Pages

Thursday, November 15, 2012

పండగ సందడి..




  పండుగకి పిండివంటలు యేమి చేద్దామా అని ఆలోచిస్తోంది ఇందుమతి. భర్త చంద్రశేఖరాన్ని సలహా అడిగింది.
తనకా హోదా యిచ్చినందుకు యేనుగెక్కినంత సంబరపడ్డాడు చందూ..
 "లడ్డూ చేసెయ్.. " అన్నాడు తీయదనం నెమరేసుకుంటూ..
"పంచదార రేటెంత పెరిగిందో తెలుసా..?" గుర్తు చేసింది ఇందు.
నాలుక్కరుచుకున్నాడతను. బెల్లంతో చెసేవేముంటాయబ్బా... అని దీర్ఘంగా ఆలోచించి,
"పోనీ బూరెలు చెయ్యి.. " అన్నాడు.
"నూనె ధర తెలిసే అంటున్నావా..?" మరో బాంబు పేల్చింది ఇందూ..
ఒక అయిదు నిమిషాలు టైము తీసుకుని, తన బుర్రని మథించి..
"హా.. చక్కెరపొంగలి చెయ్యి.." అన్నాడు తన ఆలోచనకి మురిసిపోతూ..
"అప్పుడే గేస్ సిలిండర్ తెచ్చి నెల దాటింది. ఇప్పుడు కూరా, పచ్చడులు తప్ప పిండివంటలు మొదలుపెడితే ఇట్టే అయిపోతుంది. మళ్ళీ మనం సబ్సిడీ లేకుండా కొనుక్కోవాలి. మీ ఇష్టం.. చెయ్యమంటే చేస్తాను.."
యెంతో ఒద్దికగా చెప్పింది.
వెయ్యిరూపాయలు గాల్లో యెగిరిపోతున్నట్టు కనిపించాయి చందూ కళ్ళకి..
యింక ఇందూ ముందు ఓటమిని అంగీకరించి..
"నీ ఇష్టం.. నీకేది బాగుంటుందంటే అదే చెయ్యి.." అన్నాడు.
 వెంటనే ఇందూ ఒక సంచీ తెచ్చి చందు చేతికిచ్చి, "స్వీట్ షాప్ కి వెళ్ళి ఓ పావుకిలో కాజాలు తెండి.."
అని చందూని షాప్ కి పంపి, టివీలో సీరియల్ చూడ్డం మొదలెట్టింది.

 --------------------------------------------------------------------------------------------------