Pages

Friday, August 24, 2012

“అయామ్ మింగింగ్..”
అయామ్ మింగింగ్..

  మా చిన్నప్పుడు కొంతమంది స్నేహితులు తెలుగు, ఇంగ్లీషు కలిపి మాట్లాడేసేవారు..
”ఒక సాంగు సింగుతావా..” అంటూ.
   అది మొట్టమొదట విన్నప్పుడు నాకు యేమిటోగా అనిపించింది. సాంగ్ సింగడ మేవిటి..హాయిగా తెలుగులో “ఒక పాట పాడవా..” అంటే ఎంత బాగుండును అనిపించింది. కాని వాళ్ళు ఆ రోజుల్లో ఇంగ్లీషు మాట్లాడుతున్నామనే ఆనందంతో అలా అనేసేవారు.
     తరవాత్తరవాత కాలేజీ కెళ్ళాక క్లాసులో లెక్చరర్ పాఠం చెపుతుంటే ఒక నోట్ బుక్ లో పాయింట్స్ నోట్ చేసుకునేదాన్ని. నా పక్కనున్న వాళ్ళిద్దరూ కూడా అలాగే పాయింట్స్ నోట్ చేసుకుంటూ మధ్యమధ్యలో నోట్ బుక్స్ మార్చుకునేవారు. బహుశా ఏదయినా పాయింట్స్ మిస్ అయి అలా చేస్తున్నారనుకున్న నేను ఒకసారి మా లెక్చరర్ చెపుతున్న పాయింట్ సరిగా అర్ధం కాక రాసుకోలేకపోయి  పక్కన కూర్చున్నామెని నోట్స్ అడిగాను. వెర్రిమొహాన్ని చూసినట్టు నా మొహమోసారి చూసి, ఆ నోట్స్ నా చేతిలో పెట్టింది. ఆ నోట్స్ చూసి నిజంగానే వెర్రిమొహం వేసేను. ఎందుకంటే అందులో లెక్చరర్ చెప్పిన పాఠం లోని పాయింట్స్ లేవు. ఇంగ్లీషు అక్షరాలు ఉపయోగించి, తెలుగు పదాలు వాక్యాలుగా రాసి వున్నాయి.
అంటే ఇప్పుడు మనం తెలుగు టైపు చేస్తున్నట్టన్నమాట. Transliteration.
Ninna sinimaa elaa umdi..అని మొదటిలైన్ లో వుంటే
Chaalaa baagumdi..అని రెండో లైన్.
Vaanisree enni cheeralu maarchimdi..
Oka paaTalO ayite ekamgaa padi cheeralu maarchimdi.. ..bhale vunnaay..
   అది చూసేసరికి నాకు మతిపోయింది. వీళ్ళు క్లాస్ లో పాయింట్స్ నోట్ చేసుకుంటున్నట్టు నటిస్తూ సినిమా కబుర్లు చెప్పుకుంటున్నారన్నమాట. తెల్లబోయిన నా మొహం చూసి పగలబడి నవ్వింది నా ఫ్రెండ్.
  ఆ తరవాత్తరవాత ఇలా ఇంగ్లీషూ, తెలుగూ కలగలిపేసి మాట్లాడడం, రాయడం చూస్తూనే వున్నాను. ముఖ్యంగా జాజిపూలు బ్లాగ్ లో నేస్తంగారు సింగపూర్ లో ఇంగ్లష్ ని తెంగ్లీష్ గా మార్చిన విధానం చదివి మరీ నవ్వొచ్చింది.
   అసలిదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ఈమధ్య అమెరికాలో వున్న మా మనవడితో కొన్నాళ్ళు గడిపాను.
  నా ఇంగ్లీషు ఇండియన్ ఇంగ్లీషే.. అసలే అంతంత మాత్రం. దానికి తోడు ఈ సంసారంలో పడిపోయి ఎంతసేపూ ఇడ్లీలు దూదుల్లా ఎలా వస్తాయి, చపాతీలు మెత్తగా రావాలంటే ఏం చెయ్యాలీ లాంటి వాటిల్లో మునిగిపోయిన నేను వచ్చిన రెండుముక్కలూ కూడా మర్చిపోయాను.
   మా మనవడికి ఏడేళ్ళు. ఇప్పుడు నేను నా ఇంగ్లీషులో మాట్లాడినా మా మనవడికి అర్ధంకాదు. వాడి ఇంగ్లీషు ముక్కలు నాకు అర్ధం కావు.
  కాని నా బలహీనతను అంత తేలిగ్గా ఒప్పేసుకుంటే ఎలా? అందుకని పిల్లలకి తెలుగు మాట్లాడడం నేర్పలేదని మా అమ్మాయిని నాలుగు కూకలేసి, నేను ఇక్కడున్నన్నాళ్ళూ మనవలతో తెలుగు తప్ప ఇంకోటి మాట్లాడనని ప్రతిఙ్ఞ చేసేసేను. లేకపొతే పరువు పోయేలా వుందాయే.
  “నీ ఇష్టమొచ్చినట్టు చేసుకో.. నేను మటుకు పనికి పోతున్నాను” అంటూ మా ఖర్మానికి మమ్మల్ని వదిలేసి మా అమ్మాయి ఆఫీసుకి వెళ్ళిపోయింది.
   సరే.. నేను మా రెండో మనవడూ... ఇద్దరమూ ఎవరికొచ్చిన భాషల్లో వాళ్ళం  కాసేపు కుస్తీపట్టి, రాజీ కుదరక, ఆదివారం మధ్యాహ్నం దూరదర్శన్ లో వార్తలు చదివినట్టు సైగలు చేసుకునే స్థితికి వచ్చేసేం.
   అసలు మా ఇద్దరికీ..అదే నాకూ మా మనవడికీ పేచీ వచ్చేది కేవలం ఒక్క విషయం లోనే..
అదే తిండి తినడంలో..
   అసలు ముందు వాళ్ళ తిళ్ళు చూసే ఒళ్ళు మండిపోయింది నాకు. చక్కగా ముద్దపప్పులో ఇంత పేరిన నెయ్యి వేసి పిల్లలకి పెట్టాలి కదా.. అలాగే శుభ్రంగా ఇంత గడ్డపెరుగు కలిపి వాళ్ళకి పెట్టకపోతే పిల్లలు ఇలా ఎండిపోయినట్టుండరూ..
    నాలోని అమ్మమ్మ హృదయం ద్రవించిపోయింది. అందుకే నేను ఉన్నన్నాళ్ళూ వాళ్ళకి కడుపునిండా అన్నం పెట్టెయ్యాలని మరో భీషణప్రతిఙ్ఞ చేసేసుకున్నాను.
  అన్నిరకాల బ్రెడ్డు ముక్కలకీ, అన్నేరకాల ఛీజ్ లకీ అలవాటు పడిపోయిన మా మనవలు నేను వరసగా రోజూ అన్నం వండుతుండడం చూసి తట్టుకోలేకపోయారు పాపం..ముఖ్యంగా రెండో మనవడు.
  సరే..ఆరోజు మా అమ్మాయి ఆఫీస్ నుంచి రావడం ఆలస్యమయ్యేలా వుందని, వచ్చేటప్పటికి అలిసిపోయి వుంటుందనీ, ఈ లోపల చంటివాడికి అన్నం పెట్టేస్తే ఆమెకి కాస్త తెరిపిగా వుంటుందనీ ఆ పని మొదలుపెట్టేను.
 అసలే ఇష్టంలేని పెరుగూఅన్నం తినడం, దానికి తోడు వాళ్ళమ్మ నేను ఏది పెడితే అది తినాలని చెప్పివెళ్ళడం, నేను అస్తమానం అదే పప్పూ, పెరుగూ కలిపి పెడుతూండడం.. వీటన్నింటితో పాపం మా మనవడికి ఒకరకమైన విరక్తి లాంటిది వచ్చేసిందనుకుంటాను.. ఇంకా సగం పెరుగూఅన్నం వుండగానే మరింక నోరు తెరవడం మానేసేడు.
 ముందు కాసేపు ఏవో అచ్చిక బుచ్చిక మాటలతో అదే సైగలతో ఒక రెండు చెమ్చాలు తినిపించేను. ఇంక ఆ తర్వాత నుంచి నోట్లో పెట్టినదంతా బుగ్గలలో ఇరికించేసుకుని ఇంక నోరు తెరవడం మానేసేడు. నోరు తెరిచినా ఏం లాభం.. నోటినిండా పెరుగన్నమే.. అది మింగితే కదా మళ్ళీ పెట్టగలిగేది.
  నేనేమైనా అంతటితో వదిలిపెట్టేదాన్నా..అందుకే “మింగు” అనడానికి ఇంగ్లీషులో ఏమంటారో గుర్తు చేసుకుని అనబోయి, చటుక్కున ఆగిపోయేను.. నయం.. నా భీషణ ప్రతిఙ్ఞ ..అదే తెలుగులోనే మాట్లాడాలన్న ప్రతిఙ్ఞ గుర్తొచ్చింది.
 అందుకే మింగు..” అన్నాను.. ముందు వాడికి అర్ధం కాలేదుసరే..  వున్నాయిగా సైగలు..చేద్దామనుకున్నాను.. కానీ.. ఎలా.. ఒక చేతిలో ప్లేటు. మరో చేతిలో చెమ్చా.. అయినా కూడా మనవడికి తెలుగు రావాలని కూడా నా ప్రయత్నం కదా.. అందుకనే మళ్ళీ..”మింగు..” అన్నాను.
  పాపం పిల్లాడు.. చిన్న నోరు. నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం తింటున్నాడని నేను ఆగొచ్చు కదా.. అబ్బే.. మా అమ్మాయి వచ్చే లోపల వాడికి అన్నం పెట్టేసి నా గొప్పతనం చాటుకోవద్దూ..
 అందుకే మళ్ళీ.. “మింగు..” అన్నాను. వాడికి ఏమైనా అర్ధమైందో లేదో కాని నా వేపు మటుకు మిర్రి మిర్రి చూసేడు.
 హు.. నేనా. వదిలేది..
మళ్ళీ..”మింగు..” అన్నాను ఇంకాస్త గట్టిగా..
మరింక పాపం వాడు ఉక్రోషం ఆపుకోలేక ఒక్కసారిగా..
అయామ్ మింగింగ్..” అన్నాడు గట్టిగా.
ఎప్పుడు వచ్చిందో మా అమ్మాయి
అయితే వాడికి కూడా నీ తెంగ్లీష్ నేర్పేస్తున్నావన్న మాట..”
అంది వెనకనించి వాడన్న మాటలకి ఫక్కున నవ్వుతూ..

---------------------------------------------------------------------------------


(చిత్రం—గూగులమ్మ సౌజన్యంతో..)

Wednesday, August 15, 2012


Monday, August 6, 2012

రంగాజమ్మ... కొడుకు పెళ్ళి గొప్పగా జరపాలని ఏ  తల్లికైనా  కోరిక వుండడం సహజమే..
 కాని ఆ కోరికే వెర్రితలలు వేస్తే ఫలితం ఎలా వుంటుందో తెలిపే
మాలిక శ్రావణ పౌర్ణమి సంచికలో పడిన ఈ కథ  చదివి మీ అభిప్రాయం చెపుతారు కదూ..
మాలికా పత్రికా నిర్వాహకులకు  కృతఙ్ఞతలతో...
 లింక్.. ఇదిగో..