Pages

Wednesday, March 16, 2011

పరిధి దాటని వేళ.....

శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు వారి తురుపుముక్క బ్లాగ్ లో కథను వ్రాయండి.... అన్నారు.
లింక్ ఇదిగో.
http://turupumukka.blogspot.com/2011/02/blog-post_26.html

ఈ కథలో శ్రీ పి.వి.బి శ్రీరామమూర్తిగారు "పరిధి దాటిన వేళ.." కథను వర్ధనమ్మ పక్షంగా వ్రాసారు.
అదే కథను ఆమె భర్త పక్షంగా రాయండి అన్నారు మురళీ మోహన్ గారు.
పాత్రల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏ పాత్రకు సరిపడ అభిప్రాయం ఆ పాత్రకుంటుంది. ప్రతి వ్యక్తీ కూడా అభిప్రాయాల్లోకానీ, ఆలోచనల్లోకానీ మరొకరితో పోలిక లేకుండా వుంటాడు. తనని తను సమర్ధించుకుందుకు ప్రతివారికీ కూడా వారి వారి వాదన వుంటుంది. ప్రతి పాత్రలోనూ రచయిత దూరి మాట్లాడినప్పుడే ఆ రచన బాగుంటుంది. మురళీమోహన్ గారి ప్రయత్నం ఇలాంటిదే. భావనలకి అక్షరరూపమిచ్చి చదివించడమన్నది ఒక రచయితకి పరీక్షలాంటిదే.
అలా అనుకుని దానికి స్పందించినవారము ముగ్గురమే. ఇందులో రవికుమార్ గారు వ్రాసిన "వర్ధనమ్మ మొగుడు" అనే రచన కథాజగత్ లో ప్రచురించబడింది.
లింక్ ఇక్కడ వుంది.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/vardhanam-ma-mogudu---ravikumar
మరొకటి లక్ష్మీరాఘవగారు వ్రాసింది
ఇంక నేను వ్రాసింది ఈ క్రింద ఇస్తున్నాను.
అసలు కథలో వర్ధనమ్మ పరిధి దాటారు. అందుకే అది "పరిధి దాటిన వేళ.."కథ అయింది.
కాని ఆమె భర్త పరంగా వ్రాసినప్పుడు ఆయన ఆలోచనల్లో కూడా పరిధిని దాటలేకపోయారు. అందుకే నేను వ్రాసిన కథకి "పరిధి దాటని వేళ.." అని శీర్షిక పెట్టాను.
విఙ్ఞులు చదివి తమతమ అభిప్రాయములు తెలుప ప్రార్ధన...

*********** ************** ************

పరిధి దాటని వేళ..
జి.ఎస్.లక్ష్మి.
అసహనంగా పక్కమీద దొర్లుతున్న వర్ధనమ్మని చూసి అప్పుడే మెలకువ వచ్చి నీళ్ళు తాగటానికి లేచిన భర్త "ఏంటీ.. ఇంకా నిద్రపోలేదా..?లేక - రేపు మళ్ళీ ఎక్కడికో వెళ్ళి - మాకందరికీ నిద్రలేకుండా చెయ్యాలని ఆలోచిస్తున్నావా?"
అంటూ వర్ధనమ్మని అడిగేడు."
ఆవిడ ఎప్పట్లాగే మాట్లాడలేదు.
"అయినా ఇన్నేళ్ళొచ్చేయి.. నలుగురూ ఏవైనా అనుకుంటారనైనా లేదేంటే నీకు..? నువ్విలాంటి పన్లు చేస్తే రేప్పొద్దున్న కొడుకూ, కోడలికీ ఎంత అవమానవో ఆ మాత్రం తెలియొద్దూ..?" మళ్ళీ అన్నాడు.
వర్ధనమ్మ అటు తిరిగి ఏదో గొణుక్కుంటున్నట్టు అనిపించిందాయనకి.
"వెధవ గొణుగుడూ.. ఇదీను.. దీని గొణుగుడుతో నాకు నిద్ర పట్టి చావటంలేదు."
నిద్రపోదామనుకున్నాడే కానీ ఆయనకి వర్ధనమ్మ గురించే ఆలోచన.
అయినా బీపీ మాత్రలు అయిపోతే తనో, కొడుకో తెచ్చిపెట్టరూ.. తగుదునమ్మా అని అలా రోడ్డెక్కేస్తే జరక్కూడన్ది ఏదైనా జరిగితే నలుగురూ మా మొహాన ఉమ్మేస్తా రు.
సరే.. ఇవాళ మర్చిపోయేను .. ఇంకోసారి చెప్పొచ్చుగా.. మళ్ళి చెప్పడానికి బోడి అభిమానం ఒహటీ.. అలా మూతి బిగించుకుని, మొహం ముడుచుకుని ముంగిలా మాటలు లోపలే మింగేస్తుంది.. ఎంతైనా అంతా లొపల స్వయంపాకం.
పెళ్ళైనప్పట్నించి చూస్తున్నాడు. ఏదో తప్పదురా దేవుడా అన్నట్టు ఇంత ఉడకేసి పడేస్తోంది తప్పితే ఒక మంచి మాటా, మొగుడంటే గౌరవం ఏదీ లేదు.
హన్నా.. హన్నా.. ఆ రోజుల్లో ఎంత గొడవ చేసిందీ.. అయినా మగాడన్నవాడికి బయట తిరుగుతుంటే నాలుగురకాల ఆడవాళ్ళు పరిచయమౌతారు. అదేదో మహాపరాధం ఐనట్టు ఎంత దెబ్బలాడింది. ఆఖరికి అమ్మకి కూడా ఫిర్యాదు చేసింది. పాపం అమ్మ. నేనంటే ఎంత ప్రేమో.. అందుకే దానికే గడ్డి పెట్టింది.
అసలు చెప్పుకోవల్సిందేంటంటే మావగారు మంచివారు. కూతురికి మొగుడి దగ్గర ఎలా వుండాలో చక్కగా చెప్పి పంపించేరు.
అయినా ఏదో వండేస్తున్నా.. వడ్డించేస్తున్నా అంటూ నానా హైరానా పడిపోతున్నట్టు గొడవొకటి. ఎప్పుడు చూసినా కాలునెప్పో.. నడుం నెప్పో ఏదో ఒక ఏడుపే.. ఎక్కడి డబ్బూ దీని మాత్రలకే సరిపోవట్లేదు. ఇంకా ఏవిటో కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే వుంటుంది. ఇంతకన్న పెళ్ళాన్ని చూసుకునే మొగుణ్ణొక్కణ్ణి చూపించమను.
అయినా ఆడదానికి ఆలోచనలూ, అభిప్రాయాలూ కూడానా.. ఇంట్లో కూచుని ఆవాలు బాగుచేసుకోడం తప్ప వాళ్ళకేం తెల్సని..
ఏవిటో... ఊహలంటుంది. పువ్వులంటుంది.. రాగాలంటుంది..స్పందించే హృదయం అంటుంది..
ఏవిటో.. నాకొక్క ముక్కా అర్ధమై చావదు. సంసారం చేసుకునే వాళ్ళకి పప్పులు బాగుచేసుకోడం కావాలి కాని ఇవన్నీ ఎందుకు..?
కొడుకు కొత్తిల్లు కట్టుకున్నాడు. రమ్మని పిలిచేడు. వచ్చాం. వేడుకంతా అయిపోయింది. పెద్దవాళ్ళమనే గౌరవం కొద్దీ కొత్తబట్టలు పెట్టేడు. సంతోషించొద్దూ..దీవించొద్దూ.. అబ్బే.. ఆ మొహం తుమ్మల్లో పొద్దు గుంకినట్టు ముటముటలాడుతూనే వుంది.
కొడుకూ, పిల్లల కన్న దీనికి ఆ టీవీ ప్రోగ్రామే ఎక్కువైందా. దాన్లో మొహం పెట్టేసి ఏం వినేస్తోందో..
హమ్మయ్య.. రైలెక్కాం. కొండంత ఇల్లు కట్టేడు కొడుకు. పాపం బాగానే ఖర్చయ్యుంటుంది. చుట్టపక్కాలందరూ కలవడంతో నాలుగురోజులూ ఇట్టే గడిచిపోయేయి. ఈ హడావిడిలో కంటినిండా నిద్రేపోలేదు. ఆ ఏవుందీ.. ఈ నాల్రోజులూ అది బాగానే పడుకుందిగా.. సామాను సంగతి చూసుకుంటుందిలే..
"ఏమేవ్.. కాస్త చూసుకో.. "
గట్టిగా చెప్పేడు వర్ధనమ్మకి. చురుగ్గా చూసింది భర్తవైపు.
అదేవిటీ.. అలా చూస్తుంది.. ఆ చూపుకే కనక శక్తుంటే తనిక్కడే మాడి మసైపోయేటట్టుందా చూపు.. కొంపదీసి ఇది సామానొదిలేసి మధ్యలో ఎక్కడో దిగిపోదుకదా..
ఆ నామొహం. అయినా అది దిగి ఎక్కడికి పోగలదని..?
ఇంట్లో అంతా వుండి దాన్ని చూసుకుంటున్నాం కనక దాని బతుకు వెడుతోంది. మమ్మల్ని కాదనుకుని అది ఎక్కడికి పోయినా పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టే.
హా... నిద్రొచ్చేస్తోంది... అమ్మయ్య.....గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్.....

_____________________________________________________

2 వ్యాఖ్యలు:

మాలా కుమార్ said...

మీ వెర్షన్ బాగుందండి .

Lakshmi Raghava said...

కథ లో ఒరిజినాలిటీ అలాగే వుంచి ఎంత మలుపు తిప్పచ్చో బాగా చెప్పారు .చాలా బాగుంది..