంలో "అంబ వాణి నన్నాదరింపవే.." పాడి వీణాపాణిని స్తుతించారు.


                                                             
                                                           మా మిగిలిన సభ్యులు..లక్ష్మీ ఆచార్య.

 

                                                                       సరస్వతి..




                                                                            సంధ్య

 

            సౌమ్య మా సభ్యురాలు కాకపోయినా మాలాంటి అమ్మమ్మలకోసం పరిదాన మిచ్చితే..పాడి ఆనందపరిచింది.




                          నేనూ, మా చెల్లెలు భారతీ టీవీ ప్రోగ్రాముల గురించి చిన్న వ్యంగ్య నాటిక లాంటిది చేసాము.

 
 
 చెప్పుకోడానికి ఆఖరున చెప్పుకున్నా అయస్కాంతంలా అందరినీ ఆకట్టేసుకుని, నాయకత్వం వహించేసి, మా అందరిచేతా హౌసీ ఆడించేసిన అమేయ సంతోషం చెప్పలేనిది. ఇదిగో అమేయ..
 
 
 
 
 
 ఇన్ని పాటలూ పాడేసుకుని, ఇన్ని కబుర్లూ చెప్పేసుకుని, ఇన్ని ఆటలూ ఆడేసుకుని మరి అసలు సంగతి చెప్పుకోకపోతే యెలా.. అదేనండీ.. విందు భోజనం.. ఇదిగో..
 
 
 
 
 
 
                                అన్నట్టు మీకు ఇంకా ఓపిక వుంటే నేనూ, భారతీ కలిసి చేసిన స్కిట్.. ఇదే..


 
 
                       అందరం కలిసి యెంచక్కా సరదా సరదాగా గడిపి సాయంత్రానికి ఇళ్లకి మరలాము..
 
-------------------------------------------------------------------------------------------------------------------- 
 


 

Thursday, October 16, 2014

శ్రథ్థాంజలి..



      మాన్యులు శ్రీమతి తురగా జానకీరాణిగారు నాకు గురుతుల్యులు.

    ఇరవై సంవత్సరాలక్రితం ఒక కథ వ్రాసి ఆకాశవాణి స్త్రీల కార్యక్రమానికి పంపిస్తే, అలా కథలా కాకుండా అదే విషయాన్ని ఒక నాటికలా వ్రాసి పంపమని ఆవిడ స్వయంగా ఉత్తరం వ్రాసారు. అంత పేరున్న ఆవిడ ఎంతో ఆప్యాయంగా అలాగ వ్యక్తిగతంగా నాకు ఉత్తరం వ్రాయడం నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది. ఆవిడ అలా చెప్పడం వలన ఆకాశవాణికి నాటికలు ఎలా వ్రాయాలో నాకు తెలిసింది. ఆ నా మొట్టమొదటి నాటికను “రేపటి మహిళ” అనే పేరుతో ప్రసారం చేసారు జానకీరాణిగారు.

    అంతే కాకుండా మీ స్నేహితులంతా కలిసి ఒక మహిళామండలిగా యేర్పడండి, మీకు ఆకాశవాణిలో కార్యక్రమం చేసే అవకాశమిస్తాను అని చెప్పి, మమ్మల్ని ప్రోత్సహించి, లలితా మహిళామండలి ఆవిర్భవించడానికి కారణమయ్యారు. మా మొట్టమొదటి ప్రోగ్రామే సంక్రాంతిపండుగ ప్రత్యేక కార్యక్రమంలా చేయించి, మమ్మల్ని యెంతగానో ప్రోత్సహించారు.  ఆవిడ ఇచ్చిన స్ఫూర్తి వలన మేము అలాగ యెన్నో కార్యక్రమాలు చేసాము.

     అంతే కాకుండా యెక్కడ కనపడినా ఆప్యాయంగా పలకరించడం ఆవిడ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. నేను వ్రాసిన కథలను చదవమని ఆవిడకు యిస్తే, యెంతో ఓపికగా అవి చదవడమే కాకుండా, మా ఇంటికి ఫోన్ చేసి మరీ ప్రతి కథనూ విశ్లేషించడం నాకు ఒక వరంగానే అనిపిస్తుంది.

   అటువంటి మహా మనీషి గురించి యెంత చెప్పినా తక్కువే. వారి పిల్లలకు ఈ దుఃఖం తట్టుకునే శక్తి నివ్వాలనీ, ఆవిడ ఆత్మకు శాంతి కలగాలనీ ఆ భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను.