Pages

Tuesday, June 29, 2010

భారం - అబ్బూరి ఛాయాదేవి

భారం --కథాజగత్ పోటీ

ఈ కథను మీరు ఇక్కడ చదవవచ్చు.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/bharam---abburi-chayadevi

ఈ కథ వాస్తవాన్ని అద్దం లా చూపించిన కథ కనుక నాకు చాలా నచ్చింది.

పెద్దవారయిపోయి, రిటైరయిన తల్లితండ్రులు వాళ్ళిద్దరే ఒకరికి ఒకరు ఆసరాగా వుంటున్న రోజులివి. పిల్లల వుద్యోగ బాధ్యతల గురించి అర్ధం చేసుకున్న తల్లితండ్రులు వారినుంచి ఎటువంటి సహకారమూ ఆశించకుండా, వారికి భారమవకుండా శేషజీవితాన్ని గడుపుతున్న రోజులివి. కాని ఎంత సర్దుకుందామని ప్రయత్నించినా ఒక్కొక్క బలహీనమైన క్షణం లో తమ తమ పిల్లల దగ్గరినుంచి సాయం అందకపోయినా కనీసం మాటల్లో నైనా ఓదార్పు కనపడితే చూడాలనుకోవడం కూడా అత్యాశ గానే అయిపోయింది.
అలా ఆశించిన ఒక తల్లే అవని. తనూ, భార్యా, పిల్లలు మాత్రమే తన కుటుంబం అనుకునే ఈ రోజుల్లో భార్య తల్లితండ్రుల యోగ క్షేమాలను ఎవరు కనుక్కుంటారు. కాని ఒక్కగానొక్క కూతురిని అపురూపంగా పెంచి, ఒక అయ్య చేతిలో పెట్టి, "అల్లుడివైనా కొడుకువైనా నీవే బాబూ" అంటున్న అత్తామామల మీద ఏమాత్రం అభిమానం చూపించని అల్లుడు, తన కాపురం నిలబెట్టుకుందుకు(అవకాశవాది లాగ) భర్త మాట జవదాటని కూతురూ, ఆప్యాయంగా చేరదీద్దామనుకుంటున్న మనవడిని కూడా దగ్గరికి చేరనీయకపోవడం వలన వచ్చిన బాధా.. ఇవన్నీ అవనిని బాధపెడుతూంటాయి.
అసలు ఒకరు మనల్ని చూడాలనీ, మన తదనంతరం ఆస్తి వాళ్లకే వెడుతుంది కనుక అప్పుడప్పుడయినా తమ బాగోగులు వాళ్ళు కనుక్కుంటూ వుండాలనీ ఆశించడం తప్పు. బ్రతికున్నప్పుడయినా సరే, తర్వాతయినా సరే మనం మరొకరికి భారం కాకూడదు. అవని కూడా అలాగే తన కూతురికి భారం కావాలనుకోలేదు. కూతురు నుంచి డబ్బూ ఆశించలెదు, మనిషి సాయమూ ఆశించలేదు. కాని ఒక్క చిన్న ఓదార్పు మాట. "ఫరవాలేదమ్మా, నీకు నే నున్నానమ్మా.." అనే ఒక్క మనసును చల్లబరిచే మాట. దాని కోసం తపించిపోయింది. కాని పాపం ఆమెకి కూతురి నుంచి ఆ మాత్రం ఓదార్పు మాట కూడా రాలేదు.
కారణం.. అలా పొరపాటున అయినా ఒక్క ఓదార్పు మాటంటే తల్లితండ్రుల భారం తనమీద ఎక్కడ పడిపోతుందోనని కూతురు కుసుమ అనుకోవడం వల్లే అనిపిస్తుంది. చాలా కుటుంబాల లో ఏ విషయం లోనైనా నిర్ణయం తీసుకోవలసింది భర్తే. దానిని అక్షరాలా ఆచరించడం వరకే భార్య బాధ్యత. అదే సంప్రదాయాన్ని అనుసరించింది కుసుమ కూడా. భర్త మాటని కాదని తను చిక్కుల్లో పడదలుచుకోలేదు. సాఫీగా సాగిపోతున్నప్పుడు లేనిపోని కష్టం యెందుకు అనుకుంది. కాని తల్లి పడే మనోవ్యధ అర్ధం చేసుకోలేకపోయింది.
మన చుట్టూ ఇలాంటివాళ్ళు చాలామంది కనిపిస్తారు. ఏదో మాట్లాడతారు తప్పితే మనసుతో ఆలోచించరు. నిజంగా కనక మనసుతో ఆలోచిస్తే, అమ్మా నాన్న యింటికి వస్తున్నారంటే మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. కాని స్వంత ఆలోచన అంటూ లేనివారికి, లేకపోతే మనసులో మాట బైటకి చెప్పే అవకాశం లేనివారికి, అదీకాక కుసుమ లాగా భర్త మాటే వేదం గా శిరసావహించే వాళ్ళకి తల్లితండ్రులు తమ యింటికి వచ్చి యిబ్బంది పెట్టడం యిష్టం వుండక తప్పించుకుంటుంటారు.
కూతురు తనని కనీసం మనసులో మాట కూడా చెప్పుకోలేనంత పరాయిదానిగా చూడడం అవనికి మరీ బాధగా అనిపిస్తుంది. కూతురితో తనకు వున్న యిలాంటి అనుభవాలన్నీ స్నేహితురాలితో చెప్పుకుని తన మనసులోని భారాన్ని దించుకుంటుంది.
అదంతా సానుభూతిగా విని, స్నేహితురాలిచ్చిన సలహాకి అమాయకంగా, జాలిగా చూస్తుంది అవని.
ఈ ఆఖరిమాట చదువుతున్నప్పుడు మనసు కలుక్కుమంటుంది.


*********************************************************************************

Monday, June 28, 2010

రంగుతోలు - నిడదవోలు మాలతి

రంగుతోలు--కథాజగత్ పోటీ
ఈ కథను మీరు ఇక్కడ చదవవచ్చు.

http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/rangutolu---nidudavolu-malati

ఈ కథ నాకు ఎందుకు నచ్చిందంటే మనుషులందరూ భిన్న జాతులకు చెందిన వారయినా అందరిలోనూ ప్రవహించేది ఎర్రని రక్తమే అని భిన్నత్వం లో ఏకత్వం చూపించడం.
ప్రాణి భూమ్మీద పడగానే ఆడా మగా నిర్ధారించుకున్నాక వెంటనే తలయెత్తే ప్రశ్న తెలుపా నలుపా అని చెప్పుకోడంలో తప్పు లేదేమో. ఒకే యింట్లో వున్న తోబుట్టువుల మధ్య కూడా ఈ భేద భావం కనిపిస్తుంది. మరీ కొందరిళ్ళల్లో అయితే అన్నదమ్ముల పిల్లల మధ్య తేడాలు చెప్పడానికి తెల్లసూర్యం నల్ల సూర్యం అని అనడం కూడా మామూలే. ఒకింటి వాళ్ళు, ఒక ప్రాంతంవాళ్ళ మధ్యలోనే ఇటువంటి అనుభవాలున్ననీలవేణి మరి పాశ్చాత్యదేశాల్లో నివసించాల్సి వచ్చినప్పుడు జరిగిన అనుభవాల సారమే ఈ కథ.
మనిషి సంఘజీవి. ఒక్కడూ వుండలేడు. నలుగురితో కలిసి మెలిసి వుండాలనుకుంటాడు. ఆ కలవడం కూడా తనవాడయితే బాగుంటుందని సహజంగానే అనిపిస్తుంది. ఒక అపరిచిత వ్యక్తి మనకి ఎదురయితే ముందు మనం అతని భౌతిక స్వరూపాన్ని చూస్తాం. నలుపా--తెలుపా, పొడుగా--పొట్టా, లావా--సన్నమా, పెద్దా--చిన్నా, ఇలాగ. వెంటనే మనకి తెలీకుండానే మన మనసులోఒక అభిప్రాయం యేర్పడిపోతుంది. కాని అన్నింటికన్నా మనం ముందు గుర్తించేది ఒంటి రంగు. పుట్టు ఛాయా, పెట్టు ఛాయా అని పైపైన ఎన్ని పూతలు పూసుకున్నా అసలు ఒంటి రంగు పట్టినట్టు తెలుస్తుంది. అలా గుర్తించినప్పుడు దానికి సంబంధించిన పరిణామాలూ అలాగే వుంటాయి. అవి మనవాడే కలుపుకుందాం అన్న భావనా అయివుండవచ్చు లేకపోతే మనవాడు కాదనే భేదభావం కానీ, లేదా ఒక్కొక్కసారి వివక్ష కానీ అయివుండవచ్చు.
మూడేళ్ళపాప ఒక్కత్తీ రోడ్డు మీద తల్లి కోసం ఏడుస్తూ వుంటే, ఆ పిల్ల ఒంటి రంగు చూసి దూరం నుంచే సానుభూతి వాక్యాలు పలుకుతూ, నీలవేణిది కూడా ఆ పిల్ల లాగే తెల్లతోలు కాదని గుర్తించి, మీ పిల్లని చూసుకోవాలి కదా అన్నప్పుడు కలిగిన ఆశ్చర్యం కన్న-- అంత చిన్న పిల్ల కూడా కేవలం నీలవేణి ఒంటి రంగు చూసి తన జాతే ననుకుంటూ వచ్చి కాళ్ళకు చుట్టుకు పోవడం ఆమెకు మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.
తర్వాత నీలవేణిని రోడ్డు మీద అటకాయించి కొందరు వ్యక్తులు ఆమె బేగ్ లాక్కుంటున్నప్పుడు ఒక నల్లతోలు మనిషి ఆమె కోసం వాళ్ళతో దెబ్బలాడి గాయాల పాలవడంతో, పోలీసులూ, వైద్య సదుపాయం రావడంతో, కథ ముగిసినా ఆ సమయం లో నీలవేణి మనోభావాలు రచయిత్రి బాగా వివరించారు.
మనుషులు భౌతికంగా కనపడడానికి రకరకాల రంగుల్లో వున్నా ఆ మనుషులందరికీ లోపల రక్తం రంగు మటుకు ఒక్కటే కదా.. అదే ఎరుపు అంటూ మనుషులందరిలోనూ వున్న ఏకత్వాన్ని ఎత్తి చూపించడం ముగింపుకి అందమిచ్చింది.


****************************************************************************

Saturday, June 5, 2010

ఓ పరమాత్మా..




ఓ పరమాత్మా..


ఎంత నమ్మకం నా మీద నాకు
ఏదైనా చేయగలననీ
అంతా నా చేతిలోనే వుందనీ
నా జీవితం నా ఇష్టం ఎలాగైనా వుండగలననీ
జీవితమనే చదరంగంలో
నేను వేసే ఎత్తు నా చేతిలోనె వుందనీ
ఎత్తు మీద ఎత్తు వేసి ఎదటివాణ్ణి చిత్తు చేసి
గుర్రాలను దూకించీ ఏనుగులను కదిలించీ
మంత్రి రణతంత్రం తో "చెక్" చెప్పగలననీ
ఎంత నమ్మకం నా మీద నాకు...
కానీ....
కాదు కాదు జీవితం నీ చేతిలో చదరంగం
అది నేను సృష్టించిన ఎత్తు పల్లాల కల్లోల సముద్రం
నీ ఎత్తుగడను బట్టి నడవదు నీ జీవితం
పావులు నీ చేతిలో వున్నా
నీ అరిచేతి రేఖలు నేను రాసినవే
ఆడేది నువ్వైనా ఆడించేది నేనే
అందుకే నీ జీవితం కాదు చదరంగం ..అది
పాము నిచ్చెనల నడుమ బంధించబడిన
చిత్రమైన పరమపదసోపాన పఠం...అది
వైకుంఠపాళీ..అంటూ
నిచ్చెనలను ఎక్కిస్తూ,
పాము చేత మింగిస్తూ
ఆడిస్తూ, పాడిస్తూ,
వేధిస్తూ, వేగిస్తూ,
నడిపిస్తూ,విసిగిస్తూ,
ఇంతలో కవ్విస్తూ, అంతలోనె ఏడిపిస్తూ,
కనిపించని నా మనసుని చిత్రహింసలు పెడుతూ
అంతలోనె ఆనందం..మరుక్షణం దుఃఖం
అన్నీ అనుభవించు అదే జీవితమంటే
అంటూ నన్ను నడిపిస్తున్న ఓ పరమాత్మా...
ఇంకా ఎప్పటికి నా ఈ జీవితానికి తుదిశ్వాస...?


***********************************************