Pages

Friday, September 12, 2014

లలితా మహిళామండలి మీటింగ్..



     మొన్న పదోతారీకున బుధవారం మా లలితామహిళామండలి ప్రతినెలా జరుపుకునే మీటింగ్ జరిగింది. మామూలుగా మేము యేడాదికి రెండుసార్లు అంటే వార్షికోత్సవానికి, అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి లంచ్ కలిసి పెట్టుకుంటాము. మిగిలిన ప్రతినెలా ఒక్కొక్కసారి ఒక్కొక్క మెంబర్ ఇంట్లో సాయంత్రం నాలుగునుంచి ఏడుగంటలవరకూ మీటింగ్ పెట్టుకుని వివిధ విషయాలు చర్చిస్తుంటాము. అలాగే ఈసారి వంతు కమలగారిది వచ్చింది. ఆవిడ శ్రావణమాసంలో స్నేహితులందరినీ (అంటే మమ్మల్నేలెండి) భోజనానికి పిలుద్దామని చాలా చాలా అనుకున్నారు పాపం. కానీ మనందరికీ శ్రావణమాసం చాలా బిజీ నెలకదా.. చాలామంది రాలేకపోయారు.ఆవిడ ఈసారి భోజనానికి రావల్సిందే తప్పదని పట్టుపట్టారు.  సరేనంటూ ఈ నెల మేమందరం కలిసి ఆవిడ ముచ్చట తీర్చాం. ఇదుగో ఈవిడే కమలగారు.
 
         సరిగ్గా పదకొండున్నరకి రమ్మన్నారు. మొత్తం పదిహేనుమందిమి  చేరేసరికి పన్నెండు అవనే అయింది. ప్రోగ్రామ్ ముందే చెప్పేసారు. అదేమిటంటే భోజనానికి ముందు క్విజ్ పెడతాననీ, భోజనమయ్యాక తంబోలా ఆడదామనీ చెప్పేసారు. నిజం చెప్పొద్దూ.. నేను కొంచెం టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఈ కమలగారు టీచర్ గా చేసి రిటైర్ అయ్యారు. క్విజ్ అంటే యేమేమి అడుగుతారో నని ముందు జాగ్రత్తగా ఆరోజు ఉదయమే ఫోన్ చేసి, ఎంతో వినయంగా..”నేనేమైనా తేనాండీ..?” అనడిగాను. అసలే టీచర్ గా చేసినావిడ ఇలాంటివెన్ని చూసుంటారో.. ఎంతో మర్యాదగా, “మీరు రండి చాలు..” అన్నారు. నా ప్రయత్నం ఫలించలేదు. క్వశ్చన్ పేపర్ కాస్త కూడా లీకవలేదు.  

    సరే.. పన్నెండుకల్లా అంతా సమావేశమయ్యాము.
మా సభ్యులలో ఒకరైన దుర్గ  మహనీయులు బాపూగారి గురించి మాట్లాడారు.  అందరం ప్రతి కుటుంబంలోనూ ఒక మనిషిగా కలిసిపోయిన ఆయన గొప్పదనాన్ని ఇంకోసారి గుర్తు చేసుకున్నాం.
ఈ కుడిపక్కనున్నావిడే దుర్గ.



     అందరం ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటుంటే ఇంకిది పని కాదని కమలాటీచర్ ఒక పేజీకి రెండువైపులా, మొత్తం నలభైమార్కులకి క్వశ్చన్ పేపర్ ఇచ్చేసారు. టీచర్ గారి అనుభవం ఎక్కడికి పోతుందీ.. ఇరవై ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్, మిగిలిన ఇరవైలో కొన్ని ఖాళీలు పూరించడాలూ, జంటపదాలు వ్రాయడాలూ, ఇంకా ఇలాంటివే వు   న్నాయి. అన్ని ప్రశ్నలూ కూడా జనరల్ నాలెడ్జ్, పురాణాలూ, ఆరోగ్యాలూ, దేశానికి సంబంధించినవీ అన్నీ వున్నాయి. తెలుగుభాషలో ఎంత బాగా తయారుచేసారో ఆవిడ.. అందుకు ఆవిడకు శతథా సహస్రథా నమస్కారాలు చెప్పుకోవచ్చు.

    ఇంక అందరం ఆన్సర్లు వ్రాయడంలో ములిగిపోయాం. ఆవిడ  పదినిమిషాలు టైమిచ్చారు. అయినాసరే.. అదేదో పెద్దపరీక్షలాగా వాళ్ళు వచ్చి చేతిలోది లాక్కునేవరకూ ఏదో రాసేస్తూనే వున్నాం.
      నేనైతే మల్టిపుల్ ఛాయిస్ కి చాలా ఆనందపడిపోయి, అదేదో సినిమాలో రవితేజా చెప్పినట్టు మొదటిది (ఎ), రెండోది (బి), మూడోది (సి) నాలుగోది (డీ) అలా వరసగా పెట్టుకుంటూ పోయాను. తర్వాతివాటికి కాస్త ఆలోచించాల్సొచ్చింది.
     హమ్మయ్య.. పరీక్షైపోయింది. ఇదిగో ఈ టీచర్ అందరి మార్కులూ పైకి చదువుతున్నారు. అందరం చప్పట్లు కొడుతూ, నవ్వుతూ వింటున్నాం.

 మధ్యలో కూర్చుని చప్పట్లు కొడుతున్న గాయత్రిగారికే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 34/40



     ఇక్కడ చప్పట్లు కొట్టే రాజ్యలక్ష్మిగారికి సెకండ్ ప్రైజ్. 33/40
 
నాకు --32/40 మా చెల్లెలు భారతికి--31/40

మా సభ్యులు..



అన్నట్టు వీడేనండీ మా చీఫ్ గెస్టూ..

   తర్వాత భారతి పాట నేర్పిస్తే అందరం నేర్చుకున్నాం.  ప్రతి మీటింగ్ లోనూ ఒక పాట ఒకరు నేర్పించాలీ, అందరం నేర్చుకోవాలీ అనుకున్నాంలెండి.

  ఆపైన గాయత్రీ, పద్మామూర్తీ పాటలూ, పద్యాలూ పాడారు.






   
    ఇంక అసలు విషయానికొద్దాం. అదేనండీ భోజనాలు. కమలగారి అమ్మాయి శైలజ, కోడలు కలిసి మా అందరికోసం యెంత చక్కగా చేసారో అన్నీను. టొమేటోపప్పు, ఆలూ ఉప్మాకూర, కేరట్, బీన్స్ కలగలుపుకూర, చింతకాయ పచ్చడి, టమేటోపచ్చడి, దప్పళం, జిలేబీలు, పులిహార, అప్పడాలు, పెరుగు..హమ్మయ్య.. అన్నీ చెప్పానా.. ఆ అన్నట్టు రామలక్ష్మిగారు బజ్జీలు చేసి తెచ్చారు.  

వీరే కమలగారూ, వారి అమ్మాయి శైలజ. కోడలుకి పాపం జ్వరం వచ్చేసింది. (మమ్మల్ని చూసి కాదండోయ్.) పడుకుంది.
 
     తీరుబడిగా, కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి, తంబోలా ఆడి, డబ్బులు పంచుకున్నాక అందరికీ ఇళ్ళు గుర్తొచ్చేయి. అప్పుడింక తప్పదనుకుంటూ “పోదామా.. ఇక పోదామా.. “అనుకుంటూ ఎవరిళ్ళకి వాళ్లం చేరుకున్నాం. అవండీ మొన్న జరిగిన మా మీటింగ్  విశేషాలు.