Pages

Thursday, July 31, 2014

పాతసీసాలో కొత్తసారా..



1-8-2014 తేదీ, స్వాతి వారపత్రికలో నేను వ్రాసిన "పాతసీసాలో కొత్తసారా" అనే బహుమతి పొందిన కథ ప్రచురించబడింది. పాఠకులు చదవడానికి వీలుగా క్రింద పెద్ద అక్షరాలతో ప్రతిని పెడుతున్నాను. చదివి మీ మీ అభిప్రాయాలు చెపుతారు కదూ...








పాతసీసాలో కొత్తసారా..




                                                                                            జి.ఎస్.లక్ష్మి..

   శుభలేఖ పైనే " జిడ్డు వారి పెండ్లి పిలుపు.." అని చూసి రోజురోజుకీ మారుతున్న పెళ్ళిళ్ళ విధానాలకి అలవాటు పడిపోతూ శుభలేఖ తెరిచేడు రఘుపతి. జిడ్డు వారి అమ్మాయిని నేతి వారి అబ్బాయికి ఇస్తున్నారు. ఇహనేం..శుభం..అనుకుంటూ పెళ్ళెప్పుడో, యెక్కడో చూస్తుంటే వచ్చింది అతని అర్ధాంగి అలివేలు "యెవరి పెళ్ళండీ.."అంటూ.."యెవరో జిడ్డు వారుట..మీ చుట్టాలేమో.."అన్నాడు వ్యంగ్యంగా.       అతని సంగతి తెలిసిన అలివేలు పోనీ పాపం అని వూరుకోదు. ఊళ్ళో చుట్టాలందర్నీ కలిపేసుకుని తిరిగేస్తుంటుంది.  శుభలేఖ తీసి చూస్తూనే.." అయ్యో, ఇది మా రెండోమావయ్య తోడల్లుడి చెల్లెలి పెళ్ళండీ. వైజాగ్‍లో..అరే.వచ్చేనెలే..అన్నట్టు మొన్ననే ఫోన్ చేసి చెప్పేడు. నేను చెప్పడం మర్చేపోయేను. అయిదురోజుల పెళ్ళిట. ఇప్పుడందరూ పాత రోజుల్లోలాగ మూడురోజుల పెళ్ళిళ్ళూ, అయిదురోజుల పెళ్ళిళ్ళూ చేస్తూ, పాత తంతులన్నీ మళ్ళీ పైకి తీస్తున్నారండీ..  ఒక్కటడిగితే పది చెప్పే అలివేలు ఈసారి ఇంకా ఆవేశపడిపోయింది.

     అసలే అలివేలు యెక్కడైనా మావిడితోరణం కట్టారంటే పరిగెట్టేస్తుంది. అలాంటిది ఇంత దగ్గరిచుట్టం పెళ్ళికి వెళ్ళకుండా వుంటుందా..తను వెళ్ళడవే కాదు, రఘుపతినీ బలవంతంగా బయల్దేరదీసింది.  తప్పుతుందా.. హోమ్‍మినిస్టర్‍గారి ఆదేశం. 

ఆ రోజు ఉదయాన్నే వైజాగ్‍లో పెళ్ళి జరగబోతున్న హోటల్‍కి చేరుకున్నారు రఘుపతి, అలివేలూను. అక్కడ రిసెప్షన్‍లో వీళ్ళ పేర్లు చెప్పుకుని, శుభలేఖ చూపించగానే కౌంటరులో వున్నతను బెల్ కొట్టాడు. వెంటనే సన్నజాజిమొగ్గల్లాంటి అమ్మాయి లిద్దరు పసుపు, కుంకుమ, పూలతో స్వాగతం చెప్పేరు. "రండి మావయ్యగారూ, రండి అత్తయ్యగారూ.. " అంటూ వీళ్ళిద్దరినీ లిఫ్ట్ లో రెండోఅంతస్తుకి తీసికెళ్ళీ, ఓ రూమ్ తలుపుతీసి, "ఇదిగోండి మావయ్యా, ఇదే మీ రూమ్. తొందరగా ఫ్రెష్ అయి కింద డైనింగ్‍హాల్‍కి వచ్చెయ్యండి. టిఫిన్లు రెడీగా వున్నాయి. అవునూ..బావ రాలేదా?" అనడిగి, తెల్లమొహం వేసిన వాళ్ల నక్కడే వదిలి వెళ్ళిపోయేరు. "మనని చూసి యెవరనుకుందో పాపం." అన్నాడు రఘుపతి. "మరే.. బావ రాలేదా అంటోది పాపం యెవరనుకుందో.." అంది అలివేలు కూడా అయోమయంగా.

"ఇంతకీ మీ మావయ్య తోడల్లుడి..అదే అదే వాళ్ళెవరూ కనపడరేం?" అయోమయంగా అడిగేడు రఘుపతి.

"అయ్యోరామా.. ఈ రోజుల్లో ఇంతేనండీ. మనల్ని ఇబ్బంది పెట్టకూడదని..మనం ఫ్రెష్ అయ్యేక వచ్చి కలుస్తారు. ఈ పిల్లలు వాళ్ళ తాలూకే కదా.. మీరు మరీనూ." అంది అలివేలు.

  రఘుపతికి కాస్త తేడాగా అనిపించింది. మామూలుగా పెళ్ళింటికి వెళ్ళగానే.."హా హా..రండి రండి.. ప్రయాణం బాగా జరిగిందా? అడ్రెస్ సరిగ్గా తెలిసిందా..?" అంటూ పెళ్ళికొడుకు బాబయ్యో, మావయ్యో, కాదూ కూడదంటే స్వయంగా తండ్రో ఆహ్వానిస్తారు.. కాని ఈ పిల్లకాయలేంటీ..

రఘుపతిని ఇంక ఆలోచించనివ్వలేదు అలివేలు. త్వరగా తెవలండి. టిఫిన్లు రెడీగా వున్నాయని చెప్పిందిగా ఆ పిల్ల.."అంటూ తొందర పెట్టేసింది.

  రఘుపతీ, అలివేలూ రెడీ అయి డైనింగ్‍హాల్ కొచ్చి, అక్కడ వున్న టిఫిన్లలో వీళ్ళకి కావల్సినవి తీసుకుంటుంటే ఇందాకా వీళ్ళని రూములోకి తీసికెళ్ళిన అమ్మాయే మరో దంపతులని తీసుకొచ్చి, "కూర్చోండి బాబయ్యగారూ, అన్నయ్య రాలేదా..? అయినా అన్నయ్య యెప్పుడూ ఇంతే.. యెక్కడికీ రాడు.. కదా పిన్నీ.." అంటూ వాళ్ళని కూడా ఇంకో టేబిల్ దగ్గర కూర్చోబెట్టింది.

     అప్పుడు తట్టింది అలివేలుకి. "అయ్యో.. వాళ్ళు ఈవెంట్ వాళ్ళండీ.. అందర్నీ అలాగే వరసలు పెట్టి పిలుస్తారు." రఘుపతికి చిరాకేసింది. "ఈవెంట్ వాళ్లయితే మర్యాదలు బాగా చెయ్యాలి కానీ ఇలా వరసలు పెట్టి పిలవడవేంటీ.." అన్నాడు.

    "అయ్యో.. అలా పిలిచి కూర్చోబెడితేనే మనం మన చుట్టాలింటికొచ్చినట్టు అనిపిస్తుంది. ఈ మధ్య పెళ్ళిళ్లలో మర్యాదలన్నీ వీళ్ళే చేస్తున్నారు. అందులోనూ మా అన్నయ్య మర్యాదలంటే మరీ పడిచస్తాడు. ఇంత తేడా వచ్చినా ఊరుకోడు. నిన్న చెప్పేడు నాతో.. ఈ పెళ్ళిలో అన్నీ పాతకాలంనాటి పెళ్ళిళ్ళలాగే జరగాలని మగపెళ్ళివారు పట్టు పట్టారుట. అందుకే యెనభైయేళ్ళు దాటిన మా సుబ్బమ్మత్తని ప్రత్యేకం కారు పంపించి దగ్గరుండి తీసుకొచ్చేరుట. ఆవిడకి ఈ పధ్ధతులన్నీ కొట్టినపిండనుకోండి."

  ఇవన్నీ నీకెప్పడు తెలిసేయి..ఇంకా వాళ్ళెవరూ కనిపించలేదుగా.."

  "అయ్యో.. అక్కడే ఫోన్లో అన్నీ చెప్పేరండీ బాబూ.. యెన్నాళ్ళయిందో ఇలా పెళ్ళిళ్ళలో మర్యాదలు చూసి.." ఉబ్బిపోతున్న అలివేలు నోటికి ఇంక ఆపడం అంటూ లేకపోయింది. వింటున్నట్టు నటిస్తున్న రఘుపతి చుట్టూ ఒకసారి దృష్టి సారించేడు.

       తెలిసిన మొహం ఒక్కటీ కనిపించలేదు. అలివేలు కూడా పాపం తీర్థంలో తప్పిపోయినదానిలా అంతమంది జనంలోనూ తెలిసినవారి మొహాలకోసం వెతుకుతోంది. యెవరు కనిపించేరో యేమో చేతిలో ప్లేటు ఆ పళాన్నే పట్టుకుని "శాంతమ్మొదినా..నువ్వా..బాగున్నావా..యెప్పుడొచ్చేవ్..?" అంటూ ఓ మూల కూర్చుని బిక్కు బిక్కుమంటూ చూస్తున్న దంపతులవైపు పరిగెడుతున్నట్టె వెళ్ళింది. వాళ్ళు అలివేలుని చూడగానే చాటంత మొహాలు చేసుకుని, పాయసంలో జీడిపప్పు కనిపిస్తే చటుక్కున తీసి నోట్లో పెట్టుకున్నట్టు అలివేలుని చెయిపట్టి లాగి వాళ్ల దగ్గర కూర్చోబెట్టేసుకున్నారు.

     హతాశుడయ్యేడు రఘుపతి. అయినా ధైర్యం కోల్పోలేదు. అతని కిది అలవాటే. పుట్టింటివాళ్ళెవరు కనిపించినా రఘుపతిని అక్కడి కక్కడే మర్చిపోతుంటుంది అలివేలు.

     ఓ సారిలాగే హైద్రాబాదులో అలివేలు చుట్టాలింట్లో పెళ్ళికెడితే, వాళ్ళు పెళ్ళికూతురికి తోడుగా అలివేలుని పెళ్ళికూతురితో పాటు అత్తారింటికి సాయంగా పంపడానికి అప్పటికప్పుడు నిర్ణయించుకుని, మగపెళ్ళివారింటికి కారులో యెక్కించి పంపించేసేరు. తర్వాత వాళ్ళు కూడా సామాన్లు సద్దుకునే హడావిడిలో చాలా కన్వీనియంట్‍గా రఘుపతితో చెప్పడం మర్చిపోయేరు.

         అక్కడ మగపెళ్ళివారింట్లో ఉదయం కాఫీ తాగుతున్నప్పుడు కానీ అలివేలుకి రఘుపతి గుర్తు రాలేదు. వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పింది. రాత్రంతా టెన్షన్ పడ్ద రఘుపతి ఫోన్‍లో గట్టిగా అరవబోయేడు. ఆ అనుభవం అయినప్పట్నించీ రఘుపతి ఇలా అలివేలు తరఫు బంధువుల ఇళ్లకి వచ్చినప్పుడు చాలా ముందుజాగ్రత్త పడుతున్నాడు. అలివేలుని అస్సలు తన దృష్టి నుంచి తప్పించుకోనివ్వటం లేదు.

     ఇప్పుడు కూడా అలా మూల టేబిల్ దగ్గర వాళ్లతో మాట్లాడుతున్న అలివేలునే చుస్తూ కూర్చున్న రఘుపతి పక్కన ఓ పెద్దాయన వచ్చి కూర్చున్నాడు. "యెవరి తాలూకు బాబూ నువ్వూ.." అంటూ.

 "నేనూ..అలివేలు మొగుణ్ణండీ."అన్నాడు. మళ్ళీ వెంటనే గుర్తొచ్చింది. అలివేలుని వాళ్ల చుట్టాలందరూ "చంటీ.."అని పిలుస్తుంటారు. అందుకని, "చంటి మొగుణ్ణండీ."అని అతి వినయంగా చెప్పేడు." యే చంటీ.. పెద్దబ్బులు గారి చంటా? చిన్నబ్బులుగారి చంటా?" ఆయన మళ్ళి అడిగేడు. ఈ సంగతి రఘుపతికి తెలీదు. బిక్కమొహం పెట్టుకుని, ఇదేవిటో సరిగ్గా కనుక్కుందావని అలివేలున్న వైపు చూస్తే.. అక్కడ అలివేలేదీ.. లేదు. అలివేలూ లేదు, ఆ ముసలాళ్ళూ లేరు.

         ఖంగారుపడుతూ గబుక్కునలేచి హాల్ బైటకి వచ్చి చూస్తే అక్కడ ఓ పెద్ద గుంపులోకి జేరుతూ కనిపించింది అలివేలు. రఘుపతి అలా చూస్తూనే వున్నాడు..ఆ గుంపులోంచి గట్టి గట్టిగా మగవాళ్ళ ఈలలూ, కెవ్వుకెవ్వుమంటూ ఆడవాళ్ల  కేకలూ విన్పించేయి.

    యేమైపోయిందోనని ఖంగారుపడుతూ చూస్తే, కాశీయాత్ర కెడుతున్న పెళ్ళికొడుకుని నలుగురు పెద్దమనుషులు అమాంతం యెత్తుకుని, మోసుకుంటూ, ఊరేగింపుగా గ్రౌండ్ అంతా తిరుగుతున్నారు. చుట్టూవున్న మగాళ్లందరూ ఈలలేస్తుంటే, ఆడాళ్లందరూ వెర్రికేకల్లాంటివి పెడుతున్నారు.

"యేమైందండీ.."" పక్కనున్న పెద్దమనిషిని అడిగేడు రఘుపతి.

   ఆ పెద్దాయన చాలా పేద్ద నిట్టూర్పు విడిచేడు. "యేం చెప్పమంటారు? ఇదివరకు రోజుల్లో బలగం వుండేది. డబ్బుండేది కాదు. ఇప్పుడు యెక్కడ చూసినా డబ్బే. కావలసిన మనుషులు మటుకు కనపడడంలేదు. అందుకని ఆ డబ్బు చూపించుకుందుకు ఈ మధ్య పెళ్ళిళ్ళు ఇలాంటి ఈవెంట్ మేనేజర్స్ చేతుల్లో పెడుతున్నారు. కాశీయాత్రలో వున్న విశిష్టత, అది పెళ్ళికొడుకు చేత చేయించడానికి కారణాలు యేవీ తెలీకుండా చక్కగా డెకొరేట్ చేసిన ఓ గొడుగిచ్చి పెళ్ళికొడుకుని గ్రౌండ్ లోకి తెచ్చి, ఆ బ్రాహ్మడు యేవో మంత్రాలు చదవగానే అతన్ని అలా యెత్తుకుని తిప్పుతున్నారు. యెంత గట్టిగా కేకలు పెడితే అంత బాగా జరిగినట్టన్న మాట."

ఆ పెద్దమనిషి చెప్పినమాట అక్షరసత్యం అనిపించింది రఘుపతికి.

   హు..యేం పెళ్ళిళ్ళొ..యెవరెవరు చుట్టాలో తెలీదు. యేరకం చుట్టరికమో తెలీదు.     

  సుబ్బమ్మత్త చెప్పినట్టు శాస్త్రోక్తంగానూ, అటు ఆహూతులైన ఆఫీస్‍వాళ్ళూ, ఫ్రెండ్సూ మెచ్చేట్టు ఈవెంట్ మేనేజ్‍మెంట్‍వారి చక్కటి పర్యవేక్షణతోనూ సవ్యంగా, అందంగా, ఆనందంగా, హుందాగా జరిగేయి.

     ప్రతి చిన్న తంతునీ యెంతో గొప్పగా వర్ణించి, దాని అర్ధం, అది చెయ్యడంలో గల పరమార్ధం పెళ్ళికి ముందే ఒక చిన్న అందమైన పుస్తకంలో అచ్చు వేయించి, ఈ శాస్త్రం తెలియని ఆఫీస్‍వాళ్ళకీ, ఫ్రెండ్స్ కీ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ప్రతి చిన్న కార్యక్రమంలోనూ ఉత్సాహంగా పాల్గొని, ఆనందించేరు.

    హమ్మయ్య.. మూడురోజులూ అయిపోయాయి. ఇంక ఇవేళ అప్పగింతలు పూర్తి చేసేస్తే అమ్మాయిని అత్తవారింటికి పంపెయ్యొచ్చు అని కన్యాదాత అనుకున్నట్టె రఘుపతి కూడా హమ్మయ్య.. ఇంక ఈ సాయంత్రానికి బండెక్కెయ్యొచ్చు అని అనుకున్నాడు. యెందుకంటే ఈ రెండురోజుల్లోనూ అతనికి అలివేలు దర్శనమే కాలేదు. వచ్చినరోజు రూమ్‍లో ఇద్దరూ కలిసి దిగేరు అంతే. ఇంక ఆ డైనింగ్‍హాల్లో యెవర్ని కలిసిందో కానీ, మళ్ళీ రఘుపతి కళ్లబడలేదామె. రూమ్ కీస్ తన దగ్గరే పెట్టుకుంది కనక రోజుకో ఫదిసార్లొచ్చి చీరెలు మటుకు మార్చుకుని వెళ్ళేది. రఘుపతి పడుకుందుకు రూమ్ తాళాలకోసం రిసెప్షన్‍లో మాస్టర్ కీ తీసుకుని తన పని కానిచ్చుకునేవాడు.

     అందుకే ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యేక ఇంక రూమ్ కెళ్ళి కునుకు తియ్యకుండా హాల్లోనే కూర్చున్నాడతను. ఇంతలో అతని పక్కకి ఓ యాభైయేళ్ళ పెద్ద మనిషొచ్చి, "నువ్వు పెళ్ళికూతురికి యేవవుతావు బాబూ.." అనడిగేడు  యేమవుతాడో అతనికి తెలిస్తే కదా ఆ వచ్చినాయనకి చెప్పడానికి.. అందుకని యే ప్రశ్నకైనా సరే తనకి తెలిసున్న ఒకే ఒక సమాధానం రాసే విద్యార్ధిలాగా.. "నేను చంటి మొగుణ్ణండీ.." అన్నాడు. ఆ మాట విని ఆయన మనసులొ యేవో లెక్కలు కట్టేసుకుని, "అయితే బావవే నన్న మాట."అని సంబరపడిపోతూ, "ఒరేయ్ చిన్నా, ఇక్కడ దొరికేడురా" అని అరుచుకుంటూ వెళ్ళిపోయేడు. తనని యే దొంగతనంలోనైనా ఇరికించరు కదా అని రఘుపతికి భయం లాంటిది వేసింది. 

అదేవిటో. ఆ తరవాత అరగంటకోసారి యెవరో వొకరు వచ్చి"చంటి మొగుడు మీరేనాండీ." అనడగడం, రఘుపతి నిలువుగా బుర్రూపడం, వాళ్ళేమో "భలే చేసేరండీ."అంటూ మెచ్చుకోలుగా తల వూపో, షేక్‍హేండిచ్చో ఇతన్ని మెచ్చుకుంటూ వెళ్లడం మొదలైంది.

    సాయంత్రం టిఫిన్లు కూడా అయిపోయేయి. రఘుపతి దగ్గర కొచ్చేవారి సంఖ్య పెరగడంతో పాటు అడిగే ప్రశ్నలు కూడా మారేయి. కొంతమంది అతన్ని చూసి ముసిముసినవ్వులు నవ్వితే. ఇంకొంతమంది, "భలే దాచేసేరండీ.." అని యెదురుగానే మెచ్చుకున్నారు. యెవరో మరి. చూడ్డానికి బాగున్నాడు. రఘుపతి వయసతనే ఒకతను వచ్చి తనని తాను రాజారావుగా పరిచయం చేసుకుని, "ఊ.. ఇంతకీ యే కావాలనుకుంటున్నారూ..?" అన్నాడు. రఘుపతి తెల్లబోయి చూసాడతని వైపు.

"నాకు బొత్తిగా చెల్లెలి వరసైపోయిందండీ. అందుకే మీరు కొట్టేసేరీ ఛాన్స్."అన్నాడు. రఘుపతి చటుక్కున ఆ రాజారావు చేతులు పట్టుకుని, "బాబ్బాబు, మీకు పుణ్యముంటుంది. అసలు విషయమేంటో చెబుదురూ. టెన్షన్‍తో చచ్చిపోతున్నాను. కొంపదీసి వీళ్లందరూ కలిసి నన్నెందులోనైనా ఇరికించెయ్యట్లేదు కదా.. " అన్నాడు. అతను ఆశ్చర్యంగా చూసి "అయితే మీకు తెలీదా..?" అన్నాడు.. అడ్దంగా బుర్రూపేడు రఘుపతి.

ఆ రాజారావు రఘుపతి పక్కన కూర్చుని స్థిమితంగా చెప్పడం మొదలెట్టేడు.

"పెళ్ళిళ్లలో ఆఖరున ఇంక అప్పగింతలు చేసి పిల్లని అత్తవారింటికి పంపే సమయం వచ్చినప్పుడు ఈ తంతు వుంటుందండీ. దీనిని "మరదలి మాడ" అంటారు. పెళ్ళికూతురికి వరసకి బావ అయ్యే అతను, అంటే మేనబావ కావచ్చు, అక్కమొగుడు కావచ్చు లేకపోతే యేవరసలోనైనా బావ అయితే చాలు..అతను పెళ్ళికూతురిని దాచేస్తాడు.."

"దాచేస్తాడా.." కెవ్వున రాబోయిన కేకని బలవంతాన ఆపుకున్నాడు రఘుపతి.

రాజారావు నవ్వేడు. "అవునండీ.. యెక్కడో దాచేస్తాడు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని వెతికి పట్టుకోవాలన్న మాట. అలా వెతికి పట్టుకున్నాక కన్యాదాత ఆ బావకి "మరదలిమాడ"గా యేదైనా ముట్టచెప్పి, అప్పుడు అప్పగింతలు చేసి కూతుర్ని అత్తారింటికి పంపుతాడు. ఇవన్నీ ఇదివరకు పెళ్ళిళ్ళలో వుండేవి. ఆమధ్యకాలంలో ఒక్కరోజు పెళ్ళిళ్ళే అవడంతో ఇలాంటి సరదా తంతులు లేకుండా పెళ్ళిళ్ళు కానిచ్చేసేవారు. కాని ఈ మధ్య అందరూ మళ్ళీ పాతకాలం గుర్తు చేసుకోడం ఫాషన్ అవడం వల్ల అవన్నీ బైటకి తీసి, జరిపిస్తున్నారు. అందులో తంతే ఈ మరదలిమాడ తంతు. మీరు పెళ్ళికూతురికి బావగారి వరసయ్యేరు కదా.. అందుకే మీకే ముడుతుంది మరదలిమాడ.."

"కానీ..కానీ..నేనా అమ్మాయిని యెక్కడా దాచలేదే.. అసలు పెళ్ళికూతురిని దగ్గర్నుంచి కూడా నేను చూడలేదు." యేడుపుమొహం పెట్టేసేడు రఘుపతి.

అఖ్ఖర్లేదండీ.. అన్నీ ఈవెంట్ వాళ్ళు చూసుకుంటారు. మీరలా కూర్చోండి చాలు. మొత్తానికి అదృష్టవంతులండీ. పెళ్ళికూతురి తండ్రి బోల్డు సంపాదించేడు. మీరు యేదడిగినా ఇచ్చేస్తాడు." కాస్త ఈర్ష్య ధ్వనించింది అతగాని మాటల్లో.

    రాజారావు చెప్పింది విన్న  రఘుపతికి యేం చెయ్యాలో తోచలేదు. "బాబ్బాబూ, నాకివేవీ తెలీదు. నా బదులు ఇంకెవర్నైనా చూసుకోమని చెబుదురూ వాళ్లకి.." అని బతిమాలుకున్నాడు రాజారావుని.

"అబ్బే. ఇంకెవరూ లేరండీ. అందరికీ ఒక్కళ్ళూ, ఇద్దరే పిల్లలవడంతో ఈ చుట్టరికాలకి చాలా షార్టేజ్ వచ్చేసింది. లక్కీగా మీకు వరస కుదిరింది. అయినా మీకేం కష్టం లేకుండా అంతా ఈవెంట్ వాళ్ళు చూసుకుంటున్నారుగా.. మీకు కావల్సినది అడిగి పుచ్చుకోండంతే.." విషయం తేల్చేసి అక్కణ్ణించి వెళ్ళిపోయేడు రాజారావు.

   రాజారావు అలా వెళ్ళేడో లేదో ఇట్నుంచి పెళ్ళికొడుకు, అతని అక్క వచ్చేరు. "కాస్త క్లూ ఇవ్వండి అన్నగారూ.." అని హాస్యంగా అంటూ రఘుపతి భుజం మీద చెయ్యి వేసి పక్కన కూర్చున్నాడు  పెళ్ళికొడుకు.

  "యెటువైపు రూములో చెప్పండి చాలు. మేవే వెతుక్కుంటాం." వాళ్లక్క కలుపుగోలుగా అడిగింది. "నాకు తెలీదండీ.." అంటూ బిక్కమొహం పెట్టేడు రఘుపతి. అతన్ని అనుమానంగా చూస్తూ ఇద్దరూ మళ్ళీ పెళ్ళికూతురిని వెదకడానికి వెళ్ళిపోయేరు.

 వాళ్ళటు వెళ్ళగానే ఇటు కన్యాదాత వచ్చి రఘుపతి పక్కన కూర్చుని తన గోడు వెళ్ళబోసుకున్నాడు. "బాబూ, నువ్వేం కావాలంటే అదిస్తా. మా పిల్లని యెక్కడ దాచావో కాస్త తొందరగా చెప్పు బాబూ. ఇవాళ అప్పగింతలయి, రాత్రికి ఫ్లైట్ అందుకోపోతే అవతల నా జాబ్ లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ మిస్సయిపోతాను." అంటూ అలవాటులేని జారిపోతున్న పైమీద కండువాతో చెమటలు తుడుచుకుంటూ వెళ్ళిపోయేడు.

     రఘుపతి బేజారెత్తిపోయి అలివేలుకోసం అన్నిచోట్లా వెతకడం  మొదలెట్టేడు. మైన్‍హాల్, డైనింగ్‍హాల్, పక్కనే వున్న రూములు రెండూ, వెనకున్న స్టోర్‍రూమూ ఇలా అతను వెతుకుతుంటే నెమ్మదిగా అతని వెనకాల ఓ గుంపు తయారైంది. కాసేపటికి కానీ దాన్ని అతను గమనించలేకపోయేడు. రఘుపతి యే రూమ్‍లోకి వేడుతున్నాడో చూసి, అతను అందులోంచి బైటకి రాగానే ఆ గుంపు ఆ రూమ్‍లో దూరడం, వెంటనే వెర్రిముఖాలేసుకుని బైటకి రావడం చూసిన అతనికి అర్ధమైపోయింది.. బహుశా తను పెళ్ళికూతురిని దాచినచోటుకి వెడుతున్నాననుకుని, వాళ్ళు తన వెంట పడుండొచ్చని.

   "అలివేలూ.." అని సినిమాలోలా గాట్టిగా ఒక కేక పెట్టేద్దామనుకున్నాడు కానీ మర్యాదస్తుడు కనక తనని తాను సంబాళించుకుని , ఇంక తన రూమ్‍కి వెళ్ళిపోడానికి నిశ్చయించుకుని రిసెప్షన్‍లో మాస్టర్ కీ కోసం అడిగేడు. ఇతన్ని ఫాలో అవుతున్న గేంగ్ కూడా వెనకే వున్నారు. రూమ్ తాళం తీసి లోపలికి రాగానే రఘుపతికి యెదురుగా ఈవెంట్ మనుషులు ఓ నలుగురూ, అలివేలూ, ఆ పక్కన పెళ్ళికూతురూ కనిపించారు. రఘుపతిని చూడగానే మరింక మాట్లాడనీకుండా అతన్ని ఓ పక్కకి తోసేసి, "కనిపెట్టేసేరా..నేను ఈ ఈవెంట్‍వాళ్ళు కలిసి ఇంకో రూమ్‍లో దాచేస్తాంలెండి దీన్ని. అంత తొందరగా దొరకనివ్వను. అట్టే మొహమాటాలకి పోకుండా ఓ ఐపాడో..టచ్‍స్క్రీన్ ఫోనో అడగండి.." అని హుకుం జారీ చేసేసి, రఘుపతికి యేం జరుగుతోందో అర్ధమయ్యేలోపల ఒకవైపు ఈవెంట్‍వాళ్ళూ, ఇంకోవైపు అలివేలూ  పెళ్ళికూతురి చెయ్యి పట్టుకుని బైటకి లాక్కుపోయేరు.

  "అలివేలూ, ఇవాళ రాత్రే మన బండి. ఇంకో గంటలో బయల్దేరాలి.." అని ఆమెకి అర్ధమవాలని గట్టిగా చెప్తూ వాళ్ల వెనకాల పడ్డాడు రఘుపతి. రఘుపతి వెనకాల పెళ్ళికొడుకూ, అతని అక్కా, ఆ వెనకాల కన్యాదాత, ఆ వెనకాల పెళ్ళికొచ్చిన ఆఫీస్‍వాళ్ళు, ఫ్రెండ్సూ, ఆ పైన ఈ సీన్ చూడ్డానికి బహు పసందుగా వుందని హోటల్‍‍వాళ్ళు..అలా ఒకరి వెనకాల ఒకరు ఆ రెండో అంతస్తులో రూముల ముందున్న కారిడార్‍లో ఓ పెద్ద ఊరేగింపులా వెళ్ళడం మొదలెట్టేరు. అంతా గందరగోళంగా వుంది. అందరూ అరిచేస్తున్నారు. గొంతెత్తి గట్టిగా యేవేవో మాట్లాడేస్తున్నారు. ఒకరిమాట ఒకరు వినటం లేదు. ఎవరి గోల వాళ్ళదనే ధోరణిలో అలా కారిడార్ చుట్టూ తిరుగుతున్నారు.

కింద రిసెప్షన్‍నుంచి, రెండో అంతస్తులో కనిపిస్తున్న మరదలిమాడ అనే ఈ అద్భుతమైన సీన్‍ని వీడియోవాళ్ళూ, ఫొటోలవాళ్ళూ యెంతో చాకచక్యంగా వాళ్ల ఫిల్ముల్లో బంధిస్తున్నారు.

----------------------------------------------------------------------------------------


 

Monday, July 28, 2014

పండగొచ్చేస్తోంది..






                శ్రావణమాసం వచ్చేసిందా.. ఇంకేముందీ.. వరలక్ష్మీ శుక్రవారం కూడా వచ్చేస్తుంది. మరి మనం రెడీ అయిపోవద్దూ.. పట్టుచీర యిప్పటిదాకానా.. యెప్పుడో కొనిపెట్టేసుకున్నాం. అసలు చిక్కంతా మనకి కావలసిన అసలు వస్తువు దగ్గరే. అదేనండీ.. ఆభరణం. ఓపట్టాన ఒప్పుకోరుగా మగవాళ్ళు దీనికి. అక్కడికీ సెంటిమెంటుతో కొడదామని "లక్ష్మీదేవి దగ్గర కొత్తబంగారం పెట్టి పూజ చేసుకోవాలండీ.." అంటే అంత తేలిగ్గా అవునంటారా ఇంట్లోవాళ్ళు.
    "అనవసరంగా ఆ యెల్లోమెటల్ మీద డబ్బు పెట్టడం
, దాన్ని కాపలా కాచుకోడం యెందుకూ..అదే డబ్బు బేంక్‍లో వేసుకుంటే వడ్డీ వస్తుంది కదా.." అంటారు.

      యెలాగరా బాబూ.. వీళ్ళని దారిలోకి తేవడం అని ఆలోచిస్తుంటే అంధ్రభూమిలో మన అరిపిరాల సత్యప్రసాద్ వ్రాసే "రూపాయి చెప్పిన బేతాళకథలు" గుర్తొచ్చేయి. సంపాదనని సంపదగా మార్చుకోవడమెలాగో ఆర్ధికశాస్త్రం అంతా తిరగేసి వ్రాస్తున్నట్టున్న ఆ కథలలో నాకు కావల్సినది కనిపించింది.. అదేనండీ.. రూపాయిలు మూటకట్టి యెక్కడో పాతిపెట్టేకన్న బంగారం కొని దాచుకుంటే దాని విలువ పదిరెట్లవుతుందీ.. అని చెప్పినది గుర్తొచ్చి, ఆ పుస్తకం ఇంట్లోవాళ్లకి చూపించి, వాళ్ళని సంపదవైపు నడిపించే వ్యవహారంలో విజయం సాధించేను.

     హమ్మయ్య.. ఒక మెట్టేక్కేను..అనుకుని సంతోషపడబోతుంటే "ఇంతకీ 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ యెన్ని కొందాం?" అన్న ప్రశ్నకి తెల్లబోతూ.."కాయిన్సా.." అన్నాను.

    "అవును కాయిన్సే.. ఆర్నమెంట్స్ అయితే రీసేల్ చేసినప్పుడు 90% మాత్రమే ఇస్తారు. అదే కాయిన్స్ అయితే 100% డబ్బు వచ్చేస్తుంది. అవి కొంటేనే నయం.." అన్న మాటలకి హతాశురాలినయ్యేను. కాయిన్స్ కొనుక్కుని యేం చేసుకుంటాం.. పెట్టిపూజితం తప్పితే.. యే రాయైతేనేం పళ్ళూడగొట్టుకుందు కన్నట్టు బేంక్‍లో పెట్టేటప్పుడు డబ్బైతేనేం..బంగారమైతేనేం..

     యేదైనా కొనుక్కుంటే మనం అలంకరించుకోవాలి, నలుగురూ చూడాలి, బాగుందనాలి, దానితోపాటు వారి కళ్ళల్లో కించిత్ ఈర్ష్య చూడాలి.. అంతేకానీ అలా కాయిన్స్ కొని బేంక్‍లో పెట్టేస్తే ఇవన్నీ మిస్సయిపోమూ... అర్ధంచేసుకోరూ..ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. యేది దారి.. అని ఆలోచిస్తుంటే పోయినచోటే వెతకాలన్న మాట గుర్తొచ్చింది. అందుకే సభాముఖంగా  మన సత్యప్రసాద్‍కి విన్నవించుకుంటున్నాను.

   బాబ్బాబూ..సత్యప్రసాదూ.. మాలాంటివాళ్ళని దృష్టిలో పెట్టుకుని, ఈ సంపాదన, సంపద అంతా బాగా మథించి, కాయిన్సేకాదు, నగలు కొంటే కూడా సంపదగా మార్చుకోవచ్చని వ్రాయకూడదూ..

అన్నగారు ఎన్.టి.ఆర్ గారన్నట్టు తెలుగింటి ఆడపడుచులం నీపేరు చెప్పుకుని పుట్టింటి మాటసాయం అందిందనుకుని, సంబరపడిపోతూ మెళ్ళోకీ, చేతులకీ పచ్చగా యేవైనా కొనుక్కుంటాం.

సత్యప్రసాద్‍గారూ, యేమీ అనుకోకండేం..