Pages

Monday, March 21, 2011

రాగదయ్య ఇకనైన రాజభోగా......
కనుల నింపిన ఆశలు కల్లలాయె
బాస చేసిన విభుడు రాకపోయె
ఏమియందును విధిని యిట్లొనర్ప
ఏమిసేతును మదిని ఊరడింప....

కలికి నీకన్న మేలిమి లేదటంచు
ఒట్టు పెట్టిన మాటను గట్టు పెట్టి
ఎట్టకేగితివయ్య నన్నిట్టు కష్టపెట్టి
మరియాదయే నీకిది మాననీయ....

జాములాయెను నీ జాడ కానరాదు
జాజిమల్లెలు ఎన్నడో వాడిపోయె
జాగుసేయకు యింక నామీద ఆన
జాలి లేదేల నాసామి ఈ దీనపైన...

విడిదిలో వేచిచూచు వరుని పగిది
తొంగిచూచెను చంద్రుడు మోమాటపడుచు
అన్ని నీవంటు నాతోను నమ్మ పలికి
కానరావు నీకిది న్యాయమయ్య....

అలల సవ్వడి లేదు పూవుల ఊసు లేదు
గాలికూడ ఎక్కడ కానరాదు
నీవు వత్తువన్న సత్యమొకటె నన్ను నిలిపె
రాగదయ్య ఇకనైన రాజభోగా......

*************************************

Sunday, March 20, 2011

చందురుడు దరిజేరినవేళ.. మార్చ్ 19, 2011....
అప్పుడెప్పుడో చిన్నప్పుడు..
మొట్టమొదటిసారిగా మనిషి చంద్రుని మీద కాలు మోపినప్పుడు...
చంద్రమండలమంతా రాళ్ళూ, రప్పలూ అంటూ అక్కడి మట్టి ఇంత భూమికి తెచ్చినప్పుడు...
అప్పుడు.. అప్పుడప్పుడే జాబిలి అందాల గురించి విరియబోతున్న ఊహలన్నీ ఒక్కసారి తల్లడిల్లిపోయాయి.
హేతువాదానికీ, భావుకతకీ మనసులో జరిగిన వాదులాటలో...
కవుల, రచయితల భావస్ఫూరక వర్ణనలవల్ల,
చల్లని జాబిల్లి అందాలను పాటలతో అలరించడం వల్ల...
ఆ వాదులాటలో హేతువాదం పారిపోయి..
భావుకత్వమే జయించింది.
అదిగో, అప్పట్నించీ ఆ జలతారు జరీపోగుల వెన్నెల జాలువారుతుంటే కలిగే ఆనందం నన్ను పరవశింప చేసేది.
అటువంటి పలకరింతే నిన్న పున్నమినాడు చందురుని నుంచి నాకు చేరింది.
ఆహా.. ఏమి నా భాగ్యమూ... అనుకుంటూ,
చల్లని చంద్రుని వెన్నెల కిరణాల జడిలో ఓలలాడాను..
తనువెల్లా తానమాడ
నిలువెల్లా తడిసిపోయాను..
ఎంతటి హాయి..
ఏది దీనికి మరి సామ్యము.
మది వీణలు మీట,
యెద ఊయల లూగ
చిరుగాలి పాట పాడ,
విరిబాలలు తలలూపి జతకలువ,
స్వర్గము తెచ్చి ఎదుట నిలిపినా తోసి పోనా...
దేవతలు దిగివచ్చి చేరబోయినా కాలదన్ననా..........

చందురుడు దరిజేరినవేళ.. మార్చ్ 19, 2011....


*********************************************************************************

Wednesday, March 16, 2011

పరిధి దాటని వేళ.....

శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు వారి తురుపుముక్క బ్లాగ్ లో కథను వ్రాయండి.... అన్నారు.
లింక్ ఇదిగో.
http://turupumukka.blogspot.com/2011/02/blog-post_26.html

ఈ కథలో శ్రీ పి.వి.బి శ్రీరామమూర్తిగారు "పరిధి దాటిన వేళ.." కథను వర్ధనమ్మ పక్షంగా వ్రాసారు.
అదే కథను ఆమె భర్త పక్షంగా రాయండి అన్నారు మురళీ మోహన్ గారు.
పాత్రల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏ పాత్రకు సరిపడ అభిప్రాయం ఆ పాత్రకుంటుంది. ప్రతి వ్యక్తీ కూడా అభిప్రాయాల్లోకానీ, ఆలోచనల్లోకానీ మరొకరితో పోలిక లేకుండా వుంటాడు. తనని తను సమర్ధించుకుందుకు ప్రతివారికీ కూడా వారి వారి వాదన వుంటుంది. ప్రతి పాత్రలోనూ రచయిత దూరి మాట్లాడినప్పుడే ఆ రచన బాగుంటుంది. మురళీమోహన్ గారి ప్రయత్నం ఇలాంటిదే. భావనలకి అక్షరరూపమిచ్చి చదివించడమన్నది ఒక రచయితకి పరీక్షలాంటిదే.
అలా అనుకుని దానికి స్పందించినవారము ముగ్గురమే. ఇందులో రవికుమార్ గారు వ్రాసిన "వర్ధనమ్మ మొగుడు" అనే రచన కథాజగత్ లో ప్రచురించబడింది.
లింక్ ఇక్కడ వుంది.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/vardhanam-ma-mogudu---ravikumar
మరొకటి లక్ష్మీరాఘవగారు వ్రాసింది
ఇంక నేను వ్రాసింది ఈ క్రింద ఇస్తున్నాను.
అసలు కథలో వర్ధనమ్మ పరిధి దాటారు. అందుకే అది "పరిధి దాటిన వేళ.."కథ అయింది.
కాని ఆమె భర్త పరంగా వ్రాసినప్పుడు ఆయన ఆలోచనల్లో కూడా పరిధిని దాటలేకపోయారు. అందుకే నేను వ్రాసిన కథకి "పరిధి దాటని వేళ.." అని శీర్షిక పెట్టాను.
విఙ్ఞులు చదివి తమతమ అభిప్రాయములు తెలుప ప్రార్ధన...

*********** ************** ************

పరిధి దాటని వేళ..
జి.ఎస్.లక్ష్మి.
అసహనంగా పక్కమీద దొర్లుతున్న వర్ధనమ్మని చూసి అప్పుడే మెలకువ వచ్చి నీళ్ళు తాగటానికి లేచిన భర్త "ఏంటీ.. ఇంకా నిద్రపోలేదా..?లేక - రేపు మళ్ళీ ఎక్కడికో వెళ్ళి - మాకందరికీ నిద్రలేకుండా చెయ్యాలని ఆలోచిస్తున్నావా?"
అంటూ వర్ధనమ్మని అడిగేడు."
ఆవిడ ఎప్పట్లాగే మాట్లాడలేదు.
"అయినా ఇన్నేళ్ళొచ్చేయి.. నలుగురూ ఏవైనా అనుకుంటారనైనా లేదేంటే నీకు..? నువ్విలాంటి పన్లు చేస్తే రేప్పొద్దున్న కొడుకూ, కోడలికీ ఎంత అవమానవో ఆ మాత్రం తెలియొద్దూ..?" మళ్ళీ అన్నాడు.
వర్ధనమ్మ అటు తిరిగి ఏదో గొణుక్కుంటున్నట్టు అనిపించిందాయనకి.
"వెధవ గొణుగుడూ.. ఇదీను.. దీని గొణుగుడుతో నాకు నిద్ర పట్టి చావటంలేదు."
నిద్రపోదామనుకున్నాడే కానీ ఆయనకి వర్ధనమ్మ గురించే ఆలోచన.
అయినా బీపీ మాత్రలు అయిపోతే తనో, కొడుకో తెచ్చిపెట్టరూ.. తగుదునమ్మా అని అలా రోడ్డెక్కేస్తే జరక్కూడన్ది ఏదైనా జరిగితే నలుగురూ మా మొహాన ఉమ్మేస్తా రు.
సరే.. ఇవాళ మర్చిపోయేను .. ఇంకోసారి చెప్పొచ్చుగా.. మళ్ళి చెప్పడానికి బోడి అభిమానం ఒహటీ.. అలా మూతి బిగించుకుని, మొహం ముడుచుకుని ముంగిలా మాటలు లోపలే మింగేస్తుంది.. ఎంతైనా అంతా లొపల స్వయంపాకం.
పెళ్ళైనప్పట్నించి చూస్తున్నాడు. ఏదో తప్పదురా దేవుడా అన్నట్టు ఇంత ఉడకేసి పడేస్తోంది తప్పితే ఒక మంచి మాటా, మొగుడంటే గౌరవం ఏదీ లేదు.
హన్నా.. హన్నా.. ఆ రోజుల్లో ఎంత గొడవ చేసిందీ.. అయినా మగాడన్నవాడికి బయట తిరుగుతుంటే నాలుగురకాల ఆడవాళ్ళు పరిచయమౌతారు. అదేదో మహాపరాధం ఐనట్టు ఎంత దెబ్బలాడింది. ఆఖరికి అమ్మకి కూడా ఫిర్యాదు చేసింది. పాపం అమ్మ. నేనంటే ఎంత ప్రేమో.. అందుకే దానికే గడ్డి పెట్టింది.
అసలు చెప్పుకోవల్సిందేంటంటే మావగారు మంచివారు. కూతురికి మొగుడి దగ్గర ఎలా వుండాలో చక్కగా చెప్పి పంపించేరు.
అయినా ఏదో వండేస్తున్నా.. వడ్డించేస్తున్నా అంటూ నానా హైరానా పడిపోతున్నట్టు గొడవొకటి. ఎప్పుడు చూసినా కాలునెప్పో.. నడుం నెప్పో ఏదో ఒక ఏడుపే.. ఎక్కడి డబ్బూ దీని మాత్రలకే సరిపోవట్లేదు. ఇంకా ఏవిటో కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే వుంటుంది. ఇంతకన్న పెళ్ళాన్ని చూసుకునే మొగుణ్ణొక్కణ్ణి చూపించమను.
అయినా ఆడదానికి ఆలోచనలూ, అభిప్రాయాలూ కూడానా.. ఇంట్లో కూచుని ఆవాలు బాగుచేసుకోడం తప్ప వాళ్ళకేం తెల్సని..
ఏవిటో... ఊహలంటుంది. పువ్వులంటుంది.. రాగాలంటుంది..స్పందించే హృదయం అంటుంది..
ఏవిటో.. నాకొక్క ముక్కా అర్ధమై చావదు. సంసారం చేసుకునే వాళ్ళకి పప్పులు బాగుచేసుకోడం కావాలి కాని ఇవన్నీ ఎందుకు..?
కొడుకు కొత్తిల్లు కట్టుకున్నాడు. రమ్మని పిలిచేడు. వచ్చాం. వేడుకంతా అయిపోయింది. పెద్దవాళ్ళమనే గౌరవం కొద్దీ కొత్తబట్టలు పెట్టేడు. సంతోషించొద్దూ..దీవించొద్దూ.. అబ్బే.. ఆ మొహం తుమ్మల్లో పొద్దు గుంకినట్టు ముటముటలాడుతూనే వుంది.
కొడుకూ, పిల్లల కన్న దీనికి ఆ టీవీ ప్రోగ్రామే ఎక్కువైందా. దాన్లో మొహం పెట్టేసి ఏం వినేస్తోందో..
హమ్మయ్య.. రైలెక్కాం. కొండంత ఇల్లు కట్టేడు కొడుకు. పాపం బాగానే ఖర్చయ్యుంటుంది. చుట్టపక్కాలందరూ కలవడంతో నాలుగురోజులూ ఇట్టే గడిచిపోయేయి. ఈ హడావిడిలో కంటినిండా నిద్రేపోలేదు. ఆ ఏవుందీ.. ఈ నాల్రోజులూ అది బాగానే పడుకుందిగా.. సామాను సంగతి చూసుకుంటుందిలే..
"ఏమేవ్.. కాస్త చూసుకో.. "
గట్టిగా చెప్పేడు వర్ధనమ్మకి. చురుగ్గా చూసింది భర్తవైపు.
అదేవిటీ.. అలా చూస్తుంది.. ఆ చూపుకే కనక శక్తుంటే తనిక్కడే మాడి మసైపోయేటట్టుందా చూపు.. కొంపదీసి ఇది సామానొదిలేసి మధ్యలో ఎక్కడో దిగిపోదుకదా..
ఆ నామొహం. అయినా అది దిగి ఎక్కడికి పోగలదని..?
ఇంట్లో అంతా వుండి దాన్ని చూసుకుంటున్నాం కనక దాని బతుకు వెడుతోంది. మమ్మల్ని కాదనుకుని అది ఎక్కడికి పోయినా పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టే.
హా... నిద్రొచ్చేస్తోంది... అమ్మయ్య.....గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్.....

_____________________________________________________

Friday, March 4, 2011

కదంబమాలిక 11

కదంబమాలిక
కదంబమాలిక ను ఆదరించిన పాఠకులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఏదో సరదాగా అందరం కలిసి వారి వారి భావాలను ఒక దండగా గుచ్చి, అందరినీ అలరిద్దాం అనగానే స్నేహితురాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా వారి వారి రచనా ప్రతిభను ప్రదర్శించారు. వారందరికీ మనఃపూర్వక అభివాదములు.
రాయడంలో అనుభవఙ్ఞులం కాకపోయినా జీవితాన్ని చూసినవాళ్లం, చూస్తున్నవాళ్ళం. మా అందరి అభిప్రాయం ఒకటే.. "స్త్రీ శక్తి స్వరూపిణి" అని.
దానినే మా కదంబమాలికలో చూపించడానికి ప్రయత్నించాం. లలిత లలితంగా కనిపిస్తూనే, అవసరమైతే లోకాన్ని కాపాడడం కోసం శక్తి అవతరించినట్టే.. సున్నిత భావాలతో కనిపించే ప్రతి స్త్రీలో కూడా అవసరమైతే అలాంటి శక్తిరూపం వుంటుందని చూపించాలని మా వుద్దెశ్యం .
కృతకృత్యుల మయ్యామనే అనుకుంటున్నాం..
అభిమానులు మీ మీ అభిప్రాయాలు చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ....
ఇదిగో..కదంబమాలిక ఆఖరిభాగం లో అడుగుపెట్టండి..
దీనికి ముందు ఏం జరిగిందో చదవడానికి ప్రసీదగారి బ్లాగ్ లోకి వెళ్ళాలి మరి.
• * * * * *


ఆలోచనల్లోంచి బయటపడి తలుపు తీసింది సరోజిని.
ఎదురుగా సుమ.. అప్పటివరకూ పడ్డ మానసిక ఒత్తిడిని ఒక్కసారిగా మర్చిపోయి "సుమా.." అంటూ అమాంతం కౌగలించుకొంది..
సుమ చేతిలోని బేగ్ కింద పెడుతూ, సరోజినిని పరీక్షగా చూసింది. తనకు తెలిసి వదిన ఎప్పుడూ ఇంత దీనంగా లేదే అనుకుంటూ
"ఏమైంది వదినా..అలా వున్నావు? అంతా బాగున్నారా..?"
సరోజిని సర్దుకొంటూ..
"అంతా బాగున్నారు. మీ అన్నయ్యతో రాకపోతే ఎప్పుడొస్తావో అనుకుంటున్నాం.."
"ఇదిగో.. ఇవాళ పొద్దున్నే బయల్దేరేను..ట్రైన్ గంట లేటు.."
"అయ్యో.. మంచినీళ్ళు తెస్తానుండు.. మంచి కాఫీ కూడా చేస్తాను వేడిగా.."
వంటింటి వైపు కదలబోయిన సరోజినిని ఆపి,
"అవన్నీ దారిలో కానిచ్చే వచ్చేను కాని.. సంగతేంటి వదినా. ఎందుకు మొహం అలా వాడిపోయింది? నాకు తెలిసి నువ్వెప్పుడూ ఇలా లేవు.." అనడిగింది.

సుమ అలా అడిగేసరికి సరోజినికి కడుపులో మాటలన్నీ ధారాప్రవాహంలా బైటకొచ్చేసాయి. అంతా విన్న సుమ తెల్లబోయింది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూండగానే బైటకెళ్ళిన శ్రీరాంగారూ, భాస్కర్ అందరూ వచ్చేసారు.
"ఎప్పుడొచ్చావ్..సుమా.." అంటూ సుమని పలకరించేరు అందరూ.

తిరుగుటపాలా తిరిగొచ్చిన మామగారినీ, భాస్కర్ నీ ప్రశ్నార్ధకంగా చూసింది సరోజిని.
"రేపు పొద్దున్నే అన్నీ వివరంగా కాగితం మీద రాసుకుని వెడతాం..మెడికల్ వీ, ఇంకా ఏవో రిపోర్ట్లు కావాలిట" అంటూ అక్కడ జరిగిందేమిటో చెప్పడానికి ఇష్టం లేనివాడిలా ముభావంగా అన్నాడు భాస్కర్.
అంటే వీళ్ళు అనుకున్నట్టు చెయ్యలేకపోయారన్నమాట.. ఆవేశం ఆపుకోలేకపోయింది సరోజిని. అప్పటిదాకా గుండెల్లో సుడులు తిరుగుతున్న ఆలోచనలన్నీ అనుకోకుండా ఆమె నోటమ్మట బైటకొచ్చేసేయి..
"అంటె ఏంటండీ.. తీరుబడిగా ఇవన్నీ తీసుకుని వెళ్ళాలంటే ఎలా కుదురుతుందండీ? అయినా ఏడాక్టర్ అయినా అలా పోలీస్ కేసంటే రిపోర్ట్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడా,,?"
"ఇంకెవరు..? గవర్నమెంట్ డాక్టరే ఇవ్వాలి. చూడాలి రేపు ఏమౌతుందో.."
"మరి మీ ఇన్ ఫ్లుయెన్స్ ఏమయిందండీ..?"
"నా ఫ్రెండ్ ఊళ్ళో లేడు. నాలుగురోజులక్కాని రాడు..’
"అప్పటికిదంతా చప్పబడిపోతుంది.."

కోడలి ఆవేశం చూస్తున్న శ్రీరాంగారికి ఒక ఆలోచన వచ్చింది.
"అఖ్ఖర్లేదమ్మా... మీరందరూ కలిసివస్తామంటే మనం ఈ పని రేపటినుంచే మొదలుపెట్టొచ్చు. "
".ఎలా?" ఆయనంటే వారందరికీ వున్న గౌరవం రెట్టింపయింది.
"ఇదిగో.. అందరూ వినండి..."శ్రీరాంగారు గొంతు సర్దుకున్నారు.

భాస్కర్, సరోజిని, సుభద్ర, లక్ష్మమ్మ, అనిత, సుమ అందరూ ఆసక్తిగా ఆయన చుట్టూచేరారు. లోపల విశ్రాంతి తీసుకుంటున్న నారాయణమ్మ కూడా ఈ హడావిడికి బయటికి వచ్చి వాళ్లతో కలిసి కూర్చున్నారు.
"మనం ఈ అన్యాయాన్ని ఒక్క పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఊరుకోడంతో కాకుండా అన్ని వైపుల్నించీ ఒత్తిడి తీసుకురావాలి. అదెలాగంటే మీరు ఒక్కొక్కరూ నేను చెప్పినట్టు చెయ్యండి.
ఈ రోజుల్లో మీడియా కున్న బలం మరి దేనికీ లేదు. అందుకని,

"సరోజా, నువ్వు ప్రింట్ మీడియా లో ఈ విషయాలు వచ్చేట్టు చూసుకో.. అన్ని ప్రముఖ దినపత్రికల్లోనూ ఫొటోలతో సహా ఈ న్యూస్ రావాలి.

సుభద్రా, నువ్వు ఎలక్ట్రానిక్ మీడియా చూసుకో. వాళ్ళకి ఇలా జరుగుతోందని ఒక్క ఫోన్ చేస్తే చాలు వాళ్ళు జరిగిన అన్యాయాన్ని మొత్తం కక్కిస్తారు.

అనితా, నువ్వు ఇంటర్నెట్ లో ఈ వార్త ప్రచారం అయ్యేలా చూడు. బ్లాగ్ ల్లో కావచ్చు,వెబ్ సైట్ లలో కావచ్చు.. ఇది ప్రధానంగా కనపడేలా చూసే బాధ్యత నీదే.

లక్ష్మమ్మా, నువ్వు నీ పేటవాళ్లందరినీ తీసుకుని ఆ ఆఫీసర్ ఇంటి ఎదురుగా ప్లే కార్డు లు పెట్టుకుని కూర్చో..

సుమా, నువ్వు మహిళామండలి వాళ్లందరినీ తీసుకుని వుమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్ కి వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి.

భాస్కర్, నువ్వు నీ ఫ్రెండ్ ని ఫోన్ మీదైనా కలిసి పని జరిగేటట్టు చూడు..

నేను మిమ్మల్నందర్నీ కనిపెడుతూ, ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలిస్తుంటాను.. "

శ్రీరాంగారు చెప్పిన మాటలకి అందరిలోనూ ఆవేశం పెల్లుబుకింది.
వదిలిపెడితే అప్పుడే పరిగెట్టేలా వున్నారందరూ..


మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకల్లా అందరూ శ్రీరాంగారి ఇంట్లో కూడారు. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి, ఏమేం చెయ్యాలో అందరికీ వివరంగా మరోసారి చెప్పారాయన. నారాయణమ్మ పెట్టిన పెరుమాళ్ళు ప్రసాదం అందరూ భక్తిగా తిని కార్యసాధనకై బయల్దేరుతుంటే నారాయణమ్మ ముందడుగు వేసారు.
ప్రభాతవేళనే మాధవునికి అత్యంత భక్తిశ్రధ్ధలతో పూజ ముగించుకున్న ఆవిడ నుదుటి మీది ఎఱ్ఱని బొట్టు మహేశ్వరుని మూడో నేత్రంలా మెరిసిపోతోంది.
"నువ్వెక్కడికి..?"
ఆశ్చర్యంగా అడిగారు శ్రీరాంగారు.
"నేనూ ఈ యఙ్ఞంలో పాలు పంచుకుంటాను.." స్థిరంగా సమాధానమిచ్చిన ఆవిడవైపు వింతగా చూస్తూ..
"అంటే ఏం చేద్దామని బయల్దేరేవ్?"
"వాళ్ళు కేస్ రాసుకోకపోతే పోలీస్ స్టేషన్ ముందు నిరాహారదీక్షకి కూర్చుంటాను.."
కాసేపటికి కానీ ఆవిడ మాటలు అర్ధం కాలేదెవరికీ.. అర్ధం అవగానే అందరూ సంతోషంతో ఆవిడ చుట్టూ చేరిపోయేరు.

అమ్మలగన్న అమ్మగా కనిపిస్తున్న ఆవిడకి నమస్కారం పెట్టకుండా వుండలేకపోయారు..
ఒక శంఖారావం దిక్కులు పిక్కటిల్లేలా మోగింది.

యుధ్ధభేరి మోగిస్తూ ధైర్యంగా ముందడుగు వేసిన ఆవిడని శ్రధ్ధగా అనుసరించారందరూ...
యుధ్ధం మొదలైంది.

_______________________________________________________________________


కథ మొత్తం ఒకేసారి చదవాలనుకుంటే పైన బొమ్మపై సున్నితంగా నొక్కండి. (సౌజన్యం. జ్యోతి వలబోజు)