Pages

Wednesday, February 22, 2012

"ఎంతవారలైనా..."




ఈ మధ్య చిన్నపిల్లలు సరదాగా వేసిన నాటకం ఒకటి చూసేను. వెంటనే చిన్నప్పుడు మేం వేసిన నాటకాలు ఒకటొకటీ గుర్తొచ్చేయి. అందులో ఒక నాటకం "బూర్లెమూకుడు" అని ఉండేది.

ఒక భార్యాభర్తలకి (అంటే ఒక భార్యా, ఒక భర్తా అన్నమాట) బూరెలు తినాలనిపిస్తుంది. కాని వారికి దానికి సరిపడ సరుకులు తెచ్చుకుని వండుకునే స్తోమత వుండదు. కాని వాళ్ళు చాలా తెలివైనవాళ్ళని వాళ్ళ నమ్మకం. అందుకని భర్త పచారీకొట్టుకి వెళ్ళి ఆ కొట్టతనికి ఇప్పుడే ఇంటినుంచి డబ్బు తెచ్చి ఇస్తానని చెప్పి బూరెలు వండడానికి కావల్సిన పప్పు, బెల్లం, నూనె లాంటివి అరువుగా తెస్తాడు.

వాళ్ళింట్లో బూర్లెమూకుడు కూడా వుండదు. భార్య ఇంటావిడ నడిగి ఇప్పుడే ఇచ్చేస్తానని చెప్పి బూర్లెమూకుడు తెస్తుంది. ఇద్దరూ కలిసి ఎంచక్కా తియ్యటి బూరెలు వండుకు తింటారు. ఇద్దరూ పంచుకుని తినడం పూర్తయేసరికి ఆఖరికి ఒక్క బూరె మిగిలిపోతుంది. అది నాకంటే నాకని ఇద్దరూ దెబ్బలాడుకోడం మొదలుపెడతారు.

పచారీ కొట్టులో అరువు ఇవ్వనంటే ఎన్ని రకాల అబధ్ధాలు చెప్పి సరుకులు తీసుకొచ్చేడో భర్త గొప్పగా చెప్పుకుంటాడు. తను అల్లా సరుకులు తేవడం వల్లనే ఆవిడగారు బూరెలు వండగలిగిందనీ, లేకపోతే అసలు బూరెలు ఎక్కణ్ణించి వస్తాయనీ, అందుకని ఆమిగిలిన ఒక్క బూరె తనకే చెందాలనీ గట్టిగా చెప్తాడు.

ఆవిడగారు ఊరుకుంటుందా? తను ఎన్నిరకాల మాయమాటలు చెప్పి ఇంటావిడ దగ్గర్నుంచి బూర్లెమూకుడు తెచ్చిందో చెప్పి, అదే లేకపోతే బూరెలు ఎలా వండుతారని ఎద్దేవా చేస్తూ ఎలాగైనా ఆ మిగిలిన బూరె తనదే అవుతుందని అంతకన్న గట్టిగా చెప్పింది.

ఇద్దరూ కాసేపు నాకంటే నాకని వాదించుకున్నాక ఒక ఒప్పందానికి వస్తారు.

ఆ ఒప్పందం యేంటంటే.. ఎవరయితే ఎక్కువసేపు మాట్లాడకుండా వుంటారో వాళ్లకే ఆ బూరె చెందాలని. ముందర ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఓడిపోయినట్టేనని నిర్ణయించుకుంటారు. సరే ఇద్దరూ స్టేజి మీద చెరో వైపూ రెండు కుర్చీల్లో నోటి మీద వేలేసుకుని కూర్చుంటారు. (స్కూల్ లో పిల్లల్లాగ).

అప్పుడు మొదలౌతుంది అసలు డ్రామా.

ముందుగా ఇంటావిడ వస్తుంది.

ఇంటావిడ--ఏవమ్మా..ఎక్కడలేని కబుర్లూ వల్లించి మూకుడు తీసికెళ్ళేవ్. పనయ్యేక వెంటనే ఇవ్వాలని చెప్పేనా ...లేదా. అవతల నా వంటకి కావాలి. ఇవ్వకుండా అలా కూర్చున్నావేంటీ?

ఈ కూర్చున్న భార్యగారు నోటి మీద వేలు కూడా తియ్యదు.

ఇంటావిడ-- అదిగో.. అలా విగ్రహంలా కూచుంటే ఎలా? నా మూకుడు నాకియ్యీ..

ఊహు..ఉలుకూ పలుకూ లేదు.

ఇంతలో పచారీ కొట్టాయన వస్తాడు.

కొట్టతను--ఏవయ్యా పెద్దమనిషీ.. ఇలా ఇంటికెళ్ళి అలా డబ్బు తెస్తానన్నావ్. నీ ఇంటిదాకా రప్పించేవ్. ఏదీ డబ్బు?

ఆ పెద్దమనిషి నోరిప్పడు.

కొట్టతను--కొట్టు వదిలేసి వచ్చేనయ్యా.. నా డబ్బు తియ్యి ముందు.

ఊహు..కదలడు. మెదలడు.

ఈ భార్యాభర్త లిద్దరినీ చూసిన ఇంటావిడకీ, కొట్టతనికీ అనుమానం వస్తుంది. అలా బొమ్మల్లా బిగుసుపోయేరంటే వీళ్లకి రోగమేదైనా వచ్చిందేమోనని వెంటనే డాక్టర్ ని పిలుస్తారు. డాక్టర్ వచ్చి, ఇద్దరినీ పరీక్షించి, బుర్ర గోక్కుని, ఏమీ తెలీట్లేదని వెళ్ళిపోతాడు.

ఎన్నిరకాలుగా అదిరించినా, బెదిరించినా, కుదిపినా, పడేసినా ఆ భార్యాభర్తలిద్దరూ నోటిమీద వేలు తియ్యరు. పెదవి కదపరు. మాట్లాడరు. దాంతో వీళ్ళిద్దరికీ దెయ్యం పట్టుకుందేమోనని ఇంటావిడకీ, కొట్టతనికీ అనుమానం వస్తుంది.

వెంఠనే ఓ భూతవైద్యుణ్ణి పిలుచుకొస్తారు.

ఆ భూతవైద్యుడు "హ్రాం..హ్రీం.." అనుకుంటూ వచ్చి, వీళ్ళ ముందు ముగ్గేసి, ధూపం వేసి, ఆఖరికి చింతబరికె పుచ్చుకుని మీదకి వస్తాడు.

హు.. అయినా ఇద్దరూ బుధ్ధ విగ్రహాల్లా కదలకుండా వుండిపోతారు.

భూతవైద్యుడు ముందు భర్తని పట్టుకుని చింతబరికెతో ఎడాపెడా వాయిస్తాడు.

అబ్బే.. అస్సలు చలనం వుండదా భర్తలో.

కొట్టి కొట్టి అలిసిపోయిన ఆ భూతవైద్యుడు
"నా మాట విని దిగవు కదూ.. వుండు. ముందు నీ భార్యకి పట్టిన దెయ్యాన్ని వదిలించి, తర్వాత మళ్ళీ నీ దగ్గరికొస్తాను.." అంటూ చింతబరిక పుచ్చుకుని అతని భార్య వైపు వెళ్లబోతాడు.

వెంఠనే భర్త.." అయ్యయ్యో.. మా ఆవిణ్ణి కొట్టకండి. మా ఆవిణ్ణి కొట్టకండి.."అంటూ లేచిపోయి, భూతవైద్యుడికి అడ్డం పడిపోతాడు.

ఆ వెంఠనే భార్య మిగిలిన ఒక్క బూరె నోట్లో పడేసుకుని, "నువ్వోడిపోయేవోయ్.. ఈ బూరి నాదేనోయ్.."అంటూ ఒక్క గెంతున లేస్తుంది.

అక్కడున్న అందరూ తెల్లబోతారు. ఒక్క బూరె కోసం అన్ని దెబ్బలు తిన్న ఆ భర్త భార్య మీద దెబ్బ పడుతుందనుకునేసరికి అగ్గగ్గలాడిపోయి, అడ్దం పడిపోయి బూరె తినే ఛాన్స్ పోగొట్టేసుకున్నాడు.

ఇంటావిడా, కొట్టతనూ వీళ్ళ విషయమంతా విని నవ్వుకుంటూ
"ఎంతవారలైనా ......" అనుకుంటారు..

------------------------------------------------------------------------------------


చిత్రం...గూగులమ్మ సౌజన్యంతో...