Pages

Thursday, January 28, 2010

పెద్ద చిక్కొచ్చిపడింది...


సీతకి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. మామూలుగా పండగలొచ్చినప్పుడూ, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడూ,ఎవరినైనా ఇంటికి భోజనానికి పిలిచినప్పుడూ మనం స్పెషల్స్ చేస్తూ ఉంటాం. దానికోసం ప్రత్యేకం అందుకు అవసరమైన పదార్ధాలు కొని తెస్తూంటాం. తీరా ఆ అవసరం గడిచిపోయాక తెచ్చిన పదార్ధాలలో కొన్ని కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. అవి పూర్తిగా ఒక అయిటం అవవు. పోనీ అని పడేయబుధ్ధీ వెయ్యదు. అలాగే సీత కూడా ఫ్రెండ్స్ వచ్చారని బోల్డు వస్తువులు తెప్పించింది. వాళ్ళు వెళ్ళాక చూస్తే అందులో కొన్ని కొన్ని మిగిలిపోయాయి. అవేం చెయ్యాలో సీతకి అర్ధం కావటం లేదు. . అదీకాక మనం ఫ్రిడ్జ్ లోకి ఒకసారి తొంగిచూస్తే నిన్న చిన్న కప్ లో పెట్టి మర్చిపోయిన పప్పుముద్ద, కాస్త ఉడకబెట్టిన కార్న్, పిల్లలు తింటారని చేసిన స్నేక్ మిగిలిపోయింది అన్నీ కనిపిస్తాయి. అటువంటివి మిగిలిపోయినప్పుడు వాటితో ఏమి చెయ్యవచ్చో చెపుతారని ఈ సమస్య అందరిముందూ పెడుతున్నాను.
అలాగని అన్నం మిగిలితే పులిహార కలుపుకోవచ్చు లాంటివి అందరికీ తెలుసు కనుక అవికాకుండా, వేరే పదార్ధాలేవీ ఎక్కువ వెయ్యకుండా, ఉన్నవాటితో రుచికరంగా, మైన్ మీల్ కి సైడ్ డిష్ గా కాని, స్వీట్ గా కాని, హాట్ గా కాని, స్నేక్ గా కాని ఏదైనా సరే కొన్న వస్తువు పాడుచేసుకోకుండ చెల్లిపోయేదిగా తయారయే అయిటమ్ చెపితే బాగుంటుంది. మామూలుగా ఇంట్లో ఉండే ఉప్పూ, చింతపండు, మిరపకాయలు, చక్కెర, బెల్లం వంటివి వాడుకోవచ్చు. ఏదైనా కొన్న వస్తువు వృధా కాకుండ చూసుకోవడం ముఖ్యం..
ఇంతకీ మొన్న వచ్చిన ఫ్రెండ్స్ వెళ్ళగా సీత ఇంట్లో మిగిలిపోయిన పదార్ధాలివీ..
1. చిన్న కేబేజీ ముక్క,

2.10 దొండకాయలు


3. 4 బెండకాయలు


4. 2 టమోటాలు



5. 2 వంకాయలు

6. సగం ముల్లంగి దుంప




7.ఒక కప్పు పంచదార పాకం



8.బ్రెడ్ అంచు ముక్కలు నాలుగు. (మధ్యలో ముక్కలు అందరూ తినేసి, అంచు ముక్కలు అట్టిపెట్టేస్తారుకదా)


9.పచ్చి బఠాణీలు ..అర కప్పు



10. (పన్నెండు గంటలు నానబెట్టిన) డబల్ బీన్స్..అరకప్పు.


11.కాల్చిన అప్పడాలు..నాలుగు


12. కలిపిన గోధుమపిండి


17. పనీర్ ...ఆరు ముక్కలు




సీత సమస్య తీరుస్తారుకదూ...

Monday, January 25, 2010

ముందు జాగ్రత్త




ఇవాళ మధ్యాహ్నం రెండు దాటాక మేము పని మీద హిమయత్ నగర్ వైపు వెళ్ళవలసివచ్చింది. హైదరాబాద్ లో ట్రేఫిక్ గురించి అందరికీ తెలిసే వుంటుంది. దేనికీ రూలూ, రైమూ వుండదు. టైమూ, పాడూ వుండదు. అస్తమానం ఎవరో తరుముకొచ్చేస్తున్నట్లు ముందేముందో చూసుకోకుండా దూసుకుంటూ వెళ్ళిపోవడమె. అలాంటి సమయంలో ఒకావిడ స్కూటీ మీద ముందొక చిన్న పిల్లవాణ్ణీ, వెనకాలొక మూడు నాలుగేళ్ళ పిల్లవాడిని ఎక్కించుకుని వెడుతోంది. బహుశా స్కూల్ నుంచి తీసుకొస్తోందనుకుంటాను, ఆ వెనకాల పిల్లవాడి వీపుకి స్కూల్ బేగ్ కూడా వుంది. మా ముందు వెడుతున్న ఆవిడని చూస్తున్న నేను ఒక్కసారిగా హడిలిపోయాను. వెనకాల కూర్చున్న పిల్లవాడికి పాపం పొద్దున్న ఎప్పుడు లేచాడో యేమో ఆ స్కూటీ ఊపుకి నిద్ర వస్తున్నట్టుంది.. జోగుతున్నాడు. ఇదేమీ గమనించుకోకుండా (వెనకాల పిల్లాడు కనపడడు కదా మరి) ఆవిడ స్పీడ్ గా ఆ స్కూటీ నడుపుకు వెళ్ళిపోతోంది. వెనకాల కుర్రాడు నిద్రలో అటూ ఇటూ వూగుతున్నాడు. ఆ వెనకాల వస్తున్న మాకు అది చూస్తుంటే గాభరా లాంటిది వచ్చేసింది. పిల్లవాడు ఎక్కడ పడిపోతాడో అని యెంత భయం వేసిందో. మేము గట్టిగా పిలుస్తున్నా ఆవిడకి వినపడడం లేదు. మరింక ఆగలేక మా పక్కన వెడుతున్న మోటార్ సైకిల్ ఆయనకి చెప్పాం . ఆయన ఒక్క దూకుడుతో ఆ స్కూటీ కన్న ముందుకి దూసుకుపోయి, ఆవిడని ఆపి విషయం చెప్పాడు. అది చూసాక మాకు అమ్మయ్య అనిపించింది.
ఇక్కడ నాకు అర్ధం కాని విషయం యేమిటంటే.. ఏ తల్లీ తన పిల్లవాడిని స్కూటీ మీంచి పడెయ్యాలని అనుకోదు. ఒప్పుకుంటాను. కాని చిన్న పిల్లవాడనే ధ్యాస అయినా వుండాలి కదా.. ముందు జాగ్రత్తగా ఆటో లో తీసికెళ్ళొచ్చు కదా.. ఏమీ కాదనే అంత మొండి ధైర్యం వుండడం మంచిదేనంటారా..
ఏదైనా ప్రమాదం జరిగాక బాధపడే కన్న కాస్త ముందు చూపుతో ఆలోచించడం మంచిదేమో...

Monday, January 11, 2010

సంక్రాంతి శుభాకాంక్షలుగా ఒక సంక్రాంతి పాట.



పల్లవి--దివ్యకాంతి సంక్రాంతి వనమంతా వింతకాంతి
పసిడికాంతుల ధాన్యరాశుల సుధలు చిందు నగవులరాశి..//

చరణం---ముద్దులొలుకు ముద్దబంతులు చిరునవ్వుల చేమంతులు
పుడమి ఒడిని పసిడినిచేయ హేమంత ఋతువును చేరె...//

చరణం--లోగిళ్ళమెరయు రంగవల్లులు ముంగిళ్ళ ముందు గొబ్బిళ్ళశొభ
చాటుకదా మన సంస్కృతినీ తరతరాల మన చరిత్రనీ...//





samkramti2.mp3