Pages

Wednesday, April 1, 2015

అంతర్జాతీయ మహిళాదినోత్సవం


మార్చి పదిహేడు, మంగళవారం మా లలితామహిళామండలి సభ్యులం అందరం అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరుపుకున్నాం. మా సభ్యులలో ఒకరైన రత్న ఆరోజు మాకందరికీ వేదిక యేర్పాటు చేసి, మంచి విందుభోజనం అందించారు. ఈవిడే ఆ గృహలక్ష్మి రత్న..




      అందరికీ రాగానే వెల్కమ్ డ్రింక్ లు. తర్వాత పలకరింపులు. ప్రతిఒక్కరూ వారికిష్టమైన విషయం గురించి అయిదేసి నిమిషాలు మాట్లాడాలని ముందరి మీటింగ్ లోనే చెప్పేసుకున్నాం కనుక ఒక్కొక్కరే చెప్పడం మొదలుపెట్టారు.


   ముందుగా  కమల  యేడుకొండల వెంకటేశ్వరస్వామికి  శంఖు చక్రాలు విగ్రహంలో కలిసి లేవంటూ, తర్వాత అవి ఆభరణాలుగా యెలా అమిరాయో చక్కటి కథను చెప్పారు.

 

 


 

 
       తర్వాత శారద ఇంటి ఆర్ధికపరమైన వివరాలు మహిళలందరూకూడా తెలుసుకుని వుండాలనీ, ముఖ్యంగా బాంకు లావాదేవీలు యెలా చెయ్యాలో అవగాహన కలిగి వుండడం మంచిదనీ అందరికీ ఉపయుక్తమైన విషయాలు చెప్పారు.


  
                                   ఇంక సీత. మంచిజోకులు చెప్పి అందరినీ నవ్వించేసారు.
 
 

      ఈవిడే రామలక్ష్మి. ఆవిడకి పన్నెండేళ్ళకి పెళ్లయిందిట. అప్పటి పెళ్ళిసందడులూ, పల్లకీలో ఊరేగింపులూ గుర్తు చేస్తూ, అప్పటికీ యిప్పటికీ  పెళ్ళిళ్ళు చేయడంలో వచ్చిన మార్పుల గురించి చక్కగా చెప్పారు.



 

 

        మరింక విద్యుల్లత. మహిళకు గల ఒక్కొక్కపేరుకూ చక్కటి అర్ధం చెపుతూ, చక్కటి కవితను యెంతో హృద్యంగా చదివారు.


      
                               ఈవిడ సరస్వతి. దేవి మీద స్తోత్రం చదివి వినిపించారు.

 
      ఆ తర్వాత కళ్యాణి. చిన్నతనంలోనే పెళ్ళి చేసుకుని, భర్త ఉద్యోగరీత్యా ఊళ్ళు తిరుగుతూ  లోకాన్ని పుస్తకాలనీ చదువుతూ, ఉత్సాహంగా కొత్త విషయాలు నేర్చుకుని, ఆ నేర్చుకోవడంలో భాగంగా యోగా కూడా నేర్చుకోవడమే కాకుండా అది అందరికీ కూడా నేర్పే స్థితికి వచ్చానని చెపుతుంటే మా అందరికీ యెంతో ఆనందం అనిపించింది.
 
      ఇంక మరి ఈవిడ సుందరి. ఇదివరకు రోజుల్లో యింట్లోకి ఒక వస్తువు అమర్చుకుందుకు యెన్ని ప్రణాళికలు వేసుకునేవారో చెపుతూ, ఆ వస్తువు యిల్లు చేరినప్పుడు పిల్లలతో సరిగ్గా ఆ  సంతోషాన్ని ఆస్వాదించిన బంగారురోజులని అందరికీ గుర్తు చేసారు.
            ఈవిడ దుర్గ. ఈరోజుల్లో మొబైల్ ఫోన్లు పిల్లలు వాడడంలో గల సాధకబాధకాలు చెపుతూ, మా అందరికీ తెలియని చాలా విషయాలు అంటే వాటివల్ల కలిగే ఉపయోగాలూ, భౌతికంగా కలిగే నష్టాలూ కూడా చెప్పారు.
      మరింక రాజ్యలక్ష్మి. ఈవిడ ఉదయం లేచిన దగ్గర్నుంచీ చదివే పేపరూ, పుస్తకాలలో వున్న విషయాలు బాగా ఆకళింపు చేసేసుకుంటారు. ఆ పధ్ధతిలోనే ఆడవారి మెదడులో వుండే జ్ఞాపకశక్తి మగవారి మెదడులో కన్న యెక్కువ వుంటుందని చెప్పి మమ్మల్ని విజ్ఞానవంతుల్ని చేసారు.
 
     ఈవిడ లక్ష్మీ ఆచార్య. పిల్లలు పెరుగుతున్నప్పుడు తల్లి వాళ్లమీద యెంత శ్రధ్ధ పెట్టాలో సోదాహరణంగా వివరించారు.

 
 
                   మరింక శారదగారు. వృధ్ధులయిన చెవిటి భార్యాభర్తల సంభాషణను చక్కగా నటిస్తూ చెప్పి మా అందరినీ నవ్వులలో ముంచెత్తారు.
 
 
     ఇప్పుడు, అందరికీ ఆత్మీయంగా ఆతిధ్యమిచ్చిన రత్న ఈమధ్య జరిగిన ఇండియన్ డాటర్ మీద వచ్చినవ్యాఖ్యలను చక్కగా విమర్శించారు.

      ఈవిడే ఉమాసుందరి. పిల్లల్ని ప్రయోజకులని చెయ్యవలసివచ్చినప్పుడు ఇంత్లో తల్లి యెంత ఓర్పుతో వుండాలో చెప్పారు.


      ఇంకిప్పుడు భారతి. తను పెళ్ళై కొత్తగా కాపురం పెట్టినప్పుడు జరిగిన ఉగాది ఉదంతం గురించి చెప్పి అందరినీ ఆహ్లాద పరిచింది.
 


       ఇంక నేను. మన హక్కుల్ని మనం యెలా కాపాడుకోవాలో సంగ్రహంగా చెప్పాను. (వివరంగా చెపితే యెవరూ వినరుకదా..)


 

      ఈమె దుర్గ. ఇదివరకు మా మహిళామండలిలో మెంబరే. పిల్లల చదువుల ధ్యాసలో పడి ఈ మధ్య రావడం కాస్త తగ్గించింది. మొన్న నాగార్జునమీలో యెవరు కోటీశ్వరుడుషో లో Rs. 6,40, 000 గెలుచుకుంది. ఇవాళ ఆ అనుభవాలన్నీ మాతో సరదాగా పంచుకుంది.



    అయిదురోజులపాటు ఉదయం యేడున్నరకల్లా వెళ్ళి మనవంతు వచ్చేదాకా వేచి చూస్తుండాలిట. చాలా ఓపిక కావాలి కదా..    మనం ఆ షో చూస్తుంటే ఆడేవారితో కూడా వచ్చినవాళ్ళు కూడా ఎదురుగానే కూర్చున్నట్టుఉంటారు కదా.. అలా కాదుట.. వాళ్ళూ వీళ్ళూ అసలు ఒకరికొకరు కనపడరుట.. భలే కదా.. ఇలాంటి విషయాలెన్నో చెప్పింది.
 
 

   మరింక మనందరికీ చాలా ఇష్టమైన విషయానికొచ్చేస్తే… అదేనండీ.. పసందైన విందుభోజనం..


మామిడికాయపప్పు, గుత్తివంకాయకూర, మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి, ధప్పళం, పులిహార, బొబ్బట్లు, ఆవడలు, అబ్బ.. ఇంక టైపు చెయ్యలేనుగానీ మీరే చూసెయ్యండి.

 
 
 


 
 
 


         


    హమ్మయ్య.. ఓ పెద్ద పనైపోయిందికదా అని ఆయాసపడుతుంటే భారతి ఓ పరీక్ష పెట్టింది. ఇదివరకు అస్తమానం మా సభ్యులకి పురాణాలమీద, తెలుగు భాషమీద పరీక్షలు పెట్టేస్తున్నారని ఈసారి టీవీ లో వచ్చే ప్రకటనలమీద పరీక్ష పెట్టింది. ఆహా.. యెంత వీజీనో అనుకున్నామా.. అబ్బే.. చాలా కష్టమండోయ్.. రోజూ అవి చూస్తున్నా సరే అవి యే కంపెనీవో మనకి గుర్తుండదు.
“మసాలా అమ్మ ఎవరు..” అనడిగింది. అదే కంపెనీయో ఎవరికీ గుర్తు రాదే.. కొంతమంది ఒకరికొకరు చూపెట్టేసుకున్నారు...ఇదిగో ఇలాగ ..



 
 
 
 

                            అబ్బ.. ఎంత సీరియస్ గా రాసేస్తున్నారో చూసేరా..

 
 

 

 
 
కొంతమంది కాపీలు కూడా కొట్టేస్తున్నారండోయ్..


 
 

         మొత్తానికి పదికి మూడు పాసుమార్కులతో నాకు ఫస్ట్ ప్రైజు, సీతకి సెకండ్ ప్రైజు వచ్చాయి.. హ హ..
 
 
 
 

    
   ఇదిగో ఇదేనండీ మా జట్టు…
 
 
       ఆ తర్వాత ఒక రౌండ్ తంబోలా ఆడుకుని, వేడిగా ఫిల్టర్ కాఫీ తాగి, సాయంకాలానికి ఇళ్లకి చేరుకున్నాం.

     అవన్నమాట మహిళాదినోత్సవ సంబరాల విశేషాలు..
_____________________________________________________________________