Pages

Tuesday, June 3, 2014

మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి శతజయంత్యుత్సవం..మేరునగమంతటి ఉన్నతవ్యక్తిత్వం కలవారూ
సముద్రమంత గంభీరులూ
కుసుమకోమలహృదయులూ
రాముడంతటి వినయసంపన్నులూ
బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు...
 ఆయనే మా నాన్నగారు.     
  ఈ జూన్ ఒకటవతారీకు నాకు, మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళకు పండుగరోజు. యెందుకంటే ఆరోజున మా నాన్నగారు, శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి శతజయంత్యుత్సవం జరిగింది.
   తొంభైయ్యారు సంవత్సరాలు నిండుగా బ్రతికిన మా నాన్నగారు పండుటాకు రాలినట్టు 2010లో స్వర్గస్తులయ్యారు. బ్రతికుంటే ఈ జూన్ ఒకటికి వందసంవత్సరాలు అయివుండేవి. అందుకే మా అన్నయ్యలు వెంకట రామ సోమయాజులు, దుర్గా వెంకటేశ్వర్లు కలిసి ఈ జూన్ ఒకటిన మా నాన్నగారి శతజయంత్యుత్సవాన్ని రాజమండ్రిలో బ్రహ్మాండంగా జరిపించారు.
  మా అక్కచెల్లెళ్ళం ముగ్గురం కలిసి వెళ్ళాం రాజమండ్రి. అంతే.. ఇంక స్టేషన్‍లో  దిగిన దగ్గర్నుంచీ మాకంతా ఆనందమే ఆనందం.
    ఈ ఉత్సవాన్ని ప్రకాశంనగర్ కమ్యూనిటీహాల్‍లో యేర్పాటు చేసారు. అది అక్కడ పింఛనుదారులందరూ కలిసి సమావేశాలు, సంబరాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పురాణ కాలక్షేపాలు లాంటివన్నీ జరుపుకునే చోటు. దానిని వారు కమ్యూనిటీహాల్ అనరు. పెద్దవారంతా కలిసి దానికి "ధర్మం చర.." అనే యెంచక్కటి పేరు పెట్టుకున్నారు. అక్కడందరూ ఆ హాల్‍ని ఆపేరుతోనే వ్యవహరిస్తారు. అలా "ధర్మం చర.." అన్న పేరుని ప్రాచుర్యంలోకి తేవాలనే వారి తలంపులోనే  తెలుస్తోంది వాళ్లందరూ యెంత ధర్మపరులో. ఆ "ధర్మం చర" తో మా నాన్నగారికి ముఫ్ఫైసంవత్సరాల పైనే అనుబంధం వుంది. అక్కడి పెద్దలందరూ మా నాన్నగారికి హితులు, సన్నిహితులు. వారందరూ ఈ ఉత్సవంలో ఆనందంగా పాలుపంచుకున్నారు.
మరింక బంధువులు, ఊరిలోని పెద్దమనుషులూ కూడా వచ్చి మా నాన్నగారిని గుర్తు చేసుకున్నారు.
           ఉదయం పదిగంటలకి మా అమ్మగారు శ్రీమతి పద్మావతి, మా నాన్నగారు శ్రీ సుబ్బయ్యశాస్త్రిగార్ల ఫొటోలకు పూలమాలలు వేసి, అక్కడ మా పెద్దక్క మహాలక్ష్మి జ్యోతి ప్రజ్వలనం చేయడంతో సభ ప్రారంభమైంది.   నలుగురు వేదపండితులు వేదం పఠించారు. అలా ఆ ఉదయంపూట వేదపఠనం వింటుంటే ఆ దేవతలే దీవిస్తున్నారా  అనిపించింది.   తర్వాత మా చెల్లెలు భారతి సరస్వతీదేవిని స్తుతిస్తూ ప్రార్ధనాగీతం పాడింది. "శ్రీ పద్మాంచిత పాణీ.." అన్న ఈ ప్రార్ధన మా నాన్నగారికి చాలా ఇష్టమైనది. అస్తమానం మా చెల్లెలి చేత పాడించుకునేవారు. ఆ సంగతి గుర్తొచ్చి, ఒక్కసారి నాన్నగారే అక్కడికొచ్చి వింటున్నారా అన్న అనుభూతి కలిగింది.ప్రార్ధన అయ్యాక "కౌండిన్య.." అన్న పుస్తకాన్నిపెద్దలు శ్రీ దాట్ల బలరామరాజుగారు ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో మా నాన్నగారు విశేషకృషిచేసి వ్రాసిన పిడపర్తివారి వంశచరిత్ర, వారి కథలూ-గాథలూ మాత్రమే కాకుండా అచ్చ తెలుగులో సంక్షిప్తంగా వ్రాసి మా అమ్మగారి ఆత్మశాంతికి అంకితమిచ్చిన రామకథ కూడా వుంది. అంతే కాకుండా అందులో మా నాన్నగారు చేసిన సమస్యాపూరణలూ, వ్రాసిన చాటువులూకూడా వున్నాయి. అవే కాకుండా వారి జీవితకాలంలో జరిగిన సంఘటనలు మరపురాని కథలుగా కూడా అందులో వున్నాయి. ఇవన్నీ కలిపి  మా అన్నయ్యలిద్దరూ పుస్తకాన్ని కొత్తగా, అందంగా తీసుకొచ్చారు. ఇదిగో.. ఇదే ఆ పుస్తకం.

       ఆ పుస్తకం చేతిలో పట్టుకుని పుటలు తిప్పుతుంటే మా నాన్నగారే మళ్ళీ మాముందుకొచ్చి మాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది.
       ఆ తర్వాత అక్కడి పెద్దలందరూ నాన్నగారి గురించి మాట్లాడారు. మమ్మల్నీ మాట్లాడమన్నారు. కానీ.. అదేమిటో.. నాన్నగారు పంచిన ప్రేమ, అనురాగం మాత్రమే గుర్తొచ్చాయి తప్పితే  ఆయన పాండిత్యం, గొప్పదనం గుర్తు రాలేదు. యేనాడూ కూడా మా నాన్నగారు మమ్మల్ని ఒక్క పరుషవాక్యం కూడా అనలేదు. "అమ్మా, తల్లీ.." అని పిలిచేరు తప్పితే మరో పిలుపు లేదు. నాకేమిటో ఆ పిలుపే గుర్తొచ్చింది. మళ్ళి మళ్ళీ ఆ పిలుపునే గుర్తు చేసుకుంటూ కూర్చున్నాను.
 ధూళిపాళ మహదేవమణిగారిలాంటి పెద్దలు మా నాన్నగారితో వారికి గల అనుబంధాన్ని బట్టి ఆయన యెంతటి ఉన్నత వ్యక్తిత్వం కలవారో తెలిపారు. అవన్నీ వింటుంటే మళ్ళీ మా నాన్నగారిని చూస్తున్న అనుభూతి కలిగింది.
 పెద్దల ప్రసంగాలయ్యాక అందరికీ భోజనాలు యేర్పాటు చేసారు. రాజమండ్రిలో విందుభోజనమంటే యింక వేరే చెప్పేది యేముంది.. అన్నీ ప్రత్యేకమైన వంటలే.. అందరూ ఇష్టంగా తినేవే. పదార్ధాలన్ని చాలా బాగున్నాయి.
  ఆతర్వాత మధ్యాహ్నం కాస్త విశ్రాంతి.
     కాని మేవేమీ విశ్రాంతి తీసుకోలేదు. మా కజిన్స్ అందరం చాలా సంవత్సరాల తర్వాత ఇంత తీరుబడిగా ఒకచోట కలిసాం కదా.. అందుకని మా చిన్నప్పటి ముచ్చట్లన్నీ చెప్పుకున్నాం. అలా నాన్నగారి దగ్గర గడిపిన బాల్యం గుర్తు చేసుకుంటుంటే యెంత హాయిగా అనిపించిందో.
తర్వాత సాయంత్రం ఆరుగంటలకు హరికథా కాలక్షేపం యేర్పాటు చేసారు. మనిషికి అహంకారం పనికిరాదనే నీతిని చెపుతూ అలా అహంకరించిన భీముణ్ణీ, అర్జునుణ్ణీ శ్రీకృష్ణుడు యెలా దారికి తీసుకొచ్చాడనే అంశంపై సాగిన హరికథ. యెన్నేళ్ళయిందో అలా ప్రత్యక్ష్యంగా హరికథ విని. చాలా బాగుంది. హరికథలో పిట్టకథలు మరీ బాగుంటాయి కదా..
   
  


        ఆవిధంగా మా నాన్నగారి శతజయంత్యుత్సవం చాలా బాగా జరిగింది. ఈ విధంగా మానాన్నగారి ముచ్చట్లు   మీ అందరితో కూడా పంచుకుంటున్నందుకు యింకా సంతోషంగా వుంది. 
------------------------------------------------------------------------------------
మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారి శతజయంతి సందర్భమున ఆయన రచనలతో సమకూర్చిన ప్రచురణ.

ఈ పుస్తకం ప్రింటు పుస్తకంగానూ, ebook గానూ ఈ క్రింది link లో లభిస్తుంది.


http://kinige.com/kbook.php?id=3082
రచనాభినందనలతో, జి.ఎస్.లక్ష్మి..
 
  

18 వ్యాఖ్యలు:

Lakshmi Raghava said...

enta adrushtam!

vasantham said...

సుబ్బలక్ష్మి గారూ ,
మీ నాన్నగారి శత జయంతి ఉత్సవం ఎంత బాగా జరిగింది అండీ, కనుల ముందు మీరందరూ కనిపించారు ఆ ఉత్సవ విశేషాలు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం అండీ

వసంత లక్ష్మి ..

psm.lakshmi said...

మేము ప్రత్యక్షంగా చూసినట్లు వుందండీ. చాలా సంతోషం. పెద్దవాళ్ళు పంచిన ప్రేమాభిమానాలు మన తరంలో నిలబెట్టుకుని, తర్వాత తరాలకు కూడా పంచాలి, పెంపొందించాలి.
psmlakshmi

మాలా కుమార్ said...

చాలా బాగా జరిపించారండి.ఆయన గురించి పిల్లలు ఇంత గొప్పగా అనుకొని పండగ జరిపించారంటేనే తెలుసుతోంది ఆయన పిల్లలకు ఎంత ప్రేమ ఆప్యాయతలను పంచారో .మీరు అదృష్ఠవంతులు.

Sridevi said...

మీతో పాటే వచ్చి ఆ సంగతులన్నీ చూసినట్టు ఉందండీ. మీదెంతో అద్రుష్టం!

డా.ఆచార్య ఫణీంద్ర said...

కొమ్మ చివరలో వ్రేలాడు గున్న మావి
కాయ, పితృభక్తితో వృక్ష కాండమును త
లంచి పులకించి నట్లనిపించె చదువ!
జయము "పిడపర్తి సుబ్బయ్య శాస్త్రి" గారు!

swathi said...

very lovely madam

sarma said...

మంచి మాట చెప్పేరు. తండ్రిగారిని ఇంత అప్య్యాయంగా తలుచుకున్న మీ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ధన్యులు. సర్వే జనాః సుఖినోభవంతు.

జ్ఞాన ప్రసూన said...

Subbalakshmigaru
Mee naannagaari. Satajayanti. Utsavaalu. Ghanamgaa
Jaripinchinanduku chaalaa Santosham. Pustakam
Baagundi.amma,naannalani. Taluchukonte. Anni
Devullani. Kolichinatle.

శ్రీలలిత said...


అవునండీ లక్ష్మీరాఘవగారూ, మా నాన్నగారి శతజయంత్యుత్సవం జరుపుకోవడం నిజంగా మా అదృష్టం.

శ్రీలలిత said...


వసంతలక్ష్మిగారూ, ధన్యవాదాలండీ..

శ్రీలలిత said...


పి.ఎస్.ఎమ్.లక్ష్మిగారూ, ధన్యవాదాలండీ..

శ్రీలలిత said...


మాలాకుమార్‍గారూ, నిజంగానే ఆయన పిల్లలమని చెప్పుకునే అదృష్టమేనండీ మాది...

శ్రీలలిత said...


శ్రీదేవిగారూ, ధన్యవాదాలండీ..

శ్రీలలిత said...


డా. ఆచార్య ఫణీంద్రగారూ, మీ స్పందనకు పాదాభివందనాలండీ..

శ్రీలలిత said...


Thank you Swathi..

శ్రీలలిత said...


శర్మగారూ, ధన్యవాదాలండీ..

శ్రీలలిత said...


ఙ్ఞానప్రసూనగారూ, ధన్యవాదాలండీ...