Pages

Showing posts with label ప్రార్ధన. Show all posts
Showing posts with label ప్రార్ధన. Show all posts

Tuesday, May 10, 2011

తల్లీ...నిన్ను దలంచి...




తల్లీ…. భారతి….
నిన్ను తలంచి నేను పట్టిన పొత్తము ఈ విధి భంగమయ్యె
ఏమని చెప్పుదు నాదు దుస్ఠితిన్...

ఉదయమున నిను దలంతునన్న
అరుణకిరణములు సోకని నివాసమయ్యె
మనసు కుత్సాహము లేక మౌని నైతి…….

చైతన్యముతో పట్టువిడక
నీదుగురించి నాల్గు వాక్యముల్ చెప్పుదమన్న
ఏమి పాపము చేసితినొ గాని
వినెడి విద్యార్థి ఎందును కానరాడు…….

నిను తనివార పూజింప విరిసిన పూలుతేబోవ
హతవిధీ.. ఏమని చెప్పుదు ఎక్కడ కాంచిన
కృత్రిమ పుష్పరాజములె గోచరమయ్యె…..

మదిని కలవరమ్ముతో,
తెగని పట్టుదలతో,
ఎటులైన నీదు మహిమలు,
నిను పఠించిన పొసగు మహానందములు,
నీదు దీవెనచే కలుగు పుణ్యములు,
నీదుపై ఏకాగ్రతతో కలుగు అద్వైత సిధ్ధి,
మనఃపీఠమున నిను స్థాపించిన పొందు కైవల్యము,
మరి ఎందును కానరాదని తెలియచెప్పుదుమన్న
వినెడివారు కరవైరి...ఏమనందు...

తల్లీ...భారతీ..నిను కొలవగలేని దౌర్భాగ్యపు జాతి అయినది
వేద విఙ్ఞానఖని అయిన అమృతభాండము ఎదుట నుండగా
ఎడారిలో ఎండమావికై పరుగులిడు యాతన
ఈ పిచ్చి జనుల మది కెందుకొ….

చలము సేయక
నీవు వారిని చల్లగ చూసి
పెడదారి పట్టిన పిలవాని త్రోవ మరల్చి
నీ అక్కున చేర్చి బ్రోవుమ తల్లి శారదా....



-------------------------------------------

Saturday, June 5, 2010

ఓ పరమాత్మా..




ఓ పరమాత్మా..


ఎంత నమ్మకం నా మీద నాకు
ఏదైనా చేయగలననీ
అంతా నా చేతిలోనే వుందనీ
నా జీవితం నా ఇష్టం ఎలాగైనా వుండగలననీ
జీవితమనే చదరంగంలో
నేను వేసే ఎత్తు నా చేతిలోనె వుందనీ
ఎత్తు మీద ఎత్తు వేసి ఎదటివాణ్ణి చిత్తు చేసి
గుర్రాలను దూకించీ ఏనుగులను కదిలించీ
మంత్రి రణతంత్రం తో "చెక్" చెప్పగలననీ
ఎంత నమ్మకం నా మీద నాకు...
కానీ....
కాదు కాదు జీవితం నీ చేతిలో చదరంగం
అది నేను సృష్టించిన ఎత్తు పల్లాల కల్లోల సముద్రం
నీ ఎత్తుగడను బట్టి నడవదు నీ జీవితం
పావులు నీ చేతిలో వున్నా
నీ అరిచేతి రేఖలు నేను రాసినవే
ఆడేది నువ్వైనా ఆడించేది నేనే
అందుకే నీ జీవితం కాదు చదరంగం ..అది
పాము నిచ్చెనల నడుమ బంధించబడిన
చిత్రమైన పరమపదసోపాన పఠం...అది
వైకుంఠపాళీ..అంటూ
నిచ్చెనలను ఎక్కిస్తూ,
పాము చేత మింగిస్తూ
ఆడిస్తూ, పాడిస్తూ,
వేధిస్తూ, వేగిస్తూ,
నడిపిస్తూ,విసిగిస్తూ,
ఇంతలో కవ్విస్తూ, అంతలోనె ఏడిపిస్తూ,
కనిపించని నా మనసుని చిత్రహింసలు పెడుతూ
అంతలోనె ఆనందం..మరుక్షణం దుఃఖం
అన్నీ అనుభవించు అదే జీవితమంటే
అంటూ నన్ను నడిపిస్తున్న ఓ పరమాత్మా...
ఇంకా ఎప్పటికి నా ఈ జీవితానికి తుదిశ్వాస...?


***********************************************

Monday, November 23, 2009

శారదాస్తుతి(అచ్చంగా నాదే)



శారదాదేవిని నా స్వంత మాటలతో స్తుతించే భాగ్యం కలిగించినందుకు అందరికీ కృతఙ్ఞతలు. ప్రమదావనం లో చేర్చుకోండీ అని జ్యోతీగారి నడిగితే చేయి పట్టుకు లాక్కొచ్చి ఈ బ్లాగ్ లోకంలో కూలేసారు. అందరూ ఎన్నెన్నో రాసేస్తున్నారు. అంతా కొత్త. అహా రాసెయ్యొచ్చుకదాని నాకు తోచినవి రాసేస్తూపోయాను. కొన్నాళ్ళకి తెలిసింది. అలాకాదూ, మనవూ అందరివీ చదివి కామెంట్లు రాయాలీ, మనం రాసిన దాని మీద కామెంట్లు రాసిన వారికి జవాబు లివ్వాలీ అని. మరి కొన్నాళ్ళకి కవితల మీదకి దృష్టి పోయింది. ఇప్పుడు మరువం ఉష గారు పద్యం రాయడానికి ప్రయత్నించడం చూసి నేనూ ప్రయత్నించాను. ఆచార్య ఫణీంద్రులు దానిని సరిదిద్దారు. మీరూ చూసి ఎలా ఉందో చెప్పండి. ఆచార్య ఫణీంద్రులకు హృదయపూర్వక కృతఙ్ఞతలు బ్లాగ్ ముఖంగా తెలియచేసుకుంటున్నాను.

ఇది నేను వ్రాసిన మొదటి పద్యం ..
ఆచార్య ఫణీంద్రగారికి నమస్కారములు. చంపకమాల పద్యం ఎలా రాయాలో మీరు చెప్పాక ఒకసారి ప్రయత్నించి చూడాలనిపించింది. ఇది నా మొదటి ప్రయత్నం. తప్పులు చెప్పితే సరిదిద్దుకుంటాను. ధన్యవాదములతో, శ్రీలలిత.

జిలిబిలి జుంటి తుమ్మెదల జుమ్మను నాదపు గాన మాధుర్య
మొలికెడి తీపి తేనియను మా మది నిండుగ నింపి కావవే
పలుకులరాణి నీ వలన పాడిన పాటలు వేయి తీరులై
నిలనిటు మాదు కోరికల నిండుగ తీరుచు తల్లి శారదా.


శ్రీ ఆచార్యఫణీంద్రుల జవాబు...

శ్రీలలిత గారు !
మొదటి ప్రయత్నమైనా, మొదటి పాదం ఎంత అందంగా ఎత్తుకొన్నారు !
మీకు నా హృదయ పూర్వకాభినందనలు !
అయితే, చిన్న చిన్న దోషాలు సరిదిద్ది, మెరుగులు దిద్దుతాను.

జిలిబిలి జుంటి తుమ్మెదలు చేసెడి నాదపు గాన మాధురిన్ ..."
ఒలికెడి తీపి తేనె రుచి ఉల్లము నిండుగ నింపి కావవే !
పలుకుల రాణి నీ కృపను పాడిన పాటలు వేయి తీరులై
నెలకొను మాదు కోరికల నిండుగ తీర్చుము తల్లి శారదా !


ఆ శారదాదేవి అందరికీ సకల విద్యలూ అందించాలని కోరుకుంటున్నాను.




#################################################################

Thursday, September 24, 2009

శారదాస్తుతి







దసరా నవరాత్రులలో ఒకరోజు అమ్మవారిని సరస్వతీదేవి గా స్తుతిస్తారు.
అటువంటి శారదాస్తుతే ఈ పాట.
ఇది సరస్వతీరాగం లో పాడుకోవచ్చు.








పల్లవి:-- లలిత మనోహర సుందర సుమధుర
పదముల అల్లిన జిలిబిలి సొగసు
మా గళమున నింపుము శారదా....
మము ధన్యులచేయి విశారదా..........//లలిత మనోహర//

చరణం:--వీణియ మీటిన వేణువు నూదిన
పలికెడి స్వరముల కమ్మని భావము
గళమున నింపుము శారదా....
మము ధన్యులచేయి విశారదా..........//లలిత మనోహర//

చరణం:--తుంటరి తుమ్మెద అంటని పూవుల
తేనియ తీపిని ధారగ చేసి
గళమున నింపుము శారదా....
మము ధన్యులచేయి విశారదా.....//లలిత మనోహర//
ఈ పాట ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం నుంచి వనితా కార్యక్రమం లో ప్రసారమైంది.
ఈ పాట వినాలంటే ఈ క్రింది లంకె కు వెళ్ళండి.
http://www.fileden.com/files/2009/9/28/2587394/sarada1.wma

###############################################

Saturday, August 1, 2009

కేశవనామపూజకీర్తన

ఈమధ్య ఒక పెద్దావిడను కలుసుకున్నప్పుడు ఆవిడ కేశవ నామాలతో మనం నిత్యం పూజ చెసుకునే పధ్ధతిని పాటగా పాడడం విన్నాను. అంటే మనం రోజూ పూజ చెసుకుంటున్నప్పుడు భగవంతుడిని ధ్యాన, ఆవాహనాది షోడశోపచారాలతో పూజిస్తాంకదా.. దానిని కేశవ నామాలతో పాడారన్నమాట. దానిని అందరికీ అందించాలని ఇది రాస్తున్నాను. నేను విని రాయడంలొ పొరపాట్లు ఏమైనా వుంటే దయచేసి సరిచెయ్యగలరు.

కేశవనామపూజ కీర్తన(నిత్యపూజ)



పల్లవి// రాముని పూజింపరే-భద్రాద్రి శ్రీరాముని పూజింపరే

రాజీవదళముల కామితార్ధప్రదుడైన కౌసల్య తనయుని//రాముని//

1. కేశవమూర్తిని-క్లేశనరసింహ్వుని-శ్రీశుని మదియందుచేర్చి-ధ్యానించి//రాముని//

2. నారాయణుడౌ-తారకరాముని-నారదసన్నుతు నావాహనముచేసి//రాముని//

3.మాధవమూర్తి-మంగళాకారుడౌ-ఆదిదేవున కర్ఘ్యపాద్యాచమనములా//రాముని//

4. గోవిందమూర్తియౌ-గోపరిపాలునికి-భావములరవేడ్క పంచామృతస్నానమున//రాముని//

5. విష్ణుస్వరూపునకు-విజ్ఞానమూర్తి ప్రభ-విష్ణుశ్రీరామునకు-విశుధ్ధోదకస్నానముచే//రాముని//

6. మధుసూదనుండౌ-మహనీయతేజునకు-ముదమున తడియొత్తి-అగరుధూపమువేసి//రాముని//

7.త్రివిక్రము-శ్రీరాము-దేవాదిదేవునకు-భువనసుందరునకు-సువర్ణ వస్త్రంబిడి//రాముని//

8.వామనుడౌ-హరికి-యజ్ఞోపవీతమొసగి-కామజనకునకు-గంధాక్షతిలిడి//రాముని//

9.శ్రీధరమూర్తియౌ-శ్రీరామచంద్రునకు-మోదముతో మంచి మొల్లలు మల్లెలు//రాముని//

10.హృషీకేశు-సాధుహృదయనివాసుని-భాసిల్లు మందార-పారిజాతంబుల//రాముని//

11.పద్మనాభమూర్తి-పరంధామునకు-సహస్రపద్మములచేత-పరమానందముమీర//రాముని//

12.దామోదరుండైన-దశరధశ్రీ-స్వామికి సంపెంగి, జాజి, విరజాజుల//రాముని//

13. సంకర్షణమూర్తియౌ-సర్వాంతర్యామికి-ప్రాకటముగ ధూప దీపములర్పించి//రాముని//

14.వాసుదేవు-పరమేశు-శ్రీరాముని భాసురంబుగ మంచి భక్షభోజ్యంబుల//రాముని//

15.ప్రద్యుమ్నమూర్తియౌ-పరమోత్తరామునకు హృద్యముగ కర్పూర విడెము సమర్పించి//రాముని//

16.అనిరుధ్ధమూర్తికి-వనజదళాక్షునకు-ఘనముగ పచ్చకర్పూరహారతులిచ్చి//రాముని//

17.పురుషోత్తముండైన పుండరీకాక్షునకు కరుణసాగరునకు కర్పూర నీరాంజనాచమున//రాముని//

18. అధోక్షజుండైన-ఆనందరామునకు-మదిని పొంగుచు వేగ మంత్రపుష్పంబుడి//రాముని//

19.నారసింహుడైన శ్రీరామమూర్తికి-సారెకు ప్రదక్షిణ నమస్కారములుచేసి//రాముని//

20.అచ్యుతమూర్తియౌ-హరిశ్రీరామునకు-హెచ్చుగ చామరాలే వీవ నిజభక్తులు//రాముని//

21.జనార్ధనమూర్తి-శ్రీజానకీపతిచెంత- గానంబుసేయగా-గంధర్వ కిన్నెరులు//రాముని//

22.ఉపేంద్రమూర్తియౌ-శ్రీపతి శ్రీరామ-భూపాలచంద్రుపై పన్నీరు చల్లుచు//రాముని//

23.హరి-శ్రీరామయని-ఆనందమగ్నులై-సురలు సుమవృష్టిని-సొంపుగ కురియింప//రాముని//

24.శ్రీకృష్ణ యని-బుధులు చేరి-నృత్యము చేయ-కౌకుత్సతిలకుడౌ ఘనుడు-సీతా సహితు//రాముని//

25.భూమిజతోగూడి-పూర్ణేందువదనుడు-రామపుత్ర హృదయధామమున రంజిల్లు//రాముని//



--------------------------------------------------------------------------------

Tuesday, July 28, 2009


మనము రోజూ దేవునికి పూజ చేసేటప్పుడు ముందుగా జ్యోతిని వెలిగించి ప్రారంభిస్తాము కదా. అలాగే ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు కూడా జ్యోతిని వెలిగించే సాంప్రదాయం మనకి వుంది. అప్పుడు సంస్కృతంలొని శ్లోకాలు కాకుండా అచ్చ తెలుగులో చెప్పుకునే ప్రార్ధన ఒకటి మా ఫ్రెండ్ చెప్పారు. అది ఈ మొట్టమొదటి టపా ద్వారా అందరికీ అందిద్దామని చెపుతున్నాను. నాకు వచ్చినంతమటుకు చెపుతున్నాను. సవరణలుంటే తప్పక సెలవీయండి.
కొండంత చమురు గోరంత వత్తి గోవిందుడా నా దీపాన్ని వెలిగించు.
ఈశ్వరుడా నా దీపాన్ని ప్రకాశించెటట్లు చెయ్యి
పరమేశ్వరుడా నా దీపాన్ని ఫలించేటట్లు చెయ్యి
కాలకంఠుడా నా దీపం కనికరించేటట్లు చెయ్యి
కాశీలొ గయలొ వటవృక్షంకింద యమధర్మరాజు యెదుట పడకుండా చేసి
ఈ నిక్షేపం లాంటి దీపాన్ని మా ఇంట్లో స్థిరంగా నిలిచి వుండేటట్లు చెయ్యి.
పంచభూతాల సాక్షిగా సూర్యచంద్రులు వున్నంతవరకు మా దీపాన్ని మాఇంట్లోఇలాగె నిలిచి వుండేటట్లు చెయ్యి.