Pages

Thursday, August 21, 2014

శ్రీ కృష్ణాష్టమి జ్ఞాపకాలు…
చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలతాడు పట్టుధట్టి
సందె తాయెతులును సరిమువ్వగజ్జెలు
చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు.
   స్కూల్లో చిన్నప్పుడు ఈ పద్యం పాడుకుంటున్నప్పుడల్లా  ఆ బుజ్జికృష్ణుడు అలాగే చేతిలో వెన్నతో, మెడలో దండతో ఘల్లుఘల్లుమంటూ గజ్జెలు చిన్నగా సవ్వడి చేస్తూండగా యెదురుగా వచ్చి నిలుచున్నట్టే అనిపించేది. అసలు తలపులకే యెంతటి మనోహరమైన విగ్రహం. అందమె ఆనందం అన్నట్టు విశ్వంలోని అందాన్నంతటినీ ప్రోదిచేసుకుని, మనకోసం పూలతో, హారాలతో అలంకారం చేసుకుని, మనలను ఆనందపరవశులను చేయడానికి ఆ కన్నయ్య యెట్టెదుట నిలచినట్టుండేది.

ఆ చిన్నికన్నయ్యలీలలు కథలుకథలుగా వింటున్నకొద్దీ తీయగా వుండేవి. యెంచక్కా ఇప్పుడు ఇక్కడికి వచ్చెయ్యకూడదూ.. ఆ కన్నయ్య వెనకాల అందరిళ్ళలోకీ దూరిపోయి అల్లరి చేసెయ్యొచ్చూ.. అనిపించేది.

ముఖ్యంగా కృష్ణాష్టమికి  సాయంత్రం అమ్మ తులసికోట చుట్టూ ముగ్గులు పెట్టి, ఆ బాలకృష్ణునికోసం పాలు, వెన్న, అటుకులు, బెల్లం సిధ్ధం చేసేది.

ప్రతీపండుగకీ పూజ అయ్యాక ఆ దేవునిమీద కృతికానీ, పాటకానీ పాడడం మా యింట్లో అలవాటు. అందుకోసం ప్రత్యేకం ఈ పండుగకోసం నేనూ, మా చెల్లెళ్ళూ కృష్ణునిమీద కొత్తకొత్తపాటలు నేర్చుకునేవాళ్లం. చాలా పాటలున్నా, అప్పటికీ, ఇప్పటికీ యింకా యెప్పటికీ కూడా గుర్తుండేపాట  యేదంటే.. యశోదాదేవి కృష్ణుని మన్ను తినవద్దని చెపుతూ, తినడానికి యింకా తియ్యగా బోల్డు వున్నాయని చెప్పే పాట. మనకి పాడుతుంటేనే నోరూరిపోతుంది.  యెందుకంటే యిందులో తినడానికి చాలా వున్నాయికదా.. అందుకనన్నమాట. ఇదిగో..ఇదే ఆ పాట..

మన్నూ తినకురా తనయ  మామాటా వినరా..

బంగారు పళ్ళెరాలలో భక్ష్యాములు పెడితే తినవు..// మన్నూ తినకురా//

పాదరఫేణీ, మైసూర్ పాకు, పాలకోవా, పచ్చిబిళ్ళ

పచ్చి ద్రాక్షపండ్లు నీకు బాలకృష్ణా

బాదంహల్వా, పన్నెరాలు, పనసతొనలు, కలకండాలు

కదళీ ఖర్జూరం పండ్లు తెచ్చి పెడితె తినవేమి..// మన్నూ తినకురా//

ఆ పాట పాడుతుంటే కృష్ణునితో కలిసి అవన్నీ తింటున్నట్టే ఊహలు. ఆ ఊహలలో ఒకరినొకరు ఊరించుకుంటూ, ఒకరి చేతిలోది మరొకరు లాక్కుంటూ, ఒకరినొకరు పడదోసుకుంటూ యెన్నెన్ని ఆటలో ఆడేసేవాళ్ళం. యెంత మథురమైన జ్ఞాపకాలు? యెంతటి అమాయకత్వం?

  కాస్త పెద్దవుతున్నకొద్దీ కృష్ణుని లీలల వెనకగల అర్ధం కాస్త కాస్త తెలిసేది. అమ్మ వెనకాల అమ్మని అనుకరిస్తూ ఒక్కొక్క లీలకూ నాన్నగారినడిగి అర్ధాలు తెలుసుకుంటూ పెరిగిన మాకు ఇప్పటికీ కృష్ణాష్టమి వస్తోందంటే అప్పటి రోజులే గుర్తొస్తాయి.
---------------------------------------------------------------------------------------------------
చిత్రపటం సౌజన్యం..Krishna.org