Pages

Wednesday, June 11, 2014

అయిందా పెళ్ళీ..



అయిందా పెళ్ళీ..

ఆమధ్య మంథా భానుమతిగారు FBలో స్నేహితులందరినీ మీమీ తొలి ఙ్ఞాపకాలు రాయండీ అంటూ చిన్న పోటీ పెట్టారు. అందరూ వారి వారి ఙ్ఞాపకాలు రాసారు. అందరితోపాటే నేనూ రాసాను. యెందుకో దానిని బ్లాగ్‍లో శాశ్వతంగా పెట్టుకోవాలనిపించింది. మీరు కూడా చదివి మీమీ అభిప్రాయాలు చెపుతారు కదూ.. 




       నాకు యిద్దరన్నయ్యలు. చిన్నప్పుడంతా నేను వాళ్ల వెనకాల తోకలా తిరిగేదాన్ని. నన్ను వాళ్ళిద్దరూ చాలా రష్చించేస్తుండేవాళ్లన్న మాట. అందుకని మూడు నాలుగేళ్ళప్పుడు నేనేంటో నాకే తెలీదు. కాని భానుమతిగారు మీ మీ ఙ్ఞాపకాలు గుర్తు చేసుకోండీ అన్నప్పుడు నేను నా ఙ్ఞాపకాల్లోకి రింగులు రింగులు చుట్టుకుంటూ వెళ్ళిపోయాను. అలా వెనక్కి వెళ్ళగా వెళ్ళగా బహుశా నాకు ఆరేళ్ళుంటాయనుకుంటాను...అప్పుడు నా వల్ల ఒకమ్మాయి యేడిచిన యేడుపు టక్కున గుర్తొచ్చింది. వెంఠనే అప్పటి ఆ పిల్ల రూపం కళ్ళకు కట్టింది. అంతే..పెన్ను చేతబుచ్చుకున్నాను..కాదు కాదు కీబోర్డ్ మీద వేలు పెట్టాను. అంతే. ఇదిగో ఇలా వచ్చేసింది.

     అప్పుడప్పుడే రేడియో కొంతమందిళ్లలో మాత్రమే వినబడుతున్నరోజులు. అప్పటికింకా కొన్ని పల్లెటూళ్ళకి కరెంట్ సరఫరా వుండేది కాదు. పల్లెటూళ్ళలో వున్నవాళ్ళు పట్టణాల్లో వున్న వాళ్ల చుట్టాలింటికి వచ్చినప్పుడు రేడియోని వింతగా చూసేవారు. అలాగే మా చుట్టాలు మమ్మల్ని చూడడానికి మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారు అప్పుడు రాజమండ్రిలో పనిచేసేవారు.

      ఆరోజు పొద్దున్నే అందరూ పనుల్లో వున్నారు. మా చుట్టాలమ్మాయి నా ఈడుదో లేక నాకన్నా చిన్నదో నాకు గుర్తులేదు. పేరు కూడా గుర్తులేదు. పేరే కావాలంటారా. సర్లెండి."సంతలో చింతకాయ" అనుకుందాం. అది ఆ రేడియోనే చూస్తూ కూర్చుంది. నాకు నా గొప్పతనం చూపించుకోవాలనిపించి, రేడియోలో ముల్లుని అటూ ఇటూ తిప్పాను. అప్పటిదాకా రేడియోలో వినబడుతున్న మగగొంతు కాస్తా ఆడగొంతులా మారిపోయింది. ఆ చింతకాయ రేడియో వెనకవైపుకి అంటే గోడకి, రేడియోకి మధ్య వున్న సందులోకి తలదూర్చి మగాళ్ళు కూర్చుని పాడుతున్నారా..ఆడాళ్ళా.. అన్నట్టు కుతూహలంతో తొంగిచూస్తోంది.

 "ఏయ్.. అలా వెనక్కెళ్లకు, షాక్ కొడుతుంది.." అన్నాను ఖంగారుగా.
          
      "అంటే.."అంది. "అంటే చచ్చిపోతావన్నమాట.." నా పరిఙ్ఞానాన్నంతా చూపించేసాను. ఆ చింతకాయకి కుతూహలం ఆగలేదనుకుంటాను..మళ్ళీ వెనకవైపు తొంగిచూడబోయింది. 

     "ఒద్దన్నానా.."అన్నాను గట్టిగా. వినలేదా చింతకాయ. నావైపు చూస్తూ రేడియో వెనకాల చెయ్యి పెట్టింది. "యేయ్.."అన్నాను గట్టిగా. టక్కున చెయ్యి ఇవతలకి లాగేసుకుని ఇంకో చేత్తో దాన్ని గట్టిగా పట్టేసుకుంది.    
       
        నిజంగా షాక్ కొట్టిందేమో అనుకుని, చెప్పినమాట వినకుండా రేడియో వెనకాల చెయ్యి పెట్టినందుకు విసుక్కుంటూ.."అయ్యిందా పెళ్ళీ.." అన్నాను.అంతే.. బేరుమంటూ ఒక్కసారి రాగాన్నందుకుందా అమ్మాయి. ఆ చింతకాయ ఏడుపు విని ఇంట్లో తలో మూలా వున్నవాళ్లందరూ పరిగేఠుకుని వచ్చేసేరు. వచ్చినవాళ్లని చూసి ఆ చింతకాయ శృతి హెచ్చించింది.

      "యేవైందే నా తల్లీ.. నే చచ్చిపోయేనే.." అంటూ అస్తమానం ఆ చింతకాయని నానాతిట్లూ తిట్టే వాళ్ళమ్మ దాన్ని చుట్టేసుకుని భోరుమంది.

      ఆ పిల్ల వెక్కుతూ నావైపు చెయ్యి చూపించి మళ్ళీ రాగాన్ని కంటిన్యూ చేసింది.

        "యేం చేసేవే దాన్ని..?" చుట్టాలకి జరిగిన అమర్యాదకి తెగ బాధపడిపోతూ, మడితో వున్నానన్న మాట మర్చిపోయి మా అమ్మ గట్టిగా నా చెయ్యి పట్టుకుంది. "దానికి షాక్ కొట్టింది." ఒక్కమాటలో చెప్పాన్నేను. అంతే..బాంబు పేలినట్టు హడిలిపోయారందరూ. ఆ చింతకాయ చుట్టూ జేరి, "యేదేది" అంటూ దాని ఒళ్ళంతా పరీక్షించడం మొదలెట్టేరు. 

       అది వెక్కుతూనే అడ్డంగా తలూపుతూ మళ్ళీ నా వైపు చూపించి, మళ్ళీ యేడుపు మొదలెట్టింది. దాంతో అందరూ నేను దాన్నేదో చేసేసేననుకుని నన్ను దోషిలా నిలబెట్టి యేంచేసేవని అడగడం మొదలెట్టేరు. నేనేం చేసేనూ..యేం చెయ్యలేదని చెపితే ఒక్కరూ వినరే..ఇంతలో ఆ చింతకాయ రాగం యెక్కువ చేసింది.

        మా అమ్మమ్మ గబగబా వంటింట్లోకెళ్ళి ఇంత బెల్లమ్ముక్క తెచ్చి దాని నోట్లో పెట్టేసింది. ఓవైపు నోట్లో బెల్లమ్ముక్క, ఇంకోవైపు యేడుపు..దేన్ని అందుకోవాలో తెలీట్లేదు ఆ చింతకాయకి. నోరిప్పి యేడిస్తే ఆ బెల్లమ్ముక్క కింద పడిపోతుందేమో..పోనీ బెల్లమ్ముక్క చప్పరిద్దావంటే యేడుపు తన్నుకుని వచ్చేస్తోందాయె..
నేను మటుకు మహా కుతూహలంగా చూస్తున్నాను. క్షణాని కోసారి ఆ బెల్లమ్ముక్క ఆ చింతకాయ నాలుక చివరిదాకా రావడం, అంతలోనే అది గుటకేసుకుంటూ దాన్ని మళ్ళీ లోపలికి లాక్కోడం, మళ్ళీ అంతలోనే దుఃఖం ముంచుకు వచ్చేసి గట్టిగా నోరిప్పి యేడవడం, ఆ బెల్లమ్ముక్క నాలిక చివర్దాకా రావడం, అది యెప్పుడు పడిపోతుందా అని నేను ఊపిరి బిగపట్టి చూడడం.. ఆ చింతకాయ మళ్ళీ లోపలికి లాక్కోడం..అబ్బా..అలా ఈ ఫార్సంతా ఓ రెణ్ణిమిషాలు నడిచాక, మా మావయ్యే అనుకుంటాను..లేపొతే మా బాబయ్యో..యెవరో గుర్తులేదుకానీ వచ్చి ఆ చింతకాయని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, పైకండువాతో కళ్ళు, మొహం తుడిచి, దాన్ని నెమ్మదిగా బుజ్జగించి, "యేమైందమ్మా..చెల్లాయి కొట్టిందా.."అనడిగేడు.(ఇంట్లో నన్నంతా చెల్లాయని పిలుస్తార్లెండి). అది కాదని అడ్డంగా తలూపింది.

       హమ్మయ్య అని ఇంకా పూర్తిగా అనుకోకుండానే మళ్ళీ నావైపు చూపించి యేడవడం మొదలెట్టింది. మళ్ళీ అందరూ నన్నో హంతకురాలిని చూసినట్టు చూడ్డం మొదలెట్టేరు. మా మావయ్య యెంత మంచివాడో..నెమ్మదిగా దాని యేడుపు మాన్పించి, అసలేం జరిగిందో చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ సమాచారమంతా ఆ చింతకాయ నుంచి రాబట్టేడు.

        యేతావాతా తేలిందేంటంటే.. ఆ చింతకాయ రేడియో వెనకనుంచి చెయ్యి బయటికి తీసినప్పుడు నేను "అయిందా పెళ్ళీ.." అన్నానుట. పెళ్ళి అన్నమాట ఆ రోజుల్లో ఆడపిల్లల దగ్గర యెంత చిన్నవయసువాళ్ళైనా సరే అంటే వాళ్ళు సిగ్గుతో మెలికలైనా తిరుగిపోయేవాళ్ళు. లేదా.అక్కణ్ణించి పారిపోనైనా పారిపోయేవారు(ట).

       ఈ విషయం నాకేం తెలుసూ.. అన్నయ్యల వెనకాల మగరాయుళ్ళా తిరిగేదాన్ని.. ఇంతకీ నేను ఆ చింతకాయని "అయిందా పెళ్ళీ.." అంటూ దాని పెళ్ళిమాట యెత్తినందుకు అది అంత ఘోరంగా యేడిచిందన్నమాట. అప్పటికీ ఇప్పటికీ నాకు అర్ధంకానిదొక్కటే.. పెళ్ళన్న ఒక్కమాటకి మరీ అంత వెక్కిళ్ళు పెడుతూ, బెల్లమ్ముక్కని బాలన్స్ చేస్తూ యేడవాల్సినంత అవసరం వుందా... అని.

------------------------------------------------------------------------------------------------------------


(చిత్రం: గూగులమ్మ సౌజన్యంతో..)

Tuesday, June 3, 2014

మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి శతజయంత్యుత్సవం..



మేరునగమంతటి ఉన్నతవ్యక్తిత్వం కలవారూ
సముద్రమంత గంభీరులూ
కుసుమకోమలహృదయులూ
రాముడంతటి వినయసంపన్నులూ
బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు...
 ఆయనే మా నాన్నగారు.     




  ఈ జూన్ ఒకటవతారీకు నాకు, మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళకు పండుగరోజు. యెందుకంటే ఆరోజున మా నాన్నగారు, శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి శతజయంత్యుత్సవం జరిగింది.
   తొంభైయ్యారు సంవత్సరాలు నిండుగా బ్రతికిన మా నాన్నగారు పండుటాకు రాలినట్టు 2010లో స్వర్గస్తులయ్యారు. బ్రతికుంటే ఈ జూన్ ఒకటికి వందసంవత్సరాలు అయివుండేవి. అందుకే మా అన్నయ్యలు వెంకట రామ సోమయాజులు, దుర్గా వెంకటేశ్వర్లు కలిసి ఈ జూన్ ఒకటిన మా నాన్నగారి శతజయంత్యుత్సవాన్ని రాజమండ్రిలో బ్రహ్మాండంగా జరిపించారు.
  మా అక్కచెల్లెళ్ళం ముగ్గురం కలిసి వెళ్ళాం రాజమండ్రి. అంతే.. ఇంక స్టేషన్‍లో  దిగిన దగ్గర్నుంచీ మాకంతా ఆనందమే ఆనందం.
    ఈ ఉత్సవాన్ని ప్రకాశంనగర్ కమ్యూనిటీహాల్‍లో యేర్పాటు చేసారు. అది అక్కడ పింఛనుదారులందరూ కలిసి సమావేశాలు, సంబరాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పురాణ కాలక్షేపాలు లాంటివన్నీ జరుపుకునే చోటు. దానిని వారు కమ్యూనిటీహాల్ అనరు. పెద్దవారంతా కలిసి దానికి "ధర్మం చర.." అనే యెంచక్కటి పేరు పెట్టుకున్నారు. అక్కడందరూ ఆ హాల్‍ని ఆపేరుతోనే వ్యవహరిస్తారు. అలా "ధర్మం చర.." అన్న పేరుని ప్రాచుర్యంలోకి తేవాలనే వారి తలంపులోనే  తెలుస్తోంది వాళ్లందరూ యెంత ధర్మపరులో. ఆ "ధర్మం చర" తో మా నాన్నగారికి ముఫ్ఫైసంవత్సరాల పైనే అనుబంధం వుంది. అక్కడి పెద్దలందరూ మా నాన్నగారికి హితులు, సన్నిహితులు. వారందరూ ఈ ఉత్సవంలో ఆనందంగా పాలుపంచుకున్నారు.
మరింక బంధువులు, ఊరిలోని పెద్దమనుషులూ కూడా వచ్చి మా నాన్నగారిని గుర్తు చేసుకున్నారు.
           ఉదయం పదిగంటలకి మా అమ్మగారు శ్రీమతి పద్మావతి, మా నాన్నగారు శ్రీ సుబ్బయ్యశాస్త్రిగార్ల ఫొటోలకు పూలమాలలు వేసి, అక్కడ మా పెద్దక్క మహాలక్ష్మి జ్యోతి ప్రజ్వలనం చేయడంతో సభ ప్రారంభమైంది.



   నలుగురు వేదపండితులు వేదం పఠించారు. అలా ఆ ఉదయంపూట వేదపఠనం వింటుంటే ఆ దేవతలే దీవిస్తున్నారా  అనిపించింది.



   తర్వాత మా చెల్లెలు భారతి సరస్వతీదేవిని స్తుతిస్తూ ప్రార్ధనాగీతం పాడింది. "శ్రీ పద్మాంచిత పాణీ.." అన్న ఈ ప్రార్ధన మా నాన్నగారికి చాలా ఇష్టమైనది. అస్తమానం మా చెల్లెలి చేత పాడించుకునేవారు. ఆ సంగతి గుర్తొచ్చి, ఒక్కసారి నాన్నగారే అక్కడికొచ్చి వింటున్నారా అన్న అనుభూతి కలిగింది.



ప్రార్ధన అయ్యాక "కౌండిన్య.." అన్న పుస్తకాన్నిపెద్దలు శ్రీ దాట్ల బలరామరాజుగారు ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో మా నాన్నగారు విశేషకృషిచేసి వ్రాసిన పిడపర్తివారి వంశచరిత్ర, వారి కథలూ-గాథలూ మాత్రమే కాకుండా అచ్చ తెలుగులో సంక్షిప్తంగా వ్రాసి మా అమ్మగారి ఆత్మశాంతికి అంకితమిచ్చిన రామకథ కూడా వుంది. అంతే కాకుండా అందులో మా నాన్నగారు చేసిన సమస్యాపూరణలూ, వ్రాసిన చాటువులూకూడా వున్నాయి. అవే కాకుండా వారి జీవితకాలంలో జరిగిన సంఘటనలు మరపురాని కథలుగా కూడా అందులో వున్నాయి. ఇవన్నీ కలిపి  మా అన్నయ్యలిద్దరూ పుస్తకాన్ని కొత్తగా, అందంగా తీసుకొచ్చారు. ఇదిగో.. ఇదే ఆ పుస్తకం.





       ఆ పుస్తకం చేతిలో పట్టుకుని పుటలు తిప్పుతుంటే మా నాన్నగారే మళ్ళీ మాముందుకొచ్చి మాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది.
       ఆ తర్వాత అక్కడి పెద్దలందరూ నాన్నగారి గురించి మాట్లాడారు. మమ్మల్నీ మాట్లాడమన్నారు. కానీ.. అదేమిటో.. నాన్నగారు పంచిన ప్రేమ, అనురాగం మాత్రమే గుర్తొచ్చాయి తప్పితే  ఆయన పాండిత్యం, గొప్పదనం గుర్తు రాలేదు. యేనాడూ కూడా మా నాన్నగారు మమ్మల్ని ఒక్క పరుషవాక్యం కూడా అనలేదు. "అమ్మా, తల్లీ.." అని పిలిచేరు తప్పితే మరో పిలుపు లేదు. నాకేమిటో ఆ పిలుపే గుర్తొచ్చింది. మళ్ళి మళ్ళీ ఆ పిలుపునే గుర్తు చేసుకుంటూ కూర్చున్నాను.
 ధూళిపాళ మహదేవమణిగారిలాంటి పెద్దలు మా నాన్నగారితో వారికి గల అనుబంధాన్ని బట్టి ఆయన యెంతటి ఉన్నత వ్యక్తిత్వం కలవారో తెలిపారు. అవన్నీ వింటుంటే మళ్ళీ మా నాన్నగారిని చూస్తున్న అనుభూతి కలిగింది.
 పెద్దల ప్రసంగాలయ్యాక అందరికీ భోజనాలు యేర్పాటు చేసారు. రాజమండ్రిలో విందుభోజనమంటే యింక వేరే చెప్పేది యేముంది.. అన్నీ ప్రత్యేకమైన వంటలే.. అందరూ ఇష్టంగా తినేవే. పదార్ధాలన్ని చాలా బాగున్నాయి.
  ఆతర్వాత మధ్యాహ్నం కాస్త విశ్రాంతి.
     కాని మేవేమీ విశ్రాంతి తీసుకోలేదు. మా కజిన్స్ అందరం చాలా సంవత్సరాల తర్వాత ఇంత తీరుబడిగా ఒకచోట కలిసాం కదా.. అందుకని మా చిన్నప్పటి ముచ్చట్లన్నీ చెప్పుకున్నాం. అలా నాన్నగారి దగ్గర గడిపిన బాల్యం గుర్తు చేసుకుంటుంటే యెంత హాయిగా అనిపించిందో.
తర్వాత సాయంత్రం ఆరుగంటలకు హరికథా కాలక్షేపం యేర్పాటు చేసారు. మనిషికి అహంకారం పనికిరాదనే నీతిని చెపుతూ అలా అహంకరించిన భీముణ్ణీ, అర్జునుణ్ణీ శ్రీకృష్ణుడు యెలా దారికి తీసుకొచ్చాడనే అంశంపై సాగిన హరికథ. యెన్నేళ్ళయిందో అలా ప్రత్యక్ష్యంగా హరికథ విని. చాలా బాగుంది. హరికథలో పిట్టకథలు మరీ బాగుంటాయి కదా..
   
  


        ఆవిధంగా మా నాన్నగారి శతజయంత్యుత్సవం చాలా బాగా జరిగింది. ఈ విధంగా మానాన్నగారి ముచ్చట్లు   మీ అందరితో కూడా పంచుకుంటున్నందుకు యింకా సంతోషంగా వుంది. 
------------------------------------------------------------------------------------
మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి శతజయంతి సందర్భమున ఆయన రచనలతో సమకూర్చిన ప్రచురణ.

ఈ పుస్తకం ప్రింటు పుస్తకంగానూ, ebook గానూ ఈ క్రింది link లో లభిస్తుంది.


http://kinige.com/kbook.php?id=3082
రచనాభినందనలతో, జి.ఎస్.లక్ష్మి..