Pages

Friday, October 7, 2011

వందేళ్ళ కథకు వందనాలుకథాభిమానులందరూ ఇష్టపడే కార్యక్రమం ఈ "వందేళ్ళ కథకు వందనాలు" కార్యక్రమం.
నిన్న మధ్యాహ్నం 1-30 కు హెచ్ఎంటివి లో ప్రసారమయింది.
ఎప్పుడూ సినిమాలతోనూ, వార్తావ్యాఖ్యలతోనూ ప్రసారాలు చూసే వీక్షకులకు ఇది నిజంగా అపూర్వమైన అవకాశం.
ఈ వందేళ్ళలోనూ తెలుగులో వచ్చిన గొప్ప కథలలో వంద కథలను ఎంపిక చేసి ఆ కథలపై సమగ్ర విశ్లేషణ చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.
ఈ ధారావాహికను ప్రముఖ నటులు, రచయిత శ్రీగొల్లపూడి మారుతీరావుగారు నిర్వహిస్తున్నారు.
హెచ్ఎంటివి నిర్వహిస్తున్న ఈ వందేళ్ల కథకు వందనాలు కార్యక్రమం చాలా బాగుంది.
మారుతీరావుగారు సహజంగానే మొదటి ప్రసారంలోనే వీక్షకులని ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమం ప్రతి గురువారం మధ్యాహ్నం 1-30 గంటలకు గంటలకు కు హెచ్ఎంటివి లో ప్రసారమవుతుంది.
ఈ సంగతి తెలియని సాహిత్యాభిమానులందరూ దీనిని చూస్తే బాగుంటుందని ఇలా బ్లాగ్ లో చెపుతున్నాను.

హెచ్ఎంటివి సౌజన్యంతో..

Tuesday, October 4, 2011

అమెరికా దాకా ఎందుకూ?

2003 సంవత్సరం ఉగాది సందర్భంగా సిలికాన్ ఆంధ్రా-సుజనరంజని పత్రికవారు హాస్య కవితల పోటీ నిర్వహించారు.
అందులో నేను రాసిన "అమెరికా దాకా ఎందుకూ..?" అన్న కవితకు తృతీయబహుమతి వచ్చింది.
వాటిలో కొన్ని కవితలను వీడియోగా తీసి వారి వెబ్సైట్ లో ఉంచారు. అందులో నా కవిత కూడా వుంది.
ఆ వీడియోని ఇప్పుడు నా బ్లాగ్ లో పెట్టుకుంటానంటే వారు పెద్దమనసుతో అంగీకరించారు.
మీ అభిప్రాయాలని తెలియచేస్తారుకదూ...!

అమెరికా దాకా ఎందుకూ?
బుజ బుజ రేకుల పిల్లుందా - అనుకుంటూ

జుయ్ మని విమానం దిగిన

జులపాల జుట్టు పిల్లవాడి చేయందుకుందుకు

చిలకల్లాంటి పిల్లలు ఎదురు చూస్తుంటే -

అదిగో ...

ఇంటర్వ్యూ మొదలు.

ఏం పేరమ్మా నీది

అబ్బే పాతకాలం పేరు

పోనీలే మార్చుకుంటాను

ఒకలాంటి అమెరికా నవ్వు

ఏం చదివావమ్మా

ఓహో కంప్యూటరు కాదా

మరి వుద్యోగం దొరకడం కష్టమే

ఒకరకమయిన భుజాల కుదింపు.

జీన్ పేంటు వేసుకోవాలి

జుట్టు కత్తిరించుకోవాలి - కాని

తను గీచిన గీటు దాటకూడదు.

ఫేషన్ గా వుండాలి

పార్టీలకు రావాలి - కాని

పెత్తనం అడగకూడదు

అసలు సిసలయిన ఆంధ్రా మొగుడు కదా మరి.

వున్న సెలవు మూడు వారాలు

ఇంక వారమే మిగిలింది

పిల్ల దొరుకుతుందా

ఆతృత పెరుగుతోంది

ఆంధ్ర రాష్ట్రమంతా జల్లెడ పడితే

అదుగో ఆ మూల

ఒకమ్మాయున్నట్టుందే

పరుగో పరుగు

అమ్మాయీ, ఓ అమ్మాయీ

అమెరికా వస్తావా?

ఊహు - రాను.

ఏం? ఎందుకని?

అక్కడ _

బొచ్చెలు కడుక్కోవాలి

బట్టలుతుక్కోవాలి

చద్దన్నం తినాలి

చలితో చావాలి.

మరిక్కడో _

ఇక్కడయితే

పనికి మనిషి

బట్టలకి మనిషి

వంటకి మనిషి

ఆఖరికి తినిపెట్టడానికి కూడా

మనుషులే మనుషులు.

ఇంతోటి మొగుడి కోసం

అమెరికా దాకా ఎందుకూ

అమలాపురం వెడితే చాలు కదా!


with acknowledgements to www.Sujanaranjani.siliconandhra.org