Pages

Sunday, April 29, 2012

ఒక ఇంగ్లీష్ అమ్మాయితో పరిచయం.


       మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన "మరపురాని అనుభవాలు" అనే పుస్తకంలో ఆయన రాసుకున్న అనుభవాల్లో ఇదీ ఒకటి. 1935 ప్రాంతాల్లో జరిగిందిది. చిన్నప్పుడు ఆయన మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఈ కథ చెప్పినప్పుడల్లా ఇందులో ఆ ఇంగ్లీష్ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఖండించనందుకు మా నాన్నగారితో దెబ్బలాడేవాళ్లం. ఆయన నవ్వేసి ఊరుకునేవారు. అదేమిటో మీరూ చదవండి మరి..
     ఒక ఇంగ్లీష్ అమ్మాయితో పరిచయం.
  బెనారస్ యూనివర్సిటీ చదువు పూర్తయిన తరువాత ఒకసారి ఉత్తరదేశ పట్టణాల విశేషాలు చూద్దామని ఢిల్లీ వరకు వెళ్ళాను. ముఖ్యంగా చూడదలచుకున్నది ఆ టూర్ లో తాజ్ మహల్. అందువలన ఢిల్లీ నుండి ఆగ్రా వెళ్ళి ఆ పట్టణంలో ఇతర విశేషాలు చూద్దామని టాంగాలో బయలుదేరాను. ఫతేపూర్ సిక్రీ, ఆ చుట్టూప్రక్కల విశేషాలు చూసిన తరువాత,  ఇంకా కొన్ని చూడవలసిన గోరీలు ఉన్నాయని టాంగావాలా తీసుకువెడుతున్నాడు. కొంతదూరం వెళ్ళాక టాంగావాలా టాంగా ఆపుచేసాడు. ఎందువలన ఆపాడోనని ముందుకు చూసాను. అక్కడ ఒక విదేశీ అమ్మాయి రోడ్డు వారగా చిన్న గొడుగుతో నిల్చుని ఉంది. టాంగాలో ఇంకా ఖాళీ ఉండడం వలన ఆ అమ్మాయి టాంగాలో వస్తుందేమోనని టాంగావాలా ఆశపడ్డాడు. ఆ అమ్మాయికి వయస్సు ఇరవై సంవత్సరాలకు మించియుండదు.
టాంగావాలా ఇంగ్లీష్ లో అడిగిన ప్రశ్న ఆమెకు అర్ధం కాలేదు కాని అడిగిన విషయం గ్రహించగల్గింది. వెంటనే నిరాకరించినట్లుగా తల ఊపింది. టాంగావాలా తిరిగివచ్చి టాంగాను బయలుదేరదీశాడు. నేను వాడిని టాంగా ఆపమని క్రిందకి దిగి, ఆమె దగ్గఱకు వెళ్ళి, ఆమె వచ్చినట్లయితే సాదరంగా ఆహ్వానం ఇవ్వగలనని ఇంగ్లీష్ లో అడిగాను. అందుకామె కృతఙ్ఞతలు తెల్పుతూ ఎక్కడివరకు వెళ్తున్నారని అడిగింది. నేను వెళ్లదలచుకున్న ప్రదేశమేమిటో చెప్పాను. ఆమె తాను అవియన్నీ చూశాననీ తిరుగుప్రయాణంలో రావడానికి అభ్యంతరం లేదనీ చెప్పింది. అది విని నేను మళ్ళీ టాంగా ఎక్కి ముందుకు సాగేను. నేను చూడవలసినవన్నీ చూసి, ఆ టాంగాలోనే తిరిగివస్తుంటే, ఇదివరకు నిల్చున్న ప్రదేశానికి కొంచెం దగ్గరలోనే ఆ అమ్మాయి నిల్చొని ఉంది. నేను టాంగా ఆపగానే నన్ను చిరునవ్వుతో పలకరించి టాంగా ఎక్కి కూర్చుంది. అది ఆగ్రాకు తిరుగుప్రయాణం. సుమారు ఒక గంట సేపు పట్టింది.
ఆ సమయంలో ఆమెతో జరిగిన సంభాషణలో ఆమె చూపిన నేర్పరితనం, ఆత్మీయతా, ఇప్పటికీ నేను మరువలేకుండా ఉన్నాను. ఆమె నా వివరాలు తెలుసుకుని, తన వివరాలను ఈ విధంగా చెప్పింది. లండను నగరానికి పదిమైళ్ళదూరంలో వారి ఇల్లు ఉన్నదనీ, ఆమె తన తల్లిదండ్రులతో కలిసి అక్కడ ఉంటోందనీ, ఆస్ట్రేలియాలో నున్న అన్నగారిని చూడడానికి వెళ్ళి, తిరిగి లండన్ వెళుతూ తాజ్ మహల్ చూడడానికి తాను కలకత్తాలో ఓడ దిగి ఇలా వచ్చాననీ, మళ్ళి తిరిగి వారంరోజుల్లో బొంబాయిలో ఓడ ఎక్కి లండను వెళతానని చెబుతూ, నేను "లా" చదువుతున్నట్లు తెలుసుకుంది. కనుక నన్ను లండన్ వచ్చి బార్-ఎట్- లా చేయవలసిందిగా ఆహ్వానించింది. లండనులో వారి కుటుంబసభ్యుడుగా ఉండవచ్చనీ తన తల్లిదండ్రులు   నాకు ఏ లోటూ రాకుండ చూసుకుంటారనీ ఎంతో ఆత్మీయతతో చెప్పింది. నేను చాలా ఆనందించాను. అతిథి సత్కారమనేది కేవలం హిందువుల ప్రత్యేకతయే కాదని తెలిసివచ్చింది.
  మేమిద్దరం కలిసి ప్రయాణం చేసిన గంటసేపూ కూడా ఆగ్రా పట్టణాన్ని గురించి మొగలు సామ్రాజ్యాన్ని గురించి, మేము చూస్తున్న శిథిలాలగురించి చాలా విషయాల నెంతో వివరంగా చెప్పింది.
     ఇండియాలో ఉన్న నాకు తెలియని యీ విషయాలన్నీ నీకెలా తెలిసాయని ఆమె నడిగాను. అప్పుడామె "నేను ఈ దేశం చూడడానికి వచ్చాను. రావడానికి ముందుగా ఈ దేశం గురించి నాకు దొరికిన పుస్తకాలన్నీ చదివాను. ఈ దేశం గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతనే ఈ దేశం చూడడానికి వచ్చాను. అలా కాకపోతే ఈ దేశం వచ్చిన ప్రయోజనం లేదుకదా! నేను చూసినదేమిటో, వాటి ప్రాముఖ్యం ఏమిటో తెలియకపోతే నా ప్రయాణం వృధాయే కదా!" అని అన్నది. ఆ సమాధానం విని, ఆమె తెలివికి జోహారులర్పించాను. ఆగ్రా పట్టణానికి ముందుగా ఒక ఇంగ్లీష్ కాన్వెంటు ఉంది. ఆమె అక్కడ నా దగ్గర వీడ్కోలు తీసుకుని దిగిపోయింది.
   నాలుగైదు రోజుల తరువాత నేను ఢిల్లీనుండి బొంబాయి వెళుతూ ఉండగా "ఝాన్సీ" స్టేషన్ లో బండి ఆగినపుడు నేను ప్లాట్ ఫారం మీద నడుస్తుండగా "శాస్త్రీ, శాస్త్రీ, " అన్న పిలుపు వినగానే తిరిగి చూశాను. ఆ బండిలో మొదటి తరగతి కంపార్టుమెంటులో ఆ అమ్మాయి కనిపించింది. నన్ను పెట్టెలోనికి రమ్మని ఆహ్వానించింది. ఇంకొక ముగ్గురమ్మాయిలు ఆమెతో ఆ కంపార్టుమెంటులో ఉన్నారు. వారు కూడా ఇంగ్లీష్ వారే.  పరస్పర పరిచయాలయిన తదుపరి ఒక పదినిముషాలు సంభాషణ మా మధ్య సాగింది. బేరర్ ఒక ట్రేలో టీ తీసికొని వచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు. అందరం కలసి టీ తీసుకున్నాం. ఆ ట్రేలో టీ నిమిత్తం ఇవ్వవలసిన ఖరీదుకు ఒక బిల్లు ఉంది. నేనది చూచి ఆ మొత్తం నేనిద్దామనే ఉద్దేశంతో జేబునుండి పర్సు తీయబోయాను. అప్పుడా అమ్మాయి చిన్నగా నవ్వుతూ అన్నది కదా- "No, no,Sastry, I know Indians are poor" అని. దానికి నేనేమనగలను? ఆమె ఙ్ఞాపకాలను ఆజన్మాంతం హృదయంలో పదిలంగా దాచుకొనడం తప్ప.
---------------------------------------------------------------------------------------------
(చిత్రం--గూగులమ్మ సౌజన్యంతో...)
Monday, April 23, 2012

ఆదివారంనాడు ఆడుతూ పాడుతూ...


ఆదివారంనాడు ఆడుతూ పాడుతూ...       
           ఏప్రిల్..22, మధ్యాహ్నం 11గంటలు...
హైదరాబాదులో ఆకాశంలో విద్యుత్ తరంగాలు ఒకదాని నొకటి ఢీకొంటున్నాయి. ఒకదానితో మరొకటి గుసగుసలాడుతున్నాయి. తొందరగా రండి.. శ్రీనగర్ పోవాలి అంటూ ఒకదానినొకటి తొందరపెడుతున్నాయి. "ఎందుకంత తొందర? ఏముందివాళ అక్కడ?" అని ఒక పిల్ల తరంగం పెద్ద తరంగాన్ని అడిగింది.
"ఇవాళ అక్కడ కొందరు మహిళా బ్లాగర్లు కలవబోతున్నారు. వాళ్ళు ఏమేం వండేసుకున్నారో, ఏమేమి చెప్పేసుకుంటున్నారో మనం వినాలి." అంది పెద్ద తరంగం.
"మామూలుగా వాళ్ళు ఏం చేస్తారు?" అడిగింది పిల్ల తరంగం.
తనకి తెలిసినంతవరకూ చెప్పింది పెద్దతరంగం. ఆ మాటలు విని అవి నిజమో కాదో చూద్దామని ఉత్సాహపడింది పిల్ల తరంగం.
అందులోమొదటిది..
వాళ్లందరూ వేలు వేలు ఖరీదు చెసే చీరలుకట్టుకుని, లక్షలు ఖరీదు చేసే నగలు పెట్టుకుని వచ్చి, అక్కడ వాటిగురించే మాట్లాడుకుంటారు.
అబ్బే.. పిల్ల తరంగానికి అలాంటిదేమీ కనిపించలేదు. పెద్దవాళ్ళందరూ చక్కటి చేనేత చీరల్లోనూ, చిన్నవాళ్ళు నిండుగా పంజాబీడ్రెస్సుల్లోనూ వున్నారు.
అక్కడ అన్నిగంటలు కూర్చున్నా ఒక్కసారి కూడా ఎవ్వరి నోటమ్మటా ఒక చీరమాట కాని, నగ మాట కాని రాలేదు.
రెండోది..
ఇంట్లో మగవాళ్లని వదిలేసి, వీళ్ళు ఇక్కడ విందులు చేసుకుంటున్నారు.
అది కూడా కాదనిపించింది ఆ పిల్లతరంగానికి. ఇంట్లోవారికి వండిపెట్టే వచ్చేరు అక్కడికి ఆడవాళ్ళందరూ. ఇంకా చెప్పాలంటే వెడుతూ, వెడుతూ ఇంట్లోవారి కోసం ఇక్కడి స్పెషల్స్ కూడా తీసికెళ్ళేరు.
పెద్దతరంగం మాటలేవీ పిల్ల తరంగానికి నచ్చలేదు. అందుకే ఆ మహిళా బ్లాగర్లను పరిశీలిస్తూ అక్కడే తచ్చాడింది.
మహిళలందరూ వస్తూ వస్తూ ఏదో ఒకటి తెచ్చారు.
"ఇచ్చుటలో వున్న హాయి...
వేరెచ్చటనూ లేనే లేదనీ.."
అన్నట్టు అందరూ ఏదో ఒకటి అందరికీ ఇవ్వడమే...
ఙ్ఞానప్రసూనగారు ఎంచక్కటి కంప్యూటర్ గ్రాఫిక్ రామాయణం పుస్తకాన్ని ఎంతో ప్రేమగా మాలాకి ఇచ్చారు.
జ్యోతి మంచి హిందీపాటలు, ఆపాతమధురాలైన తెలుగుపాటలు రికార్డ్ చేసిన సిడిలు అందరికీ ఇచ్చారు.
స్వాతి న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేయబడిన చాక్లెట్ లతో అందరి నోరూ తీపి చేసింది.
ఇంక వంటల ఘుమఘుమలు సరేసరి.. ఎవరిది వారికే సాటి అన్నట్టున్నాయి.
ఒకరినొకరు ఎంతో హుందాగా పరిచయం చేసుకుని జోక్స్ చెప్పుకున్నారు. వాతావరణమంతా ఆహ్లాదకరంగా తయారయింది. అందరి మొహాల్లోనూ సంతోషం, ఉత్సాహం.
  "మిస్ గెట్ టుగెదర్" బిరుదు  వరూధినిని వరించింది. ప్రసూనగారు ఆ బహుమతి ఆవిడకి అందచేసారు.
అన్ని రుచులూ ఆస్వాదిస్తూ విందారగించారు.
ఆపైన సరదాగా గేమ్ ఆడారు. అందులో ఉమాదేవి గెలిచారు.
ఆ బహుమతి శ్రీలలిత ఉమాదేవికి అందచేసారు.
ఆ తర్వాత తంబోలా ఆడారు. ఆ పైన అంత్యాక్షరి వుండనే వుంది.
అఙ్ఞానిని చూస్తున్నట్టు నిర్వికల్పంగా జ్యోతి నవ్వుతూ చూస్తుంటే నేను ఆవేశంగా అంత్యాక్షరి ఆడేసాను.
ఇంతలో తేనీరు వచ్చేసింది. టీ తాగేసి అందరూ "పోదామా.. ఇక పోదామా" అనుకుంటూ ఇళ్ళకు మరలారు.
ఇదంతా చూసిన పిల్లతరంగం "ఎందుకు నవ్వన్నీ అబధ్ధాలు చెప్పేవ్?" అంటూ పెద్దతరంగాన్ని అడిగింది.
"ఏమో.. నాకేం తెలుసూ.. నేనలా అనుకున్నాను" అంటూ పెద్దతరంగం తన ఊహ నిజం కానందుకు బాధపడుతూ శూన్యంలో కలిసిపోయింది.
ఇదీ మహిళా బ్లాగర్ల సమావేశంలో జరిగినది.
సర్వేజనా స్సుఖినో భవంతు..
సర్వ మహిళా బ్లాగర్ల పునః కలయిక ప్రాప్తిరస్తు...
----------------------------------------------------------------------------------------- Sunday, April 1, 2012

మహిళాదినోత్సవం కబుర్లు..(కాస్త ఆలస్యంగా..)

ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళాదినోత్సవానికి మా స్నేహితురాళ్ళం అందరం కలిసి ఏదైనా ప్రోగ్రామ్ వేసుకుంటూంటాం. అలాగే ఈసారి కూడా ఏం చేద్దామా అని అనుకుంటుంటే ఒక ఫ్రెండ్ "అందరూ ఆ రోజు మా ఇంటికి లంచ్ కి వచ్చెయ్యండీ.." అని అపర అన్నపూర్ణలా ప్రకటించేసేరు. ఏంటండీ కథా, కమామీషూ.. మీ.. పుట్టిన్రోజా ..పెళ్ళిరోజా.. అని ఆరా తీస్తే "అబ్బే.. అదేంకాదు.. సరదాగా అందరం కలిసి మా ఇంట్లో భోంచేద్దాం.." అన్నారు. ఎవరెప్పుడు భోజనానికి పిలుస్తారా అని చూసే నాలాంటివాళ్ళం వెంఠనే ఒప్పేసుకున్నాం. కాని కొంతమంది ఫీల్ అయిపోయి "ఎందుకండీ.. ఎప్పట్లాగే అందరం తలోటీ చేసుకుందాం..." అనడం మొదలెట్టేరు. చర్చ ఏం తేలుస్తుందా అని చూస్తుంటే భోజనానికి పిలిచినావిడ "ససేమిరా ఎవ్వళ్ళూ ఏమీ తేవద్దు, అన్నీ ఒంటి చేత్తో నేనే చెసేస్తాను" అని నిర్ధారించేసేరు. ఆ అపర అన్నపూర్ణగారు ఈవిడే.. పేరు రాణీ కల్యాణి.
ఆవిడ చేసిన వంటకాలు కూడా బ్రహ్మాండంగా వున్నాయి. ఇవిగో...
ఇవికాక ఇంకొంతమంది అన్నపూర్ణలు గోంగూర పచ్చడి, అరటికాయ బజ్జీలు లాంటివి చేసి తీసుకొచ్చేరు. (హేవిటో..పిచ్చివాళ్ళు. భోజనానికి పిలిచినప్పుడు నాలాగ చేతులూపుకుంటూ వెళ్ళాలని తెలీదు పాపం) సరే.. మా మహిళలందరం మాకేకదా ఈ రోజు స్వాతంత్ర్యం వచ్చింది అని మహా సంబరపడిపోతూ అంతర్జాతీయ మహిళాదినోత్సవం గురించి కాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత ఒక ఫ్రెండ్ దేశంలో శైవక్షేత్రాలెన్ని వున్నాయో ఒక్క నిమిషంలో రాయమన్నారు. ఎవరెక్కువ రాస్తే వాళ్ళకి బహుమతన్నమాట. అలాంటిదే ఇంకో తెలుగుపదాల మీద పరీక్ష. మేమందరం ఆవిడ తెలుగు టీచరు అవకుండా పిల్లల్ని కాపాడినందుకు ఆ దేవుడిని తల్చుకుంటూ అదీ రాసాం. (రెండిట్లొ ఒకదానికి నాకు బహుమతి కూడా వచ్చిందోచ్) తర్వాత అద్భుతమైన విందారగించాం. ఇంటావిడకి కూడా మొహమాటపడకుండా మేమే వడ్డించేం.. ఆ తర్వాత రెండు వన్ మినిట్ గేమ్ లు ఆడాం. అందులో ఒకటి తల మీద కేప్ పెట్టుకుని, దానికి టూత్ బ్రష్ వేలాడదీసి, అది పడిపోకుండా నడవాలన్న మాట. ఇలాగ.. ఇదిగో..ఈవిడకే ఈ ఆటలో బహుమతి వచ్చింది.
అలాగ స్నేహితులమందరం చాలా సంతోషంగా కాలం గడిపి, మూడుగంటలకి ఇంటావిడ ఇచ్చిన టీ తాగి, వచ్చే యేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడొస్తుందా అని ఆలోచించుకుంటూ ఇంటిదారి పట్టేం.. ----------------------------------------------------------------------------------------------------------------