Pages

Thursday, November 24, 2011

మా వనభోజనాలు...



ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో మా స్నేహితురాళ్ళ మందరం కలిసి హైదరాబాదు శివార్లలో వున్న ఏదో ఒక దేవాలయానికి వనభోజనాల పేరుతో వెళ్ళివచ్చేవాళ్ళం. కాని ఈసారి కారణమేదైతేనేం వెళ్ళడానికి కుదర్లేదు. వనభోజనాలా మానుకోలేము. అందుకని ఉభతారకంగా ఒక పని చేసాం.

మా స్నేహితురాలి పెరట్లో ఉసిరిచెట్టుంది. ఇంకనేం అందరం కలిసి బహుళద్వాదశినాడు, అంటే నవంబరు, 22 మంగళవారం మధ్యాహ్నం పన్నెండయ్యేసరికల్లా వాళ్ళింట్లో జేరిపోయాం.

ఎవరికి వారు సంకల్పం చెప్పేసుకుని, చక్కగా తులసిచెట్టుకీ, ఉసిరిచెట్టుకీ పూజ చేసేసుకుని, నైవేద్యాలర్పించేసి, మంగళహారతి పాడేసుకున్నాం.(అదిప్పుడిక్కడ పాడనులెండి..ఖంగారుపడకండి..)

అందరం వంటింటి మహరాణులమేకదా. అందుకే తలొక వంటకం చేసుకుని తీసికెళ్ళాం. మొత్తం పదముగ్గురం చేరాం. ఒక్కొక్కరైతే మరీ వీర మహారాణులయిపోయి రెండేసీ, మూడేసీ అయిటమ్స్ తెచ్చేసేరు. మొత్తం అన్నీ కలిపి ఇరవైరకాలు తేలేయి.

తినడానికి మాత్రం పక్షపాతం లేకుండా అందరం వీరనారీమణులమే అయిపోయాం. సాయంత్రందాకా ఎంచక్కా తంబోలా లాంటివి ఆడుకుని, పోదామా.. ఇక పోదామా.. అందరం ఇళ్ళకు పోదామా.. అని పాడుకుంటూ (తప్పదుకదా మరి..) ఇళ్ళకు చేరాం.

అందుకని అందరికీ తెలియజేయునదేమనగా ఈ సంవత్సరం కూడా మేము మానకుండా వనభోజనాలు చేసుకున్నామహో.. అని...

(ఇంటావిడ లక్ష్మిగారి సౌజన్యంతో...)

Thursday, November 10, 2011

వనభోజనాలు

కార్తీకపౌర్ణమి పేరే అంత బాగుందే మరింక అదే రోజు మనం బ్లాగ్ లొ వనభోజనాలు పెట్టుకున్నామంటే అవి ఇంకెంత బాగుంటాయో కదా...
అపరాహ్ణం దాటింది. అందరికీ ఉదయం తిన్నవన్నీ అరిగిపోయి వుంటాయి. అందుకే శుభ్రంగా భోజనం తయారుచేసి తెచ్చెసా.. ఇదిగో..
ఘుమఘుమలాడే మామిడికాయ పప్పు, నోరూరించే ముక్కలపులుసు, గోరువెచ్చని నేయి వేసుకుని లాగించెయ్యండి మరి..




కాలంకానికాలంలో మామిడికాయలు ఎక్కడివంటారా..? ఈ రోజుల్లో అన్ని కాలాల్లోనూ అన్నీ వచ్చేస్తున్నాయి.. కాలమహిమ.
ఒకవేళ మీకు మార్కెట్లో పచ్చిమామిడికాయ దొరకలేదనుకుంటే ఈ రోజు నేను చేసినట్టు చెసేయండి మరి..
మన వంటింటి మహారాణులకి లేదనేది యేదీ వుండదుగా.. అందుకే..




మామిడికాయపప్పు--
మనం ఊరగాయరోజుల్లో పెట్టుకుని దాచుకునే మాగాయ--1 కప్పు(దీని బదులు తొక్కుపచ్చడి, కోరుపచ్చడి ఏదైనా పనికొస్తుంది)
కందిపప్పు---1 కప్పు
ఇంగువ--చిటికెడు
ఆవాలు----1టీస్పూన్
మిరపకాయలు--2
కరివేపాకు--ఒక రెమ్మ--
కారం--1
ఉప్పు --తగినంత
నూనె----1స్పూన్
ముందుగా కుక్కర్లో పప్పు మెత్తగా ఉడికించేసుకుని, పోపు వెసుకుని అందులో ఉడికించుకున్న పప్పు, కప్పు మాగాయ, కారం, తగినంత ఉప్పు వేసుకుని బాగా మెదిపేసుకుని, కరివేపాకుతో అలంకరించుకుంటే ఘుమఘుమలాడే మామిడికాయపప్పు తయార్..

మరింక ముక్కలపులుసు--




ముక్కలపులుసు చేయు విధంబెట్టిదనిన....
సిగ్గు, సిగ్గు..
ఆంధ్రదేశంలో పుట్టీ, ఆంధ్రుల ఇష్టపాకంబయిన ముక్కలపులుసు చేయు విధానము తెలియదా....
తెలియునుకదా..అందుకే ఇచట చెప్పుటలేదు. విఙ్ఞులు గ్రహించెదరుగాక..